ఆ రాత్రి పడకగదిలో భర్త  అనిరుధ్‌ ఒళ్లో పడుకుని, పొర్లి, పొర్లి ఏడ్చింది ఉష. ‘‘ఉషా! ప్లీజ్‌. దిసీజ్‌ నాచురల్‌. సాఫ్టువేర్‌ కంపెనీల ల్యాప్‌ట్యాప్‌ నుంచి వచ్చే రేడియేషన్‌, సెల్‌ఫోన్ల కాలుష్యం, ఆహారపు అలవాట్లు, మార్పులు, ఆర్గానిక్‌ ఆహార పదార్థాలు లేకపోవటం, పనుల వత్తిడి, టెన్షన్స్‌ వీటివల్ల హార్మోన్స్‌ మధ్య సమతౌల్యం లేక ఈ సమస్యలేర్పడ్డాయి.

‘‘అది.. నీకూ తెలుసు.ఈ మధ్య చాలామంది ఇదే సమస్య  ఎదుర్కొంటున్నారు. అందుకే ఎక్కువగా దత్తత తీసుకుంటున్నారు. లేదా అద్దె అమ్మల్ని ఆశ్రయిస్తున్నారు. నాలో లోపం లేదు. నీలో లేదు. కానీ నీ గర్భాశయం పిల్లల్ని కనలేకపోతోంది. దానికి కారణాలు ఏవైనాకాని, నాకు మాత్రం బిడ్డ కావాలి. నీకు, లేదా మనకు కావాలి.

 ఈ సరోగేట్‌ మదర్స్‌ ద్వారా పిల్లల్ని కనటం నాకు మాత్రం హాయిగా అనిపిస్తోంది. తొమ్మిది నెలలు హాయిగా ఉండొచ్చు. మోసే బాధ, జాగ్రత్తలు తీసుకునే బాధ తప్పుతుంది. నీకు తెలుసా? తల్లికి నెలలు నిండుతుంటే నేనూ బ్రహ్మచర్యం చేయ్యాల్సి వస్తుంది. ఆ బాధ ఇప్పుడుండదుగా!’’ రాని నవ్వు తెచ్చుకుని ఓదార్చాడు.

కానీ ఉష నవ్వలేదు.

‘‘అది అంత సులభమా? పెంచుకున్నవాళ్లు మనవాళ్లవుతారా? నా కడుపులో రూపు దిద్దుకుని, పెంచి పోషించి, ఆ బిడ్డకు జన్మనిచ్చే అవకాశం నాకెందుకు లేదు?’’ ఏడుస్తోందామె.

‘‘అది తప్పు ఉషా! చెట్టుకు పూసిన పూతంతా కాయలౌతాయా? ఇదీ అంతే. ఆడవాళ్లందరికి అమ్మయ్యే అవకాశం రాకపోవచ్చు. అందులో నీవూ ఉన్నావు. పూర్వం చాలమంది ఆడవాళ్లు అవకాశం లేక, అమ్మలు కాలేక మనోవేదన అనుభవిస్తూ గొడ్రాలన్న ముద్ర భరించేవారు. ఈ సంతాన సాఫల్య కేంద్రాల ద్వారా, సరోగేట్‌ మదర్స్‌ ద్వారా ఈనాడు మనకీ అవకాశమొచ్చింది. పెరిగిన విజ్ఞానాన్ని మనం అందుకుని ఆదరిస్తూ ఉపయోగించుకోవాలి. పై వాటిలో మనం ఏదో ఒక అవకాశాన్ని అందుకుని ఉపయోగించుకుందాం’’ చెప్పాడు అనిరుధ్‌.

కళ్లు కాలువలయ్యేలా, గుండెలు పగిలేలా ఏడుస్తూ అంది ఉష.

‘‘నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయ్‌ అనిరుధ్‌! నేను ఆలోచించుకోవాలి!’’

అనిరుధ్‌ బైటకు వెళ్లాడు.

ఇప్పటి ఉష దుఃఖం తను అమ్మను కానందుకు కాదు. కాకుండా చేసుకున్న, తన స్వయంకృతాప రాధానికి! ఆమె మనసు పశ్చాత్తాపంతో కునారిల్లి పోతున్నది.

అవి ఉష కాలేజీ రోజులు.

ఇంటర్‌ పూర్తయి, ఎమ్‌సెట్‌ రాసింది. అప్పటి నుండి మొదలయింది కసరత్తు.

చదువంటే, ఇంజనీరింగ్‌. సంపాదనంటే, డాలర్లలోనే. స్థిరపడటమంటే అమెరికాలోనే అనుకునే తల్లిదండ్రుల తరమిది. ఉషా, అనిరుధ్‌ తల్లి దండ్రులది అదే తీరు.

ఉషకు చిన్నప్పటి నుంచి గ్రూప్స్‌ రాసి, ఐ.ఏ.ఎస్‌ ఆఫీసర్‌ కావాలని కోరిక.

కానీ, ఉష పెద్ద ఇంజినీరు కావాలి. అమెరికా వెళ్లాలి. డాలర్లు మూటగట్టాలి. ఆమె వెంట తామూ అమెరికా వెళ్లాలి. డాలర్లెే డాలర్లుగా సంపాదించి, ఇండియాలో ఆస్తులు కూడ బెట్టాలి. అన్న రీతిలో నచ్చజెప్పి ఒప్పించారు.

తన కోరికను ఏ క్షణంలో ఎవరు పాతాళానికి తొక్కేశారో కూడా తెలియని స్థితిలో విద్యావిధానాల్ని కొనేస్తున్న పేరు మోసిన ఓ కాలేజీలో ఇంజనీరింగ్‌ కోర్సులో చేరింది.

వారం రోజులు హోం సిక్‌ లీవులు!

అంతేె! కోచింగ్‌లలో పడిపోయి, ఇంజనీరు నన్నట్లుగా పెరిగింది. డబ్బుకు కొదవలేదు. దుస్తులు, అలంకరణ, మాట తీరు, స్నేహాలు – అన్నీ మారి పోయాయి. త్రి బై ఫోర్తు డ్రస్సులు, జీన్స్‌, పోనీ టెయిల్స్‌, విరబోసుకోవటం, లోనెక్‌లలో కటింగ్‌ అందాల్ని ప్రదర్శించుకుంటూ సంప్రదాయాల్ని మరిచిపోయింది.

ఇంజినీరింగ్‌ ఫస్టియర్‌ దాటగానే మెల్లిగా బాయ్‌ఫ్రెండ్స్‌, సెల్‌ఫోన్‌ మెసేజ్‌లు అలవా టయ్యాయి. ఫోర్తియర్‌లో క్యాంపస్‌ సెలక్షన్స్‌ రాగానే పబ్బులు, క్లబ్బులు అలవాటయ్యాయి.

తొలిసారిగా రుతుస్రావం ఆగిపోయింది.

సరిగ్గా ఇరవై ఎనిమిది రోజులు కొచ్చే మెన్సెస్‌ ఆగింది.

‘రుతుచక్రం’ క్రమం తప్పినా మామూలు అమ్మాయిలా కంగారు పడలేదు.

జీవన గమనాన్ని మారుస్తున్న దాని గురించి కనీసం అమ్మకయినా చెప్పాలని పించలేదు. గూగుల్‌ నాశ్రయించి, విధానం తెలుసుకుంది. మెడికల్‌ షాపులో దొరికిన యంత్రంతో, గర్భాన్ని నిర్ధారించే సాధనంతో టాయ్‌లెట్‌కు వెళ్లి యూరిన్‌ టెస్టు చేసుకుంది.

పాజిటివ్‌ వచ్చింది.

వెంటనే బాయ్‌ఫ్రెండుకు ఎస్‌ఎమ్‌ఎస్‌ పంపించింది. అతడు డెబ్బయ్‌ రెండు గంటల్లో అబార్షన్‌ జరిపే మాత్రల జాబితాని రెండు రోజుల కల్లా పంపించాడు.

అంతే, కొద్దిపాటి ‘నొప్పి’తో తలనొప్పిని వదిలించుకుంది. ఆ తరవాత, వద్దు… వద్దు అనుకుంటూనే, ఎంజాయ్‌మెంట్‌ కోసం ఎన్నిసార్లు… రూపు దిద్దుకునే ప్రాణాన్ని రెస్టు రూముల్లో జారవిడిచిందో!

తాను పొందిన ఆనందం ముందు ఆ కాస్త నొప్పి ఏ మూలకనుకునేది. ఆ తరవాత అమెరికన్‌ కంపెనీ ‘వీసా’తో విదేశాలు వెళ్లొచ్చింది ఉష.

అనిరుధ్‌తో పెళ్లయింది.

అప్పుడే పిల్లలు వద్దనుకున్నారు. ఆ తరువాత కావాలనుకున్నా పుట్టలేదు. తల్లిదండ్రులకు గాని, భర్త అనిరుధ్‌కుగాని, చివరికి ట్రీట్మెంట్‌ చేసిన డాక్టరుకయినా ఆనాటి పాప ఫలితాల గురించి చెప్పుకోలేకపోయింది.

ఈ రోజు పిల్లల కోసం తపించే తల్లిగా మిగిలింది. చదువుకునే రోజుల్లో విచ్చలవిడి శృంగారం, పబ్బులు, క్లబ్బులు, వికృతమైన లైంగిక వాంఛలు. అవీ ఇవీ ఊహించుకుని జాగ్రత్తలు పాటిస్తే ఎంజాయ్‌మెంటుండదని ఎలాగయితేనేం, అప్పటికి స్వేచ్ఛనుపయోగించుకున్నారు.

ప్రెగ్నెన్సి కన్‌ఫాం అయితే తెల్లవారే సరికి అబార్షన్‌. కొద్దిపాటి నొప్పితో, అడ్డు తొలగిపోయేది. రక్తసిక్తమయిన రెస్టరూముల్లో ఆమె పాపం కరిగిపోయేది.

ఆ క్షణంలో ఎలాంటి పశ్చాత్తాపం ఉండేది కాదామెలో.

ఒకసారి ఎంత ప్రయత్నించినా గర్భస్రావం కాలేదు. అప్పుడు అమ్మ నుంచి దాచటానికి మొదటిసారి తిప్పలు పడిరది ఉష.

కాలేజీ టూరని చెప్పి, బాయ్‌ఫ్రెండ్‌తో వెళ్లి, ఓ హాస్పిటల్లో అబార్షన్‌ చేయించుకుంది. తాను పడ్డ నరకం, కడుపులోని బిడ్డ కూడా పడి ఉంటుందని ఆమెకు అప్పుడే అర్థమయింది.

అందుకే, అప్పటి దాకా ఏది ఆనందమయ జీవితం అనుకున్నదో, ఆ జీవితానికి స్వస్తి చెప్పి, అనిరుధ్‌తో పెళ్లికి ఒప్పుకున్నది. అప్పటికెే గర్భసంచికి ఇన్‌ఫెక్షనొచ్చి విషతుల్యమయింది. గర్భసంచి గోడలనంటి ఉండేె టిష్యూలు దెబ్బతిని బిడ్డను కనే సామర్ధ్యాన్ని, అర్హతను పోగొట్టుకున్నదామె.

ఇదంతా తన తప్పిదం ఫలితమేనని తొలిసారిగా మనస్సాక్షి ముందు ఒప్పుకుంది ఉష.

 * * * *

పృథీó్వ ప్రతిసృష్టి సంతాన సాఫల్య కేంద్రం.

ఎక్కడికక్కడ నున్నటి మార్బుల్‌ తళతళ మెరిసే ఫ్లోరింగ్‌, ఆధునిక పరికరాలు, యంత్రాలతో నిండిన ల్యాబ్‌, లేబర్‌రూమ్‌, ఆపరేషన్‌ థియేటర్‌. హాస్పిటల్‌ నిండా తెల్లటి దుస్తులు వేసుకుని చిరునవ్వుతో దేవదూతల్లా తిరిగే వైద్యులు, నర్సులు. హెల్పర్స్‌తో కూడిన సమస్త సౌకర్యాలు.

ఎప్పుడైనా ఆ భవనమంతా తిరిగి చూస్తూ ఉంటే, అది ఆసుపత్రిలా ఉండదు. స్వర్గసుఖాల్ని పొందటానికి వెళ్లే భోగస్థలంలా ఉంటుంది.

అందులో డాక్టర్‌ వరద నిజంగా రోగుల పాలిట వరదాయినియే. ఆమె గొప్ప డాక్టర్‌ మాత్రమే కాదు. మంచి వ్యాపారవేత్త కూడా.

ఎన్నో క్లిష్టమయిన కేసుల్ని కూడా డీల్‌ చేసి విజయం సాధించిందామె. ఎక్కడెక్కడో తిరిగి, ఇక పిల్లలు పుట్టరని నిర్ధారణ చేసుకున్న స్త్రీలు ఇక్కడ అమ్మలయి వెళ్లారు.

ఆమె నడుస్తుంటే చైతన్యం కదులుతున్న ట్లుంటుంది.

ఆమె మెదడు ఎప్పుడూ ఓ ప్రయోగశాలలా పని చేస్తుంటుంది. రోజుకు పదిహేను గంటలు ‘ప్రతిసృష్టి’ లోనే ఉంటుంది.

బిడ్డల కోసం తపించే దంపతులు, మాతృదానం చేసే స్త్రీలు, ఆమె రాక కోసం ఎదురు చూస్తుంటారు.

ఒక్కొక్కసారి ఆమెకే ఆశ్చర్యంగా ఉంటుంది.

విజ్ఞానం పెరిగింది. అవకాశాలు అవధులు దాటి విస్తరించాయి. వీటిని అందుకుని స్వంతం చేసుకోగల ధనం సులువుగా సమకూడుతోంది. కానీ… ఇలా ఆ విజ్ఞానక్షేత్రాల్ని అందుకోవటానికి అర్రులు చాస్తున్న తీరు ఎలా ఉంది?

డాక్టర్‌ వరద వచ్చి కూర్చోగానే సిస్టర్‌ రిపోర్ట్‌ తెచ్చి ఇచ్చింది. ఆ రిపోర్టులు ఎవరివో ఆ మహిళను లోపలికి పంపమని చెప్పింది. రిపోర్టులు చూస్తూ… ‘పేరు` గాంధారి’. ‘‘బాగుంది’’ అనుకుంటూ నవ్వుకుంది డాక్టర్‌ వరద.

ఆమె వచ్చి కూర్చుంది. వయసు నలభై. కానీ అలా లేదు. తగ్గని అందంతో, అప్పుడే ముప్పయి దాటినట్లుగా ఉంది.

‘‘చెప్పండి! మీ రిపోర్ట్స్‌ చూశాను’’ అన్నది డాక్టర్‌ వరద.

సమస్య చెప్పి, ‘‘నా భర్త నుంచి నాకు పిల్లలు కలిగే అవకాశం తక్కువని తెలుసు. కానీ, నాకు పిల్లలు కావాలి. ఎలా…?’’ నేరుగా అడిగిందామె.

‘‘అవకాశాలున్నాయి. ఐ.సి.ఎస్‌.ఐ అనే పద్ధతుంది. కానీ, అది మీకు ఉపయోగపడుతుందా, లేదా అనేది ముందు తేల్చుకోవాలి!’’ చెప్పింది డాక్టర్‌ వరద.

 ‘‘నాకూ అదేె అనుమానం డాక్టర్‌! మావారు మంచి హేండ్‌సమ్‌ పర్సన్‌. మంచి ఆరోగ్యం. మరి.. నాకెందుకు పిల్లలు కలగడం లేదు?’’ సందేహం వెలుబుచ్చిందామె. ఆ ప్రశ్నలో ఆవేదనకన్నా అనుమానం, ఆసక్తి ఎక్కువున్నాయి.

‘‘రిపోర్టులనుబట్టి, మీలో లోపంలేదు. మీ వారిలో వీర్యకణాల సంఖ్య చాలా తక్కువగా ` టు పర్సెంట్‌ ఓన్లీ… అవీ చాల బలహీనంగా ఉన్నాయి. అదీ కారణం. మైక్రో ఇంజక్షన్‌ ద్వారా వీర్యకణాలను ‘అండం’లోకి పంపించి, ప్రయోగం చెయ్యాలి. దానికన్నా ముందు మీకు యాంటిబయొటిక్స్‌, హార్మోన్‌ ఇంజక్షన్స్‌ ఉంటాయి. మీ వయసును బట్టి, అవి ఎంతవరకు విజయవంతమౌతాయో ట్రీట్‌మెంట్‌ ద్వారా మాత్రమే తెలుస్తుంది’’ చెప్పింది వరద.

‘‘ఒకసారి మీ ప్రయోగశాల చూడాలనుంది!’’ అడిగింది గాంధారి.

‘‘షూర్‌. దానికేం! కానీ ప్రస్తుతం నాకు తీరిక లేదు. ఆ ప్రయోగశాల కూడా ఖాళీగా లేదు. అందులో ఓ తల్లి మాతృత్వ ప్రయత్నాలు జరిపించు కుంటోంది. రెండు గంటలు కూర్చుంటానంటే, ఓకే’’ చెప్పింది వరద.

‘‘వెయిట్‌ చేస్తాను. నా ప్రయోగానికి నేనే కర్తను కదా!’’ నవ్వింది గాంధారి. ‘‘ఓ.. కే’’ డాక్టర్‌ వరద అంగీకరించి అక్కడ నుంచి వెళ్లింది.

రెండు గంటల తరవాత తిరిగొచ్చి పిలిచింది డాక్టర్‌ వరద, ‘‘రండి.’’ గాంధారి చాల విచిత్రమైన మనిషిలా అనిపించిందామెకు.

డాక్టర్‌ వరద ఆమెను తన వెంట తీసుకువెళ్లి, అన్నీ చూపించి వివరించింది. గాంధారి ఆసక్తిగా అన్నీ పరికిస్తున్నది.

(సశేషం)

About Author

By editor

Twitter
YOUTUBE