గోడకు కొట్టినా బంతిలా హిందూత్వం దేశ రాజకీయాలలోకి ప్రవేశించింది. శతాబ్దాలుగా అర్ధిస్తూ, దశాబ్దాలుగా తిరగబడుతూ హిందూత్వం దూసుకు వచ్చింది. 1992 (అయోధ్య కట్టడం కూల్చివేత), 1996 (అటల్‌ బిహారీ వాజపేయి నాయకత్వంలో తొలి బీజేపీ ప్రభుత్వం), 1998 (రెండో ప్రభుత్వం), 1999 (మూడో ప్రభుత్వం) సంవత్సరాలు అందుకు సాక్ష్యం. వీటి కొనసాగింపు 2014, 2019 (నరేంద్ర మోదీ హయాం). కానీ ఇదొక ప్రభంజనం. ఆ ప్రభంజనానికి పరాకాష్ట 2024 ఎన్నికలు. అంటే పద్దెనిమిదో లోక్‌సభ ఎన్నికల సమరం. కొన్ని విరామాలతో ఇవన్నీ భారతీయ నాగరికత పునాదిగా, భారతీయ చింతన ఆధారంగా దేశ రాజకీయాలను పెద్ద మలుపు దగ్గరకు తీసుకువచ్చాయి. పదిహేడవ లోక్‌సభ ఎన్నికల సమయానికే దేశ రాజకీయ దృశ్యంలో కనిపించిన విభజన రేఖ ఇప్పుడు దృఢత్వాన్ని సంతరించుకుంది. అప్పుడు ‘హిందూత్వ’ రాజకీయాలు ఒక వైపు. హిందూయేతర రాజకీయాలు మరొకవైపు. ఇప్పుడు – హిందూత్వ రాజకీయాల ముందు తల దించబోతున్న కుహనా సెక్యులర్‌ రాజకీయాలు కనిపిస్తాయి.

ఈ దేశంలో మైనారిటీలు అంటే మొదట గుర్తుకు వచ్చేదీ, కుహనా సెక్యులరిస్టులు మన ముందు పెట్టేదీ ముస్లింలనే. ఈ వర్గం కేంద్ర బిందువుగా హిందూయేతర ఓటు బ్యాంకు రూపుదిద్దుకుంటూ ఉంటే, హిందూ ఓటు బ్యాంకు ఆవిర్భవించడం సహజం. నిజానికి దీనిని భారతీయ ఓటు బ్యాంక్‌ అనడం సబబు. అంటే భారతీయతకు సానుకూలమైన ఓటు. ఈ వర్గం ఓటర్లలో హిందువులు ప్రధానం. మిగిలిన మైనారిటీలు ఇటే వస్తున్నారు. అవతలి శిబిరంతో ఉన్న పెను ప్రమాదమే ఈ పరిణామానికి మూలం. నిజానికి భారతీయతను గౌరవిస్తున్న హిందూయేతరులు దేశంలో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

రాజకీయ శక్తిగా భారతీయత

ఒక ప్రశ్నతో ఈ అంశాన్ని ప్రారంభించడం సమంజసంగా ఉంటుంది. ‘హిందూ ఉగ్రవాదం’ అన్నమాట కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు పి. చిదంబరం నోటి నుంచి విన్నాం. కానీ క్రైస్తవ నేపథ్యం ఉన్న అధినాయకత్వం చేతిలో కాంగ్రెస్‌ పార్టీ ఉన్న కాలంలో ఈ నీచమైన ఆరోపణ వచ్చింది. కాబట్టి ఇది యాదృచ్ఛికమని అనుకోలేం. ఇది భారతీయతను పట్టించుకునే హిందువులను బాధించేదే. ఎనభయ్‌ శాతం ఉన్న హిందువుల మనోభావాలకు ఇదా విలువ అన్న ప్రశ్నను లేవనెత్తేటట్టు చేసేదే. జాతీయ భావాలు, దేశీయమైన సాంస్కృతిక విలువలకు చోటు కరువైపోతున్నదన్న క్షోభ భారతీయ ఓటు బ్యాంకును పటిష్టం చేస్తోంది.

హక్కులను, ఉద్యమాలను ఆధునికదృష్టితో చూసే అవకాశం కొన్ని దశాబ్దాలకు గాని భారతీయులకు దక్కలేదు. ఇవి విదేశీయమే అయినా వాటిని భారతీయత కోణం నుంచి చూసే అవకాశం కల్పించినవారు రాజారామమోహన్‌రాయ్‌, స్వామి దయానంద, ఆత్మారాం పాండురంగ, స్వామి వివేకానంద వంటివారే. 1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భవించింది. 1905లో బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమం వచ్చే వరకు అందులో భారతీయతతో కూడిన చింతన తక్కువ. బాలగంగాధర తిలక్‌, లాలాలజపతిరాయ్‌, బిపిన్‌ పాల్‌, అరవిందుల నాయకత్వం ఏర్పడే వరకు అలాంటి చింతనకు అక్కడ స్థానం దక్కలేదు. కానీ భారతీయమైన ఆలోచన, ఆ ఆలోచన పునాదిగా ఉద్యమం, రాజకీయ హక్కుల సాధనలకు జాతీయ కాంగ్రెస్‌ ఎప్పుడూ దూరమే. అయినా జాతీయ కాంగ్రెస్‌ను హిందువుల ప్రయోజనాలకు ఏర్పడిన సంస్థగా, ముస్లింల హక్కులను పట్టించుకోని సంస్థగానే నాటి ముస్లిం పెద్దలు చూశారు. కాంగ్రెస్‌ ముస్లింలను ప్రేమించింది. ముస్లింలు తమ నమ్మకాలనే ఆరాధించారు.  అఖిల భారత ముస్లింలీగ్‌ స్థాపన (1906) దాని ఫలితమే. వీటన్నిటి ప్రభావంతోనే లాలా లజపతిరాయ్‌ కొత్త బాట అవసరం గుర్తించారు.

లజపతిరాయ్‌ మొదట ఆర్య సమాజ్‌ సభ్యుడు. లజపతిరాయ్‌, లాల్‌చంద్‌, షాదీలాల్‌ అనే ముగ్గురు కలసి 1909లో పంజాబ్‌ హిందూసభను స్థాపించారు. అంటే ముస్లిం లీగ్‌ స్థాపించిన మూడేళ్ల తరువాత.  పంజాబ్‌ హిందూసభ తొలి సమావేశాలను ఆ సంవత్సరం అక్టోబర్‌లో లాహోర్‌లో నిర్వహించారు. వీటికి మదన్‌మోహన్‌ మాలవీయ అధ్యక్షులు. ఈ సంస్థ హిందువులందరిదీ అని నిర్వాహకులు ప్రకటించారు. ఈ సంస్థ హిందువుల హక్కుల గురించి పంజాబ్‌ పరిధిలో ప్రాంతీయ గోష్టిని ఏర్పాటు చేసింది. ఈ గోష్టిలోనే సభ్యులు ప్రకటించారు` ‘హిందువుల హక్కులను కాపాడడంలో జాతీయ కాంగ్రెస్‌ విఫలమైంది’ అని. భారత రాజకీయాలకు, స్వరాజ్య ఉద్యమానికి హిందూ చింతనే పునాదిగా ఉండాలని కూడా ఈ గోష్టి కోరింది. పంజాబ్‌ పరిధిలోనే ఇలాంటి మరో ఐదు గోష్టులను కూడా సంస్థ నిర్వహించింది. తరువాత యునైటెడ్‌ ప్రావిన్సెస్‌, బిహార్‌, బెంగాల్‌, సెంట్రల్‌ ప్రావిన్సెస్‌, బీరార్‌, బొంబాయి ప్రెసిడెన్సీలలో కూడా ఇలాంటి సంఘాలు ఆవిర్భవించాయి. ఇంత కృషి జరిగిన మీదట మొత్తం దేశంలోని హిందువులను ఏకం చేయాలన్న యోచన వచ్చింది. ఇందుకు తొలి అడుగు 1910 నాటి అలహాబాద్‌ జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలలోనే పడడం విశేషం. లాలా బైజ్‌నాథ్‌ నాయకత్వంలో విధివిధానాలు రూపొందించడానికి ఒక బృందం ఏర్పాటయింది. కానీ ఇది అనుకున్నంత వేగంగా సాగలేదు. 1910లో మళ్లీ అలహాబాద్‌ వేదికగా హిందూ నాయకులు సమావేశం జరిపారు. ఇందులో విభేదాలు తలెత్తాయి. చివరికి డిసెంబర్‌ 8, 1913లో పంజాబ్‌ హిందూ సభ చేసిన తీర్మానం పెద్ద కదలికనే తెచ్చింది. త్వరలో అంబాలాలో జరిగే పంజాబ్‌ హిందూసభ సమావేశాలలో అఖిల భారత హిందూ సభ ఏర్పాటు జరిగిపోవాలని ఇది తీర్మానించింది. అంబాలలో సమావేశం జరిగింది కానీ, అఖిల భారత సంస్థ ఏర్పాటును వాయిదా వేశారు. 1915లో కుంభమేళా జరుగుతున్నది కాబట్టి, ఆ సందర్భంగా అఖిల భారత వేదికను ఆరంభించాలని అంబాలా సమావేశాలు నిర్ణయించాయి. ఇది కార్యరూపం దాల్చింది. 1915 ఫిబ్రవరిలోనే హరిద్వార్‌, లక్నో, ఢల్లీిలలో ఏర్పాట్ల గురించి సమావేశాలు జరిగాయి. మొత్తానికి ఆ సంవత్సరం ఏప్రిల్‌లో హరిద్వార్‌లో సర్వదేశ హిందూ మహాసభ ఆవిర్భవించింది. ఈ కార్యక్రమానికి గాంధీజీ, స్వామీ శ్రద్ధానంద హాజరయ్యారు. 1920 నాటికి ఈ సంస్థ వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌, బాలకృష్ణ మూంజే వంటివారి ప్రభావంలోకి వచ్చింది.1921 ఏప్రిల్‌లో జరిగిన సమావేశాలలో అఖిల భారత హిందూ మహాసభగా పేరు మార్చారు. అప్పటికి గాంధీజీ స్వరాజ్య ఉద్యమంలో కీలకంగా మారారు. ఆ సమయానికి హిందూ గళం వినిపించడానికి కొంత బలం కలిగింది. కానీ అప్పటికి ముస్లింల వేర్పాటువాద ధోరణి కూడా బలం పుంజుకోవడం మొదలయింది.1915లో ఏర్పాటైన హిందూ మహాసభకు 1925 నాటి ఆర్‌ఎస్‌ఎస్‌ కొత్త రూపం కాదు.

ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావం

భారత స్వాతంత్య్ర సమరంలోని పోకడలు, ముస్లిం లీగ్‌, జాతీయ కాంగ్రెస్‌ నడతలను చూసి, ఒక చారిత్రక అనుభవంతో స్పష్టమైన సిద్ధాంతంతో ఆవిర్భవించిన సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు. 1925లో డాక్టర్‌ కేశవరావ్‌ బలీరామ్‌ హెడ్గేవార్‌ ఆ విధంగా ఒక గొప్ప చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహించారు.  హిందువులలో సామాజిక ఐక్యతను తేవడమే ఈ సంస్థ ప్రధాన ఆశయం.   హిందువులు అంటే విస్తృతార్థంలో భారతీయులే. భారతదేశంలో పుట్టినవారంతా భారతీయులు. భారతదేశానికి మరొక పేరు హిందుస్తాన్‌.

నిజానికి జిన్నా ఎత్తుగడల గురించి బాహాటంగా మాట్లాడిన సంస్థ హిందూ మహాసభ. ముస్లింలీగ్‌ వ్యూహాల పట్ల దొంగ నిద్ర నటించిన సంస్థ జాతీయ కాంగ్రెస్‌. 1942 క్విట్‌ ఇండియా ఉద్యమం విఫలమైన తరువాత ఏర్పడిన శూన్యం నుంచి లబ్ధి పొందాలని చూసిన ముస్లిం లీగ్‌కు కొంతయినా అడ్డుకట్ట వేసిన సంస్థ హిందూ మహాసభ. హిందూ మహాసభకు చెందినవారే డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ. 1951లో భారతీయ జనసంఫ్‌ును స్థాపించారు. ఈ సంస్థ కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ రెండో సర్‌సంఘచాలక్‌ గురూజీ కొందరు కార్యకర్తలను పంపించారు. వారే దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, అటల్‌ బిహారీ వాజపేయి, లాల్‌ కృష్ణ అడ్వాణీ, నానాజీ దేశ్‌ముఖ్‌ తదితరులు. స్వతంత్ర భారత నిర్మాణంలో, 20వ శతాబ్దంలో వీరి కృషి ఎంత నిర్మాణాత్మకమైనదో చరిత్ర రుజువు చేసింది.

కేవలం 26 ఏళ్లు పనిచేసిన జనసంఫ్‌ు (1951`1977)కు చరిత్రలో అసాధారణమైన స్థానం ఉంది. దీనికి లభించిన ఆదరణ ఇతర హిందూ సామాజిక, రాజకీయ సంస్థలకు దక్కలేదు.ి 1948లో స్వామి కర్పత్రి రామరాజ్య పరిషద్‌ అనే రాజకీయ పక్షాన్ని నెలకొల్పారు. ఇది రాజస్తాన్‌లో ఎక్కువగా విస్తరించింది. అలాగే 1952 తొలి లోక్‌సభ ఎన్నికలలో మూడు స్థానాలు గెలిచింది. పండిట్‌ నెహ్రూకు పోటీగా ఈ ఒక్క పార్టీ అభ్యర్థి మాత్రమే బరిలో దిగారు. అగ్నివీర్‌, ఆర్షవిద్యా సమాజం, అంతర్రాష్ట్రీయ హిందూ పరిషద్‌, హిందూ సేన, హిందూ సేవా పరిషద్‌, శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక, ఆల్‌ వరల్డ్‌ రుద్రా ఫౌండేషన్‌ రుద్ర దళ్‌, హిందూ రైట్స్‌ యాక్షన్‌ ఫోర్స్‌ వంటి ఎన్నో సంస్థలు `స్వాతంత్య్ర సమరానికి ముందు నాటివి, స్వరాజ్యం వచ్చిన తరువాత ఏర్పడినవి` కూడా ఉన్నాయి. అయితే వాటి ప్రభావం పరిమితం. హిందువుల ఐక్యత విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ దృష్టిని రాజకీయశక్తిగా మలచడంలో జనసంఫ్‌ు కృషి విశిష్టమైనది.

భారతీయ జనతా పార్టీ, కొత్తశకం

1977లో అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తరువాత నాలుగు పార్టీలు విలీనమై జనతా పార్టీ ఆవిర్భవించింది. ఆ నాలుగు పక్షాలు` భారతీయ లోక్‌దళ్‌, స్వతంత్ర పార్టీ, సోషలిస్ట్‌ పార్టీ, భారతీయ జనసంఫ్‌ు. కానీ జనతా పార్టీలోని సోషలిస్టులు ద్వంద్వ సభ్యత్వం పేరుతో మాజీ జనసంఫ్‌ు సభ్యులను బయటకు నెట్టారు. దాని ఫలితమే 1980లో ఏర్పడిన భారతీయ జనతా పార్టీ. ఇది భారతదేశ చరిత్రను మార్చింది. ఇప్పుడు దాదాపు 18 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. లేదా అధికారంలో భాగస్వామిగా ఉంది. కేంద్రంలో పూర్తి మెజారిటీతో అధికారం నిర్వహిస్తున్నది. అయినా హిందువులు న్యాయమైన హక్కుల కోసం తపన పడక తప్పడం లేదు. హిందూ ఫాసిజం, హిందూ ఉగ్రవాదం, మెజారిటీ మతోన్మాదం వంటి పేర్లతో పరోక్షంగా హిందువులను దూషిస్తూనే ఉన్నారు. ఈ ధోరణి ఆగాలి.

హిందువుల రాజకీయ ఐక్యత

విదేశీయుల దండయాత్రలతోనే కాదు, వారి పరిపాలనలో పూర్తిగా నష్టపోయినవారు హిందువులే.దేశ విభజనలోనూ మెజారిటీలయిన హిందువులే నష్టపోయారు. లియాఖత్‌ అలీ, నెహ్రూ ఒప్పందం  ప్రకారం ఇక్కడి ముస్లింలు పాకిస్తాన్‌ వెళ్లాలి. అక్కడి హిందువులు ఇక్కడికి రావాలి. హిందువులను పాక్‌ నుంచి కట్టుబట్టలతో తరిమేశారు. కానీ ఇక్కడ ముస్లింలు క్షేమంగా ఉన్నారు. విదేశీ పాలన మూలంగా ఎక్కువ సాంస్కృతిక విధ్వంసాన్ని చవిచూసినది హిందూ జీవనమే. వారి కళా సంపదే. కశ్మీరీ పండిట్లను స్వస్థలం నుంచి తరిమేస్తే దాని గురించి అడిగిన వారు లేరు. టీవీ చర్చలలో, సినిమాలలో హిందూ దేవుళ్లను, దేవతలను అవహేళన చేయడం భావ ప్రకటనా స్వేచ్ఛ. ఎంఎఫ్‌ హుసేన్‌ కారు మీద నగ్నస్త్రీ బొమ్మ గీస్తే అది కళ. కళాదృష్టి. హిందూ ఆలయాల మీద బొమ్మలు బూతు. బెంగాల్‌ వంటి చోట రంజాన్‌, దసరా నిమజ్జనం ఒకేరోజు వస్తే హిందువులు వెనక్కి తగ్గాలి. దీనికి కారణం కుహనా సెక్యులరిస్టులు, వాళ్ల ప్రభుత్వాలు. మన దేశం సెక్యులరిస్టు దేశమే అయితే ఇలా ఎందుకు ఉంది? దీనిని ప్రశ్నించడానికి రాజకీయ శక్తి కావలసిందే. ఆ పాత్రను ప్రస్తుత పరిస్థితులలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్నది.  కొన్ని విమర్శలు రావచ్చు. కానీ ఒకటి వాస్తవం. భారతీయ జనతా పార్టీ చైతన్యవంతమవుతున్న భారతీయతకు గళం. దాదాపు నూట ఐదేళ్లుగా సాగుతున్న భారతీయ ఐక్యతా కృషికి కొనసాగింపు.

–  జాగృతి డెస్క్‌

About Author

By editor

Twitter
YOUTUBE