– డా. నెల్లుట్ల నవీన్‌చంద్ర

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

ఆ ముగ్గురూ ఎప్పుడూ కలిసి ఉంటారు. కలిసే పనులు చేస్తారు. టాంకు బండు మీద జనం చాలా ఉన్నరోజుల్లో కాలినడకతో ఒకవైపు నుంచి ఇంకొక వైపు నడుస్తారు. ఐసు క్రీము అమ్ముకునే స్టాలుకు వచ్చి తమకు ఇష్టమయిన ఫ్లవరు తీసుకుని డబ్బు ఇవ్వకుండా తినేస్తారు. పక్కనే ఉన్న మిరపకాయల కొట్టుకుపోయి వాటిని అడగకుండానే దౌర్జన్యంగా దొంగిలించి తిని పైసలు ఇవ్వకుండా ఇంకో కొట్టుకు పోతారు. వారు వస్తున్నారంటే అందరికీ హడలు. అమ్మాయిల వెంబడి పడి వాళ్లని అనరాని మాటలు అని కన్నీళ్లు తెప్పిస్తారు. ఎవరూ అడ్డం రారు. వచ్చినా వారిని తిట్టి, కొట్టి బీభత్సం చేస్తారు. జనం తగ్గేంతవరకూ అలాగే అందరినీ పీడిస్తూ రాజ్యం చేస్తారు. మోటారు సైకిళ్ల మీద ఎక్కి బాగా చప్పుడు చేస్తూ ఒక వైపునుంచి రెండవ వైపు వరకు ఎక్కువ వేగంతో రొదచేస్తూ తిరగడం వారికి ఎంతో ఇష్టమయిన పని. ఒకనాడు ఇద్దరు పోలీసులు ఆ ముగ్గురినీ అరెస్టుచేసి తీసుకుపోయి జైల్లో పెట్టారు.

మరుసటిరోజు వారు తమ ప్రసిద్ధ న్యాయవాది ద్వారా బెయిల్‌ పిటిషను వేయించారు. కోర్టులో వారి బెయిల్‌కు. 10 లక్షల రూపాయలుగా న్యాయమూర్తి నిర్ధారించారు. ఆ మొత్తాన్ని చెల్లించి వారు బయటపడ్డారు. ఆ మరునాడు తమను అరెస్టు చేసిన పోలీసుల ఇండ్లపై దాడి చేసి వారినీ, వారి పిల్లలనూ చంపి, పోలీసుల భార్యలను చెరచి పారిపోయారు.

తెల్లవారి ఇద్దరి శవాలు దొరికాయి. వాళ్ల తలలు, కాళ్లూ,చేతులూ నరికి ఉన్నాయి. మొండాలు టాంక్‌ బండు మీద మధ్యలో కనపడ్డాయి. మూడో వాడు ఇంగ్లండుకు పారిపోయాడని వార్తలు వచ్చాయి. వెతికితే తేలింది ఏమిటంటే… వాడు ఇంగ్లండులో దాక్కున్నాడని. సాధారణంగా భారతదేశానికి వ్యతిరేకంగా రాసి మాంచెస్టర్‌ గార్డియన్‌ లాంటి పత్రికలు ఆ ముగ్గురు నేరస్తులకు సానుభూతి చూపిస్తూ పోలీసులను విమర్శించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం తగ్గి పోతూ అరాచకం పెరిగిపోతున్న దని అభిప్రాయపడ్డారు.

రక్‌ మంచం మీద పడుకుని చూరు వైపు చూస్తున్నాడు. వాసాలు కనిపించే చూరు అయితే వాసాలు లెక్కపెడుతున్నాడని మనం అనుకోవచ్చు. అతని గది రెండవ అంతస్తుపై ఉన్నది. విశాలమయిన గది. ఎత్తయిన ఆరు గోడలు. రెండు గోడలా మీద నేలనుండి చూరు వైపు వరకు ఎత్తుగా రెండు గవాక్షాలు ఉన్నాయి. గవాక్షాల నుండి చూస్తే పెద్ద తోట కనిపిస్తుంది. ఆ తోటలో పూల, పండ్ల చెట్లూ, నీటి ఫౌంటేన్లు, అందమయిన కాలినడకలూ కనిపిస్తాయి. మిగిలిన నాలుగు గోడలూ ఇంటివైపు, ఒకగోడమీద ఖరీదయిన చిత్రం ఉన్నది. ఒక గోడపై ఎత్తయిన ఆక్వేరియం, ఇంకో గోడపై నేలనుండి చూరు వరకు ఖరీదయిన తెల్లని చలువరాతి రాళ్లు పరచి ఉన్నాయి. మధ్యలో నల్లని చలవరాతి శిల్పం. చివరి గోడమీద నేలనుండి చూరు వరకు ఇటలీ నుండి దిగుమతి చేసుకున్న జకరంద చెట్టు పలకలు.

ఆ గదిని సృష్టించిన ఆర్కిటెక్టు నరక్‌ తండ్రి మహీష్రావు. ఆయనకు భార్య జలంధరి వైపు నుంచి కోట్ల ఆస్తి వచ్చింది. తండ్రి ఆస్తితో కలిపి రెండిరతలు. వారు చేయని వ్యాపారం లేదు. వారు అమ్మని సరకులేదు. ప్రొహిబిషను ఉన్నప్పుడు సారా అమ్మి కోట్లు ఆర్జించాడు మహీష్రావు. స్కూలు పిల్లలకు డ్రగ్గులు అమ్మి కోట్లు ఆర్జించాడు. డబ్బు అప్పుకు ఇచ్చి లక్షల మంది ఆస్తులను హరించి కోట్లు ఆర్జిందాడు. ఆయన మకుటం లేని మహారాజు.

ఆయన ప్రజలు ఆయన చెప్పిన నాయకునికి వేస్తారు వోటు. ఆయనకు డబ్బు పరంగా కానీ, నీతిపరంగా కాని బాకీ ఉన్న నాయకులు ఇరవైకి దాటి పోతారు సులువుగా. ఆయన ముఖ్యమంత్రు లను, మంత్రులను చేయించాడు. ఆయన ఇచ్చిన డబ్బుతో చదువుకుని డిగ్రీలు ఆర్జించి, గొప్ప పదవుల్లో ఉన్న ఇంజనీర్లు, డాక్టర్లు, న్యాయవాదులు, పాత్రి కేయులు, రేడియో, టీవీ రంగాలలో పనిచేసేవారూ అన్ని జిల్లాలలో, పరిసర రాష్ట్రాలలో ఉన్నారు. ఆయన ఇచ్చిన డబ్బుతో స్కూళ్లు, హాస్పిటళ్లు దేవాలయాలు కట్టించారు.

జలంధరి మహీష్రావు దంపతులకు నలుగురు సంతానం.మొదటి ఇద్దరు అమ్మాయిలు సరమ, కద్రువ. ఇద్దరు కొడుకులు జరాసంధ్‌, నరక్‌.

సరమ, కద్రువల వివాహాలు వారి తండ్రితో పనిచేసే భైరవరావు, తక్షక రావులతో అయింది. మామగారి నీతిని నూటికి నూరుపాళ్లు ఒప్పుకో పోవడమేకాక, దానిని అమలు పరచడంలో అధినేతలు అయ్యారు. జరాసంధి తండ్రి అడుగు జాడల్లో జీవిస్తున్న సొంత అభిప్రాయాలు లేని వ్యక్తి.

సరక్‌కి 19 దాటి ఇరవై వచ్చాయి. ఇంటికి దగ్గరలోనే ఉన్న కాలేజీలో రెండవ ఏడులో ఉన్నాడు. చదువులో కాని, వ్యాయామ రంగంలోకాని, కళారంగంలో కాని నిష్ణాతుడు కాకున్నా కొన్ని విద్యేతర రంగాలలో పట్టభద్రుడు కాకపోవడమేకాక ఎంఫిల్‌ కూడా తెచ్చుకున్నాడు. కాలేజీ గేటు నుంచి ముఖ్య భవనం వరకు రోజూ తన మోటోను 70 కిలోమీటర్ల వేగం తో జుంయి మనీ డ్రైవు చేస్తూ అందరినీ భయపెట్టడం లో 100 కి 100 మార్కులు తెచ్చుకున్నాడు. అమ్మాయిల కొంగులను లాగడం, వాళ్ల ముందు బూతులు మాట్లాడడం, మగపిల్లల్లతో గిల్లికజ్జాలు పెట్టుకుని వారిని చావ బాదడం వాటిల్లో ఘనుడ య్యాడు.

అలాంటి సరక్‌ చూరువైపు చూస్తున్నాడు. దృష్టిమరల్చి ఆరు గోడలవైపు చూడ్డం మొదలు పెట్టాడు. అతని కోపానికి గురి అయి పగిలిన ఆక్వేరియంను రెండు సార్లు కట్టించాల్సి వచ్చింది. జకరంద గోడను నిప్పుతో కాల్చాడు ఒకసారి. చలవరాతి గోడకు ప్రతి ఏడూ రిపేర్లే.

ఏమి నష్టం వచ్చినా జలంధరి కొడుకును వెనకేసుకు వచ్చి ఆదుకొనేది. చిన్నప్పటిని నుంచీ క్రమశిక్షణ లేకపోవడంతో ‘‘మొక్కయి వంగనిది మానయి వంగుతుందా’’ అన్న సామెత ప్రకారం నరక్‌ దుర్మార్గం ఏళ్లు మీద పడుతున్న ్డకొద్దీ మించుతూనే వచ్చింది. ఇక ఆ తల్లి. ఇంటిని నాశనం చేసినా అదుపులో పెట్టనిది బయట ఎక్కడయిన నష్టం జరిగితే మాత్రం కొడుకును అదుపులో పెట్టు కుంటుందా?

సరమకు ఒక అందమయిన ఖరీదయిన చిన్న కుక్క ఉండేది. పదేళ్లప్పుడు దానిని పైకి ఎగురవేసి ఎండాకాలంలో వేడెక్కిన సిమెంటు మీద పడి కాలు విరిగిపోతే నవ్వుతూ చూస్తున్న నరక్‌ను ఎవ్వరూ ఏమీ అనలేదు. సరమ గారాబంగా ఇంకో కుక్‌ కావాలని ఏడిస్తే మహీష్రావు బిడ్డ కోరికను తీర్చారు.

పదిహేనేళ్లప్పుడు మనిమనిషి 13 ఏళ్ల కూతురిని బలాత్కారిస్తే నరక్‌ని తప్పన్న వారు ఆ కుటుంబంలో ఎవరూ లేరు.

డబ్బు ఇచ్చి, మాట సహాయం చేసి, వాళ్ల బంధువులకు, మిత్రులకూ ఉద్యోగాలిచ్చి, పెళ్లిళ్లకు ఖర్చులు పెట్టుకుని,తాగుడికి, డ్రగ్గులకీ అలవాటు చేయించి ఆ ఇద్దరినీ తన వశం చేసుకున్నాడు నరక్‌. వాడు ఎంత చెపితే అంతా ఆ ఇద్దరికీ.

వారిలో ఒకడు చండుడు. అతని తండ్రి తాగుబోతు, పెద్దకుటుంబం. ఊరవతల గుడిసెలో ఉంటారు. బడికి పోలేదు. తండ్రి తాగివచ్చి బాగా కొట్టేవాడు చండుణ్ణి. అతని తల్లినీ, చిన్న పిల్లల్లనూ. ఈ క్రౌర్యం చూసి అతనికి ప్రపంచం మీదా, తోటిమానవుని మీదా నమ్మకం లేక, తనపై తనకు నమ్మకం లేక ఇతరులను హింస పెట్టేవాడు. నరక్‌ అంటే విశ్వాసం ఇతరులంటే అపనమ్మకమూ ఏర్పడిపోయాయి అతనికి.

రెండవ వాడు సింహన్న. అతను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాడు. అతని తండ్రి వ్యభిచారం చేసే ఆడవాళ్లకు ఏజంటుగా డబ్బు సంపాదించేవాడు. డ్రగ్గులను అమ్మి కొంత సంపాదించేవాడు. అప్పులు తీసుకుని ఎగ్గొట్ట్టేవాడు. తోటి మనిషిని ఎన్ని విధాల మోసం చేయాలో అన్నీ చేసేవాడు. కొడుక్కు మోసం చేయడం నేర్పించాడు. అతను ఆ పనిముట్టుతో జీవితం గడపేవాడు.

నరక్‌ ఒక రాత్రి వ్యభిచారం చేస్తూ తిరుగుతున్న ప్పుడు సింహాన్ని కలిసాడు. ఒకనాడు చీట్లపేక ఆడుతూ చంద్రుణ్ణి కలిసాడు. తర్వాత వాళ్ల స్నేహం పెరిగిపోయింది.నరక్‌ ఇంట్లో ఉండడమే అరుదు. ముఖ్యంగా రాత్రుళ్లు. మిగిలిన ఇద్దరూ నిశాచరులే కనుక వారి స్నేహం పెరగడంలో ఆశ్చర్యం లేదు. ఆ ముగ్గురు కలిసి చేయని అత్యాచారం లేదు.

తల్లి గాంధారి ప్రేమ నరక్‌్‌ దుర్మార్గాలు పెరగ డానికి దోహదపడిరది. ఆమె పెంపకంలో మంచి చెడులు ఏమిటో తెలియకుండా, ఇతరులకు ఎంత హాని జరిగినా తనకు నచ్చిందే చేసుకుపోయే కాఠిన్యత అలవడిరది నరక్‌కు. తోటివారికి సహాయం చేయడంలో ఉన్న ఆనందం తెలియకుండా పెరిగాడు. 20 ఏళ్లు అంధకారంలో పెరిగిన అతనికి తల్లితండ్రులను ఎలా తన వైపుకు తిప్పుకోవాలో, తనను దండిరచకుండా తన తప్పులను ఎలా కప్పిపుచ్చుకోవాలో నేర్చుకుని, నేరం తర్వాత పెద్ద నేరం చేసి, తప్పించుకుని, ఒక పైశాచిక ఆనందం పొందడంలో దురంధరుడయ్యాడు.

పొద్దున్న పదిన్నర అయినా నరక్‌ పక్కలో పడుకుని చూరు వైపు చూస్తున్నాడు. అనాటి ప్రోగ్రాము ఏమిటో ఆ ముగ్గురూ నిర్ణయించు కున్నారు. ఆ నిర్ణయము అతడు దేశం వదిలే స్థితికి దారి తీస్తుందని అతను ఊహించలేదు. తన ఇద్దరు స్నేహితులను కోల్పోతానని కూడా ఊహించలేదు.

*  *  *  *

తర్వాత సమాజంలో ఈ సంఘటనలపై చర్చ జరిగింది. పత్రికలూ, రేడియోలు, టీవీలూ, సామాజిక మాధ్యమాలలో తీవ్ర చర్చలు జరిగాయి.

డబ్బులేని ఇద్దరు నేరస్తులు తలలూ, చేతులూ, కాళ్లూ కోల్పోయి అధ్వానంగా చనిపోయారు. డబ్బున్నవాడు ఇంగ్లండుకు పారిపోయి రాజాలాగా బతుకు తున్నాడు. న్యాయం పేదవారికి ఒకటీ, ధనవంతులకు ఒకటీ.

ధనవంతులు పిల్లలను పెంచే పద్ధతిలో చిన్నప్పటి నుంచీ క్రమశిక్షణ లేకపోవడం వల్ల పిల్లలు నేరస్తులుగా తయారై సంఘంలో అల్లకల్లోలం కలిగిస్తారని ఒక వాదం బాగా పుంజుకుంది. నరక్‌ లాంటి వారి నేరాలలో తల్లి దండ్రులకు కూడా బాధ్యత ఉందనీ వారిని, శిక్షించాలని చాలా మంది వీధుల్లో నినాదాలు చేస్తూ బందులు చేసారు. స్కూళ్లను, ఆస్పత్రులను, దేవాలయాలను, కర్మాగారా లను కట్టించిన మహీష్రావు- అతన్ని శిక్షించడం సమాజానికి చెడు చేస్తుంది కాని శుభం కలిగించదని చాలా పత్రికలు రాసాయి.ఆయనకు సానుభూతి చూపిస్తూ రేడియో, టీవీల్లో ఎందరో మాట్లాడారు.

ఆ ఇద్దరినీ చంపింది ఎవరు? అనే ప్రశ్న వచ్చింది. దానికి జవాబు లేదని వెంటనే నిర్ధారమ యింది. ఈ అసంగ్ధత ఇంకొక చర్చకు దారితీసింది. ఈ పోలీసు వారుండి చేసేదేమిటి? అనే ప్రశ్నకు తావు ఇచ్చింది. తమ వాళ్లిద్దరూ చనిపోతే వీరికి చీమ కుట్టినట్లు కూడా అనిపించడం లేదని కొందరు అన్నారు. ఇక్కడ అందరూ బాధితులే అని చాలామంది వాపోయారు. పోలీసులు, ప్రజలు, బీదలు.. అందరూ బాధితులే. కేవలం ధనవంతులు అన్నిటి నుంచీ పారిపోతారు. ఇదీ ఘోరమయిన అన్యాయం అని చాలా మందికి నిజం అని అనిపించింది.

‘‘ఈ జరుగుతున్న ఘటనల్లో మీ కుటుంబం కేంద్రంగా ఉండడం మీకు బాధాకరంగా ఉన్నది కదా!’’అని ఒక టీవీ షోలో యాంకరూ, స్నేహితు రాలు దితి అడిగింది జలంధిరిని.

‘‘నీకు తెలియదు దితీ ఎంత బాధ మనస్సులో పెట్టుకుని ఈ ఇంటర్వ్యూ కొచ్చానో!’’

‘‘చిన్నప్పటినుండీ క్రమశిక్షణ లేకుండా పెరిగారు అన్న ఆరోపణ పై మీ అభిప్రాయం చెప్పండి.’’

‘‘అవన్నీ అబద్దాలు. మా వారు చేసే సంఘ అభ్యుదయ కార్యక్రమాల్లో మా పిల్లలూ, వారి కుటుం బాలూ పాల్గొంటాయి. మా కోడలూ, మా కూతుళ్లు ఎన్నో మహిళా ఉద్ధరణ సంఘాల్లో మామూలు కార్యకర్తలుగా రోజు, రాత్రి అనకుండా దీక్షగా పని చేస్తారు. అలాగే మాకొడుకులూ, అల్లుళ్లూనూ!’’

‘‘మీ చిన్న అబ్బాయి నరక్‌ ఇప్పుడు ఇంగ్లండులో ఉన్నది నిజమేనా?’’

‘‘చెడు సావాసాలు చేసి ఈ నేరాల్లో ఇరుక్కు పోయాడు. ఈ దేశంలో ఉంటే తనకు గతిలేదని స్నేహితుల సహాయంతో బయటకు వెళ్లిపోయాడు. వాడు లేకపోవడం ఎంత వెలితో నీకు అర్ధం కాదా దీతీ?’’

‘‘అతనితో పాటు మిమ్మల్ని కూడా శిక్షించాలని అడుగుతున్న వారికి మీ జవాబు ఏమిటి?’’

‘‘మా పిల్లలను మా ఇష్టం వచ్చినట్లు పెంచు కుంటాం. మధ్యలో మీరు ఎవరు జోక్యం కలిగించు కోడానికి.. అని నా సమాధానం.’’

‘‘ఇదండీ నిజం’’, అని యాంకరు ఇంటర్వ్యూ ఆపేసింది.

ఈ ఇంటర్వ్యూ ప్రసిద్ధి కెక్కింది ప్రపంచమంతా. ఒక పూనా పాత్రికేయుడు ఇలా సమీక్షించారు: ‘‘ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అత్యాచారాలకు కారణం కుటుంబ క్రమశిక్షణ లోపమే అని గొంతెత్తి చాటుతున్నది ఈ తల్లి అసందర్భ ప్రేలాపన.’’

కోల్‌ కత్తా రేడియో సమీక్ష కర్త ఇలా రాసారు: ‘‘ఇంతవరకు మంచి మాటలు విననిది కేవలం యువతయే అనుకున్నాం. ఇప్పుడు తేలిపోయింది తల్లిదండ్రులు కూడా దోషులే అని. కృతక ప్రేమ చూపి సంఘానికి హాని చేస్తున్నది పెద్ద తరం అనీ. ఈ ద్యోతకం మనందరికీ కనువిప్పు కలిగించాలి. మన చట్టాలు మారాలి.’’

ఒక ప్రసిద్ధ న్యాయమూర్తి ఇలా అన్నారు: ‘‘మనమందరమూ వ్యక్తులమన్నది నిజం. కాని మనం ఒక సంఘ సభ్యులం కూడా ఒక్కొక సారి సంఘం మంచి కోసం మన వ్యక్తిత్వాన్న్ని వదులుకోవాల్సి వస్తుంది. తమ ఇష్టం వచ్చినట్లు చేసే అధికారం వ్యక్తులకు లేదు. విశృంఖల స్వాతంత్య్రం ఏ న్యాయ చట్టంలో లేదు. కోర్టులూ,  జైళ్లూ, పోలీసులూ ఉన్నది శాంతిభద్రతలను కాపాడడానికి, వ్యక్తి స్వేచ్ఛకు ప్రాముఖ్యత ఇచ్చిన దేశాలలో కూడా కోర్టులూ, జైళ్లూ, పోలీసులూ ఉన్నాయి. ఎవరికీ తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే హక్కు లేదు. అది అరాచకత్వానికి, సంఘవినాశనానికి దారి తీస్తుంది.’’

‘‘నేరం ఉధృతంగా ప్రబలిపోతున్న ఈ కాలంలో, ఈ దేశంలో న్యాయ చట్టాలను తు.చ.తప్పకుండా అమలు పరచాలి. ఈ నేరాలను తగ్గించడానికి అందరూ కంకణం కట్టుకోవాలి. ‘‘స్వంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడుపడవోయి’’ అన్న ఆ మహాకవి మాటలు నూరుపాళ్లు అనుసరిం చాలి.’’ అని ఒక ప్రముఖ కవయిత్రి రాశారు.

 

About Author

By editor

Twitter
YOUTUBE