ప్రపంచంలోనే అతి భారీ ప్రజాస్వామిక ప్రక్రియ అయిన భారతీయ లోక్‌సభ ఎన్నికలు ఈసారి మరింత సచేతనంగా, సమ్మిళితంగా ఉండనున్నాయి. ఇందుకు కారణం, ముందెన్నడూ లేని విధంగా 2024 ఎన్నికలలో మహిళా ఓటర్లు భారీ ఎత్తున పాలుపంచుకోవడమే!

పత్రికలన్నీ ఎన్నికల జ్వరంతో ఊగిపోతున్న క్రమంలో ఈసారే కాదు, భవిష్యత్తులో కూడా అధికారం ఎవరిదన్న నిర్ణయాన్ని రాణులే చేయనున్నారన్న విషయం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు.


పరిణతి చెందిన ప్రజాస్వామ్యానికి సూచికగా మహిళల ఓటింగ్‌ శాతాన్ని తీసుకుంటారు. గత ఎన్నికలు, అంటే 2019 ఎన్నికలలో కూడా పురుష, మహిళా ఓటర్ల సంఖ్యలో చారిత్రకమైన తేడా కనిపించింది. దేశంలో ఎన్నికల ప్రారంభమైన తర్వాత ఈ ఎన్నికలలో తొలిసారి పురుషుల కన్నా ఎక్కువమంది మహిళలు ఓటు వేశారు. ప్రస్తుత ఎన్నికలు, అంటే 2024 ఎన్నికలు ఆ రికార్డును కూడా బద్దలు చేయనున్నాయి.

ఇంతకు ముందు 2014 లోక్‌ సభ ఎన్నికలలో అత్యధిక మహిళా ఓటర్ల శాతం నమోదైంది. 2014 నుంచి ప్రారంభమైన హైవోల్టేజీ ఎన్నికల ప్రచారాలలో కూడా మహిళల భాగస్వామ్యం పెరిగింది.

ఈ సరళితో అది రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీ అయినా కూడా మహిళలే లక్ష్యంగా ప్రలోభాలు, ఉచితాలను తమ మానిఫెస్టోలలో పొందు పరిచి మహిళా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.

ఓటరు జెండర్‌ నిష్పత్తి

 భారత ఎన్నికల కమిషన్‌ (ఈసీఐ) ప్రకారం, ఈసారి కొత్తగా నమోదు చేసుకున్న 2.63 కోట్ల ఓటర్లలో, పురుష ఓటర్ల కన్నా దాదాపు 1.41కోట్లతో 15శాతం అధికంగా మహిళా ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలు, అంటే 2019 లోక్‌సభ ఎన్నికల నుంచి మహిళా ఓటర్ల శాతం 9.3 పెరిగి, 43.1 కోట్లను చేరుకుంది. దీనితో పోలిస్తే, పురుష ఓటర్లు 6.9శాతం పెరిగి, 46.4 కోట్లకు చేరుకున్నారు. ఈసీఐ ప్రకారం, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, కేరళ సహా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మహిళా ఓటర్లు పురుష ఓటర్లను మించిపోయారు.

గత, అంటే 2019 ఎన్నికలలో కనిపించిన 926 జెండర్‌ నిష్పత్తి అన్నది 2014 కన్నా 18 పాయింట్లు అధికంగా ఉంది. ఇక, 2014 ఎన్నికలలో మొత్తం మహిళా ఓటర్లలో 65.63శాతం ఎన్నికల ప్రక్రియలో పాల్గొనగా, 2009 ఎన్నికలలో ఓటు వేసిన వారి శాతం 55.82 శాతంగా ఉంది. కాగా, 2014 లోక్‌సభ ఎన్నికలలో అత్యధిక మహిళా ఓటర్లు పాల్గొన్నట్టు నమోదైంది. ఓటింగ్‌లో పురుషుల కంటే మహిళల పెరుగుదల అధికంగా ఉన్నందున, ఈ ఎన్నికలలో గెలుపోటముల నిర్ణేతల కీర్తి వారికే దక్కుతుంది.

ఎన్నికలలో ప్రజలు పాలుపంచుకోవడాన్ని ఎన్నికల ప్రక్రియపై విశ్వాసాన్నే కాదు, రాజకీయ నాయకులు పనితీరుకు సూచికగా చెప్పవచ్చు. ఎన్నికలలో పాలుపంచుకోవడం అన్నది సానుకూల సామాజిక వాతావరణాన్ని, ఉత్సాహవంతమైన దృష్టికోణాన్ని సూచిస్తుంది. తమ ఎదుట గల ప్రత్యామ్నాయాల నుంచి ఎంపిక చేసుకునేందుకు ఓటర్లలో భయం లేదా నిరాశ ఉన్న సమయంలో ఓటింగ్‌ శాతాలు పడిపోతుంటాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా కనిపించిన సరళి. ఈ నేపథ్యంలో, భారత్‌లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరగడం వెనుక గల క్రియాశీలత ఏమిటి? ముఖ్యంగా గత దశాబ్దకాలంలో ఈ ట్రెండ్‌ పెరగడానికి కారణాలు ఏమిటి? అది మహిళలలో హఠాత్తుగా సంభవించిన ఓటరు చైతన్యమా లేక ఇతర అంశాల కారణంగా ప్రేరితమైన సామాజిక మార్పా?

ఎన్నికల కమిషన్‌ కృషి

2009 ఎన్నికల అనంతరం, పురుషుల ఓటింగ్‌ 60.36 శాతం ఉండగా, మహిళల ఓటింగ్‌ శాతం 55.8 ఉన్నప్పుడు, ఎన్నికల ప్రక్రియలో పాలుపంచు కోవడంలో జెండర్‌ వ్యత్యాసాన్ని ప్రధాన సవాలుగా భారత ఎన్నికల కమిషన్‌ గుర్తించింది.

ఎస్‌విఇఇపి (సిస్టమేటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్టొరల్‌ పార్టిసిపేషన్‌) పేరిట 2009 ఎన్నికల అనంతరం ఇసిఐ చేపట్టిన ఓటరు చైతన్యం, చేరువయ్యే కార్యక్రమం జెండర్‌ వ్యత్యాస సమస్యను పరిష్కరించడంతో పాటు యువత వేరుపడడం, పట్టణ ప్రాంతాలలో ఉదాసీనత వంటి సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించింది.

మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అప్పటి నుంచి పోలింగ్‌ బూత్‌ అధికారులుగా మహిళలను నియమించడం, మహిళలు మాత్రమే నిర్వహించే పోలింగ్‌ స్టేషన్లు, పిల్లలను ఉంచేందుకు పోలింగ్‌ బూత్‌ల వద్ద క్రెచ్‌ సౌకర్యం, తమ సామాజిక` సాంస్కృతిక పరిసరాలలోనే మహిళలకు ప్రేరణను ఇచ్చి, సులభంగా నమోదు చేసుకునేందుకు బ్లాక్‌ స్థాయి మహిళా అధికారులను నియమించడం సహా పలు చర్యలను తీసుకుంది.

మహిళా సంక్షేమంపై దృష్టి

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ, ‘మన తల్లులను, సోదరీమణులను సాధికారం చేస్తే, మొత్తం కుటుంబమే సాధికారం అవుతుంది. కనుక, ప్రభుత్వ ప్రాధాన్యత తల్లుల, సోదరీమణుల సంక్షేమమే.’

ఈ దృష్టి తొలి నుంచీ కనిపిస్తూ ఉంది. ప్రధాని మోదీ 2014లో ఎర్రకోట మీద నుంచి చేసిన తన తొలి ప్రసంగంలో, ప్రతి గ్రామీణ ఆవాసానికీ మరుగుదొడ్ల ఆవశ్యకతను ప్రస్తావించారు. ప్రజలు నిశ్చేష్టులయ్యారు. ఇటువంటి సమస్యను పరిష్కరించాలని ఏ నాయకుడూ అనుకోలేదు. అటువంటి కీలక ప్రజా వేదిక నుంచి ఇలాంటి విషయాల గురించి ఏ నాయకుడూ మాట్లాడలేదు. వాస్తవానికి గ్రామీణ మహిళలు రోజువారీగా వ్యక్తిగత స్థాయిలో ఎదుర్కొనే తీవ్ర సమస్య. అయినప్పటికీ, అది ఎప్పుడూ గుసగుసలుగా మిగిలిపోయిన విషయమే. ఎర్రకోట మీద నుంచే ఈ విషయాన్ని మాట్లాడాలని మోదీ నిర్ణయించు కున్నప్పుడు, అనేకమంది నిశ్చేష్టులయ్యారు, చాలామంది నవ్వేశారు, కొంతమంది అపహాస్యం చేశారు. కానీ, తమ జీవితకాలమంతా ఈ సమస్యను ఎదుర్కొన్న మిలియన్ల కొద్దీ మహిళల, గ్రామీణ ప్రాంత మహిళల పట్ల సానుభూతి కలిగిన పట్టణ మహిళల హృదయాలను ఆయన స్పృశించారు.

‘‘మన తల్లులు, అక్కచెల్లెళ్లు బహిర్భూమికి వెళ్లడం మనకు ఎప్పుడైనా బాధను కలిగించిందా? మహిళల గౌరవాన్ని కాపాడటం మన సామూహిక బాధ్యత కాదా? మన తల్లుల, అక్కచెల్లెళ్ల గౌరవం కాపాడడం కోసం మనం టాయిలెట్ల ఏర్పాటు చేయలేమా? అని ఆయన ప్రశ్నించారు.

మోదీ ‘కార్యాన్ని’ ప్రారంభిస్తారని ఎవరూ ఊహించని తరుణంలో ప్రభుత్వ యంత్రాంగం ఆ ప్రచారానికి ఊపునివ్వడమే కాదు శరవేగంతో క్షేత్రస్థాయిలో దాని అమలుకు శ్రీకారం చుట్టింది.

అన్ని గ్రామీణ ఆవాసాలకు టాయిలెట్లను అందబాటులోకి తేవడం ద్వారా దేశంలోని గ్రామీణ ప్రాంతాలను బహిరంగ మలవిసర్జన రహితం (ఓపెన్‌ డిఫికేషన్‌ ఫ్రీ-ఒడిఎఫ్‌) చేయడం కోసం స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (గ్రామీణ)ను 02 అక్టోబర్‌న ప్రారంభించారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 10.9 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించినట్టు 2022, ఫిబ్రవరిలో ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో జారీ చేసిన ఒక ప్రకటన పేర్కొంది.

ఇక, మే 2023 నాటికి మిషన్‌ రెండవ దశ కింద భారత్‌లోని మొత్తం గ్రామాలలో 50శాతం ఒడిఎఫ్‌ ప్లస్‌ హోదాను సాధించాయి. ఘన లేదా వ్యర్ధ పదార్ధాల నిర్వహణ వ్యవస్థలను అమలు చేయడంతో పాటుగా, తన ఓడిఎప్‌ హోదాను నిలకడగా నిలబెట్టుకున్నదే ఒడిఎఫ్‌ ప్లస్‌ గ్రామం. ఇక ఒడిఎఫ్‌ ప్లస్‌ మైలురాయి అంటే, ప్రాజెక్టు పూర్తి కావడమే కాక, మరుగుదొడ్ల వినియోగానికి మించి సంపూర్ణ పరిశుభ్రత దిశగా, అంటే ఒడిఎఫ్‌ నుంచి ఒడిఎఫ్‌ ప్లస్‌కు చేరుకోవడం. సెప్టెంబర్‌ 2023 నాటికి 4 లక్షలకు పైగా గ్రామాలు తమను తాము ‘ఒడిఎఫ్‌ ప్లస్‌’గా ప్రకటించుకున్నాయి.

ముఖ్యంగా, 2014కు ముందు దేశంలో 40శాతం కన్నా తక్కువ జనాభాకు వ్యక్తిగత మరుగుదొడ్లు అందుబాటులో ఉండేవి. నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన ప్రముఖ విజయాలలో స్వచ్ఛ భారత్‌ అభియాన్‌, దాని సాఫల్యం ప్రప్రథమ మైనవి. మహిళ జీవన ప్రమాణాలలో స్పష్టమైన మెరుగుదల, స్త్రీల జీవన నాణ్యత, ఆత్మగౌరవ భావనలో స్పష్టమైన మెరుగుదల అన్నవి కుల, మతాలకు అతీతంగా భారీ సంఖ్యలో మహిళా ఓటర్ల ఎదుట ఆయనను హీరోగా నిలిపాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌కు చెందిన నీరు, స్వచ్ఛత, పారిశుద్ధ్యంపై ఉమ్మడి పర్యవేక్షణ కార్యక్రమ నివేదిక ప్రకారం, ‘2015 నుంచి స్వతంత్ర సంఖ్యల పరంగా బహిరంగ మలవిసర్జన భారీగా తగ్గడానికి భారత్‌ బాధ్యత వహించింది.’ ఈ మరుగు దొడ్ల అంశం అన్నది మోదీ తొలి ఉపన్యాసంలో విస్మరించలేనిది. అందుకు కారణం, దాని అసాధారణత, దాని దీర్ఘకాలిక రాజకీయ ప్రభావం, మహిళల కేంద్రంగా సంక్షేమం అన్న ప్రభుత్వ దృష్టిని బహిరంగంగా ప్రకటించడం.

ఇప్పటికే మహిళలు పెద్ద సంఖ్యలో 2014 ఎన్నికలలో పాల్గొన్నారు. ఆ ఎన్నికలలో మహిళల భాగస్వామ్యం 10శాతం పెరిగి, అప్పటి వరకూ జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అత్యధిక పోలింగ్‌ను నమోదు చేసింది. పెద్ద ఎత్తున ఓటింగ్‌ కావడానికి కారణం కూడా పురుషులకన్నా ఎక్కువ సంఖ్యలో మహిళలు పోలింగ్‌లలో పాల్గొనడమే.

ఇక, 2019 లోక్‌సభ ఎన్నికలలో 67.01 శాతంగా ఉన్న పురుషుల పోలింగ్‌ శాతాన్ని మించి మహిళా ఓటర్ల పోలింగ్‌ శాతం 67.18శాతంగా ఉంది.

మహిళల నేతృత్వంలో అభివృద్ధికి అమలవుతున్న పథకాలు

తన దశాబ్దకాల పాలనలో ఎన్డీయే పాలనా నమూనాలో మహిళా కేంద్రిత విధానాలు పొందు పరచడం జరిగింది. మహిళ సంక్షేమం అన్నది కుటుంబ సంక్షేమంలో, సామాజిక సంక్షేమంలో ప్రతిఫలిస్తుంది. నూతన భారత వృద్ధి కథనం ప్రారంభంలోనే, భారత్‌ ఇప్పుడు మహిళా అభివృద్ధి నుంచి మహిళల నేతృత్వంలో అభివృద్ధి దిశగా పరివర్తన చెందుతోందని మోదీ నొక్కి చెప్పారు.

ఇందుకు అనుగుణంగా, భారతీయ మహిళల సామర్ధ్యాన్ని గుర్తించేందుకు, వారిని సాధికారం చేసి, దేశవృద్ధి కథనానికి దోహదం చేసేందుకు వేదికను అందించేందుకు బహుళ రంగ పథకాలను ప్రభుత్వం అమలు చేసింది.

వంట చేసేందుకు ఇబ్బంది కలిగించే కట్టెలు, ఇతర ఇంధనాలను ఉపయోగించడం గ్రామీణ మహిళలకు ఊరట కలిగించేందుకు అమలు చేసిన మరొక ప్రతిష్ఠాత్మక పథకమైన ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన మరొక మైలురాయి. మార్చి 1వ తేదీ నాటికి దేశంలో 9.59 కోట్ల ఉజ్వల లబ్ధిదారులున్నారు.  రానున్న మూడేళ్లలో విడుదల చేసేందుకు మోదీ ప్రభుత్వం సెప్టెంబర్‌ 2023లో 75 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్లను ఆమోదించింది. ‘స్వచ్ఛంగా వండటం ద్వారా మహిళల జీవితం సులభతరం’ వారిని ‘చాకిరీ నుంచి ఆరోగ్యపరమైన సంక్షోభాల నుంచి విముక్తం చేయడం’ అన్నవి ఈ పథకానికి సంబంధించి మోదీ ప్రభుత్వ ట్యాగ్‌లైన్‌లు.

2017లో మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పిఎంఎంవివై)ను గర్భిణులకు, పాలిచ్చేతల్లుల పౌష్టికాహార అవసరాలను తీర్చేందుకు, ఈ ప్రక్రియలో వారు నష్టపోయిన వేతనానికి పాక్షికంగా నష్టపరిహారాలన్ని చెల్లించేందుకు ప్రారంభించింది.

ఆడపిల్లల విద్యను సులభతరం చేసేందుకు బేటీ బచావో బేటీ పఢావోలో భాగంగా ప్రారంభించిన సుకన్య సమృద్ధి యోజన మూడు కోట్లమందికి పైగా ఆకాంక్షిత యువతులకు అందుబాటులోకి వచ్చింది.

మహిళలను ఆర్ధికంగా సమ్మిళితం చేయడం అన్నది కీలకాంశంగా పరిగణించారు. ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన ఇందులో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 18 కోట్లమంది మహిళలు మొదటిసారిగా అధికారిక బ్యాంకింగ్‌ సహా వివిధ ఆర్ధిక సేవలను పొందు తున్నారు. ఆగస్టు 9, 2023 నాటికి మొత్తం జన్‌ధన్‌ ఖాతాల సంఖ్య 50 కోట్లు దాటింది. ఈ ఖాతాల్లో 56శాతం ఖాతాలు మహిళలకు చెందినవి కాగా, 67శాతం ఖాతాలు గ్రామీణ/ సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో తెరవడం జరిగింది.

భారత ప్రభుత్వ చొరవ అయిన ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన కింద, నైపుణ్యాల గుర్తింపు, ప్రామాణీకరణ కోసం 2016 నుంచి 2020 మధ్య శిక్షణ పొందిన 73 లక్షల అభ్యర్ధులలో 40 శాతం మంది మహిళలు.

మెటర్నిటీ బెనిఫిట్‌ (సవరణ) బిల్లు, 2017 కింద గరిష్ట ప్రసూతి సెలవుల వ్యవధిని గతంలోని 12 వారాల నుంచి 26 వారాలకు పెంచారు, ఇది వేతన సెలవు. అదనంగా, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్‌, 2020 కింద అన్ని రకాల పనులను ఆవరించే అన్ని సంస్థల్లో మహిళలకు ఉపాధి కల్పించాలని భావిస్తున్నారు.

ఇక జలజీవన్‌ మిషన్‌ కింద 13 కోట్ల కుళాయి కనెక్షన్లను అందించి, ప్రత్యక్షంగా మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపడేలా ప్రభావితం చేసింది.

స్టాండ్‌ అప్‌ ఇండియా పథకం మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాలను, మద్దతును అందించడంతో పాటుగా వ్యాపారాలను స్థాపించి, ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించేందుకు వారిని ప్రోత్సహిస్తుంది.

ప్రధాన్‌ మంత్రి ముద్రా యోజన మహిళా సూక్ష్మ వ్యాపారవేత్తలకు రుణాలను సులభంగా అందుబాటు లోకి వచ్చేలా చేయడం ద్వారా వారు తమ వ్యాపారాలను ప్రారంభించేందుకు, అభివృద్ధి చేసేందుకు వీలు కల్పిస్తుంది.

వివిధ ప్రభుత్వ పథకాలు, చొరవల గురించి సమాచారాన్ని, మద్దతును మహిళలకు అందించేందుకు ఒకే చోట అన్నీ లభ్యమయ్యేలా ప్రారంభించిన కేంద్రాలు ప్రధానమంత్రి మహిళా శక్తి కేంద్రాలు.

ఏ విపత్తులోనైనా కుటుంబ సంరక్షకులుగా బాధ్యత వహించే మహిళలు ఎక్కువగా బాధపడతారు. కొవిడ్‌ మహమ్మారి సమయంలో కూడా ఇదే జరిగింది. ఈ మహమ్మారి వారి పని స్థాయిని కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. గణాంకాల ప్రకారం ` ఉద్యోగం కోల్పోయిన 7 శాతం పురుషులతో పోలిస్తే 47శాతం మంది మహిళలు తమ ఉపాధిని శాశ్వతంగా కోల్పోయి, 2020 చివరినాటికి కార్మికశక్తిలోకి తిరిగి రాలేదు.

లింగపరంగా మహమ్మారి చూపిన ప్రభావాన్ని తగ్గించేందుకు, ప్రధానమంత్రి జనధన యోజన ఖాతాలను కలిగి ఉన్న మహిళల కోసం ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ యోజన కింద మోదీ ప్రభుత్వం అతిపెద్ద నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏప్రిల్‌ 19, 2020 నాటికే, లాక్‌డౌన్‌ సమయంలో రూ. 36,659 కోట్లకు పైగా ధనాన్ని 16.01 కోట్ల మంది లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలలోకి డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్సఫర్‌ను ఉపయోగించడం ద్వారా బదిలీ చేయడం జరిగింది.

 కొవిడ్‌-19 మహమ్మారి సమయంలో ప్రజలకు సహాయం చేయడంలో భారతదేశపు డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్రోగ్రామ్‌ పోషించిన పాత్రను ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడు డేవిడ్‌ మాల్పాస్‌ ప్రశంసించారు. ‘‘డిజిటల్‌ నగదు బదిలీల సహాయంతో, భారతదేశం 85 శాతం గ్రామీణ కుటుంబాలకు, 69 శాతం పట్టణ కుటుంబాలకు ఆహారం లేదా నగదు సహాయాన్ని అందించగలిగింది’ అని మాల్పాస్‌ చెప్పారు, విస్తృత రాయితీలకు బదులుగా భారత దేశంలా లక్ష్యిత నగదు బదిలీని అనుసరించాలని ఇతర దేశాలను కోరింది.

కొవిడ్‌ మహమ్మారి సమయంలో దాదాపు 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ అందించడానికి మోడీ ప్రభుత్వం 2020లో ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజనను కూడా ప్రారంభించింది. డిసెంబర్‌ 2028వరకు అంటే మరో ఐదేళ్లపాటు ఈ పథకాన్ని కొనసాగించాలని కేంద్రం నవంబర్‌ 2023లో, నిర్ణయించింది. కుటుంబ సంరక్షకులగా, మహిళలు ఈ పథకం సహజ లబ్ధిదారులు.

మహిళలపై ప్రధానంగా దృష్టి సారించిన మరొక ప్రతిష్ఠాత్మక పథకం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన.‘లింగ సమానత్వాన్ని పెంపొందించడానికి, నారీ శక్తిని గౌరవించే ప్రయత్నంలో, ప్రధాని మోడీ ప్రభుత్వం మహిళలకు సాధికారత, సంతృప్తికరమైన జీవితాలను అందించడానికి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలను చేపట్టింది’’ అంటూ నరేంద్రమోదీ. ఇన్‌ అన్న వెబ్‌సైట్‌ ఈ పథకాన్ని పరిచయం చేస్తుంది.

పిఎంఎవై (ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన) ముఖ్య లక్షణాలలో ఒకటి మహిళలకు ఇళ్ల ఉమ్మడి యాజమాన్యాన్ని కల్పించడం. ఈ యోజన కింద 4 కోట్లకు పైగా గృహాలు మంజూరు చేయగా, ఇందులో 70శాతం మహిళా లబ్ధిదారుల స్వంతం, వీరిని ప్రధానమంత్రి ‘లఖ్‌పతి దీదీ’లుగా అభివర్ణిస్తుంటారు.

 ఏళ్ల తరబడి అటకెక్కించి, రాజకీయంగా తమ వైఖరిని ప్రదర్శించేందుకు ఒక పరికరంగా ఉపయోగించుకున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లును గత ఏడాది పార్లమెంటు సమవేశాలలో మోదీ ప్రభుత్వం 2.0 ఆమోదింపచేసింది. రెండు సభలు ఈ బిల్లును ఆమోదించాయి.

మోదీ ప్రభుత్వం చేపట్టిన ఈ మహిళా సంక్షేమ చర్యల జాబితా ఏ విధంగానూ సమగ్రమైనది కాదు. భారతీయ మహిళలకు సానుకూల పాలన అందించిన అనేక ఇతర చట్టాలు, విధానాలు కూడా ఉన్నాయి. ప్రధాని మోదీ, ఇతర ఎన్డీయే నాయకుల సభల్లో కూడా భారీ సంఖ్యలో మహిళలు పాల్గొనడం గమనించినప్పుడు వారి మనస్సుపై ఆ పథకాల ప్రభావాన్ని అంచనా వేయవచ్చు.

నరేంద్ర మోడీ పాలనా విధానంలో మహిళా సాధికారత, లింగ సమానత్వానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇది ఆయన గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అమలు చేశారు. 2002లో సిఎంగా బాధ్యతలు స్వీకరించిన మూడు నెలలకే, ఆయన ప్రభుత్వం ‘నారీ గౌరవ్‌ నీతి’ని రూపొందిం చింది (ఇది రాష్ట్రంలో ఇప్పటి వరకు కొనసాగుతోంది.). లింగ సమానత్వాన్ని ప్రోత్స హించడానికి, మహిళా సంక్షేమ ప్రాధాన్యాన్ని ప్రభుత్వ శాఖలకు తెలియజేయడానికి ఒక సమగ్ర విధానాన్ని రూపొందించింది.

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలే ఇందుకు నిదర్శనం. అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వం పథకాలు, వాగ్దానాలతో మహిళా ఓటర్లను తనవైపు తిప్పుకోవడానికి తన వంతు ప్రయత్నం చేసింది, అయితే రాష్ట్రంలోని పురుషుల కంటే మహిళా ఓటింగ్‌ శాతం ఎక్కువగా నమోదైన 88 స్థానాలలో 50 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ కేవలం 30, ఇతర స్వతంత్ర అభ్యర్థులు, చిన్న పార్టీలు ఎనిమిది స్థానాలు గెలుచుకున్నాయి. ఇటీవల జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికలలో మహిళలను, ఓటర్లను ప్రలోభపెట్టడంపై ప్రస్తుతం అన్ని పార్టీలు ఏకగ్రీవంగా దృష్టి సారించాయి. అంతిమంగా, రాజకీయ స్పెక్ట్రం వ్యాప్తంగా మహిళల ప్రాముఖ్యత ఏమిటో నాయకు లకు అర్థమైంది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలలో స్త్రీ ఓట్లే కీలకం కాగలవనడం అతిశయోక్తి ఎంత మాత్రం కాదు.

‘ఆర్గనైజర్‌’ నుంచి

About Author

By editor

Twitter
YOUTUBE