– టీఎన్ భూషణ్
ఎన్నికల్లో గెలవడానికి జగన్ ఎన్ని ఎత్తులు వేసినా అవి ఫలించడం లేదు సరికదా తిరిగి ఆయనకే చుట్టుకుంటున్నాయి. ప్రజావిశ్వాసం కోల్పోవడంతో ఎన్నికల్లో గెలవడానికి జగన్ వేయని ఎత్తులేదు. విపక్షాలను భౌతికంగా, ఆర్ధికంగా దెబ్బతీయడం నుంచి ఆ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించడం, నకిలీ ఓట్లు వేయించడానికి దొంగఓట్ల ఐడీలు సృష్టించడం వరకు అన్నీ చేశారు. అవి ఫలించేలా కనిపించడం లేదు. ఇక చివరాస్త్రంగా సెంటిమెంటును నమ్ముకున్నా అది కూడా వికటించి ఆయనకే చుట్టుకుంది. రెండురోజుల క్రితం బస్సు యాత్రలో విజయవాడ సింగ్‌నగర్‌లో జగన్‌పై హత్యాయత్నం జరిగినట్లు సాక్షి మీడియా, జగన్ అనుయాయులు చేస్తున్న ప్రచారం వాస్తవానికి దూరంగా ఉండటంతో ప్రజలు నమ్మడం లేదు.
ఈ అంశంపై పోలీసులు కంటే ముందే సాక్షి మీడియా, వైసీపీ నాయకులు స్పందించి ఆయనపై ప్రతిపక్ష నాయకులు పదునైన ఆయుధంతో హత్యాయత్నం చేయించినట్లు ఆరోపణలు చేశారు. బస్సు యాత్రల్లో బహిరంగ సభలో తప్ప జగన్ బయటకు రావడం లేదు. సాయంత్రం ఆరుదాటితే యాత్ర చాలిస్తున్నారు. ఆయన వెళ్లేదారిలో కరెంటు వైర్లు తీసేస్తున్నారు. బస్సుకు నలువైపులా ఆయన నియమించుకున్న భద్రతాసిబ్బంది కాపలా కాస్తున్నారు. ఇలాంటప్పుడు ఆయనపై హత్యాయత్నం జరిగిందంటే ఇది పోలీసుల భద్రతా వైఫల్యంగా భావించవచ్చు. అంటే ప్రభుత్వ వైఫల్యంగా చెప్పాలి. భౌతికదాడులను ఖండిరచా ల్సిందే. కాని పోలీసులు విచారణ చేపట్టక ముందే అధికార పార్టీ నేతలు స్పందించి దానిని హత్యాయత్నంగా ఆరోపిస్తూ రాజకీయం చేయడంతో దీనిపై ప్రజలు, మీడియా అందరూ స్పందించాల్సి వస్తోంది. 2019లో ఎన్నికల ముందు ఇలాంటి సంఘటలను కోడికత్తి, వివేకానంద రెడ్డి హత్య సంఘటనలను వైసీపీ రాజకీయం చేసింది. తప్పు ఎదుటిపక్షాలపై నెట్టేసింది. తర్వాత ఆ కేసుల్లో వేళ్లన్నీ అధికారపార్టీ వైపే చూడటం, ఇప్పుడు కూడా జరిగిన సంఘటన వాస్తవానికి దూరంగా ఉండ టంతో వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ప్రజలు నమ్ముతున్నారు.
అసలేం జరిగింది
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 14వ రోజు సీఎం జగన్ గుంటూరు జిల్లా బస్సు యాత్రను ముగించుకుని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లోకి ఏప్రిల్ 13న సాయంత్రం ప్రవేశించింది. విజయవాడలో దాదాపు నాలుగున్నర గంటలపాటు బస్సు యాత్ర కొనసాగింది. అదే రోజు రాత్రి 8.10 గంటలకు సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్‌కు జగన్ యాత్ర చేరుకోగా, అక్కడ వివేకానంద స్కూల్, గంగానమ్మ గుడి మధ్య నుంచి బస్సుపై ఉన్న జగన్‌కు ఎడమ కంటి రెప్ప పైన రాయి తగిలిందని, అదే రాయి పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ కంటికి తగిలిందంటున్నారు. దాడి జరిగినప్పుడు అక్కడ విద్యుత్ సరఫరా లేదు. తక్షణమే భద్రతా సిబ్బంది అప్రమత్తమై జగన్‌ను, వెలంపల్లిని బస్సులోకి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. జగన్ మళ్లీ బస్సు నుంచి తన యాత్రను కొనసాగిస్తూ, అభిమానులకు అభివాదం చేస్తూ మందుకు సాగారు. కేసరపల్లిలోని బస చేసే ప్రాంతానికి రాత్రి 11.15 గంటలకు చేరుకున్నారు. ఆయనకు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు. ఇదీ సంఘటన జరిగిన తీరు. అప్పటి నుంచి వైసీపీ నాయకులు ప్రతిపక్షంపై దాడి ప్రారం భించారు. ఈ హత్యాయత్నం వెనుక చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్ కుట్ర ఉందని ఆరోపించారు. ఓటమి భయంతో సెంటిమెంటుతో గెలవాలని జగన్ నాటకం ఆడుతున్నారని తెదేపా, జనసేన విమర్శించింది. ఈ కేసును స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తే నిజాలు బయటపడవని, అందువల్ల కేంద్ర దర్యాప్తు సంస్థలే విచారించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
భద్రతా వైఫల్యం
ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్ డబ్ల్యూ), సీఎం సెక్యూరిటీ గ్రూపు (సీఎంఎసీ), క్లోజ్ ప్రాక్సిమిటీ గ్రూప్, ఎస్కార్ట్, ఇన్నర్ కార్డన్, అవుటర్ కార్డన్, పెరిఫెరీ ఇలా వందలమందితో ముఖ్యమంత్రికి భద్రత ఉంటుంది. వీళ్లు కాకుండా ఎక్కడికక్కడ స్థానిక పోలీసులు కల్పించే భద్రత అదనం. అయినా సీఎం పైకి రాయి విసిరి, గాయం చేయగలిగారంటే.. భద్రతాపరంగా పోలీసులు ఎంత ఘోరంగా విఫలమయ్యారో అర్థమవుతుంది. దాడి జరిగిన ప్రాంతానికి పోలీసు స్టేషన్ 2 కిలోమీటర్లు, సీపీ ఆఫీసు 8 కిలోమీటర్లు, డీజీపీ ఆఫీసు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉండగా… ప్రొటోకాల్‌పరంగా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న సీఎంపై దాడి జరగడం ఘోర భద్రతా వైఫల్యంగా భావిస్తున్నారు. దాడులకు అవకాశం ఉందని భావించినప్పుడు ఎందుకు ఆయన పర్యటన కొనసాగనిచ్చారని కొందరు రిటైర్డ్ పోలీసు అధికారులు ప్రశ్నిస్తున్నారు. అసలు జగన్ హెలికాప్టర్లో వస్తున్నారంటే కింద ట్రాఫిక్ అపేస్తారు. రోడ్ యాత్ర అంటే చెట్లు కొట్టేస్తారు. ఆయన రోడ్డు మీదకు రావాలంటే.. ఇంటలిజెన్స్ పోలీసులు ముందుగానే జనంలోకి కలిసిపోయి.. ఎవరైనా నిరసనలు చేస్తారేమో చూస్తారు. వారిని పట్టుకుంటారు. రాళ్లేసేవాళ్లుంటే అలక్ష్యం చేయరు. తర్వాత రోప్ పార్టీ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే.. సీఎం భద్రతా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. అయినా రాయి పడిరది. సీఎం జగన్ సాధారణంగా బస్సు టాప్ పై ఎక్కరు. రెండు, మూడు వందల మంది జనాన్ని తీసుకు వచ్చినా ఆయన తన సీట్లో నుంచి.. నమస్కారం చేస్తారు. నైట్ కరెంట్ ఆపేసి చేసిన రోడ్ షోలో అయితే.. అసలు బయటకు రాకూడదు. అది సెక్యూరిటీ ప్రోటోకాల్ కూడా. ముఖ్యమంత్రి స్వయంగా తన భద్రత కోసం ఇన్ని చర్యలు తీసుకుంటున్నా.. గులకరాయి వచ్చి పడిరదంటే ఇంత కంటే చేతకాని తనం ఉన్న ప్రభుత్వం వ్యవస్థ ఉండదేమో అనేది విపక్షాల విమర్శ.
ఎన్నో సందేహాలు
భద్రతా ప్రొటోకాల్స్ ప్రకారం… సాధారణంగా ముఖ్యమంత్రి పర్యటన సాగుతుంటే ఆ ప్రాంతంలో విద్యుత్తుకోత, విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా ముందే చూసుకుంటారు. అదికూడా రాత్రివేళ నివాసానికి అతి సమీపంలోని ఓ ప్రైవేటు స్కూల్ వద్ద యాత్ర సాగుతుండగా ఈ ఘటన జరిగింది. అప్పుడు ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరా లేదు. సీఎం పక్కనే ఉన్న వైసీపీ విజయవాడ సెంట్రల్ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌కూ రాయి తగిలి గాయమైనట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రిని భద్రతా సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ బస్సు లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టాలి. కానీ అందుకు విరుద్ధంగా సీఎం బస్సు మీద నిలబడటానికి ఎలా అనుమతించారు? విద్యుత్ సరఫరా లేనప్పుడు ఫోకస్ లైట్లు ఆన్ చేసి చుట్టుపక్కల ప్రాంతాల్ని కవర్ చేయాలి. కానీ భద్రతా సిబ్బంది అవేవీ చేయలేదు. అనుభవజ్ఞులైన ఉన్నతాధికారులు ఈ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కదిలే సమయంలో అంతర్గత బందోబస్తు, బయట, చుట్టుపక్కల బందోబస్తు ఉండాలి. కానీ జగన్‌పైకి రాయి రువ్వినప్పుడు వారు ఎందుకు గమనించలేదు? ఎందుకు అడ్డు కోలేదు? ఏం చేస్తున్నారు? స్పెషల్ బ్రాంచ్, నిఘా విభాగం సిబ్బంది ముఖ్యమంత్రి బస్సును చుట్టుముట్టి నిరంతరం గమనిస్తూ ఉండాలి. ఎవరైనా దుండగులు రాళ్లు విసురుతుంటే ఎందుకు గమనించలేదు? ముఖ్యమంత్రికి రాయి తగిలినప్పుడు సీఎం ఎసీ (సీఎం సెక్యూరిటీ గ్రూపు) ఎందుకు వంగి మోకాళ్లపై నిలబడిరది? విద్యుత్తు కోత సమయంలో సీఎం చుట్టూ రాళ్ల వంటివి పడకుండా స్టోన్ గార్డులు ఏర్పాటుచేయాలి. కానీ అవేవీ ఎందుకు పెట్టలేదు? అనంతపురంలో ముఖ్యమంత్రిపై చెప్పులు విసిరారు. ఆ తర్వాతైనా జాగ్రత్తలు తీసుకోవాలి. కదా.. ఎందుకు చేపట్టలేదు? ఘోర భద్రతా వైఫల్యానికి కారణం నిగ్గు తేలాలంటే సీబీఐ, ఎన్‌ఐఏ వంటి కేంద్ర సంస్థలతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కరెంటుతీయడం వెనుక
ముఖ్యమంత్రి బస్సు పర్యటన సమయంలో ఆయన ప్రయాణిస్తున్న మార్గంలో చెట్లు కొట్టేస్తు న్నారు. అడ్డంగా కరెంటు వైర్లుంటే తొలగిస్తున్నారు. కరెంటు సరఫరా నిలిపివేస్తున్నారు. సిఎం ప్రయాణానికి అవరోధం కలగకుండా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా, దీని వెనుక ఉన్న వాస్తవం వేరని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సిఎం బస్సు పర్యటనకు వచ్చినపుడు ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చి ఆయనను చూడాలని వైసీపీ నిర్ణయిం చింది. అందుకోసం ఆయన ప్రయాణించే మార్గంలో అరగంట ముందు కరెంటు సరఫరా తీసేస్తున్నారు. టీవీల ముందు కూర్చున మహిళలు కరెంటు పోవడంతో వేసవి ఉక్కపోతను భరించలేక బయటకు వస్తారని, అదేదారిన వచ్చే జగన్‌ను చేసేందుకు ప్రయ త్నిస్తారని వైసీపీ భావిస్తోంది. అందువల్లే కరెంటు సరఫరాను తీసేస్తున్నారు. విజయవాడలో కూడా అదే జరిగింది. జగన్ బస్సు రాకముందు అరగంట నుంచి కరెంటు తీసేసి బస్సు వెళ్లిపోయాక అన్ని ప్రాంతాలకు వరుసగా కరెంటు సరఫరా ఇచ్చారు.
రాయితో పరిష్కారం
జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు స్పందన లేదన్నది అందరికీ తెలిసిన నిజం. మరో వైపు షర్మిల, సునీత వేస్తున్న ప్రశ్న ఎన్నికల బరిలో వెనుకబడిన అన్నింటికీ పరిష్కారాన్ని గులకరాయితో వెదుక్కున్నా రంటున్నారు. నియోజకవర్గంలో పోటీచేసే అభ్యర్థి అతి కష్టం మీద తీసుకు వచ్చే ఒకటి, రెండు వందల మంది తప్ప సామాన్య జనం ఎవరూ పట్టించు కోవడం లేదు. ఇలాంటి సమయంలో బస్సు యాత్రను ఆపలేక.. కొనసాగించలేక తంటాలు పడుతున్నారు. అలాంటి సమయంలో ఏదో ఒకటి ప్లాన్ చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడినట్లుగా కనిపిస్తోందంటున్నారు. అందుకే ఈ రాయి సినిమా తీసారని అనుమానాలు వస్తున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. రాయి తగిలిందని చిన్న బ్యాండేజీ వేసుకుని మళ్లీ ఆసుపత్రికి వెళ్లి అక్కడ ఆస్పత్రి డ్రెస్ వేసుకుని వైద్య పరీక్షలు చేయించుకుని ఫొటోలు మీడియాకు విడుదల చేసుకున్నారు. ఇదంతా సానుభూతి కోసమే అన్నది విపక్షాల వాదన.
కుట్రకోణం
వైసీపీ ఆరోపిస్తున్నట్లు దీనిని కుట్ర కోణంగా భావించవచ్చని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సానుభూతి కోసం వైసీపీనే ప్రణాళిక రూపొందిం చిందని వీరంటున్నారు. అందుకే విజయవాడ సంఘటన జరగ్గానే తెనాలిలో పవన్‌కల్యాణ్‌పై రాళ్లు పడ్డాయి. అలాగే ప్రచారంలో ఉన్న చంద్రబాబుపైనే రాళ్లు రువ్వారు. రాబోయే పదిరోజుల్లో ఈ తరహా రాళ్లదాడులు తమ నేతలపై జరగవచ్చని విపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. చిత్తూరు జిల్లా అంగళ్లు, నందిగామ, ఎర్రగొండపాలెం, రాజధాని ప్రాంతాల్లో చంద్రబాబుపై వందలాది మంది వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వడం తెలిసిందే. బీజేపీ నేత సత్యకుమార్ పైనా ఇదే రీతిలో అమరావతిలో రాళ్లదాడి చేశారు. అయితే ఈ సంఘటనలపై అప్పట్లో పోలీసులు స్పందించలేదు. ప్రజలకు భావప్రకటనా స్వేచ్ఛ ఉందని అందువల్ల ఇలా రాళ్లు వేసి దాడిచేసినట్లు అప్పటి డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు. మంత్రులైతే మరీదారుణంగా మాట్లాడారు.
ప్రజల ప్రాణాల కన్నా విలువైనవా?
ప్రతిపక్ష నాయకులపై దాడులు జరిగినప్పుడు వైసీపీ మంత్రులు దారుణంగా స్పందించారు. ‘‘పోలీసు కాపలాలో యాత్ర నడుస్తుంటే… ఆయన పైకి ఎవరో చీకట్లో రాయి విసిరారట. ఆయనను చంపేద్దామని చెప్పి… ఇంత గులకరాయి విసిరారట. ఆయనే మైనా పావురమా… పిట్టా.. గులకరాయితో కొడితే పోవడానికి? ఎవరు విసురుతారు రాయి? ఆయనే సొంత పార్టీ కార్యకర్తలతో గులకరాళ్లు వేయించుకున్నారు, చంద్రబాబుపై రాళ్లదాడి సమయంలో మంత్రి కొడాలి నాని అన్నమాటలివి. ఆప్పట్లో మంత్రి అంబటి రాంబాబు మాటలు ఇలా ఉన్నాయి. ‘‘ఓడిపోతున్నామని తెలిసి నాటకం ఆడే పరిస్థితికి దిగజారిపోయిన మాట వాస్తవమా.. కాదా? మీరు అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టి అందర్నీ వేధించారు కాబట్టి… మీరు వస్తున్నప్పుడు వారు నిరసన చేపట్టారు. ఎవరో తుంటరివాళ్లు రాళ్లు వేసి ఉండొచ్చు. మీ మీద ఎంత చెడు అభిప్రాయం ఉందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మంత్రిగా పేర్నినాని ఇలా అన్నారు. ‘‘వారి కలల్ని కల్లలు చేసి వాళ్లని భ్రమల్లో ఉంచి, కల్పన కల్ల జేశారు. అవన్నీ వాస్తవరూపం దాల్చకపోయేసరికి ఆ కసి, కోపంతో తిరుగుబాటు చేస్తున్నారు. డబ్బులిచ్చి పువ్వులైతే వేయించుకోగలరు గానీ… ప్రజల్ని మోసం చేస్తే చెప్పులు, రాళ్లే పడతాయి.’’ ఎమ్మెల్యే వంశీ ఇలా అన్నారు. ‘‘ఎమోషనల్ కనెక్టివిటీ అన్నది ఒకటుంటుంది. దేశంలో ఏ హింస జరిగినా నేరుగా సంబంధం ఉన్నవాళ్లే చెయ్యరు. వ్యక్తిగతంగా అభిమానించేవాళ్లు ఉంటారు. వ్యక్తిగతంగా దురభిమానం చూపెట్టేవాళ్లూ ఉంటారు. ఏదైనా చేయొచ్చు. మాకేం సంబంధం? బొత్స సత్య నారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తానేట వనిత, కురసాల కన్నబాబు, జోగి రమేష్, ఇలా పలువురు ప్రతిపక్ష నాయకుడిపై దాడిని విమర్శించారు. ఇప్పుడు జగన్‌కు చిన్న గాయం అయితే రాష్ట్రానికే ఏదో జరిగిపోయిందని గగ్గోలు పెడుతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. బాపట్ల జిల్లాలో 15 ఏళ్ల బాలుడు అమరనాథ్ గౌడ్ తన అక్కను వేధించవద్దని అన్నందుకు వైసీపీ కార్యకర్త నిర్దాక్షిణ్యంగా పెట్రోలు పోసి తగలబెడితే అప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా? చంద్రబాబునాయుడిపై రాళ్ల వర్షం కురిపిస్తే రాష్ట్రా నికి గాయం కాలేదా? రాష్ట్రంలో 30 వేలమంది ఆడబిడ్డలు అదృశ్యమైతే గాయం కాలేదా? కేవలం మీకు (జగన్) రాయి తగిలితేనే రాష్ట్రానికి గాయమైనట్లా? అని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రశ్నించడం గమనార్హం. జంగారెడ్డి గూడెంలో నాటుసారా తాగి 19 మంది మరణించారు. వారి ప్రాణాలు సీఎం ప్రాణాలతో సమానమైనవి కావా? ప్రభుత్వం అమ్మే నాణ్యతలేని మద్యం సేవించి వేలాది మంది లివర్ సంబంధిత వ్యాధులతో మరణిస్తు న్నారు. వారి ప్రాణాలు జగన్ ప్రాణాలతో సమానవైనవి కావా? ఇసుక లేక నెలల తరబడి పనులు ఆగిపోయి ఎందరో నిర్మాణ కార్మికులు ఆకలితో మరణించారు. వారి ప్రాణాలు జగన్ ప్రాణాలతో సమానమైనవి కావా? ఇది సగటు పౌరుడి ప్రశ్న.
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్