సార్వత్రిక, రాష్ట్రశాసనసభ,  ఎన్నికల్లో జూన్‌ 4 ‌న వచ్చే ఫలితాలు,  ఫలితాల ప్రభావం వల్ల ఏర్పడే పరిణామాలపై రాష్ట్రంలో ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో గెలుపు ఓటములపై లెక్కలు వేసుకుంటుండగా, అధికారం తమదంటే తమదని వైసీపీ, తెలుగుదేశం పార్టీలు  చెప్పుకుంటున్నాయి. ఒకవేళ వైసీపీ ఓటమి పాలైతే కొత్త ప్రభుత్వం తమ పరిస్థితి  ఏమిటని అక్రమార్జన ఆరోపణలు ఎదుర్కొంటున్న  మద్యం, ఇసుక, మైనింగ్‌   ‌మాఫియా  కలవరపడుతున్నాయి.

రాష్ట్రశాసనసభ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ‌ముగిసిన తర్వాత వివిధ వర్గాలు వెల్లడించిన అభిప్రాయాలను బట్టి ఎన్డీఏ కూటమిదే విజయమని అందరూ భావిస్తూండగా, ఈ ప్రచారంతో వైసీపీ శిబిరంలో నైరాశ్యం ఏర్పడింది. అయితే దీనికి అడ్డుక•్టవేసేలా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డి ఐప్యాక్‌ ‌టీమ్‌తో మాట్లాడుతూ, 151పైగా సీట్లు వస్తున్నాయని చెప్పడంతో అప్పటి వరకు నిరుత్సాహంతో ఉన్న పార్టీలో ఉత్సాహం వచ్చింది. బెట్టింగ్‌లు జోరందుకున్నాయి.

వైసీపీకి లేదా కూటమికి 100 దాటి మెజారిటీ వస్తుందని, పలు జిల్లాల్లో అభ్యర్థులకు వచ్చే మెజారీటీలపై బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ప్రధానంగా పులివెందులలో జగన్‌, ‌కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్‌ ‌కల్యాణ్‌లకు వచ్చే మెజారిటీపై జోరుగా పందాలు కాస్తున్నారు. మంగళగిరిలో మరలా లోకేష్‌ ఓడిపోతాడని వైసీపీ నాయకులు బెట్టింగ్‌లు కడితే 20 వేల మెజారిటీతో గెలుస్తాడని తెదేపా వర్గీయులు పందాలు కాస్తున్నారు. బెట్టింగ్‌ ‌రాయుళ్లు ఈ లెక్కల్లో ఉంటే ఇసుక, మైనింగ్‌ ‌మాఫియా, మద్యం తయారీదారుల్లో మాత్రం ఆందోళన నెలకొంది. గెలిస్తే పరవాలేదని, తమ వ్యాపారం మరో అయిదేళ్లు యధేచ్ఛగా సాగుతుందని, ఓడిపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చఙని వైసీపీవారు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా డిస్టిలరీల కబ్జా, నాసిరకం మద్యం తయారీ, విక్రయాలపై కేసులు నమోదు కావచ్చని మద్యం తయారీదారులు భయపడుతున్నారు. ఇప్పటి వరకు లెక్కలేకుండా డోపిడీ చేసిన ఇసుక, మైనింగ్‌ ‌మాఫియా కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడితే జరిగే ప్రతికూల పరిమాణాలపై భీతిల్లుతోంది.

ఓట్ల లభ్యతపై విశ్లేషణ

ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిత్యం ఓట్ల లెక్కలు, విశ్లేషణల్లో మునిగి తేలుతున్నారు. ఏ వర్గం ప్రజలు ఎవరికి ఓటేసి ఉంటారో అన్న అంచనాలపై లోతుగా చర్చించుకుంటున్నారు.

ప్రత్యర్థి శిబిరం అంచనాలు ఎలా ఉన్నాయా అని ఆరాలు తీస్తున్నారు. ఈ సమాలోచనల గొడవల్లో తాముంటే, మధ్యలో పందెం రాయుళ్ల దెబ్బకు నేతలు తలలు పట్టుకుం టున్నారు. పోలింగ్‌ ‌సరళి ఎవరికి అనుకూలంగా ఉందో తెలుసుకోవడానికి ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ సాంకేతిక బృందాలతో విశ్లేషించుకున్నాయి. ఈ బృందాలు రకరకాల నమూనాలతో లెక్కలుగట్టి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో విశ్లేషించి నివేదికలు అందజేశాయి. అన్ని పార్టీల్లో ఈ కసరత్తు ఇప్పటికే పూర్తయింది. క్షేత్ర స్థాయి సమాచారంతో ఈ నివేదికలను సరిపోల్చుకునే పనిని కొత్తగా ఈ బృందాలకు అప్పగించారు. ఉదాహరణకు.. విదేశీ పర్యటనకు వెళ్లే ముందు ము్య•మంత్రి జగన్‌ ఐప్యాక్‌ ‌ప్రతినిధులతో సమావేశమయ్యారు. పెరిగిన ఓట్ల శాతం తమకే అనుకూలంగా ఉందని, దానికితోడు ఆసరా, చేయూత, అమ్మఒడి, విద్యాదీవెన పథకాల లబ్ధ్దిదారులైన మహిళల ఓట్లు పూర్తిగా తమకు పడతాయని ఆ లెక్క ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 151 పైగా సీట్లు వస్తాయని ఐప్యాక్‌ ‌చెప్పగా జగన్‌ ‌కూడా అదే అభిప్రాయం వెలిబుచ్చారు. దానిని ఆయన బహిరంగంగా ప్రకటించారు కూడా. అయితే పార్టీ నాయకుల ఆలోచనలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. పోలింగ్‌ ‌జరిగిన వారం వరకు ఉలుకు పలుకు లేని నాయకులు జగన్‌ ‌ప్రకటన తర్వాత తమకు 100 సీట్లకు తక్కువ కాకుండా వస్తాయని తమదే గెలుపని మాట్లాడుతున్నారు. 151 సీట్లు వస్తాయనడంపై పెదవి విరుస్తున్నారు. ఇక ఎన్డీఏకి అసెంబ్లీ ఎన్నికల్లో 115 సీట్లకు తక్కువ కాకుండా వస్తాయని తెదేపా భావిస్తోంది. కూటమి స్కోరు 136 దాటిపోతుందని మరో అంచనా చెబుతోందని తెదేపా సర్వే బృందాలు తమ ప్రజంటేషన్లో పేర్కొన్నట్లు సమాచారం. అయితే పరిస్థితి పోటాపోటీగా ఉందని అవి పేర్కొన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెదేపాకు సొంతగ మెజారిటీ రాకపోవచ్చని బీజేపీ, జనసేన సహకారంతోనే సర్కారు ఏర్పాటవుతుందని విశ్లేషణలు ఉన్నాయి.

అభ్యర్థుల హుషారు.. కలవరం

పార్టీల అంచనాలతో సంబంధం లేకుండా అభ్యర్థులు ఎవరికి వారు తమ నియోజకవర్గాల్లో జనం నాడిపై సొంత విశ్లేషణలు తయారు చేసుకుంటున్నారు. గ్రామాలు, వార్డుల వారీగా పార్టీ నాయకులను పిలిపించుకుని. అక్కడ తమకు ఎన్ని ఓట్లు లభించే అవకాశం ఉందో తెలుసుకుని.. లెక్కలు వేసుకుంటున్నారు. పల్నాడు జిల్లాలో ఒక అసెంబ్లీ స్థానంలో గత నాలుగు ఎన్నికల్లో ఒక్కసారి కూడా తెదేపా గెలువ లేదు. అయితే ఈసారి అక్కడి తెదేపా అభ్యర్థి, తాను 15 వేలకు పైగా మెజారిటీతో గెలుస్తానని లెక్కగట్టారు. ప్రతి గ్రామం నాయకుల నుంచి సమాచారం తెప్పించుకున్న ఆయన గ్రామాలవారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయో లెక్కలు గట్టి ఈ విశ్లేషణ రూపొందించారు. దీంతో ఆయన అనుచర వర్గం హుషారుగా తిరుగుతోంది. తెదేపా శిబిరంలో ఉత్సాహం చూసి ప్రత్యర్థి శిబిరంలో కలవరం ఏర్పడింది. కృష్ణాజిల్లా గుడివాడలోనూ ఇదే రీతి. కొడాలి నాని అక్కడ నాలుగుసార్లు గెలిచారు. అయిదోసారి పోటీ చేశారు. కాగా, తాను 20 వేల మెజార్టీతో గెలుస్తానని తెదేపా అభ్యర్ధి ధీమాతో ఉన్నారు.నాని మాత్రం తనకు 5 వేల మెజార్టీ వస్తుందని భావిస్తున్నారు.

జోరుగా బెట్టింగులు

 అన్ని నియోజకవర్గాల్లో యథేచ్ఛగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానితో పాటు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు, మెజార్టీలపై బెట్టింగ్‌ల హడావిడి మరింత తీవ్రస్థాయిలో జరుగుతోంది. అలాగే కొందరు ఒకటికి రెండు, మూడింతలు ఇస్తామంటూ కూడా ప్రత్యర్థులను కవ్విస్తున్నారు. పందెందారుల స్థాయిని బట్టి వేలు, లక్షలు, కోట్లలో ఈ పందేలు సాగుతున్నాయి.

కొందరు ఇళ్లు, స్థలాలు, పొలాలు, వాహనాలను సైతం పందేల కోసం తాకట్టు పెడుతున్నారు. మరికొందరు ఏకంగా స్థిరాస్తుల మార్పిడికి సిద్ధపడుతున్నారు. ఆ మేరకు మధ్యవర్తుల సమక్షంలో అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు. వైసీపీ మరలా అధికారంలోకి వస్తుందని కొందరు, కనీసం 110 సీట్లు పైనే అంటూ మరికొందరు అధికార పార్టీ తరఫున పందేలు కాస్తుండగా, ఎన్డీఏకి 120 సీట్లు ఖాయమంటూ ఎక్కువగా పందేలు కడుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటు అంశంపై 2:1 నిష్పత్తిలో బెట్టింగ్‌ ఆశ్చర్యపరుస్తోంది. ఇసుక, మద్యం, మైనింగ్‌ ‌మాఫియాకు చెందిన ముఠాలు రంగంలోకి దిగి ఆయా రాజకీయ పార్టీలు అభిమానులను ప్రోత్సహిస్తూ దీనిని కూడా ఒక వ్యాపారంగా మార్చుకుంటున్నాయి. రెండు వర్గాలకు చెందిన సొమ్మును తమ దగ్గర ఉంచుకుని గెలిచిన వారి దగ్గర 5 నుంచి 10 శాతం వరకు కమిషన్‌ ‌తీసుకునే పద్ధతిని మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. రెండు వర్గాల మధ్య పందెం సొమ్యుకు వీరే హామీ ఆస్తున్నారు. ఈ తరహా వ్యాపారం లక్షలు, కోట్లలో పందేలు కాసే బడాబాబులు, రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారుల మధ్య జోరుగా సాగుతోంది.         రాష్ట్రంలో కీలకమైన స్థానాలపై పందెందారులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. మంగళగిరిలో నారా లోకేశ్‌, ‌పిఠాపురంలో పవన్‌ ‌కళ్యాణ్‌, ‌గుడివాడ కొడాలి నాని, గన్నవరంలో వల్లభనేని మళ్లీ, దెందులూరులో చింతమనేని, నగరిలో ఆర్కే రోజు, మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితర అభ్యర్థుల గెలుపు, ఓటములపై రాష్ట్రస్థాయిలో పందేలు కాస్తున్నారు. పవన్‌ ‌కల్యాణ్‌కు కనీసం 30 వేల మెజార్టీ ఖాయమనే దానిపై కూడా పందేలు కడుతున్నారు. విశాఖ ఉత్తరం, పశ్చిమ, మాడుగుల, పెందుర్తి వంటి నియోజక వర్గాలపై ఎక్కువ పందాలు సాగుతున్నాయి. భీమిలి, గాజువాక, విశాఖ ‘సౌత్‌ ‌వంటి నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు వచ్చే మెజారిటీపై బెట్టింగ్‌ ‌కడుతున్నారు. చింతమనేని ఒక్క ఓటుతోనైనా గెలుస్తారని దెందులూరులోని ఒక మెట్ట గ్రామంలో తెదేపాకు చెందిన రైతు రూ. లక్షకు రూ.రెండు లక్షలు పందెం కాశాడు.

పెదపాడు, ఏలూరు రూరల్‌లో వైసీపీకి మెజార్టీ ఓట్లు వస్తాయని పందేలకు దిగుతున్నారు. విజయవాడ సెంట్రల్‌, ఈస్ట్‌లలో తెదేపా గెలిస్తే ఒకవంతు, వైసీపీ గెలిస్తే మూడు వంతులుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. ఎన్డీఏలోని జనసేన పోటీ చేసిన స్థానాల్లో ఎన్ని గెలవబోతోంది?బీజేపీకి ఎన్ని సీట్లు రానున్నాయనే దానిపై, కుప్పం, పులివెందులలో చంద్రబాబుకు, జగన్‌కు గతంలో వచ్చినంత మెజార్జీ రాదనే వాదన పైనా పందేలు కాస్తున్నారు.

 ఎంపీ అభ్యర్థుల విజయావకాశాలపై పందేలు తక్కువగానే కొనసాగుతున్నప్పటికీ, అనకాపల్లిలో సీ•ఎం రమేష్‌, ‌విజయవాడలో కేశినేని బ్రదర్స్ ‌గెలుపు, ఓటములపై పందేలకు కొందరు ముందుకొస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా జరిగే పందేల విలువ వేల కోట్లలోనే ఉంటుందన్న వాస్తవం జగమెరిగిన సత్యమైనప్పటికీ బెట్టింగ్‌ ‌రాయుళ్లపై  పోలీసువర్గాల నిఘా మాత్రం నామమాత్రంగా కూడా లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘మాఫియా’ లో ఆందోళన

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు అయిదేళ్లుగా దోచుకుతిన్న ఇసుక, మైనింగ్‌, ‌మద్యం మాఫియాలు రాబోయే ఫలితాలపై ఆందోళన చెందుతున్నాయి. అయిదేళ్లుగా ఇసుకను అధికార పక్ష తీర ప్రాంత ఎమ్మెల్యేలు, నాయకులు దోపిడీ చేశారు. కొండలు, గుట్టలు, ఎర్రమట్టిని లూటీ చేశారు. మద్యం డిస్టిలరీ యజమానులను బెదిరించి లాక్కుని మద్యం తయారుచేసి ప్రభుత్వానికి అమ్మారు. ఇది నాసిరకం మద్యంగా వినియోగదారులు, ప్రతిపక్షాలు ఆరోపించాయి.

అధికారం మారితే తమపై కేసులు నమోదుచేసి విచారణ చేయవచ్చని వీరు ఆందోళన చెందుతున్నారు. డిస్టిలరీల్లో పూర్తి స్థాయిలో మద్యం తయారీని నిలిపివేసి రోజువారీగా మాత్రం తయారుచేసి అమ్ముతున్నట్లు సమాచారం.

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కూడా కొద్ది మొత్తంలోనే సరకు అందుబాటులో ఉంది. ఇక మద్యం దుకాణాల వద్ద సరకు కొనే మందుబాబులైతే త్వరలో ఈ నాసిరకం మద్యం పీడ విరగడ అవుతుందని, బ్రాండెడ్‌ ‌మద్యం అందుబాటులోకి వస్తుందని చెప్పుకుంటున్నారు.

-టిఎన్‌. ‌భూషణ్‌

About Author

By editor

Twitter
YOUTUBE