సార్వత్రిక, రాష్ట్రశాసనసభ ఎన్నికల సందర్భంగా ఎన్‌డిఏ కూటమి ప్రజాగళం పేరుతో రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం బీజేపీ, తెదేపా, జనసేన కార్యకర్తల్లో మంచి జోష్‌ను నింపింది. బీజేపీ తరపున ప్రధాని నరేంద్రమోదీ రాజమండ్రి, అనకాపల్లిలో మే 6న జరిగిన సభల్లో ప్రసంగించారు. పీలేరు, విజయవాడల్లో 8న రోడ్‌షోలో పాల్గొన్నారు. ధర్మవరంలో మే 5న జరిగిన సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కడప జిల్లాలో, కర్నూలు జిల్లా ఆదోని సభల్లో రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ పాల్గొన్నారు. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఎన్‌డిఏ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు లక్షలాది జనం సభల్లో పాల్గొన్నారు. 40 డిగ్రీల పైనే ఉన్న ఉష్ణోగ్రతలను సైతం లెక్కచేయక నాయకుల కోసం వేచి ఉండి తమ మద్దతు తెలిపారు. కూటమి నాయకులకు జేజేలు పలుకుతూ తమ మద్దతును తెలియచేస్తూ, రాష్ట్రాన్ని ఆవహించిన దుష్టపాలన పోవాలనే ఆకాంక్షను వెల్లడించారు. ప్రజాగళం వేదికలపై కూటమి నాయకులు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. పాలించడం చేతకాక ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు సంక్షేమ పథకాల పేరుతో నగదును బదిలీ చేసినట్లు ఆరోపించారు. అయిదేళ్లుగా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు,అధికారపక్ష నాయకుల భూకబ్జాలు, అవినీతి, ల్యాండ్, వైన్, మైన్, శాండ్ దోపిడీని ఎన్‌డిఏ నాయకులు ప్రస్తావిస్తూ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు.
దేశ, రాష్ట్రాల అభివృద్ధి డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే సాధ్యమని, ఈ ఎన్నికల్లో రెండు చోట్ల ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతోందని బీజేపీ అగ్రనేత, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవినీతిని జెట్ స్పీడ్‌తో పరిగెత్తించిందని, అభివృద్ధి సున్నా, అవినీతి వంద శాతమని రాజమహేంద్రవరం, అనకాపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో వ్యాఖ్యానించారు. ‘వైసీపీ సర్కారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది. వైసీపీ ప్రభుత్వానికి అవినీతి నిర్వహణ తప్ప.. రాష్ట్ర ఆర్థిక నియంత్రణ తెలియదు. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసింది. కేంద్ర ప్రాజెక్టుల అమలులో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసింది.పోలవరం కోసం కేంద్రం రూ.15వేల కోట్లు ఇచ్చింది. కానీ, ఆ ప్రాజెక్టును ఈ ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది.రాజధానికి కేంద్రం రూ.15వేల కోట్లు ఇవ్వాలనుకుంది. కానీ, కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందుకోలేక పోయింది. మూడు రాజధానులు పేరిట ఏపీని లూటీ చేశారు. రాష్ట్రంలో మద్యం నిషేధిస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ హామీని విస్మరించి మద్యం సిండికేట్‌గా తయారైంది. దిల్లీ- ముంబయి కారిడార్ మాదిరి విశాఖ-చెన్నై కారిడార్ నిర్మాణం చేపడతాం. చెన్నై-కోల్‌కతా హైవే, రాజమహేంద్ర వరం విమానాశ్రయం ఈ ప్రాంత ముఖచిత్రాన్ని మారుస్తాయి. ఏపీకి మోదీ గ్యారంటీ, చంద్రబాబు నేతృత్వం, పవన్ విశ్వాసం ఉన్నాయి. కూటమి అభ్యర్థులందరినీ భారీ మెజారిటీతో గెలిపించాలి. ఆంధప్రదేశ్ భవిష్యత్తు కోసం కూటమికి ఓటేయండి ’’ అని మోదీ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, పదేళ్ల క్రితం దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలు చేసిందని విమర్శించారు. ఈడీ.. ఈడీ.. అంటూ ఇండియా కూటమి గగ్గోలు పెడుతోందని, కాంగ్రెస్ నేతల వద్ద గుట్టల కొద్దీ డబ్బు బయట పడుతున్నాయని, ఆ పార్టీ నేతల డబ్బును మెషీన్లు కూడా లెక్కపెట్టలేక పోతున్నాయి. రాజమహేంద్రవరం సభలో ప్రధాని మోదీ, ముందుగా గోదావరి మాతకు, ఆదికవి నన్నయ్యకు ప్రణామాలు చెబుతూ ‘ఇక్కడి నుంచే ఇప్పుడు కొత్త చరిత్ర లిఖించబోతున్నాం’ అంటూ మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు.
అవినీతి ప్రభుత్వం ఇంటికి వెళ్లడం ఖాయమని, ఈ ఎన్నికల్లో 25 లోక్‌సభ, 160 స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరని, వికసిత్ ఆంధప్రదేశ్ దిశగా తమ కూటమి ముందుకు సాగుతుందన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలయికతో అమరావతి, పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తెలుగుభాష అమలు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుని ప్రజలకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్ అంటూ ధ్వజమెత్తారు. వైసీపీ ఉత్తరాంధ్ర ద్రోహి అని, సాగునీటి ప్రాజెక్టుల కోసం టీడీపీ హయంలో రూ.2500కోట్లు ఖర్చు పెడితే, జగన్ ప్రభుత్వం రూ.500కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ప్రజల భూముల పత్రాలపై జగన్ ఫోటో ఎందుకని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చుపెట్టినా జగన్ పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం అమలవుతున్న పోస్టల్ బ్యాలెట్‌లో కూడా ఉద్యోగులంతా కూటమికే ఓట్లు వేస్తున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు.
భారతదేశమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మోదీ పట్ల ఆదరణ పెరుగుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భారత శక్తిని ప్రపంచానికి చాటిన గొప్ప పాలనాధ్యక్షుడు మోదీ అని, ఆయన కారణంగానే భారత్‌కు శత్రుదేశాలపై పోరాడ గలిగిందని ప్రశంసించారు. ఆర్టికల్ 370 రద్దు విప్లవాత్మక నిర్ణయంగా పేర్కొన్నారు. ఆంధప్రదేశ్ పట్ల మోదీ చూపుతున్న శ్రద్ధకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం రాష్ట్రంలో అమలుచేస్తున్న పథకాల పేర్లను జగన్ తన ఇష్టానుసారంగా మార్చేసుకున్నారన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ, దేశానికి నరేంద్ర మోడీ అవసరం ఎంతైనా ఉందని, భారత్‌ను సుస్థిర ఆర్ధికాభివృద్ధి కలిగిన శక్తిగా మార్చడంలో ఆయన మేధస్సు ప్రపంచాన్ని ఆకర్షించిందన్నారు. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ, ఏపీలో మూడు పార్టీల కలయికను చారిత్రాత్మక అవసరంగా అభివర్ణించారు. దుష్ట పాలనపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. నరేంద్రమోదీ స్ఫూర్తి, చంద్రబూబు యుక్తి, పవన్ కల్యాణ్ శక్తి ప్రస్ఫుటంగా కనిపిస్తోందన్నారు. అయిదేళ్లుగా ఈ ప్రభుత్వం అన్నివర్గాలను దెబ్బ తీసిందని, పేదలపై ఆర్ధికభారాలు మోపిందని, ప్రకృతి వనరుబను దోపిడి చేసినట్లు ఆరోపించారు.
జగన్ సర్కార్ అవినీతి మయం: అమిత్ షా
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం తీవ్ర అవినీతిలో మునిగిపోయిందని, భూకబ్జాలు, మద్యం, ల్యాండ్, మైన్స్ మాఫియా చెలరేగిపోయాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఈ గూండాగిరి, అరాచకాలను అరికట్టేందుకు, రాజధానిగా అమరావతిని పునర్నిర్మించేందుకు, తిరుమల వే•ంకటేశ్వర•స్వామి పవిత్రతను కాపాడేందుకు, ఉన్నతమైన తెలుగు భాషను పరిరక్షించేందుకే బీజీపీ,తెదేపా, జనసేన కూటమిగా ఏర్పడినట్లు ధర్మపురి ప్రజాగళ సభలో చెప్పారు. జగన్ సర్కారు ఇంగ్లిషు మీడియం పేరుతో తెలుగును అంతం చేయాలని చూస్తోందని, కానీ బీజేపీ ఉన్నంత వరకు తెలుగు భాషకు ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. ‘పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడిలాంటిది. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం దీనిని మంజూరు చేయగా, జగన్ •మోహన్‌రెడ్డి తన అవినీతితో దీనిని ముందుకు సాగకుండా చేశారు. రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులను జగన్ పూర్తిగా నిర్ల్యక్షం చేశారు పనుల్లో జాప్యానికి ఆయన అవినీతే కారణం. రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ నాయకత్వంలో ప్రభుత్వాలు ఏర్పాటెన• రెండేళ్లలో పోలవరంను పూర్తి చేసి, ప్రతి ఎకరాకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తాం. ఏపీలోని మొత్తం 25 ఎంపీ స్థానాలలో కూటమి అభ్యర్థులను గెలిపించండి. హంద్రీనీవా సుజల స్రవంతి, ఇతర ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. చంద్రబాబునాయుడు అభివృద్ధికి చిరునామా. రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఏపీకి గట్టి పునాదులు వేసి, రాష్ట్రాన్ని ఆర్థికంగా పటిష్టం చేశారు. కానీ… జగన్ వచ్చి ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు. జగన్ పాలనలో ఏపీలో అభివృద్ధి శూన్యం. పెట్టుబడులు సున్నా.. అవినీతి మాత్రం కొండంత! రూ.13.50 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి జనం నెత్తిన మోపారు. మౌలిక సదుపాయాలు కల్పించలేదు. రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా పెట్రేగిపోతోంది. మద్యపాన నిషేధం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. అది చేయకపోగా.. మద్యం సిండికేట్ అవినీతికి పాల్పడుతున్నారు. ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వక పోవడంతో ఆస్పత్రుల్లో పేదలకు అడ్మిషన్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. లోక్‌సభకు సంబంధించి ఇప్పటికే రెండు విడతల్లో జరిగిన పోలింగ్‌లో మోదీ సెంచరీ కొట్టేసి ముందంజలో ఉన్నారు. మూడో విడతలో 400 సంఖ్యను దాటబోతున్నాం. తెలంగాణలోనూ కమల వికాసమే! ఏపీలో చంద్ర బాబును సీఎంను చేయాలి. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలోనే అభివృద్ధి జరుగుతుంది’ అని అమిత్‌షా అన్నారు.
గొప్ప రాష్ట్రం అప్పుల మయం: రాజ్‌నాధ్‌సింగ్
ఉత్తరాదితో పోల్చితే ఎంతో గొప్పగా ఉన్న ఆంధప్రదేశ్ రాష్ట్రం వైసీపీ అసమర్థ పాలన కారణంగా అప్పుల్లో కూరుకుపోయి పేద రాష్ట్రంగా మారిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ దుర్వినియోగం చేసిన జగన్‌కు పాలించే అర్హత లేదని, రాష్ట్రంలో డబులింజన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలం తిప్పలూరులో జరిగిన ఎన్డీయే కార్యకర్తల సమావేశంలో, కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన ఎన్ని కల ప్రచారంలోనూ ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని, ఇకపై దాన్ని సాగనివ్వబోమని పేర్కొన్నారు. కేంద్ర పథకాలు రాష్ట్రంలో సక్రమంగా అమలు కావడంలేదని మండిపడ్డారు.
ఏపీలో పేదల కోసం 21 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేస్తే జగన్ ప్రభుత్వం నిర్మించింది కేవలం 2లక్షల గృహాలు మాత్రమేనని విమర్శించారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, అందుకే ఆయనతో కలసి పనిచే స్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పాలనంతా అవినీతి మయమని రాజ్‌నాథ్ ఆరోపించారు. రాష్ట్రానికి రూ.14,500 కోట్లు అమృత్ మిషన్ కింద ఇంటింటికి తాగునీటి కుళాయి ఇవ్వాలని నిధులు మంజూరు చేస్తే కేవలం రూ.1,400కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. భారత్ ఒకప్పుడు బలహీనమైన దేశంగా ఉండేదని, ప్రస్తుతం పక్క దేశాలు మనదేశం వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడే స్థాయిలో ఉన్నాయన్నారు. ఇతర దేశాల్లో కూడా భారతీయులు అంటే గౌరవంగా చూస్తున్నారని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్
టిఎన్. భూషణ్