ముఖ్యమంత్రి.. ఓ రాష్ట్రానికి పరిపాలనాధిపతి. పాలనావ్యవస్థ మొత్తం ఆయన చేతుల్లోనే ఉంటుంది. మొత్తానికి రాష్ట్రానికి ఆయనే అధిపతి. ఆయన ప్రాతినిథ్యం రాష్ట్రం మొత్తానికి. ఆయన ఆలోచన రాష్ట్రం మొత్తానికి సంబంధించినదిగా ఉండాలి. ప్రతిపనీ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి తీసుకెళ్లేలా ఉండాలి. రాష్ట్ర అధికార, రాజకీయ యంత్రాంగమంతా ఆయన కనుసన్నల్లోనే పనిచేస్తుంది. ఆయన హుందాతనమే రాష్ట్ర హుందాతనం. ఆయన ప్రసంగించే తీరు, గౌరవ ప్రదమైన వ్యవహారమే రాష్ట్రానికి గౌరవప్రదం. కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ముఖ్యనేతల వ్యవహారశైలి, ప్రసంగం తీరు, మాట్లాడుతున్న భాష వెగటు పుట్టిస్తోంది. రాష్ట్రం పరువును కూడా బజారున పడేస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
వాస్తవానికి ముఖ్యమంత్రి, మంత్రి అనే విషయం పక్కనబెడితే.. రాజకీయ నాయకులంటే సమాజంలో ఓ గౌరవం ఉంటుంది. అధికారం ప్రతిపక్షం అన్న సంబంధం లేకుండా సాధారణ ప్రజలు రాజకీయ నేతలను సమాజంలో హోదా ఉన్న వ్యక్తులుగా గుర్తిస్తారు. నేతల మాట, నడత సమాజంపై పెను ప్రభావమే చూపిస్తుంది. ప్రజలు ప్రతిక్షణం వారిని గమనిస్తూ ఉంటారు. అనుచరులు వారు చెప్పినట్టు నడుచుకుంటారు. అందుకే నేతలు మాట్లాడే మాటలు, వారి మాటతీరు ఎంత హుందాగా ఉంటే వారికీ, సమాజానికి కూడా అంతే మంచి జరుగుతుంది. వారికీ అదే రీతిలో గౌరవం లభిస్తుంది. కానీ ప్రస్తుత రాజకీయాల్లో ఆ హుందా తనమే కరువయింది. నోటికి సైతం హద్దూ అదుపూ ఉండడం లేదు. కోట్లాదిమంది తమ మాటలు వింటారన్న కనీస స్పృహ లేకుండా ఇష్టారీతిన నోటికి ఏది వస్తే అదే మాట్లాడడం ఇప్పుడు రాజకీయ నాయకుల లక్షణంగా మారిపోయింది.
ఒకరేమో మాజీ ముఖ్యమంత్రి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పదేళ్లపాటు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన ఒకప్పటి టీఆర్‌ఎస్.. ఇప్పటి బీఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు. మరొకరేమో ప్రస్తుత ముఖ్యమంత్రి. అంటే.. తెలంగాణ రాష్ట్రానికి మొదటి, రెండవ ముఖ్య మంత్రులు వాళ్లు. ఒకరేమో బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. మరొకరేమో ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్‌కు చెందిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. వీళ్లిద్దరు మాట్లాడే భాష.. తిట్టుకునే తీరు.. దూషించుకునే తత్వం చూసి తెలంగాణ ప్రజలే నోరెళ్లబెడుతున్నారు. ఫక్తు రాజకీయ నాయకు లయినా.. వీధిలో ఆకతాయిల్లా భాషను వాడుతున్నారు. పైగా మీడియా ముందు.. అధికారిక బహిరంగసభల వేదికలపై అభ్యంతరకరమైన భాషను వాడుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే పత్రికల్లో రాయలేని, టీవీల్లో ప్రసారం చేయలేని భాషను ఇద్దరూ వాడుతున్నారు. వీధి కొట్లాటల్లా భావిస్తున్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ల కాలంలో సీఎంగా కేసీఆర్ ఎన్నో సందర్భాల్లో, రాజకీయ ప్రచారాల్లో మాట్లాడారు. తెలంగాణ మాండలి కలంలో అనేక రకాల పదాలను, ప్రజలకు చెడు అర్థంగా భావించే మాటలను కేసీఆర్ ఆయా సమయాల్లో అలవోకగా వాడేశారు. అందుకే పదేళ్ల కాలంలో ఎన్నోసార్లు కేసీఆర్ భాషపై మేధావుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యేవి. రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ సంప్రదాయాన్ని నిలబెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. కేసీఆర్‌కన్నా పదాకులు ఎక్కువే చదివినట్టుగా రేవంత్ రెడ్డి మాటతీరు ఉంది.
తెలంగాణలో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల సీజన్ నెలకొంది. వచ్చేనెల 13వ తేదీన పోలింగ్ జరగ నుంది. గత నవంబర్‌లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి కలలో కూడా ఊహించని రీతిలో చతికిలపడిరది. పదేళ్లపాటు పూర్తిస్థాయి మెజారిటీతో, ఒక దశలో అసలు రాష్ట్రంలో ప్రతిపక్షం అనేదే ఉండకుండా చేసే స్థాయిలో వెలుగొందినా.. మొన్నటి ఎన్నికల్లో మాత్రం బీఆర్‌ఎస్ బొక్కబోర్లా పడిరది. ఆ ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు కేసీఆర్ విమర్శల్లో కనిపిస్తున్నట్లు తోస్తోంది. దాదాపు మూడు నెలల పాటు సైలెంట్‌గా ఉన్న కేసీఆర్.. ఒక్కసారిగా తనలో దాగిన ఆక్రోశాన్నంతా వెళ్లగక్కారన్న సంకేతాలు కరీంనగర్ పర్యటనలో బయటపడ్డాయి. దీంతో.. ఇన్నాళ్లుగా మామూలు విమర్శలకే పరిమితమైన రేవంత్‌రెడ్డి కూడా అదే స్థాయిలో రెచ్చిపోయారు. జాతీయస్థాయి నేతలు హాజరైన తుక్కుగూడ బహిరంగ సభా వేదికపైనుంచి కేసీఆర్‌ను ఏకి పారేశారు. కేసీఆర్‌నే కాదు.. ఆయన కుటుంబ సభ్యులైన రాజకీయ నాయకులపైనా విమర్శల వర్షం కురిపించారు.
లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజ కీయాలు రంజుగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మించి నాయకులు పోటీపడి విమర్శలు గుప్పించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అత్యధిక సీట్లు గెలుచు కోవాలనే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టబోయిన చందంగా.. అనూహ్యంగా అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్.. లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా పుంజు కోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ ముఖ్యనాయకులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు ఒక్కొక్కరుగా బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి జారుకుంటు న్నారు. అయినా కేసీఆర్.. ఇన్నాళ్లు గుంభనంగా ఉన్నారు. ఆ వెలితి బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే, వర్షాభావం, భూగర్భ జలాల కొరత కారణంగా పంటలు ఎండిపోవడం కేసీఆర్‌కు ఓ ఆయుధంలా మారింది. మారిందనడం కంటే ఆ పరిస్థితులను ఆయుధంగా మలచుకున్నారు కేసీఆర్. రైతులకు న్యాయం చేయాలని, వారిని ఆదుకోవాలని, నష్టపోయినవాళ్లకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. తొలిరోజు పర్యటనలో జనగామ జిల్లా, సూర్యాపేట జిల్లాల్లోని పలు గ్రామాల్లో పంటపొలాలను పరిశీలించారు ఆయన. ఆ తర్వాత.. సూర్యాపేటలో మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ కాస్త సంయమనంతో వ్యవహరించారు. పెద్దగా ఆవేశంగా మాట్లాడలేదు. మరుసటిరోజు చూసుకుందామంటూ మీడియా ప్రతినిధులకు కూడా సర్దిచెప్పారు.
ఆ తర్వాత రెండో విడతగా కరీంనగర్‌లో పర్యటించిన కేసీఆర్ శివాలెత్తి పోయారు. ప్రభు త్వంపై, ప్రభుత్వ పనితీరుపై, ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై విమర్శలకు పదునుపెట్టారు. రేవంత్ రెడ్డిపై ఘాటుగానే తిట్ల దండకం అందుకున్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడారు. పత్రికల్లో రాయలేని విధంగా, టీవీల్లో టెలికాస్ట్ చేయలేని విధంగా దూషణలు చేశారు. అయితే, ఆ మరుసటి రోజే హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌పార్టీ బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి కూడా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ భాషలోనే రేవంత్‌రెడ్డి కూడా సమాధానం చెప్పారు.
కరీంనగర్ జిల్లాలో పర్యటన సందర్భంగా రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆ సమయంలో కేసీఆర్ భాష కూడా బౌండరీ దాటేసింది. అన్‌పార్ల మెంటరీ పదాలను అల్లుకుంటూ పోయారు. ఆ ఫ్లోలో బూతు పురాణం అందుకున్నారు.
