‌ప్రపంచ సమీకరణాలు మారుతూ, భారత్‌ ‘‌విశ్వమిత్ర’ స్థాయికి ఎదగడం ప్రపంచ పెద్దన్న అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. తాను ధ్వంసం చేసి, గందరగోళంలో వదిలిన ఆఫ్గనిస్తాన్‌కు సహాయక సరుకును రవాణా చేసేందుకు భారత్‌ ‌చాబహార్‌ ‌రేవును ఉపయోగించుకునేందుకు ఏనాడూ అభ్యంతర ప్టెని అమెరికా, హఠాత్తుగా ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక ఉన్న కారణం భారత్‌ ‌తమను మించి ఎదిగిపోతుందన్న అభద్రతే. మధ్య ఆసియా, రష్యా సహా ఐరోపా దేశాలతో వాణిజ్య లావాదేవీలు సులభతరం చేసే ఇరాన్‌లోని చాబహార్‌ ‌రేవు అభివృద్ధికి ఇరాన్‌, ‌భారత్‌ ‌మధ్య ఈ నెలలో జరిగిన ఒప్పందంపై అమెరికా మండిపాటు అందుకే. ఈ మార్గాన్ని సరుకు రవాణాకు ఎంచుకుంటే, అసలు పాకిస్తాన్‌ ‌భూభాగాన్ని స్పృశించాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు, పాకిస్తాన్‌లోని గ్వాదర్‌ ‌రేవులో చైనా భారీ పెట్టుబడులు పెట్టి దానిని అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో దానికి ప్రతిగా ప్రత్యామ్నాయ మార్గాన్ని భారత్‌ అభివృద్ధి చేస్తున్నది. అంతటి వ్యూహాత్మకమైన ప్రదేశంలో ఉన్న రేవు ఇది. ఇప్పటికే ఇరాన్‌పై ఆంక్షలు విధించి ఉన్న నేపథ్యంలో భారత్‌పై కూడా విధిస్తామంటూ అమెరికా హెచ్చరించడం, అంత సంకుచిత దృష్టితో దీనిని చూడవద్దంటూ విదేశాంగమంత్రి జయశంకర్‌ ‌హితవు పలకడం నూతన భారత ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా భావించాలి.

ఆర్ధిక వృద్ధితో పాటు సరకు రవాణా, ఇతర సేవలు సాఫీగా అందుబాటులోకి తెచ్చేందుకు అనుసంధానత పెంచుతుంది కనుకనే చాబహార్‌ ‌రేవు ప్రాధాన్యతను సంతరించుకుంది. గుజరాత్‌లోని కాండ్లా రేవు నుంచి అతి సమీపంగా అంటే ఐదువందలపై చిలుకు నాటికల్‌ ‌మైళ్ల దూరంలో ఉన్న చాబహార్‌కు సరుకు తరలించడం సులువే కాదు ఖర్చు తగ్గుతుంది. ఇండియా పోర్టస్ ‌గ్లోబల్‌ ‌లిమిటెడ్‌ అన్న భారతీయ కంపెనీ చాబహార్‌ ‌రేవును 2018నుంచే నిర్వహిస్తోంది. ప్రస్తుతం పదేళ్లపాటు పూర్తి స్థాయిలో చాబహార్‌ ‌నగరంలోని షహీద్‌ ‌బెహెష్తీ రేవు టెర్మి నల్‌ను అభివృద్ధి చేసి, నిర్వహించేందుకు భారత్‌ – ఇరాన్‌లు ఒప్పందం చేసుకున్నాయి. ఇరాన్‌ ఆగ్నేయంగా గల పాకిస్తాన్‌కు సరిహద్దులలో ఈ రేవు ఉండడం గమనార్హం.

