వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి  రాయలసీమలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కడప, ప్రొద్దుటూరు, నంద్యాల, ఎమ్మిగన్నూరు,  కర్నూలులో  పర్యటించి, తన ప్రభుత్వంలో జరిగిన మేలు గురించి ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు. ప్రజల కోసం 130 సార్లు బటన్‌లు నొక్కి  రూ.2.70 లక్షల కోట్లు జమ చేశానన్నారు. తన కోసం రెండు నొక్కి అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులను గెలిపించాలని కోరారు. విపక్షాలకు  ఎన్నికల సమయంలోనే మేనిఫెస్టో గుర్తుంటుందని, ఎన్నికలు కాగానే దానిని చెత్తబుట్టలో వేస్తారని ఎద్దేవా చేశారు. తాను ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలుచేశామని చెబుతున్న ఆయన, ‘చెత్తబుట్టలో మేనిఫెస్టో’   మాట తనకే వర్తిస్తుందనే సంగతి మర్చిపోయారు. జగన్‌ ఇచ్చిన హామీల్లో సంక్షేమ పథకాలు తప్పించి అభివృద్ధి పనులు ఒక్కటీ పూర్తిచేయలేదని విమర్శలు ఉన్నాయి.  కడపలో అభివృద్ధిని కేవలం పులివెందులకే పరిమితి చేశారు తప్ప జిల్లా కేంద్రమైన కడపకు కానీ, రెండో ముంబై అయిన ప్రొద్దుటూరుకు కానీ, వెనుకబడ్డ కమలాపురం, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలును పట్టించుకున్నారా అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

జగన్‌ ఇప్పుడు పర్యటించిన ప్రాంతాల్లో 2019 ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన హామీల సంగతి ఏమిటి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి తాగు, సాగునీటి ప్రాజెక్టులు ఆయన హయాంలో పడకేశాయి. తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు నగరి, కేసీ కెనాల్‌, వెలిగొండ ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతో రైతాంగం కష్టాలు తీరలేదు. వైసీపీ అధికారానికి వచ్చాక అనేక ప్రాజెక్టుల అంచనాల్ని భారీగా పెంచేసింది. జగన్‌ ఏలుబడిలో ప్రాజెక్టుల నిర్మాణానికి వెచ్చించిన మొత్తం కన్నా పెరిగిన అంచనా వ్యయమే ఎక్కువ కావడం విశేషం. ఇక ఆయా ప్రాజెక్టులు చేపట్టిన కాంట్రాక్ట్లంలో తమ పార్టీకి చెందిన వారికి మాత్రమే బిల్లులు చెల్లించి తమను ఇబ్బంది పెడుతున్నట్లు మిగతా కాంట్రాక్టర్లు వాపోతున్నారు.

కడపకు మంగళం

సొంత జిల్లావాసి జగన్‌ సీఎం కావడంతో ఇక కడపకు నీటి కష్టాలు తీరుతాయని అందరూ భావించారు. ఐదేళ్లకు కానీ కడపవాసులకు అర్థం కాలేదు. తాను కేవలం పులివెందులకే సీఎం అన్నట్లుగా తన సొంత నియోజకవర్గానికి నిధులు ధారబోశారు. కనీసం జిల్లా కేంద్రం కడపకు కూడా నిధులు కేటాయించకపోవడం అన్యాయమని అంటున్నారు. కడపలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదు. తొలి నాలుగున్నర సంవత్సరాలు పట్టించుకోకుండా చివరిలో సుమారు రూ.600 కోట్ల వ్యయంతో బ్రహ్మంసాగర్‌ నుంచి నీళ్లు తెస్తామంటూ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఈ ప్రాజెక్టు ఇంకా టెండర్ల దశలోనే ఉందం టున్నారు. ఇన్నేళ్లు పట్టించుకోకుండా, ఎన్నికలకు ఆరునెలల ముందు బ్రహ్మంసాగర్‌ నుంచి నీరు తెచ్చి కడప దాహార్తి తీరుస్తామనడం పట్ల జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం తరువాత 2014లో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ, ఇప్పుడూ వైసీపీ పాలకవర్గమే ఉండడం విశేషం. వరుసగా రెండుసార్లు అంజద్‌ బాషానే ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదేళ్లుగా మంత్రిగా కూడా ఉన్నారు.

ఉక్కు కథ కంచికే

జగన్‌ సీఎం అయిన ఆరుమాసాలకే అంటే 2019 డిసెంబరు 23న వైఎస్సార్‌ స్టీలు ప్లాంటు నిర్మాణానికి టెంకాయ కొట్టారు. మూడేళ్లలో చేస్తామని చెప్పారు. అయినా అతీగతీ లేదు. మళ్లీ గత ఏడాది ఫిబ్రవరి 15న మరోసారి టెంకాయ కొట్టారు. 24 నెలల నుంచి 30 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అన్నారు. ‘నాన్న చని పోయాక ఈ ప్రాంతాన్ని పట్టించుకునే నాథుడే లేడు. దేవుడి దయ. మీ ఆశీర్వాదాలతో మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేశాక ఈ ప్రాంతానికి మంచి రోజులు రావడం మొదల య్యాయి’అని గొప్పగా చెప్పుకొచ్చారు. ఈ మాటలు చెప్పి సంవత్సరం దాటిం. పనులు పూర్తవుతా యమన్న 24 నెలల గడువలో 13 నెలలు గడచిపోయాయి. రెండు షెడ్లు తప్ప ఏ నిర్మాణం జరగలేదు. ఉక్కు ఫ్యాక్టరీ పూర్తయి ఉంటే కడప మరో విశాఖ తరహాలో అభివృద్ధి చెందేది. ఈ విషయంలో నిరుద్యోగులు నిరాశ చెందారు.

ప్రొద్దుటూరులో పాలఫ్యాక్టరీ, నందలూరు ఆల్విన్‌, చెన్నూరు షుగరు ఫ్యాక్టరీ ప్రారంభిస్తామనక్న ఎన్నికల హామీల్లో ఒక్కటైనా అమలుకాలేదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కడప-బెంగళూరు రైలు మార్గం మంజూరైనా జగన్‌ పాలనలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. కడప ఐటీ సెజ్‌ ఏర్పాటు చేశారు కానీ, అందులో ఒక్క ఐటీ కంపెనీ అయినా వచ్చిందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్‌ పార్క్‌, రాయచోటిలో టొమాటో గుజ్జ పరిశ్రమ, పత్తికొండ ప్రాసెసింగ్‌ యూనిట్‌, ఎమ్మిగనూరు టెక్స్ట్సైటైల్‌ పార్క్‌- వీటిలో ఏవీ ఏర్పాటు కాలేదు. చేనేత కార్మికులు చితికిపోయినా, ఏటా వెయ్యికోట్ల రూపాయల టర్నోవర్తో పదివేలమందికి ఉపాధి కల్పించే స్పిన్నింగ్‌ మిల్లులు మూతపడినా స్పందన లేదు. అయినా 99 శాతం హామీలు అమలు చేశానంటూ జగన్‌ జనం కళ్లకు మళ్లీ గంతలు కట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

ప్రొద్దుటూరులో ప్రగల్భాలు ఏమయ్యాయి?

జగన్‌ సీఎం అయితే ఏటా రూ.500 కోట్ల చొప్పున రూ. 2వేల కోట్లతో ప్రొద్దుటూరును అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి హామీ ఇచ్చారు. తీసుకురాకపోతే ‘బూతులు’ తిట్టవచ్చని జానానికి ఆఫర్‌ కూడా ఇచ్చారు. జగన్‌ సీఎం హోదాలో డిసెంబర్‌ 23,2021న రూ.515.40 కోట్ల అంచనాలతో తొమ్మిది అభివృద్ధి పనులకు శిలాఫలకాలు వేశారు. ప్రొద్దుటూరులోని కొత్తపల్లె చానెల్తో పాటు 75 కి.మీ మేర కాల్వ ఆధునికీకరణ పనులకు టెండర్లు పూర్తయ్యాయి తప్ప పనులు ప్రారంభం కాలేదు. ప్రొద్దుటూరులో పైపులెన్‌ ఆధునికీకరణ కోసంమ నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఈ పనులూ పూర్తి కాలేదు. ఇక రామేశ్వరం నుంచి ఆర్టీపీపీ మార్గాన పెన్నానది హైలెవెల్‌ పనులు సగం మాత్రమే పూర్తయ్యాయి. బిల్లులు రాకపోవ డంతో కాంట్రాక్టరు పనులు నిలిపివేసినట్లు చెబుతారు. ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండు నిర్మాణ పనులు పూర్తి కాలేదు. కూరగాయల మార్కెట్‌ ఆధునికీకరణ పనులు ఇంకా పిల్లర్ల దశలో ఉన్నాయి. జిల్లా ఆసుపత్రి అదనపు భవనాల పనులు మాత్రం పురోగతిలో ఉన్నాయి. ఇంజనీరింగ్‌ కాలేజీ అదనపు భవనాల కోసం చేపట్టిన పనులు తొలి దశలో ఉండగా, ఆర్ట్స్‌ కాలేజీ నూతన భవనాల పనులు టెండరు దశలోనే ఆగిపోయాయి. ఎన్నికల సమయానికి ప్రొద్దుటూరు పాలఫ్యాక్టరీ తీసుకు వస్తామని హామీ అటకెక్కింది. ఐదేళ్లలో రూ.2 వేల కోట్లు కాదు కదా.. కేటాయించిన రూ.515.40 కోట్లలో సగం కూడా ఖర్చు కాలేదు. మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు రాచమల్లును ఏమనాలని జనం ప్రశ్నిస్తున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రాజెక్టుల పరిస్థితి

కెసి కెనాల్‌పై కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాలో 1.46 లక్షల రైతు కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. రెండు జిల్లాలో 2.65 లక్షల ఎకరాల్లో పంటలకు నీళ్లివ్వాలి. 3,750 క్యూసెక్కుల నీరు ప్రవహించేలా కాల్వను నిర్మించారు. నిర్వహణ లేకపోవడంతో కాల్వంతా శిథిలావస్థకు చేరింది. మరమ్మతులేక 2,200 క్యూసెక్కులు ప్రవహించడమే కష్టంగా మారింది. రెండో పంటకు నీరందకపోవడంతో సుమారు 56 వేల ఎకరాలు బీళ్లుగా మారాయి. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తుంగభద్ర నదిపై గుండ్రేవుల జలాశయాన్ని నిర్మిస్తామని ‘ప్రజాసంకల్ప పాదయాత్ర’(2019)లో హామీ ఇచ్చారు. ఈ జలాశయ నిర్మాణానికి జలవనరుల శాఖ అధికారులు నాలుగు సార్లు డీపీఆర్‌ తయారుచేసి ప్రభుత్వానికి పంపినా ఫలితం లేదు. ఇది నిర్మితమైతే 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు, 659 గ్రామాలకు తాగునీటిని అందించొచ్చు. 20 టీఎంసీల సామర్థ్యంతో.. రాజోలి మళ్లింపు పథకం (ఆర్డీఎస్‌) ప్రాజెక్టు పూర్తైతే పశ్చిమ ప్రాంతంలో అదనంగా మరో 42 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశముంది. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన 5,800 ఎకరాలు అవసరం కాగా ఇప్పటివరకు ఎకరా కూడా సేకరించలేదు. పంపింగ్‌ స్టేషన్లు, ఇతర పనులకు రూ.11 కోట్లు ఖర్చు చేసినా బిల్లులు మంజూరు కాకపోవడంతో గుత్తేదారుడు పనులు ఆవేశారు.

80 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా రూపొందించిన వేదవతి ప్రాజెక్టుకు 4,250 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఒక్క ఎకరా కూడ సమకూరలేదు. మూడు టీఎంసీలకు కుదించి.. ప్రాజెక్టు వ్యయాన్ని రూ.1942 కోట్లకు పెంచారు. పంప్‌ హౌస్‌ నిర్మాణం, 6 కి.మీ. వరకు పైపులైన్ల ఏర్పాటుకు సుమారు రూ.102 కోట్లు ఖర్చు చేశారట. ఆలూరు బ్రాంచ్‌ (ఏబీసీ) కాల్వకు అనుసంధానం చేస్తూ నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. 4,200 ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో, రూ.53 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. ఇది పూర్తయితే చిప్పగిరి, ఆలూరు, హాల హర్వి మండలాల్లోని పంటలకు నీరు అందుతుంది. 50 శాతం పనులు పూర్తయ్యాయి. ఒక్క రూపాయి బిల్లు కూడా చెల్లించకపోవడంతో గుత్తేదారు పనులు నిలిపివేశారు. తుంగభద్ర దిగువ కాల్వ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో గురురాఘవేంద్ర ఎత్తిపోతల ప్రాజెక్టును రూ.180 కోట్లతో నిర్మించారు. తుంగభద్ర నది ప్రాంతంలో పంప్‌ హౌస్లు నిర్మించి అక్కడి నుంచి నీటిని ఎత్తిపోస్తారు. ఇందులో భాగంగా 11 రిజర్వాయర్లలో 5. 373 టీంఎసీ నీటిని నిల్వ చేసుకుంటూ 40 వేల ఎకరాల ఆరుతడి, 10 వేల ఎకరాల తరి భూములకు సాగు నీరు అందించాలి. వైసీపీ ఐదేళ్ల పాలనలోఈ ప్రాజెక్టు విద్యుత్తు బిల్లులు, మరమ్మతులకు పైసా నిధులు ఇవ్వలేదు. ఫలితంగా మూడు ఎత్తిపోతల పథకాలు పని చేయడం లేదు. ‘‘తుంగభద్ర దిగువ కాల్వ (ఎల్లెల్సీ) కింద 24 టీఎంసీల నీటి వాటాను ఎమ్మిగనూరు ప్రాంతానికి ఇచ్చి 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్న హామీ బుట్టదాఖలైంది.ఖరీఫ్‌, రబీ సీజన్‌లో ఏటా 1,51,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. గత అయిదేళ్లలో కేవలం 2,45,300 ఎకరాలకు నీరిచ్చారు. సుమారు 5.09 లక్షల ఎకరాలకు సాగునీరు అందకపోవడంతో రూ.1,124 కోట్ల నష్టాన్ని అన్నదాతలు చవిచూశారు.

బనకచెర్ల హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి వైఎస్సార్‌ జిల్లా జమ్మల మడుగు సమీపంలోని పెన్నానది వరకు 187 కి.మీ. మేర కుందూ నది విస్తరణ చేపడతామని హామీ ఇచ్చి మాట తప్పారు. వంద పల్లెలను వరద పోటు నుంచి రక్షించే పనులు కాలేదు.. వందల ఎకరాలకు సాగు నీరిచ్చే రాజోలి, జోలరాశి జలాశయాలకు పునాది పడలేదు. హంద్రీనీవా నుంచి గాజులదిన్నెకు 3 టీఎంసీల నీటిని తరలిస్తామని ‘ప్రజా సంకల్ప పాదయాత్ర’ (నవంబర్‌ 28,2017)న గోనెగండ్లకు వచ్చిన జగన్‌ హామీ ఇచ్చారు. రూ.57.35 కోట్లతో ఆధునికీకరణ పనులకు 2022లో శంకుస్థాపన చేశారు. 24 నెలల్లో పనులు పూర్తవుతాయన్నారు. ఆధునికీకరణ పనులపేరుతో రబీకి సాగునీరు ఆపేశారు.

జలాశయం 6 క్రస్ట్‌ గేట్ల పనులు అసంపూర్తిగా చేశారు. నూతన గేట్లు అమర్చినా నీరు లీకేజీ అవుతూనే ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 77 చెరువులకు హంద్రీనీవా కాల్వ నీటిని తరలించి ఈ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తున్నట్లు గతేడాది సెప్టెంబరు 19న కృష్ణగిరి మండలం ఆలంకొండ పంప్‌ హౌస్‌ వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నీటి విడుదల బటన్‌ నొక్కారు. దాదాపు ఆరు నెలల పాటు హంద్రీనీవా కాల్వలో నీటి ప్రవాహం కొనసాగినా ఒక్క చెరువులోకి కూడా 20 శాతం నీరు చేరలేదు. పనులు పూర్తికాకుండానే ఎన్నికల తంతులో భాగంగానే సీఎం నీటి బటన్‌ నొక్కారని రైతులు మండిపడుతున్నారు.

– టిఎన్‌. భూషణ్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE