భారత్‌-‌రష్యాల మధ్య అనుబంధం నేటిది కాదు. అయితే, ఈ సంబంధాలు కేవలం రక్షణ పరికరాల మేరకు మాత్రమే ఉండేవి. అయితే ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ఆ పరిధిని దాటి, చమురు కొనుగోలు సహా  ఆర్కిటిక్‌ ‌ప్రాంతం, అంతరిక్ష రంగంలో సహకారానికి ఈ సంబంధాలను విస్తరింప చేస్తోంది. ఆర్కిటిక్‌ ‌ప్రాంతంలో ఉమ్మడి ప్రాజెక్టు ఏర్పాటు కోసం భారత్‌ ఇప్పటికే రష్యాతో చర్చలు ప్రారంభించింది. ఈ అంశం ఇంత ప్రాధాన్యతను సంతరించు కోవడానికి కారణం, దీనిని అంతర్జాతీయ అంతరిక్షణ కేంద్రం (ఇంటర్నేషనల్‌ ‌స్పేస్‌ ‌స్టేషన్‌ -ఐఎస్‌ఎస్‌)‌తో పోల్చదగినంత ప్రాధాన్యం ఉండటమే!

రష్యాలోని ఆర్కిటిక్‌ ‌ప్రాంతంలో నేటివరకూ తవ్వితీయని చమురు, సహజ వాయువు నిల్వలే కాదు కీలకమైన, ఉద్భవిస్తున్న ఎఐ, విద్యుత్‌ ‌వాహనాలు, సెమీ కండక్టర్ల పరిశ్రమలలో ఉపయోగించగల రేర్‌ ఎర్త్ ‌మినరల్స్ ‌కూడా ఉన్నాయి. ముఖ్యంగా గ్లోబల్‌ ‌వార్మింగ్‌ ‌కారణంగా ఆర్కిటిక్‌ ‌సముద్రం బహిర్గతం కావడం అన్నది భారత్‌కు ఒక వరమనే చెప్పాలి. ఇది భారత్‌కు దీర్ఘకాలిక నిలకడైన ఇంధన సరఫరానే కాదు కీలక ఖనిజాలను కూడా సరఫరా లభ్యతకు కూడా అవకాశాన్ని కల్పిస్తోంది.

భారత శాస్త్రవేత్తలకు రష్యా ఆహ్వానం

ప్రస్తుతం ఆర్కిటిక్‌ (ఉత్తర ధ్రువంలో) బలమైన పరిశోధనా ప్రాజెక్టును రష్యా నిర్వహిస్తోందని రష్యా ఆర్కిటిక్‌, అం‌టార్కిటిక్‌ ‌రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ (ఎఎఆర్‌ఐ) ‌డైరెక్టర్‌ అలెగ్జాండర్‌ ‌మకరోవ్‌ ‌గోవాలోని వాస్కోడ గామా నగరానికి వచ్చిన సందర్భంలో మీడియాకు వెల్లడించారు. తమ శాస్త్రవేత్తలు ఎత్తైన అక్షాంశాలలో శాస్త్రీయ పరిశోధనలను నిర్వహించేందుకు అత్యాధునిక పరికరాలు, సాంకేతి కత కలిగిన, మంచును తట్టుకోగల ప్రత్యేకమైన ఓడ మద్దతుతో పని చేస్తున్నారని, ఈ పరిశోధనలో తమ భారతీయ సహచరులను కూడా కలవవలసిందిగా కోరామని, వారు ఎంతో ఆసక్తితో ఉన్నారని ఆయన వెల్లడించడం విశేషం. ఎందుకంటే, రష్యా కేవలం ఆయుధాల విషయంలోనే కాక ఇతర రంగాలలో కూడా భారత్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉందనే విషయం దీనితో మరొక్కసారి స్పష్టమయింది.

భారత్‌కు చెందిన సెంటర్‌ ‌ఫర్‌ ‌పోలార్‌ అం‌డ్‌ ఒషానిక్‌ ‌రీసెర్చ్ అధికారులతో తాము చర్చలలో ఉన్నామని, వారు ఈ ప్రాజెక్టు పట్ల ఆసక్తి ప్రదర్శించారని అన్నారు. ఆర్కిటిక్‌ ‌ప్రాంతంలో ఉమ్మడి ప్రాజెక్టులను నిర్వహించేందుకు రష్యా ఆసక్తితో ఉన్న విషయాన్ని భారత్‌కు చెందిన శాస్త్రవేత్తలు కూడా వెల్లడిస్తున్నారు. ఉక్రెయిన్‌ ‌యుద్ధ నేపథ్యంలో ఎనిమిది మంది సభ్య దేశాలు కలిగిన ఆర్కిటిక్‌ ‌కౌన్సిల్‌ ‌కార్యకలాపాలలో స్తబ్దత రావడం వల్ల కూడా రష్యా మిత్రుల కోసం వెతుకుతోందన్నది వాస్తవం. పశ్చిమ ఆసియాలోలా కాకుండా ఆర్కిటిక్‌ ఇం‌ధన వనరులు, వాటి సరఫరా ఎటువంటి రాజకీయ అస్థిరతలతో ప్రభావితం అయ్యే అవకాశం లేదు. అయితే, ఆర్కిటిక్‌ అనేది భారత్‌కు నిలకడైన ఇంధన సరఫరా మార్గంగా ఉండగలదని, ఈ క్రమంలో దీర్ఘకాలిక ఒప్పందాలకు కూడా అవకాశ ముందని శాస్త్రవేత్తలు చెప్తున్న మాట.

వైవిధ్య వాణిజ్య సంబంధాలకు ఆస్కారం

ఉత్తర ధ్రువ ప్రాంతంతో సరిహద్దుగల లేదా ఎనిమిది దేశాలు సభ్యులుగాగల ఆర్కిటిక్‌ ‌కౌన్సిల్‌లో రష్యాకే అతిపెద్ద ప్రత్యేక ఎకనామిక్‌ ‌జోన్‌ (ఇఇజెడ్‌) ఉం‌ది.హైడ్రోకార్బన్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, అనుసంధానత, టింబర్‌, ‌మైనింగ్‌ ‌వంటి కార్యక లాపాలు ఆర్కిటిక్‌ ‌ప్రాంతంలో భారత్‌-‌రష్యాల మధ్య భవిష్యత్‌ ‌సహకారాన్ని మలచగలవు.

భారత్‌, ‌రష్యా సంబంధాలలో రక్షణరంగానికి సంబంధించిన వాణిజ్యానికే ప్రాధాన్యత ఉన్నందున, ఇరు దేశాలూ తమ మధ్య వాణిజ్య సంబంధాలను వైవిధ్య పరచుకోవాలని థింక్‌ ‌ట్యాంక్‌ ‌మేధావులు చెబుతున్నారు. భారత్‌, ‌రష్యా సంబంధాలను వైవిధ్య పరచుకునేందుకు ఉన్న ఒక మార్గం ఆర్కిటిక్‌ ‌ప్రాంతమేనని నిపుణులు చెబుతున్న మాట.

ఇటీవలే, మే 22-24వరకు పెట్రోజవోడ్సక్‌లో ‘ది ఆర్కిటిక్‌ అం‌డ్‌ అవర్‌ ‌గ్లోబల్‌ ‌నైబర్‌హుడ్‌’ అన్న ఇతివృత్తంతో రష్యా అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది. దీనిని రష్యాకు చెందిన థింక్‌ ‌ట్యాంక్‌ ఇం‌టర్‌రీజినల్‌ ‌సైంటిఫిక్‌ ‌ఫోరం (ఐఎస్‌ఎఫ్‌) ‌నిర్వ హించింది. అయితే ఇందులో వివిధ దేశాలకు చెందిన నిపుణులు, థింక్‌ ‌ట్యాంక్‌ల సభ్యులు కూడా పాలుపంచుకున్నారు.

భారత్‌ ‌మార్చి 2022లో ‘ఆర్కిటిక్‌ ‌విధానాన్ని’ ఆవిష్కరించినప్పటి నుంచీ ఈ ధ్రువ ప్రాంతంలో తన కార్యకలాపాలను తీవ్రతరం చేసింది. ఈ విధానం ఆరు స్తంభాలపై నిలిచింది. అవి – శాస్త్రీయ పరిశోధనను, సహకారాన్ని బలోపేతం చేయడం, పర్యావరణ, వాతావరణ పరిరక్షణ, ఆర్ధిక, మానవ అభివృద్ధి, రవాణా- అనుసంధానత, పాలన, అంతర్జాతీయ సహకారం, జాతీయ సామర్ధ్య నిర్మాణం.

ఆర్కిటిక్‌లో భారత్‌- ‌రష్యా ప్రాజెక్టులు

రష్యా ఆర్కిటిక్‌ ‌ప్రాంతంలోని తేమైర్‌లోని వాంకోర్‌లో, యకుతియాలోని తాస్‌- ‌యుర్యాక్స్ ‌క్షేత్రాలను అభివృద్ధి చేయడంలో ఇరు దేశాలు నిమగ్నమై ఉన్నాయని ఒక అంతరరాష్ట్రీయ శాస్త్రీయ ఫోరం విడుదల చేసిన వ్యాసం పేర్కొనడం గమనార్హం. వ్లాడివోస్టోక్‌లోని రష్యన్‌ ‌మారిటైమ్‌ ‌శిక్షణా సంస్థలో భారతీయ నావికులు ఆర్కిటిక్‌ ‌జలాలలో ప్రయాణించేందుకు శిక్షణ ఇచ్చేందుకు రష్యా అంగీకరించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో భారతీయ రేవులు, షిప్పింగ్‌, ‌జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్‌ ‌రష్యాలో పర్యటించినప్పుడు ఈ అంగీకారానికి వచ్చారు.

ముఖ్యంగా, రష్యాలోని ఇఇజెడ్‌ ‌గుండా వెళ్లే నార్తర్న్ ‌సీ రూట్‌ (ఎన్‌ఎస్‌ఆర్‌)‌ను రష్యాతో కలిసి ఉమ్మడిగా అభివృద్ధి చేసేందుకు న్యూఢిల్లీ తీవ్ర ఆసక్తిని ప్రదర్శించింది. ఈ ధ్రువ మార్గం ఇండో-పసిఫిక్‌ ‌ద్వారా వెళ్లే భిన్నమైన మార్గాన్ని భారత్‌- ఐరోపాల మధ్య ఇది తెరవగలదనే తీవ్ర అభిప్రాయం నేడు ఉందని గత ఫిబ్రవరిలో జరిగిన విదేశీ విధాన సదస్సులో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ ‌చెప్పడం విశేషం.

ఆర్కిటిక్‌లో పరిశోధనలు భారత్‌కు కొత్త కాదు

కేవలం రష్యాతోనే కాకుండా ఆర్కిటిక్‌ ‌ప్రాంతంలో ప్రస్తుత ఆర్కిటిక్‌ ‌కౌన్సిల్‌ అధ్యక్షతన నిర్వహిస్తున్న నార్వేతో కూడా భారత్‌ ఉమ్మడి ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, న్యూఢిల్లీ 2008లోనే నార్వేలో ‘హిమాద్రి’ అన్న పేరుతో తొలి పోలార్‌ ‌రీసెర్చ్ ‌స్టేషన్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలోనే నార్వేజియన్‌ ‌విదేశాంగ మంత్రి, ఆర్కిటిక్‌ ‌కౌన్సిల్‌లో సహకారంతో యుక్రైన్‌ ‌సమస్యను ‘కంపార్ట్‌మెంటలైజ్‌’ ‌చేసి చూడాలంటూ, ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరిగిన రైజీనా డైలాగ్స్‌లో పేర్కొనడాన్ని భారత దేశ నిపుణులు ఆహ్వానించారు. ‘ఈ అంశాలలో కొన్నింటిని మనం విభజించి చూసేందుకు ప్రయత్నించాలి. ఈ విషయంలో మనం ఇప్పటివరకూ విజయాన్ని సాధించామని భావిస్తున్నాను. ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో కూడా రష్యాతో మేం నిలకడైన మత్స్య సహకారాన్ని కొనసాగించాం. ఆ చేపల నిల్వలను నిలకడగా ఉంచేందుకు ఈ మత్స్య సహకారం ఇప్పటికీ మా మధ్య ఉన్నది. ఈ సమస్యలను నిర్వహించడంలో ఆర్కిటిక్‌ ‌కౌన్సిల్‌ ‌సమర్ధవంతంగా ఉండాలి’ అని క్రావిక్‌ ‌పేర్కొన్నారు. అంతర్జాతీయ దౌత్యంలో పూర్తి శత్రువులు, మిత్రులు ఉండరనే విషయం దీనితోనే స్పష్టమవుతుంది.

ఆర్కిటిక్‌ ‌ప్రాంతంలో పర్యావరణ మార్పు వంటి అంశాలు మానవాళికి అంతటినీ ప్రభావితం చేసేవి. ‘ఆర్కిటిక్‌ ‌కౌన్సిల్‌ ‌పని చేయకపోవడం దురదృష్టకరం. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో కూడా ఆర్కిటిక్‌పై సహకారం ఎప్పుడూ నిలిచిపోలేదు. పరిశీలక దేశంగా భారత్‌ ఆర్కిటిక్‌ ‌కౌన్సిల్‌ ‌తిరిగి పని చేయడం ప్రారంభించాలని కోరుకోగలదు అంతే’ అంటూ ఒక నిపుణుడు పేర్కొనడం ఈ మండలి ప్రాధాన్యతను పట్టి చూపుతుంది.

ఆర్కిటిక్‌ ‌కౌన్సిల్‌కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ ?

ఆర్కిటిక్‌ ‌కౌన్సిల్‌లో సుదీర్ఘ ప్రతిష్టంభన వస్తే, అక్కడ శాస్త్రీయ, అన్వేషక ప్రాజెక్టులను నిర్వహించేందుకు రష్యా మరొక విధానాన్ని అనుస రించే అవకాశం ఉంది. బ్రిక్స్ ఆ ‌వేదిక కావచ్చు. ఈ ఏడాది రష్యాలో జరుగనున్న బ్రిక్స్ ‌వార్షిక సదస్సులో ఈ మేరకు ప్రకటన కూడా వెలువడవచ్చని భారతీయ నిపుణులు అంటున్నారు.

ఇప్పటికే రంగంలో చైనా

ఇటీవలి సంవత్సరాలలో ఆర్కిటిక్‌లో శాస్త్రీయ, ఇంధన ప్రాజెక్టులను నిర్వహించేందుకు రష్యాకు చైనా సన్నిహిత భాగస్వామిగా అవతరించింది. బీజింగ్‌ 2018‌లో తన ఆర్కిటిక్‌ ‌విధానాన్ని ప్రకటించినప్పటి నుంచీ ధృవ ప్రాంతంలో తన ఉనికిని, వాటాను పెంచుకుంటూ పోతున్నది. అయితే, రష్యా పూర్తిగా చైనాపై ఆధారపడదలచుకోలేదనే విషయం భారత్‌ ‌సహకారం కోరినప్పుడే అర్థమవుతుంది.

ఇప్పటికే ఇరు దేశాలకు సంబంధించిన నిపుణులు ఆర్కిటిక్‌లో భవిష్యత్తు అన్వేషణలను ఖరారు చేసేందుకు ఒక రోడ్‌ ‌మ్యాప్‌ను తయారు చేయడం కోసం క్రమం తప్పకుండా సమావేశమవుతున్నారు. ఐఎస్‌ఎస్‌ ‌లేదా హెడ్రాన్‌ ‌కొలైడర్‌ ‌వంటి భారీ ప్రాజెక్టులను పరిశీలిస్తే అవి అంతర్జాతీయమైనవనే విషయం అవగతమవుతుందని ‘ఆరి’ డైరెక్టర్‌ ‌మకరోవ్‌ ‌పేర్కొనడం ద్వారా ఈ ప్రాజెక్టులు పరిమాణాన్ని చెప్పకనే చెప్పారు. భారత్‌ ‌నుంచి సహచరుల భాగస్వామ్యం ద్వారా ఆర్కిటిక్‌ ‌లో కూడా అటువంటి అనుభవాన్నే అమలులోకి తేవచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు.

ఆర్కిటిక్‌పై భారత్‌కు ఎందుకు ఆసక్తి?

ఇప్పటికే, భారత్‌, ‌రష్యాలు అంటార్కిటికాలో సహకరించుకుంటున్నాయి, ఇటువంటి ఏర్పాటే ఆర్కిటిక్‌లో జరిగితే బాగుంటుందన్నది రష్యా శాస్త్రవేత్తల అభిప్రాయం. దశాబ్దాలపాటు ఆర్కిటిక్‌ ‌లోని భిన్న కోణాలను అధ్యయనం చేసిన భారతీయ శాస్త్రవేత్తలకు రష్యా సహకారం లభిస్తే ఆ ప్రాంత రహస్యాలను కనుగొనేందుకు అవకాశం ఉంటుంది.

ఆర్కిటిక్‌ ‌ప్రాంతంపై భారతీయ శాస్త్రవేత్తల ఆసక్తి ఇటీవలి కాలంలో చాలా పెరిగింది. ఇందుకు కారణం ఎత్తైన అక్షాంశాలలో వాతావరణ మార్పు అనేది మొత్తం భూగోళాన్ని ఫ్రభావితం చేయడమే అని రష్యా శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆర్కిటిక్‌లో వాతావరణ వ్యాప్తి, ప్రసరణలో మార్పులనేవి భారత్‌లో రుతుపవనాల వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇది వ్యవసాయంపై గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇప్పటికే భారత పౌరుల జీవితాలను ప్రభావితం చేస్తున్న రుతువుల రాకపోకల్లో మార్పులు, రుతుపవనాల తీవ్రత, హీట్‌వేవ్‌లు అవతరించడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

రష్యా కూడా ఆర్కిటిక్‌ ‌ప్రాంతంలో భారత్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది. సహజవాతావరణాన్ని నిరంతరం అధ్యయనం చేస్తుండటమే కాదు, చోటు చేసుకుంటున్న మార్పులను వెంటనే అధ్యయనం చేస్తుండాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. నూతన శాస్త్రీయ విజ్ఞానం మన భవిష్యత్‌ ‌పర్యావరణ మార్పులను తగిన సమయంలో అనుసరించేందుకు తోడ్పడి జరుగబోయే విధ్వంసాన్ని తగ్గిస్తుంది. ఇది ప్రపంచంలోని అందరు శాస్త్ర వేత్తలకూ, ముఖ్యం ఉపయోగకరమన్నది రష్యన్‌ ‌శాస్త్రవేత్తలు చెప్తున్న మాట.

-జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE