వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

– కె.వి. సుమలత

‘‘అమ్మా! డ్రైవర్‌కి అన్నయ్య అడ్రస్‌ ఇచ్చాను. నీకు కూడా పేపర్‌ ‌మీద ప్రింట్‌ ‌తీసి ఇస్తున్నాను. నాలుగు గంటల ప్రయాణం ఉంటుంది. ఎక్కువగా ఆలోచించకుండా కళ్లు మూసుకొని పడుకో. అక్కడ ఎక్కువగా మాట్లాడకుండా వెళ్లిన పని చూసుకుని వచ్చేయి’’ అంది దివ్య.

‘‘నాలుగు సంవత్సరాల తరువాత వాడిని చూడబోతున్నాను. చదువు నిమిత్తం హాస్టల్‌లో ఉన్నా రోజూ ఫోన్లో మాట్లాడేదాన్ని. కానీ వాడి గొంతు విని కూడా నాలుగు సంవత్సరాలయింది’’ బాధగా అంది కరుణ.

‘‘డాడీ పడుకున్నారు… అన్నయ్య దగ్గరకు వెళ్తున్నానని ఇందాక చెప్పావు కదా! మళ్లీ ఇప్పుడు లేపకు. ఆయన లేచాక నేను చెప్తాను’’ అంది దివ్య.

అలాగే అంటూ తలూపి చిన్న బ్యాగ్‌ ‌తీసుకుని, కూతురికి జాగ్రత్తలు చెప్పి కారు ఎక్కింది కరుణ. సీటులో కూర్చొని కళ్లు మూసుకొని నాలుగేళ్ల క్రితం జరిగిన సంఘటనల వెనక్కు వెళ్లింది.

                                                                                                              * * *

‘‘కరుణ! తేజ! దివ్య! ఒక శుభవార్త… నా చిన్ననాటి స్నేహితుడు తన కూతురుతో కలిసాడు. అమ్మాయి కుందనపు బొమ్మలాగా ఉంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుంది. వాడి ఆస్తిపాస్థులకు ఏకైక వారసురాలు. పెద్దల పట్ల మర్యాద, సంప్రదాయం అన్నీ వాళ్ల నాన్నను పోలి ఉన్నాయి. అందుకే వాడికి నా కోడలిని చేసుకుంటానని మాట ఇచ్చేసాను’’ సంతోషంగా అన్నాడు రాఘవ.

‘‘మీరు మీ స్నేహితుడి కూతురు పెళ్లికి వెళ్లి కొడుక్కి సంబంధం ఖాయం చేసుకుని వచ్చారా? ఈ ఏడాదితో దివ్య చదువు పూర్తవుతుంది. ఆడపిల్ల పెళ్లవ కుండా మగపిల్ల వాడికి ఎలా చేస్తాం?’’ అంది కరుణ.

‘‘తేజ ఉద్యోగం చేస్తున్నాడు. జీవితంలో స్థిరపడ్డాడు. వాడి పెళ్లయ్యాక దివ్య పెళ్లి చేద్దాం. అప్పుడు కొడుకు,కోడలు మనకు అండగా ఉంటారు’’ అన్నాడు రాఘవ.

‘‘డాడీ! మీ మాట కాదంటున్నందుకు మన్నించండి. నేను నాతో పాటు చదువుకున్న సహజను ప్రేమించాను. తనకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. సహజ నా మీద ఒత్తిడి తెస్తోంది. నేనే మీతో ఈ విషయం చెప్పాలనుకుంటు న్నాను. నేను తననే పెళ్లి చేసుకుంటాను’’ అన్నాడు తేజ.

రాఘవకి తేజ అంటే పంచప్రాణాలు. తన మాటకు ఎదురు చెప్పని కొడుకు ఉన్నట్లుండి తిరస్కారంగా మాట్లాడేసరికి షాకయ్యాడు.

‘‘అమ్మాయి వివరాలు ఏంటి తేజ?’’ తేరుకున్నాక అడిగాడు.

‘‘వైజాగ్‌లో ఎంటెక్‌ ‌నాతో పాటు చదువుకుంది. వాళ్లు క్రిస్టియన్స్… ‌మన మతస్థులు కాదు’’ అన్నాడు తేజ.

‘‘నీ కసలు బుద్ధుందా? కులం మారితేనే ఆచార వ్యవహారాలు మారిపోతాయి. అలాంటిది మతం మారితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ ప్రేమ, దోమ అన్నీ కట్టిపెట్టు’’ అన్నాడు రాఘవ.

‘‘నో డాడీ! నేను సహజకి మాట ఇచ్చాను. మీరు ఇంకా పాత చింతకాయ పచ్చడి మాటలు చెప్పొద్దు.’’ కోపంగా అన్నాడు తేజ.

‘‘తేజా! మీనాన్నను ఎదిరించి మాట్లాడు తున్నావా?’’ కొడుక్కి నచ్చచెప్పే ప్రయత్నం చేసింది కరుణ.

‘‘ఈ విషయంలో నేను ఎవరి మాట వినను’’ మొండిగా అన్నాడు తేజ.

‘‘నువ్వు వేరే మతం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ చెల్లెలిని ఎవరూ పెళ్లి చేసుకోడానికి ముందుకు రారు. అందుకు నేనొప్పుకోను ‘‘ అన్నాడు రాఘవ.

‘‘మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నేను సహజనే చేసుకుంటాను. సహజకి పెళ్లి వయసు దాటిందని వాళ్లింట్లో గొడవ చేస్తున్నారు కాబట్టి నేను తొందరలో పెళ్లి చేసుకోక తప్పదు’’ మొండిగా అన్నాడు తేజ.

‘‘అలా నా మాట కాదంటే నువ్వు నా కళ్ల ముందు ఉండటానికి వీల్లేదు’’ కోపంగా అరిచాడు రాఘవ.

‘‘పాత కాలం బెదిరింపులు బెదిరిస్తే నేను నిజంగానే వెళ్లిపోతాను డాడీ’’ అన్నాడు తేజ.

‘‘బెదిరింపులు కాదు నేను నిజమే చెప్తున్నాను’’ అన్నాడు రాఘవ.

‘‘తేజా! ఆవేశంలో నీకు పెద్దా చిన్నా తెలియడం లేదు. నిదానంగా డాడీని ఒప్పించవచ్చు తొందర పడకు’’ అని నచ్చచెప్పింది కరుణ.

తేజ ససేమిరా వినకుండా ఇంట్లో నుండి బట్టలు సర్దుకుని వెళ్లిపోయాడు. తల్లి, చెల్లి కన్నీళ్లతో ప్రాధేయపడినా అతడి నిర్ణయాన్ని మార్చుకోలేదు. అలా గడప దాటిన తేజ మళ్లీ ఎప్పుడు కన్నవారిని చూడటానికి రాలేదు. కనీసం ఫోన్‌ ‌ద్వారా కూడా మాట్లాడలేదు.

రాఘవ రైల్వే డిపార్ట్మెంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. పరువు, ప్రతిష్టలకు ప్రాణమిస్తాడు. స్నేహితుడికి ఇచ్చిన మాట నిలబడకపోవడం, చెట్టంత ఎదిగిన కొడుకు తన మాటకు విలువివ్వ కుండా ఎదిరించి ఇల్లు వదిలి వెళ్లిపోవడాన్ని తట్టుకో లేకపోయాడు. అతడి మెదడు ఒత్తిడికి లోనయి మాటపోయింది. అపస్మారక దశలోనికి వెళ్లాడు. వాళ్ల దగ్గర ఉన్న డబ్బంతా అస్పత్రులు తిరగడానికే అయి పోయింది.

‘‘ఆయన ఏ విషయం వల్ల ఇలా ఒత్తిడికి గురయ్యారో ఆ విషయాలు ఆయన దృష్టికి రానివ్వకండి. ఆయనే గుర్తు చేస్తే మాట్లాడండి’’ కరుణతో చెప్పారు డాక్టర్‌ ‌గారు.

తేజ పెళ్లి చేసుకున్నాడని, బాబు పుట్ట్టాడని, వైజాగ్‌లో ఉంటున్నాడని విషయాలు మాత్రం కరుణకి తెలిసాయి.

రాఘవ ఉద్యోగం చేయలేకపోవడం వల్ల ప్రభుత్వానికి వివరించి అప్లికేషన్‌ ‌పెట్టింది దివ్య. అందుకు రైల్వే డిపార్ట్మెంట్‌ ‌వాళ్లు సహకరించారు. దివ్యకి క్లర్క్ ఉద్యోగం ఇచ్చారు. వారి కుటుంబానికి ఆమె ఉద్యోగమే ఆసరా అయింది.

రెండు నెలల క్రితం దివ్య ఆఫీస్‌లో పనిచేసే మనోజ్‌ ‌పెళ్లి ప్రపోజల్‌ ‌చేసాడు.

‘‘మా కుటుంబానికి నా జీతమే ఆధారం. పెళ్లి చేసుకుంటే పుట్టింటి బరువు మోయడానికి ఎవరూ ముందుకు రారు కాబట్టి నేను పెళ్లి చేసుకోను’’ అంది దివ్య.

‘‘కానీ కట్నం నాకు వద్దు. పెళ్లయ్యాక కూడా మీ వేతనం మీద నేను పెత్తనం చేయను. మీరు నా ఇంటికి ఇల్లాలయితే చాలు’’ అన్నాడు మనోజ్‌.

ఇపుడిపుడే కోలుకుంటున్న రాఘవ కూతురు పెళ్లికి అభ్యంతరం చెప్పలేదు.

తేజ ఫోటోలు ఆల్బమ్‌లో రాఘవ చూస్తుండటం కరుణ, దివ్య గమనించారు.

‘‘అమ్మా! డాడీ అన్నయ్య మీద బెంగగా ఉన్నారు. పెళ్లి శుభలేఖలు అచ్చయ్యాక వాటిని అన్నయ్యకి ఇచ్చిరా. అన్నయ్య వస్తే సరేసరి. రాకపోతే డాడీ బాధ పడతారు. ముందుగా ఈ విషయం ఆయనకు చెప్పొద్దు’’ అంది దివ్య. కరుణ అలా కాకినాడ నుండి బయలుదేరింది.

                                                                                                              * * *

‘‘అమ్మా! మీరు చెప్పిన అడ్రసుకి వచ్చేసాం’’ అన్న డ్రైవర్‌ ‌మాటలకు గతం నుండి బయటకు వచ్చి కారు దిగింది కరుణ. ఫస్ట్ ‌ఫ్లోర్లో మూడవ నంబర్‌ ‌ఫ్లాట్‌ ‌ముందుకి వచ్చి కాలింగ్‌ ‌బెల్‌ ‌నొక్కింది.

‘‘కాలింగ్‌ ‌బెల్‌ ‌మోగుతోంది… ఎవరో చూడు సహజ’’ అన్నాడు తేజ.

‘‘ఇప్పుడెవరు వచ్చుంటారు?’’ అంటూ ఏడుస్తున్న మూడేళ్ల బుజ్జితో హల్లోకి వచ్చింది సహజ.

తలుపు తీసిన సహజకు ఎదురుగా నిలబడిన నడి వయసు స్త్రీని చూస్తే ఎక్కడో చూసినట్లని పించింది.

‘‘మీరు… మీరు…’’ ఆశ్చర్యంగా అంది సహజ.

‘‘నేనే…నువ్వు ఎవరనుకుంటున్నావో అది నిజమే’’ అంటూ సహజ చేతిలో నుంచి బాబును తీసుకుంది కరుణ.

‘‘లోపలకు రండి అత్తయ్యగారు!’’ అంటూ ఆవిడ కింద పెట్టిన బ్యాగ్‌ ‌తీసుకుని లోపలకు ఆహ్వా నించింది సహజ.

‘‘తేజా! ఎవరొచ్చారో చూడు!’’ ఆనందంగా అంది సహజ.

‘‘ఎవరూ?’’ లాప్‌టాప్లో నుండి తలెత్తకుండానే అన్నాడు తేజ.

‘‘నేను చెప్పను… నువ్వే వచ్చి చూడు’’ అంది సహజ.

‘‘ఎవరూ?… నువ్వంత ఆనందపడుతున్నావంటే వచ్చి చూడాల్సిందే’’ అంటూ గదిలో నుండి బయటకు వచ్చాడు తేజ.

అప్పటికే హాల్లో కూర్చుని మనవడిని ముద్దులాడుతున్న కరుణ అలికిడికి తలెత్తింది.

‘‘అమ్మా!… అమ్మా!… నువ్వేనా? నేను నమ్మ లేకపోతున్నాను ‘‘ అంటూ తల్లి దగ్గరకు వచ్చాడు తేజ.

మూడేళ్ల తరువాత కొడుకును చూసిన కరుణ కళ్లు చెమర్చాయి.

తేజ తప్పు చేసిన అపరాధభావంతో తల వంచుకున్నాడు. ముఖంలోకి చూడలేక తల్లి ఒళ్లో ఉన్న బుజ్జి పక్కన తలపెట్టుకుని నేల మీద కూర్చున్నాడు. కరుణ అది గ్రహించి ఓదార్పుగా తేజ తల నిమిరింది. అతని ముఖం మీద ఆవిడ రాల్చిన కన్నీటి చుక్కలు పడ్డాయి.

‘‘అమ్మా! ఏడుస్తున్నావా? ఇన్నాళ్లు నేను గుర్తు రాలేదా?’’ జీరవోయిన గొంతుతో అడిగాడు తేజ.

‘‘ఇన్నాళ్లకయినా నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నీకు ఇప్పటికీ మేము గుర్తు రాలేదు’’ అంది కరుణ.

‘‘నేను రాకపోవడానికి కారణం డాడీ నా ముఖం చూపించవద్దన్నారు. లోకంలో ఎవరూ చేయని తప్పేదో నేనే చేసినట్లు అవమానించారు. నేనెలా వస్తాను?’’ అన్నాడు తేజ.

‘‘తేజా! కోపంలో అంటే వెళ్లిపోతావా? ఆయన్ని ప్రసన్నుడిని చేసుకోవలసిన ధర్మం నీకు లేదా?’’ అన్నది కరుణ.

‘‘అమ్మా! చిన్నప్పటి నుండి ఆయన క్రమశిక్షణ పేరుతో కట్టుదిట్టాల బందిఖానాలో పెంచారు. ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవద్దంటే ఎలా? ఆయన చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలంటే నా మటుకు ఆయన నియంతలాగా అనిపించారు. పిల్లల ఇష్టాలను గౌరవించడం ఆయన మరచిపోయారు. అందుకే నేను మళ్లీ అక్కడకు రాలేదు.’’ అన్నాడు తేజ.

కరుణ రెప్ప వాల్చకుండా కొడుకుని చూస్తోంది.

‘‘ఇంతకీ నువ్వు నాన్నకి తెలిసి వచ్చావా? తెలియకుండా వచ్చుంటావు కదూ? ఆయన ఇంకా అలాగే పరువు, ప్రతిష్ట అంటూ వేలాడుతున్నారా? దివ్య ఎలా ఉందమ్మా?’’ అన్నాడు తేజ.

కరుణ సమాధానం చెప్పలేదు.

‘‘అత్తయ్య గారు! కాఫీ తీసుకోండి. ఎప్పుడు బయలుదేరారో ఏమో!’’ చేతిలో కాఫీ కప్పుతో వస్తూ అంది సహజ.

కరుణ కోడలి చేతిలో కాఫీ కప్పు అందుకుంది. బాబును తేజ తీసుకున్నాడు.

‘‘ఈ…ఈ …’’ అంటూ తేజ జుట్టు పీకుతున్నాడు బుజ్జి.

‘‘బుజ్జి!… వద్దురా, జుట్టు పీకొద్దు’’ అరుస్తూ అన్నాడు తేజ.

‘‘నీపేరు బుజ్జినా? నువ్వు అల్లరి బాగా చేస్తావా బుజ్జి?’’ అంది కరుణ.

‘‘అల్లరి అంటావేంటమ్మా? విపరీతంగా అల్లరి చేస్తాడు’’ ఉత్సాహంగా అన్నాడు తేజ.

‘‘అయితే ముమ్ముర్తులా మీనాన్న నోట్లో నుండి ఊడి పడ్డావనమాట.’’ అంది కరుణ.

‘‘మొండి వెధవ! చెప్పిన మాట అసలు వినడు. తను అనుకున్నదే చేస్తాడు’’ మురిపెంగా బుజ్జిని చూస్తూ అన్నాడు తేజ.

‘‘అవునండీ అంతా ఆయన లాగానే చేస్తాడు. అనుకున్నది సాధిస్తాడు’’ వంటగదిలో నుండి వస్తూ అంది సహజ.

‘‘అత్తయ్య గారు! భోజనం చేసి వెళ్లండి’’ అంది సహజ.

‘‘వద్దమ్మా! నేను తొందరగా వెళ్లాలి’’ అంది కరుణ.

నానమ్మ చెయ్యి పట్టుకుని ‘‘దా.. దా… అము తిను’’ అన్నాడు బుజ్జి.

‘‘నా బంగారుకొండ’’ అంటూ ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది కరుణ.

‘‘బాబుకి అన్నం పెట్టుకుని రామ్మా. నా మనవడికి అన్నం తినిపిస్తాను’’

 కోడలి వైపు తిరిగి అంది కరుణ.

సహజ బాబుకి చిన్న గిన్నెలో అన్నం పెట్టుకుని వచ్చింది.

కరుణ వాడిని ఎత్తుకుని తిప్పుతూ కబుర్లు చెప్తూ తినిపించింది. వాడు నానమ్మ దగ్గర పేచీ పెట్టకుండా అన్నం తిన్నాడు.

‘‘రోజూ అన్నం తినడానికి విసిగిస్తాడు అత్తయ్య గారు. ఈరోజు మీరు పెడుతుంటే అసలేం పేచీ పెట్టడం లేదు’’ అంది సహజ.

‘‘మాఅమ్మ చేతితో అన్నం చాలా రుచిగా ఉంటుంది. నేను రోజూ అమ్మతోనే అన్నం కలిపించుకునే వాడిని’’ అన్నాడు తేజ.

బుజ్జికి అన్నం పెట్టాక కరుణ ఒళ్లు తుడిచి బట్టలు మార్చి ‘‘ఇక ఆడుకో నాన్న!’’ అంటూ కిందకు వదిలింది. వాడు నానమ్మను వదలకుండా ఎత్తుకో మన్నాడు. వాడు వెళ్లనని పేచీ పెట్టాడు.

‘‘సరే నాదగ్గరే ఉండు’’ అని బుజ్జిని వొళ్లో కూర్చో బెట్టుకుని మనవడితో ఊసులు చెప్తూ చాలా మురిసిపోయింది కరుణ.

‘ఎప్పుడు సహజ తరపు వారే కానీ తన తరపు వారెవరూ ఇంటికి రాలేదు. అదెప్పుడు తేజకు వెలితిగా అనిపిస్తుంది. ఈరోజు మొదటి సారి అమ్మ వచ్చింది… బుజ్జిని ముద్దు చేస్తుంది. అది చూస్తుంటే మనసుకు హాయిగా ఉంది.’ అనుకున్నాడు తేజ.

‘‘ఇక నేను వెళ్తాను కన్నా’’ అంటూ వదలలేక వదలలేక లేచింది కరుణ.

ఆవిడ చీర కొంగు పట్టుకుని బుజ్జి ఏడుపు మొదలు పెట్టాడు.

‘‘అమ్మా! నిన్ను వెళ్లొద్దంటున్నాడు’’ నవ్వుతూ అన్నాడు తేజ.

‘‘నేను ఇక్కడ ఉండటం కుదరదు కానీ నిన్ను నాతో తీసుకు వెళ్లనా?’’ అంటూ మళ్లీ ఎత్తుకుంది కరుణ.

బుజ్జికి ఏమర్థమయిందో తల ఊపాడు.

‘‘సరే వెళ్లిపోదాం… వీడిని నాతో తీసుకు వెళ్లనా తేజా’’ అంది కరుణ.

‘‘అమ్మో! వాడిని వదిలి మేమెప్పుడూ ఉండలేదు. వద్దమ్మా’’ వెంటనే అన్నాడు తేజ.

‘‘నిజమండి… వాడు లేకుండా క్షణం కూడా ఉండలేను’’ అంది సహజ.

‘‘తేజా! నాలుగేళ్లు పెంచుకున్న మీబిడ్డ మీద మీకు అంత బంధం ఉంటే ఇరవై నాలుగేళ్లు పెంచుకున్న బిడ్డ మీద మాకెంత మమకారం ఉంటుందో ఆలోచించు. తల్లితండ్రులు ఎన్ని త్యాగాలు చేస్తే పిల్లలు పెరుగుతారో ఇక ముందే మీకు అర్థమవుతుంది. ప్రేమ, పెళ్లి అంటూ మా గుండెల మీద తన్ని మా అనుమతి కోసం ఎదురు చూడటం కూడా అవమానంగా భావించావు. ఒక్కసారి కూడా నీ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు.’’ రుద్దమైన స్వరంతో అంది కరుణ.

తేజ, సహజ షాక్‌ ‌కొట్టినట్లు నిలబడి పోయారు.

తరువాత కళ్లు తుడుచుకుని తను తెచ్చిన బ్యాగులో నుండి శుభలేఖ తీసి తేజ చేతికి ఇచ్చింది.

‘‘ఏమిటమ్మా పెళ్లెవరిది?’’ ఆశ్చర్యంగా అడిగాడు తేజ.

‘‘చూడు! నీకే తెలుస్తుంది’’ అంది కరుణ.

అప్పటికే శుభలేఖ పైన పేర్లు చదివిన తేజ ఆనందం, ఆశ్చర్యం కలగలిపి ‘‘దివ్య పెళ్లా?…’’ అన్నాడు.

‘‘అవును… నీ కన్నా ముందు దివ్య పెళ్లి చేయాల్సిందని కూడా నువ్వు మరచి పోయావు. చెల్లి శుభలేఖలు పంచాల్సిన సమయంలో నువ్వు పెళ్లి చేసుకొని వెళ్లిపోయావు’’ అంది కరుణ.

‘‘అమ్మా! నాన్న ఆ రోజు నేను వర్ణాంతర వివాహం చేసుకుంటే దివ్యకి పెళ్లి జరగదన్నారు కదా? ఇప్పుడు ఈ అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడంటే మంచి సంబంధమే దొరికింది. తొందరపడి నన్ను అన్నందుకు ఆయన మాటలు వెనక్కు తీసుకుంటారా?’’ అన్నాడు తేజ.

‘‘మీ నాన్న చూసావా ఎలా మాట్లాడుతున్నాడో! తన తప్పు వదిలేసి వాళ్ల నాన్న తప్పులు వెతుకుతున్నాడు’’ మనవడితో అంది కరుణ.

‘‘ఇక నేను బయలు దేరుతాను తేజ. పెళ్లికి నువ్వు, వాడు ముందుగా రావాలమ్మా!’’ కోడలితో అంది కరుణ.

‘‘అమ్మా! నువ్వు నాన్నకు తెలియకుండా మమ్మల్ని పిలవడానికి వచ్చావా? తెలిసే వచ్చావా?’’ సీరియస్‌గా అన్నాడు తేజ.

‘‘తేజా! నీ మాటల్లో ఆ రోజు ఇంట్లో నుండి వెళ్లిపోయినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో ఇప్పుడూ అదే ఆవేశం కనిపిస్తుంది. నువ్వు తప్పు చేశావని ఇన్నాళ్లలో నీకు ఒక్కసారి కూడా అనిపించలేదని కూడా అర్థమవుతోంది. నువ్వు మా ప్రాణ సమానం కాబట్టి నువ్వు మమ్మల్ని వదిలేసినా మేము నీ చెల్లెలి పెళ్లి నువ్వు దగ్గరుండి జరిపించమని చెప్పడానికి వచ్చాను.’’ అంది కరుణ.

‘‘అంటే నాన్న నన్ను పిలవలేదనమాట!’’ అన్నాడు తేజ.

‘‘తేజా! నా జవాబుతో నువ్వు మారడం కాదు నాకు కావలసింది. నీలో నిజమైన పరివర్తన రావాలి. ఇంకా పంతం పట్టుకుని అలాగే ఉంటావో లేక కొడుకుగా బాధ్యత నెరవేర్చుకోవడానికి వస్తావో నీ ఇష్టం. ఇక నేను బయలు దేరుతాను’’ అంది కరుణ.

‘‘అప్పుడేనా? ‘‘ అన్నాడు తేజ. అతని గొంతులో తల్లి వెళ్లడం ఇష్టం లేదని చెప్పకనే తెలుస్తోంది.

‘‘అవును నేను వెళ్లాలి’’ అని లేచింది కరుణ.

ఇంటి బయట ఉన్న కారులో డ్రైవర్‌, ‌కరుణ కోసం ఎదురు చూస్తున్నాడు. మనవడిని ఒకసారి ముద్దు పెట్టుకుని కళ్లు తుడుచుకుంటూ కారు ఎక్కింది కరుణ. బుజ్జి నానమ్మ కోసం ఏడుస్తున్నాడు. కారు కదిలి వెళ్లిపోయింది వాళ్లను వేరు చేస్తూ…

లోపలకు రాగానే సహజ శుభ లేఖ చేతిలోకి తీసుకుంది.

‘‘పెళ్లి ఎవరిది తేజ?’’ అంది సహజ శుభలేఖ తెరిచి చూస్తూ.

‘‘తేజా! పెళ్లికొడుకు ఎవరనుకున్నావు? మా బాబాయిగారి అబ్బాయి. ఎంగేజ్మెంట్‌కి పిలిస్తే మీకు ఆఫీసులో వర్క్ ఉం‌దని మనం వెళ్లలేక పోయాము. శుభలేఖ తీసుకొని ఈ ఆదివారం వస్తామని బాబాయి నిన్నే ఫోన్‌ ‌చేసారు’’ ఆనందంగా అంది సహజ.

‘‘ఏమంటున్నావు సహజ? అబ్బాయి మీ తమ్ముడా? మా చెల్లి చాలా బాగుం టుంది. అందుకే చేసుకుంటున్నాడు. నాన్న చెల్లి కోసం ఒక ఫ్లాట్‌, ‌బంగారం కూడా ఎప్పుడో సమకూర్చారు’’ అన్నాడు తేజ.

‘‘అదేంటి తేజ? నువ్వు చెప్పేది, బాబాయి చెప్పింది ఒకటి తప్ప మిగిలినవన్నీ వేరుగా ఉన్నాయి.’’ అంది సహజ.

ఏం చెప్పారు? అన్నాడు తేజ.

‘‘ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. అన్న ప్రేమ వివాహం చేసుకుని ఇంటి నుండి వెళ్లిపోయాడట. తండ్రికి ఆ అబ్బాయంటే ప్రాణం కావడంతో షాక్‌ ‌కి లోనయి బ్రెయిన్లో ప్రాబ్లమ్‌ ‌వచ్చి మంచం పట్టారట. ఆయన ఉద్యోగం ఆ అమ్మాయికి ఇచ్చారని చెప్పారు. కుటుంబం మంచిది, కట్నం తీసుకోవడం లేదు, పెళ్లయ్యాక కూడా ఆ అమ్మాయి జీతం పుట్టింటికే ఇస్తుందని కూడా చెప్పారు’’ అంది సహజ.

‘‘నాన్నకి బ్రెయిన్లో ప్రాబ్లమ్‌ ‌వచ్చిందా? మాట పలుకు లేకుండా మంచం పట్టారా? ఇదంతా నావల్లే! నా తొందర పాటు వల్లే ఇలా జరిగింది… వాళ్లు నా మాట కాదన్నారని కోపం పెంచుకున్నాను. కనీసం ఒక్కసారి కూడా వెళ్లి చూడలేదు. ఎంత తప్పు చేసాను?’’ అంటూ ఏడుస్తున్నాడు తేజ.

‘‘తేజా! అలా బాధపడకు. దివ్య కుటుంబ బాధ్యత తీసుకుంది. మీ అమ్మ గారు ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆయనకు అలా జరిగిందని చెప్పలేదు. ఎంత మంచి మనసు!’’ అంది సహజ.

అప్పటికే తేజ ఫోన్‌ ‌తీసుకుని తల్లికి చేసాడు.

‘‘అమ్మా! నాన్న మంచంలో ఉన్నారా? ఎందుకమ్మా నాకు ఏమీ చెప్పలేదు?’’ అంటూ ఆపకుండా ఏడుస్తున్నాడు తేజ.

‘‘తేజా! ఇవన్నీ నీకెలా తెలిసాయి? నాన్న ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆయన శరీరం మందులకు స్పందిస్తుందని డాక్టర్‌ ‌చెప్పారు. ఏడవకు నాన్న! నేను తట్టుకోలేను’’ అంది కరుణ.

‘‘అమ్మా! నేను మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా మీరు నన్ను ప్రేమిస్తున్నారు. నేను వస్తే నాన్న నన్ను క్షమిస్తారంటావా?’’ అన్నాడు తేజ.

‘‘ఈ ప్రపంచంలో తల్లితండ్రులను కాదనుకునే సంతానంఉంది కానీ సంతానాన్ని కాదనుకునే తల్లితండ్రులుండరు తేజా!’’ అంది కరుణ.

‘‘అమ్మా! నేను ఇప్పుడే బయలు దేరుతున్నాను’’ అని ఫోన్‌ ‌పెట్టేసాడు తేజ.

‘‘బుజ్జి! మనం తాతయ్య దగ్గరకు వెళ్తున్నాం’’ అంటూ ఆనందంగా బుజ్జిని గిరగిరా తిప్పేసాడు తేజ.

‘‘వాడు పడిపోతాడు తేజా! జాగ్రత్త…’’ నవ్వుతూ అంది సహజ.

తేజ మనసంతా ఎపుడెపుడు నాన్నను చూస్తానా అనే ఆతృతతో నిండిపోయింది.

వచ్చేవారం కథ..

తరాల స్నేహం

-స్వాతీ శ్రీపాద

About Author

By editor

Twitter
YOUTUBE