ఒక పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలిని, అదే పార్టీ ముఖ్యమంత్రి నివాసంలో చచ్చేటట్టు కొట్టిన సంగతి భారత రాజధాని ఢిల్లీలో సంభవించింది. అన్నట్టు దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో ఉద్యమించానని చెప్పుకునే పార్టీ అదే. ఆ చీపురు గుర్తు పార్టీయే దాడికి గురైన ఆ రాజ్యసభ సభ్యురాలిని ముఖ్యమంత్రి నివాసం నుంచి నిర్దాక్షిణ్యంగా గెంటివేసి, సాక్ష్యాలు తుడిచివేయాలని చూసింది. నిర్భయ కేసులోనే కాదు, తరువాత మహిళల మీద జరిగిన పలు దురాగతాల మీద గొంతు చించుకున్న పార్టీలు, మహిళా హక్కుల నేతలు, ఉదారవాదుల నోళ్లు మాత్రం ఈ రాజ్యసభ సభ్యురాలి విషయంలో పడి•పోయాయి. ఆ పార్టీ పేరు ఆమ్‌ ఆద్మీ పార్టీ. దెబ్బలు తిన్న అదే పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్‌. ఆ ‌ముఖ్యమంత్రి అవినీతి వ్యతిరేకోద్యమం ముసుగులో నాయకుడై, ఢిల్లీని ప్రస్తుతం జైలు నుంచి పాలిస్తున్న అరవింద్‌ ‌కేజ్రీవాల్‌.

ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించినట్టు స్వాతి మలీవాల్‌ ‌ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసంలో దాడికి గురి కావడం ఒక విధంగా మంచిదైంది. దీనితో చాలా మంది అసలు రంగు బయటపడింది. దేశద్రోహ కుట్రలు బయటపడ్డాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు అసలు రూపాలు వెలుగు చూశాయి. అన్నా హజారే శిష్యులు ఘాతుకాలు బయటపడు తున్నాయి. ఆప్‌ అం‌టే విద్రోహుల ముఠా అన్న సంగతి బహిర్గతమైంది.

‘భారతదేశానికి ప్రధాని కావాలి లేదా ఖలిస్తాన్‌కైనా సరే’ (సన్నిహితుడు కుమార్‌ ‌విశ్వాస్‌ ‌దగ్గర ఆ ‘దేశభక్తుడు’ అన్నమాట) అన్న దురదతో వ్యవహరిస్తున్న కేజ్రీవాల్‌ ‌నిజ రూపం ఏనాడో వెల్లడైంది. ఈ పార్టీ నాయకుల సంబంధాలు, విభేదాలు అన్నీ ఒకరి రహస్యాలు ఒకరికి తెలియడం మీద ఆధారపడినవే. ఒకరిని ఒకరు బ్లాక్‌మెయిల్‌ ‌చేసుకుంటూ ఉండడం వల్లనే. కేజ్రీ, స్వాతి విభేదాలు అలాంటివే. ఢిల్లీ రైతు ఉద్యమం లోగుట్టు, పంజాబ్‌ ఎన్నికలలో ఆప్‌ ‌గెలుపునకూ, అంతకుముందే జరిగిన కేజ్రీవాల్‌ ఇం‌గ్లండ్‌ ‌పర్యటనకూ మధ్య ఉన్న బంధం కూడా ఆమెకు తెలుసు. మద్యం కేసులో అరెస్టయి 50 రోజుల అనంతరం బెయిల్‌పై బయటకొచ్చిన కేజ్రీవాల్‌కి స్వాతి పెద్ద గుదిబండలా తయారయ్యింది. తన నివాసంలోనే, తన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధిపైనే దాడి జరగటంతో ఆత్మరక్షణలో పడ్డారు. కానీ చిత్రం, బీజేపీపైన ఎదురుదాడి వ్యూహంతో దీని నుంచి బయటపడాలని విన్యాసాలు చేస్తున్నారు. రెండురోజుల పాటు నిందితుడిని దాచి పెట్టిన ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు.

మే నెల 13న కేజ్రీవాల్‌ అధికార నివాసంలో తనపై దాడి జరిగిందని ఆప్‌ ‌రాజ్యసభ సభ్యురాలు, ఢిల్లీ మహిళా కమిషన్‌ ‌మాజీ ఛైర్‌ ‌పర్సన్‌ ‌స్వాతి మలీవాల్‌ ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడు, కేజ్రీవాల్‌ ‌వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ ‌కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. స్వాతి రాత్రికి రాత్రి ‘బీజేపీ ఏజెంట్‌’ అయిపోయారు. బాగా ప్రాచుర్యం పొందిన ఆప్‌ ‌నేతల్లో స్వాతి ఒకరు. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌కు చెందిన స్వాతి పార్టీ పెట్టక ముందు నుంచే కేజ్రీవాల్‌ ఉద్యమ సహచరిణి. చదువు పూర్తయిన వెంటనే ఆమె కేజ్రీవాల్‌ ఎన్జీఓ ‘పరివర్తన్‌’ ‌లో చేరారు. 2011నాటి అన్నా హజారే అవినీతి నిరోధక ఉద్యమం ‘ఇండియా ఎగైనెస్ట్’ ‌కరప్షన్‌’‌లోని 23 మంది కోర్‌ ‌కమిటీ సభ్యుల్లో ఆమె ఒకరు. అనంతరం ఢిల్లీ కమిషన్‌ ‌ఫర్‌ ఉమెన్‌ (‌డీసీడబ్ల్యు) ఛైర్‌ ‌పర్సన్‌ ‌హోదాలో ఎనిమిదేళ్ల• ఆమె వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. 2015లో తన 31 ఏళ్ల వయసులో ఆ పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కురాలు. తన హయంలో 17 లక్షల కేసులను పరిష్కరించారు. ఈ ఏడాది జనవరిలో ఆప్‌ ‌రాజ్యసభ సభ్యత్వం పొందే వరకూ ఆమె ఆ పదవిలో ఉన్నారు.

స్వాతి ఇప్పుడు బాధితురాలిగా నిలిచింది. కానీ ఆమె కేజ్రీవాల్‌కు సరైన అంతేవాసేనని చెప్పాలి. కమిషన్‌ ‌పదవుల్లో ఆమె అవకవతకలకు పాల్పడ్డారని 2016లో ఏసీబీ ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేసింది. ఆమె హయాంలో అక్రమంగా నియమించిన 52 మంది కాంట్రాక్టు ఉద్యోగులను ఢిల్లీ లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌వి.కె.సక్సేనా మే నెలారంభంలో తొలగించి, కొత్తవారిని నియమించారు. ఇటీవలి రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ ‌ప్రముఖుడు, తన బెయిల్‌ ‌కేసు వాదించిన అభిషేక్‌ ‌మనుసింఘ్వి ఘోరంగా ఓడిన తరువాత స్వాతికీ, ఆప్‌కీ మధ్య అగాధం అనివార్య మైంది. స్వాతితో రాజీనామా చేయించి ఆ స్థానంలో సింఘ్విని ఎంపిక చేయాలని కేజ్రీ కోరిక. కేజ్రీ అరెస్టు సమయంలో స్వాతి లేకపోవడం పట్ల పార్టీ అసంతృప్తితో ఉందని ఒక వాదన. తీహార్‌ ‌జైలు నుంచి బెయిల్‌ ‌మీద విడుదలై మొట్టమొదటిసారి కేజ్రీవాల్‌ ‌ప్రజల ముందుకు వచ్చినప్పుడు ఏర్పాటయిన వేదికపైన కూడా ఆమె కనిపించలేదు. తన సోదరి వైద్యం నిమిత్తం అమెరికా వెళ్లానని ఆమె వివరణ ఇచ్చుకున్నారు. కానీ ఈ అమెరికా యాత్ర వెనుక భయానకమైన సంగతులు ఉన్నాయి. వాటిలో ఖలిస్తానీ సానుభూతిపరుల నుంచి వచ్చిన నిధుల సంగతి కూడా ఒకటి. అందులో ఆ ఇద్దరు సోదరీమణులకు సంబంధం ఉందన్నది ఆరోపణ. ఆ సోదరి కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌.

‌సీఎం వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ ‌కుమార్‌ ‌తనను 7-8 పర్యాయాలు చెంపదెబ్బలు కొట్టారని, ఈడ్చిపారేశారని, బెదిరించారని స్వాతి ఆరోపించారు. 16వ తేదీన ఆమె పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చారు. దాడి అనంతరం ఢిల్లీ పోలీసులకు మలివాల్‌ ‌పేరుతో ఫోన్‌ ‌రావటం, ఆ తర్వాత ఆమె స్వయంగా సివిల్‌ ‌లైన్స్ ‌పోలీసు స్టేషన్‌ ‌కు వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా, మళ్లీ వస్తానని చెప్పి వెనుతిరగటం చర్చనీయాంశమైంది. కానీ బిభవ్‌ను సభలలో తనతో పాటే తిప్పుకుంటూ కేజ్రీ స్వాతిని రెచ్చగొట్టాడు.

బిభవ్‌ ‌కేజ్రీవాల్‌కు ‘షాడో’ లాంటివాడు. ఆప్‌ ‌వ్యూహకర్తల్లో ప్రధానమైన వ్యక్తి. కేజ్రీవాల్‌ ఎన్జీఓ నిర్వహిస్తున్నప్పటి నుంచి తెలుసు. 2015 ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్‌ ‌విజయం సాధించిన దరిమిలా కేజ్రీవాల్‌ ‌వ్యక్తిగత సహాయకునిగా నియమితుడయ్యాడు. 2020లో రెండోసారి అధికారం వచ్చినప్పుడు తిరిగి నియమితుడయ్యాడు. ఎవరైనా సరే ముఖ్యమంత్రిని కలవదలుచుకుంటే బిభవ్‌ అనుమతి తప్పనిసరి. గత ఏడాది అతనికి నిబంధలనకు విరుద్ధంగా టైప్‌ 6 ‌బంగ్లా కేటాయించటంపైన ఢిల్లీ డైరక్టరేట్‌ ఆఫ్‌ ‌విజిలెన్స్ ఆయనను ప్రశ్నించింది. దాంతో పబ్లిక్‌ ‌వర్కస్ ‌డిపార్ట్ ‌మెంటు దానిని రద్దు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ మద్యం స్కాములో అవక తవకలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరక్టరేట్‌ ‌మొన్న ఏప్రిల్లో విజిలెన్స్ ‌డిపార్టుమెంట్‌ ‌కేజ్రీవాల్‌ ‌వ్యక్తిగత కార్యదర్శి పదవి నుంచి అతన్ని తొలగించింది. ఇందుకు 2007 నాటి కేసును ప్రస్తా వించింది. ప్రభుత్వ విధుల్లో ఉన్న వ్యక్తి పనిని అటకాయించినందుకు బిభవ్‌ ‌పై 2007లో నమోదయిన కేసును ప్రస్తావించింది. బిభవ్‌ ‌కూడా స్వాతి మలివాల్‌ ‌పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి గృహంలోకి అనధికారికంగా ప్రవేశించి తనపైన మాటలతో దాడి చేశారని ఆరోపించారు. అంతేకాదు ముందస్తు బెయిల్‌కి దరఖాస్తు చేసుకు న్నారు. న్యాయస్థానం దాన్ని తోసిపుచ్చి వారం రోజుల రిమాండ్‌ ‌కు తరలించింది. బిభవ కుమార్‌ ‌సీసీటీవీ ఫుటేజ్‌ని ట్యాంపర్‌ ‌చేశారని.. అలాగే తన ఫోన్‌ ‌ఫార్మాట్‌ ‌చేయించారని ఢిల్లీ పోలీసులు ఆరోపణలు చేశారు. స్వాతి మలీవాల్‌ ‌దాడి అంశాన్ని బీజేపీ సీరియస్‌ ‌గా చేసుకుంది. ముఖ్యమంత్రి కార్యాలయా నికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ని కూడా బీజేపీ విడుదల చేసింది. ఇందులో వాదనకు దిగుతున్న స్వాతి మలివాల్‌ని సెక్యూరిటీ సిబ్బంది బలవంతంగా నెట్టివేయటం స్పష్టంగా కనిపించింది.

మొదట స్వాతిపైన దాడి వాస్తవమేనని ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్‌ ‌నేత సంజయ్‌ ‌సింగ్‌ ‌విలేకరుల సమావేశంలో అంగీకరించారు. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోమని కేజ్రీవాల్‌ ‌కూడా సూచించారని చెప్పుకొచ్చారు. అనంతర పరిణామాల్లో స్వాతి మలీవాల్‌ ‌బీజేపీ ఏజెంట్‌గా మారిందని, కేజ్రీవాల్‌ను అడ్డుతొలగించుకునేందుకు బీజేపీ పన్నిన రాజకీయ కుట్రలో ఆమె పావు అంటూ ఢిల్లీ మంత్రి అతిషి వ్యాఖ్యానించారు. అతిషి ఒక విషయం గుర్తించాలి. స్వాతి ఉదంతం వెలుగు చూసిన వెంటనే ఆప్‌ ‌మాజీ నేత షాజీ ఇల్మీ (ప్రస్తుతం బీజేపీ అధికార ప్రతినిధి) ఆప్‌లో ఇలాంటి దాడులు సహజమేనని ప్రకటించడం విశేషం. యోగేంద్ర యాదవ్‌, ‌ప్రశాంత్‌ ‌భూషణ్‌, అశుతోష్‌, ‌కపిల్‌ ‌మిశ్రా (బీజేపీలో ఉన్నారు), అంజలి దామానియా, అల్కా లాంబా, సుశీల్‌ ‌కుమార్‌ ‌రింకు (ఆప్‌ ఏకైక లోక్‌సభ సభ్యుడు. ఇటీవలనే బీజేపీలో చేరి జలంధర్‌ ‌నుంచి పోటీ చేస్తున్నారు) వంటి వారందరికీ కేజ్రీవాల్‌ ‌పార్టీలో పొగపెట్టారు. ఆఖరికి కేజ్రీ గురువు అన్నా హజారే కూడా ఆప్‌కు ఓటు వేయవద్దని ప్రకటించారు.

మొగుణ్ణికొట్టి మొగసాలకు ఎక్కిన చందంగా ఉంది కేజ్రీవాల్‌ ‌వ్యవహారం. పార్టీ రగడకు బీజేపీని బాధ్యురాలిని చేయాలని చూస్తున్నారు.బీజేపీ కేంద్ర కార్యాలయం ఎదుట ధర్ణాకు ఉపక్రమించారు. ‘‘ప్రధాని ఆమ్‌ ఆద్మీ పార్టీతో ‘జైల్‌ ‌కా ఖేల్‌’ ఆడుతు న్నారు. నన్ను, మనీష్‌ ‌సిసోడియా, సత్యేంద్రజైన్‌, ‌సంజయ్‌ ‌సింగ్‌లను అరెస్టు చేశారు. ఇప్పుడు నా పీఏను జైలుకు పంపారు. రాఘవ్‌ ‌చద్దా, అతిషి,సౌరభ్‌ ‌భరద్వాజ్‌లను కూడా జైలుకు పంపుతామంటు న్నారు’’ అని ఆరోపించారు. ‘బీజేపీ ఆపరేషన్‌ ‌ఝాడూ’కు నిరసనగా పార్టీ ప్రధాన నేతలు, కార్యకర్తలతో కలిసి తాము బీజేపీ ప్రధాన కార్యాలయ ముట్టడిస్తున్నామని ప్రకటించారు. ‘‘నా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలందరితో కలిసి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తా. మీ ఇష్టంమొచ్చిన వారిని జైలులో పెట్టుకోండి’’ అని ప్రధానికి సవాలు విసిరారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో 144 సెక్షన్‌ అమలవుతోంది. పార్టీ కార్యాలయానికి కొద్ది దూరంలో ఆప్‌ ‌నేతలు ప్రశాంతంగా అర్ధగంట పాటు ధర్ణా నిర్వహించి వెనుతిరిగారు. గత కొద్దినెలలుగా విదేశాల్లో ఉంటున్న రాఘవ చద్దా కూడా ఈ ధర్ణాలో పాల్గొన్నారు. ఈయన మీద కూడా ‘నిధుల విషయంలో’ కేజ్రీకి అనుమానాలు ఉన్నాయి. పైగా స్వాతి విషయంలో బెడిసికొట్టింది కాబట్టి, రాఘవ చద్దాను రాజ్యసభకు రాజీనామా చేయించి, ఆ ఉప ఎన్నికలో అభిషేక్‌ ‌సింఘ్విని గెలిపించాలన్న వ్యూహం కూడా కేజ్రీకి ఉన్నట్టు చెబుతున్నారు.

తమ పార్టీ రాజ్యసభ సభ్యురాలిని రక్షణ కల్పించకుండా నిందితునికి వత్తాసు పలికిన కేజ్రీవాల్‌ ‌వైఖరిపైన బీజేపీ ధ్వజమెత్తింది. స్వాతి బీజేపీ ఏజెంటు అంటూ వ్యాఖ్యానించడాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా తప్పుపట్టారు. ఇంత వరకూ తమ పార్టీ నేతలు ఎవరూ ఆమెను కలవలేదని స్పష్టం చేశారు. ‘‘కేజ్రీవాల్‌ ‌రాజీనామా చేయలేదు. పార్టీ సిబ్బంది మహిళా ఎంపీపైన దాడి చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇదెక్కడి దాదాగిరి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది’’ అని వ్యాఖ్యానించారు బీజేపీ నేత రవిశంకర ప్రసాద్‌. ‌ఢిల్లీ గ్యాంగ్‌ ‌రేప్‌ ‌హత్య కేసులో బాధితులకు న్యాయం చేయాలని ఒకప్పుడు రోడ్డెక్కి ఆందోళన చేసిన నేతలే ఇప్పుడు నిందితునికి రక్షణ కల్పించటానికి ఆందోళన చేస్తున్నారని స్వాతి విమర్శించారు. మనీష్‌ ‌సిసోడియా జైలులో లేకపోతే నాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆమె పేర్కొనటం గమనార్హం.

బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే చాలు, ఏ పార్టీని అయినా చంకన వేసుకోవడానికి కాంగ్రెస్‌ ‌సిద్ధంగా ఉంటుంది. ఇదే జరిగింది. ఇంతటి అనైతిక రాజకీయాలు నడుపుతున్నప్పటికీ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ ‌చేసిన వ్యాఖ్యలు ఆప్‌కు కొండంత నైతిక బలాన్ని ఇచ్చాయి. ‘‘కేజ్రీవాల్‌ ‌కాంగ్రెస్‌కు ఓటేస్తారు. నేను ఆప్‌కు ఓటేస్తాను. రెండు మిత్రపక్షాల మధ్య దృఢమైన బంధానికి ఇదే సూచిక. రెండు పార్టీల కార్యకర్తలు కూడా ఒకరికొకరు మద్దతుగా పనిచేయాలి. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో ‘ఇండియా బ్లాక్‌’‌ను గెలిపించాలి’’ అని పిలుపు నిచ్చారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌ ‌నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్‌ ‌మూడు స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇండీ కూటమికి ఓటేసి నెగ్గిస్తే తాను జూన్‌ 2‌న మళ్లీ తిహార్‌ ‌జైలుకు వెళ్లవలసిన అవసరం రాదని కేజ్రీ చెప్పడం వికృత పోకడే. మరోవైపు సిక్కుల నిషేధ సంస్థ ‘సిక్‌ ‌ఫర్‌ ‌జస్టిస్‌’ ‌నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీకి నిధులు అందాయని, ఈ అంశంపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ఎన్‌ఐఏకు లేఖ రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో, కేజ్రీవాల్‌ ‌రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం కష్టం కాదు.

డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE