విలువలతో కూడిన విద్యను అందించటంలో దేశ వ్యాప్తంగా పేరెన్నిక గన్న సంస్థ విద్యాభారతి. అఖిల భారత శిక్షా సంస్థాన్‌కు అనుబంధంగా తెలుగు రాష్ట్రాల్లో శ్రీ సరస్వతీ విద్యాపీఠం నడుస్తున్నది. గడచిన 50 సంవత్సరాలుగా.. రెండు రాష్ట్రాల్లోనూ 400కు పైగా శిశుమందిర్‌లను నిర్వహిస్తూ సేవలు అందిస్తోంది. ఈ క్రమంలో అత్యున్నత ప్రమాణాలతో విద్యాలయాలు విస్తరిస్తున్న క్రమంలో రెండో సీబీఎస్‌ఈ పాఠశాలగా నాదర్‌గుల్ లోని విద్యాభారతి విజ్ఞానకేంద్రం రూపుదిద్దుకొన్నది. ఈ పాఠశాల భవనాల ప్రారంభోత్సవం ఏప్రిల్ 28న అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా పరమహంస పరివ్రాజకాచార్య త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి విచ్చేశారు. ఆయనతో కలిసి డాక్టర్ మోహన్ భాగవత్ పాఠశాల భవనాలను ప్రారంభించారు. తరువాత సభా కార్యక్రమం జరిగింది. క్షేత్ర అధ్యక్షులు డాక్టర్ ఉమామహేశ్వరరావు, క్షేత్ర కోశాధికారి పసర్తి మల్లయ్య, సంఫ్‌ు ప్రాంత సంఘ ఛాలక్ సుందర్ రెడ్డి, పాఠశాల అధ్యక్షులు రమేష్ గుప్తా వేదికను అలంకరించారు. మొదట శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు పద్మశ్రీ మాతాజీ ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన చేశారు.
రిజర్వేషన్లకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యతిరేకమంటూ సాగుతున్న దుష్ప్రచారానికి డాక్టర్ మోహన్ భాగవత్ తెరదించారు. సమాజంలో అసమానతలు తగ్గించేందుకు రిజర్వేషన్లు తీసుకొని వచ్చారని, అసమానతలు తొలగిపోయేదాకా రిజర్వేషన్లు యథాతథంగా ఉండాలని ఆయన అభిప్రాయ పడ్డారు. ఎప్పుడైతే రాజ్యాంగంలో ప్రజలకు రిజర్వేషన్లు అవసరమని చెప్పారో అప్పటి నుంచి మద్దతు ఇచ్చామని గుర్తుచేశారు. ఎప్పటివరకు ప్రజలకు రిజర్వేషన్లు అవసరమో, అప్పటివరకు రిజర్వేషన్లను సమర్థిస్తామని, సంస్థ తన పని తాను చేస్తుందని చెప్పారు.
రిజర్వేషన్ విధానానికి వ్యతిరేకమని డాక్టర్ భాగవత్ చెప్పినట్టు ఒక ఫేక్ వీడియో విస్తృతంగా వైరల్ అయింది. దీనిని దృష్టిలో ఉంచుకునే ఆయన ఈ వ్యాఖ్య చేశారు. దీనితో పాటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉపన్యాసాన్ని కూడా వక్రీకరించి మరొక వీడియో విడుదల చేశారు. మొత్తంగా సంఘపరివార్ మీద పన్నిన కుట్రగా ఇది బయట పడిరది. విద్యను , సాంకేతిక నైపుణ్యాన్ని దుర్వినియోగం చేయడం సరికాదన్న దృక్పథాన్ని వెల్లడిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘విద్య ఉంది. విద్య, మంచిది లేక చెడ్డదీ కాదు. శక్తి తటస్థమైనది (న్యూట్రల్). అది మంచిది, చెడ్డదీ కాదు. మీలో శక్తి ఉంటుంది. శక్తి ఉంది…దానికి మంచి, చెడు అన్న గుణాలు ఉండవు. ఉపయోగించే వాడి బుద్ధి ఏమిటి? దుష్టబుద్ధి ఉన్నవాడి సంగతేంటి? ఇది విద్యలో కూడా వస్తున్నది. దుష్టులు విద్యతో వివాదాలు లేవనెత్తుతున్నారు. నిన్న నేను ఇక్కడకు వచ్చేటప్పుడు ఒక విషయం విన్నాను, ‘సంఫ్‌ు వాళ్లు బయిటకు బాగా మాట్లాడుతుంటారు కానీ అంతర్గతంగా రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్తుంటారు… కానీ ఇదే విషయాన్ని బయటకు చెప్పలేరు’, అని వ్యాఖ్యానించే వీడియో ఒకటి బాగా సర్క్యులేట్ అవుతోంది. కానీ ఈ విషయం పూర్తిగా అసత్యం. ఎప్పటినుంచి రిజర్వేషన్లు వచ్చాయో, అప్పటి నుంచీ రాజ్యాంగబద్ధమైన రిజిర్వేషన్లను ‘సంఘం’ సంపూర్తిగా సమర్ధిస్తోంది. ఎవరికైతే రిజర్వేషన్లు అమలు చేస్తున్నారో, అవి వారికి ఎంతవరకు అవసరం అయితే అంతవరకూ అమలు చేయాలి… సమాజంలో భేదభావాలు కొనసాగి నంతకాలం రిజర్వేషన్లను అమలు చేయాలన్నది సంఘ అభిమతం. కానీ, ఈ వీడియోలో నేను బైఠక్ తీసుకుంటున్నట్టుగా దృశ్యాలు ఉన్నాయి. అది ఎప్పుడూ జరుగలేదు. కానీ, జరగనిదాన్ని కూడా జరిగినట్టు చూపగల శక్తి విద్యకు ఉంది… టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియాలు ఉన్నాయి. ఇక్కడ మంచి విషయాలూ ప్రచారంలోకి వస్తాయి, చెడ్డ విషయాలూ వస్తాయి. అది సోషల్ మీడియా తప్పు కాదు. సోషల్ మీడియాలో ఉండేవారిది. అటువంటి కపోలకల్పిత విషయాలను అమ్ముకొని, వివాదాలను లేవనెత్తడం కొందరి పని. దానితో మాకు సంబంధం లేదు.’ అని విస్పష్టంగా వెల్లడిరచారు డాక్టర్ భాగవత్.
విద్య గమ్యం, జ్ఞానం లక్ష్యం రైతుల శ్రమను తగ్గించమే!
ఇది ఒక అద్భుతమైన పని. స్వామీజీ (చినజీయర్) చెప్పినట్టు ఇది సంస్కారాన్ని ఇస్తుంది. సంఘం కూడా సంస్కారాన్ని గరిపే పనిచేస్తుంది. విద్యా భారతి విద్యారంగంలో ఆచార, సంప్రదాయాల పరంపర కలిగి పని చేస్తుంది. వాస్తవానికి పొట్ట నింపుకోవడానికి విద్య అవసరం లేదు. శక్తుంటే చాలు. అది ఉన్న వ్యక్తి విద్యావంతులను నియమించు కొని పని చేయిస్తాడు. దీనికయ్యే ఖర్చు తక్కువ కాదు.
విద్యతో పాటు జ్ఞానాన్ని ఇవ్వాలి. విద్యను బోధిం చడంతో పాటు దానిని సత్కార్యాల కోసం ఉపయో గించాలని చెప్పాలి. అణువును ఎలా విభజిస్తారో, అలాగే ఈ విద్యను నేను నీకు ఇచ్చాను, దీని ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసి రైతుల శ్రమను తగ్గించు. దీనితో అణుబాంబు తయారు చేసి పట్టణాలను ధ్వంసం చేయకు. ఇది జ్ఞానం… వివేకం. వివేకమే జ్ఞానము. మనకు ప్రకృతి నుంచి లభించినదానిని మంచి కోసం ఉపయోగించాలి. అందుకు అలవాటు కావాలి. అందుకు సంస్కారం ఉండాలి. అందుకోసం విద్య. కానీ విద్యాదానం తర్వాత ఇలా జరుగుతోంది? అందుకే, స్వామిజీ మహారాజ్ (చినజీయర్) చెప్పారు… ఈ విశాలమైన పరిసరాలు, చక్కగా నిర్మించిన భవనాలు, వీటిలో త్వరలోనే ప్రారంభం కానున్న విద్యాలయం… ఇవన్నీ బహిర్గతంగా కనిపించే విషయాలు. అవి శరీరంలో బుద్ధి చేసే పని చేస్తాయి. కానీ ఆత్మ ఏమిటి? ముక్తిని కల్పించే విద్యా సంస్కారం. ఈ విద్యా జ్ఞానం ` వివేకం, అలవాటు. మనం లోపలి ఆత్మను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటి అక్షరం, ఒకటి స్ఫూర్తి. భావంలేని అక్షరాలు నిరర్ధకమవుతాయి, హానికారకం కూడా కావచ్చు. ఒకవేళ భావానికి యోగ్యమైన అక్షరం లభించనప్పుడు అది ప్రకటితమే కాదు. కనుక రెండూ అవసరమే. భావానికి అనుగుణ మైన అక్షరం సరైంది. అక్షరాలు ఎంత భవ్యంగా ఉంటే అంతే భవ్యంగా భావం కూడా ఉండాలి (ఈ సందర్భంలోనే డాక్టర్ భాగవత్ రిజర్వేషన్‌ల ప్రస్తావన తెచ్చారు). ఇది ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే, ఇది ప్రాపంచిక భాషలో ఒక విజయం. మనం ఒక పెద్ద ప్రాజెక్టును ప్రారంభించాం. దాన్ని అంతర్జాతీయ అన్నాం. దానితో కీర్తి పెరుగుతుంది. ప్రజలు దీనిని చూసి ఆశ్చర్యపోయి వాప్‌ా చాలా భారీ పని జరిగింది అని అంటారు. ఎందుకంటారు? విద్యాభారతి 1952 నుంచి ఒక చిన్న గదిలో పది పదిహేనుమంది పిల్లలకు బోధించడం ప్రారంభించిన తర్వాత ఎటువంటి ఆటంకాలు ఎదురైనా పని చేస్తూ వచ్చింది. ఆ తపస్సు ఫలితం ఇది. విద్యాభారతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉన్నా కూడా వాటి గురించి ఆలోచిస్తారు. అలాగే విదేశీ భాషలో ‘స్వ’ అన్న భావం మారిపోకుండా, మార్చకుండా ప్రయత్నించాలి. ముఖ్యంగా, విదేశీ భాషను తీసుకున్నప్పుడు ఎక్కువ శ్రమ పడాలి. ఎందుకంటే, భావానికి భావం భాషే. అందుకే, మాతృభాష కావాలన్న కోరిక. (డా. భాగవత్ ప్రసంగం నుంచి)
కష్టాలను అధిగమించడం విద్యతోనే సాధ్యం
‘సా విద్యా యా విముక్తయే’ అన్నారు అంటే జీవితం పూలబాట కాదు. రాళ్లుంటాయి. ముళ్లుం టాయి. వాటిని తప్పించుకుని ముందుకెళ్లాలి. అది ఎలా వస్తుందంటే విద్య ద్వారా అని త్రిదండి రామానుజ చినజీయర్ స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. విముక్తి అంటే సంసారాన్ని త్యాగం చేయడం కాదు.. కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగడం. అది విద్య ద్వారానే సాధ్యపడుతుందని స్వామీజీ తెలిపారు. అలాంటి విద్య మనకు శిశుమందిర్ పాఠశాలల్లో దొరుకు తుంది అన్నారు. ‘ప్రధానమంత్రిగా మోదీ పీఠం ఎక్కే సమయానికి దేశంలో పరిస్థితులు ఏమంత మంచిగా లేవు. మోదీ ప్రధానమంత్రి అయ్యాక భారతదేశం విశ్వగురువుగా అవతరించింది. ప్రతి ఒక్కరు నేను భారతీయుడిని అని, హిందువుని అని సగర్వంగా చెప్పుకుంటున్నారు’ అని అన్నారు. నేను భారతీయుడ్ని అనే భావన ప్రతి ఒక్కరిలో రావాల న్నారు. తెలంగాణలో మాతృభాషకు అంత విలువలేదని.. ఉత్తర భారత దేశంలో మాతృ భాషకు విలువ ఎక్కువ అని గుర్తుచేశారు. భారతీయులు ప్రతి ఒక్కరినీ ఆహ్వానించాలి. ప్రతి చోటుకు వెళ్లాలి.. కానీ మన మూలాలను, పద్ధతులను మరిచి పోకూడదు. సనాతన ధర్మాన్ని విడనాడకూడదు అని స్వామీజీ అన్నారు. ధర్మం పక్షాన నిలవడమే పరమధర్మం అని శ్రీరాముడు చెప్పారని స్వామీజీ వివరించారు.
‘ఇవ్వడంలోనే ఆనందం’ పుస్తకావిష్కరణ
విద్యాభారతి క్షేత్ర సంఘటన మంత్రి లింగం సుధాకర్‌రెడ్డి రచించిన ‘ఇవ్వడంలోనే ఆనందం’పుస్తకాన్ని విద్యా భారతి క్షేత్ర అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని సుధాకరరెడ్డి అనుభవాలతో పాటు చుట్టుపక్కల పరిస్థితులు ఆధారంగా రాశారని తెలియజేశారు. పాఠశాల కార్యదర్శి విష్ణువర్ధన్ రాజు మాట్లాడుతూ,ఈ పాఠశాలకు లింగం సుధాకర్‌రెడ్డి అడుగడుగునా ఒక అమ్మలాగ ప్రేరణ కలిగించారని వివరించారు.
సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కార్యక్రమాన్ని యోజన చేసినప్పుడు ఎందరో సహకరించారు. వారందరినీ సభకు పరిచయం చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. మన పాఠశాలలు అన్నీ కూడా దాతల ద్వారా నిర్మించినవే. విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్‌కు మోహన్ భాగవత్ శంకుస్థాపన చేశారు. 2019 నుంచి ఆ స్కూల్ విజయవంతంగా నడుస్తోంది. ఇది రెండవ ఇంటర్నేషనల్ స్కూల్. ఈ విద్యాసంవత్సరం ఏడవ తరగతి వరకు క్లాసులు జరుగుతాయి. ఒక్కో ఏడాది ఒక్కో క్లాస్ పెంచుకుంటూ 10G2 వరకు తీసుకెళ్తామని అన్నారు.
యశోదమ్మ, పెంటారెడ్డిల భూదానంతో..
పాఠశాల ఆవరణలోనే ఏర్పాటుచేసిన సభా కార్యక్రమానికి విజ్ఞాన కేంద్ర కార్యదర్శి విష్ణువర్ధన్‌రాజు నాందీ ప్రస్తావన చేశారు. భీమిడి యశోదమ్మ, పెంటారెడ్డి 14 ఎకరాల భూమిని స్కూల్ నిర్మాణానికి విరాళంగా అందజేశారని ఆయన తెలిపారు. ఆ 14 ఎకరాల్లో ఒక ఎకరాన్ని నిరాశ్రయులైన మహిళలకు ఆశ్రయం ఇచ్చే వైదేహి ఆశ్రమానికి కేటాయించినట్టు తెలిపారు.
స్కూల్ భవంతిలో అత్యాధునిక సదుపాయాలతో వంటశాలను నిర్మించడానికి అరబిందో ఫార్మా వారు కోటి నలభై లక్షల రూపాయలు విరాళంగా అందజేశారని తెలిపారు. మొదటి దశలో నర్సరీ నుంచి ఏడవ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తారు. విలువలతో కూడిన విద్య కావాలంటే ప్రతి ఒక్కరు సరస్వతి విద్యాపీఠంలో పిల్లల్ని చేర్పించాలని కోరుకుంటున్నానని విష్ణువర్ధన్ రాజు అన్నారు. పాఠశాల నిర్మాణానికి సహకరించిన దాతలను ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ సత్కరించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల అధ్యక్షులు రమేష్ గుప్త నేతృత్వం వహించారు. ఎందరో ప్రముఖులు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
– రమ విశ్వనాథన్, క్షేత్ర ప్రచార ప్రముఖ్, విద్యా భారతి