తన కుటిల రాజకీయంతో సరిహద్దు రాష్ట్రాలను కూడా కాంగ్రెస్ పార్టీ రావణ కాష్టంలా మార్చేసింది. అస్సాం, బెంగాల్, పంజాబ్ అందుకు మంచి ఉదాహరణ. ఈ మూడు రాష్ట్రాలలో పంజాబ్, అస్సాం వేర్పాటువాదంతో దశాబ్దాల పాటు తల్లడిల్లిపోయాయి. పశ్చిమ బెంగాల్ చొరబాటుదారులతో బాధపడుతున్నది. క•ంగ్రెస్ క్షీణదశకు వచ్చిన తరువాత దాని పాత్రను ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహిస్తున్నది. దేశ సమైక్యతకు కాంగ్రెస్ ఎంత చేటు చేసిందో, ఆప్ అంతకు మించి చేటు చేస్తున్నది. పంజాబ్‌లో ఆప్ వచ్చిన తరువాత మళ్లీ ఖలిస్తానీ వాదం పెరిగిపోయింది. ఆప్ జాతీయ కన్వీనర్ ఖలిస్తానీ ఉగ్రవాద నేతల ఇళ్లలో ఆతిథ్యం పొందిన సంగతి ఒక వాస్తవం. సంత్ జర్నయిల్ సింగ్ భింద్రన్‌వాలే వంటి భయానక ఉగ్రవాదిని పెంచి పోషించిన ఘనత ఇండిరాగాంధీకి దక్కింది. ఇప్పుడు ఆప్ వేర్పాటువాదులు రెచ్చిపోతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. ఖలిస్తానీ తీవ్రవాదిని విడిపించేందుకు అరవింద్ కేజ్రీవాల్ డబ్బులు తీసుకున్నాడని విదేశీ గడ్డ మీద నుంచి అల్లరి చేస్తున్న ఖలిస్తానీ సానుభూతి పరులే చాటుతున్నారు. 2024 లోక్‌సభ పోరు ఈ కుటిల రాజకీయాన్నే ప్రతిబింబిస్తున్నది.
పోటీకి దిగిన వారు తమకు రాజ్యాంగం మీద విశ్వాసం లేదని బాహాటంగానే చెబుతున్నారు. ఎక్కువమంది జైళ్లలోనే ఉన్నారు కూడా. నామినేషన్లు కూడా అక్కడి నుంచే వేయవచ్చు. భారతీయ వ్యవస్థల మీద నమ్మకం లేకపోయినా పోటీ ఎందుకు? పోటీ పేరుతో వేర్పాటువాదులు, సానుభూతిపరులు ఏకం కావడానికేనట. వీరిలో గతంలో లోక్‌సభకు వెళ్లివచ్చిన వారు కూడా ఉన్నారు. ఎన్నికలలో పోటీ చేసిన అనుభవం, గెలిచిన అనుభవం కూడా వారి నేతలకు ఉన్నాయి. రాజ్యాంగాన్ని నమ్మం, అయినా అది ఇచ్చిన హక్కుతో పార్లమెంటులో ప్రవేశిస్తాం అంటున్నారు వీరు. దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి? ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? దీనితో ఒక విషయం స్పష్టం. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కును భారతదేశ విచ్ఛిత్తికి యథేచ్ఛగా ఉపయోగించు కోవాలని వేర్పాటువాదులు అనుకుంటున్నారు. దేశంలోని ముస్లిం మతోన్మాదులు, మావోయిస్టులు, చర్చ్ ప్రేరేపిత వేర్పాటువాదులు చేస్తున్నదే పంజాబ్‌లో ఖలిస్తానీ వేర్పాటువాదులు కూడా చేస్తున్నారు.
ఆపరేషన్ బ్లూస్టార్‌తో ఎప్పటికీ ఆరని చిచ్చు రగిల్చిన కాంగ్రెస్ పంజాబ్‌ను దాని ఖర్మానికి దానిని వదిలేసింది. అక్కడ అధికారంలో ఉన్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలతో జైలులో ఉన్నారు. దేశద్రోహం కేసుకు దగ్గరగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో పంజాబ్ ఎన్నికలు ఎలాంటి ఫలితాలను వెల్లడిస్తాయి?
2019 లోక్‌సభ ఎన్నికలతో పోల్చి చూస్తే ఈసారి పంజాబ్‌లో కొంత విపరీత పరిణామం కనిపిస్తున్నది. అప్పటి కంటే ఇప్పుడు ఎక్కువ మంది ఖలిస్తానీ మద్దతుదారులు లోక్‌సభలోకి రావడానికి పోటీ పడుతున్నారు. సిమ్రన్‌జిత్ సింగ్ మాన్ (అకాలీదళ్-అమృత్‌సర్) సహా ఎనిమిది మంది కరడుగట్టిన వేర్పాటువాదులు బరిలో ఉన్నారు. వారిస్ పంజాబ్‌దె అధిపతి అమృత్‌పాల్ సింగ్ కూడా పోటీలో ఉన్నారు. ప్రస్తుతం ఇతడు జైలులో ఉన్నాడు. నిజానికి 2022లో సంగ్రూర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో సిమ్రన్‌జిత్ పోటీ చేశారు. రెండేళ్ల తరువాత ఇప్పుడు జరుగుతున్న సాధారణ ఎన్నికలలో ఇంతమంది వేర్పాటువాదులు పోటీ చేయడానికి సంగ్రూర్ ఉప ఎన్నికే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ ఉప ఎన్నికలో సిమ్రన్‌జిత్ అధికార ఆప్ అభ్యర్థి గుర్మెయిల్ సింగ్‌ను 5,822 ఓట్ల తేడాతో ఓడించారు. ఇప్పుడు సిమ్రన్‌జిత్ మరొక ఆరుగురిని కూడా పోటీ చేయిస్తున్నారు. ఖుష్పాల్‌సింగ్ మాన్, బల్దేవ్‌సింగ్ గాగ్రా, అమృత్‌పాల్ చంద్రా, మణీంద్రపాల్ సింగ్ వరసగా ఆనందపూర్ సాహెబ్, ఫరీద్‌కోట, లూధియానా, పటియాలాల నుంచి పోటీ చేస్తున్నారు. హర్జిత్‌సింగ్ విర్క్, ఖజానా సింగ్ కర్నాల్, కురుక్షేత్ర నియోజకవర్గాల నుంచి పోటీ పడుతున్నారు. ఖదూర్ సాహెబ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అమృత్‌పాల్ అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్నాడు.
ఇలాంటి వాతావరణంలో బీజేపీ తొలిసారి పంజాబ్‌లో స్వతంత్రంగా పోటీ చేస్తున్నది. అనుకున్నట్టుగానే రైతుల పేరుతో చెలామణి అవుతున్న విద్రోహశక్తుల నుంచి పార్టీకి ప్రతిఘటన ఎదురవుతున్నది. రాష్ట్రంలోని 13 స్థానాలకు ఏడో దశలో జూన్ 1న పోలింగ్ జరుగుతుంది. అన్ని స్థానాలకు బీజేపీ పోటీ పడుతున్నది.
కానీ పంజాబ్‌లో ఒంటరిగా పోటీ చేస్తున్నప్పటికీ అనూహ్యమైన ఫలితాలను బీజేపీ సాధిస్తుందని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ పార్టీ ఇప్పుడు మొదటిస్థానంలో ఉందని ఆయన ప్రకటించారు.ఫరీద్‌కోట నుంచి పోటీ పడుతున్న హన్సరాజ్ హన్స్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి షెకావత్ హాజరయ్యారు. రెండేళ్ల క్రితం బీజేపీని వీడి శిరోమణి అకాలీదళ్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే సుఖ్‌జిత్ కైర్ సాహి తిరిగి బీజేపీలో చేరారు. ఎన్నికల ముందు ఇలాంటి చేరికలు, వీడ్కోళ్లు సహజమే అయినా సుఖ్‌జిత్ చేరిక వేళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్ చెప్పిన విషయాలను గమనించవలసి ఉంటుంది. హిందువులు, సిక్కులకు మధ్య వైరుధ్యాలను పెంచడానికి కాంగ్రెస్ తన ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసిందని ఆయన అన్నారు. గతంలో ఏనాడూ అయోధ్య రామమందిరం గురించి ప్రస్తావించని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు రాముడి మీద విమర్శలు చేస్తున్నారు. కులాలు, మతాలు ఆధారంగా విభజించడానికి పాకిస్తాన్ కూడా చేయలేని స్థాయిలో కాంగ్రెస్ నాయకులు అంబికా సోనీ, ఇంకొందరు రాష్ట్ర నాయకులు చేశారని కూడా జాఖడ్ చెప్పారు.
మళ్లీ వేర్పాటువాద రాజకీయాలు చూద్దాం. అమృత్‌పాల్‌కు సిమ్రజిత్‌సింగ్ మాన్, పరంజిత్ కౌర్ ఖల్డా మద్దతు పలికారు. ఈ ఇద్దరు 2019 ఎన్నికలలో పోటీ చేసి రెండు లక్షలకు పైగా ఓట్లు సాధించారు. ఇప్పుడు అమృత్‌పాల్‌కు మద్దతుగా తన పార్టీ అభ్యర్థిని సిమ్రన్‌జిత్ పోటీ నుంచి విరమింప చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ దగా కారణంగా ప్రజలంతా తన పట్ల విశేషమైన అభిమానాన్ని చూపుతున్నారని అమృత్‌పాల్ తెలియచేశారు కూడా. అమృత్‌పాల్ ఖదూర్ సాహెబ్ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇతడి పూర్వికుల స్వగ్రామం ఈ నియోజకవర్గంలోనే ఉంది. అలాగే వందలాది ఖలిస్తానీ మద్దతుదారులు ఉన్న తరన్‌తరన్ ప్రాంతం కూడా ఇందులోదే. పైగా ఇది పాకిస్తాన్ సరిహద్దులోనే ఉంది. అమృత్‌పాల్ మీద అకాలీదళ్ విర్సా సింగ్ వాల్తోతాను నిలిపింది. చిత్రం ఏమిటంటే విర్సా సింగ్ కూడా ఒకప్పుడు ఖలిస్తానీ కార్యకర్త. అకాలీదళ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా ఖలిస్తానీ కార్యకర్తగా గతంలో తాను ఎన్ని ఘనకార్యాలు చేసినదీ విర్సాసింగ్ బాహాటంగానే చెప్పుకుంటున్నాడు.
ఫరీద్‌కోటలో పోటీ గురించి కూడా తెలుసు కోవాలి. ఇక్కడ ఖలిస్తానీ వేర్పాటువాదుల తరఫున పోటీలో ఉన్న అభ్యర్థి సరబ్‌జిత్ సింగ్. ఇందిరను హత్య చేసిన బియాంత్ సింగ్ కుమారుడు ఇతడు. కేవలం 12వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న సరబ్‌జిత్ ఎన్నికలలో పోటీ చేయడం ఇది నాలుగోసారి. గతంలో ఫతేగఢ్ సాహెబ్, భటిండాలలో పోటీ చేసినా ఓటమి పాలయ్యాడు. ఇతడు కూడా అమృత్‌పాల్ సింగ్ అనుచరుడే. సరబ్‌జిత్ సింగ్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చినవాడే. ఇతడి తాత సుచా సింగ్, తల్లి బిమల్ కౌర్ పార్లమెంట్‌లో అడుగు పెట్టిన వాళ్లే.
శివసేన నాయకుడు సుధీర్ సూరిని హత్య చేసిన సందీప్ సింగ్ సన్నీ కూడా ఈ ఎన్నికలలో పోటీ పడుతున్నాడు. ఇతడు కూడా అమృతపాల్ సింగ్ మద్దతుదారుడే. ఇతడు అమృత్‌సర్ నుంచి పోటీ చేస్తున్నాడు. అయితే ఇతడి అభ్యర్థిత్వాన్ని సిమ్రన్‌జిత్ సింగ్ మాన్ వ్యతిరేకించాడు. అక్కడ పోటీ విరమించి, తన కుమారుడు ఇమన్‌సింగ్ మాన్‌కు మద్దతు ఇవ్వమని సిమ్రన్‌జిత్ సందీప్ సింగ్‌ను ఆదేశించాడు. ఇక్కడ పోటీ తీవ్రంగా ఉంది.
మాకు భారత రాజ్యాంగం మీద ఎలాంటి విశ్వాసం లేదు. అయినా ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోనే పోటీ చేస్తున్నాం అంటున్నారు సమ్రన్‌జిత్ సింగ్ మాన్, అమృత్‌పాల్ సింగ్. ఉప ఎన్నికలలో నెగ్గిన సిమ్రన్‌జిత్ సింగ్ మాన్ జూలై 18, 2022న రాజ్యాంగం పట్ల విశ్వాసం ప్రకటిస్తూనే లోక్‌సభలో ప్రమాణం చేశారు. ఇంతకీ ఇంత మంది వేర్పాటు వాదులు లోక్‌సభకు పోటీ చేయడానికి వెనుక ఉన్న ఉద్దేశం ఏమై ఉండాలి? ఇందులో పెద్ద తర్కం ఏమీ లేదు. రాజ్యాంగం మీద విశ్వాసం లేదు అంటే, మరే భారతీయ వ్యవస్థ మీద వీరికి నమ్మకం లేదనే అర్ధం. అయినా పోటీ ఎందుకు అంటే, పార్ల మెంటులో ప్రవేశించడమే. అలాగే వేర్పాటువాదుల మధ్య ఐక్యతను సాధించడానికే. ఖదూర్ సాహెబ్ నియోజకవర్గంలో వేర్పాటువాద సానుభూతిపరుల ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకోసం వేర్పాటువాద శక్తులన్నీ ఏకమైనాయి. వేర్పాటువాదుల మధ్య ఐక్యత సాధించడానికి సిమ్రన్‌జిత్ శ్రమిస్తున్నాడు. వీళ్ల ప్రచారం ఏమిటి? దేశాన్ని చీలుస్తామనే. ప్రచార మంతా భారత వ్యతిరేకత చుట్టూనే తిరుగుతుంది. అందుకే ఈ ముఠాల మీద అధికారుల నిఘా కూడా గట్టిగానే ఉంది. అమృత్‌పాల్ మద్దతుదారులు నిర్వహించే ఒక యాప్‌ను అధికారులు నిలిపివేశారు. సిమ్రన్‌జిత్ సింగ్ మాన్‌కు ఎన్నికల అనుభవం తక్కువేమీ కాదు. ఇతడు మొదట చెప్పుకున్నట్టు 2022 ఉప ఎన్నికలలో నెగ్గి లోక్‌సభలో ప్రవేశించాడు. అంతకు ముందు 1989లో ఇతడి మద్దతుదారులు ఆరుగురు గెలిచారు. 1999లో సిమ్రన్‌జిత్ సంగ్రూర్ నుంచి గెలిచాడు. ఇప్పుడు కూడా ఈ ఎనిమిది మంది వేర్పాటువాదులు గెలిచి పార్లమెంటుకు వస్తారా? జూన్ 4 తరువాత తేలుతుంది.
– జాగృతి డెస్క