రానున్న ఐదేళ్లకు ప్రభుత్వాన్ని ఎన్నుకు నేందుకు వచ్చే నెల నుంచి సార్వత్రిక ఎన్నికల పక్రియ ప్రారంభం కానుండడంతో సహజంగానే భారతదేశానికి ఎన్నికల జ్వరం పట్టుకుంది. ప్రధాన పార్టీలు ఒక్కొక్కటిగా తమ అభ్యర్ధుల పేర్లను వెల్లడిస్తూ ఎంపికైన అభ్యర్ధులకు ఆనందాన్ని, భంగపడిన వారికి విషాదాన్ని ఇస్తున్నాయి. ప్రధాన పార్టీలు ఆచితూచి నిర్ణయాలు తీసుకుని, అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తున్నాయి. అందులో కొందరి పేర్లు సంచలనాన్ని, రకరకాల వ్యాఖ్యలను రేకెత్తిస్తున్నాయి.

సందేశ్‌ఖాలీ బాధితురాలికి బీజేపీ టిక్కెట్టు, అవాక్కైన ప్రతిపక్షం

ప్రత్యర్ధి పార్టీలను విస్మయంలోకి లోను చేయడంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దిట్ట అని ఒకటికి వందసార్లు రుజువు చేసుకొని ఉంటుంది. తాజాగా, విడుదల చేసిన ఐదవ విడత జాబితాలో పేర్లు విన్నవారంతా ఒక్కసారి అశ్చర్యానికి లోనయ్యారనడం అతిశయోక్తి కాదేమో. అటు మెరుపులను, ఇటు గాయాలను కలగలిపి ఉగాది పచ్చడిలా ఉన్న ఆ జాబితాలో ఒకవైపు సినీ నటి కంగనా రనౌత్‌ ఉం‌డగా, మరోవైపు సందేశ్‌ఖలీ బాధితురాలు రేఖా పాత్రా పేరు ఉండటం. కంగనా విషయంలో ఊహాగానాలు ఉన్నా రేఖా పాత్రాకు సీటు ఇస్తారనేది ఎవరికీ ఊహకు అందని విషయం. ఆమెకు పశ్చిమ బెంగాల్‌లోని బసీర్‌హాట్‌ ‌నియోజకవర్గం టిక్కెట్టు ఇచ్చారు.

ఎవరీ రేఖా పాత్ర

సందేశ్‌ఖాలీ ఉదంతంలో గొంతెత్తి పోరాటం చేసిన ప్రముఖుల చిట్టాలో మొదటిపేరు రేఖదే ఉంటుంది. ఆమె ఫిర్యాదు ఆధారంగానే పశ్చిమ బెంగాల్‌ ‌పోలీసులు తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకుడు షేక్‌ ‌షాజహాన్‌ అనుచరుడు శిబు హజ్రాను అరెస్టు చేశారు. సందేశ్‌ఖాలీ ఘటనలో దోషి షాజహాన్‌ ‌షేక్‌ ‌చేతిలో అత్యాచారానికి గురైన బాధితురాలు రేఖ. ప్రధానమంత్రి మోదీ పశ్చిమ బెంగాల్‌ ‌పర్యటనలో ఉన్న మార్చి 6వ తేదీన సందేశ్‌ఖాలీ మహిళల ఇక్కట్లను తెలిపేందుకు ఆయనను కలుసుకున్న బృందంలో రేఖ కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ అభ్యర్ధి నూరుల్‌ ఇస్లాంపై రేఖ పోటీ చేస్తున్నారు. సందేశ్‌ఖలీ ఘటన సమయంలో ఎంపీగా ఉన్న నుస్రత్‌ ‌జహాన్‌ను వదిలిపెట్టి తృణమూల్‌ అధినేత్రి ఈ స్థానాన్ని ప్రత్యేకంగా నూరుల్‌ ఇస్లాంకు ఇచ్చారు. కాగా, తనకు అవకాశమిచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూనే, తాను సందేశ్‌ఖాలీ బాధితులకు న్యాయం జరిగేవరకూ తన గొంతు ఎత్తుతూనే ఉంటానని రేఖ పాత్ర చెప్పారు.

సమస్యలు ఎదుర్కొంటున్న సందేశ్‌ఖాలీ ప్రాంతం నుంచి గృహిణి అయిన రేఖను పార్టీ అభ్యర్ధిగా ఎంపిక చేయడం ద్వారా, తాము బాధితుల పక్షాన ఉంటామనే అత్యంత బలమైన రాజకీయ ప్రకటనను బీజేపీ చేసింది. ‘బెంగాల్‌లో బసీర్‌హాట్‌ ‌నుంచి రేఖా పాత్రను బీజేపీ నిలబెడుతోంది. ఆమె షేక్‌ ‌షాజహాన్‌ అత్యాచారాలకు బలైన సందేశ్‌ఖాలీ బాధితులలో ఒకరు.  నిశ్శబ్దంగా క్షోభిస్తున్న ఆమె వంటి మహిళల ఓటు అడిగే ముందు వారి కన్నీటిని మమతా బెనర్జీ తుడవాలి. బెంగాల్‌ ‌బీజేపీ బెంగాల్‌కు, సందేశ్‌ఖాలీ మహిళలకు అండగా ఉంటుందని స్పష్టమైన ప్రకటన ఇది,’ అంటూ బీజేపీ ఐటి సెల్‌ ‌జాతీయ కన్వీనర్‌ ‘ఎక్స్’ ‌పై చేసిన పోస్టులో పేర్కొన్నారు.

మెత్తటి కత్తితో సుప్రియ శ్రీనేట్‌ ‌వ్యాఖ్యలను, వైఖరిని ఖండించిన కంగనా

సూటిగా, స్పష్టంగా, నిష్కర్షగా తన అభిప్రాయా లను వెల్లడించే నటిగా కంగనా రనౌత్‌ ‌చాలా సందర్భాలలో, చాలామందినే ఆశ్చర్యానికి లోను చేశారు. ఆమె రాజకీయపరమైన ప్రకటనలు చేయడం, రాజకీయ అంశాలపై తన అభిప్రాయా లను వెల్లడించడం వంటివి జరుగుతున్నప్పటికీ ఇంత త్వరగా ఆమె ఎన్నికల బరిలోకి అడుగుపెడుతుందని ఎవరూ భావించలేదు. భారతీయ జనతా పార్టీ ఆమెకు హిమాచల్‌ ‌ప్రదేశ్‌లోని మండీ నుంచి టిక్కెట్టు ఇచ్చింది. అంతే, కాంగ్రెస్‌ ‌పార్టీలోని మహిళా నేతలకు పూనకం వచ్చింది.

గ్లామర్‌ ‌ప్రపంచంలో భాగమైన కంగనాపై కాంగ్రెస్‌ ‌సోషల్‌ ‌మీడియా అధిపతి సుప్రియా శ్రీనేట్‌ ‌చేసిన వ్యాఖ్యలతో సోషల్‌ ‌మీడియా అగ్గి మీద గుగ్గిలమవుతోంది. ఒక స్త్రీ అయి ఉండి మరొక స్త్రీని ఆ రకంగా అవమానించడం సరైన పనేనా అంటూ సాధారణ పౌరులు వ్యాఖ్యానిస్తుండగా, ఆమెను ఆ పదవి నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్‌ ‌చేస్తోంది.

తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో కంగనా ఫోటోను పోస్ట్ ‌చేస్తూ, ‘క్యా భావ్‌ ‌చల్‌ ‌రహా హై మండీ మే కోయి బతాయేగా (మండిలో నడుస్తున్న ధర ఎంతో ఎవరైనా చెప్పగలరా?) అని కంగనాను ఉద్దేశించి సుప్రియ శ్రీనేట్‌ ‌చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరంగా ఉన్నాయి. కేవలం ఆమె చేసిన వ్యాఖ్యలే కాదు, ఆమె పోస్ట్ ‌చేసేందుకు ఎంచుకున్న ఫోటో కూడా నటిని అవమానించేందుకు ఉద్దేశించిందేననే విషయం ఆ ఫోటో చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. ఈ వ్యవహారం టీవీలలో చర్చకు దారి తీస్తుండడం, బీజేపీ ఆమె రాజీనామాను డిమాండ్‌ ‌చేస్తుండడం, ఆ వ్యాఖ్యలు తాను చేసినవి కావని, తన అకౌంట్లు అందుబాటులో ఉన్నవారు ఈ అభ్యంతరకరమైన, అసహ్యకరమైన పోస్ట్ ‌చేశారని, దానిని తాను తొలిగించానని శ్రీనేట్‌ ‌వివరణ ఇచ్చుకన్నారు. నా గురించి తెలిసిన వారు ఎవరైనా నేను మహిళల గురించి అలా మాట్లాడనని తెలుసని ఆమె ఎక్స్‌పై స్పష్టీకరణ ఇచ్చారు.

ఇందుకు స్పందనగా, తాను కళాకారిణిగా గత 20 ఏళ్లలో అనేక పాత్రలు పోషించానని. ఇంకో మాటలో చెప్పాలంటే అన్నిరకాల మహిళా పాత్రలు పోషించానని, క్వీన్‌లో అమాయకురాలైన యువతి పాత్ర నుంచి, ధాకడ్‌లో సమ్మోహన పరిచే గూఢచారి నుంచి మణికర్ణికలో దేవతగా, చంద్రముఖిలో రాక్షసిగా, రజ్జోలో సెక్స్‌వర్కర్‌ ‌నుంచి తలైవిలో విప్లవాత్మక నాయకురాలిగా పాత్రలు పోషించానని కాంగ్రెస్‌ అధికారప్రతినిధిని ఉద్దేవించి ఎక్స్‌పై పోస్ట్ ‌చేసిన పోస్టులో పేర్కొంది. మన ఆడపిల్లలను వివక్ష అనే సంకెళ్ల నుంచి విడిపించాలని, వారి శారీరక అంగాల పట్ల ఆసక్తి నుంచి మనం ఎదగడమే కాదు, సెక్స్‌వర్కర్ల దుర్భర జీవితాలను, పరిస్థితులను ఒక తిట్టుగా, బూతుమాటగా వాడకూడదని, ప్రతి మహిళ గౌరవానికి అర్హురాలంటూ వ్యాఖ్యానించింది. వాటితో పాటుగా సోషల్‌ ‌మీడియాలో పోస్టు చేసిన ఇతర అభ్యంతరకర వ్యాఖ్యలను కూడా షేర్‌ ‌చేశారు. ఒక యువకుడికి టికెట్లు వస్తే, అతడి సిద్ధాంతంపై దాడి చేస్తారు, ఒక యువతికి టిక్కెట్టు వస్తే ఆమె లైంగికతపై దాడి జరుగుతుంది. ఎంత విచిత్రం!! అంతేకాదు, ఒక చిన్న పట్టణం పేరుకు కూడా కాంగ్రెస్‌వారు లైంగికతను ఆపాదిస్తున్నారు. ఒక యువతి అభ్యర్ధి కనుక మండీ పేరును  ఆ నేపథ్యంలోనే ప్రతి చోటా ఉపయోగిస్తున్నారు. ఇటువంటి వైఖరి ప్రదర్శిస్తున్న కాంగ్రెస్‌వారు సిగ్గు పడాలంటూ వ్యాఖ్యానించి, వారి నైజాన్ని కంగనా బట్టబయలు చేశారు.

వరుణ్‌గాంధీకి కాంగ్రెస్‌ ఆహ్వానం

బీజేపీ జారీ చేసిన జాబితాలో ఈ ఇద్దరు మహిళలు పేర్లు ఎంత సంచలనం రేకెత్తించాయో, ఒక యువకుడి తొలగింపు అంత నిశ్శబ్దంగా జరిగిపోయింది. కానీ, కాంగ్రెస్‌ ‌మాత్రం ఆగలేకపో తోంది. ఆ టికెట్టు ఎవరిదంటే, ఫిలిబిత్‌ ఎం‌పీ, గాంధీ వంశజుడైన వరుణ్‌ ‌గాంధీది. అతడికి ఈసారి బీజేపీ టిక్కెట్టు ఇవ్వకపోవచ్చనే పుకార్లు కొన్ని వారాలుగా షికార్లు చేస్తున్నాయి. అది నిజం కావడమేంటి, కాంగ్రెస్‌ ‌పార్టీ రంగంలోకి దిగిపోయింది. చివర ‘గాంధీ’ అన్న పేరు ఉన్నవారంతా తమ పార్టీవారేనన్న భావనను కాంగ్రెస్‌ ‌బాగా జీర్ణించుకుంది. అందుకే, ఎన్నిసార్లు విఫలమైనా రాహుల్‌ ‌గాంధీ వెనుకే తిరుగు తుంటారు. ఇప్పుడు బీజేపీ వరుణ్‌ను విసర్జించడం తమకు కలిసివచ్చిన ఒక అవకాశంగా కాంగ్రెస్‌ ‌భావిస్తోంది.

గాంధీ కుటుంబంతో బంధుత్వం ఉండటం వల్లనే వరుణ్‌గాంధీకి బీజేపీకి టిక్కెట్టు ఇవ్వలేదని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు అధిర్‌ ‌రంజన్‌ ‌చౌధరి వ్యాఖ్యానించడమే కాదు, ఘన చరిత్ర కలిగిన పార్టీలో చేరవలసిందిగా వరుణ్‌కు ఆహ్వానం పలికారు. వరుణ్‌ ‌గాంధీని ‘దబంగ్‌ ‌నేత’ (బలమైన నాయకుడు) అంటూ అభివర్ణించడమే కాదు, చాలా విద్యావంతు డైన వ్యక్తి అని చౌధరి అభివర్ణించారు. అంతే కాదు, అతడు క్లీన్‌ ఇమేజ్‌ ‌కలిగిన వాడంటూ పేర్కొన్నారు.  అతడు వచ్చిన తమ పార్టీలో చేరితో తామంతా సంతోషిస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ఇటీవలి కాలంలో పలు అంశాలపై బీజేపీతో వరుణ్‌ ‌విబేధిస్తూ వస్తున్నారు. అయితే, అతడి తల్లి మనేకా గాంధీ పేరు అభ్యర్ధుల జాబితాలో ఉండటమే కాదు ఆమెను సుల్తాన్‌పూర్‌ ‌నియోజికవర్గం అభ్యర్ధిని చేశారు. వరుణ్‌ ‌గాంధీ, రాహుల్‌ ‌గాంధీ అన్నదమ్ముల పిల్లలు. గత రెండు సార్లుగా వరుణ్‌ ‌ఫిలిభిత్‌ ‌నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. అనేక సందర్భాలలో పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా కేంద్రంపై యుపి రాష్ట్రంలో పరిణామాలపై తీవ్రమైన వ్యాఖ్యలను బహిరంగంగా చేశారు.

కాగా, యుపి నుంచి కేవలం వరుణ్‌గాంధీని మాత్రమే తప్పించలేదు, జనరల్‌ ‌వికే సింగ్‌, ‌సత్యదేవ్‌ ‌పచౌరీ, బరేలీ ఎంపీ సంతోష్‌ ‌గంగవర్‌, ‌బదౌన్‌ ఎం‌పీ సంఘమిత్ర మౌర్య, రజవీర్‌ ‌సింగ్‌ ‌దిలర్‌ ‌వంటి పలువురికి పార్టీ టిక్కెట్లు ఇవ్వడానికి నిరాకరించింది. అయితే, అధీర్‌ ‌రంజన్‌ ఆహ్వానాన్ని మన్నిస్తారా లేదా అన్న విషయం వేచి చూడవలసిందే.

హర్యానాలో బీజేపీ చమత్కారం

పార్టీలో చేరిన కొద్ది గంటల్లోనే ఎవరికైనా టిక్కెట్టు వస్తుందా, ఇస్తారా? రైల్వే క్యూలో నిలబడ్డా ఇటీవలి కాలంలో మనకు టికెట్టు దొరకడం లేదు కానీ కొందరికి మాత్రం దొరుకుతోంది. ఆ కోవలోకి వచ్చేవారే నవీన్‌ ‌జిందాల్‌, ‌రంజీత్‌ ‌సింగ్‌ ‌చౌతాలా. హర్యానాలో నరాలుగు సీట్లకు ప్రకటించిన పేర్లలో వీరిద్దరివి కూడా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగింది. నవీన్‌ ‌జిందాల్‌ ‌కురుక్షేత్ర స్థానం నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్‌ ‌చిన్న కుమారుడు నవీన్‌ ‌జిందల్‌. ‌దేశంలోని అత్యంత సంపన్నమైన మహిళల్లో ఆమె ఒకరు కావడమే కాదు, దివంగత పారిశ్రామిక వేత్త ఒపి జిందల్‌ ‌భార్య ఆమె. జిందల్‌ ‌స్టీల్‌ అం‌డ్‌ ‌పవర్‌ ‌చైర్‌పర్సన్‌గా ఉన్న నవీన్‌ ఇటీవలే ఇండియన్‌ ‌స్టీల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించారు.

అసలు విషయమేమిటంటే, 2004, 2014 లోనూ కాంగ్రెస్‌ ఎం‌పీగా జిందల్‌ ‌కురుక్షేత్రకు ప్రాతినిధ్యం వహించారు. రానున్న ఎన్నికల్లో నవీన్‌ ‌జిందాల్‌ ఆప్‌ అభ్యర్ధి, రాజ్యసభ మాజీ ఎంపీ సుశీల్‌ ‌గుప్తాతో తలపడనున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఇక్కడ ఆప్‌ ‌పోటీ చేస్తున్నది. నవీన్‌లాగే పార్టీలో చేరిన కొద్ది గంటలకే టికెట్టు సాధించిన మరొక అభ్యర్ధి రంజీత్‌ ‌చౌతాలా. హర్యానాలో స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్న అతడు బీజేపీలో చేరిన వెంటనే హిసార్‌ అభ్యర్ధిగా అతడి పేరును ప్రకటించారు.  సిర్సాలో జరిగిన ఒక కార్యక్రమంలో బీజేపీలో చేరిన చౌతాలా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రి. మాజీ డిప్యూటీ ప్రధానమంత్రి దేవీలాల్‌ ‌సోదరుడి కుమారుడు, హర్యానా ముఖ్యమంత్రి ఓంప్రకాష్‌ ‌చౌతాలా కుమారుడు రంజీత్‌ ‌చౌతాలా.

About Author

By editor

Twitter
YOUTUBE