– అత్తలూరి విజయలక్ష్మి
‘‘అనగనన్న నన… రాఘము…’’
‘‘అలా కాదునాన్నా.. నేను చెప్తాను .. నాతో పాటు చెప్పు..’’
అనగననగరాగ మతిశయించునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమా!
‘‘అబ్బబ్బా! ఎందుకురా అంత పెద్దగా వీధిబడిలో చదివినట్టు చదువుతావు. మెల్లగా చదువుకోలేవూ! ‘‘ అప్పుడే ఆఫీస్ పని పూర్తి చేసుకుని, హాల్లోకి వచ్చిన కీర్తి విసుగ్గా అరిచింది. తాతగారితో కలిసి, వచ్చీరాని తెలుగుని గట్టిగా పలుకుతూ, పద్యం పాడుతున్న శ్రేయాస్ ఆవిడ అరుపుకి మంత్రం వేసినట్టు ఆపేసి బుంగమూతిపెట్టి, నేరం నాది కాదు అన్నట్టు అన్నాడు. ‘‘తాత రీడ్ చేయమన్నారు.’’
‘‘వెకేషన్ ఇట్లా వేస్ట్ చేసే బదులు, గూగుల్‌లో ఫిఫ్త్ స్టాండర్డ్ మెటీరియల్ ఉంటుందేమో సెర్చ్ చేసి చదువుకోవచ్చు కదా!’’
వాడు మాట్లాడలేదు. తల్లి మందలింపుతో అలిగి మొహం కిందకి వంచుకుని, కళ్లు మాత్రం పైకెత్తి తాతగారిని చూస్తున్నాడు.
‘‘అదేంటమ్మా! ఇప్పుడు సెలవులు కదా! కాస్త తెలుగు నేర్పిస్తున్నాను. ఏదైనా, పైకి చదువుతూ కంఠతా పట్టాలి. అలా చదివితేనే కదా చదివింది గుర్తుంటుంది? అయినా, వీధిబడి అని తేలిగ్గా తీసేయకు. మహామహా వాళ్లంతా వీధిబడిలో చదువుకున్న వాళ్లే’’ కోడలి అజ్ఞానానికి కించిత్తు బాధపడుతూ అన్నాడు శ్యామలరావు.
‘‘ఆ, ఆ వీడో అబ్దుల్ కలాం అవుతాడు. అంత గట్టిగా చదివితే, వాడికి కాదు, గోడలకి, తలుపులకి వస్తుంది కంఠతా.’’ విసుగ్గా అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది కీర్తి.
కోడలు వెళ్లిన వైపు చూస్తూ, ‘‘ఏంటో ఈ కాలం వాళ్లకి కాన్వెంట్ చదువులు, కార్పోరేట్ చదువులు తప్ప ఆనాటి చదువుల విలువ తెలియదు. వీధిబడిట.. వీధిబడి..’’ గొణుగుతున్న భర్త వీపు మీద తడుతూ,
‘‘ఊరుకోండి మీరు, మీ చాదస్తమూనూ! వాళ్ల పిల్లలు, వాళ్లిష్టం. మన కాలం కాదు కదా! వీళ్లు రేపు ఏదన్నా ఉద్యోగానికి వెళితే వేమన పద్యాలు, ఎక్కాలు అడుగుతారా ఏం?’’ మృదువుగానే మందలిం చింది అరుంధతి.
ఆవిడకి భర్త చాదస్తం వలన కోడలితో అభిప్రాయభేదాలు, మాట పట్టింపులు వస్తాయని భయం. ఈ వయసులో కొడుకు, కోడలి నీడలో సర్దు కుంటూ, మంచిగా, మర్యాదగా ఉంటేనే తామిద్దరికీ మనుగడ అని, వాళ్లను కాదని ఎక్కడికో వెళ్లి సుఖంగా బతకడం అనేది కథల్లో, సినిమాల్లోనే సాధ్యం అని ప్రగాఢ నమ్మకం.
‘‘మాతృభాష రాకుండా, ఎన్ని భాషలు నేర్చుకుంటే ఏంటి?’’ గొణిగాడు ఆయన.
‘‘తాతయ్యా వీధిబడి అంటే ఏంటి !’’ ఆయన దగ్గరగా జరిగి, మొహం క్వశ్చన్ మార్క్‌లా పెట్టి అడిగింది స్వేచ్ఛ.
‘‘నాకు తెలుసు వీధిబడి అంటే. స్ట్రీట్ స్కూల్…’’ తనకి తెలుగు బాగా అర్థం అయింది అన్న ధీమాతో అన్నాడు శ్రేయాస్.
‘‘స్ట్రీట్ స్కూల్!’’ఆ మాట నచ్చనట్టు మొహం పెట్టింది స్వేచ్చ.
ఆయన నవ్వాడు. పిల్లల అమాయకత్వానికి జాలేసింది. ‘‘మా నాన్న, అంటే మీ ముత్తాత కాలంలో చెట్ల కింద, పెద్దపెద్ద అరుగుల మీద, ఎంచక్కా, బాసింపట్టు వేసుకు కూర్చుని, పంతులు గారు చెప్పే పాఠాలు శ్రద్ధగా వల్లె వేసేవాళ్లు. చెప్పిన ప్రతి పాఠం బుర్రలోకి ఎక్కించుకుని, గుర్తుంచుకుని పరీక్షలు రాసి, మంచి మార్కులతో పాస్ అయ్యే వాళ్లు.. ఆ చదువులు వేరు.. ఆ స్టాండర్డస్ వేరు. ఆ రోజుల్లో ఏడో తరగతి చదివిన వాళ్లకి, ఇప్పుడు ఎంఏ చదివిన వాళ్లకి అసలు పోలికే లేనంత విజ్ఞానం ఉండేది. కరణం గారి అరుగు, దేవాలయం అరుగు, రావిచెట్టు దిమ్మ, ఇలాంటివే మా బళ్లు. ఆ తరవాత ఏవో గదులు అవీ వచ్చాయనుకో.. మా పంతులు గారు కూడా వీధిబడిలోనే చదువుకున్నారు. ఆయన ఇంగ్లీష్, తెలుగు కూడా ప్రవాహంలా ఉండేది. అలాంటి వాళ్ల దగ్గర చదువుకుంటూ పెరిగాను కాబట్టే నాకూ కాస్త జ్ఞానం అబ్బింది’’ ట్రాన్స్‌లో ఉన్నట్టుగా, చెప్పుకు పోతున్న ఆయనను విశాలమైన కళ్లు విప్పి చూస్తూ, ఎంతో ఆసక్తిగా, కుతూహలంగా వినసాగారు పిల్లలిద్దరూ.
శ్యామలరావు, అరుంధతి దంపతులకి విశ్వాస్ ఒక్కడే కొడుకు. శ్యామలరావు సర్వే ఆఫ్ ఇండియాలో మంచి హోదాలో ఇటీవలే రిటైర్ అయాడు.
విశ్వాస్ తెలివైనవాడు, చదువు అంటే శ్రద్ధ ఉండడమే కాక, ఐదో తరగతి నుంచే అతనికి తన భవిష్యత్తు పట్ల కచ్చితమైన, స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే తండ్రితో గొడవపడుతూనే కాన్వెంట్‌లో చదవడమే కాక ఉన్నత విద్య కూడా ఖరీదైన కాలేజ్‌లో చదివి, ఇంజనీరు అయ్యాడు. తనతో పాటు టిసిఎస్‌లో పని చేస్తున్న కీర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఒక్కడే కొడుకు అవడంతో అతనేం కోరితే అది చేస్తూ వచ్చారు. విశ్వాస్ కూడా తల్లితండ్రులను ఎంతో ప్రేమిస్తాడు. తార్నాకలో మూడు వందల గజాల స్థలంలో ,విశాలంగా కట్టుకున్న ఇంట్లోనే అందరూ కలిసి ఉంటారు. విశ్వాస్, కీర్తి దంపతులకు ఇద్దరు పిల్లలు, శ్రేయాస్, స్వేఛ్చ. శ్రేయాస్ ఐదో తరగతిలోకి, స్వేఛ్చ మూడో తరగతిలోకి వచ్చారు. ఇద్దరూ నాచారంలోని అత్యంత ఖరీదైన స్కూల్‌లో చదువుతున్నారు.
పిల్లలు ఇద్దరూ భుజాలు విరిగేలాగా బ్యాగులు తగిలించుకుని స్కూల్‌కి వెళ్లడం మొదలు పెట్టినప్పటి నుంచి శ్యామలరావు దంపతుల గుండె తరుక్కు పోతోంది. ‘‘చదువు తక్కువ, బరువు ఎక్కువ, ఇవేం స్కూళ్లురా! మన దగ్గర లక్షల ఫీజు గుంజుతూ, మన పిల్లలతో వెట్టిచాకిరీ చేయిస్తారు వెధవలు’’ అని ఆయన రోజూ కొడుకు దగ్గర బాధపడుతూనే ఉంటాడు.
‘‘ఈ కాలం చదువులు అంతే నాన్నా! ఇప్పుడు కష్టపడితే భవిష్యత్తులో లక్షలు సంపాదిస్తూ సుఖంగా ఉంటారు’’ అంటాడు కొడుకు.
కీర్తి వర్క్ ఫ్రమ్ హోం చేస్తుంది. ఆవిడకి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండాలి. అత్తగారు, మామగారు టీవీ చూస్తారని తన గదిలోనే కూర్చుని పని చేసు కుంటుంది. మీటింగ్స్ అటెండ్ అవుతుంది. మధ్య మధ్యలో టీవీ సౌండ్ వస్తుంటే, గదిలో నుంచి హాల్లోకి వచ్చి, అత్తగారికి, మావగారికి ‘కాస్త వాల్యూం తగ్గించ’మని చెబుతూ ఉంటుంది. ఆ బాధలు పడలేక శ్యామలరావు టీవీ చూడడం మానేసి పుస్తకాలు చదువుకోడం మొదలుపెట్టాడు. అరుంధతికి టీవీఅంటే పెద్దగా ఇష్టం లేదు. ఇంట్లో పని చేసుకుంటూ, మధ్యాహ్నాలు విశ్రాంతి తీసుకుంటూ గడిపేస్తుంది.
ఇప్పుడు పిల్లలకి వేసవి సెలవులు. వాళ్లు అర్ధరాత్రి దాకా ఐ పాడ్ లో వీడియోలు చూస్తూ, ఆలస్యంగా పడుకోడం, ఆలస్యంగా లేవడం, ఒక డిసిప్లిన్ లేకుండా గడపడం ఆయనకి నచ్చలేదు. అందుకే తనకి కాలక్షేపం, పిల్లలకి కాస్త తెలుగు నేర్చచ్చు అని వాళ్లను బతిమాలి, బామాలి దగ్గర కూర్చోబెట్టుకుని పద్యాలు, శ్లోకాలు నేర్పడం మొదలుపెట్టాడు. వాళ్లకి నోళ్లు తిరిగి నేర్చుకోవడం ఇబ్బంది పడుతుంటే, బట్టీ పట్టించాలని పైకి చదివిస్తున్నాడు.
ఆధునిక యువతి, హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన కీర్తికి మావగారి పద్ధతులు నచ్చవు. ఆమె ఉద్దేశ్యంలో మావగారిది అంతా చాదస్తం. ఆయన చెప్పేది పనికిమాలిన సొద. ఆయన నోరు తెరిస్తే ‘మా కాలంలో ఇలా, మా కాలంలో అలా’ అంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఈ టార్చర్ నుంచి బైట పడడం ఎలా అని ఆలోచించసాగింది. పిల్లలని తీసుకుని కనీసం వారం రోజులు ఎటన్నా వెళ్లి వస్తే బాగుండు. విశ్వాస్‌ను అడిగితే మా అమ్మా, నాన్నని కూడా తీసుకుని వెడదాం అంటాడు. ఇక్కడే కాక బయటకి వెళ్లినా ఆయన సోది భరించాలి అంటే కష్టం. అందుకే అత్తగారితో మాట్లాడి, వాళ్లిద్దరిని ఇంట్లో ఉంచి వెళ్లాలి. అప్పటికప్పుడు ల్యాప్ టాప్ తీసుకుని తన గదిలోకి వెళ్లిపోయింది ‘వీ••వ ఎ• •తీఱజూ’ వివరాలు చూడడానికి.
శ్యామలరావుకి కోడలి ధోరణి నచ్చలేదు. తెలుగు నేర్పడం నేరమా! అనిపించి బాధ కలిగింది. తనన్నా తెలుగు భాషలోని మాధుర్యం వాళ్లకి రుచి చూపించకపోతే ఇలా తరతరాలు గడిచిపోయి, తెలుగు వంశాలు చిరునామా లేకుండా పోతాయి.
పిల్లలిద్దరూ తాతగారు ఆలోచనలో ఉండడం గమనించి మెల్లగా జారుకోవడంతో అందరూ తనని వెలేసినట్టు అనిపించింది శ్యామలరావుకి.
ముఖ్యంగా కోడలు అన్న ‘వీధిబడి’ మాట మనసులో గుచ్చుకున్నట్టుగా ఉంది. వీధిబడుల గురించి వీళ్లకేం తెలుసు! వీధిబళ్లు అంటే అంతులేని జ్ఞానాన్ని ఇచ్చే అక్షయపాత్రలు. ఇప్పుడు బడులు మీడియా రూములు. నిట్టూర్చాడు ఆయన.
కీర్తి తనకి కావలసిన వివరాలు సేకరించి, ఆ రాత్రి విశ్వాస్‌తో చెప్పింది. ‘‘పిల్లలకి సెలవులు వృథాగా అయిపోతున్నాయి. పెద్ద చదువులకి వచ్చినా కొద్దీ వాళ్లపై ప్రెజర్ పడుతూ ఉంటుంది. ఒక వారం ఇద్దరం లీవ్ పెట్టి, పిల్లలని తీసుకుని సౌత్ టూర్ వెడదాము’’
‘‘అమ్మా, నాన్న?’’ అడిగాడు విశ్వాస్.
తన అసహనం అదిమిపెడుతూ, ‘‘ఈ ఎండల్లో వాళ్లని తిప్పడం ధర్మం కాదు.. అన్నీ వాళ్లు చూసిన ప్రదేశాలే కదా! ఇంట్లో ఉంటారు ఇద్దరూ.. వాళ్లకి ఇబ్బంది లేకుండా పనిమనిషిని, డ్రైవర్‌ని చూసుకుంటూ ఉండమని చెబ్దాము’’ అంది.
‘‘సరే! నీ ఇష్టం.. నీకు, నాకు కూడా కాస్త చేంజ్ ఉంటుంది. ప్లాన్ చేయి. నాకు నిద్రొస్తోంది.. బాగా అలసిపోయాను’’ అంటూ పక్కకి ఒత్తిగిల్లి నిద్రలోకి జారుకున్నాడు విశ్వాస్.
నిజానికి ఆమెకి కూడా అలసటగా ఉంది. ఇవాళ రోజంతా మీటింగ్, మీటింగ్..
పొద్దున్న ఎనిమిదింటికి కాఫీ తాగి, ల్యాప్ టాప్ ఓపెన్ చేస్తే, తిరిగి ఏడు గంటలకి ఊపిరి పీల్చుకుంది. మీటింగ్స్ మీద మీటింగ్స్..ఈ కార్పోరేట్ సంస్థలు లక్షలు, లక్షలు జీతాలిస్తాయి. ఇంటి నుంచి పని చేసుకునే సౌకర్యం కల్పిస్తాయి అన్న మాటే గానీ, రక్తాన్ని పీల్చే జలగలు.
కోట్ల రూపాయలు బ్యాంక్‌లో మూలుగు తున్నాయి. సంపాదనకి లోటులేదు. కానీ సుఖపడే యోగం లేదు. ఏం జీవితం ఇది? అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ, డబ్బు లేని జీవితం జీవితమేనా? అని కూడా అనిపించడంతో వర్తమానంలోని కష్టం, భవిష్యత్తుకు సోపానంగా భావించి తృప్తి పడుతుంది. మర్నాడు శనివారం. ఇల్లంతా దుమ్ము పట్టినట్టు అనిపించి సర్దడం మొదలు పెట్టింది. పిల్లలు బ్రేక్ ఫాస్ట్ చేస్తూ వీడియో చూస్తున్నారు. ఫ్లవర్ వెజ్‌లో పూలు సర్దుతూ అక్కడే కూర్చుని టీవీ చూస్తున్న మావగారికి, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కూరలు కట్ చేస్తున్న అత్తగారికి వినిపించేలా చెప్పింది కీర్తి.
‘‘పిల్లలూ! మనం టూర్ వెళుతున్నాం. మీకు కావాల్సినవి అన్నీ సర్దుకోండి’’
‘‘టూర్! ఎప్పుడు? ఎక్కడికి?’’ పిల్లలిద్దరూ ఉత్సాహంగా అడిగారు.
అరుంధతి కోడలి వైపు చూసింది. కీర్తి అంది. ‘‘పిల్లల సెలవులు పాపం ఇంట్లోనే అయిపోతున్నాయి కదా! అందుకే నాలుగురోజులు ఎటన్నా తీసుకుని వెళ్లాలి అనుకుంటున్నామత్తయ్యా ! ఒక్క వారం రోజులే..’’
అరుంధతికి అర్థం అయింది వాళ్లు నలుగురూ వోళ్లడానికి నిశ్చయించారని ‘‘అలాగే వెళ్లి రండమ్మా’’ అంది.
అప్పుడే శ్యామలరావు మొబైల్ మోగింది. ఆయన టీవీ మ్యుట్ నొక్కి, ఆన్సర్ బటన్ నొక్కాడు.
ఆయన మేనల్లుడు మాట్లాడాడు అవతలి వైపు నుంచి. ‘‘మావయ్యా! మైథిలి పెళ్లి కుదిరింది. ఎల్లుండి నిశ్చితార్ధం. అత్తయ్యా, నువ్వు, పిల్లలు, కోడలు, కొడుకు అందరూ తప్పకుండా రావాలి.’’ అంటూ పెళ్లి కొడుకు వివరాలు, వగైరా చెప్పి, తప్పకుండా రావాలని మరోసారి చెప్పి ఫోన్ పెట్టేసాడు.
శ్యామలరావు భార్యని ఉద్దేశించి అన్నాడు ‘‘అరూ! శీను కూతురు పెళ్లి కుదిరిందిట. ఎల్లుండి నిశ్చితార్ధంట..వెళ్లాలి మనం’’
కీర్తికి ‘కాగల కార్యం గంధర్వులు తీర్చారు’ అన్న సామెత గుర్తొచ్చింది. అత్తగారిని, మామగారిని వది వెళ్లామన్న చింత లేకుండా ఈ అవకాశం రావడం నెత్తిమీద పాలు పోసినట్టు అనిపించి ఉత్సాహంగా అంది. ‘‘ఇంకేం రేపు మీరిద్దరూ రాజోలు వెళ్లండి. మేము టూర్ వెళ్తాము’’
‘‘అదేంటమ్మా వాడు అందరినీ రమ్మని మరీ, మరీ చెప్పాడు. మీరు రాకపోతే ఎలా?’’ అన్నాడు శ్యామలరావు.
‘‘ఎక్కడికి?’’ అప్పుడే లోపలికి వచ్చిన విశ్వాస్ అడిగాడు.
శ్యామలరావు నెమ్మదిగా విషయం వివరించాడు. అంతా విన్న విశ్వాస్ భార్య వైపు తిరిగి అన్నాడు’’ మైథిలి పెళ్లా! అయితే, అందరం వెడదాం. ఒకపని చేద్దాం. ఇన్నోవాలో రాజోలు వెళ్లి, ఫంక్షన్ అటెండ్ అయి, అమ్మనీ, నాన్ననీ కారుతో సహా అక్కడే ఉంచి, మనం టూర్ వెడదాం. రిటర్న్‌లో రాజోలు వెళ్లి, అందరం కారులో వెనక్కి వద్దాం’’.
ఇదేదో బాగానే ఉందనిపించింది కీర్తికి. ‘‘సరే’’ అంది. అరుంధతి ఊపిరి పీల్చుకుంది.
మర్నాడు ఉదయం అందరూ కలిసి రాజోలు బయల్దేరారు. రాజోలుకి ఆనుకుని ఉన్న ఒక గ్రామం అది అయినా, అభివృద్ధి చెందిన ఆదర్శగ్రామం. ఆ ఊళ్లో అడుగుపెడుతుంటే ఎందుకో కీర్తికి ఒళ్లంతా పులకిస్తున్నట్టు అనిపించింది.
శీను అనబడే శ్యామలరావు మేనల్లుడు, అతని భార్య రవళి వీళ్లని చూసి పట్టరాని సంతోషంతో వచ్చి గట్టిగా కౌగలించుకుని ‘‘మీరు రావడంతో మా ఇల్లు పావనం అయింది కీర్తీ !’’ అంటుంటే కీర్తికి గిల్టీగా అనిపించింది. ఆమెకి అసలు బంధుత్వాలు తెలియదు. ఎక్కడికీ వెళ్లదు. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా ముక్తసరిగా మాట్లాడి, వాళ్లని అత్తగారికి వదిలిపెట్టి, తన పనిలో పడేది. ఇప్పుడు పెళ్లికూతురు మైథిలి సహా ఇంటిల్లిపాదీ చూపిస్తున్న ఆప్యాయత, అభిమానం ఆమెకి కొత్తగా ఉన్నా, ఆనందంగా ఉంది. తన పెళ్లి అయ్యాక ఒక్కసారి కూడా ఆ ఊళ్లకు రానందుకు తనని తానే తిట్టుకుంది. శీను భార్య ఖరీదైన చీర పెట్టింది.
నిశ్చితార్ధం అయిన మరునాడు, మనం వెడదామా అన్న భర్తతో ‘‘ఈ ఒక్కరోజు ఆగి రేపు వెళ్దాం.. నాకు ఈ ఊరు చూపించరా’’ అంది. విశ్వాస్ ఆశ్చర్యంగా చూసాడు. ‘‘నువ్వేనా’’ అన్నాడు అనుమానంగా. ‘‘చాల్లెండి’’ అని సరసంగా కసురుకుంది.
మర్నాడు పిల్లలని, మైథిలిని తీసుకుని అలా ఊరు చూడ్డానికి వెళ్లాడు. పచ్చని పొలాలు, మధ్య, మధ్య పిల్ల కాలువలు, గోదావరి గట్టు, నది, కొబ్బరిచెట్లు, ఆకాశానికి, భూమికీ పందిరి వేసినట్టు ఎత్తుగా ఉన్న చెట్ల మీద నుంచి పాకుతున్న రకరకాల తీగలు.. అమాయకంగా, స్వచ్ఛమైన మనసులు మొహంలో ప్రతిబింబిస్తుంటే, తమ వైపు వింతగా చూస్తూ తిరుగుతున్న మనుషులు అంతా ఎంతో ఆహ్లాదంగా, అద్భుతంగా అనిపించింది. చిన్న ఊరు, అందంగా, పొందిగ్గా ఉంది. పిల్లలు కూడా హుషారుగా ప్రకృతి సౌందర్యాన్ని ఎంజాయ్ చేయసాగారు.
విశ్వాస్ కారు మెల్లగా డ్రైవ్ చేస్తున్నాడు. రోడ్లు కొంచెం ఎత్తు, పల్లాలతో ఉండడం ఒక్కటే ఇబ్బందిగా ఉంది.
ఇంతలో పెద్ద ప్రహరీ, విశాలమైన ఖాళీ స్థలంలో గుంపుగా ఉన్న పిల్లలు కనిపించడంతో, అది చూసి ‘‘అక్కడ ఏం జరుగుతోంది? పిల్లలంతా ఏం చేస్తున్నారు అక్కడ?’’ అని అడిగింది కీర్తి.
విశ్వాస్ అన్నాడు ‘‘దాన్నే వీధిబడి అంటారు. అరుగో, అరుగుమీద బెత్తం పట్టుకుని కూర్చున్నారు ఆయనే పంతులుగారు.’’
‘‘వ్వాట్’’ కీర్తి ఆశ్చర్యంగా చూసింది భర్తవైపు. ఇంకా ఈ కాలంలో కూడా వీధిబడులా!’’ అంది.
ఆ మాట వినగానే పిల్లలు ఇద్దరూ.’’ ఓ!.. స్ట్రీట్ స్కూల్… స్ట్రీట్ స్కూల్’’ అని గట్టిగా అరుస్తూ, ‘‘డాడీ! వుయ్ వాంట్ టు సీ ఇట్’’ అన్నారు.
కీర్తి ‘‘ఒకసారి కారాపండి’’ అంది.
విశ్వాస్ ప్రహరీ గోడ దగ్గరగా కారాపాడు. కీర్తి పాఠాలు వల్లె వేస్తున్న పిల్లలని, బెత్తం చేత్తో పట్టుకుని, వల్లె వేయిస్తున్న పంతులు గారిని ఆసక్తిగా చూస్తూ కూర్చుంది.
విశ్వాస్ స్వరం గంభీరంగా మోగింది. ‘‘ఇలాంటి పంతుళ్ల దగ్గర, ఇలాంటి ప్రాంగణంలో, ఇలాంటి ప్రకృతి మధ్య చదువుకున్న వాళ్లే మహాకవులు, పండితులు, గొప్ప నాయకులు అయి, ప్రపంచ దేశాల ముందు మన దేశం తలెత్తుకుని నిలబడేలా చేసారు. తరతరాలకు పంచినా తరగని నిధి నిక్షేపాలు ఈ వీధిబడులు.’’
‘‘కానీ, ఇంకా ఈ రోజుల్లో కూడా ఇలాంటి బడులు ఉంటాయని ఊహించలేదండి నేను’’ అంది కీర్తి.
‘‘ఉండనీలే కీర్తీ! భవిష్యత్తులో మన మాతృభాష దిక్కులేనిదై, ఆశ్రయం కోసం అల్లాడితే, అక్కున చేర్చుకుని ఆదరించడానికి ఈ బడులు అక్కడక్కడా ఉండనీ..’’ గంభీరంగా అంటున్న విశ్వాస్ స్వరం కంపించడం గమనించిన కీర్తి ఆశ్చర్యంగా చూసింది భర్తవైపు. విశ్వాస్ కారు స్టార్ట్ చేయబోతుండగా అకస్మాత్తుగా అంది కీర్తి. ‘‘ఒక్క నిమిషం’’
‘‘ఏం కావాలి?’’ అడిగాడు విశ్వాస్.
‘‘ఇప్పుడే వస్తాను’’ అని చెప్పి పిల్లలిద్దరి చేతులు పట్టుకుని కారు దిగి, వడివడిగా మొండిగోడల మధ్యలో నుంచి నడుస్తూ పంతులు గారు కూర్చున్న అరుగు దగ్గరకు వెళ్లింది.
ఆమె ఏం చేయబోతోందో అని ఆశ్చర్యంగా చూస్తున్న విశ్వాస్‌కి, కీర్తి మోకాళ్ల మీద కూర్చుని అరుగు మీద మోకరిల్లడం కనిపించింది. అప్రయత్నంగా తనూ అటుకేసి నడిచాడు. కీర్తి పిల్లలిద్దరినీ పంతులుగారి పాదాలకు నమస్కరించ మని చెప్పి అంటోంది. ‘‘ఈ ఇద్దరూ మరో చరిత్ర సృష్టించే మేధావులు కావాలని దీవించండి మాష్టారూ!’’
వాళ్లెవరో తెలియని పంతులుగారు కీర్తి వైపు, తన పాదాలకు నమస్కరిస్తున్న పిల్లల వైపు తెల్లబోయి చూసాడు. కీర్తి మందహాసం చేస్తూ ‘‘దీవించండి మేష్టారూ ప్లీజ్’’ అంది.
ఆయన కుడిచేయి పిల్లల తల మీదకు వెళ్లింది. పెదవులు అస్పష్టంగా ఏదో గోణిగాయి.
ఆ దృశ్యం చూస్తున్న విశ్వాస్ ‘‘ఇది వీధిబడి కాదు విశ్వాన్ని నడిపించే ప్రగతి రథం’’ అనుకున్నాడు.
వచ్చేవారం కథ..
ఆగామి
– కెకెవి సత్యనారాయణ