‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన

(9వ భాగం)

అమెరికా, ప్రపంచ ప్రభుత్వాలే కాక, భారత ప్రభుత్వం కూడా అనుమతించటంతో వ్యాస్‌ ఆలోచనలు ముందుకు సాగాయి.

మహాభారత కాలం నాడే వంశాభివృద్ధి, రాజ్యక్షేమం కోరి ఉత్తరాధికారి కోసం ‘కురువంశం’ ఈ విధానాన్ని అనుసరించింది. మరిప్పుడు విజ్ఞానం పెరిగింది. అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ అవకాశం ద్వారా మాతృదేశానికి మరో విజ్ఞాన వేత్తనందించవచ్చు కదా అనిపించింది.

అయితే, వ్యాస్‌ ఆలోచనంతా వాటినెలా అమలుపరచాలి అన్నదే! ఒక తెలివైన, అందమైన అమ్మాయిని వివాహం చేసుకుని సంతానం కనాలా?

ఆ విధానమైతే తనలాంటి వారికి ఎంత సమయం వృధా అవుతుంది? అంతటితో ఆగదు. సంసారం, బంధాలు, ఇవన్నీ తనను చుట్టు కుంటాయి.

ఓ బాధ్యతాయుతమైన పౌరుడిగా వీటిని విస్మరించలేడు! తనకు ఖాళీ సమయం తక్కువ. ప్రతి నిమిషం తనకెంతో విలువైంది.

ఇవన్నీ కాదని ఒక్కో ప్రయోజనం కోసం, ఆ సంసార చక్రంలో ఇరుక్కోవటం అవివేకం అనిపిం చింది. అందుకే అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించిన స్పెర్మ్‌స్టోర్‌ ‌క్రింద, దాన్ని తన స్వంత ప్రయోజనం కోసం కాకుండా, దేశాలకు ఉపయోగపడేలా రిజర్వు చేయవచ్చు.

దానివల్ల తనకు సమయం వృధా కాదు.

రెండోది- స్త్రీ స్పర్శాసుఖాల్ని అనుభవిస్తే, మళ్లీ తన మనసు పరిశోధనల పట్ల ఇంత తీవ్రంగా స్పందించకపోవచ్చు అనుకున్నాడు.

వెంటనే తల్లి, ఆమె కోరిక గుర్తొచ్చింది.

ఆమె తనకు అన్నీ చేసింది. చాలీచాలని సంసారంలో కూడా తనకు మంచి చదువు కోసం ఫీజుల కోసం డబ్బు కేటాయించింది. తన నుంచి ఈనాటి వరకూ తిరిగి ఏమీ ఆశించలేదు.

తనతో ఆడుకుని, మమతలు పంచుకునే తన వారసత్వాన్ని తప్ప.

 పోనీ తమ్ముడు రాష్ట్రయ్‌కన్నా పిల్లలు పుట్టినా సమస్య తీరిపోయేది. దీనికి, పరిష్కారం దొరికేది.

 జబ్బువల్ల వాడూ దానికనర్హుడయ్యాడు. అందుకే, అమ్మ తీవ్రంగా స్పందించి తనకు ఆర్డర్‌ ‌వేసింది. ఈ జీవన ప్రవాహం ఎప్పుడెన్ని మలుపులు తిరుగుతుందో ఊహించలేము. దానితోపాటు కొట్టుకుపోవటమే! ఇలాంటి సమస్య ఒకటి జీవితంలో ఉంటుందనీ, తను కూడా దాన్ని ఎదుర్కోవలసి వస్తుందని అసలు తను ఊహించలేదు.

దీనికి పరిష్కారం ఒక్కటే!

అదే, తను పెళ్లి చేసుకోవటం, స్పెర్ము రిజర్వు చెయ్యటం. తన ప్రొఫెషన్‌ ‌దెబ్బ తినకుండా ఉండాలంటే ఆ వివాహం తనకు ప్రతిబంధకంగా ఉండకూడదు. కానీ, ఆ అమ్మాయివైపు నుంచి చూస్తే ఆమెకది సమస్యే అవుతుంది. అందుకు, ముందే ఆర్థికపరంగా, సామాజిక పరంగా పరిష్కారాల్ని సూచించాలి. అందులో ఒకటి, తన ‘రాయల్టి’ నుంచి ఆమెకు కొంత కేటాయించటం. తన వివాహాన్ని వీలయినంత రహస్యంగా ఉంచటం అనుకున్నాడు.

చివరికి ఇదే నిశ్చయించుకున్నాడు. అలాంటి అమ్మాయిని ఎంపిక చేయమని తల్లికి, స్పెర్మ్‌రిజర్వు కోసం మెడికల్‌ ‌కౌన్సిల్‌కీ, అమెరికా, భారత ప్రభుత్వాలకీ తెలియపరచమని తన నిర్ణయం తెలియజేసి ఊపిరి పీల్చుకున్నాడు.

అప్పుడు మనసు ప్రశాంతత పొంది, దృష్టి కంప్యూటర్‌ ‌వైపు తిరిగింది.

                                                                                                    * * *

ఒక్కతె వచ్చిన గీరాను చూసి పలకరించింది డాక్టర్‌ ‌వరద. సాధారణంగా నలుగురూ వచ్చేవారు. కాని, ప్రస్తుతం గీరా ఒక్కతె వచ్చింది.

ఆమెను చూస్తే వరదకు ఆశ్చర్యంగానే అనిపించింది. కాఫీ, స్నాక్స్ ఆఫర్‌ ‌చేసి కూర్చుంది. దేనికీ చలించనట్లుగా, ఎలాంటి భయాలు లేనట్లు డాక్టర్‌ ‌వరద చెప్పే విషయం వినటానికి సిద్ధంగా ఉంది గీరా.

‘‘గీరా! ఒక మల్టీ నేషనల్‌ ‌కంపెనీలో పనిచేసే దంపతులు. వారికి సంతానం కావాలి. ఎవరయినా సరోగేట్‌ ‌మదర్‌, అద్దె తల్లి కావాలి. ఆమె వారికి మాతృదానం చేయాలి. నీ ఎస్‌.ఎమ్‌.ఎస్‌ ‌చూసుకుని ఫోన్‌ ‌చేశాను’’ చెప్పింది డాక్టర్‌ ‌వరద.

‘‘నేనివ్వగలను డాక్టర్‌!’’ ‌ఠక్కున జవాబిచ్చింది.

‘‘ఓకే. కాని, నువ్వు పెళ్లికాని అమ్మాయివి. జాగ్రత్తగా ఆలోచించుకో. ప్రయోగాలు చెయ్యటాని కిది ఆట కాదు, జీవితం. ఈ విషయంలో నీ టార్గెట్‌ ‌కూడా చాలా ఎక్కువే ఉంది’’ చెప్పింది డాక్టర్‌ ‌వరద హెచ్చరిస్తూ.

డాక్టర్‌ ‌వరదకి ఇవన్నీ సామాన్యమయిన విషయాలు. నిజానికి మెటర్నిటి ఆసుపత్రి నుంచి కన్నా పృథ్వీ ప్రతిసృష్టి సంతాన సాఫల్యకేంద్రం నుంచే ఎక్కువ ఆదాయం వస్తుందామెకు.

కానీ, డాక్టర్‌గా చెప్పదలుచుకున్నది చెప్పింది.

‘‘నేను పెళ్లయిన అమ్మాయినే! కానీ, అది బాల్య వివాహం. పెళ్లయిన సంవత్సరంలోనే భర్త వదిలేసిన దాన్ని. ఇప్పుడు నా జీవితం నా ఇష్టం. నేను దీన్నో ఛాలెంజ్‌గా తీసుకుంటున్నాను. రెండోది, నాకు డబ్బు చాల అవసరం. నేనొక వెనకబడిన తెగల జాతి అమ్మాయిని. నాకు ఆదాయం వచ్చే అవకాశాలు తక్కువ. పైగా మా తెగల్లో అక్రమ సంతానాలు, సంబంధాలూ సాధారణం. కాని నేను సక్రమంగా, లీగల్‌గానే• సంతానాన్ని కని, ఆ మాతృత్వ అనుభ వాన్ని, దాచుకోవాలనుకుంటున్నాను. ఇవి మీరు అతి గోప్యంగా ఉంచుతామంటున్నారుగా! నేనెవరినో వారికి తెలవదు. వాళ్లెవరో నాకూ తెలవదు. కానీ, నేను వారి గురించి అంటే, నేనెవరి సంతానాన్ని మోస్తున్నానో తెలుసుకోవాలనుకుంటున్నాను’’ చెప్పింది గీరా.

‘‘అలా కుదరదు గీరా! ఆ విషయాలన్నీ నీకు ముందే తెలియజేసాను. నిజానికా దంపతులు మంచి స్థితిలో ఉన్నారు. ఆరోగ్యం, ధనం ఉన్నవాళ్లు, చదువుకున్న వాళ్లు.బ్యాడ్‌లక్‌, ‌తెలిసీ•తెలియని స్థితిలో, యౌవనంలో, కన్నుమిన్నుగానక కోరికలతో, పొగరుగా అన్ని ఆకర్షణలకు లొంగిపోయిన కారణంగా ఆమెకీ దుస్థితి ఏర్పడింది. గీరా! నిన్ను చిన్న వయసులోనే భర్త వదిలేశాడు. మీకెలాంటి పురుషస్పర్శ ఉండదు. ఇక్కడ మీరు పరికరాలతోనే తల్లులవుతారు. ఆ అనుభవం మీకు ఎలాంటి అనుభూతిని మిగల్చదు’’ వివరించింది డాక్టర్‌.

‘‘అం‌దుకే, ఇలా కని, అలా వదిలేయగలను’’ నవ్వింది గీరా.

‘‘అది నిజమే, కొంతవరకు. కానీ, మీ గర్భంలో సహజంగా జరిగే మార్పులన్నీ జరుగుతాయి. వాంతులు, తినలేకపోవటం, నీరసం లాంటివి అయితే మీరు డాక్టర్‌ ‌పర్యవక్షణలో ఉంటారు కాబట్టి, అవంతగా బాధించవు. నీవు అంగీకరిస్తే వారికి ఇన్‌ఫాం చేస్తాను’’ చెప్పింది డాక్టర్‌ ‌వరద.

‘‘ఫాన్‌ ‌నంబరుంటే, నేనే వారితో మాట్లాడతాను’’ చెప్పింది గీరా.

‘‘నో… మీ ఇద్దరి మధ్య ఒప్పందం తప్ప, కమ్యూనికేషనుండదు. వాళ్లు, అడ్వాన్స్‌గా ముందే డబ్బిస్తారు. మీరు సరోగేట్‌ ‌మదర్‌గా మాతృదానం చేస్తున్నట్లు, పేపర్లపై సంతకం చెయ్యాలి.

‘‘మధ్యలో ఒప్పందాలు మార్చుకోవటాలు వంటివేమీ ఉండవు. కనడం, ఇవ్వటం, వెళ్లటమంతే! అలా అని కనగానె తల్లి వెళ్లిపోదు. పిల్ల మాత్రం అసలు వాళ్లకు చేరుతుంది. తల్లి పదిహేనురోజులు మా పర్యవేక్షణలో ఉంటుంది’’ చెప్పింది.

డాక్టర్‌ ‌వరద, గీరాకు, ఉష, అనిరుద్‌ల విషయం చెప్తూ, ‘‘ఇక్కడ భార్య మాత్రమే సంతానానికి అనర్హురాలు. భర్త అర్హుడు. వారికి, వారి సంతానమే కావాలి. నీవు అండాన్ని డొనేట్‌ ‌చేసి, నీవే కనాలి’’ చెప్పింది గీరాతో.

గీరా నవ్వి ‘‘బిడ్డను కనివ్వటానికి ఒప్పుకుంటు న్నాను’’ చెప్పింది.

‘‘లక్కీ! నేను, మీ హాస్టల్‌కు ఫోన్‌ ‌చేద్దామను కుంటున్నాను నన్ను కలవమని’’ నవ్వింది వరద.

‘‘మా హాస్టల్‌కా? ఎందుకూ? అమ్మాయిలంటే, అందులోను చదువుకునే అమ్మాయిలంటే అంత లోకువా? అంత తొందరగా ఎలా ఒప్పుకుంటారను కున్నారు, ఇలాంటి వాటికి అమ్మాయిలకు ఫోన్‌ ‌చేస్తామని చెప్పటానికి!’’ ఒకింత న్యూనతతో అడిగింది గీరా.

తన మాటలకి గీరా•కే ఆశ్చర్యంగా అనిపించింది. ఇలాంటి విషయాలు అమ్మాయిల• ధైర్యంగా చెబుతారని ఇదివరకు కూడా విన్నది.

దానికి సమాధానంగా డాక్టర్‌ ‌వరద, ఓ లిస్టు ఆమె ఆమె ముందుంచింది. అందులో డెబ్బయి శాతం గ్రామాల నుంచయితే, ముప్పయి శాతం సిటీ•ల్లో ఉండే యువతులు, గరల్స్ ‌హాస్టల్‌ ‌విద్యార్థులు. అందులో చాలామంది చదువుకున్నవాళ్లే. వారి పేర్ల ప్రక్కన డిగ్రీలు కూడా ఉన్నాయి.

గీరా మాట్లాడలేకపోయింది.

ఇది వీలుకాని వారికి, సంతానానికి నోచుకోని వారికిచ్చె సహాయమా? లేక, పెరుగుతున్న వికృత నాగరికతలకు నిదర్శనమా? అనుకుంటూ, ‘‘హాస్టల్‌కు ఎందుకు ఫోన్‌ ‌చేయాలనుకున్నారు?’’ నెమ్మదిగానే అడిగింది.

‘‘గాంధారి అనే యువతికి ‘అండం’ కావాలి. మీ నుంచి మీరు దానంగా ఇస్తే, తీసుకోవటానికి’’ చెప్పింది.

‘‘దానికీ నేను సిద్ధమే!’’ చెప్పింది గీరా.

‘‘ఇద్దరికి ఒకేసారి నీ గర్భాన్ని ఇవ్వగలవా?’’ అడిగింది డాక్టర్‌ ‌వరద.

‘‘ఇవ్వగలను. కవల పిల్లల్ని నా గర్భంలో మోయగలను’’ అంది.

‘‘గీరా! ఇది నీవనుకున్నంత సులభం కాదు. తొమ్మిది నెలలు మోయటం, అదీ ఇద్దరిని. ఆ ఇద్దరూ ఒకే తల్లిదండ్రులకు కాదు. ఆరోగ్యపరంగా నీవు చాలా జాగ్రత్త వహించాల్సి వస్తుంది’’ చెప్పింది వివరిస్తూ.

‘‘డాక్టర్‌! ‌గూడు ఒక్కటే కావచ్చు. అందులో ఎన్నో గుడ్లని పొదగవచ్చు. ఇతరుల సహాయం లేకుండా చిన్న పిట్టలు తమ సంతానాన్ని పెంచుతున్నాయి. ఇదీ అలాగే! నేనూ ఒకరిని మోసినా, నలుగురిని మోసినా, అవే తొమ్మిది నెలలు, అవే జాగ్రత్తలు కదా!’’ నవ్వింది గీరా.

డాక్టర్‌ ‌చూస్తూ ఉండిపోయింది. చిరునవ్వుతో. కానీ లోలోపలే ఈసారి తెల్లబోయింది డాక్టర్‌ ‌వరద. గీరా పలికిన ఆ మాటలకు.

తను నేర్చుకున్న విజ్ఞానాన్ని ఉపయోగించి జీవన విలువలకు విరుద్ధంగా డబ్బు సంపాదిస్తుంది. కానీ, ఈ అమ్మాయి… నవమాసాలు మోసి, తన రక్తకణాల్ని వృద్ధి చేసుకుంటూ, తనువును రెండుగా చేస్తూ, పంచాల్సిన గర్భాన్ని ఎంత నిర్భయంగా పెంచి, దానం చేయటానికి సిద్ధపడింది’’ అనుకుంది.

అది గమనించి ‘‘ఒకేసారి అందరి కోరికలు తీర్చి, పెద్ద మొత్తాన్ని ఒకేసారి తీసుకుని జీవితంలో స్థిరపడాలనుకుంటున్నాను డాక్టర్‌!’’ ‌చెప్పింది.

డాక్టర్‌ ‌వరదకు అదీ నిజమేననిపించింది. ‘అండాలు ఆమెవే కాబట్టి జన్యుపరమైన మార్పులు, సమస్యలూ ఉండకపోవచ్చు’ అనుకుంది.

ఆ క్షణంలో ఆమె మనసులోకి వచ్చిన ఆలోచ నల్ని, అమల్లో పెట్టటానికి నిర్ణయించుకుంది. నైతిక విలువల్ని, అదఃపాతాళానికి తొక్కుతున్న విజ్ఞానంలో జీవన విలువలు పక్కకు తప్పుకున్నాయి.

సంబరాజు లీల (లట్టుపల్లి)

About Author

By editor

Twitter
YOUTUBE