కేంద్రంలో తమ ప్రభుత్వం వస్తే స్థిర, చరాస్తులపై ఆర్థిక, సంస్థాగత సర్వే నిర్వహిస్తామంటూ ఏప్రిల్ 7న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన మాట మార్చారు. ఏప్రిల్ 24న ఢిల్లీలో జరిగిన సామాజిక న్యాయసదస్సులో మాట్లాడుతూ ఈ సర్వే ఆస్తులను గుర్తించడానికి కాదు, ప్రజలకు ఏమేరకు అన్యాయం జరిగిందో తెలుసుకోవడానికి మాత్రమేనని చెప్పారు. కానీ ఇలా సదుద్దేశంతో చేయాలనుకున్న సర్వే దేశాన్ని కూల్చే కుట్ర ఎట్లా అవుతుందంటూ సమర్థించుకున్నారు.
గాంధీల కుటుంబానికి సన్నిహితుడు, ఇండియన్ ఒవర్‌సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ శ్యాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలు మరో దుమారం రేపాయి. ఏప్రిల్ 23న ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన, అమెరికాలో వారసత్వ పన్ను అమల్లో ఉందని, దాన్ని మనదేశంలోనూ అమల్లోకి తెస్తే బాగుంటుందన్న రీతిలో చెప్పారు. ‘‘అమెరికాలో వంద మిలియన్ డాలర్ల ఆస్తి కలిగిన వ్యక్తి మరణిస్తే అందులో 55శాతం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. 45 శాతం మాత్రమే వారసులకు దక్కుతుంది. సంపాదించిన ఆస్తుల్లో సింహభాగం సహచర ప్రజల కోసం వదులుకోవాలని ఈ చట్టం చెబుతోంది. నాకు ఈ చట్టం నచ్చింది’’ అన్నారు. వాస్తవానికి ఈ వారసత్వ పన్ను చట్టం అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. రాహుల్, శ్యాంపిట్రోడా వ్యాఖ్యలతో కాంగ్రెస్ స్వీయరక్షణలో పడింది. ఆస్తుల పునఃపంపిణీ అంశాన్ని మేనిఫెస్టోలో పేర్కొనలేదని, వంశ పారంపర్య ఆస్తుల హక్కులపై శ్యాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమంటూ కాంగ్రెస్ సర్ది చెప్పే యత్నం చేసింది.
మేనిఫెస్టోలో ఏముంది?
‘దేశవ్యాప్తంగా సామాజిక-కులగణను చేపట్టడం ద్వారా వారి సామాజిక ఆర్థిక స్థితిగతులపై స్పష్టమైన అవగాహనకు వచ్చిన తర్వాత సేకరించిన సమాచారం ఆధారంగా గట్టిచర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములు, భూసంస్కరణల చట్టం కింద మిగుల భూములను పేదలకు పంచుతాం’ అని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అంటే విధానాల్లో తగిన మార్పులు తీసుకొని రావడం ద్వారా సంపద, ఆదాయం విషయంలో దేశంలో పెరుగుతున్న అంతరాలను పరిష్కరిస్తామన్న అర్థం రావడం వివాదానికి కారణమైంది. మేనిఫెస్టోలో పేర్కొన్న ఈ అంశం వెనుక ఆస్తుల పంపిణీ చేసే రహస్య అజెండా ఉన్నదని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ముస్లిం అనుకూల వైఖరికి 2004లో యూపీఏ ప్రభుత్వం నియమించిన రంగనాథ్ మిశ్రా కమిటీ సిఫారసులను వారు ఉదహరిస్తున్నారు. ఉద్యోగాల్లో ముస్లింలకు పదిశాతం, ఇతర మైనారిటీ వర్గాలకు ఐదు శాతం చొప్పున రిజర్వేషన్ కల్పించా లని, అన్ని మతాల్లో ఎస్సీ స్థాయి కల్పించవచ్చునని ఈ కమిటీ సిఫారసు చేసింది. తర్వాతికాలంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ముస్లింలకు రిజర్వేషన్ కల్పించడానికి యత్నించినా కోర్టులు అడ్డుకున్న సంగతిని బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు.
కాంగ్రెస్‌పై మోదీ ముప్పేట దాడి
కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల్లో బలమైన అస్త్రాలుగా మార్చుకున్నారు. వారసత్వ పన్ను మాటను ప్రస్తావిస్తూ ప్రధాని, పన్నులతో పీడించడంలో మరణించినవారిని కూడా కాంగ్రెస్ వదిలేలా లేదంటూ ఎద్దేవా చేశారు. వారసులకు ఆస్తులు దక్కకుండా లాక్కుంటుందంటూ ‘‘జిందగీ కే సాథ్ భీ…జిందగీ కే బాద్ భీ’’ అనే ఎల్‌ఐసీ బహుళ ప్రజాదరణ పొందిన నినాదాన్ని అన్వయిస్తూ మోదీ దుయ్యబట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న ‘‘దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, కులగణన’’ చేపడతామన్న అంశంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. 2006లో మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలతో ఈ హామీని జత చేస్తూ ‘కాంగ్రెస్ దేశ ప్రజల సంపదను ఎక్కుమంది పిల్లలున్నవారికి పంచడానికి యత్నిస్తోంది’ అంటూ చేస్తున్న దాడికి కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మోదీ ప్రధానంగా మూడు సందర్భాల్లో కాంగ్రెస్‌పై ఎదురు దాడికి దిగడం కనిపిస్తుంది. ఏప్రిల్ 22న ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఆయన మాట్లాడుతూ ‘‘సంపద పునఃపంపిణీ చేస్తానని మ్యానిఫెస్టోలో పేర్కొనడం, అర్బన్ నక్సల్ మనస్తత్వానికి చిహ్నం’’ అని విమర్శించారు. ఏప్రిల్ 23న టోంక్-సవాయ్ మాధోపూర్ (రాజస్థాన్) నియోజకర్గంలో జరిపిన ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘‘యూపీఏ పాలనలో ఆంధప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ కోటాను తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్ సదుపాయం కల్పించింది’ అని ఆరోపిం చారు. అంతకు రెండు రోజుల ముందు రాజస్థాన్ లోని బాన్స్‌వారా లో మాట్లాడుతూ, దేశ వనరులపై ముస్లింలకు తొలి హక్కు ఉంటుందని కాంగ్రెస్ వ్యాఖ్యానించిందని, దేశ సంపదను ‘‘ఎక్కువమంది పిల్లలున్నవారికి’’, ‘‘చొరబాటుదార్లకు’’ పంపిణీ చేస్తుందని విమర్శించారు. నిజానికి ఈ ఆస్తులు, బంగారం సర్వే నిర్వహించి పునః పంపిణీ చేసేవిధానం అర్బన్ నక్సల్స్‌దని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మధ్య తరగతి మహిళల మంగళ సూత్రాలపై కూడా కాంగ్రెస్ కన్ను పడిందని మోదీ తీవ్ర విమర్శ చేశారు.
కాలంచెల్లిన విధానాలతో కాంగ్రెస్
కాంగ్రెస్ మైనారిటీల బుజ్జగింపు, సెక్యులరిజం, భ్రమలతో కూడిన విశ్వాసం (మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలు మతపరమైన హింసకు గురవుతున్నారన్న భ్రమ) అనే మూడు కాలం చెల్లిన విధానాలను పట్టుకొని వేలాడుతోంది. ‘మతపరమైన కోటా’ అనే కాలం చెల్లిన చట్రం నుంచి బయటకు రాలేక పోతోంది. ఇది రాజ్యాంగ కర్తలు అప్పట్లోనే పూర్తిగా వ్యతిరేకించిన అంశం. అదేవిధంగా ‘జాతీయ వనరులపై మైనారిటీలకు మొదటి హక్కు’ అన్న మన్మోహన్ సింగ్ ‘అభ్యంతరకమైన’ వ్యాఖ్యలనూ ఆ పార్టీ ఖండించలేకపోతోంది. ‘ముస్లింలు ఏవిధంగా ప్రతిస్పందిస్తారు’ అనేదానిపై ఆధారపడి తన విధానాలను కొనసాగించడంతో, కాంగ్రెస్ ముస్లిం అనుకూల పార్టీగా పేరు సుస్థిరం చేసుకుంది. యూనిఫామ్ సివిల్‌కోడ్, 370వ రాజ్యాంగ అధికరణ రద్దు అంశాలపై కూడా కాంగ్రెస్ రాజ్యాంగం ఆధారంగా కాకుండా కేవలం ‘ముస్లింల స్పందన ఎట్లావుంటుందో’ అన్న కోణంలోనే స్పందించడం గమనార్హం. స్వాతంత్య్రానికి ముందు కూడా ‘వందేమాతరం’ జాతీయ గీతంగా చేయాలన్నదానిపై జరిగిన చర్చలోనూ, జాతీయ పతాకానికి మూడు రంగుల విషయంలో కూడా కాంగ్రెస్ విధానాన్ని కేవలం ఈ ‘ముస్లిం అనుకూల’ విధానమే శాసించింది.
సామ్యవాద విధానం
1955లో ఆవడి (చెన్నై పశ్చిమ శివారు) కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమా వేశం ‘సామ్యవాద అభివృద్ధి విధానాన్ని’ అధికారికంగా ఆమోదించింది. అక్కడే నెహ్రూ మాట్లాడుతూ ‘‘సోషలిజం లేదా కమ్యూనిజం సంపద పంపిణీకి దోహదం చేస్తాయి. కానీ మనదేశంలో ప్రస్తుతం సంపద లేదు, కేవలం పేదరికం తప్ప’’ అన్నారు. తర్వాత ఆయనే ‘‘మనం సంపదను సృష్టించాలి, దాన్ని పంపిణీ చేయాలి’’ అంటూ కొత్తపల్లవి అందుకున్నారు. బహుశా రాహుల్ తన ముత్తాతగారి మాటల్లోని కొన్ని అంశాలను ఇప్పుడు బయటకు తీశారని చెప్పాలి. ఈ సంపదను ఏవిధంగా పంచాలనే రాహుల్ సందేహాన్ని, శ్యాంపిట్రోడా వంశపారంపర్య పన్ను విధానం అమలు ద్వారా దీన్ని సాధ్యం చేయవచ్చునని చెప్పకనే చెప్పారు. 1976లో కాంగ్రెస్ రాజ్యాంగ కర్తలను ఏమాత్రం పట్టించుకోకుండా ఎటువంటి కారణం లేకుండా ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’ అనే పదాలను రాజ్యాంగ పీఠికలోకి ఎందుకు చొప్పించాల్సివచ్చింది? పరిశీలిస్తే నాటి ఇందిరా గాంధీ, నేటి రాహుల్ గాంధీ విధానాల్లో ఎంతమాత్రం తేడాలేదన్నది స్పష్టమవుతోంది. అయితే ఈ రెండు అంశాలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేనప్పటికీ, ఆపార్టీ ‘రహస్య అజెండా’ ఇదేనన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తం కావడానికి దోహదం చేశాయనే చెప్పాలి.
సీడీఎస్‌పై మోదీ దాడి
దేశ ఆర్థికాభివృద్ధి పేరుతో 1963, 1974 సంవత్సరాల్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ‘కంపల్సరీ డిపాజిట్ స్కీమ్’ (సీడీఎస్)ను అమలు చేసాయి. దీని ప్రకారం దేశంలోని పన్ను చెల్లింపుదార్లు తమ సంపాదనలో కొంత మొత్తాన్ని మూడు నుంచి ఐదేళ్ల• డిపాజిట్ చేయాలి. ఆ కాలం తర్వాత ఆయా మొత్తాలను ప్రభుత్వం తిరిగి చెల్లించింది. గతంలో ఈపని కాంగ్రెస్ చేసింది, ఇప్పుడు మళ్లీ చేస్తుందంటూ నరేంద్రమోదీ దాడి చేయడం మొదలుపెట్టారు. ఎమర్జెన్సీ విధించడానికి ఏడాది ముందు అంటే 1974లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం మళ్లీ ఇటువంటి స్కీమ్‌ను అమల్లోకి తెచ్చింది. విపక్షాలు తీవ్రంగా వ్యతి రేకించాయి. నాడు దేశంలో ద్రవ్యోల్బణం ఏకంగా 28.6 శాతానికి చేరుకుంది. 1971నాటి బంగ్లాదేశ్ విమోచన యుద్ధం ప్రభావం దేశంపై ఇంకా బలీయంగా కొనసాగుతున్న కాలమది. దీని ప్రకారం డిపాజిట్ చేయాల్సిన మొత్తాన్ని 4% నుంచి 18% వరకు నిర్ణయించారు. దీనిపై వ్యతిరేకత రావడంతో ఈ స్కీమ్‌ను ఎత్తేస్తానని కాంగ్రెస్ 1984 ఎన్నికల ముందు వాగ్దానం చేయక తప్పలేదు.
సంపదసృష్టి వల్లనే అభివృద్ధి సాధ్యం
సంపద పంచే పద్ధతిని 1917లో బోల్షవిక్ విప్లవంతో లెనిన్ రష్యాలో తెచ్చారు. యుఎస్‌ఎస్‌ఆర్ కుప్పకూలిపోవడంతో అక్కడ కమ్యూనిస్టులు దెబ్బతిన్నారు. రష్యా మాదిరిగానే చైనా 1949లో సంపదను పంచినప్పటికీ, రష్యా వైఫ్యం దృష్ట్యా డెంగ్ జియావోపింగ్ సంపద పంచడం స్థానే, సంపద సృష్టిపై దృష్టి సారించారు. మార్కెట్ ఆర్థికసూత్రాలు పాటించడంతో చైనా సక్సెస్ అయింది. సంపద పంచుతానంటే, దాన్ని సృష్టించడానికి ఎవరైనా ముందుకు ఎట్లా వస్తారు? పొలాల్లో పనిచేయడమే కష్టపడటం కాదు, ఇతర రంగాల్లో కూడా కష్టం అనేది ఉన్నది. పెట్టుబడి పెట్టేవాడు సృజనాత్మకంగా ఆలోచించి ముందు కెళతాడు. లాభాలు సంపాదించ డమే కాదు పదిమందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తాడు. ఇటువంటివారిని వర్గశత్రువులుగా పరిగణించడం భారత్‌లో అలవాటైపోయింది. సోషలిస్టు ఆర్థికవ్యవస్థపై నమ్మకంతో పెరగడమే ఇందుకు కారణం. సంపద సృష్టికర్తలను కమ్యూనిస్టు ఫిలాసఫీ వర్గశత్రువులగా ప్రచారం చేసింది. దానికి పరోక్షంగా కాంగ్రెస్ మద్దతిచ్చింది. మార్కెట్ ఆధారిత వ్యవస్థలో ఆర్థిక అసమానతలు పెరగడం అత్యంత సహజం. ఈ అసమానతలు తగ్గించాల్సిందే. కానీ అందుకు వారు చెబుతున్నది పూర్తిగా విఫలమార్గం! సంపద సృష్టికి ప్రోత్సాహం ఇవ్వాలనేది ప్రాథమిక సూత్రం. బెంగాల్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి బి.సి.రాయ్ (బిమన్‌చంద్రరాయ్) పదవిలో ఉన్నంత కాలం దేశంలోనే కలకత్తా నంబర్ వన్‌గా ఉండేది. ఇప్పుడు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, తదితర రాష్ట్రాలను ఎందుకు చెప్పుకుంటున్నాం? 34 సంవత్సరాలు కమ్యూ నిస్టులు, 2011నుంచి కొనసాగుతున్న మమతా బెనర్జీ పాలనకూడా కలిపితే 50 ఏళ్ల కాలం సంపద సృష్టిపై దృష్టి పెట్టక పోవడమే ప్రధాన కారణం.
కాంగ్రెస్ ఒక విరోధాభాస
సామ్యవాదాన్ని అధికారికం చేసింది కాంగ్రెస్సే. సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టింది కూడా ఆపార్టీనే. ఇప్పుడు ఆర్థిక, కులగణనపై మాట్లాడు తున్నదీ అదే. పరస్పర విరుద్ధ విధానాలను ఎప్పటి కప్పుడు అనుసరించే కాంగ్రెస్ ఒక విరోధాభాసగా మిగిలిపోయింది. మరిప్పుడు సామాజిక ఆర్థిక కులగణనపై రాహుల్ మాట్లాడుతున్నారంటే, ప్రధాన కారణం కాంగ్రెస్‌కు స్పీచ్ రైటర్లుగా వామపక్ష భావజాలికులు ఉండటమే. ఈశాన్య ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయకుమార్ జేఎన్‌యూలో వామపక్ష విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్న కాలంలో, పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన కేసులో ఉరిశిక్షకు గురైన అఫ్జల్ గురుకు అనుకూలంగా కార్యక్రమాన్ని నిర్వహించిన వ్యక్తి! ప్రస్తుతం ఈయన రాహుల్ ఆంతరంగికుల్లో ఒకడు. కాంగ్రెస్‌పై లెఫ్ట్ లిబరల్స్ ప్రభావానికి ఇదొక ఉదాహరణ మాత్రమే!
– జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్