కేరళ సీపీఎం, కాంగ్రెస్‌ ఇం‌డీ కూటమికి తొలి అడుగులు వేశాయి. చిత్రంగా ఇండీ అక్కడే అకాల మరణం పొందింది. ఏప్రిల్‌ 26‌న రెండో దశలో పోలింగ్‌ ‌పూర్తి చేసుకున్న కేరళ ఈ ఎన్నికలలో చిత్రవిచిత్రాలను ప్రదర్శించింది. వయనాడ్‌లో పోటీ చేస్తున్న రాహుల్‌ ‌గాంధీని కేరళ సీపీఎం అక్షరాలా కాకులు పొడిచినట్టు పొడిచింది. ఆయనలో అపారమైన ఓటమి భయాన్ని కూడగట్టింది. ఆయన అమేథీలో కూడా పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి.

గాంధీ-నెహ్రూ వారసుడివి కదా! కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉత్తర భారతదేశంలో బీజేపీతో తలపడ వలసిన వాడివి! వయనాడ్‌ ఎం‌దుకు పరుగెత్తు కొచ్చావ్‌ అం‌టూ ఆది నుంచి వామపక్ష ద్వయం రాహుల్‌ను వేధించింది. రాహుల్‌ ‌కూడా పెద్ద పెద్ద మాటలతోనే ఎదురుదాడికి దిగారు. ఈ నేతలంతా పాత గోడవలని తిరగదోడుతున్నారు. ఇంతకంటే రసవత్తరమైన ఘట్టం సరిగ్గా పోలింగ్‌కు ముందు చోటు చేసుకుంది. బీజేపీ కేరళ ఇన్‌చార్జ్ ‌ప్రకాశ్‌ ‌జవదేకర్‌ను తాను కలుసుకున్నట్టు వామపక్ష కూటమి కన్వీనర్‌ ఈపీ జయరాజన్‌ ‌ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ సమావేశం కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ ‌విజయన్‌కు తెలిసే జరిగింది అంటున్నారు కాంగ్రెస్‌ ‌నాయకులు. ఏ విధంగా చూసినా ఈ ఎన్నికలలో కేరళ కొత్త పరిణామాలను వీక్షించింది.

ఏప్రిల్‌ 19‌న కొజికోడ్‌లో ఎన్నికల ప్రచారం చేస్తుంటే కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ ‌విజయన్‌కి జైళ్లు గుర్తుకొచ్చాయి. విజయన్‌ ‌మీద కూడా కేసులు ఉన్నాయి. ఆయన కుమార్తె మీద బంగారం స్మగ్లింగ్‌ ‌కేసు ఉచ్చు బిగుస్తున్నది. వీటి కారణంగానే చాలాకాలం క్రితమే ఆ రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన అధికారిని లోపల వేశారు. విజయన్‌కు జైలు తప్పదన్న సంకేతాలు ఆ మధ్య వచ్చాయి. విజయన్‌, ‘‌మాకు జైలు జీవితం కొత్త కాదు, మీ నానమ్మ (ఇందిర) ఎమర్జెన్సీ రోజులలో మమ్మల్ని (సీపీఎం) దాదాపు సంవత్సరన్నర జైల్లో ఉంచింది’ అంటూ రాహుల్‌కి గుర్తు చేశారు. జైలుకు పంపుతారన్న భయం మోదీకి సంబంధించినదైతే, రాహుల్‌ ‌నానమ్మను విజయన్‌ ఎం‌దుకు గుర్తు చేసుకున్నట్టు? ఒక కారణం ఉంది. ఇటీవలనే బీజేపీలో చేరిన మహారాష్ట్ర కాంగ్రెస్‌ ‌నేత అశోక్‌ ‌చవాన్‌కీ, విజయన్‌ ‌వ్యాఖ్యకీ గతితార్కిక సంబంధం వంటిదే ఉంది. కేసులు ఎక్కువైపోయిన అశోక్‌ ‌బీజేపీలో చేరడానికి ముందు సోనియా దగ్గరకు వెళ్లి, నేను ఈ వయసులో జైలుకు వెళ్లలేను అని వలవల ఏడ్చాడట. అంటే తాను బీజేపీలోకి వెళ్లిపోవడానికి ఆ శైలిలో అనుమతి తీసుకున్నాడని కమ్యూనిస్టుల భాష్యం. మేము అశోక్‌లా శోకించం, చిర్నవ్వుతో జైలుకు పోతాం అన్నదే విజయన్‌ ‌కవి హృదయం. అశోక్‌ ‌విలాపం గురించి ఒక సభలో పేరు చెప్పకుండా రాహుల్‌ ‌ప్రస్తావించారట. పోలింగ్‌ ‌వేళ సీపీఎంలో కాంగ్రెస్‌ ‌లోపాల గురించి జ్ఞానోదయం జరిగింది. పౌరసత్వ సవరణ చట్టం తెస్తామని బీజేపీ ప్రభుత్వం ప్రకటించినప్పుడు కాంగ్రెస్‌ ఎం‌దుకు నోరెత్తలేదంటూ విజయన్‌ ఇప్పుడు ఆవేశ పడుతున్నారు.

ఇండీ భాగస్వామి అని కూడా చూడకుండా రాహుల్‌ ‌సీపీఎం శీలాన్ని దారుణంగా శంకించారు. అన్నేసి ఆరోపణలు ఉన్నా విజయన్‌ని బీజేపీ ఎందుకు ఒక్కమాట కూడా అనడం లేదు? సీపీఎం అంటే బీజేపీకి బీ టీం అనేశారు. విజయన్‌ ‌తక్కువా ఏమిటి? మీ బావ వాద్రా మీద బీజేపీ ఎప్పుడు ఆరోపణలు మానేసింది? ఆయన సంస్థ రూ. 170 కోట్లు పెట్టి ఎలక్టోరల్‌ ‌బాండ్స్ ‌కొనుగోలు చేశాకే సుమ అని తగిలించారు. ఇంకో అడుగు ముందుకేసి, ఈ దేశాన్ని పాలించే సత్తా తనకు కాస్తో కూస్తో ఉందని రాహుల్‌ ‌ప్రజల ముందు రుజువు చేసుకోవాలన్నారు సీపీఎం నేత. రాహుల్‌ ‌నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారో చెప్పేశారు. రాహుల్‌ ఉత్తర భారతదేశంలోనే ఉండి, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను ఓడించాలని ప్రజలంతా ముక్తకంఠంతో అనుకుంటున్నారట. ఇంకా, అసలు రాహుల్‌కి శత్రువులం మేమా (సీపీఎం), కమలమా? అని నిలదీస్తున్నాను అన్నారు. కేంద్ర నిఘా సంస్థలు విజయన్‌ అరెస్టు చేయకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నాయో చెప్పాలంటూ ప్రియాంకా వాద్రా కూడా అన్నయ్యతో గళం కలిపారు. ప్రియాంక చాలా పెద్ద జోక్‌ ‌వేశారు అన్నారు విజయన్‌.

 ‌రాహుల్‌! ‌నీకు మా సీనియర్‌ ‌నాయకుడు అచ్యుతానందన్‌ ‌చక్కని బిరుదు ఇచ్చారు, గుర్తుందా? అని విజయన్‌ అడిగారు. మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌ ‌పదేళ్ల క్రితం ‘అమూల్‌ ‌బేబీ’ అంటూ రాహుల్‌కి నామకరణం చేసినా ఇవాళ్టికీ బేబీలాగే ఉన్నాడని చెప్పడమే విజయన్‌ ఉద్దేశం. అని ఆరోపణలు ఉన్న పినరయ్‌ ‌విజయన్‌ను ఇంతవరకు దర్యాప్తు సంస్థలు ఎందుకు అరెస్టు చేయలేదంటూ రాహుల్‌ ‌ప్రశ్నించడం సీపీఎం తట్టుకోలేకపోయిందనే చెప్పాలి. కేరళ ఎడథనట్టుకారలో జరిగిన ఎల్‌డీఎఫ్‌ ‌స్థానిక శాఖ సమావేశంలో పీవీ అన్వర్‌ అనే సీపీఎం నాయకుడు ఇంకా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. ‘‘నెహ్రూ- గాంధీ కుటుంబంలో ఇలా మాట్లాడేవారు ఉన్నారా? నెహ్రూ వంశంలో పుట్టి ఇలా మాట్లాడతారా? ఈ విషయంలో నాకు సందేహాలు ఉన్నాయి. రాహుల్‌గాంధీకి డీఎన్‌ఏ ‌పరీక్ష చేయాలి. రాహుల్‌కు నెహ్రూ వారసుడిగా ఉండే అర్హతే లేదు’ అని తేల్చారాయన. ప్రధాని మోదీకి రాహుల్‌ ఏజెంటుగా వ్యవహరిస్తున్నాడేమోనన్న అనుమానం కూడా మనందరికీ రావాలి అన్నాడు అన్వర్‌. ‌దీని మీద కాంగ్రెస్‌, ‌మోదీని ప్రసన్నం చేసుకోవడానికి మరీ ఇంతగా దిగజారాలా విజయన్‌ అని నిలదీసింది. కేరళ అసెంబ్లీలో విపక్ష నాయకుడు, అంటే కాంగ్రెస్‌ ‌పక్ష నేత వీడీ సతీశన్‌, ‘‌కేరళలో పినరయ్‌ ‌విజయన్‌ ‌బీజేపీ బాకాలా పనిచేస్తున్నారు’ అనేశారు. బీజేపీకీ, సీపీఎంకీ మధ్య ఉన్న ఈ బంధాన్ని ఈ ఎన్నికలలో ప్రజలే బయటపెడతారని కూడా శపించారు. ఎన్‌డీఏ వంటి నియంతృత్వ వ్యవస్థ మీద యుద్ధం ప్రకటించిన రాహుల్‌ ‌మీద విజయన్‌ ‌యుద్ధం చేస్తాననడమేమిటీ అంటారు సతీశన్‌. ‌నెల్లాళ్ల నుంచి పినరయ్‌ ఒకటే ఉపన్యాసం దంచుతున్నారు. అందులో ఎక్కడైనా మోదీ మీద పల్లెత్తు మాట ఉందా? అంటున్నారు.

రాహుల్‌ ‌ప్రత్యర్థిగా వయనాడ్‌లో పోటీ చేస్తున్న అనీ రాజా (సీపీఐ) భర్త డి. రాజా కూడా నోరు చేసుకోక తప్పలేదు. వయనాడ్‌ ‌సీపీఐ అభ్యర్థి అనీ రాజా భార్య. ‘పినరయ్‌ ‌విజయన్‌ని ఈడీ ఇంకా అరెస్టు చేయడం లేదేమిటని ప్రశ్నిస్తూ, అరెస్టు చేస్తే బాగుంటుందన్న అర్ధం వచ్చేటట్టు మాట్లాడుతున్న రాహుల్‌కు ఆ ప్రకటన వెనక్కి తీసుకోమని కేసీ వేణుగోపాల్‌ (‌కాంగ్రెస్‌ ‌ప్రధాన కార్యదర్శి) వంటివారు తొందరగా హితవు చెప్పాలని, రాహుల్‌ని అలా వదిలేయకూడదని రాజా కోరారు. పైగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌నీ, జార్ఖండ్‌ ‌ముఖ్యమంత్రి హేమంత్‌ ‌సోరెన్‌ని ఈడీ పట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో రాహుల్‌ ‌వంటి జాతీయ నాయకుడి నోటి నుంచి ఇలాంటి ప్రకటనలు జాలువారితే ఈడీకి మరింత ఉత్సాహం వచ్చే ప్రమాదం లేదా అంటారు రాజా.

రాజాకి ఇంకొక అనుమానం కూడా వచ్చి ఉండాలి. 2019 ఎన్నికలలో రాహుల్‌ ‌ప్రధాని అభ్యర్థిగా యూపీఏ బరిలోకి దూకింది. బొక్క బోర్లాపడింది. అందుకే కాబోలు యూపీఏ కొత్త అవతారం ‘ఇండీ’ ఈసారి ఆ పొరపాటు చేయలేదు. అయినా రేవంత్‌రెడ్డి వంటి కొందరు అత్యుత్సాహంతో రాహుల్‌ ‌జూన్‌ ‌మొదటివారంలో ప్రధానిగా ప్రమాణం చేస్తారని ప్రకటించారు. రేవంత్‌ ‌చెప్పారు కాబట్టి తాను ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమని రాహుల్‌ ‌నమ్ముతున్నారేమోనని రాజాకి అనుమానం వచ్చి ఉండాలి. ఇక్కడ పోటీ తీవ్రమైనదే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ ఇక్కడ అనీ, రాహుల్‌లతో తలపడ్డారు. వామపక్షాల ఓట్లు రాహుల్‌కు పడతాయని ఇంకా ఆశించడం కష్టం.

 ఇన్ని అన్నా, చివరికి నికార్సయిన వాస్తవం చెప్పేశారు రాజా. కేరళలో జరుగుతున్న పోరు లెఫ్ట్ ‌డెమాక్రటిక్‌ ‌ఫ్రంట్‌కీ, యునైటెడ్‌ ‌డెమాక్రటిక్‌ ‌ఫ్రంట్‌కి మధ్య మాత్రమే అన్నారు. అంటే పాత పోరే. కానీ బీజేపీ ఫాసిజాన్ని అడ్డుకోవడానికి పొత్తు లేకున్నా కాంగ్రెస్‌కు ఓట్లేస్తామని సీపీఎం నాయకుడు బీవీ రాఘవులు తెలుగునాడులో ప్రతిజ్ఞ చేశారు. ఇక్కడ సీపీఐకీ కాంగ్రెస్‌కీ పొత్తు కుదిరింది. ఎన్ని చెప్పండి! సీపీఎం, కాంగ్రెస్‌ ‌సర్దుబాటు స్వరూప స్వభావాలు, అంటే ఇండీ సర్దుబాట్లు ఎలా ఉన్నాయో చెప్పాలంటే ఒక ప్రహేళికను పూర్తి చేసినంత పని.

కాబట్టి ఇండీ కూటమి దేవుని భూమిలో అకాల మరణం పొందిన సంగతి రుజువైంది. తేలవలసిం దల్లా, ప్రధాని మోదీ చెప్పినట్టు వయనాడ్‌ ‌కూడా రాహుల్‌బాబాను వదల్చుకుంటుందా? అమేథిని ఆశ్రయించక తప్పదా?

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE