2024 ‌సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎన్డీఏకి అత్యధిక స్థానాలను ఇచ్చి,  నరేంద్ర మోదీకి మూడోసారి ప్రధాని పీఠాన్ని అందించాయి. పదేళ్ల ఎన్‌డీఏ ప్రయాణంలో ఇదొక పెద్ద మలుపు. సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ సరికొత్త చరిత్రకు మోదీ నాంది పలికారు. 2024 సార్వత్రిక ఎన్నికలు బీజేపీకి మిశ్రమ ఫలితాలు అందించాయి. తమకు పట్టున్న ఉత్తరప్రదేశ్‌ ‌లాంటి చోట సీట్లు కోల్పోవటం ఇబ్బందికర వాతావరణం తెచ్చినా ఇతర ప్రాంతాల్లో పార్టీ కొన్ని మెరుపులు మెరిపించింది.

ఒడిశాలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. పాతికేళ్ల నవీన్‌ ‌పట్నాయక్‌ ‌బీజేడీ ప్రభుత్వాన్ని పంపేసి, బీజేపీ స్వతంత్రంగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌చేతిలో పరాజయం పాలైనప్పటికీ లోక్‌సభ ఎన్నికలలో తిరిగి ప్రాభవాన్ని చాటుకోగలిగింది. కేరళలో మొట్ట మొదటిసారి విజయాన్ని రుచి చూసింది. తెలుగు రాష్ట్రాల్లో పట్టును మరింతగా పెంచుకుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రదర్శించిన పట్టుదలను కొనసాగిస్తూ తెలంగాణలో ఎనిమిది సీట్లను దక్కించుకుంది. తన పాత మిత్రుడు చంద్రబాబును తిరిగి ఎన్డీఏలోకి తీసుకోవాలన్న రాజకీయ చాణక్యం ఫలితం ఇచ్చింది. ఏపీలో 16 స్థానాలను దక్కిం చుకున్న టీడీపీ, నితీశ్‌ ‌కుమార్‌ ఆధ్వర్యంలో 12 స్థానాలు దక్కించుకున్న జేడీ(యు) ఎన్డీఏలో కొత్త ప్రభుత్వంలో కీలకంగా కానున్నాయి.

ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు దక్కగా, టీడీపీ 16, శివసేన (షిండే)-7, జేడీ (యు) 12, లోక్‌ ‌జనశక్తిపార్టీ (రామ్‌ ‌విలాస్‌ ‌పాశ్వాన్‌) 5 ‌సీట్ల వంతున, ఇంకొన్ని చిన్న చితకా పార్టీల స్థానాలు కలిపి మొత్తం ఎన్డీఏకు 293 సీట్లు లభించాయి. ఓటింగ్‌ ‌శాతం 42.9 గా నమోదయ్యింది. ఇక ప్రత్యర్థి కాంగ్రెస్‌ ‌పార్టీకి స్వయంగా 99 స్థానాలు లభిస్తే, సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాలు, టీఎంసీ 29, డీఎంకే 22. ఉద్ధవ్‌ ‌ఠాక్రే శివసేన ఎస్‌ఎస్‌ (‌యూబీటీ)-9 స్థానాలు చొప్పున ఇండియా కూటమికి 234 స్థానాలు లభించాయి. ఓట్ల శాతం 41.1 శాతంగా నమోదయ్యింది. ఎన్డీఏ 3.2 శాతం ఓట్లను కోల్పోతే, ఇండియా బ్లాక్‌ ‌తన 6.9 శాతం ఓట్లను పెంచుకుంది.

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎప్పుడూ కీలకంగా ఉండే యూపీ, బిహార్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌రాజస్థాన్‌, ‌గుజరాత్‌లలో 2019 ఎన్నికలలో ఎన్డీఏ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ ‌వంటి చోట్ల కూడా తన శక్తిని ప్రదర్శిం చింది. 303 సీట్లతో ఎన్డీఏ తిరుగులేని  రీతిలో అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికలలో బీజేపీ మ్యాజిక్‌ ‌నంబర్‌ 272 ‌చేరలేదు. దాదాపు 32 స్థానాలు తక్కువ కావడంతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు అనివార్యమయింది. రిజర్వేషన్లు నిలిపివేస్తారని, రాజ్యాంగాన్ని మార్చి వేస్తారని ఇండియా కూటమి చేసిన అబద్ధపు ప్రచారాలు జనబాహుళ్యంలోకి బాగా వెళ్లాయని, అవే ఎన్డీఏను దెబ్బతీశాయని ఛత్తీస్‌గఢ్‌ ‌ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ ‌సాయి వంటి నేతలు వ్యాఖ్యానించారు. తాజా ఫలితాలు ఆ అభిప్రాయాన్ని బలపరిచేవే. కానీ రిజర్వేషన్‌ ‌రద్దు ఆలోచన లేదని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాలు చెప్పుకొచ్చారు. అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయినట్టుంది. అతి పెద్ద రాష్ట్రాలయిన యూపీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, ‌బిహార్‌లలో 53 సీట్లు కోల్పోవటం నష్టాన్ని తెచ్చిపెట్టింది.

యూపీలో ఏమైంది?

యూపీని డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కారు కలిగిన రాష్ట్రంగా పెట్టని కోటగా బీజేపీ భావిస్తుంది. 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో 2014లో 71, 2019లో 62 స్థానాలు లభిస్తే ఈ దఫా దాదాపు సగానికి పడిపోయి 33కి పరిమితమైంది. ఇక్కడ 50 శాతంగా ఉన్న ఎన్డీఏ ఓట్‌ ‌షేర్‌ 43 ‌శాతానికి పడిపోయింది. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో రామాలయ నిర్మాణం, ప్రాతిప్రతిష్ఠ నిర్వహించి హిందూ సమాజం మన్ననలందుకున్న పార్టీ స్థానిక ఓటర్లు మన్ననలను పొందలేకపోవటం ఆశ్చర్యం. రాహుల్‌ ‌గాంధీ- అఖిలేష్‌ ‌యాదవ్‌లతో ఇండియా కూటమిలో..ఎస్పీ 37 స్థానాలను (గతం కంటే 32 అదనం), కాంగ్రెస్‌ 6 ‌స్థానాలను (గతం కంటే ఐదు అధికం) దక్కించుకున్నాయి. గతంలో 10 స్థానాలను సాధించిన మాయావతి బీఎస్పీ సోదిలో లేకుండా పోయింది. రైతుల ఆందోళన, మహిళా రెజ్లర్ల అంశం నేపథ్యంలో యూపీలో రాజకీయ పరిణామాలు మారాయన్న విశ్లేషణలు వస్తున్నాయి. దీనిని పార్టీ ముందుగానే పసిగట్టకపోలేదు. నష్ట నివారణలో భాగంగా రాష్ట్రీయ లోక్‌ ‌దళ్‌ (ఆర్‌ఎల్డీ)ను రంగంలోకి తెచ్చింది. మరో వైపు మాయావతి ఇండియా బ్లాక్‌కు దూరంగా ఉండటం వల్ల వ్యతిరేక ఓటు చీలిపోయి తనకు కలిసొస్తుందన్న అంచనా వాస్తవం కాలేదు. ప్రధాని మోదీ వారణాసి నుంచి 1,52,513 ఓట్ల మెజార్టీతో గెలుపొంది హ్యాట్రిక్‌ ‌విజయం సొంతం చేసుకున్నారు. లక్నో నుంచి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌, ‌మీరట్‌ ‌నుంచి అరుణ్‌ ‌గోవిల్‌, ‌సినీనటి హేమమాలిని (మధుర) విజయాన్ని అందుకున్నారు. సుల్తాన్‌పూర్‌ ‌నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మనేకా గాంధీ ఓటమి పాలయ్యారు. బీజేపీ ఫైర్‌‌బ్రాండ్‌ ‌స్మృతి ఇరానీ (అమేఠీ) కూడా ఓడిపోయిన వారిలో ఉన్నారు. మహిళల ఓటింగ్‌ అత్యధికంగా ఉన్న 17 స్థానాల్లో పన్నెండిటిని ఇండియా బ్లాక్‌ ‌గెలుచుకుంది.

ఆ రాష్ట్రాలు కీలకం

ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, ‌బిహార్‌, ఒడిశాలను బీజేపీ కీలకంగా భావించి దృష్టి పెట్టింది. మిగతా చోట్ల బీజేపీ పూర్తిగా స్థిరపడటమో, స్వల్పపాత్ర పోషించే పాత్రలో ఉండటంతో అక్కడ వచ్చే ఫలితాల వల్ల పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండదని పార్టీ భావించింది. ఇక్కడ మొత్తం ఉన్న లోక్‌సభ స్థానాలు 151.

బిహార్‌: 30 ‌సీట్లు సాధించి ఎన్డీఏ బిహార్లో మంచి ఫలితాన్నే అందుకుంది. మొత్తం 40 స్థానాల్లో బీజేపీకి 12 (అంతకు ముందు కంటే 5 తక్కువ), ఎన్నికలను ముందుండి నడిపించిన ముఖ్యమంత్రి నితీశ్‌ ‌కుమార్‌ ‌జేడీయుకి12 (4 తక్కువ), చిరాగ్‌ ‌పాశ్వాన్‌ ఎల్జీపీకి 5 లభించాయి. ఆర్జేడీ4 (గతంలో సున్నా), కాంగ్రెస్‌ 3 (‌గతం కంటే 2 ఎక్కువ) సీట్లు పొందాయి. తేజస్వీయాదవ్‌ ఎన్నికల ప్రచార సభలకు భారీగా జనం హాజరైనా సీట్లు రాలేదు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లో 39 బీజేపీ దక్కించుకుంది. 54 శాతం ఓట్‌షేర్‌ ‌లభించింది. తనకున్న వ్యతిరేకతను పక్కనపెట్టి ముఖ్యమంత్రి నితీశ్‌ ‌కుమార్‌ ‌తిరిగి ఎన్డీఏ గూటికి చేరారు. ఈసారి బిహార్‌ ఓటర్లు గందరగోళానికి గురయ్యారని చెబుతున్నారు. అదేగనక జరిగితే, జేడీయూ కీలక ఓటర్లు ప్రధానంగా బాగా వెనకబడిన వర్గాలు (ఈబీసీ)లు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందన్న ప్రచారం సాగింది. దాంతో బీజేపీ నష్ట నివారణ చర్యలకు సిద్ధమైంది. ఉదాహరణకు పాట్నాలో ప్రధాని మోదీ నిర్వహించిన భారీ రోడ్‌ ‌షోలో యువతను లక్ష్యంగా చేసుకున్నారు. నిరుద్యోగ యువతలో పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చటానికి తనదైన శైలిలో ప్రయత్నించారు. అధికారిక లెక్కల ప్రకారం, బిహార్‌లోని మొత్తం 7.64 కోట్ల ఓటర్లలో 20-29 మధ్య వయసుగల యువత 1.6 కోట్లు ఉన్నారు. ప్రధాని పర్యటన పార్టీ ఎన్నికల ప్రచారానికి కొత్త ఊపు తెచ్చిందని, తాము ఆశించిన విధంగా ఈ దఫా 60 శాతం ఓట్‌ ‌షేర్‌ ‌సాధిస్తామని బీజేపీ అధికారప్రతినిధి మనోజ్‌ ‌శర్మ ప్రకటించారు.

పశ్చిమబెంగాల్‌ : ‌తృణమూల్‌ ‌తన పట్టు నిలుపుకుంది. గతం కంటే ఏడు స్థానాలను అధికంగా సాధించింది. బీజేపీ ఆరు స్థానాలు కోల్పోయింది. ఇక్కడ ఉన్న 42 స్థానాల్లోనూ బీజేపీ 12, టీఎంసీ 29 స్థానాలు సాధిస్తే కాంగ్రెస్‌ ఒక్క స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. 2019లో టీఎంఎసీ కంచుకోటలను బద్దలుకొట్టి పశ్చిమ బెంగాల్‌లోకి అడుగుపెట్టిన బీజేపీ 18 సీట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. అధికార టీఎంసీకి 22 సీట్లు లభించాయి. ఈసారి పశ్చిమబెంగాల్‌ ‌తమకు పెద్ద లాభాన్ని అందిస్తుందని మోదీ ఒక ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు కూడా.

ఒడిశా: కళింగలో కమల వికాసం జరిగింది. ఈ ఎన్నికల్లో ఒడిశా ఫలితాలను బీజేపీ సాధించిన అతి పెద్ద విజయంగా చెప్పుకోవాలి. గత ఐదు దఫాలుగా అధికారంలో ఉన్న నవీన్‌ ‌పట్నాయక్‌ ‌ప్రభుత్వాన్ని నిలువరించి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకుంది. 2014లో కేవలం 1 లోక్‌సభ స్థానంలో విజయం సాధించిన బీజేపీ, 2019లో 8కి చేరి, ఇప్పుడు ఏకంగా 20 స్థానాలను దక్కించుకుంది. నవీన్‌ ‌పట్నాయక్‌ ‌బీజేడీ పార్టీని ఒక్క సీటుకు పరిమితం చేసింది. అసెంబ్లీ విషయానికొస్తే 147 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ 78 స్థానాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

బీజేడీ 51 స్థానాలను, కాంగ్రెస్‌ 14 ‌స్థానాలను పొందాయి. మొదట ఒడిశాలో అధికార బీజేడీ, బీజేపీ కూటమిని ఏర్పాటు చేయటానికి ప్రయత్నిం చాయి. చివరకు విడివిడిగా పోటీకి దిగాయి. గత ఎన్నికల్లో ఇక్కడున్న 21 లోక్‌సభ స్థానాల్లో 8 బీజేపీకి, బీజేడీకి 12, కాంగ్రెస్‌కు ఒక స్థానం దక్కాయి. బీజేడీకి 42.8శాతం, బీజేపీకి 38.4 శాతం, కాంగ్రెస్‌కు 13.4 శాతం ఓట్‌ ‌షేర్‌ ‌లభించింది. ఈ దఫా 15 కంటే ఎక్కువ స్థానాలు లభిస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా ధీమా ప్రకటించారు.‘ఎన్నికల ఆవరణంలో క్షేత్రస్థాయిలో కీలకమైన పరిణామాలు చోటుచేసుకోవటాన్ని నేను గమనిస్తున్నాను. అది పార్లమెంటు స్థాయిలోనే కాదు. అసెంబ్లీల స్థాయిలోకూడా’’ అన్నారు ప్రధాని మోదీ. 2019లో మోదీ వేవ్‌ ‌వల్ల పార్టీ తన ఓట్‌ ‌షేర్‌ను పెంచు కోగలిగింది. కానీ అసెంబ్లీ స్థాయిలో అదే రకమైన ప్రభావాన్ని చూపలేక పోయింది. ఆ తర్వాత నుంచి బీజేడీని సవాలు చేసే పార్టీగా ఎదిగింది. మరో వైపు బీజేడీ అధినేత దేశంలో దీర్ఘకాలంగా పనిచేసే ముఖ్యమంత్రుల్లో రెండో స్థానంలో ఉన్నారు. 1997 నుంచి అధికారాన్ని కొనసాగిస్తున్నారు.

మహారాష్ట్ర : 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ 51.34 శాతం ఓట్‌ ‌షేర్‌తో మొత్తం 48 సీట్లలోనూ 41 సాధించింది. బీజేపీ 25 చోట్ల పోటీ చేసి 23 సీట్లలో విజయం సాధిస్తే, తన మిత్రపక్షం శివసేన 23 చోట్ల పోటీ చేస్తే అందులో 18 చోట్ల గెలిచింది. ప్రస్తుతం ప్రధాన పార్టీలయిన శివసేన, ఎన్సీపీలలో చీలిక రావటం వల్ల రాజకీయసమీకరణాల్లో పెనుమార్పులు సంభవించాయి. ఈ రెండు పార్టీల లోని శక్తిమంతమైన భాగస్వాముల మద్దతు బీజేపీకి ఉన్నా, పరిస్థితి మార్మికంగా ఉంది. ఓటర్లు పార్టీ చీలికను ఏ రకంగా అర్థం చేసుకుంటారు? ఎవరికి మద్దతు ఇస్తారనే చర్చలు జోరుగా సాగాయి. ఏకనాథ్‌ ‌షిండే నాయకత్వంలోని అతిపెద్ద శివసేన వర్గం, అజిత్‌ ‌పవార్‌ ‌నేతృత్వంలోని అది పెద్ద ఎన్సీపీ వర్గం తమ వైపే ఉండటం తమకు కలిసొస్తుందని, 2019లో మాదిరిగానే విజయం సాధిస్తామని ఆశించింది.

ఎన్డీఏ విజయాన్ని దెబ్బతీసిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఒకటి. ఇక్కడ బీజేపీ అంతకు ముందు గెలిచిన స్థానాల్లో 14 స్థానాలను కోల్పోయింది. తొమ్మిది సీట్లను మాత్రమే పొందింది. కాంగ్రెస్‌ 12 ‌స్థానాలను పెంచుకుని మొత్తం 13 సీట్లు దక్కించుకుంది. ఉద్దవ్‌ ‌ఠాక్రే శివసేన తొమ్మిది, శరద్‌ ‌పవర్‌ ఎన్సీపీ 8, ఇంకో శివసేన 7, ఎన్సీపీ 1 సాధించాయి. ఏది అసలైన సేన, ఏది అసలు ఎన్సీపీ అన్న చర్చలు సాగిన నేపథ్యంలో కాంగ్రెస్‌, ఉద్దవ్‌, ‌పవార్‌ల బృందంతో కూడిన మహా వికాస్‌ అఘాఢీ (ఎంవిఏ) 29 సీట్లను దక్కించుకుంది.

హిందీ హార్ట్ ‌ల్యాండ్‌లో

బీజేపీకి విపరీతమైన పట్టు ప్రాంతంగా చెప్పుకునే ఈ రాష్ట్రాల్లో సమీకరణాలు మారాయి. 2019తో పోలిస్తే ఇక్కడ, పశ్చిమ రాష్ట్రాలలోనూ కలిపి మొత్తం 2.3 శాతం పాయింట్లను ఎన్డీఏ కోల్పోయింది. 14.4 శాతం ఓట్లు తగ్గాయి. ఈ మేరకు ఇండీ కూటమి బలపడింది.ఉత్తరప్రదేశ్‌, ‌బిహార్‌లలో పరిస్థితిని పైన చెప్పుకున్నాం. ఇక రాజస్థాన్‌, ఉత్తరా ఖండ్‌, ‌ఝార్ఖండ్‌, ‌హరియాణా, ఢిల్లీ, హిమాచల ప్రదేశ్‌లలో ఓట్ల శాతం గణనీయంగా తగ్గింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ‌గట్టి పోటీ ఇచ్చింది. ఇక్కడ ఎన్డీఏకు 14 స్థానాలు (గతం కంటే 10 తక్కువ) లభిస్తే, ఇండియా కూటమికి 11 స్థానాలు దక్కాయి (పది అధికం). హరియాణాలో బీజేపీ, కాంగ్రెస్‌ ‌చెరి ఐదు స్థానాలను పంచుకున్నాయి. ఎన్డీఏ అంతకు ముందుతో పోలిస్తే ఐదు స్థానాలను కోల్పోయింది. ఢిల్లీలో 7 స్థానాలను, ఉత్తరాఖండ్‌లో 5 స్థానాలను నిలబెట్టుకోగలిగింది. మధ్యప్రదేశ్‌లో అంతకు ముందు కంటే ఒక స్థానాన్ని అధికంగా పెంచుకుని 29 స్థానాలను, ఛత్తీస్‌గఢ్‌ ‌లో మరో స్థానాన్ని పెంచుకుని 10 స్థానాలను సాధించింది. హిమాచలప్రదేశ్‌ ‌లోని నాలుగు పార్లమెంటు స్థానాలను సొంతం చేసుకుంది. ఇది పార్టీకి హ్యాట్రిక్‌ ‌విజయంగా చెప్పుకోవాలి.

గుజరాత్‌: ‌మోదీ, షాల స్వరాష్ట్రం. గుజరాత్‌లో బీజేపీ 2014, 2019ల్లో మొత్తం 26 సీట్లతో క్లీన్‌ ‌స్వీప్‌ ‌చేసింది. దశాబ్దానికి పైగా ఒక్క సీటు గెలుచుకోలేక దీనావస్థలో ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీకి ఈ సారి ఒక్క సీటు ప్రసాదించి మిగిలిన 25 చోట్ల తన హవాను చాటింది. పార్టీ వ్యూహకర్త, కేంద్ర మంత్రి అమిత్‌ ‌షా గాంధీనగర్‌లో తన రికార్డును తిరగరాశారు. గతంలో 5.6 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తే, ఈ సారి 7.4 లక్షల మెజార్టీని సాధించటం విశేషం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీ.ఆర్‌.‌పాటిల్‌ ‌కూడా తన 2019 నాటి రికార్డును తిరగరాశారు.

ఈశాన్య రాష్ట్రాలలో

ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు అసోం, సిక్కిం, అరుణాచలప్రదేశ్‌, ‌మణిపూర్‌, ‌మిజోరం, నాగాలాండ్‌, ‌త్రిపుర, మేఘాలయలు మొత్తం 25 మంది పార్లమెంటు సభ్యులను ఎగువ సభకు పంపుతాయి. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈశాన్య రాష్ట్రాలపైన ప్రత్యేక దృష్టి సారించారు. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాలకు బాహ్యప్రపంచంతో ప్రత్యేకంగా అనుసంధానం పెరిగింది. ఎన్డీఏ అరుణాచలప్రదేశ్‌, ‌త్రిపుర స్థానాల్లో గతంలో గెలిచిన 2 సీట్లను నిలబెట్టుకుంది. అసోంలో రెండు సీట్లు, 1.6 శాతం ఓట్లు పెంచుకుని 11స్థానాలను సంపాదించింది. మణిపూర్‌లో రెండు సీట్లను, మేఘాలయలో ఒక్క సీటుని, నాగాలాండ్‌లో ఒక్కసీటుని కోల్పోయింది. మొత్తంగా చెప్పాలంటే, ఎన్డీయే కూటమి 2019తో పోలిస్తే మూడు సీట్లను కోల్పోయింది. బీజేపీ పరంగా చూస్తే అది పోటీ చేసిన 17 స్థానాల్లో 4 కోల్పోయింది.

