‘‌వాసా’ పురస్కార ప్రదానం సందర్భంగా‌

ప్రముఖ రచయిత, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ విశ్రాంత ఆచార్యులు డాక్టర్‌ ‌ముదిగొండ శివప్రసాద్‌ ‌సహస్ర చంద్రోదయ దర్శనాన్ని పురస్కరించుకొని హైదరాబాదులోని సాంస్కృతిక సంస్థ కిన్నెర ఆర్టస్ ‌థియేటర్‌ ‌జూన్‌ 6‌వ తేదీన డాక్టర్‌ ‌వాసా ప్రభావతి స్మారక జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేస్తుంది. ఆ సందర్భంగా ఆయన జీవితం, సాహితీ ప్రస్థానంపై ‘జాగృతి’ ప్రత్యేక వ్యాసం.

ప్రకాశం జిల్లాలోని సముద్రతీర గ్రామం ఆకులు అల్లూరు గ్రామంలో డిసెంబర్‌ 23, 1940‌లో మాతామహుల ఇంట ముదిగొండ శివప్రసాద్‌ ‌జన్మించారు. వారి పితామహుల స్వస్థలం గుంటూరు జిల్లా తాడికొండ. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడే జరిగింది. ఒంగోలు, విశాఖ, హైదరాబాదులలో ఉన్నత విద్య అభ్యసించాను. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ‘ఆధునికాంధ్ర కవిత్వంపై వివిధ ఉద్యమాల ప్రభావం’ అనే అంశంపై పీహెచ్‌డీ పట్టభద్రులై అక్కడి తెలుగు శాఖలో మూడు దశాబ్దాలకు పైగా సేవలు అందించారు. ఆ తర్వాత సీనియర్‌ ‌ఫెలోషిప్‌ ‌సిద్ధాంత గ్రంథం ‘‘కాకతీయ కళాదర్శనం’’ ప్రచురించారు. ఆయన పర్యవేక్షణలో 30 మంది పరిశోధకులు డాక్టరేట్‌ ‌పట్టాలు పొందారు. ఆయన రచనలపై వివిధ విశ్వవిద్యాలయాలల్లో డాక్టరేట్లు పొందారు.

అధ్యాపకత్వంతో పాటు రచన ఆయన ప్రధాన వ్యాసంగం.రచనా వ్యాసంగానికి 1960లో శ్రీకారం చుట్టిన తనపై సనాతన ధర్మ సభ నాయకుడు. నవలారచయిత, పత్రికా సంపాదకుడైన తండ్రిగారు ముదిగొండ మల్లికార్జునరావు ,కె.ఎం.మున్నీ (‘జై సోమనాథ్‌’ ‌చారిత్రక నవల రచయిత) విశ్వనాథ, నోరి నరసింహ శాస్రి, బాపిరాజు ప్రభావం ఉందని, వారి రచనలు చదివి రచనా శిల్పం నేర్చుకున్నానని చెబుతారు. ‘పండిత దీనదయాళ్‌ ఉపాధ్యాయ ప్రభావం నాపై ప్రత్యక్షంగా ఉంది. రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ సర్‌ ‌సంఘచాలక్‌, ‌పరమపూజనీయ గురూజీ  ప్రసంగాలు నన్ను ఉత్తేజితం చేశాయి. వివేకానంద రచనలు విరివిగా చదివాను. కర్ణాటక ధర్మగురువు బసవన్నను బాగా అధ్యయనం చేశాను’ అని వివరించారు. తెలుగుతో పాటు సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు, గ్రీకు భాషల్లో మంచి ప్రవేశం గల ఆయన రచనలు వివిధ పత్రికలలో సుమారు పాతిక వేల పుటల వ్యాసాలు ప్రచురితమయ్యాయి. 150కి పైగా గ్రంథాలు అచ్చయ్యాయి. శాతవాహనులు, కాకతీయులు, విజయనగర రాజులు ముసునూరి నాయక రాజులు… ఇలా వరుసగా చారిత్రక నవలలు రాయడం వల్ల ‘చారిత్రక నవలా చక్రవర్తి’గా పేరు పొందారు.14వ శతాబ్దానికి చెందిన కాపయ, ప్రోలయ నాయకులు ఢిల్లీ సుల్తాన్‌ను జయించి నేటి తెలంగాణ సీమాంధ్రులను విముక్తులను చేయడంపై ఇటీవల వెలువరించిన వీరగాథ ‘మహోదయం’ విశేష ఆదరణ పొందింది.

చరిత్ర తెలియనివాడు చరిత్రహీనుడవుతాడని ఆచార్య ముదిగొండ అభిప్రాయం. ఆంగ్లేయులు, సూడో సెక్యులరిస్టుల కారణంగా భారతదేశ చరిత్ర వక్రీకృతమైందని అంటారు. విద్యార్థులకు, గృహిణులకు చరిత్రపై ఆసక్తి కలిగించి, ప్రాచీన భారతీయ వైభవం తెలియజేయడానికి చారిత్రక నవల, చారిత్రక కథ మంచి పక్రియలంటారు. అయితే ఈ తరహా రచనలకు చదివించే గుణం ఉండాలని, అందుకు మల్లంపల్లి సోమశేఖర శర్మ, నేలటూరి వెంకట రమణయ్య, కోట వెంకటాచలం వంటి ప్రామాణిక పరిశోధకులను, వారి రచనలను ఆదర్శంగా తీసుకోవాలని చెబుతారు. తెలుగు వారికి ఐతరేయ బ్రాహ్మణ కాలం నుంచి గల సుసంపన్న మైన చరిత్రపై గొప్ప నవలలు రాయవచ్చంటారు. యద్ధనపూడి సులోచనారాణి రచనలు విశేష జనాదరణ పొందుతున్న కాలంలో ఆయన సామాన్య పాఠకులతో కూడా చారిత్రక నవలలు చదివించారు.

ఆచార్య ముదిగొండ, ఏకాత్మమానవ దర్శన్‌పై ప్రత్యేక పరిశోధన చేశారు. హిందీలోని దత్తోపంత్‌ ‌ఠెంగ్డే గ్రంథాన్ని, కన్నడం నుంచి బసవన్న వచన సాహిత్యం, ప్రాకృతంలోని ‘గాథాసప్తశతి’ తెలుగులోకి అనువదించాను. 350 కథలు కలిగిన సంస్కృతం లోని సోమదేవ సూరి రచన ‘కథాసరిత్సాగరం’ అనువదించారు. భారతీయ సంస్కృతిని ప్రచారం చేస్తూ వివిధ దేశాల్లో పర్యటించారు. ‘భువన విజయం’ సాహిత్య రూపకాన్ని 1100 సార్లు ప్రదర్శించారు. స్వర్ణ కంకణాలు, గండ పెండేరాలు, కనకాభిషేకాలు, సత్కారాలు అందుకున్నారు. అయినా పాఠకుల అభిమాన•మే ఏ రచయితకైనా, కవికైనా నిజమైన సత్కారమని ఆయన భావన. తన రచనలు చదివిన వారి పిల్లలకు పేర్లు పెట్టుకున్న వారెందరో ఉన్నారని చెబుతారు. మాంచెస్టర్‌ (‌బ్రిటన్‌)‌లోని ఒక తల్లి తన (ముదిగొండ) ‘శ్రీలేఖ’ నవల చదివి తన బిడ్డకు ఆ పేరు పెట్టుకొందని, అదే గొప్ప సత్కారమని అంటారు.

రచయితకు సామాజిక, రసస్పృహ అవసరమన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. మన కవులు ‘జగద్ధితం’ అనే పదాన్ని ఏనాడో వాడారంటారు. దేశంలో రానురాను మతమార్పిడులు పెచ్చు మీరతున్నాయన్న ఆందోళనతో మార్పిడులకు వ్యతిరేకంగా రచనలు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు కోనసీమలో 0.5 శాతం ఉన్న క్రైస్తవం, నేటికి 22 శాతానికి ఎలా చేరిందో విశ్లేషిస్తూ రచన చేశారు.లేని క్రీస్తు ఉన్నాడని అబద్ధం చెప్పి మతం మార్పిడులు చేస్తున్నారని. తాను శాస్త్రీయ ప్రమాణాలు చూపుతూ దానిని ప్రతిఘటించానని, అందుకే తనపై విమర్శలకు దిగారని స్పష్టం చేశారు. వారే కాదు, కమ్యూనిష్టు రచయితలూ బహిరంగంగా యుద్ధం ప్రకటించారని, అయినా ఏటికెదురీదుతూనే ధైర్యంగా ముందుకు సాగానని చెప్పారు ఆచార్యముదిగొండ.

భారతీయతను నిర్మూలించే సాహిత్యోద్యమాలు పుట్టుకొస్తున్న తరుణంలో (1952)లో మన్నవ గిరిధరరావు వంటివారు భారతీయ రచయితల సమితిని స్థాపించారు. దానికి కొనసాగింపుగా ఇరవై రెండేళ్ల తరువాత (1974లో) ఆచార్య బిరుదురాజు రామరాజు, భండారు సదాశివరావు, కొత్తపల్లి ఘనశ్యామల, ప్రసాదరాయ కులపతి వంటి వారితో కలసి భారతీయ సాహిత్య పరిషత్‌ ‌స్థాపించారు.

తెలుగు భాషాభిమానిగా దాని ఉనికిపై ఆందోళన వ్యక్తం చేశారు.  ‘అకర•మాల నుంచి చాలా అక్షరాలు జారిపోయాయి. ఇది స్వయంకృతాపరాధం. పాఠ్యాంశాల నుండి తెలుగు, సంస్కృతాలను తొలగించారు. విదేశాలకు పోయిన లక్షలాది తెలుగు వారి పిల్లలకు తెలుగు మాట్లాడటం రాదు. తమిళం, హిందీలకు ఈ దుర్గతి పట్టలేదు. తెలుగుపై ఇంత నిర్లక్ష్యం ఎందుకు?’ అన్నది ఆయన ప్రశ్న. భారతజాతి పతనానికి అనేక కారణాలని, అందులో స్వయం కృతపరాధా ఎక్కువన్నది ఆచార్య శివప్రసాద్‌ ‌వాదన. ‘వేదం పేరుతో అవైదిక వామాచారాలు వ్యాపించాయి. ప్రజలకు మోక్ష పురుషార్థం మీద వ్యామోహం పెరిగింది. ధర్మ గురువులు పర్యటనలు మానివేశారు. వేదరక్షణ కోసం పుట్టిన ఆర్యసమాజం సంస్థాగతంగా బలహీనపడింది. ప్రాచ్య కళాశాలలు, వేద పాఠశాలలు మూతపడ్డాయి. కొద్ది మంది వేదపండితులున్నా వారు కూడా వేదార్థం చెప్పడం లేదు.విద్య అంటే కంప్యూటర్‌, ‌మెడిసిన్‌ ‌మాత్రమేఅనేలా తయారైంది. ప్రస్తుత విద్యావ్యవస్థలో వ్యక్తి నిర్మాణానికి స్థానం లేదు. కనీసం దేశ చరిత్ర తెలుసుకొనే అవకాశం కూడా ఉండంలేదు’అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏడేళ్ల క్రితం కాలం చేసిన అర్థాంగి శ్రీమతి ఉమాదేవి మెమోరియల్‌ ‌ఛారిటబుల్‌ ‌ట్రస్ట్ ‌పేరిట ఆచార్య ముదిగొండ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కుమారుడు ఇందుశేఖర్‌ ‌రచయిత, సామాజిక క్రియాశీల కార్యకర్త. భాగ్యనగర్‌ ఇతిహాస సంకలన సమితి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. పెద్ద కుమార్తె సుష్మ రాష్ట్రీయ సేవికాసమితిలో పనిచేస్తున్నారు. చిన్న కుమార్తె శ్రీలేఖ నాట్యశాస్త్ర గ్రంథాలు రాశారు.

తన నిరంతర సాహితీ ప్రస్థానంలో ‘జాగృతి’ జాతీయ వార పత్రికతో గల సంబంధం అనిర్వచనీయమంటారు ముదిగొండ. పత్రిక వ్యవస్థాపక సంపాదకులు బుద్ధవరపు వెంకటరత్నం నుంచి ప్రస్తుత సంపాదకులు డాక్టర్‌ ‌గోపరాజు నారాయణరావు వరకు సంపాదకులందరితో పనిచేసే అవకాశం కలిగిందని చెబుతారు.

-‘జాగృతి’ డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE