విదేశీ పాలనలో భారత్‌కు వందలాది గాయాలు తగిలాయి. వాటిలో ఏడున్నర దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ మానని గాయాలు ఉన్నాయి. అందులో ఒకటి కశ్మీర్‌ ‌సమస్య. భారత పరిభాషలో పాకిస్తాన్‌ ఆ‌క్రమిత జమ్ముకశ్మీర్‌. ‌పాకిస్తాన్‌, ఐక్యరాజ్య సమితిల దృష్టిలో పాకిస్తాన్‌ ‌పాలనలోని లేదా అధీనంలోని కశ్మీర్‌. ‌నిజానికి పాత జమ్ముకశ్మీర్‌ ‌సంస్థానం పాకిస్తాన్‌తో పాటు, చైనా ఆక్రమణలో కూడా ఉంది. తమకు పాకిస్తాన్‌ ‌నుంచి విముక్తి కావాలని కోరుతున్నారు ఆక్రమిత కశ్మీర్‌ ‌ప్రజలు. వనరులు మావి, ఫలితం పంజాబ్‌దా అని ప్రశ్నిస్తున్నారు ఇక్కడి ఉద్యమకారులు. పస్తులతో మాడి చావడం కంటే, ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకడం కంటే పోరాటమే మేలని ఆయుధాలు ఎత్తారు. దశాబ్దాలుగా నడుస్తున్న ఈ సాయుధ సమరంలో భారతదేశంలో కలవాలన్న కోణం కూడా కనిపించడం ప్రత్యేక పరిణామం. జమ్ముకశ్మీర్‌లో ప్రజాపోరాటానికి మద్దతిస్తామంటూ ఉగ్రవాదాన్ని ఎగదోసిన పాకిస్తాన్‌, ‌తన గడ్డ మీద జరుగుతున్న వేర్పాటువాద పోరాటంతో దాదాపు మరో దేశ విభజన అంచుకు వచ్చింది. అదే సమయంలో భారత్‌ ‌సాధారణ ఎన్నికలలో ఆక్రమిత కశ్మీర్‌ అనూహ్యంగా ఒక అంశమైపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌, ‌హోంమంత్రి అమిత్‌ ‌షా కూడా పీఓకే మనదే, సాధించి తీరతాం అని పేర్కొనడం విశేషం. జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్‌, ‌హిమంత బిశ్వశర్మ అంతా అదే చెప్పారు. ఏమైనా సమీప భవిష్యత్తులోనే పీఓకేలో జరిగే పరిణామం ప్రపంచ వార్త కానున్నదే అనిపిస్తుంది. మోదీ అయితే ఒక ఇంటర్వ్యూలో పాకిస్తాన్‌ అప్పగిస్తుందని కూడా అనేశారు. ఈ పరిణామాల ఫలితమే ఆజాదీ కశ్మీర్‌ ‌సమస్య ముందెన్నడూ లేని విధంగా ప్రపంచం ముందు చర్చనీయాంశంగా నిలిచింది.

‘ఛీన్‌ ‌కె లేంగే ఆజాదీ’ (స్వేచ్ఛను పోరాడి తీసుకుంటాం) వంటి నినాదాలతో పాకిస్తాన్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ‌దద్దరిల్లి పోతోంది. ‘ఆజాద్‌ ‌కశ్మీర్‌’ అం‌టూ పాకిస్తాన్‌ ‌పేరు పెట్టిన ఈ ప్రాంతం నేడు తమ స్వాతంత్య్రం కోసం రగిలిపోతోంది. తమను భారత్‌లో కలపాలని లేదా స్వతంత్రం అయినా ఇవ్వాలని పాక్‌ ఆ‌క్రమిత ప్రాంతవాసులు నినదిస్తు న్నారు. ఏడున్నర దశాబ్దాల క్రితం తమ ప్రాంతాన్ని కలుపుకుంటే కలుపుకున్నారు, తమకు కనీస వసతులు కానీ, వనరులలో వాటా కానీ ఇవ్వకుండా దోచుకుతింటున్న పాకిస్తాన్‌ ఆగడాలను ఇక సహించలేమని వారు ఆగ్రహిస్తున్నారు. పాకిస్తాన్‌కు జలాశయంగా పేరొందిన గిల్గిట్‌ ‌బాల్టిస్తాన్‌ ‌ప్రాంతం, పీఓకే ప్రాంతం నుంచి ఝీలం ఉపనదులు పారు తున్నా, జల విద్యుత్‌ ‌ప్రాజెక్టులు తమ ప్రాంతాలలోనే ఉన్నా అటు గుక్కెడు నీరు కానీ ఇటు ఒక్క యూనిట్‌ ‌విద్యుత్తు కానీ సరసమైన ధరకు లభించకపోవడం వారిని తీవ్ర అసంతృప్తికిలోను చేస్తోంది. దేశం మొత్తానికీ విద్యుత్తు సరఫరా చేస్తున్నా వారికి లభిస్తున్న విద్యుత్‌ ‌సరఫరా రెండు గంటలు మాత్రమే. ఇందుకు తోడుగా, దశాబ్దాల తరబడి పాక్‌ ‌సైన్యం వారిపై చేస్తున్న దౌర్జన్యాలు దోపిడీ. మరోవైపు, అడ్డగోలుగా తమ భూభాగాలను తమ అనుమతి లేకుండా చైనాకు అప్పగించడం వారిలో అభద్రతను కలిగిస్తోంది. పక్కనే ఉన్న భారత్‌లోని జమ్ముకశ్మీర్‌ ‌ప్రాంతం ఆర్టికల్‌ 370 ‌రద్దు తర్వాత విద్యుదీకరణతో ధగధగలాడటం, జరుగుతున్న అభివృద్ధి, పెట్టుబడులు పెరగడంతో అక్కడి ప్రజల జీవన విధానంలో మార్పులతో తమ జీవితాలను పోల్చుకుంటున్న వారికి తమ దుస్థితి తేటతెల్లమవుతోంది. అందుకే, తమ అస్తిత్వాన్ని, తమ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు ఈ నిరసనలు, పోరాటాలు.

 ఈసారి నిరసనలలో ప్రజలు తమ ఆంతర్యాన్ని తేటతెల్లం చేశారు. నియంత్రణ రేఖకు వెళ్లే మార్గంలో ఒక పోలీసు స్టేషన్‌పైన, మేజిస్ట్రేట్‌ ‌కార్యాలయంపైనా భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. వారి వద్ద ఆయుధాలు లేవు. అయితే ఈ నిరసనలు చూసిన అనేకమంది విశ్లేషకులు నియంత్రణ రేఖ వ్యాప్తంగా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగబో తోందంటూ చెబుతున్నారు. కానీ అది సాధ్యమైనా భారత్‌కు ఉపయోగం ఎంతన్నది ప్రశ్నార్ధకమే. ఎందుకంటే, ఆజాద్‌ ‌కశ్మీర్‌లో ప్రస్తుతం నివసిస్తున్న నాభా నిష్పత్తిని, మత సమీకరణలను పాక్‌ ‌మార్చి వేసింది. ఐదేళ్ల కింద కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసినప్పుడు, స్వాతంత్య్రానికి అనుకూలంగా ఉన్న అక్కడి ప్రజలు అనధికారిక సరిహద్దును దాటే యత్నం చేశారు. ఈసారి నేరుగా పంజాబీల ఆధిపత్యంలో గల ప్రభుత్వంతో తలపడుతున్నారు.

అసలే అంతంత మాత్రంగా ఉన్న వారి జీవితాలు పాకిస్తాన్‌ ఆర్ధిక సంక్షోభం కారణంగా మరింత అతలాకుతలం అవుతుండడంతో వారు పోలీసులు, సైనికులపై కూడా తిరగబడుతున్నారు. అటు గిల్గిట్‌ ‌బాల్టిస్తాన్‌లోనూ, ఇటు ముజాఫరాబాద్‌, ‌మీర్‌పూర్‌ ‌ప్రాంతంలోనే ప్రజల అసహనం తారస్థాయికి చేరుకున్న తర్వాత పాక్‌ ‌ప్రభుత్వం దిగి వచ్చి సబ్సిడీపై గోధుమలు ఇచ్చేందుకు, వారి ప్రాంతంలో ఉత్పత్తి చేస్తున్న విద్యుత్తును వారికి చవకగా ఇచ్చేందుకు అంగీకరించి, ఆ మేరకు ప్రకటన చేసింది. ప్రకటన వెలువడిన వెంటనే సైన్యం మీర్‌పూర్‌, ‌ముజాఫరాబాద్‌ ‌ప్రాంతాలకు తరలి రావడం, అక్కడే ఉన్న సాధారణ పౌరులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో పలువురు మరణించడమే కాదు వందలాది మంది గాయ పడడంతో స్థానికులు తిరుగుబాటు చేస్తున్నారు. పాక్‌ ‌సైన్యం వ్యూహాత్మకంగా ఈ ప్రాంతంలో దళాలను దింపి, బంగారు గుడ్లు పెట్టే ఆ ప్రాంతాన్ని ఒక్కసారిగా కోయలేదు కానీ, దోచుకు తింటోంది. భారత్‌ అనే బూచిని చూపించి, నిన్నటి వరకూ ఆ ప్రాంతాల్లో తీవ్రవాద శిబిరాలను నడిపిన సైన్యాన్ని నేడు ప్రజలు లెక్క చేయడం లేదు. సామాన్యులకు భారత్‌లో ఏం జరుగుతోందో స్పష్టంగా, కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నది. దానితోనే ఈ ప్రాంతమంతా అట్టుడుకుతున్నది.

నిజానికి, ముజాఫరాబాద్‌, ‌మీర్‌పూర్‌లకన్నా నాలుగు నెలల ముందే గిల్గిట్‌ ‌బాల్టిస్తాన్‌ ‌ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటడమే కాదు, గోధుమలపై సబ్సిడీ తీసివేయడంతో వారు ఈ నిరసనలను ప్రారంభిం చారని పాకిస్తానీ పత్రికలు నాడు ప్రచురించాయి. కానీ, సరైన మౌలిక సదుపాయాలు కల్పించకుండా, తమ వనరులను వాడుకుంటూ తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడడం, తమ భూభాగాన్ని విచక్షణారహితంగా చైనాకు అప్పగిస్తుండడం ఈ నిరసనలకు అసలు కారణంగా తెలుస్తోంది. తమకు అంతర్గత స్వాతంత్య్రాన్ని ఇవ్వాలని, అక్కడి దైమర్‌ ‌బాషా ఆనకట్టుపై వచ్చే రాయల్టీలలో ఎనభై శాతం వాటా ఇవ్వాలన్న డిమాండ్లు గట్టిగా వినిపించాయి. పలు జిల్లాల ప్రజలు నిరసన ప్రదర్శనలతో ఆ ప్రాంతాన్ని స్తంభింపచేశారు. సాధారణ ప్రజలు తమంత తాముగా చేస్తున్న నిరసనలకు తోడు పీఓకేకు చెందిన రాజకీయ పార్టీ ఆవామీ యాక్షన్‌ ‌కమిటీ (ఏసీసీ•) నిరసనలకు పిలుపిచ్చింది. తమకు 2022వరకు ఇచ్చినట్టే సబ్సిడీతో గోధుమలు ఇవ్వాలని, ఆర్ధిక చట్టం 2022ను, అన్యాయంగా తమపై రుద్దుతున్న పలు పన్నులను రద్దు చేయడం, గిల్గిట్‌ ‌బాల్టిస్తాన్‌ ‌ప్రజలకు భూయాజమాన్య హక్కులను తిరిగి ఇవ్వడం సహా 15 డిమాండ్లను పాక్‌ ‌ప్రభుత్వం ముందు ఉంచారు.

మా వాటా మాకివ్వండి

పీఓకే ఆర్ధిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడ్డదే. అయితే, అక్కడి యువత ఎంతో కొంత చదువుకుని, యునైటెడ్‌ ‌కింగ్డమ్‌లోని బర్మింగ్‌హామ్‌, ‌లూటన్‌లో స్థిరపడి అక్కడి నుంచి తమవారికి పౌండ్లు పంపిస్తూ ఉంటారు. వీరిలో అధికులు మీర్‌పురీలే. 2022లో తలసరి ఆదాయం 1512 డాలర్లతో దాని జీడీపీ 6.6 బిలియన్ల డాలర్లు. అయినప్పటికీ, ఈ ప్రాంతంలోని 29 శాతం జనాభాను పౌష్టికాహార లేమి వెంటాడుతోంది. ఇక ఆహార అభద్రత అయితే 57.1 శాతం జనాభాను వెంటాడుతూ అందులో 25.9 శాతం ప్రజలను ఒక మాదిరిగానూ, 5.7 శాతాన్ని తీవ్రంగానూ పీడిస్తోంది. ఈ ప్రాంతంలో 7 శాతం గ్రామాలకు మాత్రమే విద్యుద్దీకరణ జరిగినప్పటికీ, రెండు గంటలకు మించి విద్యుత్తు రాదు. మీర్‌పూర్‌లో ఆమెరికా సాయంతో 1950ల్లో బ్రిటిష్‌వారు నిర్మించిన మంగళా డ్యాం రిజర్వాయర్‌ ‌గోడలను పెంచుతామంటూ 2004లో కొలతలు తీసుకున్నారే తప్ప పని చేయలేదు. ఇటీవలే దాని సామర్ధ్యాన్ని 7.39 మిలియన్ల అడుగులకు, 1150 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదనకు పెంచారు.

పేరుకు ఆజాద్‌ ‌కశ్మీర్‌ – ‌భూమిపై హక్కులు ఏవీ?

పీఓకే, గిల్గిట్‌ ‌బాల్టిస్తాన్‌ ‌ప్రాంతం సహజవనరుల గని. పాకిస్తాన్‌ ‌తన అవసరాలను గడుపుకునేందుకు ఇక్కడి ఖనిజాలు తవ్వుకుపోవడానికి బయిటవారికి ఇచ్చిన లీజుల పట్ల స్థానికులలో అసహనం పెరిగి పోతున్నది. అందుకు కారణం పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం వారి అభిప్రాయాలను కానీ, వారిని కానీ పరిగణన లోకి తీసుకోకుండా స్వేచ్ఛగా వాటిని బయటివారికి అప్పగించడమే. ముఖ్యంగా, తమదైన ప్రాంతంపై తమకు యాజమాన్య హక్కులు లేకపోవడం వారిని వేదనకు గురిచేస్తున్నది. లీజులకు ఇవ్వడం సరే, దాని ద్వారా వచ్చే సంపదను తమ విలాసాలకు ఉపయోగించుకోవడానికి తప్ప అందులో ఒక్క వంతు కూడా ఆ ప్రాంత అభివృద్ధికి ఉపయోగించకపోవడం సహజంగానే వారిలో ఆగ్రహాన్ని కలిగించింది. ఈ ప్రాంతాలలో కనీస విద్యా, వైద్య సౌకర్యాలను కూడా పాక్‌ ‌ప్రభుత్వం కల్పించలేదు. అక్కడ ఆనకట్టలు ఉన్నప్పటికీ, 22 గంటల విద్యుత్తు కోత ఉండడంతో, ఉత్పత్తి అవుతున్న విద్యుత్తులో 80శాతం రాయల్టీ తమకు ఇవ్వాలని పట్టుబట్టారు. దాదాపు ఏడున్నర దశాబ్దాల నుంచి ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవిస్తున్నవారు నేడు అందుకే గళం విప్పారు.

చైనాకు భూభాగాలు ధారాదత్తం

బ్రిటిష్‌ ‌పాలనలో నార్తర్న్ ఏరియాస్‌గా పేరొంది, 2009లో గిల్గిట్‌ – ‌బాల్టిసాన్‌గా పేరు మార్చిన ఈ ప్రాంతం దాదాపు 72,935చదరపు కిలో మీటర్లు ఉంటుంది. మహారాజా హరిసింగ్‌ ‌భారత్‌కు అప్పగించిన అసలు జమ్ము కశ్మీర్‌ ‌రాజ్య భూభాగం 2,22,236 చదరపు కిమీలు. అందులో నేడు భారత్‌ ‌వద్ద భౌతికంగా గల భూభాగం 1,06,566 చ.కిమీలే. నిజానికి 1962 భారత్‌- ‌చైనా యుద్ధా నంతరం, బ్రిటిష్‌ ‌వారు సరిహద్దులను సరిగ్గా గీయ లేదన్న సాకుతోను, సైనిక, అణు సాంకేతికతలను పొందడం కోసం 1963లో చైనాకు గిల్గిట్‌ ‌బల్టిస్తాన్‌లో షక్సగమ్‌ ‌లోయ భాగాన్ని అప్పగించేం దుకు పాకిస్తాన్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఇది అంతర్జాతీయ చట్టాల విరుద్ధం. ఒకవేళ కశ్మీర్‌కు వివాదం పరిష్కారం అయితే, అప్పుడు దీనిలో సవరణలు చేసి అంతిమ ఒప్పందాన్ని చేసుకు నేందుకు తిరిగి చర్చలు జరిపి చివరి నిర్ణయం తీసుకుందామంటూ చైనా హామీ ఇచ్చిందని పాక్‌ అం‌టుంది. ఈ రకంగా, ఈ ప్రాంతంలో చైనాను కూడా ప్రవేశపెట్టి పాకిస్తాన్‌ ‌పరిస్థితిని జటిలం చేసింది.

అప్పు బాధతో కుంగుతున్న పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం 2022లో కొంతమేరకైనా తన అప్పులను తీర్చుకు నేందుకు గిల్గిట్‌ ‌బాల్టిస్తాన్‌ ‌ప్రాంతాన్ని యాభై ఏళ్ల పాటు చైనా చేతిలో పెట్టాలని నిర్ణయించడంతో స్థానికుల నుంచి వ్యతిరేకత ఉవ్వెత్తున ఎగిసింది. వాస్తవానికి పాకిస్తాన్‌ ‌మొదటి రాజ్యాంగంలో ఈ ప్రాంతం పాక్‌ ‌భాగం కాదు. ఒకవేళ దీనిని అక్రమంగా చైనాకు కట్టబెడితే, ఆ దేశ దక్షిణాసియా విస్తరణకు ఎంతో తోడ్పడుతుంది. గతంలో పాక్‌ అప్పగించిన ప్రాంతాన్ని చైనా ఇప్పటికే ఉపయో గించుకుంటోంది. ఇక అదనపు ప్రాంతం దాని చేతిలో చిక్కితే దానిని నిలవరించడం కష్టమయ్యే పరిస్థితి ఉంది.

స్థానికుల ప్రాతినిధ్యం లేని ఉత్తర గిల్గిట్‌ ‌బాల్టిస్తాన్‌ ‌ప్రభుత్వం, చైనాలోని గాన్సూ ప్రావిన్సుతో 2023 డిసెంబర్‌ 9‌న ఆ ప్రాంత రైతులు ఎత్తైన పర్వతాలపై వివిధ పంటలు వేసుకోవడానికి వ్యవసాయం చేసేందుకు సాంకేతికతను, యంత్రా లను బదిలీ చేయడం అన్న సాకుతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. చైనీయులు ఎక్కడ అడుగుపెడితే అక్కడ, ‘ఒంటె గుడారం’ చందంగానే కథ ముగుస్తుందన్న విషయం ప్రపంచం మొత్తానికీ తెలుసు. వాస్తవానికి గోన్సు ప్రావిన్సు చైనా చేపడుతున్న బెల్ట్ అం‌డ్‌ ‌రోడ్‌ ఇనిషియేటివ్‌కు కేంద్రం కాగా, గిల్గిట్‌-‌బాల్టిస్తాన్‌ ‌సీపెక్‌కు ముఖద్వారం. ఈ రెండు ప్రాంతాల మధ్య కమ్యూనికేషన్‌ ‌పెంచాలన్న సాకుతో చైనా ప్రభుత్వం వారికి వ్యవసాయపరంగా సాయం చేస్తున్నట్టుగా నాటకాలు ఆడుతున్నది.

చైనాకు ఈ ప్రాంతం ఎందుకు ముఖ్యం?

కేవలం కారాకోరం హైవే నిర్మాణం కారణంగానే చైనాకు ఇది ప్రాధాన్యం కలిగిన ప్రదేశం కాదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. కష్గర్లుగా పిలిచే వీఘర్‌ ‌శరణార్థులు చైనా అణచివేతకు భయపడి గ్జిన్‌గ్జియాంగ్‌ ‌ప్రావిన్సు నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడు తున్నారు. అంతేకాదు, ఈ ప్రాంతం సియాచిన్‌ ‌గ్లేషియర్‌కు సమీపంగా ఉండటం, అఫ్ఘాన్‌ ‌తాలిబన్లు దీనిని తమ నూతన కేంద్రంగా చేసుకోవడం వంటి కారణాల వల్ల ఇది చైనా విధానకర్తలకు వ్యూహాత్మకంగా కీలకం చేసింది. మూడు ప్రధాన పర్వత శ్రేణులైన హిమాలయాలు, కరాకోరం, హిందూఖుష్‌ ఈ ‌ప్రాంతంలోనే కలుస్తాయి. ఇవి కలిసే ప్రాంతంలో చైనా మూడు భారీ ఆనకట్టలను నిర్మిస్తోంది. గిల్గిట్‌ ‌బాల్టిస్తాన్‌ ‌ప్రాంతంలో ప్రవహించే సింధు నది పాకిస్తాన్‌కు ప్రధాన నీటి మూలం. అయినప్పటికీ, పాకిస్తాన్‌ ‌నిర్లక్ష్యంగా చైనాకు అప్పగిస్తోంది.

ఇప్పటికే స్థిరపడ్డ చైనీయులు?

పాకిస్తాన్‌ అనధికారికంగా గిల్గిట్‌ ‌బాల్టిస్తాన్‌ ‌ప్రాంతాన్ని చైనాకు అప్పగించిందని విశ్లేషకులు చెబుతున్నారు. రైల్‌రోడ్‌ ‌ప్రాజెక్టు నిర్మాణం కోసం పలువురు పీఎల్‌ఏ (‌పీపుల్స్ ‌లిబరేషన్‌ ఆర్మీ) సైనికులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించారు. చైనాలోని సిన్‌చియాంగ్‌ ‌ప్రావిన్సు నుంచి పాకిస్తాన్‌ను అనుసంధానం చేసేందుకు నిర్మించిన కారాకోరం హైవేను పొడిగిస్తుండగా, మరికొందరు ఆనకట్టల నిర్మాణం, ఎక్స్‌ప్రెస్‌ ‌హైవే తదితర ప్రాజెక్టుల నిర్మాణంలో పాల్గొంటున్నారు. అంటే, స్థానికులకు దాదాపు ఎటువంటి ఉపాధి కల్పన లేదన్నమాటే. ఇందుకుతోడు పాకిస్తానీలను నిషేధించిన 22 ప్రదేశాలలో సొరంగాలు కూడా ఏర్పరుస్తున్నారనే వాదన వినిపిస్తున్నది. ఇరాన్‌ ‌నుంచి నేరుగా చైనాకు గ్యాస్‌ను తరలించేందుకు ఈ సొరంగాలు అవసరం అవుతాయి. కానీ, చైనాను నమ్మడానికి లేదు. వాటిని క్షిపణులను నిల్వ చేసే ప్రదేశంగా కూడా ఉపయో గించుకోవచ్చు. వచ్చిన కొత్తల్లో తాత్కాలిక టెంట్లు వేసుకొని ఉంటూ, పని పూర్తి కాగానే ఇంటికి తిరిగి వెళ్లిన పీఎల్‌ఏ ఇప్పుడు భారీ ఆవాసాలను నిర్మించుకోవడం వెనుక ఉన్న కారణాలు ఏమిటో అనూహ్యమైనవి కావు. ఈ ప్రాంతం తమదే అన్న భావనకు చైనా వచ్చిందనే అభిప్రాయం ఈ పరిణామాలను గమనించినప్పుడు కలుగక మానదు.

అడ్డగోలు విభజనలను వాడుకుంటున్న చైనా

బ్రిటిష్‌ ‌సామ్రాజ్యం రష్యా ఆ ప్రాంతం వరకూ విస్తరిస్తుందన్న భయంతో సన్నటి వఖాన్‌ ‌కారిడార్‌ ‌ద్వారా తజికిస్తాన్‌ ‌నుంచి ఈ ప్రాంతాన్ని వేరు చేసింది. అంటే మధ్య ఆసియా నుంచి జమ్ముకశ్మీర్‌ను విడగొట్టిందన్న మాట. కార్గిల్‌, ‌సియాచిన్‌ ‌మీదుగా కశ్మీర్‌ ‌నుంచి లద్దాక్‌ ‌వరకు వ్యాపించి ఉన్న గిల్గిట్‌ ‌బాల్టిస్తాన్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసుకు తింటూ అంతిమంగా లద్దాక్‌ను మింగివేయాలన్నది డ్రాగన్‌ ఆకాంక్ష. భారత్‌ ‌పట్ల జాతివైరం, ద్వేషం కలిగిన పాకిస్తాన్‌ ‌చైనా వేసే కుక్క బిస్కెట్లకు ఆశపడి ఆ ప్రాంతాన్ని వారి చేతిలో పెడుతోంది. ఈ రకంగా ఇద్దరూ కలిసి భారత్‌ను నిలువరించి, సింధు, ష్యోక్‌ ‌నదుల ప్రధాన గమనాన్ని నియంత్రించాలన్నది వారి ఆలోచన.

మరొకవైపు, లద్దాక్‌ ఉత్తర శ్రేణుల్లో భారతీయ ఉనికి చైనాకు గిట్టకపోవడానికి కారణం లేకపోలేదు. ఈ ప్రాంతం టిబెట్‌ ‌ప్రాంతాన్ని అశాంతితో ఉన్న గ్జిన్‌జియాంగ్‌ ‌ప్రావిన్సుతో హైవే 219 కలుపుతుంది. ఇక్కడ భారతీయుల ఉనికి పట్ల చైనా ఎగిరెగిరి పడటానికి కారణం ఇదే. అందుకే, భారతదేశం గిల్గిట్‌ ‌బాల్టిస్తాన్‌, ఆక్సాయ్‌చిన్‌లను లద్దాక్‌ ‌కేంద్రపాలిత ప్రాంతంగా మ్యాప్‌లో చూపినప్పుడు అభ్యంతర పెట్టింది.

కార్గిల్‌ ‌యుద్ధ సమయంలో పాకిస్తానీ సైన్యం గిల్గిట్‌ ‌బాల్టిస్తాన్‌ను తమ కార్య నిర్వహక క్షేత్రంగా చేసుకొని ప్రత్యక్షంగా ఉపయోగించడం అంతర్జాతీయ సూత్రాల ఉల్లంఘనే. ఈ నేపథ్యంలో ఒక్క విషయం మాత్రం వాస్తవం, ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను నిర్వహించడంలో విఫలం కావడమే కాదు, ఫార్సుగా ఎన్నికలు నిర్వహించి, చైనా చేతిలో తోలుబొమ్మలా మారిన ప్రభుత్వానికి ఈ ప్రాంతాన్ని హస్తగతం చేయడం అన్నది ఇటువంటి పరిణామాలకు దారి తీస్తుందన్నది ముందుగా ఊహించిన విషయమే. తమకు కీలకమైన ప్రదేశాలలో తమ జెండాలను పాతుకునే చైనా, పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ‌భారత్‌కు కీలక ప్రదేశమనే విషయం గ్రహించాల్సిన అవసరం ఉంది.

భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన వెంటనే కశ్మీర్‌ ‌సంస్థానంపైకి పాకిస్తాన్‌ ‌పంపిన గిరిజన, ఇతర దాడి మూకల ఆక్రమణ కార్యకలాపాలతో భీతిల్లిన హరిసింగ్‌ ‌భారత్‌లో విలీనమవుతున్నట్టు ఒప్పందంపై సంతకాలు చేసి, వారిని వెనక్కి పంపేందుకు సైనిక సహాయం కోరిన విషయం చరిత్ర. అనంతరం, ఐక్యరాజ్య సమితి 1949లో కాల్పుల విరమణకు ఆదేశం ఇవ్వడం, దానిని మన్నించేందుకు భారత్‌ ‌వైపు నుంచి ప్రస్తుత నియంత్రణ రేఖ వద్ద మన సైనికులు నిలిచిపోవడం జరిగాయి. పాక్‌ ఆ‌క్రమించు కున్న ప్రాంతం వివాదాస్పదమైంది. ఐరాస ఆదేశాల ప్రకారం జరిగితే, పాక్‌ ఆ‌క్రమిత ప్రాంతాలైన ముజఫరాబాద్‌, ‌గిల్గిట్‌బాల్టిస్తాన్‌‌లో కూడా మన సైనికులే ఉండాలి. కానీ, పాకిస్తాన్‌ అది జర గనివ్వలేదు. ఈ లోపలే షేక్‌ అబ్దుల్లా వంటి వేర్పాటువాదులు భారత ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేయకపోవడం వల్లనే భారత్‌లో ఉన్న కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 ‌రావడం, అక్కడ కల్లోల పరిస్థితులు దశాబ్దాలపాటు కొనసాగడం జరిగాయి. అతడి వ్యాఖ్యలు, వ్యవహారాల శైలి తలనొప్పిగా మారడంతో భారత ప్రభుత్వం అతడిని ఖైదు చేసింది. అయితే, అతడు నాటిన విత్తనాలు మాత్రం రకరకాల రూపాలలో భారత్‌లో మొలకెత్తాయి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టికల్‌ 370‌ని రద్దు చేయడంతో అక్కడి పరిస్థితులు బాగా మెరుగుపడడమే కాదు ప్రజాస్వామికంగా ఎన్నికలు కూడా జరిగాయి.

భారత అధీనంలో గల కశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న పీఓకే వాసులు తాము కోల్పోయినదేమిటోనే కాదు తమ హక్కులేమిటో కూడా తెలుసుకున్నారు. ప్రజల ఆగ్రహంలో ఊగిపోతున్న మాటా వాస్తవం, ఆ ఆవేశంలో తమను భారత్‌లో కలపాలని డిమాండ్‌ ‌చేయడమూ సత్యమే. భారత్‌ ‌తమ డిమాండ్ల పట్ల స్పందించడం లేదని ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న మాటా నిజమే. వాస్తవానికి, ఇప్పటికే సగం పాకిస్తాన్‌ ‌ప్రాంతాలు చైనా ధారాదత్తం కావడంతో పాక్‌ ‌కన్నా చైనాతో చర్చలు జరుపడమే మేలని భారత్‌ ‌భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక పీఓకే విషయానికి వస్తే, గతంలో తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీలలో ఇరువైపుల ప్రజల పరస్పర అంగీకారంతో, ఇష్టంతో ఇరుప్రాంతాల మధ్య కట్టిన గోడను కూల్చివేసి కలిసినట్టుగా కలిస్తే తప్ప ఆ ప్రాంతంలో ప్రశాంతత ఏర్పడే అవకాశాలు ఉండవు.

                                                                                         …………………………..

  • భారతదేశంలో అంతర్భాగమైన జమ్ముకశ్మీర్‌ ‌లోని దాదాపు 78,000 చదరపు మైళ్ల భూభాగాన్ని పాకిస్తాన్‌ ఆ‌క్రమించుకుంది.
  • ఇందులో 5,180 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనాకు అక్రమంగా లీజుకు ఇచ్చింది.
  • ఆక్రమిత కశ్మీర్‌ను పాకిస్తాన్‌ ఆజాద్‌ ‌కశ్మీర్‌, ‌గిల్గిత్‌-‌బాల్టిస్తాన్‌ అనే రెండు విభాగాలు చేసింది.
  • పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ను మిగిలిన జమ్ముకశ్మీర్‌ ‌భూభాగం నుంచి వేరే చేసేదే అధీనరేఖ.
  • ప్రస్తుతం పీఓకేలో జరుగుతున్న అలజడికి మూలాలు చాలా పాతవి. ఇంత తీవ్రం కావడం మాత్రం 2023 నుంచే. గోధుమకు, ఇతర ఆహార పంటలకు ఇచ్చే రాయితీ కత్తిరించడం, విద్యుత్‌ ‌చార్జీలు దారుణంగా పెంచడంతో అక్కడి ప్రజలు తిరుగుబాటు ఆరంభించారు. ఇదంతా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నుంచి రుణం తీసుకోవడానికి మార్గం సుగమం చేసుకోవ డానికే.
  • గడచిన 12 మాసాల నుంచి ఆందోళన ఆపు లేకుండా సాగుతూనే ఉంది. కొన్ని వారాలుగా అది మరింత తీవ్రమైంది.
  • ఈ మే 10వ తేదీన తలపెట్టిన ఆందోళనను నిరోధించడానికి ప్రభుత్వం జాయింట్‌ ఆవామీ యాక్షన్‌ ‌కమిటీ నాయకులను ముందు రోజు అరెస్టు చేసింది. దీనితో ఉద్యమం తీవ్రమైంది.
  • మే 11న రాజధాని ముజఫరాబాద్‌ ‌నుంచి నిరసనలు నిర్వహించాలని కూడా ఆవామీ యాక్షన్‌ ‌కమిటీ నిర్ణయించింది. పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం పంపిన పారా మిలటరీ దళాలకీ, ఉద్యమకారులకీ నడుమ మే 13, 14 తేదీలలో జరిగిన ఘర్షణలో ఒక పోలీస్‌ ‌సహా నలుగురు మరణించారు.
  • ఆఖరికి కంటితుడుపుగా పాకిస్తాన్‌ ‌ప్రధాని షెహబాజ్‌ ‌షరీఫ్‌ 83 ‌మిలియన్‌ ‌డాలర్ల విలువైన రాయితీలను పీఓకే కోసం ప్రకటించారు.

                                                                                               …………………..

అక్టోబర్‌ 26, 1947‌న కశ్మీర్‌ ‌సంస్థానా ధీశుడు రాజా హరిసింగ్‌ ‌భారత్‌తో చేసుకున్న విలీన ఒప్పందం నాటికి ఆ ప్రాంత వైశాల్యం 2,22,236 చదరపు కిలోమీటర్లు. విలీన ఒప్పందం ప్రకారం ఆ భూభాగం మొత్తం మనదే. ఆ ఒప్పందం గిరిజనుల పేరుతో పాకిస్తాన్‌ ‌సైన్యం కశ్మీర్‌ ‌మీద దాడికి దిగిన సమయంలో  జరిగింది. కానీ ఇప్పుడు భారత్‌ అధీనంలో మిగిలి ఉన్న భూభాగం 1,06,566 చదరపు కిలోమీటర్లు. పాకిస్తాన్‌ ఆ‌క్రమణలో ఉన్నది 72,935 చదరపు కిలోమీటర్లు. ఇందులోనే 5,180 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన సక్షగమ్‌ ‌లోయను 1963లో చైనాకు లీజ్‌కు ఇచ్చారు. ఇది పరోక్షంగా పాకిస్తాన్‌ ‌చైనాకు ఇచ్చిన కానుక. చైనా ఇచ్చిన సైనిక, అణు సాంకేతిక పరిజ్ఞానానికి కృతజ్ఞతగానే ఈ భూభాగాన్ని కట్టబెట్టింది. ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకం. కాగా అక్సాయ్‌చిన్‌, ‌సక్షగమ్‌లతో కలిపి చైనా చేతిలో ఉన్న కశ్మీర్‌ ‌భూభాగం 37,555 చదరపు కిలోమీటర్లు. అప్పుడప్పుడు ఆక్రమించిన భూభాగాలతో కలిపితే మొత్తం చైనా ఆక్రమిత కశ్మీర్‌ ‌వైశాల్యం 42,735 చదరపు కిలోమీటర్లు. ఇటీవల పెరిగిన ఉద్రిక్తతల మధ్య మరికొంత కశ్మీర్‌ ‌భూభాగాన్ని కూడా చైనాకు ‘లీజ్‌’‌కు ఇవ్వాలని పాకిస్తాన్‌ ఆలోచిస్తున్నట్టు అమెరికా, పాకిస్తాన్‌లోని ఒక వర్గం మీడియా ఫిబ్రవరి, 2012లో వెల్లడించాయి. గిల్గిత్‌-‌బాల్టిస్తాన్‌ (72,971 ‌చదరపు కిలోమీటర్లు) ప్రాంతాన్ని చైనాకు 50 ఏళ్లకు ఇవ్వాలని పాకిస్తాన్‌ ‌నిర్ణయించినట్టు ఆ మీడియా కథనాల సారాంశం. ఇవాళ మనకీ పాకిస్తాన్‌కీ మధ్య నియంత్రణ రేఖ, చైనాకీ మనకీ మధ్య వాస్తవ అధీన రేఖ ఉన్నాయి. పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌లో నీలమ్‌, ‌మీర్‌పూర్‌, ‌భీంబర్‌, ‌కోట్లి, ముజఫరాబాద్‌, ‌బాగ్‌, ‌రావల్‌కోట, సుధానోటి అనే ఎనిమిది జిల్లాలు ఉన్నాయి. పీఓకేని ఆజాద్‌ ‌కశ్మీర్‌, ‌గిల్గిత్‌-‌బాల్టిస్తాన్‌ అనే భాగాలుగా పరిగణిస్తారు. ఇక్కడి జనాభా (2020 ప్రకారం) 55 లక్షలు. ఆక్రమిత కశ్మీర్‌కు ప్రత్యేక ప్రభుత్వం ఉంది. పాలన ఉంది. సుప్రీంకోర్టు ఉంది. ఇదంతా బూటకం.  వాస్తవంగా పాలించేది పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం. లేదా సైన్యం.

ఆగస్ట్ 15,1947 ‌నాటికి వాస్తవంగా భారత్‌, ‌పాకిస్తాన్‌ల మధ్య విభజన జరగలేదు. మరొక రెండురోజుల తరువాతే భౌగోళికంగా విభజన జరిగింది. ఈ విభజన వ్యవహారం నడిపిన వాడు సెరిల్‌ ‌రాడ్‌క్లిఫ్‌. ‌రెండు దేశాల మధ్య విభజన రేఖను గీసే పనికి ఆయనకు ఇచ్చిన సమయం కేవలం ఐదు వారాలు. అతడు భారతదేశానికి, అది కూడా తొలిసారి వచ్చినదే జూలై 8, 1947న. రెండు విభజన సంఘాలు ఆయన కింద పనిచేశాయి. ఒకటి పంజాబ్‌ ‌విభజన సంఘం. రెండు బెంగాల్‌ ‌విభజన సంఘం. రెండు సంఘాలలోను ఇద్దరేసి ముస్లింలు, ఇద్దరేసి ముస్లిమేతరులు మాత్రమే ఉన్నారు. సరిహద్దుల రక్షణతో సంబంధం ఉండే సైన్యంతో గాని, సైన్యంలో పనిచేసిన వారిని గాని వీటిలో చోటు ఇవ్వలేదు. ఆగస్ట్ 17, 1947‌న విభజన నివేదిక ముఖాన కొట్టి, మరునాడే రాడ్‌క్లిఫ్‌ ఇం‌గ్లండ్‌ ‌వెళ్లిపోయాడు కూడా. ఫలితం దారుణమైనది. పదిలక్షల మంది చనిపోయారు. కోటీ 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 75 ఏళ్లు గడిచిపోయినా సమస్యకు పరిష్కారం లేకపోవడం ఫలశ్రుతి.

                                                                                                                   …………………..

కశ్మీర్‌ ‌వివాదాన్ని పట్టి చూపే సాకుతో దశాబ్దాలుగా పాకిస్తాన్‌ ‌తీవ్రవాద హింసను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో భారత పార్లమెంటు ఉభయ సభలు ఫిబ్రవరి 22, 1994న జమ్ము, కశ్మీర్‌ అన్నది భారత దేశంలో అంతర్గత భాగమని, పాక్‌ ‌తాను అక్రమించుకున్న ప్రాంతాలను ఖాళీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించాయి.

పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌లోనూ, పాక్‌లోనూ తీవ్రవాదులకు శిక్షణనిచ్చే శిబిరాల గురించి, నిధుల సరఫరా గురించి, అస్థిర పరిస్థితులను, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు విదేశీ కిరాయి హంతకులు, శిక్షణ పొందిన తీవ్రవాదులు భారత్‌లోని జమ్ముకశ్మీర్‌లో చొరబడేందుకు అందుతున్న తోడ్పాటు గురించి తెలుసని, పాక్‌లో శిక్షణ పొందిన తీవ్రవాదులు హత్యలు, దోపిడీలతో పాటు అక్కడి ప్రజలను బందీలుగా తీసుకువెళ్లి భయోత్పాత వాతావరణాన్ని సృష్టించడాన్ని , ఇక్కడ విధ్వంసక, తీవ్రవాద వాతావరణాన్ని సృష్టించడానికి పాక్‌ అం‌దిస్తున్న నిరంతర మద్దతును తీవ్రంగా ఖండిస్తున్నామని తీర్మానం పేర్కొంది. సిమ్లా ఒప్పందాన్ని, అంతర్జాతీయంగా ఆమోదించిన అంతర్‌ ‌రాష్ట్ర నియమాలను ఉల్లంఘిస్తూ ఈ ప్రాంతంలో తీవ్రవాదానికి మద్దతునివ్వడాన్ని పాకిస్తాన్‌ ‌తక్షణమే ఆపివేయాలని పిలుపిచ్చింది. పాక్‌ ‌వైఖరే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమని కూడా స్పష్టం చేసింది. పాక్‌ అ‌క్రమిత ప్రాంతాలలోని ప్రజల మానవ హక్కుల ఉల్లంఘన పట్ల, వారికి ప్రజాస్వామిక హక్కులు దక్కకపోవడం పట్ల ఆందోళనను, విచారాన్ని వ్యక్తం చేసింది. భారతదేశ రాజకీయ, ప్రజాస్వామిక వ్యవస్థలు, రాజ్యాంగం అందరు పౌరుల మానవ హక్కులను ప్రోత్సహించి, పరిరక్షించేందుకు హామీ ఇస్తున్నాయని స్పష్టం చేసింది. భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌ ‌చేస్తున్న అబద్ధపు, వ్యతిరేక ప్రచారం ఆమోదయోగ్యం కానిదని, శోచనీయమని తీర్మానం వ్యాఖ్యానించింది. భారతదేశ ప్రజల తరుఫున తాము-

ఎ) జమ్ముకశ్మీర్‌ ‌రాష్ట్రం ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగంగానే ఉందని, ఉంటుందని, దానిని దేశం నుంచి వేరు చేసేందుకు జరిగే సకల ప్రయత్నాలను అన్ని మార్గాల ద్వారా ప్రతిఘటిస్తామని తీర్మానం ఉద్ఘాటించింది.

బి) తమ దేశ ఐక్యత, సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతకు వ్యతిరేకంగా పన్నే అన్ని ఎత్తుగడలను దృఢంగా, కఠినంగా ఎదుర్కొనే సామర్ధ్యాన్ని భారత్‌ ‌కలిగి ఉందని, ఎదుర్కొంటుందని పేర్కొంటూ-

సి) పాకిస్తాన్‌ ‌దురాక్రమణ ద్వారా ఆక్రమించిన భారత రాష్ట్రమైన జమ్ము కశ్మీర్‌ను ఖాళీ చేయాలని డిమాండ్‌ ‌చేసింది.

డి) భారత దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకునేందుకు చేసే అన్ని ప్రయత్నాలను కఠినంగా తిప్పికొడతామని హెచ్చరిస్తూ ఈ తీర్మానాన్ని ఉభయ సభలూ ఏకగ్రీవంగా ఆమోదించాయి.

ఈ తీర్మానాన్ని ప్రధానిగా పి.వి. నరసింహారావు ఉన్న సమయంలో కాంగ్రెస్‌, ‌బీజేపీలు సహా నాడు

పార్లమెంటులో ఉన్న అన్ని పార్టీలూ ఆమోదించడం గమనార్హం.

-డి.అరుణ

About Author

By editor

Twitter
YOUTUBE