18‌వ లోక్‌సభకు జరిగే సార్వత్రిక ఎన్నికల నాలుగవ దశ పోలింగ్‌ ‌మే13న రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతుంది. రాజకీయ పార్టీలు/అభ్యర్థులు ఎన్నికల్లో గెలవడానికి ప్రచారంలో తీవ్రంగా పోటీ పడినాయి. అమలుకు నోచుకోని హామీలు, ఉచితాలు, ఆర్థిక ప్రలోభాలు చూపుతూ కొన్ని రాజకీయ పక్షాలు ఓటర్లను ఆకర్షించేందుకు  ప్రయత్నం చేశాయి. చివరిక్షణంలో అయినా పోలింగ్‌ ‌బూత్‌కు వెళ్లాలి. ఓటు వేయాలి. ఇందులో యువత పాత్ర సుస్పష్టం.

దేశ జనాభాలో15-29 యేళ్ల యువత 27.5 శాతం ఉన్నారు. వారే జాతి ప్రగతికి సంధానకర్తలు. అభివృద్ధి చెందిన ఆర్థికవ్యవస్థల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. మన దేశంలో యువత శాతం పెరుగుతుంది. 2020 నాటికే ప్రపంచంలో ‘యువదేశంగా’ నిలిచింది. జనాభాలో 40 శాతం ఉన్న యువత ముఖ్య మానవవనరు. వారి సృజనాత్మకత, ఉత్సాహం, శక్తి కలసి దేశానికి అద్భుత ఫలితాలివ్వగలవు. దేశగతిని మార్చేందుకు, సామాజిక ఆర్థిక వ్యవస్థలలో మార్పులకు యువత సారథ్యం వహించాలి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఈ లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలలో 97 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.

చైతన్యశీలురైన ఓటర్లే ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలు. ప్రగతిశీల నాయకులు చట్టసభల్లో కొలువైతేనే ప్రజా సంక్షేమం, అభివృద్ధి జరిగి జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఓటర్లు నిస్తేజం వీడి, విజ్ఞతతో నిజాయితీపరులను, సమర్థులను, ప్రజాసేవకులను ప్రతినిధులుగా ఎన్నుకోవాలి. కానీ ప్రభుత్వ నిర్మాణంలో శక్తిమంతమైన పాత్ర నిర్వహించే ఓటు హక్కు వినియోగంలో యువతరం వహిస్తున్న నిర్లిప్తత ప్రజాస్వామ్య వ్యవస్థకు శాపంగా పరిణమిస్తున్నది. దిగ్భ్రాంతికి గురి చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల వెల్లడించిన వివరాలు ఇందుకు నిదర్శనం.

ఈ సార్వత్రిక ఎన్నిక వేళ తొలిసారి ఓటు హక్కు పొందిన18-19 సంవత్సరాల వయసు గల యువ ఓటర్లు 1.89 కోట్లు. దేశ వ్యాప్తంగా 18 ఏళ్లు నిండి ఓటరుగా నమోదు కావడానికి అర్హులైనవారు 4.90 కోట్ల మంది. ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం చూస్తే కేవలం 38 శాతం ఓటర్లే జాబితాలో నమోదైనట్లు తెలుస్తుంది. 62 శాతం యువత ఓటు హక్కు నమోదులో నిర్లక్ష్యం ప్రదర్శించడం ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రాల వారీగా వారి నిర్లిప్తత గురించి చూద్దాం. బిహార్‌లో 18-19 ఏళ్ల యువతలో కేవలం 17 శాతం మంది కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. కానీ ఆ రాష్ట్రంలో 54 లక్షల మంది యువత ఉన్నారు. వారిలో 9.3 లక్షల మంది మాత్రమే ఓటు హక్కు పొందారు. డిల్లీలో అర్హతగల యువ ఓటర్లు 7.20 లక్షలు. నమోదు చేసుకున్నవారు 1.50 లక్షల మంది (21శాతం). ఉత్తరప్రదేశ్‌లో 23 శాతం, మహారాష్ట్ర 27 శాతం యువత పేరు నమోదు చేసుకున్నారు. తెలంగాణలో యువ ఓటర్లు 12 లక్షల మంది. నమోదు చేసుకున్నవారు 8 లక్షల మంది. అంటే 67 శాతం నమోదుతో తెలంగాణ దేశంలో ప్రథమ స్థానం పొందింది. జమ్మూ కాశ్మీరు 62 శాతం, హిమాచల్‌ ‌ప్రదేశ్‌ 60 ‌శాతం నమోదు చేయించు కున్నారు. కానీ 12 రాష్ట్రాల్లో 18-19 ఏళ్ల యువ ఓటర్లు ఓటుహక్కు నమోదు 50శాతానికి మించలేదు.

దీనిని అధిగమించడం అనివార్యం. అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికలు, ఓటు హక్కు ప్రాధాన్యం మీద పాఠశాలలు, కళాశాల స్థాయిలో సదస్సులు నిర్వహించాలి. విద్యార్థి సంఘాలకి ఎన్నికలు నిర్వహించాలి. ప్రజాస్వామ్య పక్రియ పట్ల విద్యార్థి దశలోనే అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహించాలి. గెలుపు ఓటములు నిర్ణయించడంలో ఓటే కీలకం. ఓటు హక్కు నమోదు, వినియోగం పట్ల యువత నిర్లక్ష్యం ఉదాసీనత విడనాడాలి.

ఈ ఎన్నికల్లో రెండు దశల పోలింగ్‌ ‌ముగిసింది. తొలి దశలో 65.5 శాతం రెండో దశలో63.5 శాతం పోలింగ్‌ ‌నమోదైంది. జనాభాకు అనుగుణంగా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా ఓటింగ్‌ ‌శాతం తగ్గి పోవడం ఆందోళన కలిగిస్తుంది.

రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యం కల్పించా ల్సిన అవసరం ఎంతైనా ఉంది. వివిధ రాజకీయ పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు ఓటు హక్కు నమోదు, ఓటు తొలగింపు, వినియోగం పట్ల యువతకు అవగాహన కల్పించాలి.

 ఎన్నికల మేనిఫెస్టోలో యువత అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన పథకాల ప్రస్తావన లేక పోవడం వల్ల నాయకుల మీద విశ్వాసం కోల్పోవడం తదితర అంశాల వల్ల యువ ఓటర్లు ఓటింగ్‌ ‌పట్ల ఆసక్తి చూపడం లేదు. దేశ అభివృద్ధికి యువత చోదక శక్తి. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. పోలింగ్‌ ‌బూత్‌కు ఉత్సాహంగా వెళ్లాలి. ఎన్నికలను పండుగలా చూడాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారనే భ్రమలను విడనాడాలి. ‘వికసిత భారత్‌’‌లో వెలుగు తెచ్చేటట్లు వజ్రాయుధం వంటి ఓటును వత్తిడులకు, ప్రలోభాలకు లొంగ కుండా తప్పని సరిగా వినియోగించుకోవాలి.

కేంద్ర ప్రభుత్వం నిర్బంధ ఓటు హక్కును ప్రవేశ పెట్టాలి. ఓటు వేయని వారికి ప్రభుత్వ పథకాల అమలు నిలిపివేయాలి. ఓటింగ్‌కు గైర్హాజర్‌ అయ్యేవారి పట్ల కఠినంగా వ్యవహరించే అంశం గురించి నిర్ణయాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించాలి. ఇతర దేశాల్లో ఓటు వేయని వారికి జరిమానా విధిస్తున్నారు.

‘‘స్వీప్‌’’ ‌వంటి కార్యక్రమాల ద్వారా ఎన్నికల సంఘం పోలింగ్‌ ‌శాతం పెంచటానికి కృషి చేస్తుంది. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదు. నగరాలలో, పట్టణాలలో ఉన్న సంఘ సేవకులు, రచయితలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సినీ ప్రముఖులు, సామాజికవేత్తలను ఓటింగ్‌ ‌శాతం పెంచటానికి రూపొందించే కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలి. పబ్లిక్‌ ‌పార్కుల్లో’, ఓటు హక్కు నమోదు, వినియోగం, ప్రాధాన్యంపై చైతన్య సదస్సులు, సమావేశాలు నిర్వహించాలి. రాజకీయాల మీద ఓటర్లకు విశ్వాసం కలిగించాలి. తాము ఎన్నుకోబోయే ప్రభుత్వం తమ ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తుందనే విశ్వాసం పెంచే విధంగా ప్రభుత్వ విధానాల రూపకల్పన కార్యాచరణ ఉండాలి. పాలనలో పౌర భాగస్వామ్యం, పారదర్శకత, జవాబుదారీతనం, విశ్వసనీయతకు పెద్ద పీట వేసే సేవలను, పాలన వ్యూహాలు అమలవుతాయనే విశ్వసనీయత ఏర్పరచాలి.

నేటియువత నేటి నాయకులే

‘నేటి యువత రేపటి నాయకులు’ అనే నినాదాన్ని మానుకొని ‘నేటి యువత నేటి నాయకులే ’ అన్న స్పృహ రాజకీయ పార్టీలకు కలగాలి. చట్టసభలకు యువత ఎన్నికయ్యే అవకాశం కల్పించి, రాజకీయాల్లో రాణించి, ప్రజాసేవ చేయడానికి రాజకీయ పార్టీలు రాచబాట వెయ్యాలి. అభివృద్ధికర, ఆదర్శవంతమైన భారత్‌ ‌నిర్మాణంలో అన్ని రంగాలలో దూసుకుపోతున్న యువతకు రాజకీయ రంగంలో ప్రవేశం కల్పించాలి. చట్టసభల్లో అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి. ప్రజాస్వామ్య పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలి. దేశంలో గుణాత్మక మార్పుల ఆవిష్కరణలో యువత శక్తి సామర్థ్యాలతో ముందుకు సాగాలి. యువత మెరుగైన, సుస్థిర రాజకీయాలతో నేరమయ రాజకీయాలను అడ్డుకొని సుస్థిరాభివద్ధి కొరకు కృషి చెయ్యాలి. ‘లే, మేలుకో! రాజకీయాలలో ముందుకు సాగిపో. లక్ష్యాన్ని సాధించే వరకు ఆగకు!’’ అన్న స్వామీ వివేకానంద బోధనల స్ఫూర్తితో యువత నిరంతరం ముందుకు సాగాలి.

నేదునూరి కనకయ్య

అధ్యక్షులు, తెలంగాణ ఎకనామిక్‌ ‌ఫోరం, కరీంనగర్‌

About Author

By editor

Twitter
YOUTUBE