ఈ రేవును అభివృద్ధి చేయాలన్న ఆలోచన, ప్రణాళిక ఇప్పటివి కావు. ఈ ప్రాజెక్టుకు రూపకల్పన 2003లోనే జరిగింది, అయితే వేగం పుంజుకున్నది మాత్రం పి5+1 (యుకె, చైనా, ఫ్రాన్స్, ‌జర్మనీ, రష్యా, యుఎస్‌) ఆం‌క్షల సడలింపుకు బదులుగా ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని పరిమితం చేసేందుకు 2015లో ఒక అంగీకారానికి వచ్చిన తర్వాతే. ఒక ఏడాది కూడా తిరుగకుండానే ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి అమెరికా బయటకు వచ్చింది. మే 2016లో ఇరాన్‌, ‌భారత్‌, ఆఫ్గనిస్తాన్‌లు చాబహార్‌ ‌ద్వారా రవాణా- వాణిజ్య కారిడార్‌ను నిర్మించేందుకు త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్న తర్వాత ఈ ప్రాజెక్టుకు అవసరమైన ప్రోత్సాహం లభించింది. అయితే, డోనాల్డ్ ‌ట్రంపు ప్రభుత్వంతో జరిపిన దౌత్యపరమైన చర్చల అనంతరం 2018 నవంబర్‌లో చాబహార్‌ ‌రేవును అభివృద్ధి చేయడాన్ని, అక్కడ నుంచి ఆఫ్గనిస్తాన్‌కు అనుసంధాన రైల్వే లైను నిర్మిస్తున్నం దుకు భారత్‌కు కొన్ని ఆంక్షల నుంచి అమెరికా మినహాయింపును ఇచ్చింది. వాస్తవానికి, యుఎస్‌ ‌స్టేట్‌ ‌డిపార్ట్‌మెంటు 2018లో ప్రత్యేకంగా చాబహార్‌ ‌రేవుకు మినహాయింపులను ఇచ్చింది.

ఈ మినహాయింపులు ఏమిటి?

అమెరికా 2019లో జారీ చేసిన ఒక ప్రకటన ప్రకారం, ఇరాన్‌ ‌ఫ్రీడం అండ్‌ ‌కౌంటర్‌ ‌ప్రొలిఫరేషన్‌ ‌యాక్ట్ 2012 (ఐఎఫ్‌సిఎ – ఇరాన్‌ ‌స్వేచ్ఛ, విస్తరణ వ్యతిరేక చట్టం)లోని 1244 కింద ఆఫ్గనిస్తాన్‌ ‌పునర్నిర్మాణం, అభివృద్ధికి పరిమిత సంఖ్యలో కార్యకలాపాలను అనుమతించేందుకు ఈ మినహా యింపులను ప్రకటించింది. వాస్తవానికి ఆఫ్గన్‌ ‌పునర్నిర్మాణాన్ని తమ జాతీయ భద్రతకు కీలకంగా అమెరికా భావిస్తుంది. ఆఫ్గన్‌ ‌పునర్నిర్మాణం, చాబహార్‌ ‌రేవు అభివృద్ధికి మాత్రమే ఈ మినహా యింపులు అనువర్తితమవుతాయని కూడా ఆ ప్రకటనలో అమెరికా పేర్కొంది.

దేనికి అనుమతులున్నాయి?

ఈ మినహాయింపులు మూడు ప్రధాన కార్యకలాపాలకు అనువర్తితమవుతాయి. అవి- చాబహార్‌ ‌రేవు అభివృద్ధి నిర్వహణ, దీనికి సంబంధించి ఆఫ్గనిస్తాన్‌కు రైల్వే అనుసంధానం; గ్యాస్‌, ‌డీజెల్‌, ఎల్‌పిజి గ్యాస్‌ ‌సహా శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులను ఆఫ్గన్‌ ‌దిగుమతి చేసుకోవడాన్ని, ఆంక్షలు లేని సరుకులను చాబహార్‌ ‌రేవు ద్వారా ఆఫ్గన్‌కు రవాణా చేసేందుకు అమెరికా అనుమతించింది.

దేనికి అనుమతులు లేవు?

ఇరాన్‌ ‌నుంచి ముడి సరుకు దిగుమతి లేదా ఎగుమతులకు ఈ మినహాయింపులు అనుమతించ లేదు. అమెరికా తీవ్రవాద వ్యతిరేక లేక, విస్తరణ వ్యతిరేక అథారిటీ గుర్తించిన వ్యక్తులు, సంస్థలతో లావాదేవీలను నిరోధించింది. అందులో ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్‌ ‌రెవల్యూషనరీ గార్డ్ ‌కార్పస్ (ఐఆర్‌జిసి), దాని అధికారులు, ఏజెంట్లు, దానికి అనుబంధంగా ఉన్నవారితో సహా పలు తీవ్రవాద సంస్థలతో లావాదేవీలను అనుమతించలేదు.

భారతీయ కంపెనీలు లావాదేవీలు నిర్వహించే ఏ సంస్థకు కూడా ఐఆర్‌జిసితో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉండరాదు. అలాగే, ఏ ఆర్ధిక లావా దేవీలో కూడా ఇరాన్‌ ‌కేంద్ర బ్యాంకు జోక్యం ఉండకూడదు. ఇరాన్‌ ‌సెంట్రల్‌ ‌బ్యాంకుతో ప్రస్తుత లేదా భవిష్యత్‌ ఆర్ధిక లావాదేవీలు నిర్వహించే భారతీయ కంపెనీలు, వ్యక్తులకు ఆంక్షల ముప్పు ఉంటుందంటూ అమెరికా నాడు స్పష్టం చేసింది. అలాగే, చాబహార్‌ ‌ద్వారా ఇరాన్‌ ‌నిర్మాణ రంగానికి ఉపయోగపడే సామాగ్రిని ఆ దేశం నుంచి లేదా బయట నుంచి తెచ్చి అమ్మినా, సరఫరా చేసినా లేదా బదలాయించినా ఈ ఆంక్షలు అనువర్తితమవుతాయి.

ఇంతకీ భారత్‌పై యుఎస్‌ ఆం‌క్షలు విధించగలదా?

అంతర్జాతీయంగా భారత్‌ ‌సంతరించుకున్న ప్రాధాన్యత వల్ల ఇరాన్‌తో సహకరిస్తున్నందుకు మాత్రమే ఆంక్షలు విధించలేదని ఇరాన్‌ ‌దౌత్యవేత్త ఇరాజ్‌ ఎలాహీ అన్న మాటలు చాలా కీలకమైనవి. ఒక ప్రముఖ దినపత్రికతో మాట్లాడుతూ, చాబహార్‌ను ప్రస్తుత, భవిష్యత్‌ ‌రవాణా కేంద్రంగా పరిగణిస్తున్న అనేక దేశాల వాణిజ్య ప్రయోజనాలను అమెరికా ఆంక్షలు దెబ్బతీస్తాయంటూ ఆయన వివరించా రు. ఈ నూతన ఒప్పందానికి మాత్రం ఆంక్షల నుంచి మినహాయింపులేదని కూడా ఆయన చెప్పడం గమనార్హం. గతంలో ఆఫ్గన్‌కు ప్రత్యామ్నాయ మార్గంగా పరిగణించి, మినహాయింపులను అమెరికా ఇచ్చిన విషయాన్ని భారత మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వల్‌ ‌సిబాల్‌ ‌గుర్తు చేస్తూ, ఆఫ్గనిస్తాన్‌ను తాలిబన్లకు అప్పగించింది అమెరికానే, ఇప్పుడు బహిరంగంగా ఆంక్షలు విధిస్తామని బెదిరించడం ఎందుకు? ఇది ముతక దౌత్యం అని విమర్శించారు. అంతకన్నా, భారత్‌తో ఈ విషయంపై అమెరికా టచ్‌లో ఉండుంటే సరిపోయేదంటూ సిబాల్‌ ‌సోషల్‌ ‌మీడియా వేదిక ‘ఎక్స్’‌పై పేర్కొన్నారు.

ఇప్పుడు యు-టర్న్ ఎం‌దుకు?

అమెరికా 2021లో అధికారికంగా ఆఫ్గనిస్తాన్‌లో తన సైనిక ఉనికికి ముగింపు పలికిన తర్వాత మనసు మార్చుకుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే చాబహార్‌ ‌రేవు విషయంలో సుముఖంగా లేదని కూడా తెలుస్తోంది. ఈ పరిస్థితికి కాలక్రమంలో ఇరాన్‌తో సంబంధాలు దెబ్బతినడం ప్రధాన కారణం. ఈ ఏడాది ఏప్రిల్‌లో జోర్డాన్‌ ‌సరిహద్దులకు సమీపంలోని దక్షిణ సిరియా ప్రాంతాలపై వచ్చి పడుతున్న అనేక ఇరాన్‌ ‌డ్రోన్లను రహస్య శిబిరాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న అమెరికా సైన్యం కూల్చివేసింది.

ఇంతకీ ఈ చాబహార్‌ ఒప్పందం ఏమిటి?

చాబహార్‌ ‌పోర్టు ప్రాజెక్టు అభివృద్ధి అన్నది భారత్‌ – ఇరాన్‌ల ప్రతిష్ఠాత్మక ంగా పరిగణిస్తున్న ప్రాజెక్టు. ఆఫ్గన్‌తో పాటుగా, మధ్య ఆసియా దేశాలు, ఐరోపా దేశాలతో వాణిజ్యానికి ముఖద్వారంగా చాబహార్‌కు ప్రాముఖ్యత ఉంది. భారత ప్రభుత్వం 2020లో వెల్లడించిన సమాచారం ప్రకారం భారత్‌ ‌చాబహార్‌ ‌లోని షహీద్‌ ‌బెహెస్తీ రేవు తొలి దశ అభివృద్ధి చేస్తోంది. అందుకోసమే, 2016లో ప్రధాని మోదీ, అధ్యక్షుడు రౌహానీ, నాటి ఆఫ్గన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ‌ఘనీ సమక్షంలో భారత్‌, ఇరాన్‌, ఆఫ్గనిస్తాన్‌ల రవాణాశాఖా మంత్రులు త్రైపాక్షిక రవాణా ఒప్పందం (చాబహార్‌ ఒప్పందం)పై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఒక్కసారి మనం మనసు నిర్ణయం తీసుకుంటే, కాశీకి, కషాన్‌ (ఇరాన్‌లో ఒక నగరం) మధ్య దూరం అరడుగు మాత్రమే’’ అంటూ కవి గాలిబ్‌ ‌కవితను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించి ఒక సానుకూల భావనకు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇరాన్‌ను 15 ఏళ్ల తర్వాత పర్యటించిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీ. అంతేకాదు, ఈ ప్రాజెక్టు కోసం 500 మిలియన్‌ ‌డాలర్ల పెట్టుబడి ప్రణాళికను ఆయన ప్రకటించారు. డిసెంబర్‌ 24, 2018‌లో చాబహార్‌లో నిర్వహించిన త్రైపాక్షిక ఒప్పందం సమావేశానంతరం షహీద్‌ ‌బెహెష్త్తీ రేవు నిర్వహణలో కొంత భాగాన్ని భారత్‌ ‌చేపట్టింది.

కాగా, చాబహార్‌కు చెందిన షహీద్‌ ‌బెహెష్తీ రేవుకు సంబంధించిన పరికరాలను సేకరించేందుకు మొదటగా మొత్తం 85 మిలియన్‌ ‌డాలర్ల పెట్టుబడి పెట్టారు. ఈ ఒప్పందంలోని ఒక ప్రొవిజన్‌ ‌ప్రకారం, ఈ రేవు అభివృద్ధికి సుమారు 150 మిలియన్ల వరకు రుణాలు పొందే అవకాశం కూడా ఉంది. చాబహార్‌ ‌రేవులో డిసెంబర్‌ 2018‌లో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత 8200 టిఇయులు (20 అడుగులు ఉండే కంటైనర్లు) సహా 1.28 మిలియన్‌ ‌టన్ను సరుకు రవాణాను ఈ రేవు నిర్వహించిందని ప్రభుత్వం వెల్లడించింది.

చాబహార్‌కి అంత వ్యూహాత్మక ప్రాధాన్యత ఎందుకు?

పర్షియన్‌ ‌పదమైన ‘చాబహార్‌’ అం‌టే ‘నాలుగు వసంతాలు’ అని అర్థం. ఇరాన్‌ ‌పండితుడైన అల్బ రూనీ 10వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని భారతీయ ఉపమహాద్వీపానికి ప్రవేశ కేంద్రమైన దీనిని ఇలా అభివర్ణించారు. వర్తమానంలో ఇరానియన్‌ ‌దౌత్యవేత్తగా ఉన్న ఇరాజ్‌ ఎలాహీ దానిని హిందూ మహా సముద్రంలో ఉన్న దేశాలు మధ్య ఆసియాకు వెళ్లేందుకు ‘స్వర్ణ ద్వారంగా’ అభివర్ణించారు.

 భారీ సరుకుతో వచ్చే అతిపెద్ద, బరువైన నౌకలను నిర్వహించగలిగిన ఈ డీప్‌ ‌వాటర్‌ ‌పోర్ట్ (‌లోతైన జలాలు కలిగిన రేవు) ఇరాన్‌కు చెందిన సిస్తాన్‌ – ‌బెలూచిస్తాన్‌ ‌ప్రావిన్సుకు చెందిన మక్రాన్‌ ‌తీరంలో ఉంది. ఇది గల్ఫ్ ఆఫ్‌ ఒమన్‌కు పక్కన (దీనిని కూడా మనమే నిర్వహిస్తున్నాం), స్ట్రెయిట్‌ ఆప్‌ ‌హొర్ముజ్‌ (‌హెర్ముజ్‌ ‌జలసంధి) ముఖద్వారంలో ఉన్న చాబహార్‌ ‌రేవు మధ్య ప్రాచర్యంలోని దేశాలను ఆసియా, యూరోప్‌, ఉత్తర అమెరికాలోని మార్కెట్లతో అనుసంధానం చేస్తుంది. అంతేకాదు, ఇరాన్‌ ‌రేవులలో హిందు మహాసముద్రానికి నేరుగా యాక్సిస్‌ ‌కలిగినది చాబహార్‌కే.

భారత్‌ ‌నుంచి భౌగోళికంగా చూసినప్పుడు అది గుజరాత్‌లోని కాండ్లా రేవు సమీపంలో ఉంటుంది. ముంబై నుంచి కూడా కేవలం 768 నాటికల్‌ ‌మైళ్ల దూరంలో ఉంటుంది. నిజానికి ఇది న్యూఢిల్లీ నుంచి ముంబైకి ఉన్నంత దూరం కూడా ఈ రేవు ఉండదని కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ ‌గడ్కరీ 2016లో ఒప్పందాలపై సంతకాలు చేసేటప్పుడు పేర్కొనడం దానివల్ల గల ప్రయో జనాలను చెప్పకనే చెప్పడం అని భావించాలి.

చైనా భారీగా పెట్టుబడులు పెట్టిన పాకిస్తాన్‌లోని గ్వాదర్‌ ‌రేవు చాబహార్‌కు తూర్పు తీరంలో కేవలం 170 కిమీల దూరంలోనే ఉంది. ఇక్కడ గుర్తు పెట్టుకో వలసిన ఇంకొక ముఖ్యమైన విషయం, పాక్‌ ‌గర్వంగా చెప్పుకునే ‘సీపెక్‌’- ‌చైనా- పాకిస్తాన్‌ ఎకనామిక్‌ ‌కారిడార్‌ ‌గ్వాదర్‌ ‌రేవు నుంచే ప్రారంభం అవుతుంది. అయితే, ప్రస్తుతం అక్కడ నెలకొన్న ఉగ్రవాదం కారణంగా చైనా పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరవుతున్నట్టు కనిపిస్తోంది.

ఈ రేవు భారత్‌కు ఎందుకు ముఖ్యం?

చాబహార్‌ ‌రేవు కేవలం రవాణాలో ఉన్న ఓడలను సరఫరాలు, మరమ్మత్తుల కోసం కొంతసేపు నిలిపేందుకు (పోర్ట్ ఆఫ్‌ ‌కాల్‌) ఉద్దేశించింది కాదు, భారత్‌కు ఇది వాణిజ్యపరమైన, వ్యూహాత్మక సంభావ్యతలను కలిగిన ప్రాంతం.

పొరుగునే ఉండి, దారిలో ముళ్లు వేసే పాకిస్తాన్‌ ‌భూభాగాన్ని తాకకుండా ఆఫ్గనిస్తాన్‌కు భారతీయ సరుకును, ఉత్పత్తులను ఎటువంటి ఆటంకాలు లేకుండా చేరవేసే అవకాశం దీనివల్ల ఏర్పడింది. కరాచీ ద్వారా ఆఫ్గన్‌కు పంపే సరుకు రవాణాను కావాలని పాకిస్తాన్‌ ఆలస్యం చేస్తోందంటూ గతంలో భారత్‌ ఆరోపించిన విషయం తెలిసిందే.

చాబహార్‌ ‌రేవు నుంచి ఆఫ్గన్‌లోని జరాంజ్‌ ‌ప్రాంతానికి వెళ్లేందుకు రహదా రుల నెట్‌వర్క్ ఉం‌ది. అక్కడి నుంచి సుమారు 218 కిమీ పొడవైన జరాంజ్‌- ‌దేలారాం రోడ్డు వరకూ భారత సహాయంతో రహదారి నిర్మాణం జరిగింది. ఈ రహదారి ఆఫ్గన్‌లోని ప్రధాన నగరాలైన – హెరాత్‌, ‌కాందహార్‌, ‌కాబూల్‌, ‌మజార్‌-ఎ- ‌షరీఫ్‌లోకి ప్రవేశించే సౌలభ్యతను కల్పిస్తుంది. అంతేకాకుండా, ఇరాన్‌లోని జహెదాన్‌ ‌వరకూ రైల్వే లైన్‌ను నిర్మించేందుకు 1.6 బిలియన్‌ ‌డాలర్ల సహాయాన్ని భారత్‌ అం‌దించనుంది. ఇది కాలక్రమంలో ఉత్తరంలో ఉన్న మషాద్‌తో అనుసంధానమై బఫ్క్ – ‌మషాద్‌ ‌మార్గం ద్వారా తుర్కెమెనిస్తాన్‌, ఉత్తర ఆఫ్గనిస్తాన్‌లోకి ప్రవేశించడాన్ని సులభతరం చేయనుంది. పూర్తి స్థాయిలో ఈ రేవు కార్యకలాపా లను నిర్వహించడం ప్రారంభిస్తే, తుర్కమెనిస్తాన్‌, ‌కజఖస్తాన్‌ ‌వంటి సహజవనరులతో సుసంపన్నమైన మధ్య ప్రాచ్య దేశాలను నేరుగా చేరుకోవడం భారత్‌కు సులభతరం అవుతుంది. అంతేకాదు, కొన్ని వెబ్‌సైట్లలో వచ్చిన నివేదికల ప్రకారం, చాబహార్‌ ‌రేవు నుంచి మధ్య అసియా దేశాలకు సరుకునే పంపేందుకు భారత్‌కు పట్టే సమయం మామూలుగా పట్టే సమయంలో మూడొంతులు ఉంటుంది.

అంతేనా, ఇది ఇరాన్‌ ‌ద్వారా భారత్‌ను- రష్యాను జోడించే ఇంటర్నేషనల్‌ ‌నార్త్ ‌సౌత్‌ ‌ట్రాన్స్ ‌పోర్ట్ ‌కారిడార్‌ (ఐఎన్‌ఎస్‌ ‌టిసి)తో అనుసంధానమవు తుంది. ఆంక్షలతో ఇబ్బందులు పడుతున్న రష్యాతో మనం ఇంధన వాణిజ్యాన్ని చెప్పుకోదగ్గ స్థాయిలో పెంచుకున్న నేపథ్యంలో ఇది చాలా కీలకమైన మార్గం అవుతుంది. నేటివరకూ, పాక్‌లోని గ్వాదర్‌ ‌రేవు చైనా అరేబియా సముద్రాన్ని చేరుకోవడాన్ని సులభతరం చేస్తున్నది. ఇప్పుడు, చాబహార్‌ ‌ద్వారా పెర్షియన్‌ ‌గల్ఫ్‌లో జరుగుతున్న కార్యకలాపాలను భారత్‌ ‌పర్యవేక్షించే అవకాశం లభించింది. ఇప్పటికే, చైనా గ్వాదర్‌ ‌రేవుపై 40 ఏళ్ల కార్యనిర్వాహక నియంత్రణ కోసం ఒప్పందం చేసుకున్నది. ఈ క్రమంలో, తన బెల్ట్ అం‌డ్‌ ‌రోడ్‌ ఇనీషియేటివ్‌ (‌బిఆర్‌ఐ) ‌ద్వారా దక్షిణ ఆసియాలో తన జాడలను విస్తరించాలను కుంటున్న చైనాను సమతులం చేసేందుకు ఈ ప్రాజెక్టు భారత్‌కు ఉపయోగపడనుంది.

ఇరాన్‌కేంటి లాభం?

చాబహార్‌ ‌ప్రాజెక్టు అన్నది ఇరాన్‌కు రెండింతలు ప్రాధాన్యతను కలిగింది. ఇప్పటి వరకూ ఇరాన్‌కు బందర్‌ అబ్బాస్‌లో రేవు మాత్రమే ఉండేది. కానీ దానికి భారీ నౌకలను నిర్వహించే సౌకర్యం ఉండేది కాదు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కారణంగా చాబహ•ర్‌ ‌రవాణా కేంద్రం కావడమే కాదు, ఇరాన్‌లో అత్యంత తక్కువ అభివృద్ధి చెందిన సీస్తాన్‌ – ‌బెలూచిస్తాన్‌ ‌ప్రాంత అభివృద్ధికి తోడ్పడనుంది. ఒకరకంగా, ఇరాన్‌కు ఆర్ధికంగా ఎంతో లబ్ధి చేకూరనుంది.

అంతకన్నా ముఖ్యంగా ఇజ్రాయెల్‌లోని హైఫాలో రేవును అదానీ గ్రూపు నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఈ వ్యూహాత్మక మార్గంలో భారతీయ ఉనికిని చాబహార్‌ ‌ప్రాజెక్టు మరింత పెంచడం ద్వారా చైనా సముద్రమార్గాలపై గుత్తాధిపత్యం పొందకుండా నివారించనుంది.

హెలికాప్టర్‌ ‌ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ మరణం

మధ్య ప్రాచ్యంలో కీలక దేశమైన ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. తూర్పు అజర్బైజాన్‌లో ఒక ఆనకట్టను ప్రారంభించేందుకు విదేశాంగ మంత్రి హొస్సేన్‌ అమీర్‌ అబ్దొల్లాహియాన్‌ ‌సహా తన కీలక సలహాదారులతో ప్రయాణిస్తున్న బెల్‌ 212 ‌హెలికాప్టర్‌ ‌వాతావరణం సరిగ్గా లేకపోవడంతో అక్కడ పర్వతశ్రేణుల్లో కుప్పకూలింది. ఇందులో ప్రయాణిస్తున్న వారెవరూ జీవించి లేరని ఇరాన్‌ అధికారిక మీడియా ప్రకటించింది. ఇజ్రాయెల్‌-‌గాజాల మధ్య యుద్ధం, పాలస్తీనాకు, హమాస్‌కు ఇరాన్‌ ‌మద్దతు ఇవ్వడం మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడానికి దారి తీశాయి. షియాలు మెజారిటీగా ఉన్న దేశమైన ఇరాన్‌లో అతివాద ఇస్లామిక్‌ ‌విధానాలు అమలు అవుతుంటాయి. రైసీకి ఇస్లామిక్‌ అతివాది అనే పేరు ఉంది. ఆయన నేతృత్వంలో పలువురు అసమ్మతివాదులను, నిరసనకారులను హననం చేశారనే అపవాదు ఉంది.

రైసీ మృతి పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఇస్లామిక్‌ ‌రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌ అధ్యక్షుడు డా।। సయ్యద్‌ ఇ‌బ్రహీం రైసీ విషాద మరణం పట్ల దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేస్తున్నానని, భారత్‌-ఇరాన్‌ ‌ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన పాత్ర చిరస్మరణీయమంటూ, ఈ విషాద సమయంలో ఇరాన్‌కు భారత్‌ అం‌డగా నిలబడుతుందని ఆయన ఎక్స్‌పై పోస్ట్ ‌చేసిన సందేశంలో పేర్కొన్నారు. ఇరాన్‌ అధ్యక్షుడికి గౌరవ సూచకంగా భారత ప్రభుత్వం మే 21న తేదీని జాతీయ సంతాపదినోత్సవంగా ప్రకటించింది.

ఇటీవలే భారత్‌తో చాబహార్‌ ‌రేవు అభివృద్ధి విషయంలో ఒప్పందం చేసుకో వడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు అధ్యక్షుడు రైసీ, విదేశాంగ మంత్రి హెస్సేన్‌. ‌దీనితో వారి మరణం సహా చాబహార్‌ ‌భవిష్యత్తుపై, ఇరాన్‌లో పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారి మరణం వెనుక ఏదో కుట్ర ఉందని కూడా అనేకమంది సిద్ధాంతీకరిస్తున్నారు. కాగా, రైసీ మరణంతో ఆ ప్రాంతంలో కొంతకాలం రాజకీయ అస్థిరత కొనసాగవచ్చు కానీ, ఇరాన్‌ ‌విదేశాంగ విధానంలో కానీ, మధ్య ప్రాచ్యంలో దాని పాత్రలో కానీ ఎటువంటి మార్పు ఉండదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనికి కారణం ఇస్లామిక్‌ ‌రిపబ్లిక్‌ అయిన ఇరాన్‌ ‌విదేశాంగ విధానంపై అంతిమ నిర్ణయం అయతొల్లా అలీ •మేనీ, రహస్య జాతీయ అత్యున్నత భద్రతా మండలిదే కావడమేనని వారంటున్నారు.

-నీల

About Author

By editor

Twitter
YOUTUBE