మీడియా అంటే కేవలం ప్రభుత్వ వ్యతిరేకతను కలిగి ఉండడం, వామపక్ష భావజాలాన్ని వ్యాప్తి చేయడం అనే భావన ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిపోయిన అభిప్రాయం. ఇప్పుడు దీనికి అదనంగా, పత్రికా సంస్థలు, జర్నలిస్టులు దేశాన్ని విచ్ఛిన్నం చేసే వ్యాసాలు రాయడం, వివిధ వర్గాల మధ్య చిచ్చు పెట్టడం, అందుకు విదేశాల నుంచి తాయిలాలు అందుకోవడం కూడా మీడియా స్వేచ్ఛగా చెలామణి అయిపోతోంది. మీడియా ఎంత ఎక్కువ దేశ వ్యతిరేక ప్రచారం చేసేందుకు స్వతంత్రాన్ని కలిగి ఉంటే ఆ దేశంలో మీడియా అంత స్వేచ్ఛను కలిగి ఉన్నదనే భావనను అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే సూచీలు చెప్తుంటాయి. కానీ, దేశ వ్యతిరేక ప్రచారాలకు పాల్పడడం అన్నది దేశవిద్రోహ చర్య అని మాత్రం అవి అంగీకరించవు. అందుకే, సంఘవ్యతిరేక శక్తులకు, ఉగ్రవాదులకు తోడ్పడే ‘న్యూస్‌క్లిక్’ వంటి సంస్థలు సమాజంలో, మేధావుల నడుమ అత్యంత సత్యవంతమైనవిగా చలామణి అయిపోతుంటాయి.
న్యూస్‌క్లిక్ సంస్థ విదేశాల నుంచి నిధులు అందుకుంటోందన్న సమాచారం మేరకు మన నిఘా సిబ్బంది ఆ సంస్థపై సోదాలు నిర్వహించినప్పుడు దేశంలో ఒక వర్గం మీడియా ఆగ్రహంతో తిరగబడి పోయింది. తమకు వ్యతిరేకంగా రాస్తున్నారు కనుక ప్రభుత్వమే చట్ట సంస్థలను ఉపయోగించి మీడియా నోరుమూయిస్తోందంటూ విమర్శల వర్షం కురిసింది. అయితే, ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీటులోని అంశాలు అటువంటివారి నోరు మూయించేలానే కాదు అత్యంత విస్ఫోటకంగా ఉన్నాయి. గుజరాత్ అల్లర్లలోనూ, ఆ తర్వాత జరిగిన ఇష్రత్ జెహాన్ ఫేక్ ఎన్‌కౌంటర్‌లోనూ నేటి ప్రధాని, నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని, హోంమంత్రి అమిత్ షాను బాధ్యులను చేసేందుకు రకరకాల కుట్రలు పన్ని, ప్రచారాలు చేసిన తీస్తా సెతిల్వాద్ తన పోర్టల్ ‘సబ్‌రంగ్ ఇండియా’ను పునరుద్ధ రించేందుకు న్యూస్‌క్లిక్ ద్వారా నైవేలీ రాయ్ సింఘం నుంచి నిధులు అందాయని ఛార్జిషీటు పేర్కొంది.
న్యూస్ క్లిక్ మీడియా పోర్టల్‌లో పని చేసి, సాక్షులుగా ముందుకు వచ్చిన సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆఖరుకు దర్యాప్తు చేస్తున్నవారిని కూడా షాక్‌కు గురి చేసింది. హింస, అల్లర్లకు పాల్పడ వలసిందిగా ముస్లింలను రెచ్చగొట్టమని తమ సంస్థ ఆదేశాలు ఇచ్చిందని వారు ఆరోపించారు. సీఏఏ వ్యతిరేక (పౌరసత్వ సవరణ చట్టం), షాహీన్‌బాగ్ ప్రదర్శనల సందర్భంలో నిరసనకారులకు పంచవలసిందిగా తమకు నగదు అందచేసినట్టుగా కూడా వారు ఆరోపించడం గమనార్హం. జాతి చైతన్యాన్ని విధ్వంసం చేసి, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడం, చైనాతో సంబంధం కలిగిన సమాచార యుద్ధంలో న్యూస్‌క్లిక్ పాల్గొందని పోలీసులు తమ ఛార్జిషీటులో ఆరోపించారు.
అంతేకాదు, అల్లరిమూకలు అశాంతిని, విధ్వంసాన్ని సృష్టించేందుకు ఆయుధాలను కొనుగోలు చేసేందుకు ఈ మీడియా సంస్థ ద్వారా చైనా నుంచి కూడా నిధులు అందుకున్నారని సాక్షులు పేర్కొన్నారు. ఒక ప్రముఖ మీడియా సంస్థ ఛార్జిషీటు ఆధారంగా దాఖలు చేసిన నివేదిక ప్రకారం కశ్మీర్‌లో తిరుగుబాటును సృష్టించేందుకు కూడా వ్యక్తులకు డబ్బును అందించారు.
చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ)లోని సెక్షన్ 41 కింద ఈ రక్షిత సాక్షుల వాంగ్మూలాలు కోర్టులో నమోదు చేయడమే కాక ఢిల్లీ పోలీసులు ఇటీవల సమర్పించిన ఛార్జిషీట్‌లో కూడా చేర్చారు. ఒక మతానికి వ్యతిరేకంగా ఆందోళనకారులను రెచ్చగొట్టేందుకు తమను సీఏఏ వ్యతిరేక, షాహీన్ బాగ్ ప్రదర్శనలకు సిబ్బందిని పంపిన విషయాన్ని న్యూస్‌క్లిక్‌లో పని చేసినవారు, సాక్షులు వెల్లడించారు. న్యూస్‌క్లిక్ సిబ్బంది అల్లర్లను మరింత పెంచడానికి ఉపయోగించేందుకు కంపెనీ నుంచి డబ్బులు తీసుకుని వారికి బదిలీ చేసేవారు.
అనేక గ్రూపులు, ముఖ్యంగా వాట్సాప్ పై రెండు గ్రూపులు చురుకుగా ఉండేవని, ఇందులో ఒక గ్రూపు సీఏఏ వ్యతిరేక, రైతుల, షాహీన్‌బాగ్ ప్రదర్శనలు సమాజంలో సంక్షోభాన్ని పెంచేందుకు మరింత తీవ్రతరం కావాలని కోరుకునేది. మరొక గ్రూపు కశ్మీర్‌లో తిరుగుబాటు కొనసాగేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండేది. న్యూస్‌క్లిక్‌లో పేరోల్‌లో కేవలం జర్నలిస్టులుగా పని చేస్తున్నవారే కాక, దుష్ప్రచారాన్ని తీవ్రతరం చేసేందుకు ఇతర ‘మేధావులు’ కూడా ఉండేవారు. కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ వంటి సున్నిత ప్రాంతాల మ్యాపులను కూడా మార్చారు.
అంతేకాకుండా, సీఏఏ వ్యతిరేక హింస కేసులో నిందితుడైన షర్జీల్ ఇమామ్ పేరు కూడా బయిటకు రావడం విశేషం. తన కుట్రపూరిత అజెండాను ముందుకు తీసుకువెళ్లేందుకు న్యూస్‌క్లిక్ అధిపతి ప్రబీర్ పురకాయస్థ నుంచి అతడు డబ్బు తీసుకున్నా డని తేలింది. చార్జిషీటును, సాక్షుల వాంగ్మూలాలను, నిధులకు సంబంధించిన ఆధారాలను అన్నింటినీ ఢిల్లీ పోలీసులు కోర్టుకు సమర్పించారు.
నైవేలీ రాయ్ సింఘం నుంచి అక్రమంగా నిధుల మళ్లింపు
పోర్టల్ ద్వారా విదేశీ ఫండింగ్‌ను అందుకున్న వ్యక్తులలో యాక్టివిస్టు తీస్తా సెతల్వాద్ ఒకరు. ‘సబ్‌రంగ్ ఇండియా’ పోర్టల్‌ను పునరుద్ధరించేందుకు అత్యంత ‘అనుకూల మార్గాల’ ద్వారా ఆమె నిధులను అందుకున్నారు. ఇందులో జరిగిన స్కాంను పోలీసులు ఛార్జిషీటులో బయటపెట్టారు. ఈ ‘న్యూస్ సిండికేషన్ల స్కాం’లో తీస్తా సెతల్వాద్ కోసం పని చేసే కాలమిస్టులు, రచయితలకు ప్రబీర్ పురకాయస్థ పారితోషికాలు చెల్లించేవాడు. పోర్టల్‌లో ప్రచురితం చేసేందుకు తీస్తా గ్రూపు వ్యాసాలను వెలువరించేది. వీటి రచయితల పేర్లను ‘సబ్‌రంగ్ ఇండియా’గా పేర్కొనేవారు తప్ప అసలు రచయితలు ఎవరో వెల్లడించేవారు కాదు. ఇది ‘సబ్‌రంగ్ ఇండియా’ దాదాపు రూ. 3 లక్షలు ఆర్జించడానికి, ఆమె సిబ్బంది రూ.1 కోటి రూపాయలకు పైగా ఆర్జించేందుకు, ఆమె కుటుంబం రూ.39 లక్షలు వ్యక్తిగతంగా వినియోగించుకునేందుకు తోడ్పడిందని చార్జిషీటు పేర్కొంది. ఒకవైపు నిఘా ఏజెన్సీల రాడార్‌లో ఉన్న ప్పటికీ తీస్తా సెతల్వాద్ విదేశీ నిధులను అందుకునేందుకు ఇది అత్యంత అనుకూలమైన మార్గమని ఢిల్లీ పోలీసుల ఛార్జిషీటు వ్యాఖ్యానించడం గమనార్హం. రిట్రీవ్ చేసిన ఇమెయిళ్లు, సాక్షుల విచారణ, ఆర్ధిక ప్రేరణలు, రక్షిత సాక్షుల వాంగ్మూలాలు అన్నీ కూడా తీస్తా సెతల్వాద్, ప్రబీర్ పురకాయస్థ, నైవేలీ రాయ్ సింఘం ముగ్గురూ అంతర్• •ర్యాచరణ నిర్వహించే త్రిమూర్తులని చార్జీషీటు అభివర్ణించింది. పురకాయస్థకు దీర్ఘకాలిక సహచరుడు, అమెరికన్ మిలియనీర్ సింఘం.
ఈ ముగ్గురు వ్యక్తులూ వామపక్ష తీవ్రవాదం అజెండాను అమలుతో పాటుగా తమ వ్యక్తిగత అవసరాలకు ఒకరికొకరు తోడ్పాటు నందించు కునేవారట. తీస్తా సెతల్వాద్‌కు, నైవేలీ రాయ్ సింఘంకు మధ్య నడిచిన ఇమెయిళ్లన్నీ కూడా నైవేలీ రాయ్ సింఘమే ‘సబ్‌రంగ్ ఇండియా’ పోర్టల్‌ను, ‘సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్’ (సిజెపి) అనే స్వచ్ఛంద సంస్థకు ప్రబీర్ పురకాయస్థ ద్వారా నిధులను ఏర్పాటు చేస్తున్నారనే విషయాన్ని బయటపెట్టాయి.
ఛార్జిషీటు ప్రకారం, డిసెంబర్ 13, 2023న ప్రత్యేక సెల్ బృందం ఈ విషయంపై దర్యాప్తు చేసేందుకు ముంబై వెళ్లి, తీస్తా సెతల్వాద్‌కు, ఆమె భర్త – సబ్‌రంగ్ ఇండియా ఎడిటర్ జావేద్ ఆనంద్‌కు ఈ లావాదేవీల వివరాలను అందించవలసిందిగా నోటీసులు ఇచ్చింది. కార్మికశక్తి, వేతనాల వివరాలు, వారు రాసిన వ్యాసాలు, తీసిన వీడియోలతో పాటుగా న్యూస్‌క్లిక్ వ్యవస్థాపక, ఎడిటర్‌తో సబ్‌రంగ్ ఇండియా చేసుకున్న ఒప్పందాన్ని సమర్పించాలని కోరింది.
వివిధ చైనీస్ కార్పొరేషన్ల నుంచి రూ. 80 కోట్ల మేరకు నిధులను న్యూస్ క్లిక్ వసూలు చేసిందని ఆరోపణ. ‘భారతదేశ సార్వభౌమత్వాన్ని భంగపరిచేందుకు,’ దేశం పట్ల ద్వేషాన్ని రగిల్చే లక్ష్యంతో ఈ డబ్బును చైనా సంస్థల నుంచి తీసు కున్నట్టుగా ఎఫ్‌ఐఆర్ పేర్కొంది. ఇంతకుముందు, ప్రబీర్ పురకాయస్థపై దర్యాప్తును పూర్తి చేసేందుకు పోలీసులకు కోర్టు 10 రోజుల గడువు ఇచ్చింది. న్యూస్‌క్లిక్ హెచ్‌ఆర్ విభాగం అధిపతి, ప్రస్తుతం అప్రూవర్‌గా మారిన అమిత్ చక్రవర్తి జుడిషియల్ కస్టడీని మరో పదిరోజులు పెంచారు.
ఎఫ్‌ఐఆర్‌లో జోడించిన వ్యక్తులతో పాటు డాటా విశ్లేషణలో బయిటపడిన వారిని లక్ష్యంగా చేసుకొని ఢిల్లీతో పాటుగా ఏడు ఇతర రాష్ట్రాలలోని 88 ప్రాంతాలలో అక్టోబర్ 2023లో దాడులు నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. అంతే కాకుండా, పీపుల్స్ అలయెన్స్ ఫర్ డెమొక్రసీ అండ్ సెక్యులరిజం (పిఎడిఎస్)తో కలిసి ప్రబీర్ పురకాయస్థ 2019 లోక్‌సభ ఎన్నికలను చెడగొట్టేందుకు కుట్రపన్నాడని ఆరోపణలు చేశారు.
చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ)కింద గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు, ఎడిటర్ ప్రబీర్ పురకాయస్థను, హెచ్‌ఆర్ అధిపతి అమిత్ చక్రవర్తిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే రోజున న్యూస్‌క్లిక్ కార్యాలయంపై దాడి చేసి, సీల్ చేశారు.
దీనితో పాటు కొవిడ్-19 కాలంలో అంత ర్జాతీయంగా విమర్శల వర్షం కురుస్తున్నా చైనా అనుకూల ప్రచారానికి నైవేలీ, విజయ్‌ప్రసాద్, ప్రబీర్ వారి సహచరులు న్యూస్‌క్లిక్ ద్వారా శ్రీకారం చుట్టారని ఛార్జిషీటు ఆరోపించింది. ఇందుకోసం ‘ది చైనా టీమ్’ పేరిట ఒక బృందాన్ని కూడా సృష్టించారని పేర్కొంది. మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో చైనా వర్షన్ కథనాన్ని ప్రచారం చేసేందుకు ప్రబీర్‌పై ఒత్తిడి కూడా వచ్చిన విషయం కూడా చార్జిషీటు ప్రస్తావిం చింది. కొవిడ్-19 కాలంలో వ్యాసాలు, వీడియోల ద్వారా ప్రబీర్, అతడి బృందం చైనా అనుకూల/ తప్పుడు సమాచారాన్ని ప్రబీర్ ప్రచారం చేసినట్టు సాక్షులు నొక్కి చెప్పారు.
నిజానికి భారత్ అభివృద్ధి బాట పట్టినప్పటి నుంచీ అంతర్జాతీయ మీడియాకు, నైవేలీ, సోరోస్ వంటి వ్యక్తులకు ప్రబీర్, తీస్తా, రాణా అయ్యుబ్ వంటి వారి అవసరం పెరిగిపోయింది. తిన్న ఇంటివాసాలు లెక్కపెట్టేందుకు ఏ మాత్రం మొహ మాట పడని వీరిని కూలీలుగా ఉపయోగించుకుని భారత్‌కు వ్యతిరేకంగా దుష్ప్రచారానికి విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతున్నారన్న విషయం అనేక సందర్భాలలో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇటువంటి ఇతివృత్తాల యుద్ధంలో మనం గెలుపు సాధించాలంటే, మన దేశం పట్ల ప్రేమ, గౌరవం చాలు. అదే వంద అబద్ధాలను కూడా ఇట్టే నిర్వీర్యం చేయగలదు.
ఇదిలా ఉండగా, ‘‘ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా ఎన్నికలలో పాల్గొననుంది. ఈ నేపథ్యంలో దేశాలు, రాజకీయశక్తులు పత్రికాస్వేచ్ఛను పరిరక్షించడంలో చాలా అల్పపాత్ర పోషిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో జర్నలిస్టుల పాత్రను తక్కువ చేయడం లేదా తప్పుడు సమాచారం లేదా ప్రచారాల వేధింపులకు వారిని పరికరంగా చేసుకుని మీడియాను నిర్వీర్యం చేస్తున్నాయి. జర్నలిజం దాని లక్ష్యాలకు విరుద్ధంగా ఉంది,’’ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ సంస్థ పత్రికాస్వేచ్ఛ 2024కు గాను విడుదల చేసిన సూచీలో చేసిన వ్యాఖ్యలు ఇవి. కానీ, ఈ సంస్థ స్వదేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మీడియా సంస్థలు విదేశాల నుంచి నిధులను అందుకుని, తప్పుడు ప్రచారాలను చేయడం గురించి వ్యాఖ్యా నించక పోవడం గమనార్హం.
జాగృతి డెస్క్