వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

– కె.వి.లక్ష్మణరావు

ఆ‌త్రంగా అప్పుడే పైనున్న నా గదిలోకి వెళ్లాను. బీరువా తెరవడానికి ప్రయత్నించాను. బీరువా తెరుచుకోవడం లేదు. మళ్లీ ప్రయత్నించాను. ఊహు! నావల్ల కావడం లేదు. ఒక్కరైనా ఈ గదిలోకి రాకపోతారా?అనుకుంటూ ఎదురు చూడ సాగాను. కానీ ఎవ్వరూ పైకి రావడం లేదు.

అసలు బీరువాను నేనేందుకు తెరవలేక పోతున్నాను? రాత్రి పడుకునే ముందు తాళం కూడా వేయలేదే? బీరువా మీద సర్వహక్కులూ నావేగా?

రోజూ చూసే గదే అయినా ఈ రోజెందుకో వింతగా, విచిత్రంగా అనిపిస్తోంది. కనిపిస్తోంది. మంచం మీద పక్క సరిగా లేదు

బారెడు పొద్దెక్కినా బెడ్‌ ‌లైట్‌ ఇం‌కా వెలుగుతూనే ఉంది. ఉదయమే పనిమనిషి రంగమ్మ వచ్చి గది ఊడ్చిన దాఖలాలేమి లేవు. ప్రతిరోజూ కింద నుండి పైకి వచ్చి శుభోదయం చెప్పే కొడుకు ఉదయ్‌, ‌కోడలు రమ ఇంకా వచ్చి పలకరించలేదు.

స్కూల్‌ ‌బ్యాగ్‌తో వచ్చి, ‘‘బాయ్‌! ‌బామ్మా!’’అంటూ ఆప్యాయంగా పలకరించే మనవడు అభి కూడా రాలేదు.

ఈరోజు ఆదివారం కూడా కాదాయే? మరి ఈరోజు ఈ ఇంటికేమైంది? వీళ్లంతా ఎక్కడ? తనను ఒంటరిని చేసి, కారులో ఏ అప్పనపల్లి వెంకన్నబాబు గుడికో వెళ్లిపోయారా? కనీసం నాకు చెప్పాలని కూడా అనిపించలేదా? ఎన్నో ప్రశ్నలు. కానీ ఒక్క జవాబు కూడా లేదు. బీరువా తెరవలేక, ఏమి చేయాలో తెలియక ఒక్కసారిగా బాల్కనీ వద్దకు వెళ్లాను. కిందకు చూశాను. కింద చాలా మంది ఉన్నారు. వారిలో ఉదయ్‌, ‌రమ, మా అక్క, అన్నయ్య, పిన్ని, బాబాయ్‌ ఇలా బంధువులు, ఇంకా స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్లు అంతా పోర్టికోలో కూర్చుని ఉన్నారు. ఇంత ప్రొద్దున్నే వీళ్లంతా ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు?

ఉదయ్‌ ‌దీనంగా ఎటో చూస్తున్నాడు. రమ, ఉదయ్‌ ‌పక్కనే కూర్చొంది.అప్పుడే లేచి ‘‘ఫ్రీజర్‌ ‌బాక్స్’’ ‌ముందు పెట్టిన దీపంలో నూనె పోసింది.ఆ బాక్స్‌లో నిర్జీవంగా పడుకుని ఉన్న వారి వంక పరిశీలనగా చూశాను. వెంటనే నవ్వొచ్చింది. ‘ఆ పార్ద్ధివ దేహం నాదే కదూ? అలా పడుకున్నది నేనే కదూ?’ అవును! ఇప్పుడు గుర్తొస్తోంది. తెల్లవారుజామునే లేచేసరికి గుండె బరువుగా ఉన్నట్లనిపించింది. ఛాతిలో విపరీతమైన నొప్పి. భరించలేని ఆ నొప్పితోనే మంచం పక్కనే ఒక్కసారిగా కుప్ప కూలిపోయాను. నేను మరణించాను. అవును.. నేనే మరణించాను. అందుకే అందరూ నా చుట్టూ విషణ్ణ వదనాలతో కూర్చొని ఉన్నారు. మౌనం పాటిస్తున్నారు.

‘‘బామ్మ, లేవదా?మాట్లాడదా?’’ఆరేళ్ల అభి తెలిసీ, తెలియకుండా వేసిన ప్రశ్నకు జవాబివ్వలేక ఉదయ్‌ ‌వాడిని దగ్గరకు తీసుకుంటూ, తడిబారిన కళ్లను తుడుచుకున్నాడు.

‘‘చెల్లీ! నా ‘కంటే ‘చిన్నదానివైనా, నా ‘కంటే ముందే’ వెళ్లిపోయావా?’’ అన్నయ్య ఫ్రీజర్‌ ‌బాక్స్‌పై నున్న అద్దం లోంచి నన్ను చూస్తూ అంటున్నాడు.

‘‘నిన్నే అన్నయ్యకు ఫోన్‌ ‌చేద్దామనుకున్నాను. అంతలోనే ‘రేపు చేద్దాంలే !’అని వాయిదా వేశాను. కానీ ‘రేపు’ అనేది ఇక నా జీవితంలో లేదుగా?మళ్లీ రాదుగా? అక్కతో కూడా మాట్లాడలేకపోయాను. ఇప్పుడు మాట్లాడగలనా? నన్ను నేను తిట్టుకున్నాను.!

‘‘ఊరుకోరా!’’ అక్క ఏడుస్తూనే అన్నయ్యను ఓదారుస్తోంది.

‘‘నిద్ర మాత్రలు వేసుకుంటే గానీ నాకు నిద్ర రాదు. అటువంటిది ఆ బాక్స్‌లో నిశ్చింతగా నిద్ర పోతున్నాను. నిద్ర సుఖమెరుగదంటారు.అందుకే ఇది మామూలు సుఖనిద్ర కాదు.శాశ్వత నిద్ర.

అన్నయ్య తరువాత ఒక్కొక్కరూ వచ్చి ఫ్రీజర్‌ ‌బాక్స్ ‌ముందు నిలబడి, వారికి నాతో గల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బాధ పడుతున్నారు. శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.

ఇంటి గేటు ముందు రంగమ్మ భర్త కొండయ్య నా ఫోటో ఉన్న శ్రద్ధాంజలి ప్లెక్సీని వేలాడదీసాడు. కొండయ్యను చూడగానే నిన్న జరిగిన విషయం గుర్తుకొచ్చింది.

‘‘అమ్మగోరూ! మీ చేతి ఆవకాయ శానా బావుంటాది. నాలుక సప్పబడి పోయింది. కొంచెం ఆవకాయ పెట్టండమ్మగారూ?’’ అంటూ ఆశగా అడిగాడు.

‘‘ఆవకాయ జాడీ చిట్టటుక మీద ఉంది. తీయించడానికి బద్దకించాను. రేపు తీయించి పెడతాను లేరా!’’ అని రేపటికి వాయిదా వేశాను.

వాడు ఉస్సూరు మంటూ వెళ్లాడు.

‘‘ఈరోజు వాడు నన్ను ఆవకాయ అడగగలడా? నేను ఇవ్వగలనా?’’

‘‘రేపు అన్నది నాకు శూన్యం కదా?’’

అదిగో అపర కర్మలు చేయించే బ్రహ్మ గారొచ్చారు.

ఆయన్ని చూసి అంతా లేచారు.

ఆయన వస్తూనే ‘‘చివరి చూపు చూడవలసిన వారంతా వచ్చేసినట్టేనా? కాలా తీతం కావస్తోంది. ఇక అంతిమయాత్రకు సిద్ధం కండి!’’ అంటూ తదుపరి కర్తవ్యాన్ని చెప్పడంతో అంతా సమాయత్తం అవుతున్నారు.

నా పార్ద్ధివ దేహాన్ని జాగ్రత్తగా బాక్స్ ‌నుండి కిందకు దించారు. ఉదయ్‌ , ‌బ్రహ్మగారు చెప్పి నట్టుగా దేహంపై బిందెలతో నీళ్లు పోస్తున్నాడు. ‘‘అమ్మా’’ అంటూ ఒకవైపు ఏడుస్తూనే!’.

వాడి పిలుపు వినగానే ‘‘ఉదయ్‌! ‌నేను నీ పక్కనే ఉన్నాను రా!’’ అంటూ ఒకవైపు నేను అరుస్తున్నా వాడికి వినబడటం లేదు.

‘‘ఉదయ్‌కు వాడికిష్ట దైవం అయిన సాయిబాబా ఉంగరం చేయించాను. రేపు ఇద్దాంలే !’’ అంటూ వాయిదా వేస్తూ వచ్చాను. ఈ రోజు నా చేత్తో ఇవ్వగలనా?’’ బాధేసింది.

‘‘పాపం! ఈ రోజు సులోచన పుట్టినరోజు కూడా!’’ అన్నయ్య, అక్కతో అన్నాడు.

‘‘ఆ! అవును! సులోచన అంటే నేనేగా. ఈరోజు నా పుట్టినరోజు. రాత్రిపూట బీరువాలో భద్రంగా దాచుకున్నాను నెమలి కంఠం రంగు చీర. ఆ చీర అంటే నాకు చాలా ఇష్టం.

పెళ్లైన కొత్తలో శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతానికి మా శ్రీవారు కొన్న చీర అదే.

ఆ చీర కట్టుకున్న రోజే ఉదయ్‌ ‌నా కడుపున పడ్డాడని తెలిసింది. ఆ చీరతోనే ఈ ఇంటి గృహ ప్రవేశం చేశాను. ఆ చీర కడితే అంతా శుభమే.

కొన్నాళ్లకు ఆ చీర పాడైతే అదే రంగుతో రెండు చీరలు మావారు కొన్నారు. అందులో ఒకటి కట్టేశాను. ఈ రోజు రెండోది కట్టాలి. నిన్న ఆ చీరను నా ఒంటి మీద వేసుకుని అద్దం ముందు నిల్చొన్నాను.

 ఒక్కసారి కట్టాలనిపించింది. ‘కొన్ని గంటలు గడిస్తే నీ పుట్టినరోజు కదా? అంతవరకూ ఆగలేవా?’ మనసులో అనుకున్నాను. అంతే! చీరను తిరిగి భద్రంగా బీరువాలో పెట్టాను. గంటలు ఆగాను. కానీ నాతో పాటు నా గుండె కూడా ఆగింది. ఆ చీర మీద భ్రాంతి పోక పైకి బీరువా దగ్గరకు వచ్చాను.

‘నా పార్ద్ధివ దేహం మీద ఆ చీరను కప్పండి రా’ అని అరుస్తున్నాను. నా అరుపులు ఎవరికీ వినిపించడం లేదు. పిలుస్తున్నాను. కానీ నేనెవ్వరికీ కనబడటం లేదు. నా ఆత్మ ఘోష ఎవ్వరికీ పట్టదా?

రంగమ్మ ఎన్నాళ్ల నుంచో ‘‘అమ్మగారూ! ఓ పాత చీరుంటే ఇయ్యండమ్మా..’’ అని అడుగుతోంది. ‘‘ఈరోజు శుక్రవారం… రేపు ఇస్తాలేవే’’ అంటూ రేపటికి వాయిదా వేశాను. ఈరోజు రంగమ్మ అడగనూలేదు. నేను ఇవ్వనూ లేను.

ఏడు కట్ల సవారీ మీద నన్ను పడుకోబెట్టారు.

‘‘అమ్మా! చుట్టూ తిరిగే వాళ్లు తిరగండి. పార్ద్ధివ దేహాన్ని కైలాస రథంలోకి చేర్చాలి. సమయం అవుతోంది.!’’

బ్రహ్మ గారి పిలుపునందుకుని కొడుకు, కోడలు, బంధువులు, స్నేహితులు, అందరూ నా చుట్టూ తిరిగేందుకు సన్నద్ధమవుతున్నారు. వాళ్లందరిలో కన్నీళ్లు సుళ్లు తిరుగుతున్నాయి.

అయితే ఎవ్వరూ నా ఆశ నెరవేర్చడం లేదు. నెమలి కంఠం రంగు చీర కప్పేందుకు ఎవ్వరూ ప్రయత్నించడం లేదు. నా భ్రాంతి తీరేదెలా?

అప్పుడే కుర్చీలోంచి ఎవరో ఒక వ్యక్తి అమాంతం లేచిన చప్పుడైతే ఠక్కున అటువైపు చూశాను.

ఆ వ్యక్తి మావారే కదా!. అయ్యో! అందరినీ పేరు పేరునా తలుచుకున్నాను. మిమ్మల్ని మరిచానా? అయినా మరచిపోయే వ్యక్తా మీరు? నేను మీలో సగం. మరో సగాన్ని వదలి వెళ్లిపోతున్నాను.

ఈ క్షణం నుండీ ఈయన ఎలా బ్రతుకుతారో?

కోడళ్లు చెబితేనే కొడుకులు చూసే రోజులివి. నోరు తెరిచి రెండోసారి కాఫీ అడగని మొహమాటం మీది. పరమేశ్వరా! మా వారికి ఏ కష్టం కలగకుండా చూడవయ్యా!’’ అంటూ వేడుకున్నాను.

‘‘చుట్టూ తిరగవలసిన వాళ్లేవరైనా ఇంకా ఉన్నారా?’’ బ్రాహ్మ గారడుగుతున్నారు.

మావారు పైకి వెళ్లి గబగబా కిందకు వచ్చారు.

అందరూ ఆయన్ని గమనిస్తున్నారు. ఆయన చేతిలో నెమలి కంఠం రంగు చీర. ఆ చీరను అమాంతం నా పార్ధీవ దేహం పైన కప్పారు. రేపన్నది నాదైతే నేను కట్టాల్సిన చీర అది. నా పార్ధివ దేహానికి చుట్టారు.

నాలో ఒకరకమైన ఉద్వేగం. ఇప్పుడు నేను ఏడుస్తున్నాను. అంతలోనే మావారి కేసి చూశాను.

ఆయన రెండు చేతులూ జోడిస్తూ,‘‘కలిసి కష్టపడ్డాం! ఇన్నాళ్లూ! కలిసి సుఖాపడదాం! ఇకపై ఉన్నన్నాళ్లు!’’ అనుకున్నాను సులోచనా! కానీ నన్ను ఒంటరిని చేసి…వె.. ళ్లి… పో…? ఇక మాట్లాడలేక గొంతుపూడుకు పోవడంతో అలా చూస్తూనే ఉండిపోయారు.

ఆయన్ని అలా చూడగానే ఏమై పోతారోనని కంగారు మొదలైంది.

‘‘ఉరుకో !బావా!’’అంటూ అన్నయ్య ఆయన్ని పక్కకు తీసుకువచ్చి కూర్చో బెట్టారు.

పాడెను కైలాసరథంలోకి చేర్చారు. రథం కదిలింది.

కోరికలు తీరనప్పుడు అవి భ్రాంతిగా మారతాయి. ఇప్పుడు నా భ్రాంతి తీరింది. నెమలి కంఠం రంగు చీరతో వెళ్లాను.

ఇంకా ఇక్కడే ఉన్నానే?’’ నాలో నాకే సందేహం.

అప్పుడు అర్థ్ధమైంది. నా భ్రాంతి ఇప్పుడు మా వారి మీదే నని. శిలా విగ్రహంలా కదలకుండా కూర్చుండి పోయిన ఆయన వద్దకు వెళ్లాను.

‘‘ఏమండీ! నన్ను మన్నించండి. మిమ్మల్ని ఒంటరిని చేసినందుకు!’’వేడుకుంటున్నాను. కానీ నా ఆవేదన అరణ్యరోదనే అయింది. ఆయనకు నేను వినబడను, కనబడును కనుక.

కళ్లు తిరిగి పడిపోతారేమోనని భయం వేసింది. ఎవరైనా ఆయన్ని పట్టించుకోవాలి. ఇప్పటి వరకూ ఇక్కడే ఉన్న మగవాళ్లందరూ శ్మశానానికి వెళ్లారు. భగవంతుడా! ఆయన్ని కనిపెట్టుకో నాయనా!’’ మళ్లీ వేడుకున్నాను.

అప్పుడే రమ ‘‘మామయ్య గారూ, కాఫీ తాగండి!’’ అంటూ కప్పు ఆయన చేతిలో పెడుతూ ఇలా అంది.

‘‘మామయ్య గారూ! మీరు రోజూ ఉదయం పూట రెండుసార్లు కాఫీ తాగుతారని నాకు తెలుసు. కానీ ఉదయం నుండీ బాధలో ఉండిపోయి ఒక్కసారి కూడా తీసుకోలేదు. నీరసంగా ఉన్నారు. కాఫీ, తాగండి. అత్తయ్య లేని లోటు తీర్చ లేనిది. కాదనను. కానీ మీకు ఏ లోటు రానివ్వకుండా చూసుకునే బాధ్యత మాది’’. ఆ మాటలు వినగానే రమ గొప్ప మనసు అర్థ్ధమైంది.

‘‘రమా! చిన్నదానివే అయినా, నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా!’’ అంటూ చేతులు జోడించాను.

ఆయన కాఫీ కప్పు అందుకున్నారు. ఒక్క సారిగా పైకి చూసి తిరిగి రమ వైపు చూస్తూ,

‘‘రమా! రాత్రి పడుకోబోయే ముందు ‘ఏమండీ! ఈ సెల్‌ ‌చేతిలో ఉన్న ప్రతీ మనిషీ తోటి వ్యక్తితో మాట్లాడటం తగ్గించేశారు. మీరు కూడా అంతే నా?. రేపు నా పుట్టినరోజు. మనసారా మాట్లాడండి!’ అని మీ అత్తగారు నా చేతిలో ఉన్న సెల్‌ ‌ను లాక్కుంది. నాకు కోపం ఎక్కువైంది. ఆ సెల్‌ ‌ను తీసుకుంటూ ‘‘మనమేమైనా కొత్తగా పెళ్లైన వాళ్లమా? నోరు మూసుకుని పడుకో!’’ మంటూ గట్టిగా కసిరాను. అదే సులోచనతోనే మాట్లాడిన చివరి మాట. నా అరుపుతో భయపడింది. అప్పుడు ‘మాట్లాడలేదు’. ఇప్పుడు ‘మాట్లాడటానికి అది బతికిలేదు. నా కోపానికి ఫలితం. ఒంటరిగా బ్రతకమని శాపం పెట్టి వెళ్లిపోయింది. ఇప్పటికైనా మనుషులు మారాలి.

‘దూరం’గా ఉన్న వ్యక్తితో మాట్లాడేందుకు వాడే ఫోన్‌ను మూడో చేయిగా చేసుకున్నాం.’ దగ్గరి ‘మనుషులతో మాట్లాడటం మరచిపోయాం. నన్ను సులోచనకు దూరం చేసిన సెల్‌ ‌నాకు వద్దమ్మా!’ అంటూ సెల్‌ను రమ చేతిలో పెట్టారు.

అంతే కాదు రమా! ఎన్నోసార్లు నాతో ‘‘ఏమండీ! విజయవాడ నుంచి కాశీకి విమానాలు వేశారుటండీ!. విమానంలో కాశీ తీసుకెళ్లండి’’ అని రోజూ అడిగేది. నేను తన మాటల్ని వినిపించీ వినిపించు కోనట్టుగా చూస్తూ ‘‘రేపు అలోచిద్దాం లే !’’ అంటూ వాయిదా వేస్తూ వచ్చాను. ఇప్పుడు సులోచనకు బదులు తన అస్థికలను తీసుకెళ్లాలి. రేపన్నది మనది కాదు అని తెలియక మనం రేపు చేసేస్తామంటూ పనులను వాయిదా వేస్తూ వచ్చేస్తాం. భవిష్యత్‌ను చాలా తేలికగా చేతిలోకి తీసుకుంటాం. అది భ్రమ అని తెలిసినా ఆలోచించం. కానీ రేపన్నది మన చేతుల్లో లేదని తెలుసుకో(లే)ము.

ఆయన మాటలు అక్షర సత్యాలు. ‘‘నిజమేనండీ! రేపన్నది ఒట్టి పిచ్చి!’’ ఏడుస్తూ అనుకున్నాను. ఆయన ఆకాశం కేసి చూస్తున్నారు.

‘‘సులోచనా! నిన్నటి వరకూ నీవు నిజం. ఈ రోజు నుండీ జ్ఞాపకం!’’ అంటూ కళ్లు తుడుచు కున్నారు.

రమ మళ్లీ ‘‘ఊరుకోండి !మామయ్య గారూ!’’ అంటూ ఓదారుస్తోంది.

‘‘జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం బాగా చూసుకోండి.’’ ఆయనకు నా మాటలు వినబడవని తెలిసినా భ్రాంతి తీరక ఆయన వద్దకు వెళ్లి అన్నాను.

ఆయన కళ్లు వర్షిస్తున్నాయి. ఏడుపు ద్వారానైనా సగం బాధ తగ్గుతుందనుకున్నాను. ఇక అక్కడ ఉండలేక, ఉండకూడదు కనుక దక్షిణ దిశ వైపుగా అడుగులు వేశాను.

వచ్చేవారం కథ..

తనదాకా వస్తే

కె.వి. సుమలత

About Author

By editor

Twitter
YOUTUBE