ఓటు హక్కు అంటే బాధ్యతతో కూడిన హక్కు అంటున్నారు లెట్స్‌ ఓట్‌ సంస్థ జాతీయ కన్వీనర్‌, వేద ఐఐటి డైరెక్టర్‌  సుబ్బరంగయ్య, కోశాధికారి, పి. రాఘవేంద్ర. వందల కోట్ల స్థూలజాతీయోత్పత్తి రాశులను ప్రభావితం చేసే ప్రధానమంత్రి కూడా ఓటర్ల నిర్ణయంతోనే ఆ పదవిలోకి వస్తారని సుబ్బరంగయ్య స్పష్టం చేశారు. ఓటింగ్‌, ఎన్నికలు వంటి విషయాలలో మహిళల ప్రాధాన్యం ఇప్పటికీ తక్కువేనని, కానీ ఓటు హక్కును వినియోగించే క్రమంలో మహిళలు, పురుషుల మధ్య అంతరం బాగా తగ్గిపోయిందని చెప్పారు. 2019లో లోక్‌సభకు అత్యధికంగా 70 మంది మహిళలు అడుగుపెట్టారని ఇది చరిత్రాత్మకమని రాఘవేంద్ర అభిప్రాయపడ్డారు. ఓటు హక్కును వినియోగించుకోవడం ఒక మంచి పౌరుని లక్షణమని వారి మాటల ద్వారా తెలుస్తుంది. ఈ అంశంపై  వెలిబుచ్చిన అభిప్రాయాలు జాగృతి పాఠకుల కోసం:


సుబ్బరంగయ్య 

ఓటు హక్కు వినియోగించుకోని ఓటర్లు అనే విషయానికి వెళ్లేముందు అసలు ఓటు హక్కు అనే అంశాన్ని చర్చిద్దాం. సాధారణంగా ఓటు హక్కు అంటాం. ఓటు హక్కే కాదు ఓటు వేయడం బాధ్యత కూడా. అంటే ఓటు బాధ్యతతో కూడిన హక్కు అనేనా?

మంచి ప్రశ్న. చాలామందికి ఓటు ఓ హక్కు అని తెలుసు. బాధ్యత అని తెలిసినవారు కొద్దిమంది మాత్రమే. చాలా చోట్ల హక్కులు, బాధ్యతలు కలిసి ఉంటాయి. ఉదాహరణకు నేనొక ఉద్యోగిని. జీతం నా హక్కు. అయితే ఆ జీతం పొందాలంటే నేను నిర్వహించవలసిన బాధ్యతలు ఉంటాయి. హక్కు మాత్రమే వినియోగించుకుంటాను, బాధ్యతను పట్టించుకోను అంటే చిక్కులు వస్తాయి. వాళ్లు జీతం కూడా ఇవ్వకపోవచ్చు. ఇక్కడ ఓటు మన హక్కు. కానీ ఓటు వేయకపోతే జరిగే దుష్పరిణామాలు నేరుగా, వెంటనే ప్రభుత్వం ద్వారా కన్పించవు. కానీ పరోక్షంగా వాడి భవిష్యత్తు అంధకారమయమవు తుంది. కాబట్టి కొందరేమో నష్టపోతున్నాం కాబట్టి బాధ్యతగా వేస్తున్నారు. ఈ దృష్టి లేనివాడు బాధ్యతను నిర్వర్తించడం లేదు. కాబట్టి ఓటు హక్కు వినియో గించుకోవడాన్ని ఒక బాధ్యతగా ఏలా మలచాలో ఆలోచించాలి.

ఇంత విలువైన ఈ ఓటుకు సంబంధించిన కొందరి ఆలోచనా సరళి ఎట్లా ఉందంటే` ఈ ఒక్కసారి ఓటు వేయకపోతే ఏమవుతుంది? ఈసారికి నేను ఆగుతాను; అనుకునే వ్యక్తుల తీరు కూడా మనం చూస్తున్నాం. ఈ రకమైన ఆలోచన వల్ల ప్రజా స్వామ్యం ఎలాంటి పరిణామాలకు లోనౌతుంది?

పరిణామాలు చాలా తీక్షణంగా ఉంటాయి. మన ఎన్నికల విధానాన్ని ఫస్ట్‌ పాస్ట్‌ ది పోస్ట్‌ అంటారు. ఇందులో ఏ వ్యక్తి అయినా ఒక్క ఓటుతో గెలువవచ్చు లేదా ఓడిపోవచ్చు. ఒక్క ఓటు, పది ఓట్లు, వంద ఓట్లు కావచ్చు. అంటే ఒక్క ఓటుతో గెలవడం, ఓడిపోవడం ఈ ప్రజాస్వామ్య విధానంలో ఉంది. అందువలన నా ఓటుదేముందిలే అని ఎవరు అనుకుంటారో అతని ఓటు వలన ఆ అభ్యర్థి ఓడినట్ల యితే లేదా నా ఓటుదేమున్నదిలేనని వందమంది ఓటు వేయకపోవడంతో ఆ అభ్యర్థి ఓడిపోయాడు కదా! కాబట్టి ప్రతి ఓటు ఎన్నికను ప్రభావితం చేసేదే. మన ఓటుతో గెలిస్తే, ఆ ఎన్నికయిన వ్యక్తి రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి కావచ్చు, దేశంలో అయితే ప్రధానమంత్రి కూడా కావచ్చు. మనకు తెలుసు, ప్రధానమంత్రి స్థానం కూడా ఒక్క ఓటుతో తారుమారైన పరిస్థితులు. ఆ ఒక్క ఓటు, ఎంపీ ఓటే అనుకోండి! ఆ ఒక్క ఎంపీ వంద ఓట్లతో గెలిచి నాడనుకోండి! ఈ వందమంది ఓటర్లు ప్రధానమంత్రి ఎంపికను ప్రభావితం చేశారని అనుకోవాలి. ఈ రోజు మూడువందల లక్షల కోట్ల లక్షల జీడీపీ కలిగినది భారతదేశం. 5 సంవత్సరాలు (ఒక ప్రధాని పాలించే) అంటే 15 వందల లక్షల కోట్లు. ఒక లక్ష కోట్లు అంటే! లక్ష అంటే – 5 సున్నాలు. కోటి అంటే 7 సున్నాలు. అంటే 1500 పక్కన పన్నెండు సున్నాలు. అంటే ట్రిలియన్లు. 15 వందల ట్రిలియన్లను ప్రభావితం చేసే వ్యక్తిని ఈ ఒక్క ఓటుతో ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటుకు విలువలేదని ఎందుకు చెబుతాం, ఎలా చెబుతాం? ప్రధాన ప్రత్యర్థులలో ఎవరి గెలుపోటము లైనా 5 శాతం, 10 శాతం లేదా ఒక శాతంతోనే ఉంటాయి. కాబట్టి, మన ఓటు చాలా విలువైనది. దానిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయడానికి వీలులేదు. కచ్చితంగా వేయవలసిన అవసరం ఉంది.

ఓటు హక్కును ఉపయోగించుకోని వ్యక్తులూ, సమూహాలూ చూసినపుడు స్త్రీలు, పురుషులు, ఆ తరువాత నడివయస్కులు, యువకులు, వృద్ధులు; మళ్లీ వీళ్లలో సంపన్నులు, పేదలు, మధ్యతరగతి – ఇట్ల చూసినప్పుడు, ఏ సమూహం ఎక్కువగా ఓటింగ్‌కు దూరంగా ఉందని మీరు భావిస్తున్నారు?

ఇప్పుడు పురుష, స్త్రీ ఓటర్లను తీసుకుంటే, స్త్రీల ఓటింగ్‌ శాతం తక్కువగా ఉంది. ఇదమిత్థంగా కాకున్నా, గణాంకాలు చెబుతున్నది మాత్రం ఓటింగ్‌లో స్త్రీల శాతం తక్కువ. విదేశాలలో కూడా స్త్రీల పర్సంటేజ్‌ తక్కువే. వాళ్ల హక్కులు కాలరాయ డానికి ఇదీ కారణమే. అదే, ఎక్కువ శాతం స్త్రీలు ఓటింగ్‌లో పాల్గొన్నట్లయితే, ఎన్నికల్లో పోటీ చేసేవారు వీరిని దృష్టిలో పెట్టుకొని విధానాలు నిర్ణయించు కుంటారు. ఎప్పుడైతే ఓటింగ్‌లో మహిళల శాతం తగ్గుతుందో అప్పుడు అభ్యర్థికి వచ్చే అభిప్రాయం ఒక్కటే. మీకు (మహిళలకు) అన్యాయం జరిగినా ఫరవాలేదు. నేనేమీ మీ ఓట్ల శాతంతో ప్రభావితం కాను వంటి అభిప్రాయానికి రాజకీయ వేత్తలు వచ్చే అవకాశం ఉంది. సంపన్నులు, మధ్యతరగతి ఓటర్ల శాతం కూడా తక్కువగానే ఉంది. ఓటు వేసే వారిలో నిరుపేదల శాతం ఎక్కువ. ఎందుకంటే ఉచిత పథకాలు ఎక్కువగా వారికే వర్తిస్తాయి. అలాగే డబ్బుతోనూ, మద్యంతోనూ ఏదో విధంగా ప్రభావితం చేస్తున్నారు. మధ్యతరగతి, సంపన్నవర్గాలను నాయకులు పట్టించుకోవటంలేదు. ఏ వర్గం నుంచి ఓటింగ్‌ ఎక్కువ శాతం ఉండదో వాళ్ల అవసరం లేదు కాబట్టి వాళ్లను నేతలు ప్రభావితం చేయాలని అనుకోవటం లేదు. అంటే నాగరికులు అని చెప్పే వ్యక్తులు ఉన్నచోట ఓటింగ్‌ శాతం తక్కువగా ఉంటుందని మనం గమనించాలి.

వృద్ధులు ఎలా స్పందిస్తారు? యువతరం ఎలా స్పందిస్తున్నది?

వృద్ధులు ఒక్కొక్కసారి రాలేకపోవచ్చు. కానీ వారికి ఎన్నికల కమిషన్‌ చాలా వెసులుబాటు కలిగించింది. నిజానికి వాళ్ల ఓటింగ్‌ పర్సంటేజ్‌ ఎక్కువ. ఎందుకంటే వాళ్లు బాధ్యతగా వ్యవహ రిస్తారు. ఓటు లేకపోతే నేను బ్రతికినట్టా లేనట్టా అని ఆ తరం ప్రశ్నించుకుంటూ ఉంటుంది. యువకులు, విద్యావంతుల తరువాత విద్యార్థుల వర్గం చెప్పుకోదగ్గది. వీళ్లను మనం తప్పకుండా అడ్రస్‌ చేసి ప్రభావితం చేయవలసిన అవసరం ఉంది.

ప్రట్టణాలలో, నగరాలలో ఇటీవలి కాలంలో ఓటింగ్‌ శాతం పడిపోతోందన్నది నిజం. కారణాలు ఏమిటి? నిరాసక్తత అనుకోవాలా?

జ: పట్టణ,నగర ఓటర్ల ఓటింగ్‌ శాతం తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం, వారు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉండటమే. గ్రామీణ ప్రాంత ప్రజల మాదిరిగా రాజకీయ నాయకులపై ఎక్కువగా ఆధారపడి ఉండకపోవడం. తన ఉద్యోగ భద్రత గురించి విశ్వాసం ఉండటంతో నాయకులు తమకు చేసేది ఏముంటుందనే ఒక నిర్లక్ష్య భావనతో ఓటు వేయకుండా ఉండటం ఒక కారణం. పట్టణవాసులు గ్రామీణులలా స్థిరనివాసం ఏర్పరచుకొని ఉండరు. తమ ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడిన కొద్దీ వారు ఆ ప్రాంతాన్ని వదిలి మరొక ప్రాంతానికి వెడు తుంటారు. అందుకే ఓటు నమోదు చేసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తారు. మరణించినప్పుడు లేదా ఆ ప్రాంతాన్నే వదిలి వెళ్లడం వంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ విషయాన్ని అప్‌డేట్‌ చేయడం అవసరం. అది జరుగడం లేదు. పల్లెల్లో వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి మరణించేవరకూ ఆ ఇంట్లోనే ఉంటాడు. నివాసం మారినా, మరణించినా అందరికీ తెలుస్తుంది. అందుకే ఓటింగ్‌ శాతాలలో మార్పు వస్తుంటుంది.


పి. రాఘవేంద్ర

ఓటు హక్కు వినియోగంలో స్త్రీపురుష వ్యత్యాసం ఎక్కువ అని ముందు నుంచి అభిప్రాయం ఉంది. దాని గురించి ఏమంటారు?

మహిళకు సంబంధించి మొదటి నుంచి కూడా పురుషులు మహిళలు ఓట్ల శాతం మధ్య వ్యత్యాసమెంత అని లెక్కించే పద్ధతే ఉంది. మహిళలు పురుషులు అనే జెండర్‌ గ్యాప్‌ ఎంత అన్న గణాంకాలు చూస్తే 1962లో 16 శాతం ఉంది. పురుషులు 60 ఉంటే మహిళలు 44 మంది. అంటే 16 శాతం. ఈ అంతరం తగ్గుతూ వచ్చింది. 2009, 2014, 2019 చూస్తే 2014కు వచ్చేసరికి ఆ అంతరం 4 శాతం. 2019కు వచ్చేసరికి అది మొదటిసారి ప్లస్‌ వన్‌కు వచ్చింది ఆ అంతరం. ఇద్దరు దరిదాపు సమానం. అంటే పురుషుల కన్నా ఒక పాయింటు జీరో పర్సంట్‌ మహిళలు ఎక్కువ వేశారు. మొట్టమొదటిసారి 2019లో 70మంది మహిళలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అత్యధిక సంఖ్యలో మహిళలు ఎంపికైంది కూడా 2019 లోనే. మహిళలు ఓటు వేస్తేనే వీళ్లు గెలిచారా అంటే చెప్పలేం. జెండర్‌ గ్యాప్‌ అయితే తగ్గుతున్నది. దానితో అనేక విషయాలు చర్చకు వస్తున్నాయి.

ఉచితాలు ప్రకటించడం మీద విమర్శలే ఎక్కువ వినిపిస్తాయి. వీటిని అదుపు చేయవలసిన అవసరం లేదా?

ఆచరణాత్మకంగా ఏదో పరిమితి ఉండాలి అందరూ ఉచితాలు ప్రకటించడం ఆందోళనకరం. రాజకీయ పార్టీలు ప్రకటనను నమ్మిన వాళ్లు ఓట్లు వేస్తున్నారు. బడ్జెట్‌లో 10 శాతం మాత్రమే ఉచితాలివ్వాలని పరిమితి ఉండాలి. ఏదో ఒక కమిటీ ఉండి దాని ద్వారా మానిఫెస్టో ఆమోదం పొందాలే తప్ప ఓటర్ల దానిని పరిశీలించి, ప్రశ్నించే చైతన్యాన్ని ఆశించలేం.

ఓటింగ్‌ పట్ల పట్టణాలలో, నగరాలలో నిరాసక్తత వచ్చిందంటారా?

పట్టణవాసులలో ఓటు హక్కు మీద నిరాసక్తత ఉంటుందన్నది సరికాదు. నలుగురు ఎక్కడ కలిసినా రాజకీయాలే మాట్లాడతారు. సోషల్‌ మీడియాలోనూ అదే చర్చ. కానీ, ఓటు వచ్చేసరికి ప్రజల అజెండాకు కాక ఆ కులం, ఈ కులం, ఆ పార్టీ, ఈ పార్టీ, వారి అవినీతెంత, వీరి అవినీతెంత, ఓటర్ల జాబితా సరిగ్గా లేదు… అభ్యర్ధులు తమకు అవగాహనలేని, సంబంధం లేని విషయాల గురించి మాట్లాడడం వల్ల నిరాశ ఏర్పడుతుంది. ప్రజా అజెండా వచ్చినప్పుడే ప్రజల్లో ఆసక్తి పెరుగుతుంది, ఓటింగ్‌ శాతం పెరిగే అవకాశముంది.

About Author

By editor

Twitter
YOUTUBE