శాలివాహన 1945 శ్రీ శోభకృత్ ఫాల్గుణ అమావాస్య – 08 ఏప్రిల్ 2024, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
నిమిషాలూ, గంటలూ ఎన్ని కాలగర్భంలో కలసిపోయాయో ఎవరు చెప్పగలరు? కానీ వీటిలో మొత్తం మానవ సమాజ ప్రస్థానాన్ని మలుపు తిప్పినవి అతి స్వల్పమే. వాటిలోనే ఉన్నాయి కొన్ని క్షణాలు – చరిత్ర వినీలాకాశంలో చారిత్రక ఘట్టాలని వేగుచుక్కల్లా ధగధగ మెరిపించినవి. విశ్వమానవాళి కళ్లు చెదిరేటట్టు చేసినవి. మొత్తం మానవాళి దృష్టిని తమవైపు తిప్పుకున్నాయవి. శోభకృత్ నామ సంవత్సరం అలాంటి ఘడియను తెచ్చింది. అదే, అయోధ్యలో బాలక్‌రామ్ ప్రాణప్రతిష్ఠ జరిగిన మహత్తర క్షణం. క్రోధినామ సంవత్సరంలోకి మనం ప్రవేశిస్తున్న క్షణంలో ఈ సంగతి స్మరించుకోవడం అనివార్యం కదా!
ముందుగా క్రోధి శుభాకాంక్షలు. ఒక జాతి చిరస్మరణీయమని భావించే ఆ క్షణం దగ్గరకి చేరడానికి ముందు ఎంతో పోరాటం ఉంటుంది. సంఘర్షణ ఉంటుంది. తపస్సు ఉంటుంది. అయోధ్యలో నిర్మించుకున్న రామ మందిరంలో రామచంద్ర ప్రభువును దర్శించుకునే అసాధారణ అవకాశం ఇచ్చింది శోభకృత్ . ఆ మధ్యలో దాదాపు ఏడు శోభకృత్‌లు వచ్చి వెళ్లాయి. అందుకే ఈ శోభకృత్ వేరు. కటిక దారిద్య్రం నుంచి భారత్ బయటపడిరదని ఇప్పుడు చెప్పుకోవచ్చు అన్న సర్వేక్షణ ఈ శోభకృత్ తెచ్చిన శుభ వర్తమానమే. ఉగాది పచ్చడిలోని షడ్రుచులను జీవితానికి వర్తింపచేస్తారు. కాలానికి కూడా రుచులు ఉంటాయి. కొన్ని కొన్ని లక్షణాలనే రుచులతో పోల్చుకోవచ్చు. అందులో చేదు ఘటనలు ఉంటాయి. మధురక్షణాలు ఉంటాయి. కానీ హిందూ సమాజం చిరకాలం పాటు చేదునే ఎక్కువగా మింగవలసి వచ్చింది. మధురక్షణాలు కొన్నే ప్రాప్తించాయి మనకి. కానీ కాలం జీవనం మీద అనుభవాలను ముద్రించి వెళుతుంది. తరువాత ఎప్పుడో కాలాన్ని సమీక్షించుకున్నప్పుడు మాత్రమే ఆ అనుభవసారం లోతేమిటో, విలువెంతో గుర్తిస్తాం. ఆ అనుభవం తమను ఎలా మలిచిందో, జాతిని ఎలా శిల్పించిందో అప్పుడే బాధితులకు అర్ధమవుతుంది. నిర్వేదాల నుంచీ, నిస్త్రాణల నుంచి బయటకు తెచ్చిందీ అదేనని కూడా అర్థమవుతుంది. అందుకే అంటారు, కత్తిరించిన వత్తులే దివ్యంగా వెలుగు తాయి. ఎదురుగాలిలో నావను నడిపే సరంగుకే ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఇదే భారతీయ సమాజానికీ వర్తిస్తుంది. సంస్కృతికి సంబంధించి, దాని పరిరక్షణా పోరాటానికి సంబంధించి సమీప గతమంతా హిందువులు చూసినది ప్రతికూలతనే. దేశంలో పరాయిపాలన ముగిశాక కూడా హిందువులు దేబరించవలసిన దుస్థితిలో ఉండిపోవడం ఏమిటి? అయోధ్యలో రామమందిరం నిర్మించుకోవడానికి 490 ఏళ్లు ఆగవలసి రావడం అలాంటిది కాదా! ఎన్ని జీవితాలు ఆ పోరాటంలో ముగిశాయి! ఇంకెన్ని ప్రాణాలు ఎదురుచూపుల మధ్య రాలిపోయాయి! అంటే మన ముందు తరం చేదును మింగి మన తరాలకి మధురక్షణాన్ని మిగిల్చింది. అలాంటి మరొక మధురక్షణం దాదాపు ఏడు దశాబ్దాల క్రితం సోమనాథ్ మందిరంలో లింగ ప్రతిష్ఠను తెచ్చింది. అంటే ఇంత సుదీర్ఘ స్వతంత్ర భారత చరిత్రలో హిందువులకు దక్కినవి రెండే రెండు మధురక్షణాలు. వాటి మధ్యకాలం 70 ఏళ్లు.
క్రోధి మధురక్షణాలకు వేదిక కావాలని ఆశించవచ్చు. అందుకు దోహదం చేయగల వాతావరణం ఇప్పుడు నెలకొన్నది. ఈ దేశంలో మూడు మహా పుణ్యక్షేత్రాలను హిందువులు సగౌరవంగా చూసుకోవాలని అనుకుంటున్నారు. అందులో మొదటగా చెప్పుకునేది అయోధ్య. మిగిలిన రెండు`కాశీ, మధుర.ఈ రెండు క్షేత్రాలు కూడా పూర్తిగా హిందువుల పరమైన క్షణాలకు అవసరమైన నేపథ్యాన్ని క్రోధి ప్రోది చేస్తుందని ఆశించడం మన కర్తవ్యం. హిందువులు అధిక సంఖ్యాకులే అయినా వాటి విముక్తి కోసం సహనంతోనే ఎదురు చూస్తున్నారు. దీనికంతకూ కారణమైన ముస్లింల మీద న్యాయ పోరాటం ద్వారానే గెలవాలన్న ధ్యేయంతో ఉన్నారు. ఆ ధోరణి పోరాటకాలాన్ని పెంచినా లక్ష్యాన్ని మాత్రం చేర్చగలుగుతుంది. అయోధ్య పోరాటంలో అదే రుజువైంది. జ్ఞానవాపి (కాశీ) కృష్ణమందిరం (మధుర)లను హిందువులకు అప్పగించడానికి దారులు క్రమంగా సుగమం అవుతున్నాయి. చట్టం ప్రకారం హిందూ సమాజానికి సానుకూల వాతావరణం ఏర్పడుతున్నది. ఆ వాతావరణం ఇంకాస్త సానుకూలమయ్యే క్షణాలను మనం క్రోధిలో చూడగలుగుతాం కూడా. కానీ సోమనాథ్, అయోధ్య ప్రాణప్రతిష్ఠల మధ్య ఉన్నంత సుదీర్ఘకాలాన్ని భరిస్తూ మీనమేషాలు లెక్కించే నిరర్ధక నిరీక్షణకు మాత్రం ఇకపై హిందువులు సిద్ధపడరనే చెప్పాలి. దీనిని అవతలి పక్షం గుర్తించడమూ అత్యవసరమే. ప్రపంచ వ్యాప్తంగా ఆ వర్గం ధోరణి పట్ల పెరుగుతున్న ప్రతికూల వాతావరణాన్ని వాస్తవికంగా గమనించి అయినా, మార్పు దిశగా నడుచుకోవలసి అవసరం కనిపిస్తుంది. సంస్కరణల బాట పట్టవలసిన సమయం కూడా వచ్చింది.
క్రోధి నామ సంవత్సరం మనకిచ్చేవి ఇంకా చాలా ఉన్నాయనే అనిపిస్తుంది. పౌరసత్వ సవరణ చట్టం, ఉమ్మడి పౌరస్మృతి అమలు వంటి సామాజిక అనివార్యాలు కూడా క్రోధి తీరుస్తుందనే అనుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ధికశక్తులలో మూడో స్థానానికి దేశాన్ని తీసుకు వెళ్లాలన్న నేటి ఢల్లీి పాలకుల ఆశయానికి క్రోధి అండదండలనిస్తుందనీ, ఇవ్వాలనీ చేతులు జోడిరచి వేడుకుందాం. ఆక్రమిత కశ్మీరం తిరిగి భారత భూభాగంలో చేరాలని ఎందరో కోరుకుంటున్నారు. దీనిని అత్యాశగా పరిగణించవలసిన అవసరం లేదు. అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్న ఆశయంతో పరిపాలన సాగిస్తున్న ఇవాళ్టి ప్రభుత్వాల ఆశయాలను క్రోధి దీవిస్తుందనే నమ్మవచ్చు.
సర్వేజనాః సుఖినోభవంతు