దక్షిణాది ప్రత్యేకం

దక్షిణాదిన ‘మిషన్‌ 50’ ‌లక్ష్యంగా బీజేపీ ఈ దఫా ఎన్నికల గోదాలోకి దిగింది. ఇక్కడ ఉన్న ఐదు రాష్ట్రాలు తమిళనాడు (39 సీట్లు), కర్ణాటక (28 సీట్లు). ఆంధప్రదేశ్‌ (25), ‌కేరళ (20). తెలంగాణ (17), పాండిచ్చేరి (1)వంతున 130 మంది ఎంపీలను పార్లమెంటుకు పంపుతాయి. 2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీ 29 సీట్లు సాధించింది. అందులో 25 కర్ణాటక నుంచి కాగా మిగిలిన నాలుగు తెలంగాణ నుంచి దక్కించుకుంది. తమిళనాడు, కేరళ, ఆంధప్రదేశ్‌, ‌పాండిచేరిలోని 85 సీట్లలోనూ తన ఖాతా ప్రారంభించలేకపోయింది. తన పోటీ చేసిన స్థానాల్లో 22 శాతం ఓట్లు దక్కించుకుంది. ఇది అంతకు ముందు కంటే మెరుగయిన ఫలితం.2014లో పార్టీ 21 సీట్లు సాధించింది.

తమిళనాడు నుంచి 20 సీట్లు దక్కించుకోవాలని పార్టీ లక్ష్యంగా విధించుకుంది. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీనికి సంబంధిం చిన ప్రణాళికలు ఊపిరిపోసుకున్నాయి. అక్టోబరు 2019లో, చైనా ప్రభుత్వాధినేత షి జిన్‌పింగ్‌తో భేటీకి తమిళనాడు తీర ప్రాంతం మామళ్ల పురాన్ని ఎంచుకున్నారు. అంతర్జాతీయ వ్యవహారాలతో పాటు చెన్నైతో బంధాన్ని పెంచటంపైన దృష్టి సారించారు. సెప్టెంబరు, 23లో కొత్త పార్లమెంటు భవనం ప్రారం భోత్సవం సందర్భంగా సెంగోల్‌ ఆవిష్కరించారు మోదీ.

మరోవైపు తమిళనాడులో పార్టీ పునర్వవస్థీ కరించేందుకు మోదీతో పాటు, అమిత్‌ ‌షా, జెపీనడ్డాలు కూడా కృషి చేశారు. దూకుడుగా వ్యవహరించే మాజీ ఐపీఎస్‌ అధికారి కె.అన్నామలైకు పార్టీ రాష్ట్ర బాధ్యతలను అప్పగించారు. 39 ఏళ్ల చిన్న వయసులో పార్టీ బాధ్యతలు దక్కిన వాళ్లెవరూ లేరు. ఈ అవకాశాన్ని అన్నామలై ఉపయోగించు కున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించటంతో కేవలం నాలుగు సీట్లు మాత్రమే దక్కించుకున్న బీజేపీ తనకు మిత్రపక్షంగా ఉన్న ఏఐడీఎంకే తో మద్దతు గురించి పునరాలోచించింది. అన్నామలై ఒక వైపు డీఎంకేతోపాటు, ఏఐడీఎంకేపైన విమర్శల దాడి చేశారు. దాంతో సెప్టెంబరు 2023లో బీజేపీ, ఏఐడీఎంకెల మధ్య తెగిపోయింది. బీజేపీ కొత్త కూటమిని ఏర్పాటు చేసుకుంది. పార్టీ తనకు తానుగా 19 సీట్లలోనూ (2019తో పోలిస్తే 14 అధికం), మిగిలిన 20 చోట్ల కూటమి భాగస్వా ములకి టిక్కెట్టిచ్చింది. తమిళనాడులో ఏఐడీఎంకే నానాటికి బలహీనపడుతోందని, తాను పార్టీలో ప్రధాన పోటీదారుగా ఎదగటానికి అవకాశం ఉందని భావిస్తోంది. దాంతో ఈ ఏడాది జనవరి నుంచి ప్రధాని తనకు తానుగా ఏడుమార్లు పర్యటించారు. దాదాపు 11 ర్యాలీల్లో పాల్గొన్నారు. తనకు తానుగా 15 శాతం, భాగస్వాములతో కలిసి 20 శాతం సాధించి.. 2026 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేనాటికి డీఎంకే సవాలు చేసే స్థాయికి ఎదుగుతా మని పార్టీ ఆశాభావంతో ఉన్నారు.

దక్షిణాదిన బీజేపీకి పట్టున్న రాష్ట్రం కర్ణాటక. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌చేతిలో ఓటమి పాలవ్వటంతో పార్టీలో మార్పులు చేర్పులు చేసుకుంది. 2019 ఎన్నికల్లో వచ్చిన 25 సీట్లు చెక్కుచెదరకూడదన్న ఉద్దేశంతో తన పాత మద్దతుదారు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.‌డి. కుమార స్వామి ఆధ్వర్యంలోని జేడీ(ఎస్‌)‌తో చేతులు కలిపింది. కాంగ్రెస్‌ ‌ను దెబ్బతీయటానికి వొక్కలిగలు ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండే మూడు చోట్ల జేడీ(ఎస్‌)‌కు టిక్కెట్‌ ఇచ్చారు. లింగాయత్‌లను ఆకట్టుకునేందుకు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ ‌యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్రకు పార్టీ బాధ్యతలు అప్పచెప్పారు.

పాండిచ్చేరిలో ఉన్న ఒకే ఒక లోక్‌సభ స్థానంలో ఎన్డీఏ ప్రభుత్వ హయంలో హోం మంత్రిగా పనిచేసిన ఎ.నవశ్శివాయంను పార్టీ రంగంలోకి దింపింది. కాంగ్రెస్‌ ‌తరపున సిట్టింగ్‌ ఎం‌పీ, రెండు సార్లు సీఎంగా పని చేసిన వి. వైద్యలింగం తలప డ్డారు. ఈ స్థానం ఈసారి కాంగ్రెస్‌ ‌గెలుచుకుంది.

భారత దక్షిణ భాగంలో మరింతగా చొచ్చుకు పోవాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలితమిచ్చాయి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, సాధించిన సీట్లు అందుకు తార్కాణం. కేరళలో తొలి అడుగు పడింది. ఏపీలో చంద్రబాబుతో జతకట్టటం అనేది ఎన్డీయేకు కలిసొచ్చింది. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న జనసేన తన పోటీ చేసిన అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ, రెండు పార్లమెంటు స్థానాల్లోనూ ప్రజాదరణను మరింతగా పెంచుకుంది.

ఎన్నికలు చెబుతున్న పాఠాలు

1.2019 ఎన్నికలతో పోలిస్తే 2024 ఎన్నికల నాటికి ఎన్డీఏ భారత దేశం తూర్పు రాష్ట్రాలలో 1.7 శాతం, దక్షిణాదిన 7.6శాతం, నార్త్‌లోని హిందీయేతర రాష్ట్రాల్లో 2.6 శాతం ఓట్లను పెంచుకోగలిగింది.

2.పశ్చిమాన 14.4,హిందీ హార్ట్ ‌ల్యాండ్‌లో 2.3 శాతం,ఈశాన్యంలో 1.5శాతం ఓట్ల శాతాన్ని కోల్పోయింది.

3.అర్బన్‌, ‌సెమీఅర్బన్‌, ‌రూరల్‌ ‌ప్రాంతాల ఓటర్లు ఇండియా కూటమికి మద్దతు పలికితే, సెమిరూరల్‌ ‌ప్రాంతాల ఓటర్లు ఎన్డీయే మద్దతు పలికారు. ఇక్కడ ఎన్డీయే తన ఓటు బ్యాంకును 2.5 శాతం పెంచుకోగలిగింది.

4.ఎస్సీ రిజర్డ్ ‌స్థానాల్లో ఎన్డీయేకు గణనీయంగా మద్దతు లభించింది. ఆ పార్టీకి గత ఎన్నికలతో పోలిస్తే అదనంగా 1.8 శాతం మద్దతు లభించింది. ఎస్టీ నియోజకవర్గాల్లో ఇండియా కూటమి వైపు మొగ్గు కనిపించింది.

5.బీజేపీ మొత్తం ఆరు మెట్రోల్లో మూడు చోట్ల తన పట్టు సాధించింది. ఢిల్లీ, బెంగళూరుల్లో ఇంతకు ముందే తన ప్రాభావాన్ని చాటగా ఇప్పుడు కొత్తగా హైదరాబాద్‌ను తన ఖాతాలోకి చేర్చుకుంది.

6.2019లో ఎన్డీఏ గెలిచిన స్థానాల్లో 299 చోట్ల తిరిగి పోటీ చేస్తే దాదాపు 200 వరకూ స్థానాలను తిరిగి దక్కించుకోగలిగింది. అలాగే గతంలో ఓడిపోయిన 99 స్థానాల్లో పోటీ చేస్తే 27 స్థానాలు గెలవగలిగింది. అప్పుడు పోటీ చేయని 41 స్థానాల్లో పోటీ చేస్తే తొమ్మిది విజయం సాధించారని ఒక ఆంగ్లపత్రిక విశ్లేషించింది.

కాంగ్రెస్‌తో ముఖాముఖీ తలపడిన రాష్ట్రాల్లో 2009లో.. 173 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ ‌తలపడితే బీజేపీ 80 స్థానాలు (41 శాతంఓట్లు), కాంగ్రెస్‌ 93 ‌స్థానాలు (42.6శాతం) దక్కించు కున్నాయి. 2014లో 189 సీట్లలో బీజేపీకి 166 (50.9 శాతం), 2019లో 190కి 175 సీట్ల (56.5 శాతం)ను బీజేపీ గెలుచుకుంది. ఇక 2024 వచ్చేనాటికి 215 సీట్లలో బీజేపీ 153 సీట్లు (51శాతం) సాధించింది. 62 సీట్లలో కాంగ్రెస్‌ ‌బీజేపీని ఓడించింది. (28.9 శాతం)

జాతీయవాదం, సాంస్కృతి పునాదితో మనుగడ సాగించే బీజేపీ 1980లో ఏర్పాటయ్యింది. దాని మూలాలు, సిద్ధాంతాలు జనసంఘ్‌కు కొనసాగింపే అయినా ముస్లింలలోనూ పార్టీ తన ఆదరణను పెంచుకుంటూ వచ్చింది. 2009లో కేవలం 4 శాతం మంది బీజేపీకి ఓటు వేస్తే, 2014లో 9 శాతానికి, 2019లో 19శాతానికి హెచ్చింది. (ఆ ఏడాది 30 శాతంమంది ముస్లింలు కాంగ్రెస్‌ ‌వైపు మళ్లితే మిగిలిన వారు చీలిపోయిన ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గు చూపారు). ఈ ఏడాది పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ విజయవకాశాలను దృష్టిలో ఉంచుకుని నాలుగో వంతు ఎంపీలను మార్చి, కొత్త వారికి అవకాశం ఇచ్చింది. అవకాశం కోల్పోయిన వాళ్లలో ఎక్కువ మంది అనుభవం ఉన్న వారు కావటం విశేషం. దీనితో నేతలు ఎవరైనా కష్టపడి పనిచేయవలసి తీరవలసిందే అన్న అభిప్రాయంతో ఉంటారు. పార్టీ ప్రచారంలో, కార్యాచరణలో బీజేపీది వినూత్నశైలి. 2000 మంది జనాభా ఉన్న చిన్న గ్రామంలో కూడా 18 నుంచి 20 వరకూ మీడియా వ్యాన్లు పార్టీ సందేశాన్ని ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తూంటాయి. పార్టీ అనుసరించే ‘నో యువర్‌ ‌కస్టమర్‌’ ‌డేటా బేస్‌ ‌చూస్తే ప్రఖ్యాత కంపెనీలు సిగ్గుపడవలసి వస్తుంది. 2024 ఎన్నికల్లో 400 సీట్లు సాధించాలన్న లక్ష్యంతో బీజేపీ నేతలు అలుపెరగని కృషి చేశారు. 180పైగా ర్యాలీలు, రోడ్‌ ‌షోల్లో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొన్నారు.

‘‘ఈ దేశ ప్రజలు బీజేపీపైనా, ఎన్డీయేపైన అపారమైన విశ్వాసం ఉంచారు. ప్రజా స్వామ్యం సాధించిన అపూర్వ విజయం ఇది. వికసిత భారత్‌ ‌విజయం ఇది. సబ్‌ ‌కా సాత్‌, ‌సబ్‌ ‌కా వికాస్‌ ‌మంత్రం ఇది’’ అని బీజేపీ కార్యకర్తలతో తన ఆనందాన్ని పంచుకున్నారు మోదీ.

– డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE