నిజానికి, అరవింద్ కేజ్రివాల్ ఎప్పటి నుంచో అదే కోరుకుంటున్నారు. అరెస్ట్ చేయండి.. అరెస్ట్ చేయండని… అడుగుతూనే ఉన్నారు. ఏకంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని, విచారణ సంస్థలను అదే డిమాండ్ చేశారు. డిమాండ్ చేయడమే కాదు సవాలు విసిరారు. అయినా, కేంద్ర ప్రభుత్వం సరే… విచారణ సంస్థలు కూడా తొందర పడలేదు. విచారణ క్రతువును శాస్త్రోక్తంగా కావించి, చివరికి ఆయన కోరిక తీర్చింది. ఈడీ ఆయన్ని అరెస్ట్ చేసింది. ఎందుకు, ఏమిటనేది, అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఆ వివరాలోకి వెళ్లడం లేదు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ ‘అరవింద్ కేజ్రివాల్’ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది.
కేజ్రీవాల్ అరెస్ట్’కు ముందు తర్వాత జరిగిన పరిణామాలను గమనిస్తే, ఢల్లీి లిక్కర్ వ్యవహారం కేసును వర్తమాన చరిత్రలో ఒక రాజకీయ సంచలనంగా చెప్పుకోవచ్చు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వెలుగు చూసినప్పటి నుంచి, ముఖ్యంగా ఈ కేసులో అరెస్టుల పర్వం మొదలైనప్పటి నుంచి, అరవింద్ కేజ్రీవాల్ ఈ కేసులో ఏదో ఒక రోజు, ‘నేను సైతం’ అరెస్ట్‌కాక తప్పదనే నిర్ణయానికి వచ్చారు. అందుకే, ముహూర్తం కంటే ముందు నుంచే, అదొక ఎత్తుగడగా అరెస్ట్ చేయండని అడుగుతూ వచ్చారు. అయితే అదే సమయంలో, అదే కేజ్రివాల్,ఈడీ విచారణకు హాజరయ్యేందుకు మాత్రం ఎందుకో వెనకడుగు వేశారు. భయపడిపోయారు. విచారణను తప్పించుకునేందుకు చివరి క్షణం వరకు ప్రయత్నిం చారు. విచారణకు హాజరయ్యేది లేదని మొండి కేశారు. మొరాయించారు. ఒకటికి తొమ్మిదిసార్లు ఈడీ సమన్లు జారీ చేసినా, విచారణకు హాజరు కాలేదు. ఏదో ఒక సాకున తప్పించుకున్నారు. చివరకు, ఢిల్లీ హైకోర్టు రక్షణ కోరారు. అరెస్ట్ చేయకుండా ఈడీని ఆదేశించాలని కోర్టును వేడుకున్నారు. అయితే, కోర్టు, అది కుదరదని తేల్చి చెప్పడంతో.. దారులన్నీ మూసుకు పోయి… గత్యంతరం లేని పరిస్థితిలో అరెస్ట్‌కు తలవంచారు. అలా, కేజ్రీవాల్ వల్లించే నీతుల వ్రతం చెడినా ఫలితం లేకుండా పోయింది. కాగల కార్యాన్ని గంధర్వులే కానిచ్చారు అన్నట్లు.. కేజ్రీవాల్ కోరికను ఈడీనే కానిచ్చింది.
తొలి ముఖ్యమంత్రి
అదే రోజు, కోర్టు క్లియరెన్సు ఇవ్వడంతో ఈడీ ముఖ్యమంత్రి అధికార నివాసం తలుపులు తట్టింది. అక్కడే, విచారించి, అరెస్ట్ చేసి, సగౌరవంగా వెంట పెట్టుకు పోయింది. నిజానికి పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదేమో, కానీ కేజ్రీవాల్ ఈడీ విచారణను తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, సమన్లను సవాలు చేయడం ద్వారా ఆయన మెడకు ఆయనే ఉచ్చు బిగించుకున్నారని, ఒకప్పటి సహచరులు అంటున్నారు. ఈడీ విచారణ పట్ల ప్రదర్శించిన సహాయ నిరాకరణ దృక్పథం ఆయన మెడకు తాడై చుట్టుకుందని, ఆ కారణంగా ఆయనకు బెయిల్ రాకపోవచ్చని అంటున్నారు. అలాగే, ఆయన ప్రవచించిన రాజకీయ నిజాయతీని ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టింది. అంతే కాకుండా, విచారణను తప్పించుకునేందుకు ఆయన ఎంచుకున్న మార్గం, అందుకు దారితీసిన పరిస్థితులు కేజ్రీవాల్ ఇమేజ్’ని కూడా భయంకరంగా దెబ్బ తీశాయని అంటున్నారు.
అందుకే, అన్నాహజారే అంతటి పెద్దమనిషి, ‘‘అది (కేజ్రీవాల్ అరెస్ట్) ఆయన స్వయంకృతం’ అని తేల్చి చెప్పారు. చేసుకున్న వారికి చేసుకున్నంత అని తేల్చేశారు. అంతే కాదు, అన్నాహాజరే అవినీతి వ్యతిరేక ఆందోళనను నిచ్చెనగా చేసుకుని, రాజకీయ అరంగేట్రం చేసిన కేజ్రీవాల్, చివరకు అవినీతికి కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన మొన్నటి లాలూ, నిన్నటి హేమంత్ సోరెన్ కంటే ఇంకొక మెట్టు దిగజారా రని, కేజ్రివాల్ ఒకప్పటి అనుచరులు, సహచరులు అంటున్నారు. ఆవేదన వ్యక్త ం చేస్త్తున్నారు. ముఖ్యంగా, అరెస్ట్ అనివార్యమని తెలిసిన తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోవడం, ముఖ్యమంత్రిగా అరెస్ట్ కావడం, మరింత తలవంపులు తెచ్చి పెట్టిందని అంటున్నారు. ఆ విధంగా అవినీతి కేసులో ఆరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రిగా చరిత్ర పుటల్లో చేరడం కేజ్రీవాల్’కే కాదు, అన్నా హజారేకు, ఆయన సారథ్యంలో సాగిన అవినీతి వ్యతిరేక ఆందోళనకు కుడా అవమానం, తలవంపులు అంటున్నారు.
విషాద కోణం
ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో కేజ్రీవాల్ అరెస్ట్ కావడం, ఒకటైతే, ఆయన ఆత్మకథలో అసలైన విషాద కోణం మరొకటి ఉంది. అంతిమంగా ఈ కేసు ఏమవుతుంది? ఏ తీరం చేరుతుంది? అనే కోణంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల ముందు చోటు చేసుకున్న ఈ పరిణామం ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం లోనూ ఇటు మీడియాలో అటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవంక, అవినీతి వ్యతిరేక ఆందోళనకు ‘ఐకాన్’గా కేజ్రీవాల్’ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం, అరెస్ట్ కావడం (కొందరు దీన్నే మహాపతనం అంటున్నారు) గురించి కూడా లోతైన చర్చలు, విశ్లేషణలు వినవస్తున్నాయి.
కేజ్రీ కథలో.. అసలు విషాదం
‘‘ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్ నోటి నుంచి వచ్చిన మాటల్లో వ్యక్తమైన ఆందోళనకు ఇప్పడు ఆయనే సజీవ ప్రతిరూపంగా, నిలిచారు. ఒక విధంగా, శకునం చెప్పిన పిల్లి కుడితిలో పడిరది అన్నట్లుగా, ఒకప్పుడు నీతిసూత్రాలు వల్లెవేసిన అరవింద్ కేజ్రీవాల్’ పోయిపోయి అవినీతి ఊబిలో కూరుకు పోయారు. ఆయనే అవినీతిని బయటపెట్టి అవినీతిపరుడని వర్ణించిన కూటమిలో చేరిపో యారు. జైలు పాలయ్యారు. ఇదే కేజ్రీ కథలో అసలు విషాదం’’… అంటున్నారు ఒకప్పుడు కేజ్రీవాల్ వెంట నడిచిన, నడిపించిన సామాజిక రాజకీయ కార్యకర్తలు. అరవింద్ కేజ్రీవాల్,తమ రాజకీయ ఆకాంక్షలకు వేదికగా చేసుకున్న,‘ఇండియా ఎగెనెస్ట్ కరప్షన్’ వేదిక నిర్మాత, గాంధేయవాది, సామాజిక కార్యకర్త అన్నా హాజారే మొదలు, కవి, ప్రవక్త, సామాజిక, రాజకీయ కార్యకర్త, విశ్లేషకులు కుమార విశ్వాస్, జర్నలిస్ట్ అశుతోష్ వరకు కేజ్రీవాల్ మాజీ సహచరులు అందరి నోట వినిపిస్తున్న మాట అదొక్కటే.
ఎవరు ఎన్ని మాటల్లో చెప్పినా, ఎవరు ఏ కోణంలో విశ్లేషించినా అరవింద్ కేజ్రీవాల్ తమ విశ్వాసాలకు వ్యతిరేకంగా రాజకీయ మార్గం ఎంచుకోవడంతోనే ఆయన నైతిక పతనం మొదలైంది. ఇక అక్కడి నుంచి జారుడుమెట్ల వెంట జారి.. జారి దిగజారి పోయారు. చివరకు, అవినీతి ఊబిలో కూరుకుపోయారనేదే అందరి మాటల సారాంశంగా వుంది. కేజ్రివాల్ ఒక్కడి కారణంగా, అన్నా సారథ్యంలో నిర్మాణమైన ఒక మహోద్యమం నీరుకారి పోయింది. ఆ ఒక్కడి కారణంగా, ఉద్యోగాలువదులుకుని ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారులు నిందలు మోయవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తమవుతోంది. అలాగే, ఇందిరా గాందీ,ó 1975లో తమ ప్రధాని పదవిని కాపాడుకునేందుకు దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన నేపథ్యంలో సర్వోదయ నేత జయప్రకాష్ నారయణ్ సారథ్యంలో నిర్మాణమైన సంపూర్ణ క్రాంతి ఉద్యమం, లాలుయాదవ్ వంటి కొద్దిమంది అవినీతి పోకడల కారణంగా నీరు కారిపోయిన విధంగా, అన్నాహాజారే నిర్మించిన అవినీతి వ్యతిరేక ఆందోళన కేజ్రీవాల్’ కారణంగా నిర్వీర్యమై పోవడమే కాకుండా, తాజాపరిణామాలనేపథ్యంలో మరో ఉద్య మానికి అవకాశమే లేకుండా చేసిందని ఆవేదన వ్యక్త పరుస్తున్నారు.
అప్పుడేమన్నారు..?
2014కు ముందు సోనియా, మన్మోహన్, రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో, భూమ్యాకాశాలే హద్దుగా, రోజుకో స్కామ్, పూటకో అవినీతి వ్యవహారం వెలుగు చూస్తున్నరోజుల్లో, అన్నా హజారే, ఇండియా ఎగెనెస్ట్ కరప్షన్’ వేదికగా అవినీతి వ్యతిరేక దేశవ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుట్టారు.
ఈ అవినీతి వ్యతిరేక ఆందోళనలో అరవింద్ కేజ్రివాల్ కీలకపాత్ర పోషించారు. ఆందోళనకు అన్నా ఆత్మ అయితే, అన్నా ఆత్మ, దేహం రెండూ తానే అన్నట్లుగా కేజ్రీవాల్ వ్యవహరించారు. ఇండియన్ రెవిన్యూ సర్వీస్‌లో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకుని, అన్నాతో చేతులు కలిపారు. ఆ విధంగా ఎందరో యువకులకు ఆదర్శంగా నిలిచారు. వందలు కాదు వేల సంఖ్యలో యువత కేజ్రీవాల్‌ను ఆదర్శంగా తీసుకున్నారు. ఉద్యోగాలు వదులుకుని అన్నా, ఆయన బాటలో ఆందోళనలో పాల్గొన్నారు.
అదే సమయంలో, అన్నాహజారేతో అవినీతి వ్యతిరేక వేదికను పంచుకున్న సందర్భంలో కుర్చీ మహిమ గురించి, అరవింద్ కేజ్రీవాల్ చక్కని ప్రవచనం వినిపించారు. కుర్సీ చాలా డేంజర్ గురూ.. అంటూ పాఠాలు చెప్పారు. అప్పట్లో, ఒక సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్, ‘‘ఏ కుర్సీ కే అందర్ కుచ్ న కుచ్ సమస్యా హయ్, జో ఇస్ కుర్సీ కే ఉపర్ భైట్‌తా హై వోయీ గడబడ్ హోజాతా హై, తో కయీ ఐసాతో నహీ, ఇస్ ఆందోళన్ సే జబ్ కుచ్ వికల్ప్ నికలేగా, ఔర్ జబ్‌వో లోగ్’ జాకే ఉస్ కుర్సీ పర్ బైఠేంగే కహి వో లోగ్ భ్రష్ట్ హో జాయ్, కహి వో నా గడ్బిడ్ కరనే లగే, ఏ భారీ చింతా హమరే మన్ మే హై. హమారా మన్ మే బహుత్ డర్ హై, కహి ఐసా న హోగే, ఇస్ ఆందోళన్ సే, జబ్ రాజనీతిక్ వికల్ప్ కడారహో, కహీ ఉసమే సే భష్ట్రాచార్ కో జన్మ దేనేకి కుచ్ ప్రవృతి నికలే, ఔర్ ఐసే గలత్ లోగ్ నికలే, ఇస్కే బారే మే ఆప్ లోగోం కా క్యా కహనా హై, కీ జో లోగ్ సత్తా మే జాయే వో భ్రష్ట్రాచార్ న కరే, ఇస్కా క్యా సమాధాన్ హై, ఇస్కే బారే మే భీ ఆప్ ఆప్కీ రాయి దేతో అచ్చా రహేగా .. అంటూ.. ఈ కుర్చీ ఏదైతే ఉందో, అది చాలా ప్రమాద కరమైనది. ఈ కుర్చీలో కూర్చున్న వారు గడబిడకు గురవుతారు. ఒక వేళ రేపు ఒక ఈ ఆందోళన (ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్) విజయవంతమై, ఉద్యమ కారులు వెళ్లి ఇదే కుర్చీలో కూర్చుంటే, వీరు కూడా గడబిడకు గురై, అవినీతికి అలవాటు పడితే, ఏమిటి పరిస్థితి? అంటూ ఆందోళన వ్యక్త పరిచారు. అలాంటి పరిస్థితి వస్తే ఏమి చేయాలో ఆలోచించాలని అన్నా సాక్షిగా పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ చేసిన ఈ ప్రసంగం అదే వేదికపై ఉన్న అన్నా సహా అందరినీ అబ్బుర పరిచింది. ఆనంద పరవశులను చేసింది.
అయితే, అప్పుడు ఆ వేదికపై ఉన్న అన్నా సహా ఇతర నేతలు, కేజ్రివాల్ అద్భుత భాషణం విన్న వేలది మంది సామాన్యులు, అదే కేజ్రీవాల్’ ఇలా 180 డిగ్రీలు తిరిగి పూర్తి వ్యతిరేక రూపంలో, అవినీతి మరకల మయంగా కనిపిస్తారని ఉహించారో లేదో కానీ, కేజ్రీవాల్ ఇప్పుడు దేశం ముందు అవినీతి ముద్ర వేసుకున్న మరో లాలు, మరో జయలలితలా నిలిచారు. ఇదే అసలు విషాదం అంటున్నారు.
– రాజనాల బాలకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్