మణిపూర్‌లో ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్న ప్రశాంత పరిస్థితులను భగ్నం చేసేందుకు పదే పదే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా, స్థానికేతరులను గుర్తించి తిరిగి పంపించే ప్రయత్నాలు తీవ్రతరం కావడం నిన్నటివరకూ ఆడింది ఆట, పాడింది పాటగా సాగించుకున్న చట్ట వ్యతిరేక శక్తులకు చెక్‌ ‌పడింది. అయినప్పటికీ వారు తమ ప్రయత్నాలు ఆపలేదని మే 18వ తేదీ అర్థరాత్రి జరిగిన సంఘటనతో అవగతమవుతుంది.

మీరా పైబీలుగా పిలిచే మెయితీ గ్రామాలలోని నిరాయుధులైన మహిళా వాలెంటీర్లను కూకీ తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్టు అస్సాం రైఫిల్స్‌కు సమాచారం అందడంతో వారు అప్రమత్తం అయ్యారు. ఘటన దిగువ కొండ ప్రాంతమైన బిష్ణుపూర్‌ ‌జిల్లాలోని ఉయోక్‌ ‌గ్రామానికి సంబంధిం చింది. కొండ ప్రాంతంలో మే 18వ తేదీ రాత్రి తీవ్రవాదుల కదలికలను అస్సాం రైఫిల్స్ ‌బృందం పసిగట్టింది. మెయితీ మహిళా వాలెంటీర్లను లక్ష్యంగా చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో బఫర్‌ ‌జోన్‌ ‌సమీపానికి తీవ్రవాదులు రావడంతో పరిస్థితి తీవ్రమైంది.. రాత్రి సుమారు 10.30 గంటల ప్రాంతంలో భారీగా ఆయుధాలతో వచ్చిన తీవ్రవాదులు మహిళా బృందంపై దాడి ప్రారంభించారు.

దీనికి తక్షణమే అస్సాం రైఫిల్స్ ‌తమ దళాలను, 81 ఎంఎం మోర్టార్లు సహా అత్యాధునిక ఆయు ధాలను మోహరించి ప్రతిస్పందించింది. తీవ్ర వాదులు, అస్సాం రైఫిల్స్ ‌మధ్య తుపాకులతో పోరు అర్థరాత్రి ఒంటిగంట వరకూ సాగింది. భద్రతా దళాల నుంచి తీవ్ర ప్రతిదాడిని ఎదుర్కోవడంతో తీవ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు. ఫలితంగా, అస్సాం రైఫిల్స్ ఆ ‌ప్రమాదకర ప్రాంతం నుంచి 75మంది మహిళా వాలెంటీర్లను సురక్షితంగా కాపాడారు. మణిపూర్‌లో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించి, శాంతి భద్రతలను కాపాడడానికి తాము కట్టుబడి ఉన్నామని అస్సాం రైఫిల్స్ ‌పునరుద్ఘాటించింది. ‘భారతీయ సైన్యం- అస్సాం రైఫిల్స్ ‌మణిపూర్‌లో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించి, శాంతి భద్రతలను కాపాడడానికి కట్టుబడి ఉన్నామని’ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

మూతపడ్డ ఇంఫాల్‌ ‌మార్కెట్టు

సమాంతరంగా చోటు చేసుకున్న ఒక పరిణామంలో, ఖ్వైరంబంద్‌ ‌బజార్‌లో బజార్‌ ‌షాప్‌ ‌యజమానుల సమాజం 24 గంటల బంద్‌ను ప్రకటించడంతో ఇంఫాల్‌ ‌స్తంభించింది. ఈ చర్య క్షీణిస్తున్న శాంతి భద్రతల పట్ల ఆందోళనలను పట్టి చూపడమే కాకుండా, కూకీ-జో, మెయితీ తెగల మధ్య కొనసాగుతున్న సంఘర్షణను మరింత సంక్లిష్టం చేస్తోంది. మే 13 అర్ధరాత్రి నుంచి మరునాడు అర్ధరాత్రి వరకూ జరిగిన బంద్‌ ‌వ్యాపార కార్యకలాపాలను నిర్వీర్యం చేయడమే కాకుండా, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. రాష్ట్రం మొత్తానికీ సరఫరా కేంద్రం కావడంతో రద్దీగా ఉండే కొన్ని ప్రాంతాలలో నిశ్శబ్దం ఆవరించింది. ఉదయంపూట కళకళలాడే పౌనా బజార్‌ ‌మసీద్‌ ‌రోడ్డు కూడా నిర్మానుష్యమైంది. వీటితో పాటు పలు మార్కెట్లు మూతపడ్డాయి.

ఈ ప్రాంతంలో పెరుగుతున్న సమస్యల కారణంగానే బంద్‌ ‌జరిగినట్టు తెలుస్తోంది. చిన్న, భారీ దుకాణాల యాజమాన్యాలతో కూడిన బజార్‌ ‌దుకాణాల యాజమాన్య సమాజం ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలకు స్పందనగా ఈ చర్యను చేపట్టాలని నిర్ణయించారు. ముఖ్యంగా, తంగల్‌ ‌బజార్‌కు చెందిన వారిని రాత్రిపూట దాడి చేయడంతో, ఆ ప్రాంత ప్రజలలో అశాంతి, భయం నెలకొన్నాయి. ఈ దాడులకు ప్రతిస్పందనగా, మే 13వ తేదీన మణిపూర్‌ ‌పోలీసులు చెప్పుకోదగిన సంఖ్యలో అరెస్టులు చేశారు. ఐదుగురు మైనర్లు సహా ఏడుగురు వ్యక్తులను ఈ రాత్రి దాడులలో జోక్యం కారణంగా అదుపులోకి తీసుకున్నారు. సిసిటివి ఫుటేజ్‌ ‌ద్వారా వీరిని గుర్తించారు.

పోలీసులు తక్షణమే స్పందించినప్పటికీ, ఉద్రిక్తతలు తీవ్రంగానే ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఖుముఖ్చమ్‌ ‌జాయ్‌ ‌కిషన్‌ ఇటువంటి ఘటనలకు పాల్పడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆ ప్రాంతంలో నెలకొన్న అశాంతిని తొలగించి, వ్యాపార వర్గంలో భద్రతా భావాన్ని పునరుద్ధరించాలన్నది ఆయన లక్ష్యం. కొనసాగుతున్న తెగల మధ్య ఘర్షణ నేపథ్యంలో జరిగిన ఈ బంద్‌, ‌ప్రజలలో నెలకొన్న భయాన్ని పట్టి చూపుతోంది. వ్యాపార లావాదేవీలు నిర్వీర్యం కావడం అన్నది స్థానిక ఆర్ధిక వ్యవస్థను ప్రభావితం చేయడమే కాదు, మణిపూర్‌లో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు అద్దం పడుతుంది. ఇటీవల జరిగిన ఘటనలు రాష్ట్ర స్థిరత్వం, విధించిన భద్రతాచర్యల సామర్ధ్యాన్ని గురించి ఆందోళనను కలిగిస్తున్నాయి.

పెరుగుతున్న హింస, ఉద్రిక్తతలతో మణిపూర్‌ ‌తలపడుతుండగా, అస్సాం రైఫిల్స్ ‌మీరా పెయిబీలను కాపాడడం అన్నది ఆశాకిరణంలా కనిపిస్తుంది. ఈ అస్థిర పరిస్థితులను దాటుకొని, గత ఏడాదిగా తమ జీవితాలను స్తంభింప చేస్తున్న సంఘర్షణను ప్రజా నాయకులు అంతం చేయాలని మణిపూర్‌ ‌ప్రజలు కోరుకుంటున్నారు.

– ఆర్గనైజర్‌ ‌నుంచి

About Author

By editor

Twitter
YOUTUBE