ఇ‌జ్రాయెల్‌-ఇరాన్‌ల మధ్య ఆధిపత్యపోరు మధ్యాసియా ప్రాంతాన్ని  నిత్యాగ్నిగుండంగా మార్చింది. ఆ ప్రాంతమే మరోసారి ప్రతీకార జ్వాలలతో ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 1949లో ఇజ్రాయెల్‌ను సార్వభౌమ దేశంగా ఐక్యరాజ్యసమితి వేదికగా గుర్తించిన ఇరాన్‌, ఇప్పుడు ఆ దేశ ఉనికి తనకు సుతరామూ ఇష్టంలేదంటూ అడ్డం తిరగడమే వింత. ఈ నేపథ్యంలో రెండు దేశాలు ఒకరి ప్రాబల్యాన్ని మరొకరు అడ్డుకుంటూ మధ్యప్రాచ్యాన్ని మంటల్లోకి నెట్టాయి. ఇందుకోసం ఇరాన్‌  ‌హిజ్‌బుల్లా; హమాస్‌, ‌హౌతీ ఉగ్రవాదులను ఎగదోస్తున్నాయి.  అమెరికా సాయంతో ఇజ్రాయెల్‌ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొని దేశ రక్షణకోసం, దాడుల కోసం వినియోగించుకుంటున్నది.  ఇరాన్‌కు వ్యతిరేకంగా పనిచేసే పీపుల్స్ ‌ముజాహిద్దీన్‌ ఆఫ్‌ ఇరాన్‌, ‌జుండెల్లా మిలిటెంట్‌ ‌సంస్థలకు మద్దతునిస్తోంది. సిరియా అంతర్యుద్ధంలో ఇరాన్‌ అక్కడి ప్రభుత్వానికి మద్దతునిస్తే, ఇజ్రాయెల్‌ ‌విపక్షా లకు అండగా నిలిచింది. గత ఏడాది అక్టోబర్‌ 7‌న ఇరాన్‌ ‌మద్దతున్న హమాస్‌ ‌తీవ్రవాదులు జరిపిన అమానుష దాడి తర్వాత, ఇజ్రాయెల్‌ ‌గాజా లోని ఈ ఉగ్రవాద సంస్థపై తీవ్రస్థాయిలో దాడులకు పాల్పడటంతో ఒక్కసారిగా మధ్య ప్రాచ్యం ఉద్రిక్త పరిస్థితులక• నెలవైంది.

లెబనాన్‌కు చెందిన హిజ్‌బుల్లా ఉగ్రవాద సంస్థకు ఇరాన్‌ ఆయుధాలను అందిస్తుంటుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్‌ను నిలువరించే ప్రయత్నం ఈ ఉగ్రసంస్థ చేస్తోంది. ఈ నేపథ్యంలో హిజ్‌బుల్లాకు ఆయుధాల సరఫరాలో ఖుద్స్ ‌దళాల సీనియర్‌ ‌కమాండర్‌ ఇరాన్‌ ‌బ్రిగేడియర్‌ ‌జనరల్‌ ‌మహమ్మద్‌ ‌రెజా జెహాదీ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ ఉగ్రసంస్థకు ఆయుధాల సరఫరా ఇష్టం లేని ఇజ్రాయెల్‌ ‌దీన్ని అడ్డుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్ని స్తుంటుంది. అంతేకాదు ఇరాన్‌ ‌సైనికంగా బలోపేతం కావడం ఇజ్రాయెల్‌కు సమ్మతం కాదు. ఈ నేపథ్యంలో సిరియా రాజధాని డెమాస్కస్‌లోని ఇరాన్‌ ‌రాయబార కార్యాలయంలో మహ్మద్‌ ‌రెజా జెహాదీ నేతృత్వంలో సమావేశం జరుగుతున్నదన్న పక్కా సమాచారంతో ఏప్రిల్‌ 1‌వ తేదీన ఇజ్రాయెల్‌ ‌వైమానిక దాడి జరిపింది. ఇందులో 13మంది మరణించారు. మృతులలో మహమ్మద్‌ ‌రెజా జెహాదీ కూడా ఉన్నారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ‌జరిపిన ప్రతీకార దాడికి తక్షణ కారణం ఇదీ!

ఇరాన్‌ ‌దాడి

తమ సీనియర్‌ ‌కమాండర్‌ ‌మరణానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఏప్రిల్‌ 13‌వ తేదీ అర్థరాత్రి దాటిన తర్వాత ఇరాన్‌ ‌దాడులకు దిగింది. ఈదాడుల్లో ఇరాన్‌ 300 ‌డ్రోన్‌లు, క్షిపణలు ప్రయోగించింది. వీటిల్లో 170 డ్రోన్లు, 30 క్రూయీజ్‌ ‌క్షిపణులు, 110 బాలిస్టిక్‌ ‌మిస్సైల్స్ ఉన్నాయి. వీటిల్లో 99% డ్రోన్లు, క్షిపణులను తన గగన తలానికి రాకముందే ఇజ్రాయెల్‌ ‌కూల్చేసింది. యు.ఎస్‌, ‌యు.కె, ఫ్రాన్స్, ‌జోర్డాన్‌ ‌దేశాలు ఇజ్రాయెల్‌కు సహకరించాయి. అయితే వీటిల్లో ఐదు బాలిస్టిక్‌ ‌క్షిపణులు ఇజ్రాయెల్‌లో ప్రవేశించగా, నాలుగు నవాటిమ్‌ ‌వైమానిక స్థావరంపై పడ్డాయి. ఈ స్థావరం దక్షిణ ఇజ్రాయెల్‌లోని నెగెవ్‌ ఎడారి ప్రాంతంలో ఉంది. ఇక్కడే అతిముఖ్య మైన ఎఫ్‌-35 ‌వంటి ఆధునిక యుద్ధ విమానాలను ఇజ్రాయెల్‌ ఉం‌చుతుంది. ఇరాన్‌ ‌ప్రధాన లక్ష్యం కూడా ఇదే. అయితే ఈ వైమానిక స్థావరం స్వల్పంగా దెబ్బ తిన్నట్టు ఇజ్రాయెల్‌ ‌చెబుతోంది. విశేషమేమంటే ఇరాన్‌ ‌దాడుల ప్రణాళికల గురించిన నిఘా సమాచారాన్ని ఎప్పటికప్పుడు సౌదీ అరేబియా ఇజ్రాయెల్‌కు అందజేసింది. దీని ఫలితంగానే ఇజ్రాయెల్‌ ‌రక్షణ వ్యవస్థను క్రియాశీలకం చేసి, దాడిని తిప్పికొట్టగలిగింది.

సమర్థించుకున్న ఇరాన్‌

‘‘ఐక్యరాజ్య సమితిలోని బాధ్యతాయుత సభ్యురాలిగా, సమితి చార్టర్‌లోని 51 అధికరణకు అనుగుణంగా తమ దౌత్య కార్యాలయంపై జరిగిన దాడికి ప్రతీకారంగా మాత్రమే ఇజ్రాయెల్‌పై దాడిచేశాం’’ అని ఇరాన్‌ ‌స్పష్టం చేసింది. తమ కాన్సులేట్‌పై జరిపిన దాడి దౌత్య సంబంధాలపై 1961 వియన్నా సదస్సు తీర్మానాన్ని అతిక్రమించడమేనని స్పష్టం చేసింది. ఈ ప్రతీకార దాడులను ఇంతటితో నిలిపేస్తున్నామని, ఇజ్రాయెల్‌ ‌ప్రతిక్రియకు దిగకుండా అంతర్జాతీయ సమాజం కలుగజేసుకోవాలని కూడా ఇరాన్‌ ‌కోరింది. దీనికి స్పందిస్తూ అమెరికా, బ్రిటన్‌, ‌యూరప్‌ ‌దేశాలు ఇజ్రాయెల్‌ను ప్రతీకార చర్యకు పాల్పడవద్దని హెచ్చరించినప్పటికీ ఖాతరు చేయకపోవడం గమనార్హం. ఇజ్రాయెల్‌ ‌ప్రధాని బెంజిమెన్‌ ‌నెతన్యాహు ఏప్రిల్‌ 17‌న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ‘‘మా దేశాన్ని రక్షించుకోవడానికి స్వతంత్ర నిర్ణయం తీసుకునే హక్కు మాకున్నది’’ అని స్పష్టం చేయడంతో పాశ్చాత్య దేశాల హెచ్చరికలను బేఖాతరు చేసినట్లయింది. ఇదే సమయంలో ముంబయిలోని ఇరాన్‌ ‌తాత్కాలిక కౌన్సెల్‌ ‌జనరల్‌ ‌దావూడ్‌ ‌రెజాయ్‌ ఎకందరీ ఈ పరిణామాలపై చేసిన వ్యాఖ్యలు ఇరాన్‌ ‌వైఖరిని మరోమారు స్పష్టం చేశాయి ఇరాక్‌తో యుద్ధం ముగిసిన తర్వాత పాలస్తీనా సమస్యకు తమదేశం ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కారాన్ని చూపిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పాలస్తీనా అనేది ముస్లింలు, యూదులు, క్రైస్తవులు అందరూ నివసించే ప్రాంతం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ వర్గాలన్నీ ఓటింగ్‌లో పాల్గొని ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. ఇదే పాలస్తీనాకు తాము చూపిన ఉత్తమ ప్రజాస్వామ్య పరిష్కారమని చెబుతూ, ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా తాము గుర్తించబోమని స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్‌ ‌ప్రతి దాడులు

