– సంబరాజు లీల (లట్టుపల్లి)

మిల మిలా మెరుస్తూ శుభ్రంగా ఉంది ల్యాబ్‌. కంట్రోల్‌లో ఉంది  టెంపరేచర్‌. ఆయా బాక్స్‌ల్లో దాచిన వీర్యకణాల్ని, అండాల్ని మైక్రోస్కోప్‌లో చూపించింది డాక్టర్‌ వరద.

కృత్రిమంగా టెస్టుట్యూబుల్లో అండాల్ని శుక్రకణాల్ని కలిపి ఫలదీకరించిన విభాగాన్ని చూసింది గాంధారి.

లోపల ఒక యువతి పడుకుని ఉంది.

ఆకారం కనిపించటం లేదు. నీడే కనిపిస్తోంది.

‘‘అప్పుడే ఫలదీకరించిన రెండు నెలల పిండాన్ని ఆమె గర్భంలో, అదే ` అద్దె గర్భంలో ` ప్రవేశ పెట్టారు. ఆమె రెండు రోజులు కదలకుండా నా అబ్జర్వేషన్‌లో ఉండాలి. తరువాత రెండు రోజులకో సారి చెకప్‌కు రావాలి. క్రమంగా వారం, పది, నెలరోజులకోసారి రావచ్చు’’ చెప్పింది డాక్టర్‌ వరద.

ఆమె కదలకుండా, ఓ యజ్ఞాన్ని నిర్వహిస్తున్న ట్లుగా దీక్షగా పడుకునుంది. ఆ విషయం చెబుతూ ‘‘ఆమె మాతృదానం చేస్తోంది. ఎవరి బిడ్డకు జన్మనిస్తుందో డాక్టర్‌కు తప్ప, ఆమెకేమీ తెలవదు. కానీ, ఆమె ఇప్పటి నుంచి ఎనిమిది నెలలు ఆ గర్భాన్ని, అతి జాగ్రత్తగా మోయాలి. ఆ సంతానం మీద ఎలాంటి అధికారం కలిగి ఉండదు. ఆ తరువాత ఆమె తన పారితోషికాన్ని తీసుకుని వెళ్లిపోతుంది’’ చెప్పింది.

‘‘నేనామెను చూడవచ్చా?’’ అడిగింది గాంధారి.

‘‘ష్యూర్‌! ఇందులో రహస్యమేమి లేదు. మీరు ఆమెకు సంబంధించినవాళ్లు కాదు. కేవలం ఓ సరోగేట్‌ మదర్‌గా తెలుసంతే’’ చెప్పింది డాక్టర్‌ వరద, తేలిగ్గా.

ఆమెను చూస్తుంటే గాంధారికి విచిత్రంగా అనిపించింది. తల్లి ఎవరో, తండ్రి ఎవరో తెలవదు. కానీ, ఆ వివరాలేమీ తెలియకుండానే బిడ్డకు తల్లి అవుతోంది. వారెవరో బిడ్డను నెలల తరబడి మోస్తుంది. ఆ బిడ్డ కదలికల్ని తనవిగా భరిస్తుంది. ఆ బిడ్డ క్షేమం కోసం తను ఆరోగ్య సూత్రాల్ని పాటిస్తుంది. అయినా ఆ బిడ్డ ఆమెది కాదు. ఆ అనుబంధం ఆమె సొంతం కాదు అనిపించింది.

ఇంటికి వెళ్తూ కూడా అదే ఆలోచించింది గాంధారి.

* * * *

అదొక లేడిస్‌ హాస్టల్‌. వెనకబడిన తెగల నుంచి వచ్చి,  పి.జి. చేస్తున్న అమ్మాయిల క్యాంపస్‌. భద్ర తనకొచ్చిన ఎస్‌.ఎమ్‌.ఎస్‌. చూసుకుని, ఆశ్చర్య పోయింది.

‘ఇది సాధ్యమా? తనకూ ఇలాంటి అడ్వెంచర్‌ చెయ్యాలనే ఉంది. కానీ సాధ్యమయ్యె పనేనా?’ అనుకుంటు తన రూమ్మేట్‌ కల్పలత దగ్గరకొచ్చింది.

కల్పలత కూడా అచ్చం అలాంటి ఎస్‌.ఎమ్‌. ఎస్‌.నే  చూసుకుంటోంది.

ఇద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. ఇదే విషయం చర్చించుకుంటూ, ‘లాన్‌’లోకి వచ్చారు.

అక్కడ వరూధిని, నాన్సీ, గీరా ఉన్నారు. ఇంకా కొంతమంది అమ్మాయిలూ ఉన్నారు. పలకరింపు లయ్యాక బయటపడిరదొక్కటే. అందరి ఫోన్‌లలో అదే ఎస్‌.ఎమ్‌.ఎస్‌. అందులో, ‘సులభంగా డబ్బు సంపాదించాలనుకుంటే, ఎక్కువ కష్టపడకుండా, ఉనికి, అస్తిత్వం పోగొట్టుకోకుండా, ఎలాంటి అవినీతికి పాల్పడకుండా, చట్టబద్ధంగా డబ్బు సంపాదించాలను కుంటే వచ్చి కలవండి!’ అని ఉంది. క్రింద వారి నంబరుంది.

ఆ అమ్మాయిలంతా పేదవాళ్లేమీ కాదు. అవసరమయిన డబ్బు తల్లిదండ్రులు పంపిస్తూనే ఉన్నారు. అందులో నాన్సీ ఓ ధనవంతుని కూతురు.

ఆమె తండ్రి క్రైస్తవమతంలోకి మారిన హిందువు. నిజమైన క్రైస్తవులెవరూ హిందూధర్మానికి వ్యతిరేకులు కారు. కానీ ఉల్లిగడ్డ తిన్నవాడి కన్నా, వాసన చూసిన వాడి కెక్కువన్నట్లు, మారిన నాన్సీ తల్లిదండ్రులకు ఆచారమని పిలిచే  సంప్రదాయమన్నా, సామాజిక కట్టుబాట్లున్న ఇష్టం ఉండవు.

భారతీయ ఆచారాలంటే అసంబద్ధ, అనాగరిక పద్ధతులని ఓ చులకన  భావం.

అందుకే నాన్సీకి అవసరం లేకపోయినా, వెంటనే స్పందిస్తూ, ‘‘దీనికి రెస్పాండయితే, ఎలా ఉంటుందేె వరూధినీ?’’ అడిగింది.

‘‘అమ్మో! వద్దు. అవేలాంటి పద్ధతులో! ఈ కాలంలో పిలిచి డబ్బు సంపాదించే మార్గం చూపిస్తా మంటే ఆలోచించాల్సిందే. నిజానికిది సరైనదైతే, వాళ్లే వాళ్ల వాళ్ల కెవరికో ఇవ్వొచ్చుగా! ఇలా మనలాంటి అమ్మాయిలకెందుకు పంపుతారు మెయిల్స్‌?’’ అంటూ తార్కికంగా ప్రశ్నించింది.

‘‘గాడిదగుడ్డు… ఇలా… ఇంటికి దూరంగా ఉండే అమ్మాయిలయితే ఎలాంటి ప్రాబ్లమ్స్‌ ఉండవని! పైగా, ఇవాళ్టి అమ్మాయిలెవరూ  వెనకటిలా అమాయకంగా లేరు. సమాజంలో వస్తున్న మార్పుల్ని, దాని ఎదుగుదలని, సోషల్‌ కష్టమ్స్‌ని, స్త్రీ, పురుష శరీరాల్లో వచ్చే మార్పుల్ని, సంయోగాల్ని, సృష్టి మార్పుల్ని సైతం ఆన్‌లైన్లో గూగుల్‌కు లాగిన్‌ అయి తెలుసుకుంటున్నారు. వాళ్ల మెయిల్లో ఏముంది? సరోగేట్‌ మదర్‌ కావాలుకుంటే, ఎగ్‌ డొనేట్‌ చెయ్యాలనుకుంటే, సంప్రదించమన్నారంతే!

‘‘కాబట్టి,  స్వయంగా తెలుసుకుని నిర్ణయాలు తీసుకుంటారన్న అభిప్రాయంతో మెయిల్స్‌ కొట్టారేమో! రెండోది మనలాంటి అమ్మాయిల ‘ఎగ్స్‌’ వృధా అయిపోకూడదని అడిగి ఉండొచ్చు. లేదా, ఎయిడ్స్‌ లాంటి ప్రాబ్లమ్స్‌ ఉండవని కావచ్చు!’’ తేల్చేసింది నాన్సీ.

‘‘ఎంత చదువుకున్నా ఇలాంటివి అమ్మాయిలకు ప్రాబ్లమే కదా?’’ భయంగా అంది భద్ర.

భద్ర కుటుంబం సనాతనమైనది కాకపోయినా, పిల్లలకు సంబంధించిన విషయాల్లో అన్నిటికి స్వతంత్రమివ్వని కుటుంబం. ముందు తండ్రి నిర్ణయం తీసుకుని, నానమ్మ తాతగార్లతో చెప్పాలి. నానమ్మ తాతగారు సంప్రదించుకుని, కోడలు, అంటే భద్ర తల్లితో చెబితే, అప్పుడు ఒక నిర్ణయం జరిగి, ఏ విషయంలో నయినా, ముఖ్యంగా పిల్లల విషయాల్లో అవి అమలులోకి వస్తాయి.

‘‘పోవే! ఇందులో మనకు పోయేదేముంది? వీటిలో రకరకాలుంటాయి. ఎగ్‌ డొనేషన్‌, స్పెర్మ్‌ డొనేషన్‌, సరోగసి లాంటివాటిని ఇప్పుడు ఓపెన్‌గా చూస్తూనే ఉన్నాం. ఎన్నో సంతాన సాఫల్య కేంద్రాలు అడ్వర్టయిజ్‌ చేస్తున్నాయి. ఐ.యూ.ఐ, ఐ.వి.ఎఫ్‌, ఐ.సి.ఎఫ్‌.ఐ, హెచ్‌.ఐ.ఎఫ్‌.జి. లాంటి పద్ధతుల్ని మనమెన్నిసార్లు వెబ్‌లో చూడలేదూ! వీటిల్లో సరోగసి కాస్త పెద్దది. క్రిటికల్‌గా ఉంటుంది. వీటి వల్ల  తల్లులు కాలేకపోయిన ఎంతోమంది తల్లులవు తున్నారు. కొందరికి లేని మాతృత్వం వీటి వల్ల దక్కుతోంది. కొందరు పేద మహిళలు, ఈ పద్ధతిలో బిడ్డల్ని కనిచ్చి, డబ్బు పర్స్‌లో పెట్టుకుని వెళ్తున్నారు.

‘‘అయితే, ఈ పద్ధతిలో కూడా ఆయా లోపాలున్న దంపతుల పురుష వీర్య కణాలని, అండాల్ని ల్యాబుల్లో ఫలదీకరణ జరిగే వరకు ఉంచి అద్దె అమ్మల గర్భాల్లో పొందుపరుస్తారు.

‘‘అది ఎక్కడ జరుగుతుందో… ఎవరివో ఎవరికీ తెలియవు. కనే వరకు మోయటమే అమ్మల పని’’ అతి తేలిగ్గ చెప్పింది నాన్సీ.

‘‘ఇది… చిన్న విషయమా? మా అక్క గర్భవతి అయితేె బెడ్‌రెస్టు, బలం కోసం మందులు, చెకప్‌లు, వాంతులు.. ఓప్‌ా! ఇన్ని ఉన్నా ఇంట్లో అందరికి అవురూపమే!

‘‘తొమ్మిది నెలలూ నిండిపోతే నొప్పులొస్తాయేమో నని ఎదురుచూపులు. అఫ్‌కోర్స్‌, ఆ డాక్టర్‌ నార్మల్‌ డెలివరీ కాదని చెప్పేసి, ముందే ‘సిజెరియన్‌’ చేసిందనుకో…!’’ నవ్వుతూ ఆ ప్రహసనమంతా వివరించింది భద్ర.

గీరా మాట్లాడలేదు. వింటూ ఉండిపోయింది. అయినా ఆమెకంతా తెలుసు! కొన్నిసార్లు తమ తాండాల్లో కూలికి వెళ్లి, అడవిలో పనులకు వెళ్లి, పొలం పనులకు వెళ్లి, పగటిపూటయితే ఏ చెట్టు కిందో, రాత్రిళ్లయితే అనారోగ్యకరమైన ఏదో గోడచాటునే పురిటిగదిగా చేసుకుని, నొప్పులు పడి, నరకయాతనతో రక్తసిక్తమయిన దేహంలోంచి, రక్తపుచారికల ఓ శిశువు భూమ్మీద పడడం.

ఆ వెనక అంతటి నొప్పులతోనే, మాంసం ముద్దలాంటి ‘మాయ’ పొరను తీయటం. అన్నీ తెలుసు! కాని, అలాంటి ‘సృష్టి’ జీవనవిధానాన్ని, ఆధునికత పేరుతో ఇంత సునాయాసంగా, మనుషు లకు జన్మనిచ్చి, ‘ప్రతి సృష్టి’ చేయటమా!

ఇది ప్రకృతికి విరుద్ధమని, అక్కడున్న యువతు లందరికి తెలుసు. అయినా, కేవలం నేటి అవసరాల కోసం, ఆ అవకాశాలని అందిపుచ్చుకుని పనులు జరిపించుకోవటానికే ఇదంతా. అదే వివరించింది గీర.

మనసులో మాత్రం, ‘‘దేహం మీద ఎలాంటి కోతలు లేకుండా, ప్రకృతి అతి సహజంగా స్త్రీకిచ్చిన మాతృత్వవరంతో, పురిటి నొప్పుల్ని అనుభవించి పిల్లల్ని కనాలని ఉంది. కానీ, తనకు ఆ అవకాశం లేదు.

పెళ్లి అయింది. అదీ తనకు తెలవదు. బాల్య వివాహం అది.

నిజానికి తాండా సంప్రదాయంతో తనింతగా కట్టుడిగా ఉండాల్సిన అవసరం లేదు.‘ఓలి’ చెల్లించి విడాకులు తీసుకుని ఆ బంధాల్ని వదిలించుకోవచ్చు.

అవీ అయ్యాయి. ‘‘రెండు కుటుంబాలకు పడక, ‘ఓలి’ చెల్లించి, ఆ పెళ్లిని విచ్ఛిన్నం చేయటం మాత్రం ఆమెకు తెలవదు.

తనకు ఇప్పుడు తెలిసిందొకటే. తనలో స్త్రీత్వం సంపూర్ణంగా వికసించింది. దానికి అన్ని అనుభవాల్ని ఉపయోగించుకోగల అవకాశాలున్నాయి. అందుకు సంబంధించి మంచి చెడ్డలూ ఆలోచించగల విచక్షణ తనకు తన ‘విద్య’ నేర్పింది. అప్పుడే కల్పలత, ‘‘… అయితే, ఇంకో విషయాన్ని కూడా అందిపుచ్చుకో వచ్చు. అదే – ఆడపిల్లలంటే ఆడపిల్లల్ని, మగపిల్లలంటే మగపిల్లల్ని కనివ్వటం’’ చెప్పి నవ్వేసింది.

‘‘అవునే కల్పా! ఒకప్పుడీ అవకాశాలు లేవు. ఇవాళ ఉన్నాయి. ఈ శాస్త్ర విజ్ఞానాన్ని ఉపయో గించటంలో తప్పేముంది?

‘‘వాళ్లకు లేనిదాన్ని మనమిస్తాం. మన అవసరం వాళ్లిచ్చే ‘ధనం’ తీరుస్తుందంతే!’ అంది వరూధిని,

నిజానికి వరూధినికి ఇంట్లో, ఆర్థిక అవసరాలు న్నాయి. తన ఫీజు కట్టడానికి నాన్న చాల కష్టపడ్డాడన్న విషయం గుర్తొచ్చింది. పైగా హాస్టల్‌ ఫీజు, పుస్తకాలు, బట్టలు ఇలా ఎన్నో అవసరాలు. అందుకే`

‘‘ఓకే గీరా! మనమంతా, ముందు ఈ ఎస్‌.ఎమ్‌.ఎస్‌. పంపించిన డాక్టర్‌ను కలుద్దాం. విషయాలు తెలుసుకుందాం. అక్కడేమయినా నిజమైన అవసరాలుంటే ఆదుకుందాం. మోసాలేమయినా ఉండి, మనకి అపాయం చేసేదని అనిపిస్తే బైటపెడదాం’’ అంది వరూధిని.

 మరునాడు ఆదివారం కాబట్టి, డాక్టర్‌ను కలుస్తూన్నట్లుగా అందరూ మెసేజ్‌ పంపించారు.

* * * *

‘పృథ్వి ప్రతిసృష్టి’ కేంద్రం.

డాక్టర్‌ వరద ముందు కుంతల, ఆమె భర్త, అత్తగారు, మామగారు కూర్చుని ఉన్నారు.

కుంతల నీరసంగా కనిపిస్తున్నది. అది పోషకాహార లోపంతో వచ్చిన నీరసం కాదు. అన్ని రకాల మానసిక సంఘర్షణతో పొందిన భావ స్వరూపమది.

అత్తింట్లో అన్ని రకాల వైభవాలు అనుభవిస్తున్న దన్న భ్రమలో ఉన్న పుట్టింటి వారి సహకారం ఆమెకు లేదు. పోనీ, అత్తింటికి దూరంగా ఉండి, భర్తతో జీవితాన్ని అనుభవించగల-నేర్పు వ్యక్తిత్వం, ఆర్థిక స్వాతంత్య్రం కూడా లేవు.

నిజానికి, కుంతలకు అత్తింట్లో ఏ లోపం లేదు. కాలు క్రిందపెట్టని వైభవం ఉంది. ప్రేమగా చూసుకునే భర్త, కూతురిలా చూసుకునే అత్తమామలు, స్నేహితురాల్లా చూసుకునే ఆడబిడ్డలు ఉన్నారు.

అయితే, మూడుతరాల నుంచి ఆ ఇంట్లో మగపిల్లలు లేరు. కేవలం కల్యాణ్‌ ఒక్కడే ఆ ఇంటి రాకుమారుడు. కానీ, కోడలు ఆ రెండెండ్లలో మూడు సార్లు గర్భవతయింది. ఆ మూడుసార్లు ఆడపిల్లని తెలిసి ఆ గర్భాల్ని పోగొట్టుకుంది.

అందుకే డాక్టర్‌ వరద వద్దకొచ్చింది. కానీ ఇప్పుడు కుంతల గర్భవతి కాదు. మళ్లీ గర్భం దాల్చినా ఆడపిల్ల కాకుండా ఉండటం కోసం ముందు జాగ్రత్తగా డాక్టర్‌ వరదని సంప్రదించడానికి వచ్చారు.

(సశేషం)

About Author

By editor

Twitter
YOUTUBE