సంపాదకీయం

శాలివాహన 1946 శ్రీ క్రోధి వైశాఖ శుద్ధ షష్ఠి – 13 మే 2024, సోమవారం

అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ   – బృహదారణ్యకోపనిషత్‌


రిజర్వేషన్‌ల గురించి ఈ ఎన్నికలలో పెద్ద చర్చే జరిగింది. నాలుగు వందల స్థానాలతో బీజేపీ మూడోదఫా అధికారంలోకి రావాలని అనుకోవడం రిజర్వేషన్‌ల రద్దుకేనన్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్‌ రేపింది. అసలు రాజ్యాంగమే రద్దు చేస్తారన్న దారుణమైన అబద్ధం మరొకటి. కనీస ఇంగిత జ్ఞానం ఉన్నవారు ఎవరైనా ఆ రెండూ సాధ్యమని చెప్పగలరా? రిజర్వేషన్‌ల రద్దు ఆలోచనే లేదని బీజేపీ పదే పదే చెప్పవలసి వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌ సరసంఘచాలక్‌ డాక్టర్‌ భాగవత్‌ కూడా అదే కరాఖండీగా చెప్పారు. ఓటమి భయం తీవ్రంగా ఉన్న కాంగ్రెస్‌ మరొక అంశమేదీ దొరకక బీజేపీ రిజర్వేషన్‌లను ఎత్తివేస్తుందన్న దుష్ప్రచారంతో ఎన్నికల బరిలోకి దిగింది. ఇది పెద్ద తప్పిదం.

రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం హిందూ జీవనవిధానంలోని దళితులకు, గిరిజనులకు రిజర్వేషన్‌లు ఇవ్వాలి. ఇవి బాగా వెనుకబడిన కులాలు. వీరి వెనుకబాటుతనం చరిత్ర ప్రసిద్ధి గాంచినది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ఈ వర్గాలకు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించి సామాజిక న్యాయం పాటించాలన్నదే రాజ్యాంగకర్తల ఉద్దేశం. మత ప్రాతిపదికన రిజర్వేషన్‌లు వారి ఉద్దేశం కాదు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మాత్రమే కాదు, ప్రథమ ప్రధాని నెహ్రూ కూడా నాడు మతం ప్రాతిపదికగా రిజర్వేషన్‌ల గురించి మాట్లాడలేదు. కానీ కాలక్రమంలో బుజ్జగింపు ధోరణితోనే రాజకీయాలు నడిపిస్తున్న కాంగ్రెస్‌  రిజర్వేషన్‌ స్ఫూర్తినే మరచిపోయింది.

కర్ణాటక చేసిన నిర్వాకంతో ఈ ఎన్నికలలో రిజర్వేషన్‌ అంశం విశ్వరూపం దాల్చింది. బుజ్జగింపు రాజకీయాల పట్ల తిరుగులేని నమ్మకం ప్రకటించే కాంగ్రెస్‌ ఇతర వెనుకబడిన వర్గాలు (ఓబీసీ) కోటా నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచనతో ఉంది. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్‌లకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం చేస్తున్నది అదే. ఇది దేశాన్ని ఇస్లామీకరించడానికీ, విభజన వైపు తీసుకువెళ్లడానికీ దోహదం చేసేదేనని బీజేపీ విమర్శ. ఆ విమర్శ, ఆరోపణ అర్ధరహితం కావు.  షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన కులాల వారికి రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్‌ సౌకర్యం నుంచి కోత విధించి ముస్లింలకు కట్టబెట్టడాన్ని ఏమనాలి? ఇదే కాంగ్రెస్‌ ఉద్దేశం. దీనిని రాజ్యాంగం నిరాకరిస్తున్నది. కర్ణాటక వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇచ్చిన గణాంకాలను ఆధారం చేసుకుని ముస్లింలలోని అన్ని తెగల వారిని కూడా కులాల పేరిట గంపగుత్తగా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలుగా చిరకాలం క్రితమే కర్ణాటక ప్రభుత్వం తీర్మానించింది. పైగా రాష్ట్ర వెనుకబడిన తరగతుల జాబితాలో ‘టు బి’గా వర్గీకరించింది. దీనికి పునాది యూపీఏ ప్రభుత్వం నియమించిన రంగనాథ్‌ మిశ్రా సంఘమే. ఈ సంఘం ఓబీసీలకు ఇస్తున్న 27 శాతం రిజర్వేషన్‌లలో 6 శాతం ముస్లింలకు ఇవ్వాలని సిఫారసు చేసింది. అంతేకాదు, ఇస్లాం స్వీకరించిన హిందూధర్మంలోని దళితులను వేరే వర్గంగా పరిగణించి అక్కడ దళితవర్గంగా గుర్తించాల కూడా సిఫారసు చేసింది. దళితులకు ఇస్తున్న రిజర్వేషన్‌ సౌకర్యాలు వారికీ కల్పించాలని మిశ్రా సంఘం సిఫారసు చేసింది. మిశ్రా కమిషన్‌ను బీజేపీ ఆనాడే వ్యతిరేకిం చింది. మిశ్రా కమిషన్‌ కావచ్చు, సచార్‌ కమిటీ నివేదిక కావచ్చు. ఇవి ముస్లిం రిజర్వేషన్‌లు పెంచాలన్న కాంగ్రెస్‌ కుట్రకు అనుగుణంగా ఉన్నవే.

ఇంతకు ముందు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన బసవరాజ్‌ బొమ్మయ్‌ ముస్లిం రిజర్వేషన్‌ను ఓబీసీ నుంచి కాకుండా ఆర్థికంగా వెనుకబడిన తరగతులలో చేర్చారు. దానినే తిరగతోడి ప్రస్తుత కర్ణాటక ప్రభుత్వం ఐదు శాతం ముస్లిం రిజర్వేషన్లు ప్రతిపాదించింది. ఇదేకాదు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించిన నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు కాంగ్రెస్‌ పాలన వస్తే జరిగేదేమిటో చెప్పేవే. ప్రధాని మోదీ వీటిని పైలట్‌ ప్రాజెక్టులని ఇటీవల రాజస్తాన్‌లో జరిగిన ఒక ఎన్నికల సభలో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మొదట కాంగ్రెస్‌ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలలో ముస్లిం రిజర్వేషన్‌లను ప్రయోగాత్మకంగా ఆ పార్టీ అమలు చేయదలిచిందన్నది నిజం. 1975లో దేవరాజ్‌ అర్స్‌ కాలం నుంచి ముస్లిం రిజర్వేషన్‌ల వ్యవహారం కర్ణాటకలో నలుగుతున్నదే. ఆ తరువాత రాష్ట్రాన్ని ఏలిన బీజేపీయేతర ముఖ్యమంత్రులంతా దానికి మద్దతు పలికినవారే. అక్కడ ముస్లిం మతోన్మాదం ఊడలు వేయడానికి కారణం ఇదేనేమో అధ్యయనం చేయవలసి ఉంటుంది.

తాజాగా రేగిన ముస్లిం రిజర్వేషన్‌ల వ్యతిరేక వివాదం తరువాత వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ కూడా కలగజేసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయం మీద వివరణ కోరాలని ఈ కమిషన్‌ చైర్‌పర్సన్‌ హన్సరాజ్‌ గంగారాం అహీర్‌ నిర్ణయించుకున్నారు. మొత్తం ముస్లింలందరికీ 2బి కేటగిరీ కింద రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం గురించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుంచి ఆయన వివరణ కోరుతున్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వం ముస్లింలలోని అన్ని వర్గాలను ఓబీసీలుగా వర్గీకరించడాన్ని కూడా వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ తప్పు పట్టింది. 2011 జనాభా లెక్కల ప్రకారం కర్ణాటకలో ముస్లింలు 12.92 శాతం ఉన్నారు. నిజానికి ఓబీసీలోనే రిజర్వేషన్‌ కేటాయింపులలో అసమతౌల్యం ఉందని, దానిని సరిచేయడానికి సూచనలు చేయవలసిందని ఆరేళ్ల క్రితం రోహిణి కమిషన్‌ను నియమించారు. ఈ కమిషన్‌ తన నివేదికను ఇటీవలనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందించింది కూడా. కాబట్టి ఓబీసీ రిజర్వేషన్‌ విధానం కూడా పరిపూర్ణం కాదు. 1992లో 50 శాతం రిజర్వేషన్‌ మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పు ఉండనే ఉంది. ఈ సంధి దశలో ముస్లిం రిజర్వేషన్‌ కోసం వేరొక కోటాలో కోత విధించడం శాస్త్రీయమైనదని చెప్పలేం. మొత్తంగా చూస్తే ఇది ఎన్నికల అంశం కాదు. దీనిని గమనించి ఈ అంశం గురించి మాట్లాడడం మంచిది.

About Author

By editor

Twitter
YOUTUBE