దొందూ దొందే.. అంటూంటారు కదా.. రాష్ట్రంలో భారత రాష్ట్రసమితి, కాంగ్రెస్‌ పార్టీల వ్యవహారం ఇలాగే ఉంది. రాష్ట్రంలో మొన్నటిదాకా అధికారం వెలగబెట్టిన బీఆర్‌ఎస్‌ పార్టీ.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ రెండూ పోటీ పడి మరీ జంపింగ్‌ జపాంగ్‌లను ప్రోత్సహిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగించి మరీ ఎన్నికల్లో గెలిచిన ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులను తమ పార్టీలోకి ఇష్టం ఉన్నా, లేకపోయినా లాక్కుంది. అందుకోసం గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యలన్నీ ప్రయోగించిం దన్నది రాజకీయ విశ్లేషకులు ఇప్పటికీ చెబుతున్న మాట. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రె స్‌ కూడా అదే ఒరవడిని కొనసాగిస్తు న్నట్లు జరుగుతున్న పరిణామాలను బట్టి స్పష్టమవుతోంది. అయితే, బీఆర్‌ఎస్‌ మాదిరిగా మరీ బరితెగించి బెదిరింపులకు పాల్పడటం కాకుండా.. బతిమిలాడి, ఎరవేసి.. ఆశలు చూపి బీఆర్‌ఎస్‌ నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది.


మొన్నటిదాకా తనకు తిరుగులేదనుకున్న బీఆర్‌ఎస్‌ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఓవైపు కాంగ్రెస్‌ నేతలు ఆపరేషన్‌ ఆకర్ష్‌ను అమలు చేస్తుండగా.. అంతకుముందే.. బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున గెలిచిన ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్‌ పార్టీలోకి జంప్‌ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అధికార మార్పిడి జరిగిన తర్వాత నుంచే ఈ పరిస్థితులు కనిపించాయి. అయితే, కాంగ్రెస్‌ ముఖ్య నేతలు, ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి అప్పటికప్పుడే అలాంటి నాయకులను పార్టీలోకి తీసుకోకుండా జాగ్రత్త పడ్డారు. కొన్నాళ్లు సమయం ఇచ్చారు. ఆ పరిణామాలను గుర్తు చేస్తూ.. బీఆర్‌ఎస్‌కు ఎప్పటి కప్పుడు రaలక్‌లు ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతల్లో గుబులు పుట్టించారు.

చేరికల కుతూహలం

వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చేరికల పర్వం మొదలయ్యింది. అయితే, ఒక్క ఎంపీని చేర్చు కోవడంతో ఆ పార్టీ అప్పటికి మాత్రం కొంత గ్యాప్‌ ఇచ్చింది. పెద్దపల్లి బీఆర్‌ఎస్‌ ఎంపీ వెంకటేష్‌ నేత కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఢల్లీిలోనే హస్తం కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ నేతల చేరికలకు కొంతకాలం ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌కు చెందిన చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ ముఖ్యనేతలను కలిశారు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కూడా భేటీ అయ్యారు. ఆ సమయంలోనే వాళ్లు కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ, పార్టీలో చేర్చుకోలేదు. ఎమ్మెల్యేలు కూడా షరా మామూలుగానే.. తమ నియోజకవర్గం అభివృద్ధి గురించి ముఖ్యమంత్రిని కలిశామని, మంత్రులతో చర్చించామని మీడియా ముందు వల్లెవేశారు. కానీ, సమయం కోసం వేచి చూశారు. ఇంకా చూస్తున్నా రన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతోంది.

 బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కండువా కప్పుకోవడంతో కాంగ్రెస్‌లోకి వలసలు మొదలయ్యాయి. అంతకుముందురోజే వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ పార్టీ మారారు. ఆ తర్వాత చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అదే సమయంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు అయిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. ఇన్నాళ్లు ఎంతమంది వస్తామన్నా సీరియస్‌గా తీసుకోలేదని, కొంత గడువు ఇచ్చామని… ఇకపై కాంగ్రెస్‌పార్టీ గేట్లు తెరిచామని.. తమ పార్టీలోకి బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు.. రాష్ట్ర వ్యాప్తంగా వరదలా వచ్చి చేరుతారని ప్రకటించారు. అప్పటి నుంచి అధికార పార్టీలోకి వలసలు జోరందు కున్నాయి. కొందరేమో కాంగ్రెస్‌పార్టీని వెతుక్కుంటూ వచ్చి చేరుతుండగా.. మరికొందరు పార్టీ ముఖ్యనేతలు కీలకమనుకుంటున్న వారి ఇళ్లకు వెళ్లి మరీ వాళ్లను కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన భార్య.. వికారాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ సునీత మహేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. ఆ వెంటనే మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థిగా సునీతా మహేందర్‌ రెడ్డిని కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అలాగే, పార్టీలో చేరిన వాళ్లలో పెద్దపల్లి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న వెంకటేష్‌ నేతకానిని మళ్లీ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా ప్రకటించేశారు. చేవెళ్ల లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంజిత్‌రెడ్డి పేరును ప్రకటించేశారు. ఇలా.. పార్టీ మారిన నేతలకు కాంగ్రెస్‌ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసేందుకు ఎంపీ టికెట్లు కేటాయించడంలో ప్రాధాన్యత ఇస్తోంది.

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవితను ఢల్లీి లిక్కర్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు హైదరాబాద్‌కు వచ్చి అరెస్ట్‌ చేసిన సమయంలోనే ఎంపీలు రంజిత్‌రెడ్డి, పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరిపోయారు. ఆ సమయంలో కేసీఆర్‌ హైదరాబాద్‌ లోనే ఉన్నారు. ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ కవితకు బెయిల్‌ కోసం ఢల్లీిలో ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇక, కేసీఆర్‌ మేనల్లుడు, మాజీమంత్రి ట్రబుల్‌షూటర్‌గా పేరున్న హరీష్‌రావు కూడా పార్టీని వీడుతున్న నేతలతో చర్చించే ప్రయత్నం గానీ, వాళ్లను అడ్డుకునే ప్రయత్నం గానీ చేయలేదు.

ఇక, మరోవైపు.. హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అలాగే, గత మూడు నెలలుగా పదిమందికి పైగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరతారనే ప్రచారం జరిగింది. వాళ్లంతా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కూడా కలిశారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలలో చాలామంది కాంగ్రెస్‌పార్టీలోకి వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నారన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా నడుస్తోంది.

జంబో జంపింగ్స్‌

బీఆర్‌ఎస్‌నుంచి కాంగ్రెస్‌లో చేరిన వాళ్లలో మూడు అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే, సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్యతో కలిసి కాంగ్రెస్‌పార్టీలో చేరారు. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. కడియం కావ్యకు ఆల్‌రెడీ బీఆర్‌ఎస్‌ పార్టీ వరంగల్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి టికెట్‌ కేటాయించింది. ఇక.. బీఆర్‌ఎస్‌ సెక్రెటరీ జనరల్‌, చాలా రోజులుగా కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటున్న కె.కేశవరావు బీఆర్‌ఎస్‌పార్టీని వీడారు. తన కూతురు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి సహా గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు.

 విలీనానికి బీఆర్‌ఎస్‌ఎల్పీ ఓకే

అంతేకాదు.. బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్సీలు కూడా అదే ఫిరాయిం చేందుకు సిద్ధంగా ఉన్నారన్న చర్చ జరుగుతోంది. ఎప్పుడంటే అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకుంటామని సంకేతాలు ఇస్తున్నట్టు తెలుస్తున్నది. ఆలస్యం చేయకుండా, పార్లమెంట్‌ ఎన్నికలలోగా చేరికల ప్రక్రియను పూర్తి చేయాలని రిక్వెస్టులు పెడుతున్నట్టు సమాచారం. మండలిలో కాంగ్రెస్‌ సభ్యులు కేవలం ముగ్గురే ఉండగా, బీఆర్‌ఎస్‌ పార్టీకి సుమారు 28 మంది ఉన్నారు. వీరిలో మెజారిటీ సభ్యులు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తున్నది. తమ పార్టీలోకి రావాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై రూలింగ్‌ పార్టీ ఒత్తిడి పెట్టడం సహజం. కానీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల విషయంలో సీన్‌ రివర్స్‌ అయ్యింది. పార్టీ మారేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, వెంటనే చేర్చుకోవాలని గులాబీ ఎమ్మెల్సీలు ఒత్తిడి పెడుతున్నట్టు సమాచారం. తమకు సన్నిహితంగా ఉండే మంత్రులు, ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి చేరికల ప్రతిపాదనలను పదే పదే ప్రస్తావిస్తున్నట్టు తెలిసింది. అయితే ఎమ్మెల్సీల చేరికల విషయంలో ఓ ప్లాన్‌తో ఉన్నామని ఓ సీనియర్‌ మంత్రి వెల్లడిర చారు. ముందు అసెంబ్లీలో 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం తమ టార్గెట్‌. ఆ తర్వాత ఎమ్మెల్సీలపై ఫోకస్‌ పెడుతామని ఆ సీనియర్‌ మంత్రి సన్నిహితుల వద్ద చెప్పడం ఆసక్తి రేపుతోంది.

 పెద్దల సభలో కాంగ్రెస్‌ పార్టీకి 28 మంది ఎమ్మెల్సీలు ఉండగా, అందులో మెజార్టీ సభ్యులు కాంగ్రెస్‌ పార్టీ నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా పనిచేశారు. కానీ, రాష్ట్ర విభజన తర్వాత అప్పటి రాజకీయ కారణాల వల్ల గులాబీ పార్టీలోకి వెళ్లారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన మండలి సమావేశంలో చాలా మంది ఎమ్మెల్సీలు జోష్‌గా కనిపించారు. అప్పటి నుంచే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇస్తున్నట్టు తెలిసింది. 20 మంది ఎమ్మెల్సీల మద్దతు ఉంటే, శాసన మండలిలో బీఆర్‌ఎస్‌ ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం కావొచ్చు. అప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. ప్రస్తుతం పార్టీ మారేందుకు 20 నుంచి 25 మంది ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇంత మందిని పోగు చేయడంలో కీలక పదవుల్లో ఉన్న ఒకరిద్దరు ఎమ్మెల్సీల కృషి ఉన్నట్టు టాక్‌ ఉంది. ఘర్‌ వాపస్‌ కోసం కొన్ని రోజులుగా ఇతర ఎమ్మెల్సీ లను ఒప్పించి, సక్సెస్‌ అయినట్టు తెలుస్తున్నది.

నీవు నేర్పిన విద్యే నీరజాక్షా !

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నప్పటికీ అది ఆచరణలో పని చేయడం లేదు. పార్టీ మారిన వారి సభ్యత్వాలను రద్దు చేయాలని గతంలో కాంగ్రెస్‌ వారు డిమాండ్‌ చేస్తే ఇప్పుడు బీఆర్‌ఎస్‌ నేతల వంతు అవుతోంది. బీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నా అది అధికార పార్టీకి చుట్టంగానే ఉంటోంది. ఇంతవరకు పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు. దీంతో నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అని సెటైర్లు వేస్తున్నారు.  బీఆర్‌ఎస్‌ పార్టీలో నేతలంతా మూకుమ్మడిగా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారు. దీనిపై కేటీఆర్‌ స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం గమనార్హం. వారి సభ్యత్వాలను రద్దు చేయాలని విజ్ణప్తి చేశారు.

అప్పుడు 39 మంది ఫిరాయింపులు

ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ నేతలు బీఆర్‌ఎస్‌ను నిలదీస్తున్నారు. వాళ్లు అధికారంలో ఉండగా చేసిందేమిటని ప్రశ్నిస్తున్నారు. వాళ్లు అధికారంలో ఉన్న సమయంలో 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించిన అంశాన్ని నిలదీస్తున్నారు. 2014 నుంచి 2018 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్‌ అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి చేర్చుకున్నారు. 2018 ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ 88 ఎమ్మెల్యే సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, 16 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులకు కారణమయ్యారు కాంగ్రెస్‌ నుండి 12 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. ఒకరకంగా ప్రతిపక్షాలను తుడిచిపెట్టేలా వ్యవహరించారు. రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న దృష్టితో ఓ రకంగా నియంతగా వ్యవహరించాన్న ఆరోపణలు మొదటినుంచీ కేసీఆర్‌పై ఉన్నాయి. అంతేకాదు.. తమ పార్టీలో చేర్చుకున్న చాలామందికి తన కేబినెట్‌లో మంత్రిపదవులు కూడా కట్టబెట్టారు కేసీఆర్‌. ఆ విషయాన్ని ఇప్పుడు కాంగ్రెస్‌ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ఇప్పుడేమో కేసీఆర్‌పై నమ్మకం సడలిపోవడంతో బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు వెళ్లిపోతున్నారని చెబుతున్నారు.

– సుజాత గోపగోని, 6302164068 

About Author

By editor

Twitter
YOUTUBE