మే 25 నుంచి దుర్గావాహిని శౌర్య ప్రశిక్షణ వర్గ
బాల, లలిత, అన్నపూర్ణ, వారాహి,పరాశక్తి, భువనేశ్వరి, చండి…ఈ అన్నీ కనకదుర్గ నామాంతరాలు. దుర్గాభవానిగా లోకాన్ని కాపాడుతుంది. బాల లలితాన్నపూర్ణగా సున్నిత తత్వమున్నా, సందర్భానుసారం సునిశితంగా వ్యవహరిస్తుంది. విమలగాత్రిగా విజయధాత్రిగా నిలిచి, సంరక్షక కంచుకోటలా గెలిచి ఘన బావుటాను ఎగురవేస్తుంది. కనకదుర్గా భవానీమాత ఆశీస్సులే సకల జన పరిరక్షకాలు. అపరాజిత ఆమె. శిష్టరంజని, దుష్టగర్వభంజని అచల, అనంత, భార్గవి, భద్రకాళి బుద్ధి, సిద్ధి, కల్యాణీ, కాత్యాయని అన్నీ తానే!
వాహిని అంటే నదీ ప్రవాహధార. మరో కోణంలో సేనా విశేషం. ఖ్యాతి అని కూడా అర్థం.
ఇప్పుడు అవగతమవుతోంది కదూ! దుర్గావాహిని ఒక అజేయ శక్తిశాలిని.
జగత్ కంటకుడైన నరకుడి దురహంకారాన్ని నేలమట్టం చేసింది సాత్రాజితి.
విశేష విభ్రాజదవక్ర విక్రమ పరాక్రమ భారత వీరనారి కాబట్టే అంతటి జైత్రయాత్ర.
‘ఇది మహాశక్తి విజయ, మియ్యది దురంత
దుర్మద పరాజయమ్ము! ఘాతుక కిరాత
జాతి పెనుభూతములకు శాశ్వత సమాధి!’
అంటూ గర్జించింది సింహేంద్ర వాహన. అందుకే నిఖిలలోకమూ జయజయ ధ్వానాలు పలికింది.
అబల అనే పదాన్ని నిషేధించి, ‘సబల’ను ఆవిష్క రించింది దుర్గావాహిని మహిళాశక్తి. నేటి యువతుల్లో ధార్మిక నిష్ఠతోపాటు ఆత్మస్థైర్యాన్ని పెంచి పరిపోషిం చేందుకు వారంరోజుల విస్తృతస్థాయి ‘శౌర్య ప్రశిక్షణ’ను ఈమే నెలాఖరు వరకు నిర్వహిస్తోంది. శ్రీకాకుళంలోని గాయత్రీ కళాశాల ప్రాంగణ వేదికగా మార్గదర్శనం అందిస్తోంది. యుద్ధవిద్యలో మరింత నేర్పు కలిగించి, సాంస్కృతిక వికాసాన్ని అంతటా విస్తరించి, సమైక్య కుటుంబ భావనను ఫలప్రదం చేస్తోంది.
సంస్థాగతంగా విశ్వహిందూ పరిషత్‌ది అర్ధశతా బ్దికి మించిన, తరతరాల ధీరత నిండిన చరిత్ర. సామాజిక సేవాకార్యక్రమాల పరంపరతో, సంకల్ప బలంతో పురోగమిస్తున్న వ్యవస్థ. బజరంగదళ్ మహిళా విభాగమే దుర్గావాహిని. ధర్మోరక్షతి రక్షితః అన్నదే నాదం, విధానం, ఏకైక సూత్రం.
జాతికి భవ్యదీక్ష, భాగ్యరక్ష
లలిత నవోషస్సువోలె విలసిల్లిన బాల
జీవన సౌఖ్యామృతము నిండిన కల్యాణి
ఇంటిని వెలిగించే నిరుపమ దీపం –
కుటుంబ జీవనయానమంతటికీ సూచిక మార్గం! భవిష్యత్ భానుదీప్తి, నిత్యనిరంతర క్రాంతి!
ఇంతింత ప్రాధాన్యమున్నందునే, దుర్గావాహిని ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. యువతుల పాత్ర ఏమిటి?గృహిణిగా ప్రాథమిక కర్తవ్యాలేమిటి? మాతృమూర్తిగా సంతానాన్ని ఎలా రూపుదిద్దాలి? అనే అంశాలను విస్తారంగా వివరిస్తూ వస్తోంది. ఇంటాబయటా కూడా నిర్వర్తించాల్సిన వాటి గురించి అధ్యయన, అవగాహన, శిక్షణ, ఆచరణీయ శిబిరాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా 16 నుంచి 36 సంవత్సరాల వారికి మేలిమి బాట చూపుతోంది.
జీవితం అనేక అంశాల సమాహారం. చరిత్ర తెలుసుకోవడం, అధ్యాత్మికత పెంచుకోవడం అందులో అంతర్భాగాలు. వాటితోపాటు వివిధ స్థితిగతుల్లో తనను తాను అన్ని విధాలా రక్షించు కోవడం, ఇతరులనూ సంరక్షించడానికి ముందడుగు వేయడం అత్యవసరాలు. సరిగ్గా ఈ విధమైన వాతావరణాన్ని సృజించడమే ప్రథమ ధ్యేయమని, ప్రతీ కుటుంబం నుంచీ యువతులు స్ఫూర్తి పొందాలనీ విభాగ నేతలు లోకనాథం ఆనందరావు, శ్రీరంగం మధుసూదనరావు, దుర్గావాహిని ప్రముఖ్ సింహాద్రి హైందవి అభిలాష.
మన సంస్కృతిలోని జీవన మూల్యాలు అనేకం. వాటన్నింటినీ యువతకు విశదీకరించడం ముందుగా జరగాల్సిన పని. కార్యక్షేత్రంలో తటస్థపడిన బాధితులను ఓదార్చి, చెంత చేర్చుకుని ఆదరించి, న్యాయం జరిగేలా చూపడడం అత్యంత ముఖ్యం. సహాయ సహకార సమన్వయాల ద్వారా వెలుగుపూలు పూయించాలన్నదీ విభాగ అంతస్సూత్రం.
నిస్సహాయత, నిరాదరణ స్థితి, సహించడం, భరించడం… ఇంకెంతకాలం? సామాజిక దురన్యాయాలను ఎక్కడికక్కడ ప్రతిఘటించడం… ఇంకెప్పుడు సాధ్యం?
‘జీవనగీతం’ కర్త అవలోకించినట్లు –
పాపలేని ఊయలను ఊచే బాలెంత కడుపుతీపు/శాపంతో రూపుచెడిన వనిత జాలి చూపు/కలతల నలతల ఒడిలో చిక్కి సొక్కి సోలుతున్నవారి బాధ గట్టుమీది గడ్డిపరక చెప్పిన కన్నీటి కరుణామయ గాథ/ వీటన్నింటిని చూసీ, వినీ, తెలుసుకునీ స్పందిం చని మనసంటూ ఉంటుందా?/ తనమీద తనకు నమ్మకం, తనదైన శక్తితో సాగే ప్రాబల్యం/ ఈ రెండూ ఉంటే, ప్రతీ యువతీ ధీర. శాసించగలిగిన వీర.
ఇటువంటి జీవనాంశాలన్నింటినీ విపులీకరి స్తోంది దుర్గావాహిని. గృహ వైద్యం, ప్రాథమిక చికిత్సలతోపాటు సంప్రదాయ ఔషధీయ, మానవీయ వైనాలనూ ఉదాహరణలతో సహా చెప్తోంది. దేశీయ భావనా నిష్ఠను పెంపొందిస్తోంది.
సంఘటన శక్తి, ఇదంతా ఉంటే, ఏదీ అసాధ్యం కాదు. అఘాయిత్యాలను ఎదిరించి నిలువరించే యుక్తి. ఇదే జరిగితే, పీడన అన్నదే ఉండదు. స్త్రీ గౌరవానికి ఎప్పుడు ఎక్కడ భంగం కలిగినా ముందుకు దూకుతుంది యువతీశక్తి. కలసికట్టుగా రంగ ప్రవేశం చేసి, న్యాయసాధన కోసమే ఉద్యమిస్తుంది.
రుద్రమదేవిని గుర్తుచేసుకుందాం. శౌర్య ధైర్యాలను స్మరించుకుందాం.
అశ్వారోహణలో ఆరితేరిన
ఖడ్గయుద్ధంలో నిపుణత గడించిన
శస్త్ర శాస్త్ర సకల కళా సంపన్న ఆమె.
చతురోపాయముల చతురురాలు
ధనుర విద్యాకౌశలమున దక్షురాలు,
తెలుగుతల్లి గౌరవ శిఖరం మీద తేజోరేఖలా మెరిసి / తెలుగు రాణి రతనాల మౌళిమీద ఆశీస్సుమాలు కురిసి / ఆ భుజశౌర్య దీధితులన్నీ అఖండంగా మనగలిగాయి ఆనాడు! / దురన్యాయాల పైన పోరాటభేరి మోగించి నప్పుడు… / ఆమె ప్రళయకాల మహోగ్ర భానుకిరణం / కల్పాంత కుపిత సాగర తరంగవేగం! / వీరనారీ శిరోమణి భారతీయ / గౌరవపతాక రుద్రాంబికా మతల్లి / విజయదుందుభి మోగించి ప్రజల నేలె / దేశమందెల్ల సుఖశాంతి తేజరిల్ల / వెలుగు వెల్లువలు నింపిన
ఆ తెలుగురాణిని ఆదర్శంగా భావిస్తుంది దుర్గావాహినీ బృందం. లక్ష జనసంఖ్య ఉన్న ప్రతీ నగరాన్నీ ఎంపిక చేసుకుంది. నిర్ణీత ప్రాంతంలో సేవా కార్యక్రమాలు అమలు జరుపుతోంది. విభాగం నిర్వహించే కార్యకలాపాల పేర్లే వాటి విశేషాన్ని తేటతెల్లం చేస్తాయి.
బాల సంస్కార కేంద్రం: పిల్లలలను భావిభారత ఆదర్శపౌరులుగా తీర్చిద్దడం.
శక్తి సాధనా కేంద్రం: అంతర్లీన శక్తియుక్తులను వెలికితెచ్చే కార్యక్రమ భాగం.
అదేవిధంగా సంఘంలో విద్య, వైద్యం వంటి కీలక రంగాల పరంగా ప్రత్యేకత నిలబెట్టే పనులను రూపొందిస్తోంది.
దుర్గావాహిని ఆరంభమైంది దుర్గాష్టమి రోజున. ఆనాడే అంటే నలభై ఏళ్ల కిందటే శక్తిపూజ అయింది. సేవ, సురక్ష, సంస్కారం అనేవి త్రిసూత్రాలు. యువతులను జాగృతపరచడం ద్వారా ధర్మ సంస్కృతులను పరిరక్షించాలన్నదే పరమాశయం. కోమలతత్వానికి, శక్తిమంత ప్రవృత్తిని జోడించి సకల విధాల ఆరోగ్యకర వాతావరణాన్ని సృష్టించాలన్నది మేటి సంకల్పం.
నేడు మన కళ్లముందు ఎన్నో కనిపిస్తున్నాయి. ధార్మిక రాహిత్యం పెచ్చరిల్లుతోంది. అభద్రత ఇంకా తాండవిస్తూనే ఉంది. అసమానత ఇప్పటికీ పట్టి పీడిస్తోంది. నీతిరహిత వర్తనం సరేసరి. వీటన్నింటినీ తిట్టుకుంటూ కూర్చుంటే సరిపోతుందా? అంధకారాన్ని తరిమేయాలి. కాంతిని ఆహ్వానించాలి. ఈ ప్రయత్నంలో వ్యక్తిగా, సంఘ భాగస్వామిగా ఎవరు ఎంత చేయగలరో అంతా చేస్తేనే సమున్నతి. ప్రయత్నిం చకపోతే, కనీసం చిరుదీపాన్ని అయినా వెలిగించడానికి ముందుకు రాకుండా ఉంటే ఎలా? అన్నది యువతులందరికీ ఈ విభాగం వేస్తున్న సూటి ప్రశ్న. సమాధానమూ మన దగ్గరే ఉందని, ఉమ్మడి బలంతో లక్ష్యాలు సాధిద్దామనీ ఎంతగానో ప్రోత్సహిస్తోంది.
అది సుపర్వదినం, సగర్వకారణం/ఆ రోజున అదొక అరుణోదయ సమయం / దుర్గామహాదేవి ఆలయ ఆవరణం/ వీరమాత జిజియా ఆరాధిస్తోంది జగజ్జననిని./వచ్చి కూర్చున్న బాలశివాజీ నుదుటన/పూజా కుంకుమంతో విజయ తిలకం దిద్దింది./కళకళ వెలిగే కర్పూరహారతిని/కన్నబిడ్డ కన్నులకు సుతారంగా అద్దింది/కరిగిన హృదయంలో నిండారా మదితో/శివుని శిరసును మెలమెల్లన నిమిరింది/ఆ జనని ఆనంద బాష్పాలు -లోకజనని ఆశీః పుష్పాలు!/బంగరు బిడ్డకు ప్రబోధిస్తూ పలికిందిలా అంతర్వాణి-/నీతోటివారిని మరవకు, అధర్మానికి వెరవకు/మంటలు రేపిన తుంటరులను మన్నించకు/చెలువల వలువలూడ్చిన తులువలను క్షమించకు/ఖండించు క్రౌర కౌటిల్యాల శిరస్సు/పండించు భరతవంశం తపస్సు!
‘జయభవాని! పేరున కరుణశ్రీ వెలువరించిన ఈ రచనాంశాన్ని నేటికీ సమన్వయించుకోవాలి. తల్లి జిజియా, తనయ/తనయుడు ధీరగాథలను తలపులోకి తెచ్చుకోవాలి. పురాణకథలు, ఇతిహాసాల వివరాలు యువతులు తెలుసుకుంటే, అనంతర కాలంలో వారి కుటుంబాలు కర్తవ్య నిబద్ధతతో వర్థిల్లుతాయి. అందువల్లనే ప్రత్యేక సమ్మేళనాల నిర్వహణతో యువతీ దక్షతను విస్తారం చేస్తోందీ దుర్గావాహిని.
ప్రతీ ఒక్కరికీ వివేకం, అలాగే సాహసమూ ఉండి తీరాలి. ఆ రెండింటి కలయికే అద్భుత ఫలితాలకు నాంది. అభ్యాస వర్గలూ ప్రశిక్షణా వర్గలూ నడపటంలో సంస్థ అంతరార్థం ఇదే. మనో ధైర్యాన్ని వృద్ధి చేయడం దేహశక్తినీ పెంపొందించడం ఐక్యత, శూరత విస్తరించడం సంయోజిక లేదా ప్రముఖ్ ద్వారా పనుల నిర్వహణ కొనసాగించడం.
రోజులో ఎంతైనా సమయమిచ్చే దుర్గల వల్ల సంఘటనా కార్యం ఎంతెంతగానో విస్తృమవుతోంది. సహయోగంతో బాల సంస్కార కేంద్రాలు నిర్వహిస్తు న్నారు. వైద్య సేవలో భాగంగా రక్తదాన శిబిరాలనూ నిర్వర్తిస్తున్నారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే యువ అభ్యర్థినులకు ఉచిత శిక్షణలు చేపడుతున్నారు. రక్షణ అనేది మూడు విధాలు. స్వీయ, సమాజ, సురక్షలు. వీటికి మొదటగా కావాల్సింది శారీరక దారుఢ్యం. ఈ కారణంగానే దుర్గావాహిని ఆధ్వర్యాన కర్రసాము తరగతులు నడుస్తున్నాయి.
నియమిత వ్యాయామంవల్ల శారీరక పటిమ పెరుగుతుంది. విశాల ఆలోచనల మూలంగా భావ విస్తృతి సాధ్యపడుతుంది.మనసు, శరీరం బలంగా ఉంటే ఇక కావాల్సింది ఏముంటుంది? వీరమాతల చరితలు చదివి (స్వాధ్యాయం) మనో దృఢత్వం వ్యాయామ శిక్షణల అమలుతో శారీరక పటుత్వం వీటికోసమే అహరహం పరిశ్రమిస్తున్న దుర్గావాహిని…రమ్యగుణమణి, ఆశల సంజీవని, శర్వాణి ఆ యువతీలలామ చేతిలోని ధీరభారత పతాక దిగ్దిదంతాల కాంతులు దిద్దితీర్చి గణుతిగను గాక, వేయి యుగాల దాక!
జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్