‌జూన్‌1 ‌హనుమజ్జయంతి

‌శ్రీమద్రామాయణం విచిత్ర మణిహారం. అందులోని పాత్రలన్నీ అనర్ఘరత్నాలే.  ఈ మహా కావ్య నాయకుడు శ్రీరామచంద్రమూర్తి తరువాత అంతటి ఉన్నత స్థానం అందుకున్నవాడు హనుమే. ఈ కావ్యానికి తలమానికంగా భావించే ‘సుందరకాండ’లో ఆయన పరాక్రమం, కార్యదీక్ష, స్వామి భక్తి, బుద్ధికుశలత, రాజనీతిజ్ఞత, యుక్తాయుక్త విచక్షణ తదితర సుగుణాలు వెల్లడవుతాయి. ఆంజనేయుడు దాస్యభక్తికి ప్రథమోదాహరణ. ప్రభుభక్తి పరాయణుడైనా, అభయం కోరిన వారిని ఆదుకోవడంలో అవసరమైతే ప్రభువుకే వినయపూర్వకంగా ఎదురు నిలిచిన ధీరుడు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు. మాటకారి. నిర్భయత్వం, అమోఘమైన వాక్చాతుర్యం, అపారమైన బుద్ధిబలం, అద్భుత పాండిత్యాలకు గని. కార్యాకారణ విచక్షణ, యుక్తాయుక్త వివేకం కలవాడు. ఒక్కమాటలో బహునేర్పరి. వాల్మీకి మహర్షి అడుగడుగున ‘శ్రీమాన్‌’ అని వర్ణించగా, ‘అన్నిటా నేరుపరి హనుమంతుడు / పిన్ననాడే రవినంటె పెద్ద హనుమంతుడు’ అని పదకవితా పితామహుడు అన్నమాచార్య కీర్తించారు.

శ్రీరామావతార కర్తవ్య నిర్వహణలో పాలుపంచుకునేందుకు వైశాఖ మాస కృష్ణ పక్ష దశమి నాడు రుద్రాంశతో హనుమ అవతరించాడని శివ, నారద పురాణాలు, పరాశర సంహిత తెలిపాయి. హనుమ తాను భక్తాగ్రేసరుడై చరిస్తూ లోకంలో రామభక్తిని నెలకొల్పినట్లు (‘స్థాప•యామాన భూలేకే/రామభక్తిం కపీశ్వరః/స్యవం భక్త వరోభూత్వా/సీతారామ సుఖప్రదః’) శివపురాణం పేర్కొంది. వాయునందనుడిగా ప్రసిద్దుడైన ఆయన రుద్రావతార మూర్తి అని చెబుతోంది.‘యత్రయత్ర రఘునాథ కీర్తనమ్‌/‌తత్రతత్ర కృతమస్తకాంజలిమ్‌’-‌రామ నామం వినిపించిన చోటల్లా వినయాంజలితో నిలుచుండి పోతాడ•ట. ‘జై శ్రీరామ్‌’ ‌పిలుపుతో రాముడి కంటే ముందే చేరి తన తేజశ్శక్తిని ప్రసరించి కార్యోన్ముఖు లవుతాడట. అందుకే శ్రీరాముడు వంటి ప్రభువు/యజమాని ఆంజనేయుడు వంటి సేవకుడు లేరన్నది పెద్దల మాట. అంజనీసుత, పవనసుత, వాయుసుత, కేసరి నందన, పావని, కపిశ్రేష్ఠ లాంటి ఎన్ని నామాలు ఉన్నా ‘శ్రీరామదూత’గా ఉండడమే ఆయనకు ఇష్టమట. శ్రీరామచంద్రమూర్తి గాఢ పరిష్వంగను గ్రహపాత్రుడు హనుమ.

సంకల్పసిద్ధుడు

సంకల్పం ఉంటే సాధించలేనిది లేదనేందుకు ఆంజనేయుడి సాహస కృత్యాలే నిదర్శనం. దైవబలంతో పాటు స్వశక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. కార్యసాధనకు కేవలం దైవభక్తి చాలదని, ఆత్మవిశ్వాసమూ ప్రధానమని ఆయన సాధించిన విజయాలను బట్టి తెలుస్తుంది. అప్పగించిన కార్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తూ ‘ రేపటి పనిని ఈ రోజు… నేటి పని ఇప్పుడే చేయాలి’ అనే వ్యక్తిత్వ వికాస నినాదానికి స్ఫూర్తి ప్రదాత. ఆయన ఎంతటి శాంతమూర్తో అంతటి తేజోమూర్తి. దుష్టశక్తుల పాలిట అరివీర భయంకరుడు. ‘కిమేషు భగవాన్నందీ భవేత్‌ ‌సాక్షా దిహాగతః’ (సాక్షాత్తు శంకరకింకరుడు నందీశ్వర భగవానుడిలాదిగి వచ్చాడు. అలనాడు కైలాసంలో పరిహసించినందుకు నన్ను శపించిన వాడు ఈయన కాదు కదా?) అని హనుమ చూసిన రావణుడు చకితుడై మనసులో అనుకున్నాడట.

వినయశీలి

ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే తత్వానికి ప్రతీక.కపిశ్రేష్ఠుడిగా మన్ననలు అందుకున్నప్పటికీ అధికారం కోరుకోలేదు. సుగ్రీవునికి సచివుడిగా ఉండేందుకే ఇష్టపడ్డాడు. ఆయనకు మంత్రిగా తన విధులను అత్యుత్తమంగా నిర్వహించాడు. తన ఏలికలతో పాటు తన తరువాత వారిని గౌరవిం చాడు. దిగువ శ్రేణి వారిని తక్కువగా మదింపు చేయరాదని ఆయన వ్యవహార శైలిని బట్టి తెలుస్తుంది. ఎదుటి వారి ఉన్నతినీ మన్నించే అంజనీ సుతుడు పొగడ్తలు రుచించనివాడు. ‘సముద్రాన్ని లంఘించి, ఒంటరిగా ఈ రాక్షసపురంలోకి ప్రవేశిం చిన నీవు సమర్ధుడవు, ప్రాజ్ఞుడవు, విక్రముడవు…’ అని సీతామాత లంకలో చేసిన ప్రశంసలను హనుమ ఆశీస్సులుగానే భావించాడు తప్ప ‘నేను..నేనే’ అనుకోలేదు. ‘నేను వానురలలో అగ్రేసరుడిని కాను. చిన్నవాడిని (అవరుడను). నాకంటే బలవంతులు, నాతో సమానులు ఎందరో వానర సమూహంలో ఉన్నారు. ఆకాశంలో, భూమిపై మనసు కంటే వేగంగా అవలీలగా ప్రయాణించగల వానరవీరులు లంక చేరడానికి శ్రీరామ, సుగ్రీవాజ్ఞల కోసం నిరీక్షిస్తున్నారు. అందరికంటే చిన్నవాడినైనా నన్ను నీ జాడ కోసం పంపారు’ అని సవినయంగా విన్న వించాడు. తాను సాధించిన కార్యాలు తన ఘనతగా కాకుండా వానర సమూహ విజయంగా అభివర్ణించిన మహోన్నతుడు. ఆయన సంభాషణా చాతుర్యాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే అబ్బురపడ్డాడట. సీతాన్వేషణకు బయలుదేరిన రామలక్ష్మణులకు తారసిల్లిన హనుమ తీరును గమనించిన రాముడు ‘తమ్ముడూ! చతుర్వేదాలు అధ్యయనం చేసిన వారికి తప్ప ఇతరులకు ఇంతటి శ్రేష్ఠమైన చతురత అలవడదని (నాన్‌ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ్ణి/నా సామవే విదుషః శక్యమేవం ప్రభాషితుమ్‌)’ అని ఆయన పాండిత్య గరిమను నిర్ధరించాడు.

‘నవవ్యాకరణాలనూ చదివిన జ్ఞానసంపన్నుడు. సాక్షాత్తూ సరస్వతీ స్వరూపుడు. సీతాన్వేషణ కార్యాన్ని నెరవేర్చగల సమర్థుడు’ అని హనుమలోని విశిష్ట లక్షణాలను వివరించారు. అందుకే, సీతమ్మ జాడ కోసం వానరవీరులు నలుదిక్కులకు బయలుదేరిన వేళ తన అంగుళీయ కాన్ని హనుమకే అందచేశాడు. సమయపాలనలో మేటి. సీతాన్వేషణ కోసం జలధి లఘించేటప్పుడు మైనక పర్వతం తనపై కొంతసేపు  విశ్రమించాలన్న కోరికను మృదువుగా తిరస్క రించాడు. లంకలో  ‘అమ్మ’ జాడ కోసం ఆరాట పడుతూ కలయ తిరిగాడు తప్ప, లంకాపురి సౌందర్యాన్ని చూడడానికి  క్షణం కూడా వృథా చేయలేదు. అవతారమూర్తిని గుండెలలో ప్రతిష్ఠించుకున్న పరమభాగవతోత్తముడు, జ్ఞానులలో అగ్రగణ్యుడు, సకల గుణనిధానుడు అయినా పెద్దల ముందు అతి వినయశీలి. అందుకే ‘ఒక్కడే ఏకాంగ వీరు డుర్వికి దైవమౌనా/యెక్కడా హనుమంతుని కెదురా లోకము’ అనీ, ‘అన్నిటా నేరుపరి హనుమంతుడు/పిన్ననాడె రవినంటె పెద్ద హనుమంతుడు…’ అని పదకవితా పితామహుడు అన్నమాచార్యులు శ్లాఘించారు. త్యాగయ్య (సంగీత సేవ), కబీరు (కవనసేవ), రామదాసు (కరసేవ) ల•ంటి మహా వాగ్గేయకారులు, కవులకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచాడు.

యువతకు హనుమే ఆదర్శం

స్వామి (యజమాని) కార్యం కోసం శక్తియుక్తులు ధారపోయాలని, అహం దారిచేరనీయక సంకల్ప బలం, మనోనిశ్చయం కలిగి నిరంతరం శ్రమించా లన్నది హనుమ సందేశం. లక్ష్యసాధనకు పట్టుదల, శారీరక బలమే చాలదని. సమయానుకూలంగా తగ్గడం, నెగ్గడం, శక్తియుక్తులను ప్రదర్శించాలనేం దుకు నిదర్శనగా నిలిచాడు. ఎదగాలనుకునేవారు, రామాయణంలో వివిధ సన్నివేశాలలో ఆయన నడతను ఆదర్శంగా తీసుకోవాలని రామకృష్ణ పరమహంస, వివేకానంద లాంటి జిజ్ఞాసువులు హితవు పలికారు.‘కార్య సఫలతకు అవసరమైన దీక్ష, ధైర్యం,వినయం, త్యాగం, ఆత్మవిశ్వాసం, అంకిత భావం, బుద్ధికుశలత ప్రధాన లక్షణాలు సంపూర్ణంగా గల హనుమ యువతకు ఆదర్శం. ఆయన స్ఫూర్తితో యువత జీవితాలను తీర్చిదిద్దుకోవాలి’ అన్నారు స్వామి వివేకానంద. హనుమలో అవధూతకు తగిన లక్షణలు పరిపూర్ణంగా ఉన్నాయన్నారు రామకృష్ణ పరమహంస. తులసీదాస్‌ ‌వందల ఏండ్ల క్రితమే అందించిన ‘హనుమాన్‌ ‌చాలీసా’ అశేష భక్తకోటికి పారాయణ గ్రంథమైంది. త్రికాలాలు ఆయన అధీనంలోనే ఉంటాయని విశ్వసించిన తులసీదాస్‌ అణువణున ఆయనను ఆవహింప చేసుకున్నారు.

 ప్రభువుతో పాటు ప్రత్యేకంగా పూజలందుకునే అరుదైన ‘బంటు’. అంజన్నంటే భక్తులకు కొండంత నమ్మిక. ఆయన పేరు విన్నంతనే భయం మటుమాయమై ధైర్యం ఆవహిస్తుందని, భూత ప్రేత పిశాచాదులు పలాయనం చిత్తగిస్తాయని, మనోభీష్టం నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. ‘హనుమత్స దృశం దైవం నాస్తి నాస్త్యేవ భూతలే అనేనైన ప్రమాణేన జయసిద్ధికరం పరమ్‌’ (‌హనుమంతునితో సమాన మైన దైవం భూతలంలో లేడు ఈ ప్రమాణం వల్లనే హనుమంత వ్రతం ఆచరించిన వారికి నిశ్చయంగా జయం కలుగుతుంది) అని శాస్త్ర వచనం.ఇక ఆంజనేయుడికి ఆసేతుశీతాచల పర్యంతం ఆయన ఆలయాలకు కొదువలేదు. తన ప్రభువు రామ చంద్రుడు ఊరిమధ్యలో కొలువుదీరితే హనుమన్న ఆలయాలు గ్రామ శివారుల్లో రక్షగా అన్నట్లు అత్యధికంగా కనిపిస్తుంటాయి.

ప్రాంతీయ అచారాలను బట్టి వివిధ తిథులలో హనుమజ్జయంతిని జరుపుకుంటారు. తెలుగువారు పరాశర సంహితను అనుసరిస్తూ వైశాఖ బహుళ దశమి నాడు నిర్వహించుకుంటారు. ద్వైత సంప్రదాయపరులకు హనుమజ్జయంతి ప్రధాన పండుగ. వారు ఆయనను ‘ముఖ్య ప్రాణదేవుడు’ సంభావిస్తారు. హనుమదుపాసకులు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు.  హనుమజ్జయంతి నాడు సూర్యోదయం నుంచి ప్రత్యేక పూజాదికాలతో మందిరాలు పరిమళిస్తుంటాయి. తెల్లజిల్లేడు వేరుతో చేసిన హనుమ విగ్రహం ప్రశస్థమైనదని, దానిని ఆర్చించడం వల్ల శస్త్రశత్రుభయాలు ఉండవని చెబుతారు. జిల్లేడు పూలు, పారిజాతాలు, తమల పాకుల మాలను ఆయనకు అలంకరిస్తారు. హనుమత్‌ ‌పూజతో సర్వదేవతా పూజఫలం కలుగు తుందని మైత్రేయునితో పరాశర మహర్షి చెప్పినట్లు (‘సప్తకోటి మహామంత్రాః సిధ్యంత్యేవ, నసంశయం/ఆరాధితే కపిశ్రేష్ఠే సమస్తా ఆదిదేవతాః’) అని పరాశర సంహిత తెలుపుతోంది.

‘వైశాఖ మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే

పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళమ్‌ శ్రీ‌హనూమతే!!’

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE