2024 లోక్‌సభ ఎన్నికల తీర్పును ఏ కోణంలో చూడాలి? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే, ఎవరిష్టం వారిది అన్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రచారంలో రాజ్యాంగాన్ని పట్టుకు తిరిగిన, ‘పేద్ద’ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ మొదలు అష్టావక్ర చుక్కల కూటమి నేతలు అంటున్నట్లుగా బీజేపీ/ ఎన్డీఏకు ఆశించిన స్థాయిలో ప్రజామోదం లభించలేదు కాబట్టి, ప్రజలు తిరస్కరించారని అనుకోవచ్చునా? అదే ‘పే..ద్ద’ పార్టీ అధ్యక్షులవారు (?) అన్నట్లుగా బీజేపీ, ‘సంఘ’ పరివార్‌ భావజాలాన్ని, సనాతన ధర్మమార్గాన్ని ప్రజలు తిరస్కరించారని అనుకోవచ్చునా? ఇంకొందరు ‘మీడియా’ మేధావులు అన్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పటిమను, ఎన్డీఏ పరిపాలనను ప్రజలు తిరస్కరించారని అనుకోవచ్చునా? లేదు.

పదేళ్లు పాలించిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించలేదు. బీజేపీ, ఎన్డీఏలకు ఆశించిన సీట్లు రాలేదు కానీ, రాజ్యాంగం నిర్దేశించిన మేరకు ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ దక్కింది. ఇండీ కూటమిలోని అన్ని పార్టీలకు కలిపివచ్చిన సీట్ల కంటే, బీజేపీకే ఎక్కువ సీట్లు, ఓట్లు వచ్చాయి. అందుకే, మూడవసారి నరేంద్ర దామోదర్‌దాస్‌ మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది. ముందే సిద్ధం చేసుకున్న వందరోజుల ప్రణాళికతో ముందుకు సాగుతోంది.

ఏది ఏమైనా బీజేపీ/ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రాకూడదని, మోదీ మళ్లీ ప్రధాని కారాదని ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి చాలా ముందే విపక్షాలు ‘దుష్ట’ సంకల్పం చెప్పుకున్నాయి. ఫలితమే ‘ఇండి’ కూటమి. దేశ విదేశాల్లోని జాతి వ్యతిరేక శక్తులతో చేతులు కలిపాయి. ఎన్నికల సంఘం సహా ప్రభుత్వ వ్యవస్థలు అన్నిటిపైనా ఇష్టారాజ్యంగా విరుచుకుపడ్డాయి. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతను రాజకీయ రొంపిలోకి లాగారు. రాజ్యాంగమే ప్రమాదంలో పడిరదని, బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే, రాజ్యాంగాన్ని చించి ముక్కలు చేస్తుందని, రిజర్వేషన్లు రద్దు చేస్తుందని అసత్య ప్రచారం సాగించారు. బీజేపీ 26 ఎస్సీ, ఎస్టీ నియోజక వర్గాలను కోల్పోయింది. ఇలా, ఏమిచేసినా, ఎంతగా దిగజారినా ప్రజలు విపక్షాలకు అధికారాన్ని అప్పగించలేదు. పదేళ్లుగా ప్రతిపక్ష హోదా అయినా లేని కాంగ్రెస్‌ పార్టీకి ఆ హోదా మాత్రమే ఇచ్చారు. విపక్షంగా నిరూపించుకోమని ఒక అవకాశం ఇచ్చారు. ఆ హోదా అయినా ఎలా దక్కిందో వేరే చెప్పనక్కరలేదు.

కానీ, ప్రజల తిరస్కారానికి గురైనా బుద్ధి మారని విపక్షాలు వికృత క్రీడను కొనసాగిస్తూనే ఉన్నాయి. మోదీ మంత్రిమండలి ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలోనే, జమ్ము కశ్మీర్‌లో చోటుచేసుకున్న ఉగ్రవాదుల దాడిని ఆసరా చేసుకుని విద్వేషం రగిల్చే విధంగా విమర్శలకు దిగారు. బీజేపీ/ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తే దేశంలో అగ్గి రాజేస్తామని రాహుల్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ ముందే హెచ్చరించారు.ఈ హెచ్చరికకు, జమ్ము కశ్మీర్‌ తాజా ఉగ్రదాడికి సంబంధం ఉందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం.

అయినా మూడవసారి కొలువు తీరిన మోదీ 3.0 ప్రభుత్వం వందరోజుల అభివృద్ధి ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టిన సమయంలోనే విపక్షాలు అరాచక సృష్టికి శ్రీకారం చుట్టాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్‌, అరాచక రాజకీయాలకు కేరాఫ్‌ ‘ఆప్‌’ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌’, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్‌ ఇతర నాయకుల నడక, నడత గమనిస్తే, గెలుపు ఓటములతో సంబంధంలేకుండా, విదేశీశక్తుల అండదండలతో విద్వేష పూరిత రాజకీయాలు సాగించేందుకు, దేశాన్ని ఛిన్నాభిన్నం చేసేందుకు సమాయత్తమవుతున్నారనే ఎక్కువ మంది అభిప్రాయం. ఆ విధంగా హిందూ సమాజం పైన, సనాతన ధర్మం పైన యుద్ధానికి అస్త్రశస్త్రాలతో సిద్దమవుతున్నారు. ఫలితాలు వచ్చిన గంటల వ్యవధిలోనే స్టాక్‌మార్కెట్‌లో కుట్ర అంటూ రాహుల్‌ గోల మొదలుపెట్టారు. మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపులో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరిగింది. సంకీర్ణయుగం వచ్చేసిందని విపక్షాలు, విపక్ష మీడియా మురిసిపోతున్నాయి. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అయితే మరో అడుగు ముందుకేసి, త్వరలో ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతుందని, ‘ఇండి’ కూటమి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

నిజానికి ఇవేవీ కూడా అంత సులభం కాదు. ఈ హ్యాట్రిక్‌ విజయం ఒక రోజుతో వచ్చింది కాదు. ఒక వ్యక్తితో సాధ్యమైనదీ కాదు. వందేళ్లుగా వందల వేల లక్షల మంది హిందూ ధర్మ నిబద్దులు, జాతీయవాద సైనికులు, స్వయంసేవకులు అకుంఠిత దీక్షతో నిర్మించుకున్న హిందూ జాతీయవాద పునాదులపై విరిసిన విజయం ఇది. ఇదే అంతిమ విజయమూ కాదు. విజయ ప్రస్థానంలో మరో మైలురాయి. ఇక్కడ మనం ఒకసారి బీజేపీ ప్రస్థానంలోకి వెళ్లి చూస్తే, కమల వికాసం క్రమానుగతిలో జరుగుతూ వచ్చిన వైనం స్పష్టమవుతుంది.

 ఆవిర్భావం నుంచి బీజేపీ ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం అన్న విధంగా, హిందూ జాతీయ భావజాల పునాదులపై జాతి నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది. అందుకే, రెండే సీట్లున్నా, మూడొందల మార్క్‌ దాటినా జాతి నిర్మాణమే లక్ష్యంగా కలిసి వచ్చే వారందరినీ కలుపుకు పోతూ భారతీయ భావనతో ముందుకు సాగుతోంది. ఈ ప్రస్థానంలో బీజేపీ, హిందుత్వ భావజాలం ఎదురు దెబ్బలు తిన్న మాట నిజం. అయినా, కమలదళం, ప్రతి వెనకడుగు నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ సాగుతోంది. 1984 కేవలం రెండు సీట్లతో తొలి అడుగు వేసిన బీజేపీ, 2019 ఎన్నికల్లో ఏకంగా 303 మార్క్‌ను చేరుకుంది.

నిజం. బీజేపీ,రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌) నుంచి పుణికి పుచ్చుకున్న హిందూ‘ధర్మ’ మార్గంలో ఎదుగుతూ వచ్చింది. అడ్డదారుల్లో అధికారాన్ని అందుకునే ప్రయత్నం ఏనాడూ చేయలేదు. రాజకీయ అధికారం కోసం ఖాటా ఖట్‌ .. వాగ్దానాలు చేయలేదు. రాజకీయ అధికారం కంటే, జాతి నిర్మాణ కార్యానికి పెద్ద పీట వేస్తూ వచ్చింది. అందుకే నాలుగు పదుల కాలంలో తిరుగులేని శక్తిగా ఎదగడమే కాదు, గడచిన పదేళ్లలో దేశాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకుపోవడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో గౌరవాన్ని ఇనుమడిరప చేసింది.

గుజరాత్‌లో 1984లో 18.64 శాతం ఓట్లతో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా నిలచిన బీజేపీ, అదే సంవత్సరం మధ్యప్రదేశ్‌, 29.99 శాతం, రాజస్థాన్‌ 23.69 శాతం, హిమాచల్‌ప్రదేశ్‌’లో 23.27 శాతం, ఢల్లీిలో 18.85 శాతం ఓట్లతో, మహారాష్ట్రలో 10.07 శాతం, హరియాణాలో 7.54 శాతం , మణిపుర్‌లో 6.96 శాతం , బిహార్‌లో 6.92 శాతం, ఉత్తర్‌ప్రదేశ్‌లో 6.42, కర్ణాటకలో 4.68, , పంజాబ్‌లో 3.39, కేరళలో 1.75 శాతం, ఒడిశాలో 1.18శాతం , త్రిపురలో 0.77 శాతం తమిళనాడులో 0.07 శాతం, బెంగాల్‌ 0.40 శాతం, అస్సాంలో 0.37 శాతం ఓట్లు దక్కించుకుంది. క్రమంగా బలం పెంచుకుంటూ 1990లో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, హిమాచల్‌లో, 1991లో ఉత్తర్‌ప్రదేశ్‌లో, 1993లో ఢల్లీిలో, 1995లో గుజరాత్‌, మహారాష్ట్ర(శివసేనతో కలిసి)లలో తొలిసారి ప్రభుత్వాలు ఏర్పాటుచేయగలిగే స్థాయికి వచ్చింది. తొలి ఎన్నికల్లో 10 శాతానికి పైగా ఓట్లు సాధించిన రాష్ట్రాల్లో కమలదళం తొలి పదేళ్లలోనే ప్రభుత్వాలు ఏర్పాటుచేసింది. ఒకటి రెండు శాతం ఓట్లు లేని ఈశాన్య రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రచండ శక్తిగా ఎదిగింది. అస్సాం, త్రిపుర సహా ఈశాన్య రాష్ట్రాల అంతటా బీజేపీ ప్రభంజనం కనిపిస్తోంది. ఈ నాలుగు దశాబ్దాల్లో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేరళ, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ సొంతంగానో, మిత్రపక్షాలతో కలిసో ప్రభుత్వాలను ఏర్పాటుచేయగలిగింది. ప్రస్తుతం బీజేపీ 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది.

1984 నుంచి 2004 వరకు వాజ్‌పేయీ, ఆడ్వాణీ బీజేపీని నడిపించారు. 1996, 1998, 1999 ఎన్నికల్లో దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. వాజ్‌పేయీ నేతృత్వంలో, రెండుమార్లు సంకీర్ణ ప్రభుత్వాలను నడిపింది. మూడవ మారు పూర్తిగా ఐదేళ్లు అటల్‌జీ సారథ్యంలో 24 పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది.

అదే సమయంలో ఇతర పార్టీలకు భిన్నంగా బీజేపీ వ్యక్తులపై ఆధారపడకుండా, హిందుత్వ భావజాల మార్గంలో సంస్థాగతంగా బలోపేతమైంది. బీజేపీ ఎదుగుదలను సీట్లు ఓట్ల లెక్కన చూడడం కంటే, భావజాల వ్యాప్తి కోణంలో చూడవలసిన అవసరం ఉందనే వాస్తవాన్ని పెద్దలు గుర్తు చేస్తున్నారు. ఈ కోణంలో చూసినప్పుడు, ఈ ఎన్నికల ఫలితాలను, మరింత లోతుగా విశ్లేషించుకోవలసిన అవసరం ఉంది. కనిపించే శత్రువుతో పాటుగా కనిపించని శత్రువు విషయంలోనూ మరింత అప్రమత్తంగా ఉండవలసిన అవసరాన్ని ఎన్నికల ఫలితాలు నొక్కి చెపుతున్నాయి.

– రాజనాల బాలకృష్ణ, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE