సంపాదకీయం

శాలివాహన 1946 శ్రీ క్రోధిచైత్ర బహుళ త్రయోదశి – 15 జనవరి 2024, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


అనేకానేక నాలుకలే కాదు, ఎన్నో కోరలూ ఉన్న అత్యంత ప్రమాదకర విషనాగు కాంగ్రెస్‌. భారతీయ నాగరికతనీ, ఆ పార్టీలో చేరే ప్రతి తరం నాయకత్వాన్నీ, శ్రేణులనీ, నమ్మినవారినీ ఒక్కొక్కరినీ ఒక్కొక్క తీరులో కాటు వేస్తుంది. వాళ్ల మెదళ్లని ఒక్కొక్క రకం విషంతో నింపుతుంది. అదంతా దేశ వ్యతిరేకమే. ఇదే దాని చరిత్ర. ఈ ఎన్నికలలో మరింత బుసలు కొట్టే ప్రయత్నం చేస్తూ, రెట్టింపు విషాన్ని చిమ్మే ప్రయత్నం చేస్తోంది.

రెండు దశల పోలింగ్‌ పూర్తయినా బీజేపీ ప్రభుత్వం మీద ఒక్క అవినీతి ఆరోపణ కూడా చేయలేక కనిపించిన అడ్డతోవనల్లా తొక్కుతోంది కాంగ్రెస్‌. బీజేపీ మీద రాజ్యాంగం మార్చేస్తుందన్న దుష్ప్రచారం, రిజర్వేషన్‌లు ఎత్తివేస్తుందన్న విష ప్రచారం అందులో భాగమే. నిన్న కాక మొన్న ముఖ్యమంత్రులైన అంగుష్ఠమాత్రులు కూడా అమిత్‌షా వంటి మేరునగధీరుడి మీద బురద చల్లడానికి నానా గడ్డి కరుస్తున్నారు. అధిష్ఠాన దేవతల సమక్షంలో మరింత రెచ్చిపోతున్నారు.  ఒక ఫేక్‌ వీడియోను ఆధారం చేసుకుని రిజర్వేషన్‌ల గురించి అనని మాటలతో అమిత్‌షాను, బీజేపీ గెలుపు అవకాశాలను పలచన చేసే నీచత్వం కూడా అందులో భాగమే. దానికి తెలంగాణ కాంగ్రెస్‌ కేంద్ర బిందువైంది. ఫేక్‌ వీడియో తెచ్చిన నోటీసుల గురించి వ్యాఖ్యానిస్తూ, బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది, రిజర్వేషన్లు ఎత్తివేస్తుంది అని మళ్లీ నోటివాటం ప్రదర్శించడం అంటే ఏమిటి?

‘మా మీద రాజ్యాంగాన్ని రుద్దారు’ అంటూ గోవా కాంగ్రెస్‌ అభ్యర్థి విటారియో ఫెర్నాండెజ్‌ ఎన్నికల ప్రచారంలో అన్నాడు. అంటే అసలు ఈ రాజ్యాంగాన్ని ధిక్కరించినట్టు కాదా! ఆ గోవా వాచాలుడి మాటలకి అర్ధం చెప్పి వీళ్లంతా బీజేపీని విమర్శించాలి. అంతేతప్ప, విటారియో వికృతభాష్యం సంగతే ఎరగనట్టు నటిస్తూ బీజేపీని లక్ష్యంగా చేసుకోవడం పచ్చి దగా. నిజం చెప్పాలంటే కాంగ్రెస్‌ పార్టీ ఆరు దశాబ్దాల పాలనలో ఎన్నోసార్లు రాజ్యాంగాన్ని శిరచ్ఛేదం చేసింది. డాక్టర్‌ అంబేడ్కర్‌ ఆత్మను లెక్కలేనన్ని పర్యాయాలు గాయపరిచింది. రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను అవమానించింది. అత్యవసర పరిస్థితి విధింపు, షాబానో కేసు తీర్పు పట్ల వైఖరి అందుకు పరాకాష్ఠ.

ఎన్నికల వేళ మాత్రమే రాజ్యాంగ రక్షణ గురించి ఆపసోపాలు పడుతున్నాయి ఈ పార్టీలు. ఈ విషయంలో కాంగ్రెస్‌, కొన్ని ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలు ఒకదానికొకటి ఉమ్మడి తోకల్లా అలంకరించుకుంటున్నాయి. వీటిలో ఏ ఒక్క పార్టీకి అయినా రాజ్యాంగం మీద కనీసం గౌరవం ఉందా? సనాతన ధర్మం గురించి డీఎంకే చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగబద్ధమా? దేశాన్ని ముక్కలు చేస్తామని అరిచిన కన్హయకుమార్‌కి కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఇచ్చింది. పార్లమెంట్‌ మీద ఉగ్రదాడి కేసులో నిందితుడిని ఉరితీయడమేమిటని గొంతు చించుకున్న ఈ వింతజీవిని  దేశ అత్యున్నత చట్టసభకు పంపగోరుతోంది ఈ దౌర్భాగ్య కాంగ్రెస్‌. రాజ్యాంగం ఎడల భక్తి అంటే ఇదా? కన్హయకుమార్‌కి రాజ్యాంగం మీద గౌరవం ఉందని ఎవరనగలరు? తలబొప్పి కట్టేట్టు కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా జైలు నుంచే పాలిస్తాను తప్ప పదవిని చస్తే వీడను అంటున్న కేజ్రీవాల్‌ వైఖరి రాజ్యాంగబద్ధమా? అవినీతిపరులు బీజేపీలోకి వెళితే వాషింగ్‌ మెషీన్‌ పద్ధతిలో పరిశుద్ధులైపోతారని విమర్శించే ప్రతిపక్ష క్షుద్రజీవులకు ఇదంతా కనిపించదా? బీజేపీని వ్యతిరేకిస్తే చాలు, లెక్కలేనన్ని కేసులతో జైలులో కూర్చున్నా విపక్షం  శిబిరంలో దూరితే శుద్ధపూసలైపోవడం లేదా? జైలుకు వెళ్లి, ఇప్పటికీ కేసులు ఎదుర్కొంటున్న లాలూ ప్రసాద్‌్‌, యావన్మంది పరివారం బీజేపీ వ్యతిరేకత అన్న ఒక్క వీరతాడుతో విపక్షాల దృష్టిలో పునీతులుగా చెలామణి కావడం లేదా? సెక్యులరిజానికీ, మైనారిటీల హక్కులకీ రక్షణ కవచాలైపోలేదా? ఆఖరికి సందేశ్‌ఖాలీ పాపంతో పాటు వందలాది పాతకాలను నెత్తిన మోస్తున్న, కోర్టుల చేత చీవాట్లు వేయించుకుంటున్న మమతా బెనర్జీ బీజేపీ వ్యతిరేక మూకకి  ఇప్పటికీ వీరమాత కాదా!

సోదర భారత పౌరులారా? హిందూ బంధువులారా? ఇదంతా వర్షాకాలంలో మాదిరిగా ఎన్నికల రుతువులో వినిపించే కప్పల బెకబెకలు కావని గుర్తించండి! ఇప్పటికీ హిందూ సమాజం నిస్సహాయంగా, అమాయకంగానే ఉందనుకుంటూ దాడికి ఉరుకుతున్న రేసుకుక్కల రాక్షసత్వమని మరచిపోవద్దు. హిందూ వ్యతిరేకతే రహస్య అజెండాగా వస్తున్న ఏ పార్టీని క్షమించవద్దు. అవన్నీ జార్జ్‌ సోరెస్‌లు, చర్చ్‌లు, మసీదుల అండతో మొరుగుతున్న సంగతి పట్ల ఏమరుపాటు వద్దు. నీవు ఏ పార్టీకైనా ఓటు వేయవచ్చు. కానీ ఆ ఓటు, ఆ ఓటుతో ఎన్నికైన అభ్యర్థి ఈ దేశ సమైక్యతకు పనికిరావాలి. ఈ దేశ గతంతో వర్తమానానికి ఉన్న బంధాన్ని గౌరవించాలి. మెజారిటీ ప్రజలను ద్వితీయ శ్రేణికి నెట్టేసే విదేశీశక్తుల ముందు మోకరిల్లకుండా ఉండితీరాలి. నా ఓటు ఐదేళ్లో, పదేళ్లో అనుభవించే అధికారం కోసం, శతాబ్దాల భారతీయ నాగరికతను బలిపెట్టే నికృష్టులకు బలికారాదన్న స్పృహ ప్రతి ఓటరులోను అనివార్యం.

ఓటు పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నది మధ్య తరగతి హిందువులేనని చెప్పడం విచారకరమే అయినా, వాస్తవం. ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడిన, పోయిన స్వాతంత్య్రాన్ని తెచ్చిన మధ్య తరగతి వారసత్వాన్ని వారు విస్మరించరాదు. ఇవన్నీ రాజకీయ నినాదాలు కావు. కొందరు రాజకీయ క్షుద్రులు చెప్పే ఫేక్‌ మాటలు కావు. ఈ ఆశయం భ్రమ కాదు. భవిష్యత్‌ మీద విశ్వాసం. హిందువుగా నీవు బతకడానికి మిగిలిన ఏకైక భూమి ఇదే. ఈ పుణ్యభూమిని, వేదభూమిని కాపాడుకోవడానికి ఓటును ఆశ్రయిద్దాం. తప్పక ఓటు వేద్దాం. మన ధర్మం, మన భూమి, మన నాగరికతల రక్షణకు ఈ తరం చేయగలిగే పెద్ద సాయం ఇదే.

About Author

By editor

Twitter
YOUTUBE