దేశ ఆధ్యాత్మిక చరిత్రలో మేలిమలుపు తెచ్చిన శ్రీ శోభకృత్ నామ సంవత్సరానికి ఆత్మీయ వీడ్కోలు. శతాబ్దాల అయోధ్య భవ్యమందిర కలను సాకారం చేసిన వత్సరంగా చిరస్థాయిగా నిలిచిపోతుంది. ‘శార్వరి’లో (ఆంగ్ల పంచాగం ప్రకారం ఆగస్టు3,2020)లో భూమిపూజ నిర్వహించగా శోభకృత్ (జనవరి 22, 2024)లో బాలరాముడు ప్రతిష్ఠుతుడయ్యాడు. శోభకృత్ నుంచి నాలుగేళ్లు వెనక్కి వెళితే, చేదు, తీపి అనుభవాల కలబోత సాక్షాత్కరిస్తుంది. ‘వికారి’ (2019)నామ సంవత్సరం పేరుకు తగినట్లే సకల వికారాలను విస్తృతస్థాయిలో ప్రదర్శించింది. ఆ ఏడాది ఉత్తరార్థంలో పొరుగు దేశంలో పుట్టిన సూక్ష్మాతి సూక్ష్మక్రిమి (కొవిడ్-10) ప్రపంచాన్నే గడగడలాడిరచింది. మరుసటి సంవత్సరం ‘శార్వరి’ (2020). అంటే చీకటి. కొవిడ్ తీవ్రరూపం దాల్చి జనజీవనాన్ని అంధకారమయం చేసింది. వ్యవస్థలు కుదేలయ్యాయి. ఒక్క మాటలో… బతుకులే తలకిందులయ్యాయి. ‘ప్లవ’ (2021) అంటే దాటడం అని, ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తుందని భావం. ఆ ప్రకారమే కొవిడ్‌తో సతమతమైన జనజీవనాన్ని చిగురింప చేసి కొంత ఊరటనిచ్చింది. శుభకృత్’ (2022) కొవిడ్ పూర్వ పరిస్థితులకు బాటలు వేసింది. ఇప్పుడు నిష్క్రమిస్తున్న ‘శోభకృత్’ (2023) శుభాలు నింపింది. దాని వారసుడుగా వస్తున్న ‘క్రో`ధి’ పేరులా కాకుండా లోకహితకారిణి అవుతుందని అభిలషిస్తూ స్వాగతం పలుకుదాం.
సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన పుణ్య కాలం వసంత రుతువుకు మొదటి రోజు. అదే ఉగాది పర్వదినం.విధాత చైత్ర శుద్ధ పాడ్యమిని సృష్టి ఆరంభానికి సుముహూర్తంగా ఎంచుకున్నాడని ‘నిర్ణయ సింధు’ పేర్కొంటోంది. ఈ తిథి నాడే. శ్రీమన్నారాయణుడు మత్స్యావతారం ధరించి సోమకుడిని పరిమార్చి వేదాలను రక్షించిరోజు, శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు ఉగాదేనట. చైత్ర శుద్ధ పాడ్యమి నాటికి ద్వాపర యుగం పూర్తయి కలియుగం ప్రారంభమైందని, కృష్ణావతారం ముగిసిన నాడే కలి ప్రవేశించినందున ఉగాదిని జరుపుకోవడం ఆచారంగా మారిందని చెబుతారు.
ప్రళయం తరువాత చైత్ర శుద్ధ పాడ్యమి నాడు విధాత సృష్టిని ఆరంభించారని (చైత్రమాసి జగద్బ్ర హ్మససర్జ ప్రథమేహని…) ‘హేమాద్రి’ అనే ధర్మశాస్త్రం పేర్కొంటోంది. కృతయుగం వైశాఖ శుద్ధ విదియ నాడు, త్రేతాయుగం కార్తిక శుద్ధ నవమినాడు, ద్వాపరయుగం శ్రావణ శుద్ధ త్రయోదశి నాడు, ఈ (కలి)యుగం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభ మయ్యాయని విష్ణుపురాణ భారతాదులు చెబుతున్నాయి. అదే ‘ఉగాది’. ‘ఉ’ అంటే నక్షత్రం, ‘గ’ అంటే గమనం. ‘ఉగ’ అంటే.. నక్షత్రం గమనం. ‘ఉగాది’ అంటే నక్షత్ర గమనాన్ని లెక్కింపు మొదలు పెట్టిన రోజు అని కొందరి అభిప్రాయం. కొన్ని పండుగల విషయంలో తిథి, నక్షత్రాలే ప్రధాన పాత్ర వహిస్తాయని పంచాంగకర్తలు చెబుతారు, ధర్మ శాస్త్రాలూ పేర్కొంటున్నాయి. ఉదాహరణకు ఉగాదినే తీసుకుంటే… సూర్యోదయానికి పాడ్యమి ఉంటేనే సంవత్సరాది. మధ్యాహ్నానికి చవితి, నవమి తిథులు ఉంటేనే వినాయక చవితి, శ్రీరామనవమి. అర్థరాత్రి వేళకు అష్టమి తిథి ఉంటేనే కృష్ణాష్టమి.
ఈ పండుగను ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాలలో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ రోజు (ఉగాది) నూతన సంవత్సరానికి ఆరంభం కనుక ‘సంవత్స రాది’అనీ వ్యవహరిస్తారు. ఇది తెలుగు, కన్నడ, మరాఠీయులకు తొలిపండుగ. చాంద్రమానం రీత్యా ఇది సర్వప్రథమైన రోజు. రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో ఉగాదిగా, మహారాష్ట్రలో ‘గుడి పాడ్వా’గా, తమిళులు ‘పుత్తాండ’గా, మలయాళీలు ‘విషు’, బెంగాలీలు ‘పొయ్‌లా బ్కెశాఖ్, సిక్కులు ‘వైశాఖీ’ అనీ పేరుతో…ఇలా వివిధ ప్రాంతాల వారు సంవత్సరాదిని జరుపుకుంటారు. రాష్ట్రాలను బట్టి పండుగ పేర్లు, ప్రాంతాలను బట్టి దానిని జరుపు కునే తీరు వేర్వేరుగా ఉండవచ్చు గానీ, నూతన సంవత్సరం ఆరంభం మాత్రం ఒక్కటే.
సృష్టి కారకుడు బ్రహ్మను మొదటగా, తరువాత షోడశోపచారాలతో ఇష్ట దేవతారా ధన చేసి ఈ ప్రసాదాన్ని స్వీకరించాలి. దీనివల్ల సర్వ అరిష్టాలు, గ్రహదోషాలు, ప్రమాదాలు, అనారోగ్యాలు, సమస్త ఇబ్బందులు తొలగి దీర్ఘాయుష్షు, వజ్రకాయం లభిస్తాయని పూర్యాచార్యులు పేర్కొన్నారు.
‘త్వామష్ఠ శోక నరాభీష్ట మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం మామశోకం సదాకురు’.. (మధుమాసంలో పుట్టినటువంటి, శోక బాధలను దరిచేరకుండా చేసే ఓ నింబ కుసుమమా నన్ను ఎల్లప్పుడూ శోకరహితుడుగా చేయి) శ్లోకం పఠిస్తూ ఉగాది ప్రసాదాన్ని స్వీకరించాలంటారు. ఇతర పండుగలు, వ్రతాల మాదిరిగా ఉగాది ఏదో ఒక దేవుడినో, దేవతనో ఉద్దేశించి చేసుకునేది కాదు, ఇష్ట దేవత(ల)ను అర్చించి జరుపు కుంటారు. ఈ సందర్భంగా అవకాశం ఉంటే ఆవునేతితో దీపారాధన చేసి, హారతి ఇవ్వాలని పండితులు చెబుతారు. సంవత్సరాదినాడు కలశస్థాపన చేసి నాలుగు రోజులపాటు దేవీపూజలు చేయడం వలన అపమృత్యుభయం ఉండదని ‘ధర్మసింధువు’ తెలియచేస్తోంది.
ఆ రోజే (చైత్ర శుద్ద పాడ్యమి) వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి.ఈ సమయంలో శ్రీమద్రామాయణం, సుందరకాండ పారాయణం, అఖండ రామనామ జపాన్ని నిర్వహిస్తారు. కొత్త సంవత్సరంలో భగవదనుగ్రహంతో సర్వ శుభాలు కలగాలన్న ఆకాంక్షే ఈ పర్వదిన ప్రధాన ఉద్దేశ్యం. ఈ సమయంలో శక్తిస్వరూపిణి లలితా పరమేశ్వరిని ఆరాధించాలని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ నవరాత్రుల చివరినాడు శ్రీరామచంద్రుడు జన్మించా డని, ఈ కాలంలో విష్ణువు లేదా దుర్గతో పాటు శ్రీరాముడు, హనుమను ఆరాధిస్తే మంచిదని పురాణాలు పేర్కొంటున్నాయి. రామలక్ష్మణులు నవరాత్రులలో అమ్మవారిని అర్చించారని చెబుతారు.
ఆరు రుచులు అనుభూతుల ప్రతీకలు..
జీవితమంటే సంతోషానందాలు, శుభశోభానాలే కాదు. సుఖదుఃఖాలు, కష్టనష్టాలు,లాభనష్టాల వంటి అనుకూల, ప్రతికూలాల సమాహారం. ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు అదే చెబుతున్నాయి. తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు… రుచులు జీవితంలోని సంతోషం, బాధ, ఉత్సాహం, నేర్పు, సహనం, సవాళ్లకు సంకేతాలు. ఏడాది పొడవున అనుభవంలోకి వచ్చే వాటిని సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఇస్తున్నాయి.
‘శతాయర్ వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ
సర్వారిష్ట వినాశాయ నింబకుసుమ భక్షణమ్’
వేప పూత పచ్చడిని ఆరగించడమే సకల అరిష్టాలకు సరైన విరుగుడు’ అని శాస్త్రవచనం.
పంచాగ శ్రవణంతో వికాసం
కాలం భగవత్ స్వరూపమైతే దాని నడకను వివరించడమే పంచాగ పఠన లక్షణమని, ఉగాది నాడు పంచాగం వినాలని పెద్దలు చెబుతారు. ఏడాది పొడవును ఆచరించే శ్రౌతస్మార్తాది కర్మలన్నిటి కాలవిశేషాలను తెలియచెప్పేది ‘పంచాగం’ కనుక దానిని అర్చించి, భగవత్ సన్నిధి (ఆలయాలలో)లో వినిపించాలని పెద్దలు చెబుతారు. పంచాగం అంటే కేవలం తిథులు, వర్జ్యాల లాంటి నమ్మకాలు కావు. అప్రమత్తం చేయడం కూడా. కొన్ని తిథులను దుష్టమైనవిగా భావిస్తూ భయపడాలని కాదు. ఏడాది పొడవున ఎదురుకాగల పరిస్థితులు, సమస్యలను అంచనావేసి, వాటిని అధిగమించేందుకు అనుస రించవలసిన విధానాలు, పట్టువిడుపుల గురించి ముందుగానే హెచ్చరించడం లాంటిది.
తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదింటి కలయికే ‘పంచాగం’. వీటిని దేవతా స్వరూపాలుగా సంభావించి నిత్యం స్మరించుకోవడం కాలదేవతాశక్తిని ఆరాధించడమేనని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. ‘శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం/గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం/ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం/నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యతామ్’ (పంచాంగ శ్రవణం వలన సంపదలు కలిగి సద్గుణాలు అలవడ తాయి. శత్రువులు నశిస్తారు. చెడుకలలు తొలగి పోతాయి. గంగాస్నాన, గోదాన ఫలితం లభిస్తుంది. ఆయుష్షు పెరుగుతుంది. సంతానం కలుగుతుంది. అంటే వంశాభివృద్ధి సంప్రాప్తిస్తుంది) అని ‘పంచాగం’ శ్రవణం విశిష్టతను శ్లాఘించారు. చంద్రుడి గమనం ద్వారా తిథి, నక్షత్రాలను తెలుసుకోవడాన్ని చాంద్రమానం అంటారు. తెలుగువారు దీనినే పాటిస్తారు.
రాశి ఫలాలకు అనుగుణంగా కార్యక్రమాలు రూపొందించుకుంటూ గెలుపుదారిలో సాగిపోవాల న్నది పంచాంగ శ్రవణంలోని అంతస్సూత్రం. గ్రహ సంచారం గందరగోళంగా ఉన్నప్పుడు తగిన పరిహారాలను పంచాగకర్తలు సూచిస్తారు.పంచాగం అంటే రాజపూజ్యాలు, ఆదాయ వ్యయాలను తెలుసుకొని సంబర పడడమో,బెంబేలెత్తి పోవడమో కాదు. అనారోగ్య స్థితిలో ఆహార నియమాలు పాటించినట్లే, గ్రహాలు అనుకూలించనప్పుడు (తిరుగు బాటు చేసేటప్పుడు) అనుసరణీయ తీరును సూచిస్తుంది. ఈ పట్టువిడుపుల గురించి హెచ్చ రించడమే పంచాంగ పఠనంలోని అంతరార్థం.
ఒకనాడు ప్రత్యేకించి రెడ్డి, విజయనగరం రాజుల కాలంలో తెలుగుగడ్డపై ఉగాది వేడుకలు ఘనంగా జరిగేవని చరిత్ర చెబుతోంది. ఇవీ వర్తమానంలో ఆలయాలకే పరిమితమయ్యాయి. ఈ పర్వదినం నాడు శ్రేయోభిలాషులను, వృత్తి ప్రదాతలను, అధికారులను కలిసి అభినందించు కోవడం, కృతజ్ఞతలు చెప్పుకోవడం ఆచారం. అయితే పాశ్చాత్య సంస్కృతి వెల్లువెత్తిన నేపథ్యంలో ఆంగ్ల సంవత్సర ఆరంభానికి ఉన్న విలువ ‘ఉగాది’కి దక్కడం లేదనే ఆవేదనా ఉంది.
ఉగాది నాడు పంచాగ శ్రవణంతో పాటు కవిసమ్మేళనాలు,సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ పెద్ద ముచ్చట. ఇటీవలి దశాబ్దాల క్రితం వరకు ఎందరో ప్రసిద్ధ కవులు ఆ ‘సమ్మేళనాల’లో వసంత రుతుశోభను ఆహ్లాదంగా, వైభవోపేతంగా ఆవిష్కరించేవారు. కవితలలో కేవలం తమ తమ పాండిత్య పటిమను ప్రదర్శించడమే కాకుండా సమకాలీన సమస్యలను ప్రస్తావిస్తూ, వాటి పరిష్కారానికి సూచనలు చేస్తూ, సమసమాజ, ఆదర్శ సమాజ కాంక్షను వ్యక్తీకరించేవారు.
తిరుమలేశుడి ఆస్థానోత్సవం
తిరుమలలోని శ్రీనివాసుడికి నిర్వహించే ప్రధాన ఉత్సవాలలో ‘ఉగాది ఆస్థానం’ ఒకటి. ఆలయ కార్యక్రమాలు, ఉత్సవాలు ఉగాది నుంచే ప్రారంభమవుతాయి.ఆ రోజు సాయంవేళలో భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి మాడవీథుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్యమంగళరూపంతో దర్శనం అనుగ్రహిస్తారు. ‘నిత్యోత్సవం’గా వ్యవహరించే ఇది నలభయ్ రోజుల పాటు..అంటే వైశాఖ శుద్ధ దశమి వరకు కొనసాగుతుంది.
– డా॥ ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్ జర్నలిస్ట్