అంతర్జాతీయ సమాజం వారిస్తున్నా వినకుండా ఇరాన్‌ ‌దాడికి ప్రతీకారం గా ఇజ్రాయెల్‌ ఏ‌ప్రిల్‌ 19 ‌తెల్లవారుజామున ఇరాన్‌పై క్షిపణుల దాడి చేసింది. ఇరాక్‌లోని ఇరాన్‌ అనుకూల సైనికస్థావరంపై ఐదు బాంబు పేలుళ్లు జరిగాయని, ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డట్టు సి.ఎన్‌.ఎన్‌. ‌వార్తా సంస్థ తెలిపింది. దక్షిణ సిరియాలోని సిరియా సైనిక స్థావరాలు అస్‌-‌సువేదా, దారాలు కూడా ఈ దాడులకు గురయ్యాయని, ఆ దేశ మీడియా పేర్కొనగా, దారాలోని ఖద్రా, ఇజ్రా రాడార్‌ ‌సైనిక స్థావరాలు ఈ దాడులకు గురయ్యాయని ‘అస్‌ ‌సువేదా-24’ అనే స్థానిక వార్తాసంస్థ వెల్లడించింది. మధ్య ఇరాన్‌కు చెందిన అతిపెద్దదైన ఇస్‌ఫహాన్‌ ‌నగరంపై కూడా ఇజ్రాయెల్‌ ‌క్షిపణులతో దాడి చేసింది. ఇక్కడ అతిపెద్ద వైమానిక స్థావరం, సైనిక మౌలిక వసతులు, అతిపెద్ద క్షిపణుల తయారీ కేంద్రం, అణుకేంద్రాలు ఉన్నందువల్లనే ఇజ్రాయెల్‌ ‌దీన్ని లక్ష్యంగా చేసుకుంది.ఈ పట్టణంలోని విమానాశ్రయం, సైనిక స్థావరానికి సమీపంలో పేలుళ్లు జరిగిన నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లోని తన వాయు రక్షణ వ్యవస్థలను ఇరాన్‌ ‌క్రియాశీలం చేసింది. అయితే ఈ దాడుల్లో ఇరాన్‌లోని అణు కేంద్రాలకు నష్టం వాటిల్లలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ చీఫ్‌ ‌రాఫెల్‌ ‌మారినో గోసీ స్పష్టం చేస్తూ, ఇరుపక్షాలు సంయమనం పాటించాలని కోరారు. ఇస్‌ఫహాన్‌ ‌పట్టణంలోని సైనిక వైమానిక స్థావరం దాడులకు గురైనట్లు న్యూయార్క్ ‌టైమ్స్ ‌పేర్కొంది. ఇరాన్‌ ‌దాడికి ప్రతీకారమే ఈ దాడులని ఇజ్రాయెల్‌ ‌పేర్కొంటున్నది. ఇరాన్‌ ‌దాడుల తర్వాత ఇజ్రాయెల్‌ ‌గాజాపై జరిపిన దాడిలో హమాస్‌ ‌భద్రతాధికారి యూసఫ్‌ ‌రఫీక్‌ అహ్మద్‌ ‌షాబాత్‌ ‌మరణించాడు. ఈయన హమాస్‌ అం‌తర్గత విచారణ శాఖకు అధిపతి. ప్రపంచంలోనే మెరుగైన రక్షణ వ్యవస్థల్లో ఒకటిగా పేరొందిన ఎస్‌-300 ‌వ్యవస్థను ఇజ్రాయెల్‌ ‌క్షిపణి దాడిలో ధ్వంసం చేసినట్టు న్యూయార్క్ ‌టైమ్స్ ‌తాజా కథనం పేర్కొంది. నంతాజ్‌ అణుకేంద్రానికి రక్షణగా ఉన్న ఈ వ్యవస్థను విమానం నుంచి ప్రయోగించిన రాడార్‌కు దొరకని క్షిపణిని ప్రయోగించి ధ్వంసం చేసిందని వివరించింది. ఈ దాడి ఏప్రిల్‌ 19‌వ తేదీ రాత్రి వేళల్లో జరిగింది. అదే విధంగా ఇరాక్‌లోని ఇరాన్‌ అనుకూల పాపులర్‌ ‌మొబిలైజేషన్‌ ‌ఫోర్సెస్‌ (‌పీఎంఎఫ్‌) ‌సైనిక స్థావరంపై ఏప్రిల్‌ 20‌న జరిగిన దాడిలో ఒకరు మృతిచెందగా ఎనిమిదిమంది గాయపడ్డారు. ఇరాన్‌ ‌మద్దతున్న షియా మిలిటెంట్‌ ‌సంస్థల్లో పీఎంఎఫ్‌ ఒకటి.

ఇజ్రాయెల్‌ ఆధిపత్యం

ప్రస్తుతం ఇరాన్‌తో జరుగుతున్న ఘర్షణలో ఇజ్రాయెల్‌ ‌తన ఆధిపత్యాన్ని చాటడంతో, దాని సహచర దేశాల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. కాకపోతే అంతర్జాతీయంగా వస్తున్న వత్తిడుల నేపథ్యంలో రెండు పక్షాలు పూర్తిస్థాయి యుద్ధానికి దిగడంలేదు. అయితే ఇజ్రాయెల్‌పై, సైనికంగా ఆధిపత్యం సాధిం చేందుకు ఇరాన్‌ ‌ఫ్రాక్సీలైన హిజ్‌బుల్లా తదితర ఉగ్రవాద గ్రూపులను పూర్తి స్థాయిలో రంగంలోకి దించలేదన్న సంగతిని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌ ‌స్వీయరక్షణ సామర్థ్యాన్ని దెబ్బతీసే లేదా గణనీయంగా తగ్గించే సామర్థ్యం హిజ్‌బుల్లా సంస్థకు ఉంది. ఇదిలావుండగా అవసరమైన సమయంలో ఇజ్రాయెల్‌కు అరబ్‌, ‌పశ్చిమదేశాల మద్దతు పుష్కలంగా లభిస్తుందన్న సత్యాన్ని కూడా ఈ యుద్ధం స్పష్టం చేసింది. ఒకవైపు ఇరాన్‌లో ఈ ప్రతీకార దాడులకు హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా మరోవైపు ఇజ్రాయెల్‌ ‌స్వీయ రక్షణ సామర్థ్యం మరోసారి ప్రపంచానికి వెల్లడైంది.

ఇరాన్‌కు మద్దతు ఎవరు?

మధ్యప్రాచ్యంలో సిరియా, ఇరాన్‌కు అతిముఖ్య సహచర దేశం. దాదాపు దశాబ్దకాలం పాటు జరిగిన సిరియా అంతర్యుద్ధంలో ఇరాన్‌, ‌రష్యాలు, బషర్‌ అల్‌ అసాద్‌ ‌నేతృత్వంలోని ప్రభుత్వానికి తమ మద్దతును కొనసాగించాయి. ఇరాన్‌కు మరో మిత్రదేశం రష్యా. ఉక్రెయిన్‌ ‌యుద్ధంలో రష్యాకు అవసరమైన డ్రోన్‌లను ఇరాన్‌ ‌సరఫరా చేసింది. ఇరాన్‌ ‌మద్దతిస్తున్న ఉగ్రవాద సంస్థల్లో లెబనాన్‌లోని హిజ్‌బుల్లా అత్యంత శక్తిమంతమైంది. ఇరాక్‌లోని షియా మిలిటెంట్లకు, యెమెన్‌లో హౌతీ తీవ్రవాదులకు ఇరాన్‌ ‌మద్దతుంది. యెమెన్‌లోని అత్యధిక భాగం ఈ ఉగ్రవాదుల ఆధీనంలోనే కొనసాగుతోంది. హమాస్‌తో సహా పాలస్తీనా ఉగ్రవాదులకు ఆయుధాలు, శిక్షణ ఇరాన్‌ ‌కొనసాగిస్తోంది.

అమెరికా శకుని పాత్ర

ఇజ్రాయెల్‌ ‌చర్యలను ఒకపక్క విమర్శిస్తూనే అమెరికా, ఇజ్రాయెల్‌ ‌డోమ్‌ ‌వ్యవస్థ, గగనతల రక్షణ చర్యలను బలోపేతం చేసేందుకు వీలుగా 13 బిలియన్‌ ‌డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించనుంది. ఈ మేరకు అమెరికా చట్టసభలు ఆమోదం తెలిపాయి. పాలస్తీనాకు స్వతంత్ర దేశ ప్రతిపత్తిని కలిగించే తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితిలో ఏప్రిల్‌ 18‌న ప్రవేశపెట్టగా, అమెరికా తన వీటో అధికారంతో దాన్ని అడ్డుకుంది. దీంతో తీర్మానానికి అనుకూలంగా 12 దేశాలు ఓటు చేయగా కేవలం అమెరికా వ్యతిరేకించింది. దీనిపై ఐక్యరాజ్య సమితిలో యు.ఎస్‌. ‌డిప్యూటీ శాశ్వత ప్రతినిధి రాబర్ట్ ‌వుడ్‌ ‌మాట్లాడుతూ తమ దేశం పాలస్తీనాకు వ్యతిరేకం కాదని, కేవలం రెండు పార్టీలు కూర్చొని పరస్పరం చర్చించడం ద్వారా మాత్రమే పాలస్తీనా ఏర్పాటు కావలన్నది తమ అభిమతమని సమర్థించుకున్నారు. ఇదిలావుండగా అమెరికా, బ్రిటన్‌ ‌దేశాలు ఇరాన్‌పై మళ్లీ తీవ్రమైన ఆంక్షలు విధించడంతో, సమస్యకు పరిష్కారంమాట అట్లా వుంచి మరింత జటిలమయ్యే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇస్లామిక్‌ ‌రివల్యూష నరీ గార్డులు, ఇరాన్‌ ‌రక్షణమంత్రిత్వశాఖకు చెందిన డ్రోన్‌ ‌కార్యకలాపాల బాధ్యులపై ఈ ఆంక్షలను విధించాయి.

రవాణానౌక ఉదంతం

ఈ ఘర్షణల నేపథ్యంలో ఏప్రిల్‌ 13‌న ఇజ్రాయెల్‌కు చెందిన ‘ఎంఎస్‌సి ఎరీస్‌’ ‌సరుకు రవాణా నౌకను ఇరాన్‌ ‌స్వాధీనం చేసుకుంది. ఇందులో 17మంది భారతీయ క్రూ సభ్యులున్నారు. వెంటనే వీరి విడుదల కోసం భారత్‌ ‌జరిపిన దౌత్యయత్నాలు ఫలించిన సూచనగా వీరిలో ఒకే ఒక మహిళా క్రూ సభ్యురాలు కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన అన్‌ ‌టెస్సా జోసెఫ్‌ ‌సురక్షితంగా కొచ్చిన్‌కు చేరుకున్నారు. ఇదిలావుండగా భారత్‌లోని ఇరాన్‌ ‌రాయబారి ఇరాజ్‌ ఇలాహి, భారతీయ క్రూమెంబర్లను తాము నిర్బంధించలేదని, వారు తమ ఓడ కెప్టెన్‌ ఆధీనంలో ఉన్నారని, వారు స్వేచ్ఛగా వెళ్లిపోవచ్చని స్పష్టం చేయడం గమనార్హం.

 చలికాచుకుంటున్న చైనా

తైవాన్‌ను కబళించాలని చూస్తున్న చైనా, మధ్యప్రాచ్యం, ఆసియా-పసిఫిక్‌ ‌ప్రాంతంలో తన పలుకుబడిని మరింత పెంచుకొని తద్వారా అమెరికాను కట్టడిచేయాలని చూస్తోంది. ఇరాన్‌తో తనకున్న గాఢమైన స్నేహాన్ని తైవాన్‌కు మద్దతుగా నిలుస్తున్న యు.ఎస్‌.‌ను చికాకు పరచడానికి ఉపయోగిస్తోంది. ఇరాన్‌ ‌సైన్యాన్ని ఆధునీక రించడంతో పాటు ఆధునిక మిలిటరీ సాంకేతిక బదలాయింపుతో పాటు అణుసహకారాన్ని అందిస్తోంది. ఇరాన్‌ ఆర్థికంగా దౌత్యపరంగా తనపై ఆధారపడటం కూడా చైనాకు కలిసొచ్చింది. ఇదంతా ఎందుకు చేస్తున్నదంటే, మధ్యప్రాచ్యంలో యు.ఎస్‌. ‌సహచరులైన ఇజ్రాయెల్‌, ‌సౌదీ అరేబియా వంటి దేశాలను తన మద్దతుదారులైన హిజ్‌బుల్లా, హమాస్‌, ‌హౌతీ ఉగ్రవాదుల ద్వారా నిరంతరం చికాకుపెట్టే సామర్థ్యం ఇరాన్‌కు ఉంది. ఆవిధంగా మధ్యప్రాచ్యంలో మంటలను ఎగదోసి, దక్షిణ చైనా సముద్రంలో మోహరించిన తన సైన్యాలను అమెరికా తగ్గించేలా చేయవచ్చు. అప్పుడు తైవాన్‌ను ఆక్రమించుకోవడం చైనాకు పెద్ద కష్టం కాబోదు. అందువల్లనే తాను తైవాన్‌పై వత్తిడి పెంచాలను కున్నప్పుడు, మధ్యప్రాచ్యంలోని యు.ఎస్‌. అనుకూల దేశాలపై ఉగ్రవాద సంస్థలు దాడులు చేసేలా ఇరాన్‌ను పురికొల్పుతోంది.

ఒకప్పుడు మిత్రులే!

ఇరాన్‌-ఇ‌జ్రాయెల్‌ ‌సంబంధాలను ముఖ్యంగా నాలుగు దశలుగా చూడ వచ్చు. అవి వరుసగా అనిశ్చితి దశ (1947-53), పహ్లవీ రాజవంశం పాలనలో స్నేహ సంబంధాల దశ (1953-79), ఇరాన్‌ ‌విప్లవం కాలంలో క్షీణదశ (1979- 1990), 1991 ఇరాన్‌-ఇరాక్‌ ‌యుద్ధం తర్వాత సంఘర్షణ దశ. 1947లో ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా విభజనపై నాటి బ్రిటిష్‌ ‌ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటుచేసిన 13 దేశాల్లో ఇరాన్‌ ఒకటి. రెండేళ్ల తర్వాత ఇజ్రాయెల్‌ను ఐక్యరాజ్య సమితిలో సభ్యురాలిగా చేసుకునే తీర్మానాన్ని కూడా ఇరాన్‌ ‌వ్యతిరేకించింది. విశేషమేంమంటే ఇజ్రాయెల్‌ను సార్వభౌమ దేశంగా మొదటగా గుర్తించిన రెండు ముస్లిం మెజారిటీ దేశాల్లో ఒకటి ఇరాన్‌. ‌రెండవది టర్కీ. 1979లో ఇరాన్‌లో విప్లవం విజయవంతమైన తర్వాత నుంచి ఈరెండు దేశాల మధ్య క్రమంగా పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. 1991లో సోవియెట్‌ ‌యూనిన్‌ ‌పతనం, గల్ఫ్ ‌యుద్ధంలో ఇరాన్‌ ఆధిపత్యం సాధించిన నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ప్రాబల్యం ఇరాన్‌, ఇ‌జ్రాయెల్‌ ‌దేశాలకు మారి పోయింది. 1990 ప్రాంతంలో అప్పటి ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఐజాక్‌ ‌రాబిన్‌ ఇరాన్‌పై కఠినవైఖరి అవలం బించారు. తర్వాతికాలంలో ఇరాన్‌ అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, ఇజ్రాయెల్‌ అనుసరించిన ‘బెగిన్‌ ‌సిద్ధాంతం’ (శత్రువు మరింత బలోపేతం కాకుండా ముందుగానే దాడి చేయడం) వంటి కారణాలు రెండు దేశాలను బద్ధశత్రువులుగా మార్చాయి. ఇరాన్‌ ‌క్రమంగా ఇస్లామిస్ట్ ‌గ్రూపులైన హిజ్‌బుల్లా, పాలస్తీనా ఇస్లామిక్‌ ‌జిహాద్‌, ‌హమాస్‌లకు మద్దతునివ్వడం మొదలు పెట్టింది. ఇరాన్‌కు వ్యతిరేకంగా పనిచేసే పీపుల్స్ ‌ముజాహిద్దీన్‌ ఆఫ్‌ ఇరాన్‌, ‌జుండెల్లా మిలి టెంట్‌ ‌సంస్థలకు ఇజ్రాయెల్‌ ‌మద్దతిస్తోంది. 1985 నుంచి రెండు దేశాల మధ్య ఆధిపత్యంకోసం ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వానికి మద్దతునిస్తే, ఇజ్రాయెల్‌ ‌విపక్ష గ్రూపులకు అండగా నిలిచింది. మొత్తంమీద ఈ రెండుదేశాల మధ్య జరుగుతున్న ఆధిపత్యపోరు, మధ్యప్రాచ్యాన్ని రావణకాష్టంగా మారుస్తున్నాయి.

జమలాపురపు విఠల్‌రావు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE