370 అధికరణం రద్దు తర్వాత కశ్మీర్‌లో శాంతియుత వాతావరణంలో జరిగిన పోలింగ్‌ ‌గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తపిస్తూ ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన ఎంతోమందికి నివాళి వంటిది. దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారి ఎన్నికలు బహిష్కరించాలన్న పిలుపులు వినపడలేదు. ప్రజలు తాము ఓటు వేశామంటూ వేళ్లు ఆనందంగా చూపించడం వెనుక ఈ బహిష్కరణ పిలుపుల ‘భయం’ లేకపోవడమే కారణం! ఏ స్టేషన్‌లోను ‘జీరో’ పోలింగ్‌ ‌నమోదు కాకపోవడం స్పష్టమైన మార్పునకు సంకేతం. శ్రీనగర్‌ ‌పరిధిలోని 2135 పోలింగ్‌ ‌స్టేషన్లలో గతంలో మాదిరిగా కాకుండా పోలింగ్‌ ‌ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

 2019, ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే 370 అధికరణాన్ని రద్దుచేసిన తర్వాత జరిగిన ఎన్నికలు కావడంతో సహజంగానే ప్రాధాన్యం ఏర్పడింది. ఉగ్ర బెడద లేకపోవడంతో అభివృద్ధి, స్థానిక సమస్యలు ప్రచారంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. స్వయం పాలన, స్వేచ్ఛ, చర్చలు వంటి అంశాలు అసలు ప్రస్తావనకే రాకపోవడం జమ్ము-కశ్మీర్‌లో వచ్చిన మార్పును స్పష్టం చేస్తున్నది.

జమ్ము-కశ్మీర్‌లో మొత్తం ఐదు లోక్‌సభ స్థానాలుండగా, రెండు జమ్ములో (ఉధంపూర్‌, ‌జమ్ము) మిగిలిన మూడు కశ్మీర్‌లో ఉన్నాయి. జమ్ములోని స్థానాలకు తొలి రెండు దశల్లో పోలింగ్‌ ‌జరిగింది. బీజేపీ అభ్యర్థులుగా కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ (ఉధంపూర్‌), ‌ప్రస్తుత ఎంపీ జుగల్‌ ‌కిషోర్‌శర్మ (జమ్ము) రంగంలో నిలిచారు. ఉధంపూర్‌ ‌నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా లాల్‌సింగ్‌ ‌చౌదరి, జమ్ము నుంచి ఇదే పార్టీ తరపున రామన్‌భల్లా నిలిచారు. ఈ స్థానాల్లో ఎప్పుడూ పోలింగ్‌ ‌ప్రశాంతమే. కశ్మీర్‌లోయ మాత్రమే సమస్యాత్మకం! ఏప్రిల్‌ 19‌న ఉధంపూర్‌ (68.27%), ఏ‌ప్రిల్‌ 26‌న జమ్ము (72.22%), మే 13న శ్రీనగర్‌ (38.49%) ఎన్నికలు జరగ్గా బారాముల్లాలో మే 20న, అనంత్‌నాగ్‌ ‌రాజౌరీలో మే 25న పోలింగ్‌ ‌జరిగింది.

శ్రీనగర్‌లో స్పష్టమైన మార్పు

శ్రీనగర్‌ ‌లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 17.48 లక్షలు. మొత్తం ఏడుదశల ఎన్నికల్లో నాల్గవ దశలో మే 13న జరిగిన పోలింగ్‌లో 1996లో నమోదైన అత్యధిక పోలింగ్‌ 40.94% ‌తర్వాత అధిక పోలింగ్‌ అం‌టే 38% నమోదైంది! ఒకప్పుడు మిలిటెన్సీతో నలిగిపోయిన ఈ నియోజక వర్గంలో, ఉగ్రవాదుల భయంతో ఓటేసేందుకు ఎవ్వరూ ముందుకు వచ్చేవారు కాదు. కానీ ఈసారి నిర్భయంగా ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనడంతో శ్రీనగర్‌లో శాంతి సుస్థిరతలు నెలకొన్నాయన్న సత్యం ప్రపంచానికి వెల్లడైంది. ఇదిలావుండగా ఈ స్థానం నుంచి నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌తరపున అగా సయ్యద్‌ ‌రుహనుల్లా మెహదీ, పీడీపీ తరపున వహీద్‌ ‌పర్రా, అప్నీ పార్టీకి చెందిన అష్రాఫ్‌ ‌మీర్‌ ‌పోటీపడ్డారు. విచిత్రమేమంటే నేషనల్‌ ‌కాన్ఫరెన్స్, ‌పీడీపీ పార్టీలు 370, 35ఎ అధికరణాల రద్దును వ్యతిరేకిస్తున్నాయి. ఇక అల్తాఫ్‌ ‌బుఖారీ నేతృత్వంలోని జేకే అప్నీ పార్టీ (ఏపీ) తరపున పోటీ పడిన మాజీ మంత్రి మహమ్మద్‌ అ‌ష్రాఫ్‌ ‌మీర్‌కు సజ్జద్‌ ‌లోనీ నేతృత్వంలోని జేకే పీపుల్స్ ‌కాన్ఫరెన్స్ ‌మద్దతు పలికింది. అప్నీ పార్టీకి బీజేపీ మద్దతిస్తోంది. ఈ పార్లమెంట్‌ ‌నియోజక వర్గంలో శ్రీనగర్‌, ‌గందేర్బల్‌, ‌పుల్వామా, బుద్గామ్‌, ‌సోఫియాన్‌ ‌జిల్లాల్లోని కొన్ని భాగాలు ఉన్నాయి. పుల్వామా, షోఫియాన్‌, ‌గందేర్బల్‌ ‌ప్రాంతాల్లో ఎప్పుడూ ఉగ్రవాదుల బెడద ఉండేది. ఓటుహక్కు వినియోగించుకోవాలంటే ప్రాణాన్ని పణంగా పెట్టి రావడమేనన్న పరిస్థితులు నెలకొనేవి. కానీ నేడు ఆ పరిస్థితి మారిపోయింది. ఉగ్రవాదుల పదఘట్టనల మధ్య అల్లాడిన పుల్వామాలో 39.25%, షోపియాన్‌ ‌జిల్లాలో 40.25% మార్కును పోలింగ్‌ ‌దాటడం ఈసారి విశేషం. శ్రీనగర్‌ ‌పాతబస్తీతో పాటు జిల్లాలోని బుద్గామ్‌, ‌గందేర్బల్‌, ‌పుల్వామా, షోపియాన్‌ ‌ప్రాంతాలు గత కొన్ని దశాబ్దాలుగా తీవ్ర ఉద్రిక్తపరిస్థితలకు నెలవుగా ఉండేవి. ఫలితంగా అతి తక్కువ ఓటింగ్‌ ‌నమోదవుతూ వచ్చింది. అయితే 1996 ఎన్నికలు మాత్రం ఇందుకు మినహాయింపు. ఇక 1991లో కశ్మీర్‌ ‌లోయలో అల్లర్ల కారణంగా ఎన్నికలు జరగలేదు. మిగిలిన ఎన్నికల విషయానికి వస్తే 2019లో 14.43%, 2014లో 25.86%, 2009లో 25.55%, 2004లో 18.57%, 1999లో 11.93%, 1998లో 30.06% ఓటింగ్‌ ‌నమోదైంది.

బరిలో ప్రాంతీయపార్టీలు

 ప్రాంతీయ పార్టీలైన నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ (ఎన్‌సీ), పోగ్రెసివ్‌ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీ (పీడీపీ), మాజీ సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నేత గులాంనబీ ఆజాద్‌ ‌నేతృత్వంలోని డెమోక్రటిక్‌ ‌పోగ్రెసివ్‌ ఆజాద్‌ ‌పార్టీ (డీపీఏపీ), అల్తాఫ్‌ ‌బుఖారీ నాయకత్వంలోని జేకే అప్నీ పార్టీ కశ్మీర్‌లోని మూడు స్థానాల్లో తలపడ్డాయి. మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా బారాముల్లా నుంచి రంగంలో ఉండగా పీడీపీ అభ్యర్థి ఫయాజ్‌ ‌మీర్‌ ‌ప్రత్యర్థిగా పోటీలో ఉన్నారు. అదేవిధంగా అనంతనాగ్‌-‌రాజౌరీ లోక్‌సభ స్థానానికి పీడీపీ తరపున మాజీ ముఖ్య మంత్రి మెహబూబా ముఫ్తీ, ఎన్‌సీ తరపున మియాల్‌ అల్తాఫ్‌, అప్నీ పార్టీ నుంచి జాఫర్‌ ఇక్బాల్‌ ‌మన్హాస్‌ ‌పోటీ పడుతున్నారు. ఇక్కడ అప్నీ పార్టీకి బీజేపీ మద్దతిస్తున్నది. ఎన్‌సీ, పీడీపీ, ఇండియా కూటమి మధ్య కుదిరిన అంగీకారం మేరకు జమ్ములోని రెండు స్థానాల్లో కూటమి అభ్యర్థులకు ఎన్‌సీ, పీడీపీ మద్దతునిచ్చాయి. అయితే కశ్మీర్‌లోని మూడు స్థానాలకు ఎవరికి వారు పోటీలో నిలవాలని నిర్ణయించడంతో ఎన్‌సీ, పీడీపీ అభ్యర్థులను రంగంలో నిలిపాయి.

రంగంలోకి దిగని బీజేపీ

విశేషమేమంటే భారతీయ జనతా పార్టీ లోయలోని మూడు లోక్‌సభ స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టలేదు. గడచిన మూడు దశాబ్దాల్లో ప్రతిసారీ బీజేపీ శ్రీనగర్‌, ‌బారాముల్లా, అనంతనాగ్‌ ‌స్థానాల్లో అభ్యర్థులను నిలబెడుతూ వచ్చింది. ఈ ఏడాది చివరల్లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలకు తగిన రీతిలో బలోపేతమయ్యే లక్ష్యంతో కశ్మీర్‌లో ప్రస్తుతం బీజేపీ పోటీ చేయడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు లేకపోలేదు. 2018 నుంచి జమ్ము- కశ్మీర్‌ ‌లెఫ్ట్‌నెంట్‌ ‌గవర్నర్‌ ‌పాలనలో కొనసాగుతోంది. గత మార్చిలో ప్రధాని శ్రీనగర్‌లో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించడంతో బీజేపీ ఎన్నికలకు సిద్ధమవుతున్నదని అంతా భావించారు. కానీ అటువంటిదేమీ లేదని కొద్ది వారాల తర్వాత స్పష్టమైంది. ఏప్రిల్‌ 16‌న కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా శ్రీనగర్‌లో ర్యాలీ నిర్వహించినప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీర్‌ ‌నుంచి తమ పార్టీ పోటీచేయబోవడంలేదని రాష్ట్రంలో ‘కమలవికాసానికి’ ఇప్పుడే తొందరలేదని వెల్లడించారు. జమ్ము-కశ్మీర్‌ ‌బీజేపీ చీఫ్‌ ‌రవీందర్‌ ‌రైనా, విస్తృత వ్యూహాత్మక లక్ష్యం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పడం గమనార్హం. 2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీ జమ్ము-కశ్మీర్‌లోని అన్ని స్థానాలకు పోటీచేయగా, జమ్ము, లద్దాఖ్‌ ‌స్థానాలను గెలుచుకుంది. కశ్మీర్‌ ‌లోయలో మూడు స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. బారాముల్లా, అనంతనాగ్‌లు ముస్లిం మెజారిటీ స్థానాలైనప్పటికీ, అనంత్‌ ‌నాగ్‌-‌రాజౌరీ స్థానంలో బీజేపీకి కొంతమేర అవకాశాలున్నాయి. అయితే ఇక్కడ బీజేపీ అప్నీ పార్టీకి మద్దతిస్తోంది. పూర్వ అనంతనాగ్‌ ‌స్థానంగా ఉన్న ఇందులో పూంచ్‌, ‌రాజౌరీలనుంచి కొన్ని ప్రాంతాలను కలపడంతో ఇప్పుడు దీన్ని అనంతనాగ్‌-‌రాజౌరీ స్థానంగా పిలుస్తున్నారు. ఇదే ప్రాంతంలోని పహారీ తెగలకు బీజేపీ రిజర్వేషన్లు ప్రకటించింది. ఈ లోక్‌సభ స్థానంలో వీరి సంఖ్య గణనీయంగా ఉంది. అయితే తగినంత మద్దతు పొందటం ఇప్పుడే సాధ్యం కాదన్న ఉద్దేశంతో బీజేపీ ఇక్కడ రంగంలోకి దిగడంలేదని భావించాలి.

మిలిటెన్సీకి ముందు ముమ్మర పోలింగ్‌

1984‌లో జమ్ము-కశ్మీర్‌లో ఉగ్రవాద బెడద ప్రారంభం కాకముందు అనంతనాగ్‌, ‌బారాముల్లా, శ్రీనగర్‌లలో వరుసగా 70%, 61%, 73% పోలింగ్‌ ‌నమోదయింది. 1989 నుంచి రాష్ట్రంలో ఉగ్రవాద బెడద మొదలైంది. తర్వాత మిలిటెంట్ల హెచ్చరికలతో క్రమంగా పోలయిన ఓట్ల శాతం తగ్గుతూ రావడం చరిత్ర. అయితే జమ్ము, కశ్మీర్‌లతో పోల్చినప్పుడు లద్దాఖ్‌లోనే ఎక్కువ పోలింగ్‌ ‌నమోదయ్యేది. మిగిలిన రెండు ప్రాంతాలతో పోలిస్తే లద్దాఖ్‌లో శాంతి సుస్థిరతలు అధికం కావడం కూడా ఈ పోలింగ్‌ ‌వ్యత్యాసానికి ప్రధాన కారణం.

లద్దాక్‌ ‌కూటమిలో కుంపటి!

దేశంలోనే భౌగోళికంగా అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గమిది. లద్దాక్‌లో రెండు జిల్లాలున్నాయి. ఒకటి లెహ్‌, ‌రెండవది కార్గిల్‌. ‌లెహ్‌లో బౌద్ధుల జనాభా అధికం. కార్గిల్‌ ‌జిల్లాలో ముస్లింలు మెజారిటీ. లద్దాఖ్‌ ‌నియోజవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,84,000 కాగా, ముస్లిం మెజారిటీ కార్గిల్‌ ‌జిల్లాలో 95,925, లెహ్‌ ‌జిల్లాలో 88,877 మంది ఓటర్లున్నారు. ఈ రెండు జిల్లాల ప్రజల సంస్కృతీ సంప్రదాయాలు భిన్నం కనుక, వీటిని వేర్వేరు లోక్‌సభ స్థానాలుగా విడగొట్టాలన్న డిమాండ్‌ ‌ప్రస్తుతం బలంగా ఉంది. జమ్ము- కశ్మీర్‌నుంచి విడగొట్టిన తర్వాత కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న ఇక్కడ జరిగే తొలి ఎన్నికలివి! గత రెండు ఎన్నికల్లో ఈ సీటును కైవసం చేసుకున్న బీజేపీ ఈసారి అడ్వకేట్‌ ‌తాషి గ్యాల్సన్‌ (57)‌ను రంగంలో నిలిపింది. ఈయన లద్దాక్‌ ఆటానమస్‌ ‌హిల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కౌన్సిల్‌ ఎగ్జిక్యూటివ్‌ ‌కౌన్సిలర్‌/‌ఛైర్మన్‌గా ఉన్నారు. ఇక కాంగ్రెస్‌ ‌జామ్యాంగ్‌ ‌సెరింగ్‌ ‌నంగ్యాల్‌ను బరిలోకి దింపింది. ప్రస్తుతం బీజేపీ ఎం.పి.గా ఉన్న జామ్యాంగ్‌ ‌సెరింగ్‌ ‌నంగ్యాల్‌ ‌తనకు పార్టీ టిక్కెట్‌ ఇవ్వకపోవడం సహజంగానే తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. లెహ్‌ ‌బౌద్ధుల్లో జామ్యాంగ్‌ ‌సెరింగ్‌ ‌నంగ్యాల్‌ ‌పట్ల ఉన్న వ్యతిరేకత కూడా బీజేపీ తాషి గ్యాల్సన్‌ను నిలబెట్టడానికి కారణం. ఒక లాయర్‌గా ఈయన బౌద్ధులను మాత్రమే కాదు, కార్గిల్‌ ‌జిల్లాలోని ముస్లింలను కలుపుకొని పోగలడన్న నమ్మకంతో పార్టీ ఈయనకు టిక్కెట్‌ ఇచ్చింది.

కార్గిల్‌ ‌డెమోక్రటిక్‌ అలయన్స్ (‌కేడీఏ-ఇది నేషనల్‌ ‌కాన్ఫరెన్స్‌కు చెందిన కార్గిల్‌ ‌శాఖ)కు చెందిన హాజీ అనీఫా జాన్‌ ఇం‌డిపెండెంట్‌గా రంగంలో ఉన్నారు. ఈయన నేషనల్‌ ‌కాన్ఫరెన్స్‌కు చెందిన కార్గిల్‌ ‌జిల్లా అధ్యక్షుడు కూడా! ప్రస్తుతం ఐ.ఎన్‌.‌డి.ఐ.ఎ. కూటమితో కుదిరిన ఒప్పందం మేరకు లద్దాక్‌లో నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌పార్టీ కాంగ్రెస్‌ అభ్యర్థి జామ్యాంగ్‌ ‌సెరింగ్‌ ‌నంగ్యాల్‌కు మద్దతిస్తోంది. ఇందుకు నేషనల్‌ ‌కాన్ఫరెన్స్‌కు చెందిన కార్గిల్‌ ‌విభాగంలో తీవ్ర అసంతృప్తి చెలరేగింది. సెరింగ్‌కు మద్దతివ్వాలని వత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ మే6న ఈ కౌన్సిల్‌కు చెందిన అగ్రనాయకులు రాజీనామాలు సమర్పించారు. పార్టీ నాయకుడు ఖొమర్‌ అలీ అఖూన్‌, ‌నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్‌ అబ్దుల్లాకు ఒక లేఖ రాస్తూ కౌన్సిల్‌ ‌చీఫ్‌గా ఉన్న హాజీ అనీఫా జాన్‌ ‌స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని స్పష్టం చేసిన మేరకు ఆయన ప్రస్తుతం ఇండి పెండెంట్‌గా రంగంలో ఉన్నారు. లద్దాక్‌ ‌స్థానాన్ని ఆరుసార్లు కైవసం చేసుకున్న చరిత్ర కాంగ్రెస్‌ది! కానీ ఇప్పుడు నేషనల్‌ ‌కాన్ఫరెన్స్‌కు చెందిన హాజీ అనీఫా జాన్‌ ‌పోటీలో ఉండటం గ్రాండ్‌ ఓల్డ్‌పార్టీకి మింగుడు పడటంలేదు.

లద్దాక్‌ ‌వాసుల డిమాండ్లు

2019 ఆగస్టు నెలలో జమ్ము-కశ్మీర్‌ ‌రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు జమ్ము, కశ్మీర్‌, ‌లద్దాఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రం ప్రకటించిన తర్వాతి కాలంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో లద్దాక్‌ ‌వాసులు తమకు ప్రత్యేక రాష్ట్ర గుర్తింపు కావాలని, రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూలును అమలు పరచాలని, ప్రత్యేక పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ఏర్పాటు చేయాలని, రెండు లోక్‌సభ స్థానాలుగా విడగొట్టాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఒక ప్రాంతంలోని ప్రజల సాంస్కృతిక, స్థానిక గుర్తింపు నకు భద్రత కల్పించే రీతిలో అటానమస్‌ ‌కౌన్సిల్స్ ఏర్పాటు చేయవచ్చునని రాజ్యాంగంలోని 244వ అధికరణకు చెందిన ఆరవ షెడ్యూలు పేర్కొంటున్నది.

ప్రస్తుతం లద్దాక్‌లో రెండు స్వతంత్ర పాలక మండళ్లు పనిచేస్తున్నాయి. మొదటిది లెహ్‌లో 1995 నుంచి, రెండవది 2003 నుంచి కార్గిల్‌లో పని చేస్తున్నాయి. అయితే ఇవి 1995లో రూపొందించిన చట్టం ద్వారా ఏర్పాటయ్యాయి తప్ప రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూలు కింద కాదు! ఇదిలావుండగా 2019లో లద్దాక్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత కేంద్రం ఇక్కడ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రకటించింది. వీటిని వేగంగా అమలు చేయడానికి సంకల్పించింది కూడా. అయితే ఈ ప్రాంతంలో పేరెన్నిక గన్న విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్‌ ‌వాంగ్‌చుక్‌, ఇక్కడి అభివృద్ధి పనులను వ్యతిరేకిస్తూ 21రోజుల పాటు నిరాహారదీక్ష చేశారు.

ఈ అభివృద్ధి పనుల వల్ల పర్యావరణం దెబ్బ తింటుందన్నది ఆయన వాదన! ఈయనకు సామాజిక-రాజకీయ సంస్థలైన ఎపెక్స్ ‌బాడీ (లెహ్‌), ‌కార్గిల్‌ ‌డెమోక్రటిక్‌ అసోసియేషన్‌ (•కేడీఏ)లు మద్దతిచ్చాయి. సంస్కృతీ సంప్రదాయాల్లో పూర్తి భిన్నంగా ఉన్న రెండు జిల్లా(కార్గిల్‌, ‌లెహ్‌)‌కు చెందిన ఓటర్లు ఈసారి ఎవరికి పట్టం కడతారన్నది  జూన్‌ 4‌న తేలుతుంది.

మరో కీలక పరిణామం

పాక్‌ అనుకూల మత సంస్థ జమాత్‌-ఎ-ఇస్లామీ నాయకుడు గులాం ఖాదిర్‌ ‌వని మే 15న ఒక ప్రకటన చేస్తూ తమపై నిషేధం ఎత్తేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీచేస్తుందని ప్రకటించడం తాజా పరిణామం. ‘మజ్లిస్‌-ఎ-‌సౌరా’ (అత్యున్నత నిర్ణాయక మండలి)తో చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. ఈ దిశగా కేంద్రంతో చర్చలు జరుపుతున్నట్టు కూడా పేర్కొన్నాడు. పుల్వామా దాడి జరిగిన రెండు వారాల తర్వాత ఫిబ్రవరి 28, 2019న కేంద్రం ఈ సంస్థపై నిషేధం విధించింది. ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగా కశ్మీర్‌ ‌సమస్యను పరిష్కరించాలని ఈ సంస్థ వాదించేది.

విచిత్రమే మంటే 1987 వరకు ఈ సంస్థ జమ్ము- కశ్మీర్‌లో ఎన్నికల్లో పాల్గొన్నది. 1972లో అత్యధికంగా 5 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. 1987లో ఈ సంస్థతో పాటు మరికొన్ని సంస్థలు కలిసి ముస్లిం ముత్తహిదా మహాస్‌ (‌ముస్లిం యునైటెడ్‌ ‌ఫ్రంట్‌)‌గా ఏర్పడి పోటీ చేశాయి. అయితే అప్పటి నేషనల్‌ ‌కాన్ఫరెన్స్, ‌కేంద్రంలో కాంగ్రెస్‌ ఉమ్మడిగా రిగ్గింగ్‌కు పాల్పడి తమ విజయావకాశాలు దెబ్బతీశాయని అప్పట్లో ఫ్రంట్‌ ఆరోపించింది. తర్వాతి కాలంలో ఈ ఫ్రంట్‌కు చెందిన యువకులు ఉగ్రవాదులుగా మారారు.

ప్రస్తుతం బీజేపీ మద్దతున్న జమ్ము-కశ్మీర్‌ అప్నీ పార్టీ అధ్యక్షుడు అల్తాఫ్‌ ‌బుఖారీ జమాత్‌ ‌నాయకులతో జరిపిన చర్చల ఫలితమే ఈ ప్రకటన అన్న వార్తలు వస్తున్నాయి. సరిగ్గా ఇదే తరుణంలో అమిత్‌ ‌షా అంత బిజీ షెడ్యూల్‌లో కూడా శ్రీనగర్‌లో రెండురోజుల పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది! అయితే జమాతే-ఎ- ఇస్లామీ కోరుతున్నట్టు నిషేధం ఎత్తివేత అంత తొందరగా సాధ్యపడకపోవచ్చు!

-జమలాపురపు విఠల్‌రావు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE