శాలివాహన 1945 శ్రీ శోభకృత్ ఫాల్గుణ బహుళ సప్తమి – 01 ఏప్రిల్ 2024, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
ఆర్థికంగా దివాళా అంచుకు చేరిన కేరళ ప్రభుత్వం ఆ వాస్తవం నుంచి ప్రజలను ఏమార్చడానికి దేశంలో రాజ్యాంగపరమైన ఒక అవాంఛనీయ వాతావరణం సృష్టించే ఆలోచనకు వచ్చినట్టే ఉంది. భారత రాజ్యాంగ అధిపతి రాష్ట్రపతి. వారి ఒక నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కేరళ వామపక్ష ప్రభుత్వం భారత అత్యున్నత న్యాయస్థానం `సుప్రీంకోర్టును అభ్యర్థిస్తున్నది. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌లకు వ్యతిరేకంగా కేరళ దాఖలు చేసిన వ్యాజ్యంలో కీలకాంశం ఇదే. మార్చి 23న ఈ వ్యాజ్యం సుప్రీంకోర్టు ఎదుటికి వచ్చింది.
శాసనసభ ఆమోదించిన వాటిలో ఓ నాలుగు బిల్లులను ఎలాంటి కారణం చెప్పకుండానే రాష్ట్రపతి నిలిపివేశారన్నది కేరళ ఆరోపణ. రాజ్యాంగంలోని 14, 200, 201 అధికరణాలను రాష్ట్రపతి ఉల్లంఘించారన్నది ప్రభుత్వ వాదన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నడుమ అతి సున్నితమైన అధికార సమతౌల్యాన్ని రాష్ట్రపతి ఈ నిర్ణయం లేదా చర్య భగ్నం చేస్తున్నదని గగ్గోలు పెడుతున్నది. బిల్లులను గవర్నర్ నిలిపి ఉంచగలిగే కాలం, వాటిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపే కాలం వంటి అంశాలను కూడా ప్రభుత్వం ప్రశ్నించింది. రాష్ట్రాల పరిధిలోని అంశాలకు సంబంధించిన బిల్లులను కూడా నిలిపి ఉంచవలసిందిగా రాష్ట్రపతికి సలహా ఇస్తే అది సమాఖ్య విధానానికి చేటేనని కూడా ఆ రాష్ట్రం వాదిస్తున్నది. రెండేళ్లుగా ఏడు బిల్లులు రాష్ట్రపతి వద్ద అనుమతికి నోచుకోకుండా ఉండిపోయాయనీ,ఆ బిల్లులలో ఏ ఒక్కటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలను నిర్దేశించేవి కూడా కాదనీ ఆ రాష్ట్రం వాదన. ఏడు బిల్లులను నవంబర్ 2023న రాష్ట్రపతి నిర్ణయానికి పంపించారు. వాటిలో విశ్వవిద్యాలయాల చట్టాలు (సవరణ) (నం.2), కేరళ కో ఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు 2022, విశ్వవిద్యాలయాల చట్టాలు (సవరణ) (నం.3) 2022. ఈ నాలుగింటిని మాత్రం ఆమోదించడం లేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 23, 29 తేదీలలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేసింది. తమ శాసనసభ ఆమోదించిన బిల్లులను ఎలాంటి కారణం వెల్లడిరచకుండా ఆపివేయడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కేరళ తన పిటిషన్‌లో కోరింది.
రాష్ట్రపతి కొన్ని బిల్లులను నిలిపివేయడం గతంలోనూ ఉన్నది కాని, దానిని కోర్టులో సవాలు చేయడం చరిత్రలో ఇదే తొలిసారి అని బీజేపీ నేత, కేంద్రమంత్రి వి. మురళీధరన్ విమర్శించారు. అయినా కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సీపీఎం నాయకుడు రాధాకృష్ణన్ కలసి ఈ కేసును ఫైల్ చేశారని అంటూ కేంద్రమంత్రి, ఒక ఐఏఎస్ అధికారి రాజకీయ నాయకుడితో కలసి వేసిన ఈ వ్యాజ్యానికి చట్టబద్ధత ఎక్కడిదని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వాన్ని, కేరళ గవర్నర్‌ను, గవర్నర్ అదనపు కార్యదర్శిని కూడా ఈ కేసులో పార్టీలుగా చేసింది రాష్ట్రం.
ఇండీ భాగస్వామి సీపీఎం మీద మరొక భాగస్వామి కాంగ్రెస్ పార్టీ నాయకుడు శశి థరూర్ చక్కని వ్యాఖ్య చేశారు. ‘ఆ కేసును పూర్తిగా అధ్యయనం చేయలేదు కాని, ఇది కచ్చితంగా అసాధారణమైన సందర్భమే. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి సర్వోన్నతాధికారి. అలాగే (బిల్లులకు) ఆమోదం తెలియచేయడానికి, నిరాకరించడానికి లేదా జాప్యం చేయడానికి రాష్ట్రపతికి పూర్తి అధికారాలు ఉన్నాయి. రాష్ట్రపతి దగ్గరకు వెళ్లిన కొన్ని బిల్లులు 15 సంవత్సరాల పాటు ఆమోదం పొందకుండా ఉండిపోయాయి. కాబట్టి సుప్రీంకోర్టు దీని మీద ఏం చెబుతుందో మనం వేచి చూడాలి. నాకు తెలిసినంతవరకు ఎన్నికలు జరగబోతున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి ఒక వ్యాజ్యం వేయడం వెనుక రాజకీయ కారణాలే ప్రధానంగా ఉంటాయి’ అన్నారాయన. ఇదే సమయంలో ‘మనమంతా సమాఖ్య విధానానికి బద్ధులమే. ఏ రాష్ట్రం మీదనైనా కేంద్రం తన అధికారాన్ని రుద్దడానికి మనం వ్యతిరేకమే’నని భాగస్వామికి కోపం రాకుండా జాగ్రత్త పడ్డారు శశి థరూర్.
ప్రభుత్వ అధికారుల ఆదేశాలు అనర్హమైనవిగా ప్రకటిస్తూ లోకాయుక్త వెలువరించిన నిర్ణయాలను సమీక్షించే అధికారం తమకు ఉండాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ బిల్లుకు ఈ ఫిబ్రవరిలోనే రాష్ట్రపతి ఆమోదం తెలియచేశారు. అంటే ఆ రాష్ట్ర గవర్నర్ పంపించిన ప్రతి బిల్లును రాష్ట్రపతి తొక్కి పెట్టి ఉంచారని అనలేం.
సీపీఎం, డీఎంకే ప్రభుత్వాలు నడిపిస్తున్న కేరళ, తమిళనాడు ప్రభుత్వాల వైఖరిలో రోజురోజుకూ కేంద్ర వ్యతిరేకత బలపడుతున్న దాఖలాలే ఎక్కువ. ఈ రెండు ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా కాకుండా, వాటిని ఏర్పాటు చేసిన రాజకీయ పక్షాల కోసమే నడుస్తున్నాయి. ఆ రెండు పార్టీలూ వ్యక్తుల కనుసన్నలలో నడిచేవే. బంగారం దిగుమతి వ్యవహారంలో కేరళ ముఖ్యమంత్రి ప్రమేయం ప్రత్యక్షంగా లేకపోతే పరోక్షంగానే అయినా ఉన్నమాట నిజమేనని వార్తలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వ్యవహారంలో సీపీఎం జోక్యం కూడా అలాంటిదే. వాటిని తమవారితో నింపేసి, సీపీఎం అనుబంధ ఎస్‌ఎఫ్‌ఐ ఆడ్దాలుగా మార్చాలన్న కోరికతో సీపీఎం తహతహ లాడిపోతోంది. గవర్నర్‌తో వివాదమంతా ఇదే. కేరళ విశ్వవిద్యాలయాల వీసీల వ్యవహారం, నియామకాల తీరు పూర్తిగా అసంబద్ధం. వాటినే గవర్నర్ వ్యతిరేకించి, నిలిపివేశారు. ఆ పనే రాష్ట్రపతి కూడా చేశారు. ఆ అక్రమ వ్యవహారాలకే అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వారిచేత, అత్యుతన్నత న్యాయస్థానం ద్వారా ఒత్తిడి తెచ్చి ఆమోదింప చేయాలన్నదే సీపీఎం ప్రభుత్వం దురాశ. దేశ అత్యున్నత వ్యవస్థలను ఇలా ఉపయోగించుకోవాలని చూస్తున్న సీపీఎం తెంపరి వ్యవస్థకు అత్యున్నత న్యాయస్థానం నుంచి చెంపదెబ్బ తప్పదనే అనిపిస్తున్నది.