‌సార్వత్రిక ఎన్నికలు జరిగే సంవత్సరంలో ప్రవేశపెట్టే బడ్జెట్టులో పౌరులకు రాయితీలు ప్రకటించి, తమపై గల వ్యతిరేకతను తొలిగించుకునే ప్రయత్నం ప్రభుత్వాలు చేయడం మనకు తెలిసిన విషయమే. కానీ, ఈ సంవత్సరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ పని చేయకపోవడం అనేకమందిని నిరాశపరిచిందనే చెప్పాలి. ప్రతిపక్షాలు కూడా ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని యత్నించాయి. కానీ, అంతర్జాతీయ విత్త సంస్థ (ఐఎంఎఫ్‌) ‌మాత్రం ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్‌ ఆర్ధిక క్రమశిక్షణను అనుసరించడాన్ని తెగ ప్రశంసించేసింది. అంతేకాదు, ఈ చర్యవల్ల ప్రపంచంలోనే ఆశాజనకమైన ప్రదేశంగా భారత్‌ ‌తన స్థానాన్ని నిలుపుకుందంటూ పేర్కొనడం విశేషం.

ప్రపంచంలోని పలుదేశాలు యుద్ధాలు సహా వివిధ కారణాల వల్ల ఆర్ధిక తిరోగమనంలోకి వెళ్లిపోతున్న క్రమంలో భారత్‌ ఇం‌తటి సానుకూల ప్రగతిని చూపడం చిన్న విషయం కాదు. ఎంతో ప్రణాళికాబద్ధంగా ఆర్ధిక అంశాలను నిర్వహిస్తే తప్ప ఇటువంటి పురోగతిని సాధించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే ఐఎంఎఫ్‌ ఆసియా- పసిఫిక్‌ ‌విభాగం డైరెక్టర్‌ ‌కృష్ణ శ్రీనివాసన్‌ ఒక వార్తా సంస్థకు ఇటీవలే ఇంటర్వ్యూ ఇస్తూ, ‘‘స్థూల మూలసూత్రాలు బాగున్నాయ’’ంటూ ప్రశంసించడమే కాదు భారతీయ ఆర్ధికవ్యవస్థ బాగుందంటూ పేర్కొనడం చిన్న విషయం కాదు. ప్రపంచంలో నెలకొని ఉన్న పరిస్థితుల నడుమ 6.8శాతం రేటుతో వృద్ధి చెందడం మంచి పరిణామమని పేర్కొనడం గమనార్హం. భారత ద్రవ్యోల్బణం రేటు తగ్గుతూ, ప్రస్తుతం 5శాతానికన్నా తక్కువకు వచ్చిందని ప్రశంసించారు.

‘‘ఎన్నికల ఏడాదిలో ఆర్ధిక క్రమశిక్షణను నిర్వహించడాన్ని పట్టి చూపవలసిందే, ఎందుకంటే ఎన్నికల సంవత్సరంలో దేశాలు ఆర్ధిక సాహసాలకు పూనుకుంటుం టాయ’’ని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం క్రమశిక్షణను పాటించింది. దేశాలు నిలకడైన వృద్ధితో సుసంపన్నం అయ్యేందుకు స్థూల మూలసూత్రాలే ఆధారమనే విషయాన్ని గుర్తించడం ఎంతో ముఖ్యమని కూడా శ్రీనివాసన్‌ ‌చెప్పారు.

గత కొన్నేళ్లుగా, భారత్‌ ‌పలు ఆర్ధిక షాక్‌లను సమర్ధవంతంగా దాటుకు వచ్చింది. నేడు ప్రపంచం లోనే వేగంగా పెరుగుతున్న ప్రధాన ఆర్ధిక వ్యవస్థల్లో ఒకటి అయిందని ఆయన వెల్లడించారు. నిజమే, కొవిడ్‌ అనంతర పరిస్థితులు కారణంగా ఉత్పత్తి నిలిచిపోవడం, డిమాండ్‌ ‌పడిపోవడం సహా అనేక కారణాల వల్ల భారీ నుంచి ఒక మాదిరి ఆర్ధిక వ్యవస్థల వరకూ దాదాపు స్తంభించిపోయాయి. ఆ సమయంలో కూడా మోదీ ప్రభుత్వ హేతుబద్ధమైన ప్రణాళికలతో భారత్‌ ‌వృద్ధి కథనం ఎక్కడా నిలిచిపోలేదు. అందుకే, ఇన్ని ఇక్కట్ల నడుమ కూడా మన ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించింది. అంతేకాదు, ప్రైవేటు డిమాండు, ప్రభుత్వ పెట్టుబడి ప్రోత్సాహంతో నిలకడైన వృద్ధిని సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

భారత వృద్ధికి దోహదం చేసిన అంశాలలో డిజిటల్‌ ‌ప్రజా మౌలిక సదుపాయాలు (డిపిఎ) కీలక పాత్రను పోషిస్తున్న విషయాన్ని చెప్పకతప్పదు. ఇది ఉత్పాదకతను పెంచడం ద్వారా వ్యక్తులు మెరుగ్గా పని చేసేందుకు దోహదం చేస్తోందని ఐఎంఎఫ్‌ అధికారి పేర్కొనడం గమనార్హం. సమ్మిళిత ఆర్ధిక వ్యవస్థను ప్రోత్సహిస్తూ అందరికీ విత్తం అందుబాటు లోకి వచ్చేలా నిర్ధారించేందుకు నూతన భావనలను, ఆవిష్కరణలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న విషయాన్ని కూడా శ్రీనివాసన్‌ ‌పట్టి చూపారు. అంతేకాదు, ఈ డిపిఐ చొరవ ప్రభుత్వరంగ సామార్ధ్యాన్ని క్రమబద్ధం చేయడంతోపాటుగా ఆర్ధిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది.

ప్రతి ఏడాదీ 15 మిలియన్ల యువత కార్మికశక్తికి తోడవుతుందని అంచనా. భారతీయ యువత దేశ ఆర్ధిక భవిష్యత్తుకు దోహదం చేయనుంది. కనుక, దీనిని కూడగట్టవలసిన అవసరం ఉంది. నిలకడైన వృద్ధి, సంపన్నత కోసం విద్య, ఆరోగ్య సంక్షేమ రంగంలో, కార్మిక రంగంలో సమగ్ర సంస్కరణలు అవసరం. ఎఐ వంటి అత్యాధునాతన సాంకేతికత లను అనుసరించే నైపుణ్యాలను యువతకు బోధించడం అవసరం. విద్య, ఆరోగ్య సంక్షేమంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టే ముందు మారుతున్న ఉపాధి మార్కెట్టుకు తగిన సంసిద్ధతను కార్మిక శక్తి కలిగి ఉండేలా నైపుణ్యాలను మెరుగుపరచక తప్పదు.

కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌ 5 ‌వారాంతానికి విదేశీ మారక నిల్వలు 2.98 బిలియన్లు నుంచి 648.562 బిలియన్‌ ‌డాలర్లకు పెరిగినట్టు ప్రకటించింది. పైగా, 2024లో భారత్‌ 6.5‌శాతం వృద్ధిని సాధిస్తుందని యుఎన్‌సిటిఎడి తన నివేదికలో పేర్కొంది. భారత్‌ ‌సుమారు 6.5 శాతం వృద్ధిరేటు సాధిస్తుందని ఇంతకుముందు పేర్కొన్న ఐఎంఎఫ్‌, ‌తన సూచనను సవిరించి ప్రస్తుతం 6.8 శాతం వృద్ధి రేటును ప్రకటించింది. కేవలం ఐఎంఎఫ్‌ ‌మాత్రమే కాదు, ప్రపంచ బ్యాంకు కూడా తను ఇంతకు ముందు సూచన అయిన 6.4 శాతం నుంచి 6.6శాతం వృద్ధిని ప్రదర్శిస్తుందని పేర్కొంది.

వీటితో పాటుగా ఈ వృద్ధి రేటును సవరించిన పెద్ద సంస్థలు పలు ఉన్నాయి. అందులో ఫిచ్‌ ఈ ‌రేటును ముందు 6.5 శాతం అంటూ అనంతరం 7.0 శాతానికి, ఎడిబి 6.7శాతం నుంచి 7.0 శాతానికి, సిటీ బ్యాంక్‌ 6.4 ‌శాతం నుంచి 6.8శాతానికి సవరించుకున్నాయి. అంతర్గతమైన డిమాండ్‌, ‌వినియోగం ఉండటం వల్లనే ఈ వృద్ధి సాధ్యమవుతోంది. ఎంతో క్రమశిక్షణతో, ప్రణాళికతో అందరినీ కలుపుకుపోతూ ముందుకు వెడుతున్నారు కనుకనే ఈ పురోగతి సాధ్యమైందన్న విషయాన్ని విస్మరించడం తగదు.

జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE