శ్రీరాముడు కేవల పురాణ పురుషుడు కాదు. కావ్య నాయకుడూ కాదు. భారతీయ నాగరికతా చరిత్రకు ఆయన శ్రీకారం. దాశరథి భారతీయు లకు మాత్రమే కాదు.. హిందువులకు మాత్రమే కాదు, ప్రపంచ మానవాళికే దేవుడు అంటున్నప్పుడు, భారతదేశ ఉత్తర దక్షిణ ప్రాంతాలతో ఆయన బంధం గురించి వేరే తర్కించాలా? హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ప్రతి మట్టి రేణువు రాముడి గురించి విన్నదే. పలికినదే, స్పర్శతో పరవశించినదే. మనుషులకి, పక్షులకి, ఊళ్లకి, ఫలాలకి, కొండలకి, గుహలకి, వాగులూ వంకలకి, జలాశయాలకి రాముడి పేరే పెట్టుకున్న సంస్కృతి ఇక్కడ. అంతా రామమయమే. భారతీయ జీవనంలోని ఏకాత్మను దర్శింపచేసేవాడు రామచంద్రుడు. ఈ నేలలోని, ఈ జాతిలోని ఏకాత్మతకు ఆయన ఆద్యుడు. సమైక్యతకు స్ఫూర్తిప్రదాత.

అయోధ్యలో రామమందిర నిర్మాణంతో, బాలక్‌రామ్‌ ప్రాణప్రతిష్ఠతో ప్రపంచ దేశాలే రామతత్త్వం వైపు చూశాయి. అయోధ్య ప్రాణప్రతిష్ఠ అంటే భారతీయ నాగరికతకు ఊపిరి పోయడమేనని చెప్పుకుంటున్నా, అది కొంచెం పెద్ద మాట. విశ్వం యావత్తు విస్మరించలేని ఆ మహోన్నత నాగరికత విలువలను స్మరించుకుని ఒక జాతిగా వర్తమానం తరం కొత్త జీవితాలను ప్రారంభించడానికి జరిగిన ప్రయత్నమది. ఆ నాగరికతకు ఆత్మ శ్రీరామ చంద్రుడు. కాబట్టే అయోధ్య సహా, దేశంలో ఎక్కడ నిర్మించిన ఆలయమైనా సున్నం, ఇటుకలు, విగ్రహాలు కాదు. ఈ జాతి ఐక్యతను ఎలుగెత్తి చాటేవే. ఆయన మూర్తీభవించిన ధర్మం. రామ రాజ్యం నేటికీ ఆదర్శపాలనకు కొండగుర్తు. ఆయన నడయాడిన కాలమంటే ధర్మం నాలుగు పాదాల మీద నిలిచిన కాలం. ఆయన కథానాయకుడిగా వెలువడిన మహాకావ్యం శ్రీమద్రామాయణానికి అందుకే అంత ఆదరణ. ప్రపంచంలోని ఎన్నో భాషలలో ఆ కావ్యం వినిపిస్తుంది. ప్రతి భారతీయ భాషలోను దర్శనమిస్తుంది. వందలాది అనువాదాలు.

సంస్క్సతంలో వాల్మీకి రామాయణం అవతరించిన తరువాత మన సువిశాల దేశంలో ప్రతి ప్రాంతం తన భాషలోకి రాముడిని తీసుకు వెళ్లింది. పూజించుకుంది. ఆయన వేల సంవత్స రాలుగా భారతదేశ ఆరాధ్యదైవం. అందుకు సాహిత్య ఆధారాలతో పాటు పురావస్తు ఆధారాలు సాక్ష్యం పలుకుతూనే ఉన్నాయి. వాల్మీకి మహర్షి రామచంద్రప్రభువుకు సమకాలికుడంటాయి తొలినాటి రామకథా గ్రంథాలు. అయోధ్యకు దాదాపు 110 మైళ్ల దూరంలోనే ఉన్న బిథూర్‌లోనే వాల్మీకి ఆశ్రమం ఉండేదని చాలామంది విశ్వాసం. అక్కడే లవకుశులు జన్మించారని కథనం. ఆ పుణ్యస్థలం పవిత్ర గంగకు పశ్చిమ ఒడ్డును ఉంది.

కశ్మీర పండితుడు, భారతదేశం విశ్వానికి అందించిన చరిత్రకారుడు, చరిత్ర తత్త్వవేత్త కల్హణుడు. ఇక్కడ 12వ శతాబ్దానికి ముందే రామకథా గానం అనే సంప్రదాయం ఉందని రాశారు, తన ‘రాజతరంగిణి’ గ్రంథంలో. శ్రీరామచంద్రునిలోనివే కాదు, రావణబ్రహ్మలోని ఆధ్యాత్మిక అంశాలను సట్లెజ్‌ తీరంలో విశ్లేషించిన ఘనత దక్కించుకున్నవారు సిక్కుల పదవ గురువు గోవింద్‌ సింగ్‌. గుజరాత్‌లోని వాలభి ప్రాంతం వారైన భర్తృహరి తన రావణవధ కావ్యంలో (భత్తికావ్య) రామావతారం ఘనతను వర్ణించారు. గుజరాత్‌లో 14వ శతాబ్దంలోనే మొదటిసారి రామకథను వర్ణించుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి.

వీరికంటే ముందే దక్షిణాదివారు రాముడిని ఆరాధించడం ఆరంభించారు. తమిళదేశంలో అళ్వార్లు, నాయనార్లు చేసిన కృషితో 7,8 శతాబ్దాలలోనే రాముడి మహిమాన్విత జీవితం, దివ్య సందేశం బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇందుకు ఆద్యుడు కులశేఖర్‌ ఆళ్వార్‌ అని చరిత్ర చెబుతోంది. 9`12 శతాబ్దాల నడుమ ఎప్పుడో వెలువడిన కంబ రామాయణంలో ఉత్తర రామాయణ గాథ ఉంది. సంస్కృతం నుంచి ఒక భారతీయ భాషలోకి రామాయణం వెళ్లడం దీనితోనే మొదలయింది. తెలుగు, మలయాళ భాషలలోను, ఆగ్నేయ ఆసియాలోని దేశాల భాషలలోకి తరువాత ఈ కావ్యం వెళ్లింది. గోన బుద్ధారెడ్డి, మొల్ల తెలుగులో రామాయణం రాశారు. రామచరితం, ఆధ్యాత్మ రామాయణం మలయాళంలో వెలువడిన రామకథలు. మధ్యయుగాలలో జైనులు కూడా తమవైన విశ్వాసాలను జోడిరచుకుని రామాయణం రాశారు. కన్నడలో పంప రామాయణం ఎంతో ప్రసిద్ధి. దీనినే రామచరిత్ర పురాణ అని పిలుస్తారు. రాసినవారు నాగచంద్ర.

అస్సామీ కవి మాధవ్‌ కందాలి(సప్తకాండ రామాయణ/14శతాబ్దం), వంగ భాషలో కృత్తివాస ఓజా కృత్తివాస రామాయణం రాశారు. 15వ శతాబ్దంలో వచ్చిన ఈ కావ్యానికే శ్రీరామపాంచాలి అని మరొకపేరు. 16వ శతాబ్దంలో ఒడియాలో ఇద్దరు కవులు రామాయణం రాశారు. వాల్మీకి రామాయణం పేరుతో సరళాదాస్‌, దండి రామాయణ లేదా జగమోహన రామాయణ పేరుతో బలరామ్‌ దాస్‌ వాటిని రాశారు. 16వ శతాబ్దంలో మరాఠీ కవి సంత్‌ ఏక్‌నాథ్‌ భవర్త రామాయణ్‌ పేరుతో రాశారు. ఇక ఇప్పటికీ భారతదేశమంతటా వినిపించే రామచరిత మానస్‌ను తులసీదాస్‌ అవధీ భాషలో 16వ శతాబ్దంలోనే రాశారు. రామచరిత మానస్‌కు భారతదేశంలోనే కాదు, పాశ్చాత్య దేశాలలోను విశేష ఆదరణ ఉన్నది. ఈ గ్రంథాన్ని బైబిల్‌ కంటే ఎక్కువగా ఆరాధించే వారు ఉన్నారనీ, దూర విద్యావిధానం ద్వారా ఈ కావ్యాన్ని చదువుకుంటున్నారనీ బ్రిటిష్‌ పురాతన భాషల అధ్యయనకర్త రాల్ఫ్‌ థామస్‌ హచ్కిన్‌ గ్రిఫిత్‌ చెప్పారు. వేదాలను ఆంగ్లంలోకి అనువ దించినవారు ఈయనే. థాయ్‌లాండ్‌, కంబోడియా, ఇండోనేషియా, లావోస్‌, మయన్మార్‌, నేపాల్‌ దేశాలలో రామకథకు ఆదరణ ఉంది. సింగపూర్‌, మలేసియా, వియత్నాం దేశాల జీవనం మీద ఆ గాథ ప్రభావం ఇప్పటికీ ఉంది.

రాముడు కల్పితమని అత్యున్నత న్యాయ స్థానంలో దబాయించడం భారత నాగరికతను అవమానించడమే. రామసేతును తొలగించాలని అనుకోవడం అంటే  ఆ నాగరికత మీద వేటుకు సిద్ధం కావడమే. ఎక్కడ రామ మందిర నిర్మాణానికి అడ్డంకులు కల్పించినా, అడ్డుకున్నా అది దేశ ఐక్యతకు విఘాతం కలిగించే దుర్బుద్ధే. ఇదే అయోధ్య కొత్త మందిరం ఇస్తున్న సందేశం. రాముడు ఒక సాత్వికశక్తి. మనసులు గెలిచే ఉద్దేశంతో చేసే దండయాత్రకు చోదకశక్తి. ఇవాళ్టి కేంద్ర ప్రభుత్వం ఈ సాత్విక శక్తితోనే భారత్‌ను విశ్వగురువు స్థానానికి తీసుకువెళుతున్నది. కాబట్టే రాముడికీ, ఈ మట్టికీ ఉన్న బంధాన్ని నిరంతరం గుర్తు చేసుకోవడం మన కర్తవ్యం. భారతీయ నాగరికతతో మన అనుబంధాన్ని వ్యక్తం చేసుకునే మార్గమూ అదే. అయోధ్యలో భవ్యమందిరంతో ఇంత కదలిక వచ్చింది. కశ్మీరం నుంచి రామేశ్వరం వరకు ఉన్న దివ్య రామ మందిరాల గురించి చదివితే మన నాగరికత మీద, మన చరిత్ర మీద, వీటికి కేంద్ర బిందువైన మన జీవన విధానం మీద రాముడి ముద్ర ఎంతటిదో తెలుస్తుంది. రామాయణం దానిని ఎలా మలిచిందో అర్ధమవుతుంది. ఈ శ్రీరామనవమి సందర్భంగా భారత సమైక్యతకు స్ఫూరిని ఇస్తూ దేశమంతా, వివిధ కాలాలలో  నిర్మించిన ఆలయాల గురించి తెలుసుకుందాం.


రఘునాథ్‌ దేవాలయం, జమ్ము (జమ్ముకశ్మీర్‌)

ఇది ఏడు ఆలయాల ప్రాంగణం. దేని ప్రత్యేకత దానిదే. 1835`1860 మధ్య వీటి నిర్మాణం జరిగింది. కశ్మీర్‌ చరిత్రలో ప్రముఖ స్థానం ఉన్న మహారాజా గులాబ్‌ సింగ్‌ ఆయన కుమారుడు మహారాజా రణ్‌బీర్‌ సింగ్‌ ఈ ఆలయాన్ని నిర్మించారు. సరిగ్గా ప్రాంగణం మధ్యలో ఉండే గొప్ప ఆలయమే రాములవారిది. ఇదొక శిల్పాకళా అద్భుతం కూడా. గర్భగుడి, మిగిలిన ప్రదేశాలలోను రామకథలతో కూడిన చిత్రాలు, శిల్పాలు విరివిగా ఉంటాయి.  మిగిలిన ఆలయాలు కూడా కంటికి ఇంపుగా ఉంటాయి. ప్రకృతి అందాల మధ్య ఉన్న ఈ కళావేదిక భక్తులను ఎక్కువగా ఆకర్షిస్తుంది.

శ్రీరామతీర్ధం, అమృత్‌సర్‌ (పంజాబ్‌)

నిజానికి వాల్మీకి మహర్షి ఆశ్రమం ఇక్కడే ఉండేదని, ఆ స్థలంలో నిర్మించినదే ఈ రామాలయమని చెబుతారు. అంటే లవకుశులు జన్మించిన స్థలమని స్థానికుల నమ్మకం. దీనినే భగవాన్‌ వాల్మీకి తీర్థస్థల్‌ అని కూడా పిలుస్తారు. సీతాసమేతుడై రాములవారు కొలువున్నారు. ఆలయం నిండా రామాయణ గాథలతో చిత్రపటాలు ఉంటాయి.ఏటా దీపావళికే ఇక్కడ ఉత్సవం నిర్వహిస్తారు.

రామచంద్రాలయం, హరిపూర్‌ (హిమాచల్‌ప్రదేశ్‌)

చిన్న కాశీగా ఈ క్షేత్రానికి పేరు ఉంది. ఇక్కడ ఒక్కచోటే 18 పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఇందులోనే ఉంది రామచంద్రాలయం. ఇది 900 సంవత్సరాల క్రితం నిర్మించారు. అందుకే బాగా శిథిలావస్థకు చేరుకుంది. సీత, లక్ష్మణ సమేతుడై ఇక్కడ రాముడు ఉన్నాడు. లోపల శిల్పాలు, చిత్రపటాలు ఉన్నాయి. కాంగ్డా జిల్లాలోని డెహ్రా సబ్‌డివిజన్‌లో ఈ ఊరు ఉంది. సంసార్‌చంద్ర, ఆయన కుమారుడు హరీశ్‌చంద్ర ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. కాంగ్డా వంశీకులైన ఈ ఇద్దరు పాలించిన కొండరాజ్యం నందపూర్‌`గులేర్‌లోనే హరిపూర్‌ ఉంది. ఆలయం కూడా కొండ సంప్రదాయక శిల్పకళతో నిర్మించారు.

కాలారామ్‌ ఆలయం, అహ్మదాబాద్‌ (గుజరాత్‌)

పేష్వాల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి 600 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడి రాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలు నల్లని రాతితో చెక్కారు. అందుకే కాలారామ్‌ అని పిలుస్తారు. ఆలయం కూడా శిల్పకళా వైభవంతో ఉంటుంది. నాసిక్‌ ఆలయానికి ఇదే పేరు. అయితే అక్కడ రాముడు నిలబడి ఉన్న భంగిమలో ఉంటాడు. ఇక్కడ కూర్చున్న భంగిమలో ఉంటాడు.

రామాయణంతో అనుబంధం కలిగిన స్థలాలు గుజరాత్‌లో చాలా ఉన్నాయి. శబరి ధామ్‌, పంపా సరస్సు, అంజనీ కుండం, రామేశ్వర్‌, ఉన్నాయ్‌ అలాంటివే. సుబీర్‌ అనే గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే శబరి ధామ్‌ ఉంది. అక్కడ శబరిమాతగా ఆమెను కొలుస్తారు. 2004లోనే ఆ ఆలయం కట్టారు. లోపల శబరి రామలక్ష్మణులకు పళ్లు అందిస్తున్న దృశ్యమే ఉంటుంది. శబరి ధామ్‌కు కొద్దిదూరంలోనే పంపా సరస్సు ఉంది. ఇది పూర్ణా నదీతీరంలోనే ఉంది. దాంగ్‌ ప్రాంతంలో ఉన్న అంజనీ కుండమే ఆంజనేయుని జన్మస్థలి అని ఇక్కడి వారి విశ్వాసం. ఉన్నాయి అని పిలిచే చోటు నవసారి జిల్లాలో ఉంది. ఇక్కడ ఉన్న చెలమలలో నీరు వేడిగా ఉంటుంది. ఇక్కడ రాముడు యాగం చేసినప్పుడు రుత్వికుల కోరిక మేరకు తన బాణం వేసి ఈ చెలమలను సృష్టించాడని చెబుతారు. వీటిలోని నీటికి ఔషధీయ గుణాలు ఉన్నాయని చెబుతారు.

కాలారామ్‌, నాసిక్‌ (మహారాష్ట్ర)

నాసిక్‌ గోదావరి పుట్టిన స్థలం. ఇక్కడిదే కాలారామ్‌ ఆలయం. నల్లరాతితో చెక్కిన ప్రతిమను ప్రతిష్ఠించారు. నాసిక్‌ నగరంలోనే పంచవటి ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. తన అరణ్యవాసంలో రాముడు పంచవటి దగ్గర కొద్దికాలం ఉన్నారని పురాణాలు చెబుతాయి. ఈ స్థలంలో మొదట ఉన్న దారు ఆలయం స్థానంలో 1782లో సర్దార్‌ రంగారావ్‌ ఒధేకర్‌ ఈ భవ్య ఆలయాన్ని నిర్మించాడు. అప్పుడు ఆయన గోదావరిలో విసిరేసిన విగ్రహాన్ని వెతికిస్తే అది లభ్యమైంది. అదే ప్రతిష్ఠించారు. ఒక పుష్కరకాలం పాటు నిత్యం 2000 మంది శ్రామికులు ఈ నిర్మాణంలో పాల్గొన్నారు. పశ్చిమ భారతంలో ఉన్న అందమైన ఆధునిక ఆలయాలలో దీనికే ప్రథమ స్థానం ఇస్తారు. ఇక్కడ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు నల్లరాతితో చెక్కారు. అంతకు ముందు ఆలయం 7 శతాబ్దం నుంచి 11వ శతాబ్దం వరకు పాలించిన రాష్ట్రకూటుల కాలానిది.కానీ ఇక్కడ ప్రతిష్ఠించిన రాముడి ప్రతిమ 2000 ఏళ్లనాటిదని చెబుతారు. తురుష్కులు దండెత్తినప్పుడు ఒక పూజారి ఇందులోని విగ్రహం అపవిత్రం కాకుండా గోదావరిలోకి విసిరేశాడని చెబుతారు.

తులసీబాగ్‌ రామ్‌జీ సంస్థాన్‌, పుణే (మహారాష్ట్ర)

చరిత్రాత్మక బుధవార్‌పేట్‌లోని తులసీబాగ్‌లోని ఈ రామమందిరం చూడడం ఒక దివ్యానుభవంగా చెబుతారు. ఇక్కడ రాములవారికి తప్పనిసరిగా తులసీదళాలను సమర్పిస్తారు కాబట్టి ఆ పేరు వచ్చింది. ఈ పరిసరాలలో తులసి విరివిగా కనిపిస్తుంది. తులసిబాగ్‌ అంటేనే తులసివనం. ఈ ఆలయాన్ని రామ్‌జీ సంస్థాన్‌ అంటారు. ఈ ఆలయం వెనుక ఘనమైన చరిత్ర కనిపిస్తుంది. 1703లో ఔరంగజేబు ఇక్కడ బస చేశాడు. అప్పుడు ఇది జుజుబే తోట.అంటే ఎరుపు లేదా చైనా ఖర్జూరాల తోట. తరువాత ఒకటో పీష్వా మాధవరావు దీనిని అభివృద్ధి చేయించాడు. మూడో పానిపట్టు యుద్ధం తరువాత 1761లో ఇక్కడ పీష్వా కార్యాలయానికి చెందిన నారో అప్పాజీ ఖైర్‌ తులసీబాగ్‌ నిర్మాణం ఆరంభించాడు. ఈయన పుణే సుబేదార్‌.  ఎందుకంటే ఆ యుద్ధంలో మరాఠీలు ఓడిపోయారు. దానితో పూర్తి ఆత్మ రక్షణలో పడిపోయిన తన వారిలో ఆత్మ స్థయిర్యం నింపడం కోసం ఈ ఆలయ నిర్మాణం చేపట్టాడాయన. 32 ఏళ్ల తరువాత 1795లో పూర్తయింది. అప్పుడే దీనికి అయిన వ్యయం రూ. 1,36, 667. ఈ ఆలయానికి ఉన్న అద్భుతమైన శిఖరం మాత్రం 19వ శతాబ్దంలో కట్టారు. స్వాతంత్య్రోద్యమ సమయంలో ఈ ఆలయంలోనే ఉన్న సభామందిరంలో బాలగంగాధర తిలక్‌, భాలాకర్‌ భోపట్కర్‌ వంటివారు ఉపన్యాసాలు ఇచ్చారు.

 కోట రామాలయం, రాంటెక్‌ (మహారాష్ట్ర)

రాంటెక్‌ పేరు రాముడితో ముడిపడి ఉన్నదే. ఆగస్త్య ఆశ్రమంలో కొద్దికాలం ఉన్న తరువాత రాముడు నివశించిన ప్రదేశం ఇదే. రాంటెక్‌ అంటే రాముడి ప్రతిజ్ఞ. రాక్షసుల నుంచి అక్కడికి వారికి విముక్తి కలిగిస్తానని రాముడు ప్రతిజ్ఞ చేశాడు. ఇక్కడ కూడా రాముడి పాదుకలు ఉండేవని, చిరకాలం వాటిని సేవించారని చెబుతారు.

రామరాజా, ఊర్చా (మధ్యప్రదేశ్‌) 

భారత భూమిలోని ప్రతి రామాలయానికి ఒక ప్రత్యేక ఉంది. బేత్వా నది ఒడ్డున వెలసిన ఈ రాముడిని ఒక దైవంగా కాదు, ఈ ప్రాంత పరిపాలకునిగా కొలుస్తారు. అందుకే ఇది ఆలయం ఆకృతిలో కాకుండా, కొంత రాజప్రాసాదాన్ని తలపిస్తూ ఉంటుంది. బుందేలీ రాజవంశీకులు పోషించిన శిల్ప శైలితో ఈ మందిరాన్ని నిర్మించారు. బురుజులు, గుమ్మటాలతో ఇది భక్తులను విస్తుగొలుపుతూ ఉంటుంది. నిజానికి అయోధ్యలో దురాక్రమణదారుల దాడుల సమయంలో రాముడి విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించే ఉద్దేశంతో ఒక భక్తులు ఈ ఆలయాన్ని నిర్మించారని కూడా చెబుతారు. ఆ మేరకే ఇక్కడ ప్రతిష్ఠ కూడా జరిగిందని ప్రతీతి. ఊర్చా అనే ఒక భక్తురాలు అయోధ్య వెళ్లి రాముడిని బాలుని రూపంలోనే ఇక్కడకు తీసుకువచ్చిందని స్థల పురాణం. అయితే తరువాత ఇక్కడ నుంచి రాములవారు వెళ్లడానికి నిరాకరించారని స్థలపురాణం. అప్పటి నుంచి స్థానికులు ఆయనను తమ పాలకునిగా భావించుకుంటున్నారు. ఇక్కడ నిత్యం ఒక ఊరేగింపు ఉంటుంది. అచ్చంగా ఒక హిందూ పరిపాలకుడు బయటకు వచ్చినప్పుడు అనుసరించే  సంప్రదాయాలను అనుసరిస్తూ ఊరేగింపు నిర్వహిస్తారు. ఆలయంలో సేవలు కూడా ఒక చక్రవర్తికి చేసే విధంగానే ఉంటాయి.భక్తులు రాములవారికి సైనికుల రీతిలో వందనం చేస్తారు.

చిత్రకూట్‌ (మధ్యప్రదేశ్‌) 

అయోధ్య వీడిని సీతారాములు, లక్ష్మణుడు ప్రయాగ చేరుకున్నారు. అక్కడ యమునా నది దాటి చిత్రకూట్‌ వచ్చారు. అక్కడే అనసూయ ఆశ్రమంలో ఉన్నారు. ఇక్కడ రామ్‌ఘాట్‌, జానకీకుండం, హనుమాన్‌ఘాట్‌, గుప్త గోదావరి వంటి ప్రదేశాలు కూడా రామాయణంతో సంబంధం కలిగినవే.

పంచవటి (మధ్యప్రదేశ్‌) 

అయోధ్య నుంచి అరణ్యవాసానికి బయలుదేరిన రాముడు, సీత, లక్ష్మణుడు చాలా రుష్యాశ్రమాలలో కొద్దికాలం పాటు నివాసం ఉన్నారు. చివరికి నాసిక్‌ చేరుకున్నారు. అక్కడ అగస్త్య ముని ఆశ్రయంలో కొద్దికాలం ఉన్నారు. ఇక్కడ ఐదు వృక్షాలు ఉండేవి కాబట్టి పంచవటి అని పేరు వచ్చింది. ఇవి రాముడు, సీత, లక్ష్మణుడు నాటినవని చెబుతారు. రావణుడు సీతను అపహరించినది కూడా ఇక్కడే. మారీచుడు చనిపోయిన స్థలం కూడా ఇక్కడ ఉంది. ఇంత ప్రాధాన్యం ఉన్నది కాబట్టే రామాలయం కట్టారు.

 బాలక్‌రామ్‌, అయోధ్య  (ఉత్తరప్రదేశ్‌)

సాంస్కృతిక, ధార్మిక, సామాజిక విలువలు నిర్దేశించిన మేరకు నడుచుకునే భారతీయ సమాజం రామమందిర్‌ను పునర్‌ నిర్మించుకోవడం అంటే తమవైన ఆ మూలాలకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించడమేనని జనవరి 22, 2024 నాటి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం గురించి పాశ్చాత్య పత్రికలు కొన్ని వ్యాఖ్యానించాయి. ఇక్కడ రాములువారు జన్మించారని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఎంత విశ్వాసమంటే, దురాక్రమణదారులు ఆక్రమించిన ఆ నేలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఐదు వందలేళ్లు పోరాడారు. చివరికి మందిరం నిర్మించారు. బాలక్‌రామ్‌ను ప్రతిష్ఠించుకున్నారు. ఈ మందిరం ఇప్పుడు ఒక అద్భుత శిల్ప విన్నాణంగా ప్రపంచం కీర్తిస్తున్నది. భారతీయ సాంస్కృతిక, హిందూ ధార్మిక కోణం నుంచి ఇది ఒక చరిత్రాత్మక ఘట్టమని ప్రపంచ ప్రజలు భావిస్తున్నారు. ప్రపంచం ఎంత మారిపోయినా, దానితో పాటు భారతదేశం, జీవన విధానం రూపురేఖలు మార్చుకున్నా రాముడిని మాత్రం తమ ఆరాధ్యదైవంగానే ఇక్కడ చూస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ, ఆ రోజున ఆ ప్రాంగణంలో వెల్లువెత్తిన ఉద్విగ్నత అదే రుజువు చేశాయి. సాధుసంతులు, విశ్వహిందూ పరిషత్‌, రామభక్తులు ప్రారంభించిన రామమందిర నిర్మాణ ఉద్యమం భారతీయ జనతా పార్టీ ప్రవేశంతో కొత్త మలుపు తీసుకున్నది. హిందువులు నాడు కరసేవ చేశారు. తరువాత బీదాబిక్కీ, ధనిక మధ్య తరగతి అని లేకుండా అంతా విరాళాలు ఇచ్చారు. ఇవాళ హిందువుల ఆత్మ గౌరవాన్ని ప్రకటించే రమ్యహర్మ్యం అయోధ్య రామమందిరం.

రామరాజతాల, హౌరా (పశ్చిమ బెంగాల్‌)

పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నగరానికి సమీపంలో ఉన్న ఊరు రామరాజతాల. ఇక్కడ వెలసిన రామాలయం కారణంగానే ఆ పేరు వచ్చింది. ఈ ఆలయానికి మూడు శతాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడ ఇప్పటికీ ఏటా మూడు మాసాల రామదీక్ష తీసుకునే సంప్రదాయం కొనసాగుతున్నది. అయోధ్యారామ చౌదురి అనే జమిందారు ఇక్కడ రామపూజలను ఆరంభించాడు. దాని పేరు బారోవరి పూజ. రాముడి ఆదేశం మేరకే తాను ఆ పూజ ఆరంభించనట్టు ఆయన చెప్పేవారు. అది ఎంతో పేర్గాంచి ఆ ఊరికే రామరాజతాల పేరు స్థిర పడిరది.

రామచంద్ర ఆలయం, గుప్తిపారా (పశ్చిమ బెంగాల్‌)

ఇది 18వ శతాబ్దానికి చెందినది. ఈస్టిండియా కంపెనీ కాలం నుంచి ఇక్కడ రాముడికి పూజలు జరుగుతున్నాయి. ఇది టెర్రాకోటా ఆలయం.

సోనాముఖి (పశ్చిమ బెంగాల్‌)

బంకురా జిల్లాలోని సోనాముఖి గ్రామంలో రామనవమి ఘనంగా జరుపుతారు. ఆ రోజు సంచార తెగ కవి సమ్మేళనం, సంచార గాయకుల కార్యక్రమాలు కూడా జరుగుతాయి. దీనిని జయదేవ కెందౌళి మేళా అని పిలుస్తారు.

రఘునాథ మందిరం, చంద్రకోన (పశ్చిమ బెంగాల్‌)

చంద్రకోన చిన్న పట్టణం. ఇది చంద్రకేతు అనే పాలకుడు నిర్మించాడు. ఆయనే రఘునాథ్‌ (రాముడు), మాల్యానాథ్‌/లాల్‌జీ (కృష్ణుడి ఆలయాలు) ఆయన కట్టించాడు.

రామసీత మందిర్‌, కిషన్‌గంజ్‌ (పశ్చిమ బెంగాల్‌)

నాడియాలోని కిషన్‌గంజ్‌లో ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో నిర్మించారు. మేదినీపూర్‌లో కూడా ఇదే పేరుతో పురాతన దేవాలయం ఉంది. తమ్లుక్‌ రాజులు దీనిని నిర్మించారు. మేదినీపూర్‌లోనే చిరౌలీ అనే చోట కూడా మరొక రామాలయం ఉంది. 1843లో నిర్మించిన ఆలయమిది.

బెంగాల్‌లో శాక్తేయం బలంగా ఉన్నమాట నిజం. అది కూడా హిందూ ఆరాధనా విధానమే. ఎవరూ కాదనరు. అయితే గత కొద్దికాలంగా, అయోధ్య ఉద్యమం నేపథ్యంలో కావచ్చు, పశ్చిమ బెంగాల్‌లో రామనవమి ఉత్సవాలకి జనం విశేష సంఖ్యలో హాజరవుతున్నారు. అక్కడ వైష్ణవం కూడా ఒకప్పుడు పెద్ద ఎత్తున నడిచిందన్న సంగతి మరచి,  రాముడి ఆరాధన బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌ విస్తరణగా భావించింది మమతా బెనర్జీ. ఒక వెకిలి వ్యాఖ్య చేశారామె. ఉత్తర భారతదేశం నుంచి రాముడిని బీజేపీ వాళ్లు పశ్చిమ బెంగాల్‌ దిగుమతి చేస్తున్నారన్నదే ఆ వ్యాఖ్య. ఇది ఎంత అబద్ధమో అక్కడి ఆలయాల చరిత్రే చెబుతుంది.

రామ్‌చౌరా మందిర్‌, హాజీపూర్‌ (బిహార్‌)

వైశాలీ జిల్లాలోని హాజీపూర్‌ పట్టణంలో ఈ ఆలయం ఉంది. రాముడు జనక్‌పురి (ప్రస్తుతం నేపాల్‌లో ఉంది) వెళుతూ ఈ ప్రాంతంలో ఆగాడని చెబుతారు. ఇక్కడ రామ పాదచిహ్నాలు ఉంటాయి. వాటిని భక్తితో పూజిస్తారు. ఇక్కడ నవమి ఘనంగా జరుగుతుంది.

రామమందిరం, భువనేశ్వర్‌ (ఒడిశా)

కళింగ శిల్పశైలిలో నిర్మించిన అద్భుత ఆలయమిది. భువనేశ్వర్‌లో ఖారవేల్‌ నగర్‌లో ఉంది. పెద్ద శిఖరంతో, నిండా రామాయణ గాథలు చెప్పే శిల్పాలతో అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ సీతాలక్ష్మణ సమేతుడై రాముడు కొలువై ఉంటాడు.ఇక్కడ రామనవమి, వివాహ పంచమి, జన్మాష్టమి, దసరా, శివరాత్రి, పన సంక్రాంతి జరుపుతారు. ఈ ప్రాంగణంలో రామాలయంతో పాటు ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి.

 రఘునాథాలయం, ఉదుగావ్‌ (ఒడిశా)

కళింగ శిల్పంతో నిర్మించిన అద్భుత ఆలయమిది. ఉదుగావ్‌ గ్రామానికి రాముడు వచ్చాడని ప్రజలు విశ్వసిస్తారు. నయాగఢ్‌ పాలకుడు మృత్యుంజయ సింగ్‌ 1763లో దీనిని నిర్మించాడు. అత్రి మహాముని యాగం చేసిన చోటుగా దీనికి పేరుంది. ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన సీతారాములు, లక్ష్మణస్వాముల విగ్రహాలు వేప కర్రతో చేస్తారు. శిఖరం మీద ఉండే కలశం బంగారు పూత కలిగినది. అది ప్రత్యేక ఆకర్షణ.

ఒంటిమిట్ట, కడప జిల్లా (ఆంధ్రప్రదేశ్‌)

తండ్రి మాటకోసం శ్రీరామాచంద్రమూర్తి సీతాదేవి, లక్ష్మణునితో కలసి దండకారణ్యానికి బయలుదేరాడు. దారిలో రుష్యాశ్రమాలు దర్శించాడని రామాయణం చెబుతుంది. ఆ ముగ్గురి పాద స్పర్శతో పవిత్రమైనదే ఒంటిమిట్ట. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఉంది. ఇక్కడ వెలసిన రాముడిని కోదండరాముడని అంటారు. ఈ ఆలయం భారతదేశంలోనే అత్యంత కళాత్మక కట్టడమని ఫ్రెంచ్‌ పర్యాటకుడు జీన్‌ బాప్టిస్టె టామెమిర్‌ వ్యాఖ్యానించాడు. అది అతిశయోక్తి కాదు. నిజంగానే ఉలి చేసిన అద్భుతమిది. ఏకశిలా నగరమని కూడా ఖ్యాతి ఉంది. రామతీర్ధం పేరుతో ఒక కొలను ఉంది. పోతనామాత్యుడు ఇక్కడ భాగవతం రాశాడని ప్రతీతి.

శ్రీరామాచంద్రమూర్తి సీతాదేవి, లక్ష్మణునితో కలసి వచ్చినప్పుడు అక్కడే తపస్సు చేసుకుంటున్న రుషులు శ్రీరాముని ప్రార్థించారు. మహానుభావా! ఇక్కడ రాక్షసబాధ సహింపరాకున్నది. నీవిక్కడే ఉంటే మేము నిర్విఘ్నంగా తపస్సులు గావిస్తూ, సర్వదాన, జప, తపో అనుష్ఠానాదుల ఫలితమైన నీ దివ్య మంగళ విగ్రహం దర్శించుకుంటూ జన్మ సాఫల్యం చేసుకుంటాం అన్నారు. అందుకు రాముడు, ‘మహానుభావులారా! నేను చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయి. అయినా మీ శరణాగతి వ్యర్థం కాదు. హేమాద్రి మీద ఉన్న ‘యొండుశిల’ను చూడవలసింద’ని చెప్పాడు. రుషులు అక్కడికి వెళ్లి చూశారు. ఆ ఏకశిలయే శ్రీ సీతారామలక్ష్మణ మూర్తుల రూపంలో కనిపించింది. ఆనాడు మొదలు యధావిధి ఆ ప్రతిమలను రుషులు పూజించడం ఆరంభించారు. ఇక్కడ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసిన రాజు ‘‘వసుమంతుడు’’. వేల సంవత్సరాల క్రితం ఆ రాజు కట్టించిన దేవాలయమే ఇప్పుడు సీతారామలక్ష్మణులున్న గర్భగృహం. చరిత్రను బట్టి చోళరాజులు, విజయనగర ప్రభువులు ఆదరిం చారు. తళ్లికోట యుద్ధంలో విజయనగర ప్రభుత్వం కూలిన తరువాత మట్లె ప్రభువుల స్వాధీనమయింది. తరువాతి కాలాలలో శ్రీవాసుదాస స్వామి ఒంటిమిట్ట కోదండరామ దేవాలయ పునరుద్ధరణకై ఎంతో కృషిచేశారు. దేశాటనం చేసి మిత్రుల సహకారంతో సీతాకల్యాణం, పట్టాభిషేకం వంటి ఎన్నో కార్యాలను నిర్విఘ్నంగా చేయించారు. ఆయన సేవ ఎంతో గొప్పది.

రామతీర్థం, (విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌)

ఇది మూడో శతాబ్దం నాటిదని చరిత్రకారులు అంచనా వేశారు. ఇక్కడి విగ్రహాలు పాండవులు ప్రతిష్ఠించారి, వాటిపై ఉన్న వెండితాపడం వారే చేయించారని కూడా నమ్ముతారు. అంటే తమ వనవాసకాలంలో వారు ఈ దారిన వచ్చారు. ఈ ఆలయం, గ్రామం కూడా కొండల మధ్య ఉంది. ఆలయం ఉన్న ప్రాంతాన్ని బావికొండ అని పిలుస్తారు. నిరంతరం నీళ్లను ఇచ్చే చిన్న చిన్న చెలమలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అందుకే దీనికి రామతీర్ధం అని పేరు వచ్చింది. ఇక్కడ కనిపించే తాబేళ్ల మీద విష్ణునామాలు కనిపిస్తాయి. దగ్గరగా చంపా నది పారుతూ ఉంటుంది.

కోదండ రామాలయం, గొల్లలమామిడాడ (ఆంధ్రప్రదేశ్‌)

దక్షిణ భారతదేశంలోనే అందమైన రామాలయాలలో ఒకటిగా తూర్పు గోదావరి జిల్లా, గొల్లల మామిడాడ కోదండ రామాలయానికి పేరు ఉంది. ఇక్కడే సూర్యనారాయణ మూర్తి గుడి కూడా ఉంది. రామాలయాన్ని 1920 కొవ్వూరి బసివిరెడ్డి నిర్మించారు. కాకినాడకు సమీపంలో ఉండే ఈ ఊరినే గోపురాల మామిడాడ అని కూడా పిలుస్తారు. చిన్న భద్రాద్రి అని కూడా పేరుంది.

భద్రాచలం, (తెలంగాణ)

దక్షిణ అయోధ్య భద్రాద్రిలో కల్యాణ శోభ సంతరించుకుంటోంది. శ్రీరామచంద్రుడు  తన భక్తుడు భద్రమహర్షికి దర్శనమిచ్చి ఆయన విన్నపంపై ఇక్కడే  కొలువుదీరాడు. ఇతర  ఆలయాలలో శ్రీరాముడు  రెండు చేతులతో మానవాకారంలో దర్శనమిస్తే, నాలుగు చేతులతో, ఆయుధాలనూ అపసవ్యంగా ధరించి  ఉండడం ఇక్కడి ప్రత్యేకత.  ఆయా ఆలయాలలలో  శ్రీరాముడు కుడిచేతితో విల్లు, ఎడమచేతితో బాణంతో ఉంటే, భద్రాద్రిలో అందుకు  భిన్నంగా ఉంటుంది.  కుడిఎడమ చేతులలో ఉండవలసిన చక్రం, శంఖం తారుమారుగా కనిపిస్తాయి. అలాగే సీతామాత ఆయన పక్కన కాకుండా వామాంకాన్ని అధిష్ఠించి ఉంటారు. లక్ష్మణుడు కూడా శ్రీరాముడికి వామభాగంలోనే  దర్శనమిస్తాడు.

 పోకల దమ్మక్క శ్రీసీతారామచంద్రుడిని ఆరాధించి తరించిందని  ఐతిహ్యం. రామదాసుగా చరిత్రకెక్కిన  కంచర్ల గోపన్న  నిజాం  సర్కార్‌ నిధులతో ఆలయ ప్రాకారాదులు నిర్మించి, దేవదేవీరులకు ఆభరణాలు చేయించి స్వామి వారి కల్యాణోత్సవాలకు అంకురార్పణ చేశారు. తన   గేయ వాఙ్మయంతో భక్తకోటి హృదయాలలో నిశ్చలభక్తిని పాదుకొల్పారు. ఆయన అనంతరం రామభక్తుడు  తూము నరసింహ వరద రామదాసాది భక్తులు ఉత్సవ వైభవాన్ని కొనసాగించారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారికి  ఏటా మార్గశీర్షంలో ముక్కోటి (వైకుంఠ ఏకాదశి),  చైత్రం శుద్ధ నవమి నాడు  కల్యోణోత్సవం,మరునాడు పట్టాభిషేకోత్సవం జరుగుతాయి.అభిజిత్‌ లగ్నంలో జరిగే  నవమి నాటి కల్యాణోత్సవంలో స్వామివారికి  రాష్ట్ర ప్రభుత్వం పట్టువస్త్రాలు  సమర్పిస్తుంది. ఈ ఉత్సవాలకు మన్య ప్రాంతానికి చెందిన కోయ,కొండరెడ్లు, లంబాడీలు  తరలివస్తారు. గిరిజనులు శ్రీరామనవమి కల్యాణాన్ని  ‘దేవుడి పెళ్లి’ అని వ్యవహరిస్తారు.  ఆ  పెళ్లి తరువాత కొన్ని రోజులకు కానీ పెళ్లిళ్లు చేసుకోని ఆచారం కొన్నేళ్ల క్రితం దాకా ఎక్కువగా ఉండేంది. రామాయణ ఘట్టాలు తెలుగునేలపై, అందులోనూ  భద్రాద్రి పరిసరాల్లో ఎక్కువ చోటుచేసుకున్నట్లు రుజువులు ఉన్నాయి. ఆలయ సమీపంలోని పర్ణశాల ప్రాంతంలో  సీతాదేవి స్నానమాడిన  ప్రాంతంగా చెప్పే సీతవాగు, ప్రకృతి సిద్ధంగా   వేడినీళ్లు లభించే ఉష్ణగుండాలు లాంటివి కనిపిస్తాయి.  యాటపాక (జటాయుపాక), రేగుబల్లి (రెక్కపల్లి)ని   సీతాపహరణానికి పాల్పడిన రావణుడిని జటాయువు ఎదిరించిన ప్రాంతాలుగు  చెబుతారు.

శ్రీరామచంద్రస్వామి, అమ్మపల్లి (తెలంగాణ)

హైదరాబాద్‌ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మపల్లి శ్రీరామచంద్రస్వామి ఆలయం పురాతనమైనది. వేంగి రాజులు 13వ శతాబ్దంలో నిర్మించారు. అంటే వేయేళ్ల చరిత్ర ఉంది. సీతమ్మ, రాముడు, లక్ష్మణుడుÑ వీరి వెనుక మకర తోరణం ఇదంతా కలిపి ఒకే రాతి మీద చెక్కారు. ఇక్కడ పురాతన కోనేరు కూడా ఉంది.

శ్రీసీతారామస్వామి ఆలయం, గంభీరావుపేట (తెలంగాణ)

కరీంనగర్‌ జిల్లా గంభీరావుపేటలో కాకతీయ వంశీకుడు ప్రతాపరుద్రుడు 1314లో ఈ ఆలయం నిర్మించాడు. ఇది ఏడు వందల ఏళ్ల నాటిది. ఇదొక గొప్ప విశేషం కాగా, మరొక అద్భుతం ఇక్కడ ఏడు శతాబ్దాలుగా అఖండ దీపం లేదా నందా దీపంలో నిరంతరాయంగా వెలుగుతూనే ఉంది. మొదట ఈ దీపంలో చమురు కోసం పన్నులు వేశారు. తరువాత దాతలు చమురు అందిస్తున్నారు.

కోదండరామ ఆలయం, హంపి, హిరేమంగళూరు (కర్ణాటక)

కర్ణాటక ప్రాంతంలో ఆలయ సౌందర్యానికి పెట్టింది పేరుగా ఉండే ఆలయమిది. విజయనగర రాజుల శిల్పకళతో ఈ ఆలయం నిర్మించారు. దీనికి ప్రపంచ సాంస్కృతిక కట్టడంగా యునెస్కో  గుర్తింపును కూడా ఇచ్చింది. చుట్టూ శిలలతో, పక్కనే పారే తుంగభ్రదతో ఈ ఆలయం ఎంతో అందంగా ఉంటుంది. పక్కన సీతాలక్ష్మణులతో, కోదండం, బాణం పట్టిన రాముల వారిని ఇక్కడ భక్తులు దర్శించుకుంటారు. హింపి క్షేత్రమంటేనే ఒక గొప్ప చరిత్రకు సాక్ష్యంగా ఉన్న స్థలం. విజయనగర పాలకుల కాలం నాటిది. తురుష్కుల దండయాత్రలో నాశనమైన గొప్ప శిల్పకళా నిలయం. ఇదే పేరుతో చిక్‌మగళూరులోని హిరేమగళూర్‌లో కూడా మరొక ఆలయం ఉంది.

రామాపురం శ్రీరామాలయం (కేరళ)

రామాపురం కేరళలోని కొట్టాయం జిల్లాలో ఉన్నది. ఇది కూడా వేయేళ్ల నాటి ఆలయమని చెబుతారు. రాముడు చతుర్భుజునిగా కనిపిస్తాడు. రాముని సోదరులకు కూడా ఇక్కడ ఆలయాలు ఉన్నాయి. అరణ్యవాసానికి వెళుతూ రాముడు ఈ గ్రామంలో ఆగాడని, ఇక్కడి ప్రశాంతవాతావరణానికి ముగ్ధుడయ్యాడని అంటారు.

శ్రీరామ, త్రిప్రయార్‌ (కేరళ)

త్రిశ్శూర్‌ జిల్లాలోని త్రిప్రయార్‌ అనే అందమైన గ్రామంలో ఈ అద్భుత ఆలయం ఉంది. ద్రవిడ వాస్తుశైలితో దీనిని నిర్మించారు. రాముడు సీతాలక్ష్మణ, హనుమ సమేతుడై ఉంటాడు. ఈ రాముడిని త్రిప్రరాయప్పన్‌ లేదా త్రిప్రరాయర్‌ దేవర్‌ అని పిలుచుకుంటారు. ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా పూజలు చేశాడని స్థల పురాణం చెబుతుంది. కృష్ణుడి నిర్యాణం తరువాత ఈ ఆలయంలోని రాముడి విగ్రహం సముద్రంలో కలసిపోయిందని మరొక కథ. తరువాత చెట్టువా అనే ప్రాంతంలోనే సముద్రంలో ఇది దొరికింది. ఆ తరువాతే ఇక్కడి పాలకుడు వక్కాయిల్‌ కయిమాల్‌ ఆలయాన్ని నిర్మించాడు. ఆలయ శిల్పకళ, పవిత్రత, ప్రశాంతతకు తోడు పరిసరాలన్నీ కూడా అద్భుతమైనవే. కొబ్బరితోటలు, పచ్చదనంతో ఉన్న గ్రామం, అటే ప్రవహించే త్రిప్రయార్‌ నది అక్కడ ఉంటాయి. ఏటా ఒకసారి జరిగే ఉత్సవంలో అలంకరించిన ఏనుగులు ప్రత్యేక ఆకర్షణ.సంప్రదాయ వాద్యాల సమ్మేళనం కూడా ప్రత్యేకమైనదే. ఈ ఆలయంలో పూజల తరువాత ప్రత్యేక అనుభూతి పొందవచ్చునని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కేరళ ప్రాంత సంస్కృతిని నిలుపుతున్న ఆలయంగా దీనిని గౌరవిస్తారు. ఇక్కడ చతుర్భుజుడిగా రాముడు దర్శనమిస్తాడు. శంఖుచక్రాలు, విల్లు, పూలదండ ఆ చేతులలో ఉంటాయి.

తిరువగండ శ్రీరామస్వామి (కేరళ)

దీనిని ఇత్తడి పగోడా అని కూడా పిలుస్తారు. ఇది రామాలయమే. కేరళలో తలస్సేరిలోని రామస్వామి ఆలయంతో పాటు త్రినయాంకుడమ్‌  (వైకోం), త్రిప్రయార్‌, తిరువిల్లుమాల, కడలూరు కేరళలో రాముడికి అంకితం చేసిన ఆలయాలు. తిరువగండ శ్రీరామస్వామిని భక్తులు పెరుమాళ్‌ అని పిలుస్తారు. నాలుగు చేతులతో, అభయ ముద్రతో ఉంటాడు రాముడు.

రామస్వామి ఆలయం, కుంభకోణం (తమిళనాడు)

భారతదేశంలో ఉన్న ప్రఖ్యాత రామాలయాలలో ఇదొకటి. తంజావూరు నాయకరాజులు 16వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించారు. ఇందులో ప్రతిష్టించిన విగ్రహాలు దారుసరామ్‌ అనే చోట ఒక చెరువులో దొరికాయని చెబుతారు. రాముడు, సీత కూర్చుని ఉన్నట్టు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు నిలిచి ఉన్నట్టు ఇక్కడ విగ్రహాలు తయారు చేశారు. యథాప్రకారం హనుమ మొక్కుతున్న కనిపిస్తాడు. 64 స్తంభాలతో నిర్మించిన మందిరం ఇందులో ప్రత్యేకం.  గోపురం మీద రామాయణ దృశ్యాలు చెక్కారు.

విజయరాఘవ పెరుమాళ్‌ గుడి, కంచి (తమిళనాడు)

రామాయణంలో కనిపించే ముఖ్య పాత్ర జటాయుతో ముడిపడి ఉన్న ఆలయం విజయరాఘవ పెరుమాళ్‌ ఆలయం. ఇది ఆలయాలకు నిలయమైన కాంచీపురంలో ఉంది. సీతమ్మను రక్షించేందుకు రావణుడితో యుద్ధం చేసిన జటాయువు తీవ్రంగా గాయపడి, ఇక్కడే పడి మరణించిందని గాథ. జటాయువుకు రాముడు ఇక్కడే మోక్షం ప్రసాదించాడు. ఇక్కడి ఆలయంలో అదే విధంగా రాములువారు దర్శనమిస్తారు. అయితే చతుర్భుజుడైన రాముడు కనిపిస్తాడు. ఆయన చేతులలోనే జటాయువు ఉంటుంది. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు కూడా పక్కన కొలువై ఉన్నారు. ఆధునిక కాలంలోను దీనికి ఒక ప్రత్యేక వచ్చింది. శ్రీనివాస రామానుజన్‌ అక్షరాలు దిద్దుకున్నది ఈ ఆలయంలోనే.

 ఇరి కథా రామర్‌, మదురాంతకం (తమిళనాడు)

ఈ ఆలయం పలవులు నిర్మించారు. అంటే 1600 సంవత్సరాల నాటిది. ఈ ఆలయానికి చోళరాజులు కూడా భూరి విరాళాలు, కానుకలు ఇచ్చినట్టు ఆలయంలో ఉన్న శిలాఫలకం వెల్లడిస్తున్నది. ఎనిమిది అడుగుల రాములవారి మూలవిరాట్‌ తూర్పు ముఖంగా చూస్తుంటుంది. మదురాంతకం సరస్సు ఒడ్డునే ఈ గుడి కట్టారు. ఈ ఆలయంలోనే కరుణాకరమూర్తి ప్రతిమ ఉంది.

కొతాంద రామస్వామి ఆలయం, ముడికొందన్‌ (తమిళనాడు)

ఇది వేయేళ్ల క్రితం నాటి ఆలయం. ఈ గుడి ఉన్న గ్రామం మగుదవర్ధన్‌పురి. ముడికొండన్‌ అంటే అర్ధం పట్టాభిషేకం. తాను అయోధ్య పట్టాభిషిక్తుడిగా రాముడు ఇక్కడ భరద్వార మహర్షికి దర్శనమిచ్చాడు. అందుకే గ్రామానికి ఆ పేరు వచ్చింది. లంకకు వెళ్లినప్పుడు, తిరిగి వెళ్లిపోతున్నప్పుడు కూడా రాముడు ఈ ఊరు వచ్చాడని చెప్పుకుంటారు. భరద్వాజ మహర్షి ఆతిథ్యం స్వీకరించడానికి ముందు రంగనాథుని ప్రతిష్ఠించమని కోరగా భరద్వాజుడు ఆ కోరిక తీర్చాడు.

వడువూర్‌ శ్రీకోదండరామ ఆలయం (తమిళనాడు)

ఇది కూడా వేయి సంవత్సరాలు చరిత్ర కలిగిన రామాలయమే. కావేరి ఉపనదికి సమీపంగా ఉన్న ఈ క్షేత్రానికి దక్షిణ అయోధ్య అన్న కీర్తి ఉంది.

శ్రీయోగరామర్‌ ఆలయం, నెడుంగునమ్‌ (తమిళనాడు)

వేయేళ్ల చరిత్ర కలిగిన ఆలయం. గుండె మీద చేయివేసుకుని చిన్ముద్రలో కూర్చున్న భంగిమలో ఇక్కడ విగ్రహం ఉంటుంది. కళ్లు మూసుకుని ఉంటాడు. చేతిలో ఎలాంటి ఆయుధం ఉండదు. పక్కనే సీత చేతిలో కమలం ఉంటుంది. సుకబ్రహ్మ మహర్షి తపస్సు చేయడం వల్ల రాముడు ఇక్కడకు వచ్చాడని చెబుతారు. ఈ ఆలయంలో రెండు గోపురాలు ఉంటాయి. రెండోది సుకబ్రహ్మకు గుర్తుగా ఉంటుంది.

రామేశ్వరం.. రామనాథస్వామి (తమిళనాడు)

దివంగత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్‌ కలాం రచన ‘వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌’ చదివితే రామేశ్వరం ఆలయం ఆలయం, అందులోని శిల్పకళ, అక్కడి సముద్రతీరంలో కొంగలు ఎగురుతూ ఉండే సుందరదృశ్యాలు కళ్లకు కడతాయి. తమిళనాడులోని రామనాథపురం ప్రాంతంలో పంబన్‌ దీవిలో రామేశ్వరం ఆలయం ఉంది. దీనినే రామనాథస్వామి ఆలయమని కూడా పిలుస్తారు.ఈ క్షేత్రానికి అరుదైన విశేషాలు ఉన్నాయి. ఇది వైష్ణవక్షేత్రం, శైవక్షేత్రం కూడా. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఇదీ ఒకటి. బదరీనాథ్‌, ద్వారక, పూరీ జగన్నాథ్‌ క్షేత్రంతో పాటు రామేశ్వరాన్ని కలిపి చార్‌ధామ్‌గా వ్యవహరిస్తూ ఉంటారు.

ఈ ఆలయానికీ, శ్రీరాముడికీ ప్రత్యక్ష సంబంధం ఉందని స్థలపురాణాలు చెబుతాయి. ఇక్కడి ఆలయంలోని శివలింగాన్ని రాములవారే స్వయంగా ప్రతిష్ఠించాడని ప్రతీతి. అంతటి శిల్ప సంపదతో, విస్తృత దేవాలయ ప్రాంగణాన్ని నిర్మించింది మాత్రం తరువాతి కాలపు పాలకులే. ఇక్కడ ఆలయంలోని శివలింగ ప్రతిష్ఠకు వెనుక ఉన్న పురాణగాథ లోతైనది. సీతమ్మను తిరిగి తీసుకురావడానికి వానరసేనతో కలసి లక్ష్మణ సమేతుడై రాముడు స్వర్ణలంక మీద దండయాత్రకు వెళ్లాడు. మహాయుద్ధంలో రావణబ్రహ్మను రాముడు వధించాడు. తిరిగి అయోధ్యకు ప్రయాణమై వెళుతున్నప్పుడు ఇక్కడ రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. కారణం` ఆ యుద్ధంలో రావణబ్రహ్మను చంపడం వల్ల వచ్చిన బ్రహ్మహత్యా దోష నివారణకే. రావణుడు పండితుడైన బ్రాహ్మణుడని రామాయణం చెబుతుంది. తన మీద పరమేశ్వరుడికి ఆగ్రహం రాకుండా ఉండేందుకు రాముడు ఈ పుణ్యకార్యం నిర్వహించాడు. దీనికి అగస్త్య మహర్షి సూచన కూడా ఉంది. లింగ ప్రతిష్ఠకు సంబంధించిన మరొక ఉప కథ కూడా ఉంది. ఇంతటి మహత్తర కార్యక్రమం కోసం శివలింగాన్ని తేవడానికి హనుమను రాముడు కైలాసానికి పంపించాడు. అయితే అనుకున్న సమయానికి బహుశా ముహూర్తానికి హనుమ అక్కడకి తిరిగి రాలేదు. దీనితో సీతమ్మ చేసిన చిరు సైకత లింగాన్నే ప్రతిష్ఠించారు.  తరువాత హనుమ తెచ్చిన నల్లటి భారీ శివలింగాన్ని కూడా రాముడు ప్రతిష్ఠించాడు.

ఇక్కడ ఉన్న పురాతన ఆలయాన్ని శ్రీలంక పాలకుడు పరాక్రమబాహు 12 శతాబ్దంలో విస్తరించాడని చరిత్ర చెబుతోంది. ఇందుకు సంబంధించిన ఒక శిలాశాసనం ఆలయంలో ఉంది. తరువాత పాండ్యులు, నాయకరాజులు, మధురై పాలకులు మరింత వృద్ధి చేశారు.

రామేశ్వరం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది` ఆలయ ప్రాంగణంలోని 64 బావుల తీర్థాలు. వీటిలో 14 బావుల గురించి స్కందపురాణం ప్రస్తావించింది. అంత ప్రాముఖ్యం ఉంది వీటికి. ఇవన్నీ ఒకే ప్రాంగణంలో ఉన్నప్పుటికి దేని రుచి దానిదే. ప్రతి బావి తీర్ధానికి కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. లోపలి శివలింగాన్ని దర్శించుకునే ముందే ఈ బావుల తీర్థంతో భక్తులు స్నానమాచరిస్తారు. అంటే ఒక పవిత్ర మనసుతో, క్షాళన చెందిన దేహంతో లోపలికి వెళతారని విశ్వాసం. ఇందులో మొత్తం 3850 అడుగుల పొడవైన మూడు నడవాలు ఉంటాయి.

తమిళనాడుకు రాముడికీ సంబంధమే లేదని దబాయించే ద్రవిడ పార్టీలకు కళ్లు తెరిపించగల స్థాయిలో అక్కడ రామాలయాలు ఉన్నాయి. ఎక్కువ ఆలయాలు వందలాది సంవత్సరాల క్రితానివే. సతుర్భుజ రామర్‌ ఆలయం (పోన్‌ పధార్‌ కూడమ్‌), వల్వీల్‌ రామర్‌ కోవిల్‌ (తిరు పుల్లభూతంగుడి) ఇక్కడే ఉన్నాయి. రాముడికే ప్రత్యేకంగా పంచ రామక్షేత్రాలు కూడా ఇక్కడే ఉన్నాయి.

About Author

By editor

Twitter
YOUTUBE