డీప్‌ ‌ఫేక్‌.. ‌కొన్నాళ్లుగా విరివిగా వినిపిస్తోన్న మాట. అయితే, సెలబ్రిటీలు.. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు, మహిళలకు సంబంధించిన వీడియోలతో మాత్రమే డీప్‌ ‌ఫేక్‌ ‌ప్రయోగాలు చేసేవారు. జనంలో తాము పాపులర్‌ ‌కావాలనో, లేదంటే ఎదుటివాళ్లను ఆట పట్టించాలనో, కాదంటే ఏదో ఒక సెన్సేషన్‌ ‌సృష్టించే ఉద్దేశ్యంతోనో ఆకతాయి పనులకు పాల్పడేవాళ్లు. కానీ, ఇప్పుడు ఎన్నికల వేళ.. ఆకతాయిలు, ప్రత్యర్థులు బరితెగిస్తున్నారు. ప్రజల్లో ఎదుటివారిని కించపరిచే విధంగా కావాలనే డీప్‌ ‌ఫేక్‌ ‌టెక్నాలజీని వినియోగించుకుంటున్నారు. ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.

గడిచిన దశాబ్దం.. దశాబ్దంన్నర కాలంగా ఎన్నికల పక్రియలో నైతికత అనేది మాయమవు తోంది. నిజాయతీ, ముక్కుసూటితనం, న్యాయంగా ఎదుర్కోవడం అనే అంశాలు భూతద్దం పెట్టి వెతికినా ఒకటీ అరా మినహా కనిపించడంలేదు. ఎక్కడ చూసినా, ఏ సభలో గమనించినా.. ఏ నాయకుడి ప్రసంగంచూసినా అనైతికత, ప్రత్యర్థి పార్టీలపై విద్వేష పూరిత ప్రసంగం, లేనివి ఉన్నట్లు.. ఉన్నవి లేనట్లు భ్రమించేలా చేయడం వంటివే గోచరిస్తున్నాయి.

ఇక, దశాబ్దకాలం నుంచి చూస్తే.. సోషల్‌ ‌మీడియా ప్రభావం ఎక్కువైపోయింది. ప్రతి ఎన్నిక ల్లోనూ రాజకీయ పార్టీలు సోషల్‌ ‌మీడియాను విరివిగా వినియోగించుకుంటున్నాయి. ప్రజలను తమవైపునకు తిప్పుకునేందుకు, ఓటర్లను ఆకర్షించేందుకు, తమ పార్టీ అభ్యర్థులకే ఓట్లు వేసేలా చూసేందుకు సామాజిక మాధ్యమాలను ఎక్కువగా వినియోగించుకుంటున్నాయి.అయితే, కొన్ని పార్టీలు సోషల్‌ ‌మీడియాలో తమ ప్రచారాన్ని పాజిటివ్‌ ‌దృక్పథంతో పాటు.. తమ పార్టీ గొప్పలు చెప్పుకోవడానికి, ఉన్న పరిస్థితులను వివరించడానికి మాత్రమే వినియోగించుకుంటున్నాయి. కానీ, కొన్ని పార్టీలు మాత్రం విలువలు మరిచిపోతున్నాయి. తప్పుడు ఫోటోలు, తప్పుడు వీడియోలు, తప్పుడు కంటెంట్‌ను, తప్పుదారి పట్టించే కంటెంట్‌ను ప్రచారం చేయడానికే తమ సోషల్‌ ‌మీడియా ప్లాట్‌ఫామ్‌లను వినియోగించుకుంటున్నాయి. ఇన్నాళ్లుగా ఇమేజ్‌ల రూపంలోనో, వీడియోల రూపంలోనో, తప్పుదారి పట్టించే కంటెంట్‌ ‌రూపంలోనో ఫేక్‌ ‌న్యూస్‌ను ప్రచారం చేసేవారు. అయితే, గూగుల్‌ ‌ఫ్యాక్ట్‌చెక్‌ ‌ట్రైనర్లు, గూగుల్‌ ‌ఫ్యాక్ట్‌చెక్‌ ఎక్స్‌పర్ట్‌లు ఆ ఫేక్‌న్యూస్‌ను డీబంక్‌ ‌చేసేవారు. కానీ, తొండముదిరి ఊసరవెల్లి అయినట్లు ఫేక్‌ ‌న్యూస్‌, ‌మిస్‌ ఇన్ఫర్‌మేషన్‌, ‌డిస్‌ ఇన్ఫర్‌మేషన్‌ ‌కాస్తా.. మరింత డీప్‌గా తయారయ్యింది. డీప్‌ఫేక్‌ ‌వీడియోలు తయారు చేసేదాకా వచ్చింది. నాయకులు చేసిన ప్రసంగాన్ని తప్పుదారి పట్టించే విధంగా మార్పులు, చేర్పులు చేస్తున్నారు. అందరూ దానిని నిజమని నమ్మే మాదిరిగా తయారుచేస్తున్నారు. సోషల్‌ ‌మీడియా హ్యాండిల్స్‌లో షేర్‌ ‌చేస్తూ ,ప్రజలను, ఓటర్లను, సోషల్‌ ‌మీడియా వాడకందార్లను తప్పుదోవ పట్టిస్తున్నారు.

ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ తరహా అనుభవం ఎదురయ్యింది. కాంగ్రెస్‌పార్టీ నేతలు, సోషల్‌ ‌మీడియా బాధ్యులు బరితెగించారు. ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలనే తప్పుదోవ పట్టించారు. ఆయన ప్రసంగాన్ని డీప్‌ఫేక్‌ ‌వీడియోగా మార్చేశారు. వాస్తవానికి ఆయన చేసిన ప్రసంగమే అయినా.. అందులో నుంచి కొంత భాగాన్ని తొలగించి వక్రీకరించారు. ఫలితంగా తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ ‌పార్టీని డీప్‌ ‌ఫేక్‌ ఇష్యూ వెంటాడుతోంది. ఏకంగా ఢిల్లీ పోలీసుల నుంచి సాక్షాత్తూ ముఖ్యమంత్రి సహా మరో నలుగురికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గత నెలలో బీజేపీ మెదక్‌ ‌పార్లమెంటు అభ్యర్థి రఘునందన్‌రావు ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఆ తర్వాత సిద్ధిపేట బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలు మైనారిటీలకు కూడా రిజర్వేషన్లు కల్పించారని, తాము తొలగించి, ఆ మొత్తాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సర్దుబాటు చేస్తామని ప్రకటించారు. అయితే ఈ వీడియో క్లిప్‌ని కాంగ్రెస్‌ ‌సోషల్‌ ‌మీడియా టీమ్‌ ‌డీప్‌ ‌ఫేక్‌ ‌సాఫ్ట్‌వేర్‌తో అమిత్‌షా ప్రసంగాన్ని మొత్తం ఎడిట్‌ ‌చేసింది. మైనార్టీల ప్రస్తావన లేకుండా.. చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను ఎత్తివేస్తామని అమిత్‌షా అన్నట్లుగా మార్చివేసి, ఆ వీడియోను కాంగ్రెస్‌ ‌పార్టీకి సంబంధించిన సోషల్‌ ‌మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ ‌చేశారు.

అమిత్‌ ‌షా ప్రసంగంగా రూపొందించిన వీడియో సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అయ్యింది. దాన్ని కాంగ్రెస్‌పార్టీ నేతలు మరింతగా షేర్‌ ‌చేస్తూ.. దేశంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం వస్తే.. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ఎత్తివేస్తారంటూ ప్రచారం చేశారు. అయితే, వీడియో కేంద్ర హోం మంత్రికి సబంధించినది కావడంతో.. ఆ మంత్రిత్వ శాఖ పరిశీలించి, అది నకిలీ వీడియోగా గుర్తిం చింది. ఆ శాఖతో పాటు, బీజేపీ బాధ్యులు కూడా ఢిల్లీ పోలీసులకు ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులతో ఢిల్లీ పోలీసులు ఈ డీప్‌ఫేక్‌ ‌వీడియో అంశంపై ఏప్రిల్‌ 27‌వ తేదీన కేసు నమోదు చేశారు. ఇండియన్‌ ‌పీనల్‌ ‌కోడ్‌ – ‌సెక్షన్‌ 153,465, 469, 171, ఇన్ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ – చట్టంలోని సెక్షన్‌ 66 ‌కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వీడియోను అప్‌లోడ్‌ ‌చేసిన, షేర్‌ ‌చేసిన సోషల్‌ ‌మీడియా అకౌంట్ల సమాచారం ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు ఎక్స్, ‌ఫేస్‌బుక్‌ ‌కి నోటీసులు పంపించారు.

తొలుత ఈ డీప్‌ఫేక్‌ ‌వీడియోను తెలంగాణ కాంగ్రెస్‌ అఫీషియల్‌ ఎక్స్ ‌హ్యాండిల్‌ ‌లో పోస్ట్ ‌చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత ఆ వీడియోను మిగతా రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్‌పార్టీ సోషల్‌ ‌మీడియా టీమ్‌లు, కాంగ్రెస్‌పార్టీ ముఖ్యనేతలు తమ ప్లాట్‌ఫామ్‌లకు షేర్‌ ‌చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలోనే ఏప్రిల్‌ 29‌వ తేదీన ఢిల్లీ పోలీస్‌ ‌స్పెషల్‌ ‌సైబర్‌ ‌యూనిట్‌ అధికారులు హైదరాబాద్‌లో కాంగ్రెస్‌పార్టీ ఆఫీస్‌ ‌గాంధీభవన్‌కు చేరుకున్నారు. కాంగ్రెస్‌ ‌సోషల్‌ ‌మీడియా బృందానికి చెందిన నలుగురికి నోటీసులు జారీచేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీ సోషల్‌ ‌మీడియా ఇన్‌ ‌చార్జి మన్నె సతీశ్‌తో పాటు.. ఆ టీమ్‌ ‌సభ్యులు నవీన్‌, ‌శివకుమార్‌, ‌తస్లీమాను విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. అలాగే, తన ఎక్స్ ‌హ్యాండిల్‌లో ఆ వీడియో పోస్ట్ ‌చేశారన్న కారణంగా సీఎం రేవంత్‌రెడ్డికి కూడా నోటీసులిచ్చారు. మే 1వ తేదీన ఢిల్లీ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో సీఎం చిక్కుల్లో పడ్డారు.

మే 13వ తేదీన లోక్‌సభ ఎన్నికలకు ప్రచారం జరుగుతున్న సమయంలో.. ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీచేయడం, విచారణకు వెంటనే హాజరు కావాలని పేర్కొనడంపై చర్చ జరిగింది. ఎన్నికలున్నాయన్న కారణంగా గడువు అడిగినా ఢిల్లీ పోలీసులు గడువు ఇవ్వలేదని టీపీసీసీ లీగల్‌ ‌టీమ్‌ ‌చెబుతోంది. మే 1న సీఎం రేవంత్‌రెడ్డి గానీ, నోటీసులు అందుకున్న సోషల్‌ ‌మీడియా టీమ్‌ ‌గానీ ఢిల్లీ వెళ్లలేదు. అయితే, అదేరోజు.. టీపీసీసీ లీగల్‌ ‌టీమ్‌ ‌ఢిల్లీ పోలీసులకు లేఖ పంపించింది. ఆ నోటీసులను పరిశీలిస్తున్నామని, విచారణకు హాజరు కావడానికి పదిహేను రోజులు గడువు కావాలని ఆ లేఖలో పేర్కొంది.

ఇదే సమయంలో ఈ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ అం‌దరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ ‌షా డీప్‌ఫేక్‌ ‌వీడియో కేసు కొత్త మలుపు తిరిగింది. నిందితులను అరెస్ట్ ‌చేసేందుకు ఢిల్లీ పోలీసులు ఈనెల రెండో తేదీన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు చేరుకున్నారు. అయితే, వారిని అంతకుముందే హైదరాబాద్‌ ‌సీసీఎస్‌ ‌పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో, ఈ కేసులో హైడ్రామా మొదలైంది. కాంగ్రెస్‌ ‌సోషల్‌ ‌మీడియా ఇన్‌ ‌చార్జి మన్నె సతీశ్‌, ‌కన్వీనర్‌ ‌నవీన్‌తో పాటు.. ఆ టీమ్‌కు చెందిన తస్లిమా, గీత, శివను  సిటీ సెంట్రల్‌ ‌క్రైమ్‌ ‌స్టేషన్‌ ‌పోలీసులు అదుపులోకి తీసుకుని సీసీఎస్‌ ఆఫీస్‌కు తరలించారు. ఊహించని ఈ పరిణామంతో ఢిల్లీ పోలీసులు బిత్తరపోవాల్సి వచ్చింది. మొత్తానికి ఈ పరిణామం ఢిల్లీ పోలీస్‌ ‌వర్సెస్‌ ‌తెలంగాణ పోలీస్‌గా తయారయ్యింది. ఢిల్లీ పోలీసులు వస్తున్నారని తెలుసుకొని.. ముందుగానే తెలంగాణ సీసీఎస్‌ ‌పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు భావించారు. దీంతో నిందితులను ఎలా అరెస్ట్ ‌చేయాలన్న దానిపై ఢిల్లీ పోలీసులు సందిగ్ధంలో పడిపోయారు. సాయంత్రం దాకా సీసీఎస్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌ముందు పడిగాపులు కాసారు. ఢిల్లీ పోలీసులు తిరిగివెళ్లకపోవడంతో.. సాయంత్రం దాకా కాంగ్రెస్‌ ‌సోషల్‌ ‌మీడియా టీమ్‌ను ప్రశ్నించిన సీసీఎస్‌ ‌పోలీసులు.. సాయంత్రానికి వాళ్లను అరెస్ట్ ‌చేస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ పోలీసుల అరెస్టును నిరోధించేందుకే తెలంగాణ పోలీసులు వాళ్లను ముందుగానే అరెస్ట్ ‌చేశారన్న వాదనలు అప్పుడు వినిపించాయి.

డీప్‌ఫేక్‌ ‌వీడియో అంశం తీవ్ర చర్చనీయాంశం కావడం.. రోజురోజుకీ రిజర్వేషన్ల రద్దు వివాదం రాజుకుంటున్న నేపథ్యంలో అమిత్‌ ‌షా స్పందించారు. రాహుల్‌ ‌గాంధీ తమపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఉద్దేశం ఉంటే బీజేపీ ఈ పదేళ్ల పాలనలో చేసేదని చెప్పారు. కానీ తమ ప్రభుత్వానికి అలాంటి ఆలోచన లేదని అమిత్‌షా స్పష్టత ఇచ్చారు. ఆయనతో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ‌కూడా ఈ రిజర్వేషన్ల వివాదంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ ‌వచ్చిన ఆయన, సీఎం పేరును ప్రస్తావించ కుండా రిజర్వేషన్ల విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌పై సోషల్‌ ‌మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. స్వార్థంతో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మీద మాట్లాడుతున్నారని, వివాదం సృష్టించి లబ్ధిపొందాలని చూస్తున్నారని.. కొట్టిపారేశారు. సోషల్‌ ‌మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. రిజర్వేషన్లకు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, అవసరమైనంత కాలం రిజర్వేషన్లు కొనసాగించా ల్సిందేనని స్పష్టం చేశారు.

మరోవైపు.. అమిత్‌షా డీప్‌ఫేక్‌ ‌వీడియో ఎక్కడ నుంచి వచ్చిందనే విషయం బయటపడింది. ఆ ఫేక్‌ ‌వీడియోను మొదట పోస్ట్ ‌చేసినది తెలంగాణ నుంచేనంటూ సోషల్‌ ‌మీడియా సంస్థ ‘ఎక్స్’ ‌ఢిల్లీ స్పెషల్‌ ‌సెల్‌ ‌పోలీసులకు నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. మొదట పోస్ట్ ‌చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే, ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ముందు పోస్ట్ ‌చేశారన్న దానిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎక్స్, ‌ఫేస్‌బుక్‌లను స్పెషల్‌ ‌సెల్‌ ‌పోలీసులు ఆదేశించారు. ఈ మేరకు ‘ఎక్స్’ ‌సంస్థ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఒక ల్యాండ్‌లైన్‌ ఐపీ అడ్రస్‌ ‌నుంచి ఈ వీడియో పోస్ట్ అయినట్టుగా పేర్కొంది. దీంతో ఢిల్లీ స్పెషల్‌ ‌సెల్‌ ‌పోలీసులు మళ్లీ ‘ఎక్స్’‌కు లేఖ రాశారు. కచ్చితంగా ఎవరి ఐపీ అడ్రస్‌ ‌నుంచి వచ్చింది? ఎక్స్‌లో పోస్ట్ ‌చేసిన తర్వాత ఎంతమంది వీక్షించారు? ఎవరెవరు షేర్‌ ‌చేశారు? కామెంట్లు/లైకులు తదితర సమగ్ర వివరాలు ఇవ్వాలని కోరారు. మరోవైపు.. ఈ డీప్‌ఫేక్‌ ‌వీడియో ప్రసంగం సృష్టికర్తను అరెస్టు చేశారు. అమిత్‌ ‌షా వీడియోను ఏఐసీసీ సోషల్‌ ‌మీడియా విభాగం జాతీయ సమన్వయకర్త అరుణ్‌రెడ్డి డీప్‌ఫేక్‌ ‌చేశారని పోలీసులు నిర్ధారించారు. ఆయనను అరెస్ట్ ‌చేశారు. దీని వెనుక కాంగ్రెస్‌ ‌ప్రముఖుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలోనూ విచారణ చేపట్టారు.

మెదక్‌ ‌సభలో అమిత్‌ ‌షా చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను అరుణ్‌రెడ్డి ఎడిట్‌ ‌చేసి నట్లు చేసి, ఆ వీడియోను ఏఐసీసీ, ఎన్‌ఎస్‌యూఐ, కాంగ్రెస్‌ ‌పార్టీకి సంబంధించిన అన్ని వాట్సాప్‌ ‌గ్రూపుల్లో  పోస్ట్ ‌చేశారని ఢిల్లీ పోలీసులు చెప్పారు. వీడియో సృష్టికర్త అరుణ్‌రెడ్డి కాగా దాన్ని వైరల్‌ ‌చేసింది మాత్రం తెలంగాణకు చెందిన వ్యక్తేనంటూ సోషల్‌ ‌మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ ‌ఢిల్లీ స్పెషల్‌ ‌సెల్‌ ‌పోలీసులకు నివేదించింది.

-‌సుజాత గోపగోని, 

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE