ఇటీవలే ఒక జాతీయ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ, పాకిస్తాన్‌తో ఎటువంటి సంబంధాలను నెరిపేందుకు భారత్‌ ఆసక్తితో లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌లో అల్లర్లు వెలుగులోకి రావడం, సోషల్‌ ‌మీడియాలో దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు చక్కర్లు చేయడం యాదృచ్ఛికమేనా? ఆ ప్రాంతం భారత్‌కు చెందిందని, దానిని తాము తిరిగి తీసుకుంటామని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌తరచుగా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. విదేశాంగ మంత్రి జయశంకర్‌ అల్లర్ల నడుమ పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ‌భారత్‌లో భాగమని, ఏదో ఒకరోజు అక్కడ పాక్‌ ఆ‌క్రమణను అంతం చేస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు తప్ప ఎప్పుడో చెప్పలేదు. ప్రస్తుత అల్లర్లలో కలుగచేసుకునేందుకు మాత్రం భారత్‌ ‌సుముఖత చూపనట్టే కనిపిస్తున్నది. దాని వెనుక కారణాలు ఏమిటన్నది ఇంకా బహిరంగంగా ఎవరికీ తెలియకపోవడంతో ఎవరికి తోచినట్టుగా వారు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. బహుశ, అక్కడి ప్రజలు మానసికంగా భారత్‌కు అనుకూలం అయ్యి, తమను అంగీకరించమనే వరకూ వేచి ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం కావచ్చని కొందరు విశ్లేషకులంటుండగా, మీడియా మాత్రం ప్రధాని మోదీ తిరిగి అధికారం చేపట్టిన తర్వాత ఇది జరుగుతుందని ఊహాగానాలు చేస్తున్నది.

చిత్రంగా, పాక్‌ను అలుసుగా చూడవద్దని, వారి వద్ద ఆటంబాంబు ఉందని కాంగ్రెస్‌కు చెందిన మణిశంకర్‌ అయ్యర్‌, ‌నేషనల్‌ ‌కాంగ్రెస్‌కు చెందిన ఫరూక్‌ అబ్దుల్లా వంటివారు ఇటీవల భారత ప్రభుత్వాన్ని హెచ్చరించిన క్రమంలో ఈ అల్లర్ల సందర్భంగా ఆ ప్రాంతాలలో భారత్‌కు అనుకూల పోస్టర్లు , జెండాలు కనిపించడానికి కారణం ఏమిటో వారే చెప్పాలి. అసలే రాజకీయ, ఆర్ధిక సంక్షోభంతో, అధికార, నిధుల దుర్వినియోగం, బంధుప్రీతి కారణంగా అల్లాడుతున్న పాక్‌కు ఈ పరిణామాలు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంలా ఉన్నాయి.

కాగా, ఈ అల్లర్లను భారత్‌కు చెందిన రీసెర్చ్ అం‌డ్‌ అనాలసిస్‌ ‌వింగ్‌ (‌రా) రెచ్చగొడుతోందని యధాప్రకారంగా పాకిస్తాన్‌ ఆరోపణలు చేస్తోంది. పాక్‌ ‌పోలీసులపై, సైనికులపై అక్కడి ప్రజలు తిరగబడి వారిని చావగొడుతుండడంతో ఆ ప్రాంతంలో పాక్‌ ‌ప్రభుత్వం 144సెక్షన్‌ను విధించింది, ఇంటర్నెట్‌ను సస్పెండ్‌ ‌చేసింది.

వలసపాలన రీతిలో ఆక్రమిత ప్రాంతాల పాలన

నిజానికి 1947 నుంచి జమ్ము, కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలు పాకిస్తాన్‌ ఆ‌క్రమణలో ఉన్నాయి. భారత్‌ ఈ ‌ప్రాంతాన్ని పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ (‌పీఓకే)గా వ్యవహరిస్తోంది. ఆక్రమిత ప్రాంత భౌగోళిక వైశాల్యం 13,297 చదరపు కిమీలు. కాగా, జనవరి 1, 1949నుంచి కాల్పుల విరమణ అమలులోకి రావడంతో ఈ ప్రాంతం పాకిస్తానీ దళాల నియంత్రణలో ఉండిపోయింది. పాక్‌ ఆ‌క్రమించుకున్న ప్రాంతంలో జాతిపరంగా, భాషాపరంగా కూడా భిన్నమైన రెండు ప్రాంతాలు ఉన్నాయి. అందులో మీర్‌పూర్‌, ‌ముజాఫరాబాద్‌లతో కూడిన పీఓకే కాగా, రెండవది గిల్గిత్‌ ‌బల్టిస్తాన్‌. ఇది కశ్మీర్‌కు ఉత్తరపు అంచుల్లో ఉండి, లద్దాక్‌లోని కొన్ని ప్రాంతాలతో కలుస్తుంది. వాస్తవానికి గిల్గిత్‌ ‌బల్టిస్తాన్‌ ‌ప్రాంతమే పిఒకె మొత్తం వైశాల్యంలో 86శాతం ఉంటుంది. గత కొంతకాలంగా ఈ ప్రాంతం కూడా అసంతృప్తితో, నిరసనలతో అట్టుడుకుతున్నది. ఇక్కడ సమస్యలకు కారణం – పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం ఈ ప్రాంత పాలనలో రాజకీయ అణచివేత, హక్కుల నిరాకరణ, ఆర్ధిక దోపిడీ, వారి సంస్కృతిని హననం చేయడం వంటి వలసవాద పాలన లక్షణాలనే అనుసరించడమే.

దీనితో పాటుగా, స్థానిక ప్రజలను ప్రభుత్వో ద్యోగాలలో ఉన్నత స్థాయికి చేరుకోవడం నుంచి పాకిస్తాన్‌ ‌తెలివిగా మినహాయించింది. ఈ ప్రాంతంలో ఇనస్పెక్టర్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ‌పోలీస్‌ ‌నుంచి ప్రధాన కార్యదర్శి వరకూ ముఖ్య పదవుల్లో ఉన్నవారు పంజాబీ బ్యూరోక్రాట్లే కావడం గమనార్హం. స్థానికులు మహా అయితే కిందిస్థాయి గుమాస్తాలుగా ఉండగలరేమో కానీ, ఏనాడు వారి స్థాయిని చేరలేరు. విభజన సమయంలో ఈ ప్రాంతంలో మెజారిటీ షియా ముస్లింలు ఉండగా, బ్యూరోక్రసీలో ఉన్నత పదవుల్లో కేవలం సున్నీ ముస్లింలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. అంతేకాదు, న్యాయవ్యవస్థలో కూడా స్థానికులు ఉన్నత పదవులకు చేరకుండా చర్యలు తీసుకుంది. ఈ అంశాలు కూడా ఆ ప్రాంతంలో అసంతృప్తికి కారణమయ్యాయి.

వీటన్నింటినీ మించి ఐక్యరాజ్య సమితి ప్లెబిసైట్‌ ‌ద్వారా తమ ఎంపికను తెలియచేయవలసిన ప్రజలను పాకిస్తానీ చట్టాలను ఉపయోగించి తమ పౌరులుగా చేసేసుకుంది. దీనితోపాటుగా, వారి సాంస్కృతిక, జాతిపరమైన అస్తిత్వాలను మట్టిలో కలిపేందుకు జనరల్‌ ‌జియా ఉల్‌ ‌హక్‌ ‌కాలంలో ఇస్లామీకరణ తీవ్రంగా జరిగింది. ఈ పక్రియ ఈ ప్రాంతంలో షియా, సున్నీల మధ్య ఉద్రిక్తతలకు దారి తీయడమే కాక పాక్‌లో అతివాద సున్నీ భావజాలం వేళ్లూనుకోవ డానికి దారితీసింది.

ఇప్పుడు అల్లర్లు ఎందుకు?

ఇంతకీ పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌లో అల్లర్లకు కారణమేమిటి? సహజ వనరులతో సుసంపన్నమైన ప్రాంతం పీఓకే. కానీ అక్కడి ప్రజల జీవితం మాత్రం దుర్భరం. ఆహార, ఇంధన, విద్య సహా అన్ని రంగాల లోనూ సామాన్యుడు భరించలేని స్థాయిలో ధరలు పెరిగిపోతుండడంతో ప్రజలు తిరగబడుతున్నారు. తినడానికి తిండి లేక, విద్యుత్తు లేక, సరైన విద్యా,ఉపాధి అవకాశాలు లేక అక్కడి ప్రజలు అలమటించి పోతున్నా, తమ ప్రభుత్వానికి అర్జీల మీద అర్జీలు పెడుతున్నా పట్టించుకోక పోవడంతో వారు ఈ బాట పట్టారు.

తమను దశాబ్దాలుగా పాక్‌ ‌ప్రభుత్వం విస్మరిస్తూ వస్తోందని, అందుకే తాము ఇంత నిరుపేద పరిస్థితుల్లో జీవించాల్సి వస్తోందని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా, పీఓకే ప్రాంతంలో నీలం-ఝీలం జలవిద్యుత్‌ ‌ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అయ్యే 2,600 మెగావాట్ల విద్యుత్తులో తమకు న్యాయమైన వాటా రాకపోగా, విద్యుత్‌ ‌ధరలు పెరిగిపోవడం అన్నది వారి అసహనానికి కారణం కావడంలో ఆశ్చర్యం లేదు. ఈ విషయాన్ని ‘డాన్‌’ ‌వంటి పాకిస్తానీ పత్రికలు కూడా అంగీకరించాయి. ఝీలం నదికి ఉపనది అయిన నీలం నది, కున్హార్‌ ‌నది ఈ ప్రాంతం నుంచి పారేవే అయినప్పటికీ, స్థానికులకు చుక్కనీరు మిగల్చకుండా వాటిని కాలువల ద్వారా పంజాబ్‌ ‌ప్రాంతానికి మళ్లించి, స్థానికులు మంచి నీటికి కూడా అలమటించేలా ప్రభుత్వాలు చేస్తుండడం ప్రజల సహనానికి పరీక్ష పెట్టింది.

జమ్ముకశ్మీర్‌ ‌జాయింట్‌ ఆవామీ యాక్షన్‌ ‌కమిటీ (జేఏఏసీ) నేతృత్వంలో ఆ ప్రాంతంలో ఉత్పత్తి చేస్తున్న జలవిద్యుత్‌ ఉత్పాదక ధరలకు అనుగుణంగా విద్యుత్‌ ‌రేట్లతో ఇవ్వాలని, సబ్సిడీపై గోధుమ పిండి అందించాలని, ఉన్నతవర్గాలకు ఇచ్చే విశేషాధికారా లకు, అదనపు హక్కులకు ముగింపు పలకాలని శాంతియు తంగానే ఉద్యమిస్తున్న వారికి నాయకత్వం వహిస్తున్న వ్యాపారస్తులులో 70మందిని పోలీసులు అరెస్టు చేయడంతో అక్కడ హింస నెలకొంది. ప్రజలు అక్కడకు వచ్చిన పోలీసులపై దాడి చేసి చావ గొట్టడమే కాదు, వారి ఒంటిపై దుస్తులు, ఆయుధాలు లాక్కొని వారిని దిగంబరం చేయడం గమనార్హం. ఒక పోలీసును అయితే, ఆ ఆవేశంలో ఉద్యమ కారులు కొండపై నుంచి తోసివేశారు. పోలీసులకు, ఉద్యమకారులకు మధ్య జరిగిన సంఘర్షణలలో వందమంది గాయపడ్డారు, ఒక పోలీసు మరణించి నట్టు వార్తలు చెబుతున్నాయి. పాకిస్తాన్‌లో నెలకొన్న ఆర్ధిక సంక్షోభం, తత్ఫలితంగా చుక్కలనంటుతున్న ద్రవ్యో ల్బణం ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజల జీవితాలు దేశ వ్యాప్తంగా అస్తవ్యస్తమవు తున్నాయి. కాగా, పీఓకే వంటి నిర్లక్షిత ప్రాంతాల్లో వారి జీవితాలు మరింత దుర్భరమయ్యాయి. ప్రధానిగా ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ఉన్న సమయంలో భారత్‌తో వాణిజ్య సంబంధాలను నిలిపివేయడంతో ఇక్కడి వ్యాపారస్తుల లావాదేవీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

 గత కొన్నిరోజుల నుంచి అధిక విద్యుత్‌, ఆహార ధరలకు వ్యతిరేకంగా వ్యాపారులు, ప్రజలు నిరసన ప్రారంభించారు. పీఓకే రాజధాని ముజఫరాబాద్‌లో సమ్మె చేయడంతో అక్కడ ప్రభుత్వ రవాణా, దుకాణాలు, మార్కెట్లు, వ్యాపారాలు సహా సమస్తం మూతపడ్డాయి. తమను నిలవరించేందుకు వేసిన బారికేడ్లను విరకొట్టి మరీ మీర్‌పూర్‌, ‌ముజాఫరా బాద్‌లో నిరసనకారులు పోలీసులతో తలపడ్డారు. ఈ పరిణామాలతో అక్కడి ప్రభుత్వం అసెంబ్లీ, కోర్టు వంటి ప్రభుత్వ భవనాలకు రక్షణ కల్పించేందుకు పారా మిలటరీ రేంజర్లను పిలిపించడం నిరసనకారు లలో మరింత ఆగ్రహాన్ని పెంచింది.

తరాలపాటు ఈ ప్రజలు ఆర్ధికంగా వృద్ధి చెందకుండా నిలవరించడమే కాకుండా, అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ ‌రాజకీయ అజెండాను సమర్ధించుకు నేందుకు వీరిని ఉపయోగించుకున్నారని విశ్లేషకులు పేర్కొనడం గమనార్హం. కేవలం పెరుగుతున్న విద్యుత్‌ ‌బిల్లులు, పన్నులు, నిత్యావసర వస్తువులు, నిరుద్యోగిత ఈ నిరసనలకు కారణమని భావించడం సరికాదన్నది వారి వాదన. పాకిస్తాన్‌ ‌పోలీసుల ఆగడాలు, పాకిస్తాన్‌ ‌సైన్యం చేసే అత్యాచారాల పట్ల ఆగ్రహం కూడా ఒక ప్రధాన కారణం. మీర్‌పూర్‌, ‌ముజాఫరాబాద్‌ ‌ప్రాంతాల నుంచి వందలాది మంది బాలబాలికలు మాయం అవుతున్నారన్నది ఆరోపణ. అందులో ఎక్కువమందిని సైన్యమే మాయం చేసిందని స్థానికులు వేలెత్తి చూపుతున్నారు. దీనితో పాటు పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ‌ప్రాంతాన్ని తీవ్రవాద శిబిరాలుగా, తీవ్రవాదులను తయారు చేసి, ప్రయోగించే లాంచ్‌ప్యాడ్‌గా పాక్‌ ‌సైన్యం వాడుకోవడం మినహా స్థానికులకు దక్కింది ఏమీలేదు.

భారత్‌లో కశ్మీర్‌ ‌ప్రజలతో పోల్చుకుంటున్న పిఒకె వాసులు

భారత్‌లో ఉన్న జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370‌ని రద్దు చేసిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి, వెల్లువలా వచ్చిపడుతున్న పెట్టుబడులు, అక్కడి ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పు పీఓకేలో ఉన్న ప్రజలను ఆలోచింపచేస్తున్నా యన్నది వాస్తవం. తమ ప్రాంతాన్ని, వనరులను వాడుకోవడం తప్ప ఇక్కడ గల మనుషులకు ఇసుమంతైనా గౌరవం ఇవ్వకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడాన్ని వారు సహించలేకపోతున్నారు. రకరకాల కారణాల వల్ల ఎప్పటి నుంచో అంతర్లీనంగా రగులుతున్న పాక్‌ ‌వ్యతిరేకత దీనితో మరింత తీవ్రతరమవడమే కాదు, రావల్‌కోట్‌ ‌ప్రాంతంలో ప్రజలు తమ ప్రాంతాన్ని, తమను, భారత్‌తో కలిపేయవలసిందిగా డిమాండ్‌ ‌చేస్తూ పోస్టర్లు వేశారు. వాస్తవానికి ఇటువంటి నిరసనలు ఆ ప్రాంతంలో జరుగడం మొదటిసారీ కాదు, కొత్తా కాదు. ఇటువంటి ప్రదర్శనలు గతంలో కూడా పలుమార్లు చోటు చేసుకున్నాయి. కానీ, అక్కడి ప్రజలు భారత్‌ అనుకూలతను ప్రదర్శించడం మాత్రం కొత్తే. ఈ క్షేత్రస్థాయి వాస్తవాలు సోషల్‌ ‌మీడియా కారణంగా సామాన్య ప్రజలకు తెలుస్తున్నాయి. ఈ క్రమంలోనే, నిరసన ర్యాలీలలో భారత జాతీయ జెండాలు ఎగురుతున్న ఫోటోలు సోషల్‌ ‌మీడియాలో చక్కర్లు కొట్టడాన్ని కూడా చూస్తున్నాం.

నిజానికి పాకిస్తాన్‌కు కశ్మీర్‌ ‌పట్ల గల వ్యామోహం, దానిపై భౌగోళికంగా విజయం సాధించాలన్న కోరికకే పరిమితమైంది తప్ప అక్కడ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్న ఉద్దేశాలు దానికి ఉన్నట్టు ఎప్పుడూ కనిపించలేదు. ప్రజలు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే దాకా వేచి చూడకుండానే కశ్మీర్‌పై దాడి చేయడం అన్నది ప్రజల ఆకాంక్షల పట్ల పాక్‌కు ఎటువంటి గౌరవం లేదనే విషయాన్ని పట్టిచూపుతుంది. దీర్ఘకాలం పాటు గిల్గిత్‌ ‌బల్టిస్తాన్‌ ‌ప్రాంతాన్ని మిగిలిన దేశంతో సమగ్రం చేయకుండా ఉండటానికి కారణం, భవిష్యత్తులో ఎప్పుడైనా •ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్లెబిసైట్‌ ‌నిర్వహిస్తే అది తమ దేశవాదనను బలహీనపరుస్తుందనే భయమే. పదే పదే ఐరాస ప్లెబిసైట్‌ ‌నిర్వహించాలని పాక్‌ ‌రొటీన్‌గా డిమాండ్‌ ‌చేసినప్పటికీ, ఐరాస భద్రతామండలి సూచించినట్టుగా తన సైనికులను ఆ ప్రాంతం నుంచి ఉపసంహరించక పోవడం గమనార్హం. ఒకవేళ ప్లెబిసైట్‌ ‌నిర్వహిస్తే, ఫలితం తమకు అనుకూలంగా రాదనే భయంతోనే ఏడున్నర దశాబ్దాలుగా ఆ ప్రాంత వాసులకు ఎటువంటి స్వేచ్ఛలు ఇవ్వకపోవడమే కాదు, తన తీవ్రవాదంతో కశ్మీర్‌ ‌ప్రజలను గడగడలాడించింది. నేడు పాక్‌ ‌ప్రభుత్వం తమ వ్యవస్థాగత వైఫల్యాల కారణంగా ఏర్పడిన పరిస్థితిని దాచేందుకు తాత్కాలికంగా ఏవో తాయిలాలు ప్రకటించి, ఆ గాయానికి కట్టుకట్టే యత్నం చేసినప్పటికీ, అది దాగే పరిస్థితిలేదు. ముఖ్యంగా పాకిస్తాన్‌లో రాజకీయ అస్థిరతలు, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ‌పుణ్యమా అని పరువు కోల్పోయిన సైన్యం వంటి కారణాలన్నీ ఈ ప్రాంత ప్రజలు తమ గళమెత్తడానికి కొంత ధైర్యాన్ని ఇచ్చాయి. కొన్ని దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న అణచివేత నుంచి బయటపడాలన్న బలమైన కోరిక ఆక్రమిత ప్రాంత ప్రజలలో బలంగా నెలకొన్నట్టు కనిపిస్తోంది.

ఇదిలా ఉండగా, పాకిస్తాన్‌లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనల విషయంలో అంతర్జాతీయ సమాజం మౌనం వీడాల్సిన సమయం ఆసన్నమైంది. భారత కశ్మీర్‌లో చీమచిటుక్కుమన్నా వెంటనే మెలకువ తెచ్చుకుని, భూతద్దాలతో బయిలుదేరే మానవ హక్కుల సంస్థలు, కార్యకర్తలు పాక్‌లో జరుగుతున్న అణచివేతలు, అకృత్యాలు, హింసపై గొంతెత్తి మాట్లాడి తీరవలసిందే.

డి. అరుణ

About Author

By editor

Twitter
YOUTUBE