ఆం‌ధప్రదేశ్‌ ‌శాసనసభ, లోక్‌సభలకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. పోలైన ఓట్ల శాతం పూర్తి వివరాలు ఇంతవరకు రానప్పటికీ 80 శాతం మించవచ్చని సమాచారం. పెరిగిన పోలింగ్‌ ‌శాతం అధికార వైసీపీ పట్ల ప్రజల అనుగ్రహమా? లేక ఆగ్రహమా? అనేది జూన్‌ 4‌న తేలుతుంది. విద్య, ఉపాధి, ఉద్యోగం, అభివృద్ధి అనే అంశాలే అజెండాగా పోలింగ్‌ ‌జరిగింది. యువత పోలింగ్‌లో ఎక్కువగా పాల్గొన్నారు. నిరుద్యోగులు ఓటు రూపంలో తమ ఆగ్రహాన్ని చూపించారు. అలాగే వారి తల్లిదండ్రులతో కూడా ఓట్లేయిం చారు. గల్ఫ్, ‌నార్వే, స్వీడన్‌, ‌కెనడా, మారిషస్‌ ‌వంటి దేశాల్లో స్థిరపడిన వారు సహా పక్క రాష్ట్రాల్లో పనిచేస్తున్న లక్షల మంది యువత దొరికిన వాహనంలో రాష్ట్రానికి వచ్చి ఓటేసి వెళ్లిపోయారు. ఒక లక్ష్యం, కసితో ఓటు వేయాలన్న భావన వీరిలో కనిపించింది. ‘ఈసారి ఓటేయకపోతే సర్వస్వం కోల్పోతాం!’ అనే ఆందోళనతోనే వీరంతా తరలివచ్చినట్లు చెబుతున్నారు.

పోలింగ్‌ ‌నాటి (మే 13) ఉదయం ఆరున్న గంటలకే పోలింగ్‌ ‌కేంద్రాల వద్ద బారులుదీరారు. 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ ఓటర్ల కోలాహ లంతో సాయంత్రం వరకు ఏకరీతిలో ఉత్సాహంగా సాగింది. సాధారణంగా ఉదయం మందకొడిగా మొదలై తర్వాత పుంజుకొని, సాయంత్రానికి పోలింగ్‌ ‌జోరు తగ్గుతుంది. ఈసారి అలాలేదు. అత్యధిక బూత్‌లవద్ద రోజంతా ఓటర్ల బారులు కనిపించాయి. రాష్ట్రంలో మూడు వేలకు పైగా బూత్‌లలో అర్ధరాత్రి దాకా పోలింగ్‌ ‌కొనసాగడం గమనార్హం. విద్యా వంతులు, ఉద్యోగులు, యువత, ఎగువ మధ్య తరగతి వారు, గ్రామీణులు, రైతులు, కార్మికులు, అంతా పోలింగ్‌ ‌బూత్‌లకు తరలివచ్చారు. క్యూలో ఓపిగ్గా నిలబడి గంటైనా, రెండు గంటలైనా వేచిచూసి ఓటేశారు.

హింసాత్మకమే… కానీ!

పోలింగ్‌ ‌సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతా లలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఓటమి భయమో… ఓటు చేజారుతోందని అర్థమైందో గానీ వర్గాలు విచ్చలవిడిగా దాడులు, దౌర్జన్యాలకు దిగాయి. పల్నాడులో భారీగా దాడులు చేశారు. కొన్ని గ్రామాల్లో ఓటర్లను పోలింగ్‌లో పాల్గొనకుండా బెదిరించారు. ఈవీయంలను ధ్వంసం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎస్పీ వాహనంపైనే దాడి చేశారు. పలుచోట్ల టీడీపీ ఏజెంట్లను కొట్టారు. జమ్మలమడుగులో వైసీపీ,బీజేపీ వర్గాల మధ్య భౌతిక దాడులు జరిగాయి. ఆయా ఘటనలపై టీడీపీ, బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. అయితే… గత ఎన్నికలతో పోల్చితే ఈసారి హింసాత్మక ఘటనలు తక్కువే అని, ఓట్ల గల్లంతు పైనా ఫిర్యాదులు తక్కువగానే వచ్చాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఓట్ల తొలగింపుపై మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో జనం ముందే అప్రమతమై, తమ ఓట్లను కాపాడుకున్నారు. ఈవీఎంలు మొరాయించడంతో పలుచోట్ల పోలింగ్‌ ఆలస్యంగా మొదలైంది.

గెలుపుపై బీజేపీ ధీమా

ఎన్నికల్లో గెలుపుపై బీజేపీ అభ్యర్థులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. వైసీపీ ఐదేళ్ల ప్రజావ్యతిరేక పాలన, ఎన్డీఏ మ్యానిఫెస్టో ఓటర్లను బాగా ప్రభావితం చేశాయంటున్నారు. మిత్రపక్షాల సంపూర్ణ సహకారం వల్ల సామాజిక వర్గాల వారీగా ఓటర్ల నుంచి పూర్తి మద్దతు లభించిందంటున్నారు. వైసీపీ పాలనతో విసిగిపోయిన ఓటర్లు ఎన్డీయే వైపు మొగ్గు చూపడంతో తమ విజయావకాశాలు మరింత పెరిగాయని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సహా బీజేపీ అగ్రనేతలూ తమ ఎన్నికల ప్రచారంలో, జగన్‌ ‌ప్రభుత్వ అవినీతి, అరాచకాలను తీవ్రంగా ఎండ గట్టడం వంటివి ప్రజలపై విస్తృత ప్రభావం చూపాయన్న భావన వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 6 లోక్‌సభ స్థానాల నుంచి.10 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేసింది. అరకు, అనకాపల్లి, రాజమహేంద్రవరం, నరసాపురం, రాజంపేట, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులు కొత్తపల్లి గీత, సీఎం రమేశ్‌, ‌పురందేశ్వరి, శ్రీనివాస వర్మ, నల్లారి కిరణ్‌కుమార్‌ ‌రెడ్డి, వరప్రసాదరావు గెలుపే లక్ష్యంగా చేసిన ప్రచారం సానుకూలంగా మారిందంటున్నారు. కనీసం నాలుగు స్ధానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అలాగే ఎచ్చెర్ల, ధర్మవరం, ఆదోని, జమ్మలమడుగు, బద్వేలు, అరకు, విశాఖ నార్త్, ‌కైకలూరు, విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా విజయాల ముంగిట నిలిచారు. విశాఖ నార్త్, ‌కైకలూరు, విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో భాజపా అభ్యర్థులు విష్ణుకుమార్‌ ‌రాజు, మాజీమంత్రి కామినేని శ్రీనివాస్‌, ‌సుజనాచౌదరి, అనపర్తి అభ్యర్ధి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జమ్మల మడుగు అభ్యర్ధి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ధర్మవరం అభ్యర్ధి వై.సత్యకుమార్‌లు దాదాపు విజయం సాధించినట్లుగానే పార్టీ వర్గాలు భావిస్తు న్నాయి. ఆదోని, ఎచ్చెర్ల, బద్వేలు, అరకు నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉన్నా… ఓటింగ్‌ ‌సరళి ప్రకారం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తెదేపాలో జోష్‌

ఈ ఎన్నికలు తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహాన్ని తీసుకువచ్చాయి. ఈ ఏడాది జనవరి నుంచి ప్రభుత్వాన్ని మార్చాలన్న ధోరణి కనిపించింది. ఎన్నికల షెడ్యూల్‌ ‌ప్రకటించినప్పటి నుంచి ప్రజలలో ప్రభుత్వంపట్ల అయిదేళ్లుగా దాగిన ఆగ్రహం బహిర్గతమైంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేకవిధానాలు, పెరిగిన ధరలను అదుపుచేయలేకపోవడం, ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం, తీవ్రమైన అవినీతి, ముఖ్యమంత్రి కేంద్రంగా అవినీతి ఆరోపణలు రావడం, అమరావతి రాజధానిని ఉద్దేశపూర్వకంగా అణచివేసేందుకు ప్రయత్నించడం, అభివృద్ధి మాట మరచి సంక్షేమం జపం చేయడం, రైతులు, నిర్మాణరంగ కార్మికులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాలను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో వాటిని తెలుగుదేశం పార్టీ మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దాంతో ప్రజల్లోనూ చైతన్యం పెరిగి ఓటేశారు. యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనడం… ఇతర రాష్ట్రాల నుంచి ఆరు లక్షలకుపైగా ఓటర్లు తరలి రావడం వంటి పరిణామాలు తమకు విజయం చేకూర్చ నున్నట్లు తెదేపా శ్రేణులు పేర్కొంటున్నాయి. ఓటింగ్‌ 80 ‌శాతం దాటుతుందన్న అంచనాలతో కనీసం 130-140 అసెంబ్లీ సీట్లు, 23 వరకు లోక్‌సభ స్థానాలు గెలుస్తామని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికల వ్యూహాలు, కార్యాచరణ, ప్రచారశైలిలో ప్రతి దశలోనూ అధికారపార్టీపై ఎన్డీయే పైచేయి సాధించిందని, ఓటింగ్‌ ‌సరళి కూడా దానికి అద్దం పట్టిందని టీడీపీ• వర్గాలు చెబుతున్నాయి. సరియైన సమయంలో జనసేన, బీజేపీలతో తెదేపా జట్టుకట్టడం, సీట్ల సర్దుబాటు పక్రియను సాఫీగా పూర్తిచేయడం, గతానికంటే భిన్నంగా ముందుగా మెజారిటీ స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించడం బాగా కలిసివచ్చిందని కూటమి శ్రేణులు భావిస్తున్నాయి. మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటులో ఎక్కడైనా క్షేత్రస్థాయిలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినా… అగ్రనాయకత్వం వెంటనే స్పందించి సర్దుబాటు చేయడం, ఓట్ల బదిలీ సజావుగా జరిగేలా చూడటం వంటివి ఎన్డీఏ బలాలుగా పేర్కొంటున్నాయి. అదే సమయంలో ప్రభుత్వంపై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకత ఎన్డీయేకు కలిసొచ్చి భారీ విజయాన్ని కట్టబెట్టబోతోందని అంచనాలు వేస్తున్నాయి.

జనసేనలో ఉత్సాహం

ఎన్డీయే కూటమిలోని జనసేన కూడా అత్యధిక స్ధానాల్లో గెలుపుపై ధీమాగా ఉంది. తాను పోటీ చేసిన 2 లోక్‌సభ స్థానాల్లోనూ, 21 అసెంబ్లీ స్థానాల్లో 18 చోట్ల గెలుపు తథ్యమని, 3 చోట్ల గట్టిపోటీ ఉందని పార్టీ అంతర్గత అంచనాలు పేర్కొంటు న్నాయి. పోలింగు పూర్తయ్యాక పరిస్థితుల్ని విశ్లేషించి, క్షేత్ర స్థాయి సమాచారం ఆధారంగా పార్టీ వర్గాలు ఈ లెక్కలు వేశాయి. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని సమాచారం. ఆ పార్టీ అధినేత పవన్‌ ‌కల్యాణ్‌ ‌పోటీ చేసిన పిఠాపురంలో భారీ మెజారిటీ వస్తుందనే ధీమాతో పార్టీ శ్రేణులు ఉన్నాయి. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ ‌నాదెండ్ల మనోహర్‌ ‌బరిలో నిలిచిన తెనాలిలోనూ గెలుపు ఖాయంగా మారింది. అక్కడ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ‌పోలింగ్‌ ‌కేంద్రంలో వ్యవహరించిన తీరు సంచలనమైంది. ఆయన అక్కడి ఓటరును కొట్టడంతో నియోజకవర్గంలో వైసీపీకి మరింత ప్రతికూల పరిస్థితి ఏర్పడింది. పాలకొండ, పోలవరం వంటి ఎస్టీ రిజర్వు నియోజక వర్గాల్లో జనసేన పోటీకి దిగింది. తొలుత అక్కడ గట్టి పోటీ కనిపించినా చివరకు రెండు స్థానాల్లోనూ పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడింది. రాజోలులో జనసేనకు మద్దతు ఏక పక్షంగా లభించిందని క్షేత్రస్థాయి సమాచారం. రాజా నగరంలో తొలుత గట్టిపోటీ ఉంటుందని భావించినా చివరకు సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో జనసేన పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ గెలుస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. నెల్లిమర్లలో తొలుత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా క్రమేణా అభ్యర్థి మాధవికి తెదేపా, బీజేపీ శ్రేణులు పూర్తిస్థాయిలో సహకరించడం కలిసాచ్చింది. పి. గన్నవరం, రైల్వే కోడూరు, తిరుపతి శాసనసభ నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఎదురైంది. వీటిలో కొద్ది మెజారిటీతోనైనా బయటపడతా మనే ధీమాతో పార్టీ వర్గాలు ఉన్నాయి. మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గంలో పూర్తి అనుకూల పరిస్థితులున్నాయని అంచనా. కాకినాడ లోక్‌సభ స్థానంలో కొంతమేర క్రాస్‌ ఓటింగ్‌ ‌జరిగినట్లు తెలిసింది. కాకినాడ గ్రామీణ, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన బరిలో నిలవడం, పార్టీ అధినేత పిఠాపురంలో పోటీ చేయడం ఇక్కడ లోకసభ అభ్యర్థికి అనుకూలాంశాలయ్యాయి. సామాజికవర్గంతో పాటు తెదేపా, బీజేపీ పొత్తు ఈ లోక్‌సభ నియోజకవర్గంలో జనసేనకు సానుకూల మైంది. కూటమి మద్దతు ఇచ్చిన అనేక నియోజక వర్గాల్లో తెదేపా, బీజేపీ అభ్యర్థులకు జనసేన యువత అండగా నిలిచింది.

వైసీపీలో ఆందోళన

రాష్ట్రంలో పోలింగ్‌ ‌సరళి పాలక పక్షం వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఓటర్లు భారీగా పోటెత్తడం, అర్ధరాత్రి దాటినా వెయ్యికిపైగా పోలింగ్‌ ‌కేంద్రాల్లో ఓటింగ్‌ ‌కొనసాగడం తమకు అనుకూలమో కాదో ఆ పార్టీ నేతలకు అంతుపట్టడం లేదు. వారి మాటల్లో కాస్త నైరాశ్యం కనిపిస్తోందని ప్రత్యర్థులు అంటున్నారు. గెలుస్తామని చెబుతున్నా ఆత్మవిశ్వాసం మాత్రం లోపించిందంటున్నారు. మహిళలు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొనడం తమకే లాభమని, సంక్షేమ పథకాల అమలువల్లే వారు పోలింగ్‌ ‌కేంద్రాలకు తరలివచ్చారని కొందరు అభ్యర్థులు తెలిపారు. మొత్తంగా 97 నుంచి 100 అసెంబ్లీ స్థానాలు దక్కించుకుంటామని అంటున్నారు. అయితే తాడేపల్లి ప్యాలెస్‌ ‌మాత్రం 130 సీట్లకు తగ్గవని లెక్కలు వేస్తోంది. మహిళలు, యువత భారీసంఖ్యలో తమకే ఓట్లేశారని అంటోంది. గ్రామీణంలో తమకే అనుకూలంగా ఉంటుందని మొదటి నుంచి పార్టీ అంచనా వేస్తోంది. క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉందంటున్నారు. ప్రతి ఇంట్లోనూ ఒకరిద్దరు నిరుద్యోగులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండంటం వారికి ఉద్యోగం ఇప్పించలేని ప్రభుత్వం పట్ల భారీగా వ్యతిరేకత గూడుకట్టుకుందన్న విషయాన్ని వైసీపీ నాయకత్వం గుర్తించడం లేదు. పేదల తిండి సంగతి అటుంచి అప్పులు తీర్చడానికి కూడా సరిపోవడం లేదనే వాస్తవాన్ని వైసీపీ వైకాపా గుర్తించలేదు. పెరిగిన ధరలను అదుపు చేయక పోవడం కూడా ఆ పార్టీ తమ వైఫల్యంగా గుర్తించ లేదు. ల్యాండ్‌ ‌టైటిలింగ్‌ ‌యాక్టు, టీడీపీ కూటమి సూపర్‌సిక్స్ ‌హామీల ప్రభావం అంచనా వేయలేక పోతున్నారు. ఓటర్లలో వెల్లివిరిసిన చైతన్యం.. క్షేత్రస్థాయిలో ఎదురైన అనుభవాలతో వారిలో అంతర్గతంగా భయం నెలకొన్నట్లు వారి మాటలతో తెలిసిపోతోందని.రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఏడాది కిందట 175 అసెంబ్లీ.. 25 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంటామని సీఎం జగన్‌ ఆర్భాటంగా ప్రకటించారు. వైసీపీ నేతలు, శ్రేణుల్లో అయితే పోలింగ్‌ ‌ముగిశాక.. నైరాశ్యం కనిపించింది. కానీ అది కనబడకుండా భారీ విజయం తథ్యమని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.

టిఎన్‌. ‌భూషణ్‌

About Author

By editor

Twitter
YOUTUBE