ముఖ్యమంత్రి పదవి ఊడిపోయిన తర్వాత కేసీఆర్ మాట్లాడిన ఈ భాష ఆయనలో ఫ్రస్ట్రేషన్‌కు అద్దం పట్టిందన్న విమర్శలు వినిపించాయి. బీఆర్‌ఎస్ ఓటమిని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ఇన్నాళ్లు.. ఆ ఆవేదననంతా లోపలే దాచుకున్నారని, కనీసం బయటకు కూడా రాలేదని, కనీసం కన్నకూతురు కవితను ఈడీ అధికారులు ఢల్లీి నుంచి వచ్చి అరెస్టు చేసినా కేసీఆర్ ఇంట్లో నుంచి బయటకు రాలేదన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆ ఆక్రోశమంతా వెళ్లగక్కుతున్నారని సొంతపార్టీ నేతలు కూడా చెవులు కొరుక్కున్నారు.
కేసీఆర్ ఉపయోగించిన ఆ భాషకు రేవంత్‌రెడ్డి కూడా తానేమీ తక్కువ తినలేదని నిరూపించు కున్నారు. ఒకరకంగా కేసీఆర్.. తాను రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన ముఖ్యమంత్రిని అన్న విషయాన్ని మర్చిపోయి దూషణల పర్వం అందుకున్నారు. వాస్తవానికి ఆయన ఆ విషయం తెలియకుండా మాట్లాడటం అనేది కాకున్నా.. కనీస హుందా తనంతో వ్యవహరించాల్సి అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా విజ్ఞత పాటించలేదు. సంయమనంతో వ్యవహరించ లేదు.
‘‘తమలపాకుతో తానొకటంటే తలుపుచెక్కతో నే రెండంటా’’ అనే సామెత లాగా వ్యవహరించారు. ఇద్దరూ దొందూ దొందే అన్నట్లుగా పరస్పరం తిట్ల పర్వం సాగించుకున్నారు. ఆ మరుసటిరోజే.. తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ జనజాతర సభలో రేవంత్‌రెడ్డి కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రతిస్పందించారు. డిసెంబరు నుంచి ఇప్పటిదాకా అనేకసార్లు కేసీఆర్‌పైనా, ఆయన కుటుంబంపైనా, బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినవారి పైనా రేవంత్ విమర్శలు చేసినప్పటికీ.. తుక్కుగూడ సభలో మాత్రం ఆయన అన్ని హద్దులూ చెరిపేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్సాహపరిచే క్రమంలోనో శక్తిమంతమైన ప్రసంగం చేయాలన్న ఉద్దేశంతోనో, ప్రతీకారేచ్ఛ ప్రతిధ్వనించాలన్న ఆలోచనతోనో కానీ రేవంత్ గతంలో ఎన్నడూ లేని విధంగా మాట్లాడారు.
కేసీఆర్ భాషపై సీఎం రేవంత్ గట్టి గానే రెచ్చిపోయారు. కేసీఆర్ నోటి కొచ్చినట్లు మాట్లాడితే.. చర్లపల్లి జైలుకు పంపించి చిప్పకూడు తినిపిస్తామని హెచ్చరించారు. అడవి పందిలా పదేళ్లపాటు తెలంగాణను సర్వనాశనం చేశారని.. పదేళ్లలో వందేళ్ల విధ్వంసం చేశారని, మీ కాలు విరిగిందని, మీ కూతురు జైలుకి పోయిందని కొంతకాలం మేము సంయమనం పాటించానన్నారు. ‘అలా అని.. ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోను.. నేను రేవంత్ రెడ్డిని అని గుర్తు పెట్టుకో బిడ్డా. మా కార్యకర్తలతో జాగ్రత్త’ అంటూ చెలరేగి పోయారు. చర్లపల్లి జైల్లో చిప్పకూడు తిని పిస్తా. నువ్వు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టివ్వలేదు. నేను మాత్రం నీకు తప్పకుండా చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని హెచ్చరించారు.
మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు, ప్రతి విమర్శలు.. బూతు పురాణం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. రాజకీయ విమర్శలు మరీ.. ఇంతలా దిగజారుతున్నాయన్న చర్చ నడుస్తోంది. ఎవరు ఎక్కువ తిట్లు తిట్టగలం అనేదానిపై నేతలు ఒకరితో ఒకరు పోటీపడుతు న్నారు తప్ప.. ప్రజలకు మంచి చేయడానికి ఏం చేయాలన్నది ఆలోచించడం లేదు. తీవ్ర విమర్శలు చేసుకుంటున్న రేవంత్, కేసీఆర్ ఇద్దరూ.. ఆ హుందాతనాన్ని మర్చిపోతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.
– సుజాత గోపగోని, 6302164068, సీనియర్ జర్నలిస్ట్