– సంబరాజు లీల (లట్టుపల్లి)
అంతవరకూ గిలగిలా కొట్టుకున్న ఆ ప్రాణం శక్తి హీనమైంది. క్రమంగా కదలిక ఆగిపోయింది. దానికి కారణం చాలా చిన్నది.
ఆ పిండం ఆడపిల్ల కావటమే!
పెరిగిన విజ్ఞానం పుణ్యమాని, నాలుగు నెలలు దాటకుండానే చావు అంచును తాకింది ఆ ప్రాణి.
కుంతల పురిటినొప్పులు పడేవారి కన్నా ఎక్కువ దుఃఖిస్తున్నది. తాను కన్సివ్ అయినానని తెలిసి ఎంతో సంతోషపడిరది. ఆ ఆనందాన్ని వర్ణించగలిగే అక్షరాలు లేవు. ‘‘తను అమ్మ కాబోతున్నది… ఇంతవరకు ఇల్లాలు, గృహిణి, భార్య. ఇప్పుడు ‘అమ్మ’. అదే ఇప్పటి గొప్పదనం’’ అనుకుంది.
వారం రోజులు గడిచేసరికి కడుపులో తిప్పటం, ఏది తిన్నా వాంతి కావటం, ఆకలి మందగించటం, నీరసం, తినాలని ఉన్నా తినలేకపోవటం చూసి, ‘‘బాబోయ్! ఈ స్థితి తొమ్మిది నెలలు భరించాలా?’’ భయం నటిస్తూ అడిగింది అత్తగారిని.
‘‘ఆ… ఇదంతా మామూలే! మూడునెల్లు గడిచేసరికి అంతా సర్దుకుంటుంది. దబ్బపండు లాంటి కొడుకు పుడితే, అంతా మరిచిపోయి మరోసారి కనటానికి సిద్ధపడతారు!’’ అంది ఆవిడ, తేలిగ్గా.
‘అందుకే తల్లి.. ఆ పుట్టేవాడి కోసం ఇవన్నీ సహిస్తుంది’ అనుకుంది కుంతల. ఇంట్లోవాళ్లు, భర్త చేసే అపురూపం, అప్పుడప్పుడూ చేపపిల్లలా తుళ్లిపడే లోపలి ప్రాణి కదలికలు గమనిస్తూ అమ్మదనంలోని కమ్మదనాన్ని అనుభవిస్తున్నది.
మూడునెలలు గడిచేసరికి అంతా సర్దుకుని, కొద్దిపాటి మార్పులతో, పొత్తి కడుపు క్రింద గట్టిపడిన అమ్మలోని మార్పుల్ని తెలియజేస్తున్న ప్రాణి ఉనికిని గమనిస్తూ, ఏకమైన రెండు దేహాల కలయిక నుంచి, వెలువడిన నిట్టూర్పుల అందాల ఆనందాలు చిందించిన అణువు, సహస్రాణువులై, దేహంగా రూపుదాల్చిన ఆ సృష్టి విన్యాసాన్ని ఎవరు వర్ణించగలరు? అందుకే ఓ అద్భుత శిల్పి! నీ మహోన్నత ఔన్నత్యం ముందు మనిషిగా మోకరిల్లి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను’’ అనుకుంది భగవంతునికి స్మరిస్తూ.
కానీ… ఆనందాన్ని ఛిద్రం చేస్తూ ఆసుపత్రిలో ‘స్కానింగ్’ జరిగింది. ‘‘మగపిల్లాడా?’’ ఆతృతగా అడిగింది అత్తగారు. వాళ్లు జవాబివ్వలేదు. రిపోర్ట్సులో రాయలేదు.
కానీ, ఆవిడ వదల్లేదు.
రెండు మూడు చోట్ల చేయించారు, ఎవరో ఒకరు చెప్పకపోరని!
‘‘ఎందుకత్తయ్యా? నాకిది తొలిబిడ్డ. ఎవరయితే ఏమిటి!’’ అనునయించబోయింది కుంతల.
‘‘నువ్వూరుకో! అవకాశాల్ని అందుకుని ఉపయోగించుకోవాలి. మొదటి సంతానం అబ్బాయి కావాలి. మనింట్లో అంతా ఆడ మలయాళమే. ఎంతో ఎదురు చూశాక కాని, కల్యాణ్ పుట్టలేదు. వరసగా నలుగురు ఆడపిల్లలు. వంశోద్ధారకుడు లేడే అన్న దిగులు. ఎన్నో ఎదురుచూపుల తరువాత కానీ అబ్బాయి పుట్టలేదు. అప్పుడిన్ని అవకాశాలు లేక కన్నాను. ఇప్పుడు విజ్ఞానం పెరిగింది. ముందే తెలుసుకుని ఆనందించే అవకాశముందిప్పుడు. దాన్ని ఉపయోగించుకోవాలి కదా!’’ అంది.
అప్పటికి దాన్ని వదిలేస్తూ, ‘‘పోనీ తెలుసుకుని ఆనందిస్తారు’’ అనుకుంది కుంతల. వారం రోజులకే మరో ‘స్కానింగ్’కు అంతా తయారయితేె, ఎందుకో భయం వేసింది కుంతలకు.
స్కానింగ్ గురించి వణికిపోతూ ‘‘నిజంగానేె, ఆ ప్రాణి ఆడపిల్లయితేె…’’ అన్న ఆలోచన రాగానే బాగా భయపడిరది.
దాన్ని నిజం చేస్తూ ఓ హాస్పిటల్లో, ఎన్ని నిబంధన లున్నా, బాధ్యత మరిచిన ఆ డాక్టర్, ‘అమ్మాయి’ అని చెప్పేశారు. అది తెలియగానే గాజులు వేయవచ్చు, పట్టు లంగాలు, నగలు వేయొచ్చు అనుకొన్నది కుంతల. కానీ ఆ కబురు విన్నాక అత్తింటి వారందరిలో వచ్చిన మార్పు ఆమెను బాగా భయపెట్టింది. అత్తగారిస్తున్న బొప్పాయిరసం తాగనని వారించింది. అభ్యర్థిం చింది, ఏడ్చింది.
చివరికి ఓడిపోయింది. భర్త సహకారం కూడ లేని ఆమె, నెలలు నిండకుండానే నొప్పులు పడుతున్నదిప్పుడు, పురిటి మంచం మీద.
* * * * * * *
డాక్టర్ వరద, ‘పృథ్వి ప్రతిసృష్టి సంతాన సాఫల్య కేంద్రం’లో అధితి డాక్టర్ ముందు కూర్చుని ఉంది. ఆమె కూర్చున్న ఆ కుర్చీయే ఎంతో సదుపాయంగా, గర్భిణులకు ఏ మాత్రం అలసట కలిగించనంతగా, అమ్మ ఒడిలా ఉంది. వెనుకకు ఆనుకుని కూర్చున్న అధితికి, హార్లిక్స్ కలిపి ఇస్తూ, ‘ఓకే. తాగాక అలా పడుకో అధితి, చెకప్ చేస్తాను! నీ చిన్నారి బొజ్జలో, రాక్షసుడిలాంటి దుష్టుని అణగదొక్కెే ఏ వామనుడున్నాడో చెక్ చేస్తాను!’’ అంది ధైర్యం చెబుతూ భుజం తట్టి.
‘‘మీరు డాక్టరయినా పురాణగాథ భలేగా చెప్పారు. వామనుడేనని ఎందుకనుకుంటు న్నారు? ‘యోగమాయ’ కావచ్చుగా!’’ అంది అధితి.
‘‘అలా అనిపించటం లేదు. బలిచక్రవర్తిని మూడడుగుల భూమిని దానం కోరిన త్రివిక్రముడేె అనుకుంటున్నాను’’ అంటూ స్టెత్ తీసుకుంది. డాక్టర్ వరద చిరునవ్వు చల్లగా, లలితంగా ఉంటుంది. ఆమె చదువు, వ్యక్తిత్వం, కేవలం శాస్త్రీయ దృక్పథంగానేె ఉంటాయి.
ఆమె ఏ కేసులో అటెండయినా, అందులోకి డాక్టరుగా శాస్త్రవేత్తగా ప్రవేశిస్తుంది. ఆ రోజు ఆమె చెకప్ చేస్తున్నది అధితిని. కశ్యప్‌చంద్రల ఐ.వి.ఎఫ్ (IVF) ఇన్ విట్రా ఫెర్టిలైజేషన్ కేసు. శుద్ధి చేసిన వీర్యకణాల్ని అండంతో ల్యాబ్‌లో ఫలదీకరించి, ఆ పిండాన్ని ఆమె గర్భంలో ప్రవేశపెట్టారు.
అధితికి చక్కటి భర్త, సంసారం. కోరుకున్న అంతస్తు` సోషల్ కమ్యూనిటిలో పెద్ద ఉద్యోగంతో. మంచి స్థితి ఉన్న జీవితం. ఒకే ఒక లోటు. ఉద్యోగం, టెన్షన్ లాంటి కారణాలతో, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయి, గర్భసంచి కుంచించుకు పోయింది. ఫలితంగా భర్తతో గర్భం దాల్చలేక ఐ.యు.వి.(IVF) ఇంట్రా యుటిలైన్ ఇంజక్షన్ పద్ధతి ఎంచుకుంది. ఈ పద్ధతిలో శుద్ధి చేసిన శుక్ర కణాల్ని మైక్రో ఇంజక్షన్ ద్వారా అండంలోకి పంపి, దాన్ని ల్యాబ్‌లో ఫలదీకరించిన తరువాత తల్లి గర్భంలో ప్రవేశపెడతారు.
ఆ పద్ధతిలో అధితికి ఇప్పుడు రెండో నెల.
అధితి కూడ నవ్వుతూ, ‘‘అబ్బాయేనని కమిటయ్యారా?’’ అడిగింది.
‘‘అంత గట్టిగా తెలవదు. అనుకుంటున్నాను’’ అంది. కానీ, ఆమెకు తెలుసు. అది ఎక్స్ ఎక్స్ క్రోమోజోములు కాక, ఎక్స్, వై (xy) క్రోమోజములు కలసిన పిండమని.
అథితి తన పొట్టను అపురూపంగా చూసుకుంది. ఇంతవరకు తనలో ఎలాంటి కదలికా కనిపించలేదు. డాక్టర్ వరద, తన భర్త వీర్యకణాలతోనే తనను తల్లిని చేస్తుంది. నిజానికిది నాల్గు గోడల మధ్య అతి రహస్యంగా జరగాల్సిన తతంగం.
ముగ్ధ మోహనరూపంలో తొలిరాత్రి భర్తను చేరిన ఆడపిల్ల, అపురూపంగా దాచుకున్న అనుభవంతో అమ్మను చేసిన- సంఘటన. కానీ పెరిగిన విజ్ఞానంతో, ధనవ్యామోహంతో కాలాన్ని దుర్వినియోగ పరిచినందుకు ప్రతిసృష్టి కేంద్రంలో భర్త సహాయానికి బదులు, డాక్టరు చేత తల్లి కాబోతున్నాను కదా! అనుకుంది ఎంతో గొప్ప కంప్యూటర్ ఇంజనీర్ అధితి.
కంప్యూటర్ స్క్రీన్‌ను పరిశీలిస్తున్న డాక్టర్ వరద కనుబొమ్మలు ముడిచింది.
చిన్న ఉదరంలో, గాజు తొట్టిలాంటి, మాతృగర్భ సముద్రంలో చిన్న నీటి బొట్టులా, ఓ చిన్న నల్లని చుక్క, గులాబీరంగు పలుచని పొరల మధ్య, ఓ ప్రాణిరూపంలో నిలబడి కనిపించింది.
కదలిక లేదు.
‘‘హుష్…’’ అంటు ఆపి, ‘‘రిలాక్సయి అలా కూర్చో అధితి’’ చెప్పింది.
డాక్టర్ చెబుతున్న తీరులోనే, ఆ విధానంలోనే ఏదో అపశ్రుతి వినిపించింది ఆమెకు. అయినా అందరు తల్లుల్లా కంగారుపడలేదు. ‘‘ఏమయింది డాక్టర్!’’ ప్రశ్నించింది. చేస్తున్న ప్రాజెక్టు వర్కులో ‘గోల్’ చేరుకోలేని ఇంజనీర్‌లా.
అయినా, తల్లిని కాలేకపోతున్నట్టు ఆ గొంతులో దీనత్వం వినిపిస్తున్నది.
‘‘సారీ… ఏమి చేయలేనమ్మా! నీ గర్బకోశం నీ బిడ్డ పెరగటానికి అనువుగా లేదు!’’ విచారిస్తున్నట్టు చెప్పింది.
‘‘మరీ.. నేను తల్లయ్యే మార్గం లేదా?’’ అధితి కళ్లల్లో నీళ్లు ముంచుకొచ్చాయి.
‘‘ఇలాంటి గర్భస్రావాలు మూడయ్యాయి. దీన్నిబట్టి లేనట్టె. అయితే ‘సరోగసి’ ద్వారా తల్లి కావచ్చు!’’ చెప్పింది.
‘‘అంతకన్నా మార్గం లేదా?’’ ప్రశ్నించింది.
‘‘ఉండొచ్చు. ఉండకపోవచ్చు. అయితే ఈసారి నీతోపాటుగా ఎవరయినా గర్భాన్ని సరోగేట్ చేస్తే, ఐ.వి.ఎఫ్ (IVF) – అంటే శుద్ధి చేసిన వీర్యకణాల్ని, అండాల్ని ల్యాబ్‌లో ఫలదీకరించి, గర్భంలో ప్రవేశపెడతారు. ఈ పద్ధతి మీకు, మాతృదానం చేసే మరో స్త్రీకి ప్రయోగించి చూద్దాం. మీ విషయంలో విజయవంతం అయితే , ఆ అమ్మ అద్దెగర్భం అవసరం లేదనుకోవచ్చు.’’ తేలికగా చెప్పేసింది.
అప్పటికి అధితి మౌనంగా ఉండటంతో, ‘‘అధితి! ఇది చాలా చిన్న విషయం. అక్కడా ఇక్కడా నీ భర్త వీర్యకణాలేె, నీ అండాలేె ఉంటాయి. అది నీవల్ల విజయం సాధించలేకుంటే, ఆ అమ్మాయిలు అద్దె గర్భాన్ని ఉంచుకోవచ్చు లేదా` నీ దగ్గరే సక్సెసయితే… సమస్యే ఉండదుగా!’’ ఇంకాస్త విడమరిచి చెప్పే ప్రయత్నం చేస్తూ నవ్వింది డాక్టర్ వరద.
‘‘మనకింత తొందరలో గర్భాన్ని అద్దెకిచ్చె అమ్మలెవరు దొరుకుతారు? దొరికినా వెంటనే ఎవరంగీకరిస్తారు?’’ అమాయకంగా ప్రశ్నించింది అధితి. ఆమె కంప్యూటర్ ఇంజనీర్‌నన్న విషయం గుర్తుకు వచ్చినట్టు అంది.
‘‘గూగుల్ కొట్టి లాగిన్ అయితే చాలు, సమాచారమంతా వస్తుందని తెలుసు. కానీ… ఇలా అమ్మ కావాలి అనుకోగానేె, తమ గర్భాన్ని అద్దెకిచ్చె అమ్మలు రోజుల్లోనే దొరుకుతారంటేె ఆశ్చర్యమే!’’
వరద మరోసారి సన్నగా నవ్వి, ‘‘నీవా విషయం వదిలెయ్యి అధితి! ముందు నీకిది అంగీకారమేనా, కాదా? ఆ విషయం తేల్చి చెప్పు. నిజంగా చెప్పు! నిజంగా నీకు సంతానం కావాలంటేె, ఇద్దరికి ఐ.వి.ఎఫ్ పద్ధతిలో సుమారు ఆరు నుండి ఎనిమిది లక్షలవరకు కావచ్చు!’’ అసలు విషయం చెప్పింది వరద.
‘‘ఖర్చు విషయం వదిలేయండి డాక్టర్! ఇప్పటికిప్పుడు తమ అపురూపమైన మాతృత్వాన్ని దానమిచ్చే వారెవరుంటారు?’’ నమ్మలేనట్లుగా అడిగింది.
‘‘ఇది దానం కాదు, వాళ్లను ‘దాతలు’ అనటానికి! ఇది విజ్ఞానంతో చేస్తున్న వ్యాపారం. అన్నీ అమ్మటం కొనడం అన్నట్టే గర్భాన్ని అద్దెకిస్తున్నారు. ఇక్కడ అవసరానికి దాతృత్వాన్ని జత చేస్తున్నామంతే! నీకెందుకు? రేపీపాటికి నీ గర్భాన్ని మోయటానికి ఆరోగ్యవంతమైన స్త్రీ సిద్ధంగా ఉంటుంది!’’ చెప్పింది, ఇంకా నమ్మలేనట్లుగా చూస్తున్న అధితితో.
‘‘అద్దె అమ్మలుగా గర్భాలను అద్దెలకివ్వటం సర్వ సాధారణమయిందిప్పుడు. అలాంటి వాళ్లున్నందుకే మరి, ఇన్ని సంతాన సాఫల్య కేంద్రాలు పుట్టు కొచ్చాయి. అఫ్‌కోర్స్! ఎంతోమంది స్త్రీలు గొడ్రాళ్లుగా మిగిలిపోకుండా మాతృమూర్తుల్ని చేస్తున్నది సరోగసీ!’’ అంటూ లేచింది.
డాక్టర్ వరద ఎప్పటికప్పుడు కొత్త విషయాలతో, వరిశోధనలతో, శాస్త్రంతో కుస్తీ పడుతుంటుంది. పరికరాలతో పరిశోధించినట్లుగా, ఇప్పుడు మనుషులు, వారి అవసరాలతో అనురాగం, అమ్మల మధ్య శాస్త్రవేత్తగా నిలబడిరది.
(సశేషం)