సంపాదకీయం

శాలివాహన 1945 శ్రీ క్రోధి చైత్ర శుద్ధ చతుర్దశి

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


రాబోయే ఎన్నికల కోసం కానేకాదు, రేపటి తరాల సంక్షేమంతో పాటు, భారత్‌ వంటి సుసంపన్న దేశం, నాగరికతా నిలయం స్వాతంత్య్రం తెచ్చుకున్న వందేళ్ల తరువాత ఎలాంటి పరమ వైభవాన్ని చూడాలో స్వప్నించినదే సంకల్పపత్రం. వేయేళ్ల బానిసత్వం నుంచి బయటపడ్డాక, వేయేళ్ల భవితవ్యం కోసం ఇవాళ పడవలసిన అడుగు ఎంత పటిష్టంగా ఉండాలో నిర్దేశించిన ప్రణాళిక కూడా ఇదే. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ విడుదల చేసిన ఎన్నికల ప్రణాళిక పేరే సంకల్పపత్రం. అదే ‘మోదీ గ్యారంటీ’. ఏప్రిల్‌ 14న ఢల్లీిలో విడుదల చేశారు.

జనాకర్షక పథకాలతో, అమలుకు ఎంతమాత్రం వీలుకాని ఉచితాలతో ఎన్నికల ప్రణాళికలను విడుదల చేయడం గత కొంతకాలంగా విపక్షాలు పనిగా పెట్టుకున్నాయి. ప్రలోభాలతో ఓటర్లను దిగజార్చడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు ఆది నుంచి ఉన్న రోగమే. వాటి ఫలితాలు చూస్తున్నాం. కానీ బీజేపీ దృష్టి వేరు. రాజకీయ అనుభవజ్ఞుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన బీజేపీ ఎన్నికల ప్రణాళిక సిద్ధమైంది. కొన్ని లక్షల మంది ఇచ్చిన సలహాలు ఇందులో ఉన్నాయి.

మా ఎన్నికల ప్రణాళిక కోసం దేశం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టే, ఒక విస్తృత దృక్పథంతో, భవ్యమైన ఆకాంక్షలతో, భ్రమలకు, ప్రలోభాలకు అవకాశం లేని తీరులో, వాస్తవిక దృష్టితో బీజేపీ ఎన్నికల ప్రణాళికను దేశం ముందు ఉంచింది. ఇది దేశ భద్రత, సంక్షేమం, సాంస్కృతిక జాతీయవాదం, పురోగామి దృష్టి వంటి వాటి మిశ్రమం. పేదలు, యువత, రైతులు, మహిళలు అనే నాలుగు స్తంభాల మీద నిర్మించినది. ఎనభయ్‌ కోట్ల మంది పేదలకు మరొక ఐదేళ్ల ఉచిత రేషన్‌ (ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన) మొదలు, గగనయాన్‌ వరకు ఇదొక నిర్మాణాత్మక హామీల తోరణం. ఈ తోరణంలోని మణిపూస భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరింపచేస్తా మన్న హామీ. ఇవి ఈ ఎన్నికల కోసం తయారు చేసిన ప్రణాళికలోని హామీలు మాత్రమే కాదు. చాలా వరకు ఇప్పటికే అమలులో ఉన్నాయి. అమలుకు సిద్ధంగా ఉన్నవి ఇంకొన్ని. అంటే ఇవేవీ ఆచరణకు సాధ్యం కాని హామీలు కావు.

పేదలకు మరో మూడు కోట్ల ఇళ్లు నిర్మించాలన్న సంకల్పం ఇందులో ఉంది. ఇక్కడే మనకొక మాట గుర్తుకు రావాలి. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోదీ, దేశంలో రాముడితో పాటు మరొక నాలుగు కోట్ల మందికి సొంత నివాసాలు ఏర్పడినాయని అన్నారు. పైప్‌లైన్ల ద్వారా రాయితీ ధరలో వంట గ్యాస్‌, జన ఔషధి దుకాణాల పెంపు, డెబ్బయ్‌ ఏళ్లు నిండిన వారికి, ట్రాన్స్‌జెండర్స్‌కి వైద్యసదుపాయాలు (ఆయుష్మాన్‌ పథకం) పెంపు హామీలలో ఉన్నాయి. నిజానికి బీజేపీ వైద్యానికి చక్కని ప్రాధాన్యం ఇచ్చింది. రక్తలేమి, రొమ్ము కేన్సర్‌, గర్భస్థ కేన్సర్‌ వ్యాధులకు ప్రస్తుతం ఉన్న వైద్య సదుపాయాలను విస్తరిస్తామని హామీ ఇచ్చింది. పేద కుటుంబాలకు ఉచిత సౌర విద్యుత్‌ (ప్రధాని సూర్య ఘర్‌ ముఫ్తి బిజిలీ యోజన) మరొక మంచి హామీ. ఉచిత విద్యుత్‌ పేరుతో విపక్షాలు కొన్ని ప్రభుత్వ ఖజానాలకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి. అలా కాకుండా సౌర విద్యు సదుపాయం ద్వారా విద్యుత్‌ సౌకర్యం విస్తరిస్తామని పార్టీ చెబుతున్నది. ఇదే కాకుండా పంటలకు ఎరువులు పిచికారీ చేయడానికి మూడు కోట్ల మంది మహిళలకు డ్రోన్లు (నమో డ్రోన్‌ దీదీ యోజన) అందిస్తామని హామీ ఇచ్చింది. నగరాలలో ఉండే తోపుడుబళ్ల వ్యాపారులకీ, చిరు వ్యాపారులకీ రుణాలు ఇస్తామని చెప్పింది. గ్రామీణ ప్రాంతంలో మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేసే యోజన (లఖపతి దీదీ) ఉంది.

అంతా భావిస్తున్నట్టే ఉమ్మడి పౌరస్మృతి గురించి ఈ ప్రణాళిక నిర్ద్వంద్వంగా ప్రకటించింది. దానితో పాటే పౌరసత్వ సవరణ చట్టం అమలు కూడా. ఒకే దేశం, ఒకే ఎన్నిక కూడా ఊహిస్తున్నదే. ఐక్యరాజ్య సమితిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం హామీ కూడా విశేషమైనది. ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా ఒక చట్టం. ఇవివీ తాయిలాల జాబితాలోకి రావు. కానీ వ్యవస్థ స్వరూపం మార్చగలవు.

ఆహార భద్రతలోను అంతే శ్రద్ధ చూపారు. కనీస మద్దతు ధర పెంపు, మిల్లెట్స్‌తో చేసే ఆహార పదార్థాలకు ప్రోత్సాహం, దేశాన్ని ప్రపంచ పౌష్టికాహార కేంద్రంగా మార్చడం వంటివి చెప్పుకోవలసిన అంశాలే. విమానాశ్రయాల పెంపు, దక్షిణాదికి, ఈశాన్య భారతానికి కూడా బుల్లెట్‌ రైలు, 5జి, 6జి సాంకేతిక పరిజ్ఞానం విస్తరణ దేశ స్వరూపాన్ని మార్చగలిగేవే.

విశ్వవ్యాప్తంగా రామాయణ ఉత్సవాలు నిర్వహించాలన్న సంకల్పం ప్రత్యేకమైనది. అలాగే తిరువళ్లువర్‌ సాంస్కృతిక కేంద్రాల ఏర్పాటుకు హామీ ఇచ్చారు.

భారతీయ అంతరిక్ష స్టేషన్‌ ఏర్పాటు దూరదృష్టితో ఇచ్చిన హామీ. ఇది దేశంలోనే ఎన్నికల ప్రణాళికలకు సరికొత్త అంశం కూడా. అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాల మౌలిక సదుపాయాల వ్యవస్థను విస్తృతం చేయడమే ఈ హామీ ఆశయం. ఇందుకోసం గ్లోబల్‌ స్పేస్‌ అకాడెమి ఏర్పాటు చేస్తారు. శాస్త్ర పరిశోధనల కోసం లక్ష కోట్లతో ‘అనుసంధాన నిధి’ ఏర్పాటు చేస్తామన్న హామీ కూడా ప్రత్యేకమైనదే. వ్యవసాయ అవసరాలను తీర్చేందుకు భారత్‌ కృషి పేరుతో ఒక ప్రత్యేక ఉపగ్రహాన్ని అక్షరిక్షానికి పంపిస్తామని హామీ ఇచ్చిరు. మౌసమ్‌ పేరుతో వాతావరణ పరిశోధనకు సంస్థను ఏర్పాటు చేయడం గురించి కూడా ఉంది. చంద్రమండలం మీదకు మనిషిని పంపుతా మని కూడా చెప్పారు. అందుకే భారత్‌ను ప్రపంచ గమ్యస్థానంగా మార్చాలన్న సంకల్పం ఇందులో ఉందని ప్రధాని చెప్పడం అతిశయోక్తి కాదు.

About Author

By editor

Twitter
YOUTUBE