రాష్ట్రంలో ఈ నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించడానికి తెలుగుదేశం, వైసీపీ సంక్షేమ పథకాలను పోటీపడి ప్రకటించాయి. టీడీపీ ఇప్పటికే సూపర్‌ 6 ‌పేరిట కొన్ని పథకాలను ప్రచారం చేస్తుండగా, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి మేనిఫెస్టోను ప్రకటించారు. జగన్‌ ఇప్పటి వరకు అమలుచేస్తున్న నవరత్నాల కన్నా టీడీపీ ప్రకటించిన సంక్షేమ పథకాలు మరింత ఎక్కువమందికి లబ్ధిని చేకూర్చేలా ఉన్నాయి. దాంతో వైసీపీ మేనిఫెస్టో కూడా మరింత ఎక్కువ మందికి లబ్ధి కలిగించేలా ఉంటుందని భావించారు. కాని జగన్‌ ‌ప్రకటనతో వైసీపీ నాయకులు హతాశులయ్యారు. మేనిఫెస్టో వారు ఊహించినట్లుగా లేదు. గత నవరత్నాల పథకాలనే మళ్లీ ప్రకటించారు. దీని కంటే తెలుగుదేశం సూపర్‌ ‌సిక్స్ ఓటర్లను ఎక్కువగా ఆకర్షిస్తోంది.

ఓటర్లను ఆకర్షించేందుకు సంక్షేమ పథకాలను ప్రకటించడం గతంలో ఉన్నా 2014 నుంచి మరింత పెరిగిపోవడం, మూలధన పెట్టుబడుల నిధులు కూడా సంక్షేమానికే మళ్లించడంతో రాష్ట్రాల ప్రగతి శూన్యమైపోయింది. ఇప్పుడు పార్టీలు పోటీపడి ప్రకటిస్తున్న రాయితీలు, నగదు బదిలీ పథకాలు రాష్ట్ర ఖజానాను ఖాళీచేసి రాష్ట్రాన్ని అధోగతి పాలుచేయకమానవని నిపుణులు అంటున్నారు.

సంక్షేమం పేరిట ఓట్ల కొనుగోలు

పేదలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు అమలుచేయడం అవసరమే. అయితే సంక్షేమం పేరిట తమకు ఓట్లు వేయించుకోవడానికి పార్టీలు ప్రాధాన్యమిస్తున్నాయి. లెక్కలేనన్ని పథకాలు ప్రకటించి ఓటర్లను ముందు నుంచే కొనుగోలు చేస్తున్నాయి. సంక్షేమ పథకాలు ఎప్పటి నుంచో అమలులో ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి పెరిగాయి. రైతు రుణమాఫీ•, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ పథకాలను అమలు చేశారు. దాంతో ఓటర్లు మరలా 2009లో కాంగ్రెస్‌కే పట్టం కట్టారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం ఈ పథకాలను అమలుచేస్తూనే సామాజిక పింఛన్లను రూ.200 నుంచి రూ.2 వేలకు పెంచింది. ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు రూ.10 వేల చొప్పున నగదు బదిలీ చేసింది. 2019లో నవరత్నాల పథకాలను ప్రకటించి ప్రజలను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైసీపీ వాటి అమలుకు తీవ్ర ఇబ్బందులు పడింది. ఏడాదికి రూ.70 వేల కోట్లు ఖర్చుచేసినట్లు ముఖ్యమంత్రి జగన్‌ ‌ప్రకటించారు. ఇప్పుడు టీడీపీ ప్రకటించిన సూపర్‌ ‌సిక్స్ ‌లేదా జనసేనవి కలుపుకుంటే సూపర్‌ ‌టెన్‌ ‌పథకాలకు ఏడాదికి రూ.1.20 లక్షల కోట్లు ఖర్చవుతాయని జగన్‌ ‌విమర్శిస్తున్నారు. ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తాయని కూడా ప్రశ్నించారు. తాను సంపదను సృష్టించి దానిని ప్రజలకు పంచుతానని చంద్రబాబు చెబుతున్నారు. మొత్తానికి ఎన్నికలప్పుడే కాకుండా ఎన్నికల తర్వాత కూడా అయిదేళ్ల పాటు జనానికి డబ్బులు పంచేందుకు ప్రభుత్వాలు సిద్దమయ్యాయి.

రెండి మధ్య పోలికలు – తేడాలు

వైసీపీ, టీడీపీ మేనిఫెస్టోల్లో ఓటర్లను ఎక్కువగా ఆకర్షించే సామాజిక పింఛన్లు, మహిళలకు నగదు సాయం, రైతులకు ఆర్థిక సాయం, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పథకాలుండగా, వాటిలో ఏవి ఆకర్షణగా ఉన్నాయో చూద్దాం.

సామాజిక పింఛన్లు

వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలకు నెలకు ప్రస్తుతం రూ.3 వేలు పింఛన్‌ ఇస్తున్నారు. వైసీపీ 2024 మేనిఫెస్టోలో సామాజిక పింఛన్లను 3 ఏళ్ల పాటు అదే మూడు వేలు ఇస్తూ, చివరి రెండేళ్లు ఏడాదికి రూ.250 చొప్పున రెండేళ్లకు రూ.500లకు పెంచుతామన్నారు. అంటే నాలుగో ఏడాది 2028లో రూ.3,250, తర్వాత చివరి ఏడాది 2029లో రూ.3,500కు ప్రతి నెలా ఇస్తారు. టీడీపీ నాలుగు వేలు పింఛన్‌ ఇస్తామంది. అది కూడా ఏప్రిల్‌, ‌మే, జూన్‌ ‌నెలల నుంచి ఇస్తామని, జూలై నెలలోనే రూ.4 వేలు, ఏప్రిల్‌, ‌మే, జూన్‌లకు పెంచిన రూ.వెయ్యి కూడా కలిపి ఒకేసారి రూ.7 వేలు ఇస్తామని చంద్ర బాబు ప్రచారం చేస్తున్నారు. ఇది ఆయా వర్గాలను బాగా ఆకర్షిస్తోంది. 50 ఏళ్లు దాటిన బీసీలకు కూడా పింఛన్‌ ‌వర్తింపచేస్తామని ప్రకటించడం కూడా ఈ వర్గాలను ఆకర్షించేదే.

అమ్మఒడి

ఈ పథకంలో ఇప్పటి వరకు రూ.15 వేలు నగదును పిల్లల చదువుకు ఇస్తున్నారు. ఇందులో రూ.2 వేలు పాఠశాలల మెయిన్‌టెనెన్స్‌కు తీసుకుని మిగతా రూ.13 వేలు మాత్రమే తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం వేస్తోంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.2 వేలు పెంచి రూ.17000 ఇస్తామని, ఇందులో రూ.15,000 తల్లుల ఖాతాలో జమ అవుతాయని, 2వేలు పాఠశాల అభివృద్ధికి వెచ్చిస్తామని జగన్‌ ‌వెల్లడించారు. కుటుంబానికి ఒకరికే అనే నిబంధన కూడా ఉంది. టీడీపీ ‘తల్లికి వందనం’ పేరుతో ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికి రూ.15 వేలు వంతున ఇవ్వనున్నట్టు సూపర్‌సిక్స్‌లో స్పష్టం చేశారు. ఇక్కడ కూడా కూటమిదే పైచేయిగా నిలిచింది.

మహిలలకు ఆర్ధిక సాయం

వైసీపీ ప్రభుత్వం ‘చేయూత’ పేరుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు నాలుగు విడతల్లో ఒక్కో విడత రూ.18,500 చొప్పున నాలుగు విడతల్లో రూ.75,000 నగదు పంపిణీ చేసింది. మరో ఐదేళ్ల పాటు ఇదే కొనసాగిస్తామని చెప్పింది. అది కూడా 45 ఏళ్లు దాటి 60 ఏళ్లలోపు మహిళలకు అందజే సింది. ఈ నిబంధన 45 ఏళ్ల లోపు మహిళలకు ఆగ్రహం తెప్పించింది. టీడీపీ మాత్రం 18 ఏళ్లు నిండిన మహిళలకు మహలక్ష్మి పథకంలో నెలకు రూ.1500 ఇస్తామని, ఒక కుటుంబంలో వారందరికి లబ్ధి సమకూరుస్తామంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్‌ ‌సిలెండర్లు ఉచితం వంటి పథకాలను సూపర్‌ ‌సిక్స్‌లో కూటమి పొందుపరిచింది. ఇలా సంక్షేమ పథకంలో అమలు లోనూ కూటమి మేనిఫెస్టో ముందు వరసలోఉంది.

రైతులకు ఆర్దిక సాయం

వైసీపీ తన మేనిఫెస్టోలో ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.16వేల చొప్పున లబ్ది చేకూర్చుతామని ప్రకటించింది. గత ఎన్నికల ముందు రైతుభరోసా కింద ఐదేళ్లలో రూ.50 వేలు ఇస్తామన్న జగన్‌.. 2019-24 ‌మధ్య ఏటా ఒక్కో రైతు కుటుంబానికి రూ.7,500 చొప్పున ఐదేళ్లలో ఇచ్చింది రూ. 37,500 మాత్రమే. ప్రధానమంత్రి కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌యోజన కింద కేంద్రం ఏటా ఇస్తున్న రూ.6వేలు కూడా తన ఖాతాలో కలుపుకొని ఏటా రూ.13,500 చొప్పున ఇచ్చినట్లు చెప్పుకొంటున్నారు. పండ్లతోట లకు సబ్సిడీలు అటకెక్కాయి. డ్రిప్‌ ఇరిగేషన్‌ ‌పూర్తిగా కనుమరుగైంది. ఇలా చెబుతూ పోతే 2019లో వైసీపీ ఇచ్చిన హామీలలో కొంత వరకే అమలు చేశారు. తాజా మేనిఫెస్టోలో ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.16వేల చొప్పున లబ్ధి చేకూర్చుతామని ప్రకటించారు. టీడీపీ కూటమి రైతుకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం అందజేస్తామంటూ హామీ ఇచ్చింది. ఆక్వా రంగానికి జోన్‌తో నిమిత్తం లేకుండా రూ.1.50లకే యూనిట్‌ ‌విద్యుత్‌ అం‌దజేయనున్నట్టు భరోసా కల్పించింది.

ఉద్యోగ భర్తీలు

అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తానని గత ఎన్నికల ముందు చెప్పిన జగన్‌.. ఆ ‌విషయంలో మాట తప్పారు. ఐదేళ్లలో 5వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఒక్క గ్రూప్‌-2 ఉద్యోగం ఇవ్వని ఏకైక ప్రభుత్వంగా ఘనత సాధించారు. ఇకపై యూపీఎస్సీ తరహాలో ఉద్యోగాలు భర్తీ చేస్తానంటూ జగన్‌ ‌కొత్త పల్లవి అందుకున్నారు. ‘క్రమం తప్ప కుండా గ్రూప్‌-1, ‌గ్రూప్‌-2, ‌పోటీ పరీక్షల నోటిఫికే షన్లు ఇచ్చి, యూపీఎస్సీ తరహాలో నిర్దిష్ట సమయంలో పరీక్షలు నిర్వహణ’ అని తాజా మేనిఫెస్టోలో పేర్కొన్నారు. 2019లోనూ ఇలాంటి హామీనే ఇచ్చిన జగన్‌ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీని గాలికొదిలేశారు. నాలుగున్నరేళ్ల పాటు మౌనం వహించి చివర్లో 897 పోస్టులతో గ్రూప్‌-2 ‌నోటిఫికేషన్‌ ఇచ్చారు. 111 పోస్టులతో ఒకే ఒక్క గ్రూప్‌-1 ‌నోటిఫికేషన్‌ను పూర్తిచేశారు. మొత్తంగా ఐదేళ్లలో ఏపీపీఎస్సీ ద్వారా 5వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. ఇప్పుడు జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌విషయాన్ని పూర్తిగా వదిలేసారు. రాష్ట్రంలో అత్యధి కంగా ఉపాధి అవకాశాలు కల్పించే ఐటీ రంగంపై ప్రభుత్వం తీవ్ర అలక్ష్యం చేసింది. కొత్త కంపెనీలు రావడం అటుంచి ఉన్నవి పోయేలా చేసింది. ఈ నిర్వాకంతో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఒకరు లేదా ఇద్దరు చొప్పున ఐటీ కోర్సులు చదివిన నిరుద్యోగు లున్నారు.వైసీపీకి చిత్తశుద్ది ఉంటే అయిదేళ్లపాటు ఇందులో కొంతయినా చేసి ఇప్పుడు మరికొన్ని కలపాలి, కాని నవరత్నాల తప్ప మరేం చేయకుండా ఇప్పుడే చేస్తామని చెబుతుంటే నిరుద్యోగులు నమ్మడం లేదు. కూటమి తాము అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేస్తామని 20 లక్షల ఉద్యోగాలు అందిస్తామని నిరుద్యోగులకు రూ.3 వేల చొప్పున భృతి అందిస్తామని ప్రకటిచింది. ఐటీ ఉద్యోగులకు ఇంటి వద్దే పనిచేసుకునేలా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది.

రాజధానుల విషయంపై..

రాజధాని విషయంలో వైసీపీ మరల 3 రాజధానుల రాగాన్నే అందుకుంది. విశాఖ నుంచే పాలనంటూ ప్రకటించారు. కర్నూలును న్యాయ రాజధానిని చేస్తామని, అమరావతిని శాసన రాజధానిగా అభివృద్ధి చేస్తామని జగన్‌ ‌హామీ ఇచ్చారు. 3 రాజధానుల విషయంలో మూడు ప్రాంతాలవారు జగన్‌ ‌పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. విశాఖవాసులు అసలు తమకు రాజధాని అవసరం లేదని అంటున్నారు. ఇప్పటికే ఇక్కడ తిష్టవేసిన వైసీపీ నాయకులు విలువైన భూములు కబ్జా చేసినట్లు ఆరోపిస్తున్నారు. అమరావతే రాజధానిగా ఉండాలని తమ అభీష్టాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంలో న్యాయ రాజధాని నిర్మించకపోవడంపై రాయలసీమ వాసులు వైసీపీపై ఆగ్రహంతో ఉన్నారు. కూటమి మాత్రం రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. రెండు పార్టీలు ఇచ్చిన హామీల్లో ఎక్కువ మందిపై ప్రభావితం చూపేవి గెలుపు ఓటములను నిర్ణయించనున్నాయి.

‌టిఎన్‌ ‌భూషణ్‌

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE