సంపాదకీయం

శాలివాహన 1946 శ్రీ క్రోధి ఛైత్ర  శుద్ద సప్తమి – 15 ఏప్రిల్‌ 2024, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


భారత స్వాతంత్య్రోద్యమానికి సంబంధించిన ఏ చారిత్రక వాస్తవాన్న యినా కాంగ్రెస్‌ పార్టీ ఏనాడైనా హుందాగా అంగీకరించిందా? లేదా, కాంగ్రెస్‌ మార్కు చరిత్ర నిగ్గు తేలిన, సత్యనిష్ఠతో నమోదైన నిజమని తేలిందా? ఏ సత్యాన్ని అయినా అది చరిత్ర పుస్తకంలోకి చేరనిచ్చిందా? జనంలోకి వెళ్లనిచ్చిందా? సకల సదుపాయాల ఆగాఖాన్‌ భవన్‌లో నిర్బంధాలూ, హౌస్‌ అరెస్టులూ తప్ప తెలియని ఆ సంస్థ నేతలు కాలాపానీలో ఘోరమైన శిక్షలు అనుభవించి జీవితాలను దేశం కోసం అర్పించిన ధన్యులను గౌరవించే సంస్కారం ఏనాడూ చూపలేదు. స్వాతంత్య్రం కోసం ఉరికంబాలను ఎక్కిన వారిని స్మరించుకోవాలని ఏ క్షణంలోనూ భావించలేదు. కాంగ్రెస్‌ దృష్టిలో స్వాతంత్య్ర సమరంలోని ఏ ఘట్టమైనా నెహ్రూ కుటుంబం చుట్టూ తిరిగినదిగానే నమోదు కావాలి. స్వతంత్ర భారత చరిత్ర అయితే నెహ్రూ`గాంధీ కుటుంబం చుట్టూ పరిభ్రమించాలి. కాబట్టి, ‘వాస్తవంగా చెప్పాలంటే భారతావని తొలి ప్రధాని నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌’ అని దేశంలో ఎవరైనా అంటే కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సహిస్తుంది? ఎలా భరిస్తుంది? ఇప్పుడు ఆ పార్టీ, దానితో పాటు వామపక్షం, ఉదారవాదం కలసి రోడ్డెక్కి పెడుతున్న శోకాలు అందుకు సంబంధించినవే.

ప్రఖ్యాత నటి, మండీ (హిమాచల్‌ ప్రదేశ్‌) లోక్‌సభ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ పడుతున్న కంగనా రనౌత్‌ ఒక చర్చలో ప్రస్తావించిన విషయమిది. ఈ దేశానికి తొలి ప్రధాని నేతాజీయేనని తాను ఒక వ్యాసంలో చదివానని ఆమె అన్నారు. అంతే, తల్లి కుక్క మొరిగితే పిల్ల కుక్కలన్నీ ఆలస్యం లేకుండా అందుకున్నట్టు కాంగ్రెస్‌ బాకాలు, ఉదారవాదులు, పాఠాలు మొదలుపెట్టారు.

 ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి. బోస్‌ భారత తొలి ప్రధాని అంటూ వ్యాఖ్యానించిన కంగన గురించి కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి శ్రీప్రియా శ్రీనేతే ఒక స్త్రీ అయి ఉండి అత్యంత నీచంగా మాట జారారు. అప్పుడు కనీసం ఖండిరచడానికి నోరు రాని బధిరులు ఇప్పుడు మాత్రం కంగనను విమర్శించడానికి ఉరకలేస్తున్నారు. అలాగే కమ్యూనిస్టులనే ఒక నీచ జాతి బోస్‌ను పలకడానికి కూడా వీలుకాని రీతిలో నిన్న మొన్నటి దాకా దూషించింది. ఆ ఘోర దూషణ మీద ఏనాడూ నోరు మెదపని బోస్‌ ‘వారసులు’ ఇప్పుడు మాత్రం కంగన వ్యాఖ్యలను ‘సరి దిద్దే’ పనికి సిగ్గు లేకుండా సిద్ధమైపోయారు. నేతాజీ 1943లో ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేసినా, తాను ప్రధానిని అని ప్రకటించుకోలేదట. ఇది బోస్‌ వారసుడి దిద్దుబాటు వ్యాఖ్య. ఈ దేశ చరిత్ర, నాగరికతలను సర్వ భ్రష్ఠం చేసిన నెహ్రూను కాపాడడానికి బోస్‌ గొప్పతనాన్ని ఇంకా ఇంకా దిగజార్చాలా వీళ్లంతా? సుభాషిణి అలీ అనే సీపీఎం నాయకురాలైతే బోస్‌ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకుడు తప్ప, స్వతంత్ర భారత ప్రభుత్వానికి కాదని కంగన గుర్తించాలని దిక్కుమాలిన వాదన తెచ్చారు. ఆ మధ్య మణిపూర్‌ స్త్రీల నగ్న ఊరేగింపు నేరాన్ని స్వయంసేవకుల మీదకు నెట్టే ప్రయత్నంలో బొక్క బోర్లాపడి, క్షమాపణలు చెప్పి చెంపలు వేసుకున్న వామపక్ష జ్ఞాని ఈవిడే. మేధాశక్తి మీద గుత్తాధిపత్యం ప్రకటించుకునే కమ్యూనిస్టులు ఇలాంటి నేతలను ఎలా భరించారో అర్థమే కాదు. అసలు, స్వతంత్ర భారతదేశంలో కూడా నెహ్రూను మొదట ప్రధాని అనలేదు. కార్యదర్శి అన్నారు. ప్రావిన్సెస్‌ ప్రభుత్వాధిపతులను కూడా ప్రధాని అనే పిలిచారు. బీఆర్‌ఎస్‌ ఇంకా చచ్చిపోలేదని గుర్తు చేయడానికి కాబోలు, దాని యువరాజు కేటీఆర్‌ కూడా కంగన వ్యాఖ్యలని తప్పు పట్టారట. ఇలాంటి జ్ఞానగుళికలని చానెళ్ల ద్వారా కంగన ఇంకొన్ని వెదజల్లితే తరిస్తామని శివసేన (ఉద్ధవ్‌) ఎంపీ ప్రియాంక చతుర్వేది హద్దులు లేని అజ్ఞానాన్ని ప్రదర్శించారు. అయితే బోస్‌ జీవితచరిత్ర రాసిన చంద్రచూర్‌ ఘోష్‌, అసలు మీకు బోస్‌ ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలియనట్టే ఉందని చెంప చెళ్లుమనిపించారు. బోస్‌ ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేయడం నిజం, బ్రిటిష్‌ వ్యతిరేకులే కావచ్చు, 9 దేశాలు దానిని గుర్తించిన మాటా నిజం. పెద్దల సభలో చెలరేగిపోయే ప్రియాంక చతర్వేదీలు కుళ్లు రాజకీయ వ్యాఖ్యలలో మునిగి తేలే కంటే కొద్దిగా జ్ఞాన సముపార్జన వైపు మళ్లితే మంచిది. లేకపోతే నోరు మూసుకుని కూర్చుంటే మంచిది. ఆ విధంగా అయినా పెద్దల సభ గౌరవం కాపాడినవారు కాగలరు. ఇక ఇర్ఫాన్‌ హబీబ్‌ అనే దగాకోరు, మతోన్మాద చరిత్రకారుడి వ్యాఖ్య (బహుశా గతంలోనిది) మరీ దారుణం. నెహ్రూకి సరే, బోస్‌కి ప్రథమ ప్రధాని గౌరవం అసలే దక్కకూడదన్న దుగ్ధ కాబోలు, నిజంగా అయితే భారత తొలి ప్రవాస ప్రభుత్వం 1915 ఏర్పడిరదంటారాయన. రాజా మహేంద్ర ప్రతాప్‌ కాబూల్‌లో ప్రవాస భారత ప్రభుత్వం ఏర్పాటు చేశాడనీ, దానికి ప్రధాని మౌల్వీ బర్కతుల్లా అనీ హబీబ్‌ ఉవాచ. ఆ ప్రవాస ప్రభుత్వం కాగితాలకే పరిమితమైన సంగతి అని హబీబ్‌ తెలుసుకుంటే మంచిదని బోస్‌ చరిత్ర రచయితలలో మరొకరు అంజు ధర్‌ ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు అక్టోబర్‌ 21, 1943న బోస్‌ ప్రకటించారు. సింగపూర్‌లో ప్రవాస ప్రభుత్వం ఏర్పడిరది. పని చేసింది. కరెన్సీ తెచ్చింది. బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది.

ప్రవాస ప్రభుత్వాలు ప్రపంచ చరిత్రలో భాగం. మొదటి ప్రపంచ యుద్ధం వేళ బెల్జియం, చైనా కోసం డిసెంబర్‌ 7,1949న, ఆఖరికి 2011లో సిరియా కోసం ప్రవాస ప్రభుత్వాలు ఏర్పడినాయి. ఇలాంటివే ఇంకా ఎన్నో! విదేశీయులతో యుద్ధాలు, అంతర్యుద్ధాలు, తిరుగుబాట్లు సమయంలో ఇవి ఏర్పాటవుతూ ఉంటాయి. తన వ్యాఖ్యతో చెలరేగిన దుమారానికి కంగన ఇచ్చిన సమాధానమే ఈ సంపాదకీయానికి మంచి ముగింపు. ‘ఈ వ్యాఖ్య భారత మొదటి ప్రధాని ఎవరు అన్న అంశం మీద దేశంలో బోలెండత చర్చకు అవకాశం ఇచ్చింది. సంతోషం.’

About Author

By editor

Twitter
YOUTUBE